Thursday, July 28, 2011

మావయ్యల లీలలు..!


ప్రతీ మనిషికీ ఊహ తెలియక ముందు అమ్మా, నాన్న మొదటి స్నేహితులయినా, ఊహ తెలిసాక బయట నుండి ఎంత మంది మంచి స్నేహితులు వచ్చినా, అమ్మ తోబుట్టువుల తో ఉండే అనుబంధం, స్నేహం, ప్రేమా ప్రత్యేకంగా ఉంటుందీ. 
మా ఫ్యామిలీ లో మొదటీ చంటి పిల్లోడిని నేనే గనుకా నా మీద ఆ ప్రేమ మరింత గా ఉండేది అందరికీనూ. మా ఇద్దరు పిన్నులూ, ఇద్దరు మావయ్యలూ నేనంటే అబ్బో.. భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ఎగ్జాంపుల్ లాగా  ఉండే నా బొజ్జనీ నేనే మోసుకోలేనేమో అన్నట్టూ నన్ను భూమి మీద నిలబడనిచ్చేవారు కాదు. మా పెద్ద పిన్ని అయితే మిగిలిన వాళ్ళందర్నీ పక్షపాతం చూపకుండా పడేసి తన్నేసి మరీ నన్నెత్తుకునేదంట. ;) తను పెళ్లి చేసుకొని వెళ్ళి పోయాకా మా చిన్న పిన్ని కూడా అంతే.. రోజూ కాలేజ్ నుండీ వచ్చేటపుడూ తను తెచ్చే సాల్ట్ బిస్కట్స్ కోసమో, చాక్లెట్ల కోసమో తెగ ఎదురు చూసేవాడిని. 

ఆ.. ఇప్పుడు కధానాయకుల విషయానికి వద్దాం.. అదే మా మాయలు (మావయ్యలు) ఇద్దరూ చెరొక టైపూనూ (అంటే ఒక్కొక్కళ్ళూ ఒక్కో టైపనీ). 
చెయ్యి పెడితే తిరిగిరానంత దట్టమయిన ఉంగరాల జుత్తూ,తను చాచిపెట్టి కొడితే తిరిగి లేవనంత దిట్టమయిన  పెర్సనాలిటీతో, ఇంచుమించు ఎం.టీ.ఆర్ కి డూప్ లాగా ఉండే మా పెదమాయ కీ కుక్కలన్నా, క్రికెట్టన్నా ప్రాణం. సినిమాలన్నా, సినిమాల్లో చిరంజీవన్నా పిచ్చీ. వంట చేసీ, వండింది ఒక్కడే తినేయడం, తేడా వస్తే ఒంగేబెట్టీ వాయించేయడం హాబీలు.
తను బొంగరాలాటకీ బయటకెళ్ళి ఇంటీకొస్తుంటే ఊళ్ళో ఊరకుక్కలన్నీ వెనకాల తోకూపుకుంటూ, మూతి నాక్కుంటూ వచ్చేవంటా. భోజనం చేసేటప్పుడూ కుడి వైపు కుక్కనీ, ఎడమవైపు పిల్లినీ కూర్చోపెట్టేవాడు. అదిచూసీ చిఱెత్తిన మా అమ్మమ్మ, కంచం లో పెట్టేవాటితో పాటూ, తిట్టే తిట్లు కూడా ఆ రెండు జీవాలతోనూ కలిసి తినేవాడు.  (ఆయన ఎంత జంతు ప్రేమికుడంటే మా  బ్రౌణీ ని(పెట్ డాగ్)ఏదయినా  అడిగితే, అది కూడా అదే ఫ్రీక్వెంసీ  లో  రిప్లై ఇచ్చేదీ. పిలిస్తే పలికేది.)  సైకిల్ మీద నన్ను ఊరంతా తిప్పుతూండేవాడు. ఊళ్ళెళ్ళినప్పుడూ నాకోసం వేసుకోడానికీ బూట్లూ, ఆడుకోడానికి క్రికెట్ బ్యాట్లూ గట్రా తీసుకొచ్చేవాడు. 


అయితే ఇంట్ళొ చాలా  ఎక్కువ  కాలం‌ కలిసి ఉండటం వల్లా, వయసు వ్యత్యాసం తక్కువ  అవ్వటంవల్లా  పెదమాయ కంటే చినమాయ (చిన్న మావయ్య) తో  నాకు అటాచ్ మెంట్ ఎక్కువ ఉండేది.

అప్పట్లో చీపురు పుల్లకి చొక్కా, ప్యాంట్ తొడిగినట్టూ ఉండీ, కళ్ళ్లల్లో పడే జుత్తు కత్తిరించుకోడానికి పది రూపాయలూ, కారుతున్న ముక్కు తుడుచుకోడానికి ఐదు రూపాయలూ అమ్మమ్మ ని లంచం అడిగే మా చిన్నమాయ కీ కావిడిబద్దంత క్రియేటివిటీ,కొలబద్దంత తిక్కానూ. తనకి నచ్చింది జరక్కపోతే ఇంట్లో దేవుడి గదికీ, పెద్దగదికీ మధ్య దార్లోఅడ్డంగా పడుకొనీ, మనిషన్న వాడు భరించలేని శృతి లో ఆనందభైరవి రాగం లో దొర్లి దొర్లీ ఏడ్చేవాడు.  మడిచేసిన విస్తరాకుకీ, మడతెట్టిన పూతరేకు కీ తేడా తెలీ చిన్న పిల్లోణ్ణి నేనే ఎప్పుడూ ఏడవలేదూ.. ఇలాగా.. వీడేంటీ అసయ్యం గా అనుకునేవాడిని :) :) 
తన గది లోకి ఎవరయినా ఎంటరయితే కుక్క దూరిందనుకొనీ కర్ర   పట్టుకు బాదేసే మా మామ్మ (అమ్మ గారి నానమ్మ) గారి మంచం కింద ఒక ఇనపరేకు పెట్టె ఉండేది. అందులో తేదీ దాటిపోయిన ట్రెయిన్ టిక్కేట్లూ , కలర్ పేపర్లూ, ఖాళీ ఇంజక్షన్ సీసాలూ, వాడేసిన అగ్గి పెట్టెలూ, అయిపోయిన బ్యాటరీలూ లాంటి  కలెక్షన్  ఉండేది చినమాయకి. రంగు కాగితాలని  తిరిగే చక్రానికి అతికీంచీ వాటివెనకాల టార్చ్ లైట్ వేసి తిప్పుతూ సినిమా వేసేవాడు. అట్టపెట్టెలతో ట్రాక్టర్ బొమ్మలూ, కార్ లూ, బ్యాటరీలతో నడిచే బళ్ళూ, చెక్కతో పొడుగాటి తుపాకీ మోడల్స్ తయారు చేసేవాడు. ఆ తుపాకీ ఎడమ చేత్తో కాకులకి గురిపెట్టీ, ఇంట్లో ఉండే అశోక చెట్టు కాయలు కుడి చేత్తో గురితప్ప కుండా విసిరేసీ "డిష్కూ" అనేవాడు. ఖాళీ ఇంజక్షన్ సీసాలని అందమయిన ఆకృతుల్లో అతికించీ కింద బల్బ్ పెట్టీ నా చేత చప్పట్లు కొట్టించేవాడు. అయితే ఇవన్నీ చూడ్డానికి మాత్రమే నాకు పర్మిషన్.  ఆడుకోడానికి ఇమ్మంటే  అవి నాకివ్వడం అడుక్కుతినేవాడికి  అమెరికా  ప్రెసిడేంట్ ఆటోగ్రాఫ్ ఇవ్వడం‌లాంటిదనీ ఫీలయ్యేవాడో ఏమో ఒక్క సారి కూడా ముట్టుకోనిచ్చేవాడు కాదు. :( :(   

ఒకసారేం జరిగిందంటే... మా మేడమీదా అన్నంమెతుకులూ, తెల్లకాగితాలతో కుస్తీ పడుతూ చిన్నమాయా,ఆ కుస్తీని చూస్తా నేనూ చాలా బిజీ గా ఉన్నాం.. తర్వాత ఆ కాగితానికి దానికి దారం కట్టీ గాల్లోకెగరేశాడు. అప్పుడే తెలిసింది నాకు దాన్ని గాలిపటం అంటారనీ.  దాని  తోక మిగిలిన గాలి పటాల్లాగా కాకుండా రింగులు రింగులు గా భలే ఉన్నాది. 



మా మేడకి చాలా దూరం లో ఇంకో మేడ మీద ఎవరో అమ్మాయ్ చెయ్యూపుతా ఉన్నాదీ. మాయ నన్ను భుజాల మీదకెక్కీంచుకొనీ చేతులు ఖాళీగా లేవని అనుకూంటా.. "ఒరే.. బుజ్జిగా నువ్వ్ కూడా చెయ్యూపరా" అన్నాడు.
ఎంతయినా నాకు కాబోయి, కాకుండా పోయిన ఒకానొక అత్త కదా.. చేతులు పీకేవరకూ, కా.పో అత్త వెళ్ళిపోయే వరకూ తెగ ఊపేసాను. ఇంతలో కింద నుండీ అమ్రీష్ పురీ రేంజ్ లో ఒక అరుపు వినిపించిందీ.. 
"ఒరేయ్...*#(&$%$(#% అవి హాఫ్ ఇయర్లీ ఎగ్జాం పేపర్లు రా.. ఇంకా కరెక్షన్ కూడా చెయ్యలేదూ..నువ్ గాలిపటాలెగరేసేస్తున్నావా?  " అనీ. మాయ నా వైపు చూశాడు. నేను చినమాయ కళ్లల్లో భయం చూశాను.  ఆ తర్వాత కింద అరుస్తున్న తాతయ్య గారి కళ్ళల్లో కోపం చూసాను. డాబా మెట్లెక్కీ, తగువేసుకున్న వీధిలో వాళ్లనీ బూతులు తిట్టడం లో డిప్లొమా చేసిన మా తాతయ్య గారూ కటకటాల రుద్రయ్య సినిమా లో క్రిష్ణంరాజు లాగా బలంగా అడుగులేస్తూ, ఆగ్రహంతో ఊగిపోతూ మేడ మీది కొస్తున్నారు. 
ప్రమాదాన్ని పసిగట్టిన మావయ్యేమో గాలిపటాన్ని గాలికొదిలేసీ, సిగ్నల్ రాని దూర్ దర్శన్ కోసం పెట్టిన 18 అడుగుల  టీవీ యాంటెన్నా పైపు పట్టుకొనీ కిందకి దిగేశాడు. 

డాబా మీదికొచ్చిన తాతయ్య, మావయ్య లేకపోవటం తో అవాక్కయ్యీ , రోడ్ రోలర్ ని రిక్షాకి కట్టి లాగే వాడిలాగా ఒక  ఎక్స్ప్రెషన్ పెట్టీ, ఆకాశం లో ఎగురుతున్నా ఆఫ్ఇయర్లీ  ఆన్సర్ పేపర్లవైపు అయోమయం గా చూస్తూ, సభ్యసమాజం సిగ్గుపడుతూ, చెవులు మూసుకొని తలదించుకునేలాగా బూతులు తిడుతూ కిందికెళ్ళిపోయారు. (అలా చూడకండీ.. మా ఇంటి ముందుండే ఆకుల అప్పయ్యమ్మ గారు తిట్టడం మొదలెడితే మా తాతయ్యే చెవులు మూసుకునేవారు. ఆవిడ పీ.హెచ్.డీ చేసిందిలేండీ  తిట్ల మీద ;)) 

ఇది చూడండీ.. ! :)    


 కిందకొచ్చి చూసేసరికీ చినమాయా, పెద్ద మాయ వీర లెవల్లో కొట్టుకుంటున్నారు కారణం తెలీదు నాకు. వాలీ సుగ్రీవులు కొట్టుకున్నారంటే నమ్మలేదు వీళ్లని చూసేవరకూ. విడదీయడానికి మధ్య లోకేళితే ఇద్దరూ కలిసి మనల్ని కొడతారనీ అందరూ ఎవ్వరి పనివాళ్ళు చేసుకుంటున్నారూ. కన్నడ యాక్షన్ సినిమా చూస్తున్నట్టూ, ముష్టియుద్దాల పోటీ లైవ్ చూస్తున్నట్టూ, మల్ల యోధులకి ఆయుధాలిచ్చి కొట్టుకోమన్నట్టూ ఉంది సిచ్చువేషన్.  పెదమాయ వీధిలోకి పరిగెట్టాడు. వెనకాల చినమాయ కూడా పరిగెట్టాడు. చిన్నమాయకి మా గోడ పక్క పేర్చున్న ఇటుకలు దొరికాయ్. పెద్దమాయ కి ఒక మోస్తరు కర్ర  దొరికీందీ. ఈ చివర ఈయన రాళ్ళిసరడం మొదలెట్టాడు. ఆ చివర ఆయన వాటిని కర్ర తో కొట్టడం మొదలెట్టాడు.
నేను మధ్యలో అరుగు మీద కూర్చొని చూస్తున్నాను ఇంట్రస్టీంగా ఉందనీ.  రసవత్తరం గా  సాగుతోంది మ్యాచ్. అప్పటివరకూ అరుగు మీద సోది కబుర్లు చెప్పుకుంటున్న  పక్కింటి పాపా, చివరింటి నల్లమరీ  గార్లూ "ఇదేటమ్మా మాయదారి గుంట్లూ..!" అనుకొని తిట్టుకొనీ వీళ్లకి నీతులు చెప్పడం  "పిచ్చి కుక్కలకి పళ్ళుతోముకోమని పెప్సొడెంట్ ఇవ్వటం‌లాంటిదనీ" డిసైడయ్యీ లోపలికి పారిపోయేరు.
ఓ నాలుగు రాళ్ళయ్యాకా "ఇంకోంచేం పెద్ద రాళ్ళిసర్రా" అన్నాడు పెదమాయ. అప్పటి వరకూ పిచ్చోడి చేతిలో రాయి లాగా పవర్ఫుల్ గా విసిరిన చిన్నమాయ పక్కా క్రికెటర్ లా పెర్ఫెక్ట్ బౌలింగ్ యాక్శన్ తో ఫుల్ టాస్ లు వెయ్యటం మొదలెట్టాడు. ఇంకో నాలుగు రాళ్ళేసాకా ఇద్దరికీ  జ్ఞాన జ్యోతి కంబైండ్ గా వెలిగీ, బాలూ, బ్యాటూ పట్టుకొనీ చెరో సైకిలూ వేసుకొనీ ఏటి ఒడ్డున క్రికేట్ ఆడ్డానికి బయలుదేరారు గొడవ మరిచిపోయి. (వీళ్ల క్రికెట్ పిచ్చి కాకులెత్తుకెళ్ళా.. అనుకొనీ నేనూ సైకిలెక్కేను)

ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అన్నమాట. మధ్యాహ్నం టైం లో అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఇంట్లో పనిచేసే "మెంటల్ శీను" పరిగెట్టుకుంటూ వచ్చీ మా అమ్మమ్మ గారితో 
"బాప్పా..బాప్పా.... ఊరు తగలడిపోతుందే" అన్నాడు ఆందోళన గా. వెంటనే అందరూ మా పెరటి గుమ్మం వైపు పరిగెట్టారు. వెనకాల నేనూ వెళ్ళాను. ఒక్కసారిగా భయం వేసిందీ. మా పక్కన ఉన్న తాటి కమ్మలిల్లు కాలిపోతుందీ. అందరూ అరుపులూ...అంతా ఒకటే గోలా. "ఒక ఇల్లే కదా తగలడుతుందీ? ఊరు తగల బడుతుందంటారేంటీ?" అని ధర్మ సందేహం అడిగాను అమ్మనీ. "ఇది ఆర్పక పోతే మంటలు పెరిగీ అందరి ఇళ్ళూ కాలిపోతాయ్ రా" అని అనటం తో అర్ధమయ్యిందీ. 
చినమాయ మా హ్యాండ్ బోర్ లో నీళ్ళు కొడుతూ ఉంటే, అమ్మా వాళ్ళూ బిందెలతో అందిస్తుంటే, పెద్దమాయ ప్రహారీ గోడేక్కీ  ఆ నీళ్ళు, కాలుతున్న ఇంటి మీద పోయటం మొదలెట్టారు. పెదమాయ కాలు వేసిన గోడ కూలిపోయీ లోపల పడబోయి తృటి లో తప్పించుకున్నాడు.


మంటల వేడికి చుట్టుపక్కలంతా వేడిగా అయ్యిపోయిందీ. ఎటు చూసినా పొగా. అక్కడ ఉండటమే కష్టం గా ఉందీ. అయినా గానీ అక్కడే ఉండీ ఫైరింజన్ వచ్చేలోపు మంటలు ఆర్పేశారు దిగ్విజయం గా.. అందరూ ఊపిరి  పీల్చుకున్నారు.   
(క్లైమాక్ష్ ఫైట్ అయిపోయిన తరువాత పోలీసు లోచ్చినట్టూ, దొంగలు పడ్డ  ఆర్నెల్లకి  కుక్కలు మొరిగినట్టూ  మంటలు మొత్తం ఆరిపోయిన తరువాత తాపీగా ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళదేం  తప్పు  లేదు  లెండీ.. మా వూరి  రోడ్ అలాంటిదీ)

అప్పటి వరకూ  నన్నేడిపించే  మావయ్యలూ, నా బొజ్జని వెక్కిరించే మావయ్యలూ,  చిన్న పిల్లల్లాగా  గొడవాడుకుంటారనీ నేను నవ్వుకునే మావయ్యలూ  హీరో ల్లాగా కనిపించారు నా కంటికీ.....!

Sunday, July 17, 2011

మా ఏటికొప్పాక గొప్ప...!

చిన్నప్పుడు సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళూరు వెళుతున్నాం అంటే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఆ మాట కొస్తే ప్రతీ ఒక్కరికీ అదో తియ్యని జ్ఞాపకం అయి ఉంటుందీ. నా బాల్యం లో గొప్ప గొప్ప జ్ఞాపకాలన్నీ అమ్మమ్మా వాళ్ళూరి లో జరిగినవే..(కంగారు పడకండీ అవన్నీ ఇప్పుడు మొదలెట్టను)
ఇంతకీ ఏ వూరో తెలుసా?
గత  150  సంవత్సరాలుగా తెలుగువారి సంస్కృతి లో భాగమయ్యి, ఆంధ్రదేశపు హస్త కళావైభవాన్ని చాటి చెప్తున్న లక్కబొమ్మల పరిశ్రమ నెలకొన్న ఊరు. ఎందరో గొప్ప కళాకారుల పుట్టినిల్లు.. విశాఖజిల్లా లోని "ఏటికొప్పాక".

వరహానది ఒడ్డున వెలసిన ఊరు... ఆ ఊరికి  ఒక వైపు గ్రామ దేవత బండితల్లీ, మరో వైపు నూకాలమ్మ తల్లి ఆలయాలుంటాయి.  వచ్చే వాళ్ల మీద పోయే వాళ్ల మీద ఒక కన్నేసి చూస్తుంటారు ఈ అక్కా చెల్లెళ్ళు. ఊరి విస్తీర్ణం తక్కువేగానీ, ఇళ్ళూ, జనాలూ చాలా
ఎక్కువ. ఊరిని చుట్టేస్తూ ఒకే ఒక్క్క రహదారి ఉంటాది. మిగిలినవన్నీ ఇరుగ్గా ఉండే సందులూ గొందులే ;). అయితేనేం? మా వూరి జనాల మనసులు ఇరుకు కాదు. వారి సృజనాత్మకతా, నైపుణ్యాలకి కొలత లేదు.
"ఏంటంటా వారి టాలెంటూ?" అంటారా? చెప్తా గానీ.. మీలో ఎంతమందికి లక్కబొమ్మల గురించి తెలుసో చేతులెత్తండీ? చిన్నప్పుడూ ఎంతమంది లక్క పిడతలతో ఆడుకున్నారో చెప్పండీ...? హ్మ్మ్.. ఈ రోజుల్లో చాలా మందికి తెలిసుండకపోవచ్చు.
అందుకేగా బోలెడు స్టఫ్ తో వచ్చానూ..! ఈ రోజుల్లో హస్తకళలని పెద్దగా ఎవరూ పట్టించుకోవటం లేదు గానీ, నా చిన్నప్పుడు ఊళ్ళొ టీనేజ్ కొచ్చిన ప్రతీ కుఱాడూ ఈ బొమ్మల తయారీ నేర్చుకునేవాడు. సరే పాయింట్ కి వచ్చేస్తున్నా.

లక్కబొమ్మలు అంటే లక్క (Lac) రంగులు అద్దిన చెక్క బొమ్మలు." లక్క అంటే ఏంటీ?" అంటారా?
"లక్క" అనే  కీటాకాలు ఉన్న కొమ్మలను విరిచి, వాటికున్న లక్కను (అవి స్రవించే ఒక పదార్దం) గీకి తీస్తారు. ఈ విధంగా లభించిన ముడి లక్కను 'స్టిక్ లాక్' (Sticklac) అంటారు. ఈ ముడిలక్కను కరిగించి శుద్ధిచేసి బిళ్ళలుగాను, కడ్డీలుగాను అచ్చులు పోస్తారు. శుద్ధి చేసిన ఈ లక్కను 'షెల్లాక్' (Shellac) అంటారు.


ఏజన్సీల్లో ఫారెస్ట్ డెపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకూ పనికి రాని పిచ్చి మొక్క గా పరిగణించీ, తీసుకెళ్లడానికి మాత్రం పెర్మిషన్ ఇవ్వని "అంకుడు చెట్టు" కలపని ఉపయోగిస్తారు వీటి కోసం. (ఈ కఱ చాలా మెత్తగా ఉండటం వల్ల ఎందులోనూ వాడరు.)
ఈ అంకుడు కఱ ని అందమయిన బొమ్మలుగానూ, గృహాలంకరణ వస్తువులుగానూ మార్చి దేశ విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. (మనకి పొరిగింటి పుల్ల కూర రుచి కాబట్టీ పెద్దగా పట్టీంచుకోమనుకోండీ).  
పసుపు కొమ్ములూ, కరక్కాయలూ మరియూ కూరగాయల నుండీ తయారు చేసిన రంగులని లక్కతో కలిపి, ఈ చెక్క తో చేయబడ్డ బొమ్మలకి పూస్తారు. ఈ బొమ్మలకి మెరుగు దిద్దటం లో "మొగలి రేకు "ది కూడా ముఖ్య పాత్ర.
ఇవన్నీ ఎటువంటి కెమికల్స్ కానీ,ప్లాస్టిక్ గానీ వాడకుండా ప్రకృతిసిద్దమయిన వాటిచేతనే చేయబడతాయి. చిన్నపిల్లలొ నోట్లో పెట్టుకోవటం వల్ల గానీ, మనం ఉపయోగిస్తున్నప్పుడూ వంటికి తగలడం వల్లగానీ ఎటువంటి హానీ జరిగేఅవకాశం లేదు..

వీటి గురించిన మరిన్ని వివరాలూ, ఇక్కడి కళాకారుల ఘనత ని చాటే గొప్పగొప్ప కళా ఖండాల గురించీ.., తెలుగువాడి సృజనాత్మకతనీ, పట్టుదలనీ ఎలుగెత్తి చాటిన సంఘటనల గురించీ త్వరలో  వివరంగా చెప్తాను.

మచ్చుక్కి కొన్ని బొమ్మల పోటోలు.. వీళ్ళ క్రియేటివిటీ కి అవధులు ఉండవ్. చిన్న్నపిల్లల గిలిగిచ్చి కాయలను మొదలుకోనీ.. పశు పక్షాదులూ, మనుషులూ, దేవుళ్ళూ.. ఒకటేమిటీ.. ఆడపిల్లల గాజులూ, చెవిరింగులూ, హారాలూ, జడక్లిప్పులతో సహా అన్నిటినీ చెక్కతో చేసి మెరిపించి మురిపిస్తారు.


బుజ్జి గణేశుడు.. వీటిలో అరచేతిలో ఇమిడి పోయే సైజ్ నుండీ రక రకాల మోడల్స్ లో, వేరు వేరు సైజుల్లో దొరుకుతాయి.


ఇదేంటీ అనుకుంటున్నారా? సెల్ ఫోన్ స్టాండ్ అండీ.. వీటిలో కూడా చాలా రకాలుంటాయ్.




అద్దీ....  ఈ వంట సెట్ట్లు. చాలా పాపులర్ అయిన ఐటెం. ఒకప్పుడూ.. ఆడపిల్ల ఉండే ప్రతీ ఇంట్లోనూ ఆడుకోడానికి ఇచ్చే కిట్ అన్నమాట. మొన్న అడిగితే.. ఈరోజుల్లొ ఎవరూ కొనటం లేదండీ. తయారీ ఆపేశాం అన్నాడు షాపతను. నేనూరుకుంటానా?
తయారు చేసే కళాకారుల ఇంటికెళ్ళి మరీ చేయించా..


పక్కనా ఆ తాటాకు బుట్ట ఏమిటీ అని చూస్తున్నారా? అది కూడా ఏటికొప్పాక లక్క బొమ్మల సంస్కృతి లో ఒక భాగమే.. ఈ బొమ్మలు ఆ బుట్టలో పెట్టి ప్యాక్ చేస్తారు.


ఈ బొంగరాలు మీ లో చాలా మందికి తెలిసే ఉంటాయ్..చిన్నప్పుడు తెగ ట్రై చేసేవాడిని తాడు తో ఆ బొంగరం తిప్పడానికి..ప్చ్.. వచ్చేది కాదు.. (ఇప్పుడూ రాదు అనుకోండీ.. ఒక వేళ తిప్పినా తిరగేసి తిరుగుతుందీ..)



ఈ బొంగరాలు ఎలా తయారు చేస్తారో చూడాలని ఉందా.. అయితే ఈ వీడియో మిస్సవ్వద్దూ..
ఈ వీడియో కనిపించే ఆర్టిస్ట్ పేరు చిన్నయాచారి గారు. అబ్దుల్ కలాం చేతుల మీదుగా జాతీయ అవార్డ్ తీసుకున్న వ్యక్తి. ఈయన చేతిలో రూపు దిద్దుకున్న కళాఖండాలని తర్వాత పోస్ట్ లలో చూపిస్తాను.





ఇవి చిన్న పిల్లలు ఆడుకునే కొన్ని బొమ్మలు...





ఈ వీడియో చూడండీ..
http://www.youtube.com/watch?v=nhRwz8JEmJk

ఎడ్లబండీ.. (ఎడ్లు మేతకెళ్ళాయి)

ఇది పూర్వకాలం నుండీ వస్తున్న ఐటెమ్. ఇందులో బొమ్మనీ రెండు గా విడగొట్టీ.. మిగిలినవన్నీ ఒకదానిలో ఒకటి పెట్టేయొచ్చూ..


మనం దాడి ఆట ఆడేవాళ్ళం కదా.. అదీ ఇది.. చెస్ బోర్డ్ కూడా చాలా ఫేమస్. రాజూ, మంత్రీ, గుఱం అన్నీ చెక్కతో చేయబడి ఉంటాయ్. వాటితో ఆడితే ఆ మజానే వేరు. మా ఇంట్లో ఒక సెట్ ఉట్టుందీ..

విజిలేయించే కీ చెయిన్లు..





ప్రస్తుత రోజుల్లో.. వీటికీ, వీటిని తయారు చేసేవారికీ పెద్దగా విలువ లేకుండా పోయిందీ. వీటికి ఉపయోగించే కలప లభించకపోవటం వల్ల రేట్ పెరిగీ కొనకపోవటం ఒక కారణమయితే... ప్లాస్టిక్ బొమ్మలూ, వీడియో గేమ్స్, ఎలక్ట్రానిక్ టాయ్స్ ల తాకిడికి తట్టుకొని నిలబడలేకపోవటం మరోకారణమయితే.... మన కళలనీ కాపాడుకోలేని నిర్లక్ష్యం, మనమే ప్రోత్సహించక పోవటం అసలు కారణం. ఆర్ట్ ఎగ్జిబిషన్ లో వీటిని చూసి వచ్చేసే మనం,  ఏ షాపింగ్ మాల్ లోనో కాస్ట్లీ గా ప్యాక్ చేస్తే ఇరవై రూపాయల ఐటెమ్ ని Rs.299 only (Hand made wooden toy) అని రాస్తే మాత్రం కొంటాం.

చూసారు కదా. ఎక్కడో మీ బాల్య స్మృతుల్ని నిద్ర లేపిన ఈ బొమ్మల్ని. నిజంగా ఎంత మంది ఈ కళాసంపద మన తరంతోనే ఆగిపోతుంది అంటే కించిత్ బాధ కూడా పడకుండా చాలా మామూలుగా తీసుకోగలరు? మన మట్టికి, మన సంస్కృతికి తెలిసో తెలియకో  ద్రోహం చేస్తున్న భావన ఎక్కడో మనల్ని గుచ్చుతుంది కదా. చివరికి మన దేశ సంపద, మన కళలు ఎవరో బయటి వ్యక్తులు వచ్చి తెలియజేస్తే గానీ తెలుసుకోలేని దుస్థితిలోకి వెళ్లే రోజు ఎంతో దూరం లేదేమో అని భయంగా ఉంది. మన సొంత మనుషుల్ని, వాళ్ల చేతిలోని అద్భుతమైన కళల్ని ప్రోత్సహించని మనం, మనది కాని సంస్కృతిని మనవి కాని వస్తువుల్ని ఆరాధించడం నిజంగా సిగ్గుచేటు కాదంటారా? ముందు మన పునాదిని గట్టిగా నిర్మిద్దాం, తరాలు మారినా చెదరని పునాదిని. అదెలా ఉండాలంటే, పైన ఎన్ని రంగులు హంగులతో కొత్త వాసనలు తొంగి చూస్తున్నా, వాటిని మనం ఆస్వాదిస్తున్నా, మన పునాదిని మాత్రం ఎప్పుడూ గుండెల్లో భద్రంగా దాచుకునే విధంగా.. దానికి మన వంతు కృషి మనం చేద్దాం, తరువాత తరాన్ని వారసుల్ని చేద్దాం. నేను అందుకు సిద్ధం.. మరి మీరేమంటారు..!!!!

మరిన్ని బొమ్మలకోసం చూస్తూనే ఉండండీ.. చిత్రం..The Picture

Thursday, July 14, 2011

ఆ దేవుడికి ఇదేం బుద్ధీ?


రిగ్గా ఇరవై రోజుల కిందట....
ఆఫీస్ నుండీ క్యాబ్ లో ఇంటికెళుతున్నాను. ఇంటినుండి అమ్మ ఫోన్.
"అప్పారావు సార్ కి ఆరోగ్యం బాలేదంటరా... కారణం సరిగ్గా తెలీదు 15 రోజుల కిందటే ట్రాన్స్ఫర్ అయ్యి మన స్కూల్లోనే జాయినయ్యారు.హఠాత్తుగా ఏమయ్యిందో తెలీదు. సీరియస్ గా ఉందనీ ఇప్పుడే తెలిసిందీ" అనగానే ఎందుకో ఏదో తెలియని భయం.

చాలా కాలం అయిపోయిందీ మా మాష్టారికి ఫోన్ చేసి మాట్లాడి. దాదాపు ఎనిమిది సంవత్సారాలు గడిచిపోయాయి ఆయన్ని చూసి. వర్క్ ఎక్కువగా ఉండటం ఒక కారణం అయితే.. నా బద్దకం, నిర్లక్ష్యం  అసలు కారణమ్.
అన్నట్టూ మీకు తెలీదు కదూ మా సార్ గురీంచీ...

మా ఫ్యామిలీ లో అమ్మగారి వైపు చూసుకున్నా, నాన్నగారి వైపు చూసుకున్నా మ్యాత్స్ అంటే మైలు దూరమ్ పరిగెట్టే వాళ్ళే గానీ చదివిన వాళ్ళు లేరు. నేను కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఒకటవ తరగతి కంప్లీట్ అయినా ఒకటి నుండి పది వరకూ
అంకెలు చెప్పమంటే మధ్యలో ఐదు తర్వాత ఏడూ అని చెప్తూ మా నాన్నగారి గుండెల్లో రైళ్ళు పరిగెట్టీంచే వాడిని. ఆయన నన్ను ఊరంతా పరిగెట్టించి, అలిసిపోయి ఇంటికొచ్చాకా పడేసి తొక్కేవారు. అలా నాతో పాటూ లెక్కలంటే నాకున్న భయం కూడా పెరిగి ఆరో తరగతి లో కి ఎంటరయ్యింది.
నన్ను ట్యూషన్ లో జాయిన్ చేశారు. నా తోటివాళ్లందరూ అన్ని సబ్జెక్ట్లూ చదువుతుంటే..నేను ఫుల్ టైమ్ లెక్కలు మాత్రమే చేసేవాడిని. రెండు సంవత్సరాల తర్వాత సెవెన్త్ లో మనమే స్కూల్ ఫస్ట్. నా మ్యాథ్స్ మార్కులు మాత్రం 54. మా ట్యూషన్ సార్
చేతులెత్తేసీ నా వల్ల కాదనేశారు. నేను సగర్వంగా కాలరెగరేశాను.

సరిగ్గా అప్పుడే మా నాన్నగారు నన్ను అప్పారావు సార్ ట్యూషన్ కి తీసుకొచ్చీ.. "మా వాడిని మీ చేతుల్లో పెడుతున్నా. మీరేం చేస్తారో తెలీదు.. లెక్కల్లో కనీసం ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేలా చూడండీ. కనీసం వాడి భయం పోయేలా చూడండీ " అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు.

కొత్త మాష్టారు, కొత్త వాతావరణం, అంతా కొత్తే. మొదట్లో భయం ఆయన్ని చూస్తే. మా సార్ వయసు అప్పటికి 40 దాటదు. కానీ జుత్తంతా పండిపోయి ఒక్క నల్ల వెంట్రుక కూడా ఉండేది కాదు. రోజూ పది కిలోమీటర్లు సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళొచ్చేవారు. పొద్దున్న వెళ్ళే ముందూ, సాయంత్రం
వచ్చిన తర్వాత ట్యూషన్ అన్నమాట. చిన్న పిల్లలందరికీ వారి శ్రీమతిగారు చెప్తూ ఉంటే, మా లాంటి ఘటాలని ఆయన చూసుకునే వారు.  తెలుగు, హిందీ తప్ప అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసేవారు. ఆయన లెస్సన్ ఎప్పుడూ మధ్య మధ్య లో జోకులేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది. మా అందరికీ చాలా ఇష్టం ఆయనంటే.
ఎంతంటే ఎప్పుడయినా అల్లరి చేసి ఆయనకి దొరికేస్తే.. ఆయనకి కోపం వస్తుందేమో అన్న భయం కన్నా, ఆయన్ని నొప్పించామన్న  బాధ ఉండేది. అలా ఉండేది ఆయన ట్రీట్మెంట్. సార్ కి  ఎప్పుడన్నా కోపం వస్తే  ఆ  కోపాన్ని  2,3 సెకన్లు  మాత్రమే ముఖం  లో ఉంచీ , అలిగినట్టు గా కొద్ది సేపు చూసి  నవ్వుగా మర్చేసేవారు. ఆ నవ్వు చూడగానే రిలాక్స్ అయిపోయేవాళ్ళం.  ఆ సమయం లో అతని మొహం చూడటం చాలా ఇష్టమయ్యేది నాకు. 
రోజూ వారి ఇద్దరు పిల్లల ముద్దు మాటలతో, ఆటలతో  మాకు టైమే తెలిసేది కాదు.

క్రమంగా నాకు లెక్కలంటే భయానికి బదులుగా ఆసక్తి రావటం మొదలయ్యిందీ నాకు తెలీకుండానే. ఎంతగా అంటే టెంత్ లో మ్యాథ్స్ టెక్స్ట్ మొత్తాన్నీ వారం రోజుల్లో పొద్దుట నుండీ రాత్రి వరకూ ఒక్క లెక్క కూడా వదలకుండా చేసేటంత.
నాకు చదువంటే మొట్టమొదటి సారిగా ఇంట్రస్ట్ కలిగింది అప్పుడే (అప్పటివరకూ పరీక్షల భయం తోనో, హోమ్వర్క్ చెయ్యకపోయినా, మార్కులు తక్కువ వచ్చినా తిడతారని మాత్రమే చదివేవాడిని ). అంతటి ఇంట్రస్ట్ నాకు ఆ తర్వాత మళ్ళీ దేనిమీదా ఎప్పుడూ కలగలేదు. ;( ;( .

టెంత్ పరీక్షలు ఇంకో మూడు నెలలున్నాయనగా నేనూ, నాతో పాటూ మా ఫ్రెండ్స్ అందరం వాళ్ళింటిలోనే ఉండి పోయాం. దాదాపు పది మంది.ప్రొద్దుటే ఇంటికేళ్ళీ స్నానం గట్రా చేసేసీ
మళ్ళీ ట్యూషన్ కి, తర్వాత స్కూల్, ఇంటికొచ్చి రెడీ అయిపోయి మళ్ళీ సార్ వాళ్ళింటికీ. ఇదే మాలోకం.. మా స్కూల్ కన్నా, ఇల్లు కన్నా వాళ్ళింటిలో ఉండటమే నచ్చేది మాకు.
రాత్రుళ్ళు మేము చదువుతూ  కునికి పాట్లు పడుతూ ఉంటే మ్యాడమ్ గారు మాకోసం రాత్రి పదకొండు కి టీ లు చేసిచ్చేవారు రోజూ. సార్ కి మాత్రం కాఫీ.ప్రతీ రెండు గంటలకీ ఒక కప్పు కడుపులో పడిపోవాలి ఆయనకి. అప్పుడప్పుడూ ఆయన కాఫీ మేము తాగేసీ, మా "టీ" సార్ కి ఇచ్చేవాళ్ళం( పొరపాటున) .
"రేయ్.. నా కాఫీ ఎవరయ్యా తాగేశారు? నువ్వేనా...? ఎంజాయ్.. దాని టేస్ట్ అమృతానికి కూడా ఉండదూ. మిస్స్స్స్...నాకు  ఇంకో కాఫీ.." అనేవారు నవ్వ్యుతూ. మేము మాత్రం కడుపు నిండా టీ తాగి కంటి నిండా నిద్రపోయేవాళ్ళం.

"గోళ్ళు కొరకబాకు రా సభా పిరికి అవుతావూ..."
"ఏంటి నాన్నా.. టైం ఎంతయిందీ? ఇంత లేట్ గానా రావటం?"
"అరేయ్.. బకెట్ సాంబార్ లో ఒక ఇడ్లీ ముక్క పడేసీ అందులో నీ తలకాయ ముంచుతా"
["ఇడ్లీ ముక్కెందుకు సార్ పడేయటం ?" అని అడిగేవాళ్ళం
" సాంబార్ లో ముంచినప్పుడూ ఆ ముక్క కోసం వెతుకుతాడు రా" అనేవారు.]
"ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ !"
ఈ మాటలు, ఆ పద్యమూ ప్రతీరోజూ ఒక్కసారన్నా ఎవరో ఒకర్ని ఉద్దేశించి అనేవారు..  ఆ పద్యమయితే మాష్టారు మొదటి పాదం పాడగానే అన్ని క్లాసుల వాళ్ళం, చదువుతున్నదీ, రాస్తున్నదీ, చేస్తున్నదీ ఆపేసీ "నొప్పింపక తానొవ్వక తప్పించుకు
తిరుగువాడు ధన్యుడు సుమతీ" వంతపాడి నవ్వేవాళ్ళం.
నెలలో మొదటివారం దాటేలోపు  ఫీజివ్వలేక పొతే ఇక రానక్కరలేదు అని చెప్పే స్కూళ్ళూ, ట్యూషన్ సెంటర్లూ తెలుసు నాకు. ఆయన మాత్రం నెల మధ్యలో ఒకసారి "ఫీజ్ రిమైండ్ చెయ్యండమ్మా ఇంట్లో " అని కామన్ గా అందరికీ ఒకే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేవారు అంతే.. ఇచ్చినోళ్ళ  దగ్గర తీసుకునే వారు. లేదంటే లేదు. 
"ఎంత పంచినా తరగనిది చదువొక్కటే " అనేవారు ఎవరైనా అడిగితే.
ఆయనకీ నేనంటే ఎంత ఇష్టమంటే.. సెలవులకి వాళ్ళూరు వెళ్ళోస్తే నాకోసం  గోంగూర పచ్చడి తెచ్చిచ్చి "గుంటూరు గోంగూర" రుచి చూడవోయ్ అనేవారు.
క్రికెట్ మ్యాచ్ వస్తుంటే మాతో కలసి చూసేవారు. పిక్నిక్ కి తీసుకెళితే మాతో కలసి ఆడేవారు. ఆరోజులు మళ్ళీ రావనుకుంటా..! 

మొత్తానికి టెంత్ ఫైనల్ ఎగ్జామ్ లో మ్యాత్స్ నా చేతులారా చేసుకున్న తప్పువల్ల 4 మార్క్స్ తగ్గీ 96/౧౦౦ వచ్చాయి ..! నా కన్నా ఎక్కువ ఆనంద పడ్డారు మా నాన్నారు 90 దాటాయని. నా కన్నా ఎక్కువ బాధ పడి ఉంటారు మా సారు... సెంట్ రాలేదని...!

ఆ తర్వాత సార్ ఫ్యామిలీని తీసుకొనీ వైజాగ్ వెళ్లిపోయారు ట్రాన్స్ఫర్ మీద. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడ్డం తప్పా.. కలవలేదు.

మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ న్యూస్...

మర్నాడే ఆఫీస్ కి సెలవు పెట్టీ డైరెక్ట్ గా వైజాగ్ వెళ్ళాను. వెళ్ళే ముందుగా విన్నదాన్ని బట్టీ ఆయనకి చిన్న ప్రేవులు పాడయ్యి, డైజెషన్ సిస్టమ్ స్తంభించిపోయిందటా. గత పది రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా సెలైన్ మీదనే ఆధారపడుతున్నారు. ఆపరేషన్ చెయ్యాలో వద్దో కూడా డాక్టర్లకి తెలీని పరిస్థితి.
భయపడుతూ  భయపడుతూ వెళ్ళాను హాస్పిటల్ కి. నన్ను చూసేసరికీ "హా.. వచ్చావా నాన్నా... నీ కోసమే ఎదురుచూస్తున్నాను" అంటూ పలకరించారు. ఎలా ఉన్నారు సార్ అని అడగలేనీ, గురువు గారి  దగ్గరకి వెళ్ళినప్పుడు పండో, కాయో తీసుకెళ్ళి ఇవ్వలేని పరిస్థితి . సరిగ్గా ఆరోజు నుండే ఆరోగ్యం కాస్త కుదుట పడిందటా. ముందు రోజు వరకూ వంటికి ఉన్నవైర్లన్నీ తీసేశారట. మ్యాడమ్ గారు కూడా నవ్వుతూ మాట్లాడారు. హమ్మయ్యా అనుకున్నాను. సార్ మాటలకి అవధులే లేకుండా పోయాయి. బెడ్ మీదనే పడుకొనీ ఎన్ని కబుర్లు చెప్పారో..!

"ఏం లేదు నాన్నా.. సీరియస్ ప్రాబ్లమే గానీ డాక్టర్స్ సరయిన సమయానికి గుర్తించారు. కాఫీ తాగడం తప్ప ఏ అలవాటూ లేని నాకే ఎందుకొచ్చిందీ అంటావా? అలా అని ఇక్కడ రాసుందీ..! కాకపోతే జీవితం లో ఏ సమస్య కీ తలోంచని నేను ఒకానొక దశ
లో భయపడ్డాను. నా  పిల్లలూ, ఫ్యామిలీ ఏమయిపోతారూ? అని.  కానీ ఒక్కటే ధైర్యం .. మనకి తెలిసీ నలుగురికి సాయం చేసి ఆదుకున్నామే తప్పా.. ఎప్పుడూ ఎవర్నీ బాధ పెట్టలేదు... ఇది దేవుడు పెట్టిన పరీక్ష అంతే..నాకు అన్యాయం చెయ్యడూ..
నాకున్న బలాలు రెండే రా.. ఒకటి నాకున్న మిత్రవర్గం, రెండు నా స్టూడేంట్స్.. అంతే ఇంకెవరూ లేరు. మీరంతా ఉండగా నాకేం అవుతుందీ..? నాలుగు రోజుల్లో డీశ్చార్జ్ చేసేస్తారు.రోజూ పదివేలు ఖర్చు పెట్టాలీ అంటే మనలాంటి  బడి పంతుల్లకీ అయ్యే  పనా ?   అవసరమయితే రెండు రోజుల కొకసారి చెకప్ కి వచ్చేస్తాను  .
కాకపోతే.... "దాహమేస్తుండీ  గుక్కెడు నీళ్లు ఇవ్వండీ" అని  డాక్టర్ల ని అడుగవలసిన ఇలాంటి పరిస్థితి, కాఫీ సంగతీ పక్కనెట్టూ.... గొంతెండిపొతే నీళ్ళు పుక్కిలించి ఊసెయ్యాల్సిన పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. చెప్తున్నానని కాదు గానీ ఫ్యామిలీ అంతటికీ హెల్త్ ఇన్షూరెన్స్ చేయించూ. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు.. ఈరోజు నువ్వొచ్చావ్ కదా..నా నీరసం మొత్తం ఎగిరిపోయిందీ" 

ఇలా ప్రస్తుతం టీచర్ల పనితీరు గురించీ మొదలుకోనీ చిన్నప్పుడు ఆయన పేరు వచ్చేటట్టుగా అమ్మ చేత అల్లించి ఇచ్చిన బ్యాగ్ వరకూ, అన్నీ గుర్తుచేసుకుంటూ,గుర్తు చేస్తూ   గలగలా మాట్లాడుతూనే ఉన్నారు. నా పెళ్ళీ తన చేతులమీద గానే జరగాలన్నారు. 5 రోజులు జరిపిస్తానన్నారు.  ఎప్పటిలాగానే జోకులేశారు. పాత ఫ్రెండ్స్ అందరినీ ఎవరేం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. నా నుదుట కుంకుమ పెట్టీ, ఏదో శ్లోకం
చదివీ ఆశీర్వదించారు.. నేను బయలుదేరే ముందు వెనక్కి పిలిచీ "
రెండు విష్యాలు చెప్తానూ గుర్తుంచుకో 
1. నీ మంచితనాన్ని, నిజాయితీనీ ఎప్పుడూ నిలబెట్టుకో 
2. నీ ఫ్రెండ్స్ కి కానీ, హెల్ప్ కావల్సిన వాళ్ళెవరయినా కానీ, నీ చేతిలో పని అయితే మాత్రం
తప్పకుండా హెల్ప్ చెయ్యి. అంతే..
" అన్నారు.

గుండెల నిండా గాలి పీల్చుకొనీ, తేలిక పడిన మనసు తో బయలుదేరాను. ఇంటికి మా వూరు వచ్చేసిన మర్నాడే పొద్దున్నే నాన్నగారు "సడెన్గా  బీపీ తగ్గిపోయీ అప్పారావ్ సార్ ఎక్స్పైర్ అయ్యారటరా తెల్లవారుజ్హామున" అని  చెప్పిన మాటకి నిద్ర ఎగిరిపోయి ధిగ్గున లేచి కూర్చున్నాను.
ఆయన్ని చూడటానికి వెళ్లలేదు నేను. అది తప్పో, ఒప్పో తెలీదు. నేను ఆయన్ని అలా నిర్జీవంగా చూడలేను. ఏ జన్మ  పుణ్యమో ఆ ముందురోజు ఆయనతో కలిసి ఆ క్షణాలు పంచుకోవటం. అంత లోనే అలా.....ప్చ్.. ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షల పేరుతొ మంచి మనుషులకు శిక్షలు వేస్తున్టాడో? . ఇది కూడా  మా మేడం గారికీ, నా చిన్నారి  చెల్లెళ్ళకీ పెట్టిన పరీక్షే అనుకోవాలా ?