జీవితం లోని వెల లేని విలువైన గొప్ప రోజులని బాధాకరమయిన భయంకరమయిన రోజులని భ్రమపడుతూ, అవి గడిచిపోయాయని సంబరపడుతూన్న రోజులు.
టెంత్ క్లాస్ రిజల్ట్స్ చూసుకొని స్కూల్ ఫస్ట్ నేనే అని తొడకొట్టి తాండవం చేస్తున్న రోజులు.
పెణం లోనుండి పొయ్యిలో పడే రోజులు త్వరలో తరుముకు రాబోతున్నాయని తెలీక, స్విచ్ ఆన్ చేసి, ప్లగ్ లో వేలెట్టి , కరెంట్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నట్టూ కాలేజ్ కెళ్ళే మొదటి రోజు కోసం ఎదురు చూస్తున్న రోజులు.
"ఓరేయ్.. గాడిదా..! ఏం పాటడిపోతున్నావ్ లోపలా?" అన్న పిలుపు కి స్వాతీ వీక్లీ లో సీరియస్ గా సెంటర్ పేజ్ చదువుతున్న నేను ఉలిక్కి పడి పేజీలు తిప్పేసీ "ఏమీ లేదు..ఏమీ లేదు" అని "ఏదో.. ఉందీ" అనేట్టు గా ఎదవేక్షన్ చేస్తూ ఎదురెళ్ళాను వాకిట్లోకి.
"ఏరా.. ఏనాడయినా నేను చెప్పకుండా నీ అంతట నువ్వు పుస్తకం తీసి పేరా అయినా చదివావా?"
నేను : మరగబెట్టిన మజ్జిగ సాసర్ లో పోసుకొనీ ఉఫ్ఫూ..ఉఫ్ఫూమని ఊదుకుంటా తాగేవాడిలాగా ఫేస్ పెట్టీ ఐమూల గా షెడ్ లో కట్టేసిన మా టైసన్ గాడిని (మా కుక్క పిల్ల) చూస్తూ
{మనసులో.. పరీక్షలయిపోయి రిజల్ట్స్ వచ్చేశాక కూడా ఏం చదవాలి నా బొందా?}
మా నాన్నః "నేనిక్కడ మాట్లాడుతుంటే ఆ నేల చూపులేంటీ? నేల చూపులు చూసేవాళ్ళనీ నమ్మకూడదంటారు."
నేను : చటుక్కున తలయెత్తి మా ఇంటి మీద పెంకులు లెక్క పెడుతూ..
మా నాన్నః "ఇలాగే ఉంటే మీ మాయల్లాగా తయారయ్యి ఎందుకూ పనికి రాకుండా పోతావ్"
నన్ను తిడుతున్నంత సేపూ, బోరు దగ్గర తిట్లు వింటూ ప్రశాంతం గా అంట్లు తోముకుంటున్న మా అమ్మ, ఎండబెట్టిన గింజలు తింటానికొచ్చిన పక్కింటి నారాయణమ్మ గారి కోడి మీదకి చేతిలో ఉన్న గరిట విసిరేసీ "మధ్య లో మా తమ్ముళ్ళేం చేశారూ?" అని కళ్ళెర్రజేసింగ్స్.
"ఆ... చాలా గొప్ప తమ్ముళ్ళు. ఇంటికొస్తే నాకేనాడయినా కాళ్ళు కడుక్కోమని చెంబుడు నీళ్ళిచ్చారా? గొంతులో పోసుకోమని గ్లాసుడు మజ్జిగిచ్చారా? అయినా మీ నాన్న పెంపకం అలాంటిదీ."
మా అమ్మః ఇంకా ఆ మాట అన్లేదేమిటా అనుకుంటున్నాను.
మా నాన్నః అనకుండా ఎలా ఉంటానూ? ఆ టార్చరెలా మరిచిపోతానూ? అయినా.. అల్లుళ్లని కూడా చూడకుండా, అన్నం కూడా తిన్నీయకుండా అర్ధరాత్రి దాకా "నేనెందుకు గ్రేటూ? మా ఫ్యామిలీ ఎంత నీటూ? మావల్లే మారింది నీ ఫేటూ" అని పిప్పరమెంట్ బిళ్లలు చప్పరించినట్టూ అల్లుళ్ళ మెదళ్ళు చప్పరించెయ్యడానికి మనసెలా ఒప్పుతాదీ మీ నాన్న కీ? మీ సోది అందరూ వినాలిగానీ, పక్కోళ్ల ప్రోబ్లెమ్ గురించి పట్టించుకోరుగా మీ ఫ్యామిలీ మొత్తం?
మా అమ్మః కోపం లో తోమేసిన అంట్లు మళ్ళీ తోమేస్తూ..
మా నాన్నః ఒరేయ్.. రేప్పొద్దున్న వైజాగెళుతున్నాం. నువ్ స్కూల్ ఫస్టొచ్చినందుకూ గిఫ్ట్ గా నీకు వాచ్ కొంటున్నాను.
మా అమ్మః ఎందుకిప్పుడూ? అనవసరంగా? ఆల్రెడీ మా చిన్న చెల్లెలిచ్చిన వాచ్ ఉందాడికి. నా వాచ్ వాడి లక్కీ వాచ్ కూడాను. అదీ గాక వాడి పరీక్షలన్నిటికీ అదే పెట్టుకెళ్ళేడు.
నేను: ఏదీ? పిన్ని వాడిచ్చేసిన ఆ వంద రూపాయల వాచ్చా? నాకొద్దది. హ్మ్మ్..... అయినా నీ వాచ్ ఎగ్జామ్స్ కి మాత్రమే. నాకు కొత్త వాచ్ కావాలి.
నాన్న వెళ్ళిపోయాకా.. కుక్కర్ లో పడేసిన కందిపప్పులాగా కుత కుతా ఉడికిపోతున్న నన్ను చెవట్టుకొని దగ్గరకి లాగీ.. " దురదేసినప్పుడు గోక్కోవాలి, సరదా వేసినప్పుడు తీర్చుకోవాలి. మీ నాన్న వాచ్ కొనివ్వాలని సరదా పడుతున్నారుగా. నీకు నచ్చినది కొనిపించుకో. నేనలా అన్నాను కాబట్టీ..మీ నాన్న కచ్చితంగా కాస్ట్లీ వాచ్ కొంటారు"
అని మాస్టర్ ప్లాన్ ని రివీల్ చేసిందీ మా మాతృదేవత. (ఎంతయినా అమ్మ అమ్మే కదా..!) అరెరే... పెరుగువడ లాంటి మృదువయిన మా అమ్మ మనసుని చెరుకుగడ లాగా కరుకు అనుకున్నానే అని రియలైజ్ అయ్యాను. ****************************** ****************************** *****************
మర్నాడు మా బజాజ్ బాక్సర్ బండి మీద మా ఇసాపట్నం బయలెల్లాం. టైటన్ షో రూం లో లైటేసి చూపిస్తున్న ప్రతీ మోడల్ నచ్చేస్తుందీ నాకు. నా టేస్టు గానీ, అక్కడున్న ఏ ఒక్క మోడల్ కాస్ట్ గానీ నచ్చట్లేదు నాన్నారికి. చతురస్రాకారం లో పేద్ద డయల్ ఉన్న ఒక చెయిన్ మోడల్ సెలెక్ట్ చేసీ తన చేతికి పెట్టుకొని చూసుకునీ "ఇది బావుంది కదా" అన్నారు. మా నాన్నగారు కూడా వాచ్ తీసుకుంటున్నారేమో అనుకొని "ఆ... బానే ఉంది నాన్నా" అన్నాను.
"అయితే ప్యాక్ చేయించెయ్యనా?"
"ఏమిటీ..? అది నాకా" అని అవాక్కయ్యి.. స్లో మోషన్ లో షడెన్ బ్రేక్ వేసినట్టూ షాక్ కి గురయ్యాను.
"ఫాస్ట్ ట్రాక్ లో తీస్కుంటాన్నాన్నా.. సూపర్ గా ఉంటాయ్, పైగా స్పెషల్ ఆఫర్ కూడానూ" అని చూపించేను. "ఇవేం వాచీలు రా? ఏమిటీ ఒక పద్దతీ పాడూ, ఆకారం ప్రాకారం లేకుండా, అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చిగా... ఛీ..ఛీ.. " అని ఛీకొట్టేశారు.
"అది కాదు నాన్నా.. అవి లేటెస్ట్ మోడల్స్. పెట్టుకుంటే సూపర్ లుక్ ఉంటాయ్. ఆ ఫినిషింగ్ చూడూ ఎలా మెరిసిపోతున్నయో?"
"ఆరిపోయే దీపానికి వెలుగూ, రాలిపోయే జుత్తుకు మెరుపూ, మానిపోయే పుండుకు సలుపూ ఎక్కువ గానే ఉంటాయ్ అలా అని అవి గొప్పవయిపోతాయా?" అనేసీ పక్కనే ఉన్న సొనాటా షోరూమ్ కి తీసుకెళ్ళీ పన్నేండొందలెట్టీ ఆయనకి నచ్చిన సో కాల్డ్ సూపర్ వాచ్ ఒకటి తీసీ నా చేతికి ఒకసారి పెట్టేసీ "సూపర్ గా ఉందిరా.. చాలా డిగ్నిఫైడ్ గా ఉందీ. పెర్ఫెక్ట్ " అనేసీ ప్యాక్ చేయించేసీ గర్వంగా ఒక లుక్కిచ్చేరు.
నేనుః "అది పెద్ద బా లే.." వినిపించీ వినిపించనట్టుగా..
మా నాన్నః ఆ...? ఎంట్రా నసుగుతున్నావ్? ఎదవ నాటు తుపాకీ లో వాడేసిన తూటా వాటం నువ్వూనూ. అవతల చాలా పనులున్నాయ్... పదా..!
"అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వటం లోని ఆనందం మీకు తెలుసు... కోరుకున్నది దక్కకపోతే కలిగే బాధ మీకు తెలీదు"... ఈ హిడెన్ డైలాగ్ నాదే. అప్పుడు నేను వాడాను. తర్వాత సినిమాలో వాడుకున్నారు.
ఇంటికొచ్చాక గెలవేసిన అరిటిచెట్టు లాగా వేలాడేసిన మొహం తో ఉన్న నన్ను చూసి "ఏరా వాచ్ కొనలేదా?" అన్నాది మాతృదేవత. "కొనక పోయినా బాగుండేదమ్మా.. నాన్న నాలిక్కి రాసుకునే టేస్ట్ లే నాకు నచ్చవ్. అలాంటిది చేతికి రాసేరు చూడు. ఎప్పుడో రాక్షస బల్లుల కాలం నాటి మోడల్ ఇది" అని వాచిన ఎడమ చెయ్యి చూపించి, ఖాళీగా ఉన్న కుడిచేత్తో మొహం దాచుకున్నాను.
"అసలు కాలేజీకెళ్ళే కుర్రాడికి కొనాల్సిన వాచ్చేనా అదీ? అన్నీ ఇలాగే తగలేస్తారు.. మూర్ఖత్వం. ఆ మాత్రం దానికి వాడిని తీసుకెళ్ళడం ఎందుకూ?" అని అమ్మ మైక్ లేకుండా సువార్త సభల్లో స్పీచిస్తున్నట్టూ హైపిచ్ లో ప్రైవేట్ చెప్పడం మొదలెట్టిందీ.
నా కడుపుమంట కూసింత చల్లారింది గానీ, నాకేం కావాలో ఎప్పుడు కావాలో అడక్కుండానే కొనిపెట్టే మా నాన్న ఆ తర్వాత ఏదీ కొనిపెట్ట లేదు. ఒక వేళ ఏమన్నా కొనమని అమ్మ అడిగినా గానీ "నేను కొన్నవి వాడికి నచ్చవ్.. వాణ్ణే కొనుక్కోమను" అనేసేవారు.
ఇంజినీరింగ్ చదూతున్నప్పుడు కాలేజ్ ఎగ్గొట్టి మరీ బొమ్మరిల్లు సినిమా రెండు సార్లు చూసేసీ, సినిమా లో బాగా ఇన్ వాల్వ్ అయిపోయాను. మా నాన్నారికి ఎలా అయినా ఆ సినిమా చూపించాలనుకున్నాను. తమ్ముడు, నేనూ "ఈ సినిమా లో ప్రకాష్రాజ్ సేం నాన్న టైపే" అని అమ్మకి గోరింటాకు నూరినట్టూ బాగా నూరిపోసెయ్యటం తో అన్నమయ్య సినిమా తర్వాత సినిమానే చూడని మా వాళ్ళిద్దరూ బొమ్మరిల్లు సినిమా చూశారు. సినిమా చూస్తున్నంత సేపూ నేనూ, మా తమ్ముడూ మా ఫాదర్ వైపూ, ప్రకాష్ రాజ్ వైపూ మార్చి మార్చి చూసేం. ;) ;)
అయిపోయాక "సినిమా బావుంది కదా నాన్నా" అన్నాను అక్కడికేదో ఆయనకి జ్ఞాన జ్యోతి వెలిగించేనన్న ఫీలింగ్ తో.
ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి "నాకు నచ్చలేదు" అన్నారు.
"న..చ్చ.. లే దా? ఏం నచ్చ లేదూ? "
"ఆ సినిమా లో హీరోకున్న కష్టాలేమిట్రా? వాడి బాధ లో అర్ధమే లేదు.. పీకలదాకా తిండి పెట్టీ, ఏ లోటూ రాకుండా కంటికి రెప్ప లాగా చూసుకుంటుంటే ఏం తెగులు వాడికి? వాడి సంగతి వదిలెయ్యి. వాణ్ణి సపోర్ట్ చేస్తున్న నీకు చెప్తున్నాను. విను
మీ స్కూల్ లో......హాస్టల్ కి సెలవులిస్తే ఇంటికెళితే మూడు పూట్లా తిండి ఉండదని బాధ పడే నీ క్లాస్మేట్స్ గురించి తెలుసా నీకూ? ఒక టీచర్ గా నాకు తెలుసు
పిల్లల్ని పనిలోకి పంపితే గానీ పూట గడవని ఫ్యామిలీస్ గురిమ్చి తెలుసా నీకూ?
చదువవసరం లేదనీ, చదివిస్తే తన మాట వినరనీ, నన్ను మాత్రమే చదివించీ, నా తర్వాత పుట్టిన మీ చిన్నాన్నని పొలానికి పంపించిన మీ తాతయ్య మూర్ఖత్వం గురించి తెలీదు నీకు.
కొడుకేం చదువుతున్నాడో, అసలేం చదువుతున్నాడో కూడా పట్టించుకోని మా నాన్న నిర్లక్ష్యం గురించీ, గవర్నమెంట్ హాస్టల్ లో చదివే పిల్లల బాధల గురించీ, అలాంటి హాస్టల్స్ నేను తిన్న తిండి గురించీ ఏమీ తెలీదు. అసలు లోటు అనే మాటే తెలీదు మీకు. నేను పడ్డ కష్టాలేవీ నా పిల్లలు పడకూడదనీ,
కనీసం తెలియకూడదనీ నా తాపత్రయం. మా నాన్న నన్ను చదివించటం మీ అదృష్టం. మీకేం రా? లోకం లోని చాలా మంది కన్నా నీ జీవితం ఎన్నో రెట్లు మేలు. చక్కగా అన్నీ అమర్చిపెట్టీ, చదువుకోమని పంపిస్తే... ఏం రోగం మీకూ? ఇప్పటి వరకూ ఇన్ని చేసిన మాకు మా పిల్లల గురించి ఆలోచించే బాధ్యత ఉండదా?, నిర్ణయం తీసుకునే హక్కుండదా? "
ఆ రోజు అడిగిన ఆ ప్రశ్నలని ఎదురు చెప్పే సమాధానం లేదు ఊకొట్టి, తలాడించటం తప్ప.
ఎదిరించే ధైర్యం లేదు అప్పటీకీ, ఇప్పటికీ.
వారిని బాధ పెట్టే ఆలోచన రాదు ఎప్పటికీ.
హ్మ్మ్... నిజమే.. నా జీవితం పూలబాటే. నాకే కష్టాలూ లేవు. నాకున్న కష్టాలు అసలు కష్టాలే కావు. నాకోసం పరితపించే మా అమ్మా, నాన్నా ఉండగా నాకు కష్టాలే రావు.
[ఇటీవల ఇల్లు మారుతున్నప్పుడూ, అన్నీ సర్దుతూ ఉంటే సూట్ కేస్ లో మా నాన్న కొనిచ్చిన వాచ్ కనిపించీ ఈ జ్ఞాపకాల్ని తట్టి లేపిందీ]