Monday, June 11, 2012

ఓ చిత్రకారుడి చీకటి రహస్యాలు

వి ఇంట్లో మా అమ్మ మొట్టే మొట్టీకాయలూ, స్కూల్ లో నాన్న  పెట్టే బొబ్బట్లూ తినడం హాబీ గా మారిపోయిన దుర్గతి పట్టిన నాలుగో తరగతి రోజులు.
అప్పట్లో మా ఇంటి ముందే లైబ్రరీ ఉండేది.  లైబ్రేరియన్ మా నాన్నగారికి ఫ్రెండ్ అయిపోవటం తో  ఆకలితో ఉన్న
కుక్కకి తోలు చెప్పు దొరికినట్టూ నాకు ఆ లైబ్రరీ దొరికింది.  స్కూల్ నుండి రాగానే లిబ్ కి వెళ్ళిపోయీ  మూసేసే వేళ
వరకూ కదిలేవాణ్ణి కాదు. అవి నేనెప్పటికీ మరిచిపోలేని రోజులు లెండీ. బాలమిత్ర, చందమామా, బుజ్జాయీ,
బాలజ్యోతీ వగైరాలకి  ఈ ఆడోళ్ళంతా సీరియళ్ళు చూస్తూ ఏడవడానికీ, మా నాన్న రాజశేఖర్ సినిమాలకీ, మా తాత లంక పొగాకు చుట్టలకీ, మా నానమ్మ ఆ చుట్టపీకలు ఊడ్చడానికీ, అడిక్ట్ అయిపోయినట్టూ, అడిక్ట్ అయిపోయాను.

ఆ ఏడాది మా  లైబ్రరీ వార్షికోత్సవానికి   పలురకాల పోటీలూ పెడుతుంటే నా తరుపున మా నాన్నారు
చిత్రలేఖండనం, గానకాలుష్యం పోటీలకి నా పేరిచ్చీసేరు.  మా గోడమీద తగిలించిన పెయింట్ ని చూపించీ "ఈ
 బొమ్మ ప్రాక్టీస్  చెయ్" అని ఆర్డరేసేరు. ఆ బొమ్మేంటంటే... రెండు కొండలూ, మద్య నుండి ఉదయిస్తున్న  ఎర్రని
సూరీడూ(రూపాయి బిళ్ళతో వేయాలి) , మీద  పక్షులు ఎగురుతూ ఉంటాయ్, పక్కనే నీలి మేఘాలు ఉంటాయి. కొండల ముందు  ఏరు పారతా ఉంటాది.
అందులో రెండు తెరచాప పడవలు పోతా ఉంటాయ్. ఆ ఏటి ఒడ్డున రెండు కొబ్బరి చెట్లూ, వాటిని ఎక్కుతూ ఇద్దరు మనుషులూ..(ఇది నేను ఇంప్రొవైజ్ చేశా).
ఇహ చూస్కో నా రాజా... కనిపించిన ప్రతీ పేపర్ మీదా, గోడల మీదా, గుమ్మంమీదా రాక్షస ప్రాక్టీసు చేసేను.
పోటీ రోజు రానే వచ్చిందీ. నేను మొదలెట్టీ, ఒక కొండా, ఒక పడవా పూర్తయ్యేసరికీ నా ప్రాక్టీసు దెబ్బకి కొన ఊపిరితో
ఉన్న  స్కెచ్ లన్నీ అయిపోయాయ్.  తోటి కళాకారులని అడుక్కొనీ నా సీనరీ ని పూర్తి చేసేను.  తలతిప్పి చూసేసరికీ
ఒక్కొక్కడూ అద్భుతం గా  వేసేస్తున్నారు. కొంత మంది బ్రష్ లతో వేస్తుంటే, కొంతమంది స్కెచ్ పెన్ లోపలి కడ్డీని
నీట్లో ముంచి అద్దేస్తున్నారు. ఆ బ్యాచ్ నుండీ మా పక్కింటీ కిషోర్ గాడోచ్చీ...  "ఇదేంట్రా ఇల్లు అలికినట్టూ
అలికేశావూ.. చాలా వరస్ట్ గా ఉన్నాదిలే" అనేసి నా లేత మనసు ని గాయపరిచాడు. ఇక నాకు వడదెబ్బ కొట్టినట్టూ
డీ హైడ్రేషన్ అయిపోయిప్రిజ్ లో‌ పెట్టిన  లేతశవం లాగా బాడీ చల్లబడిపోయింది.

"ఎలా వేశావు రా బొమ్మా?"  అడిగింది మా మాతృదేవత ఇంటికి రాగానే. అసలే డిప్రెషన్ లో ఉన్న నేనూ
"ప్చ్... చెత్తలాగా నా స్కెచ్ పెన్ లు అయిపోయాయమ్మా.. లేకుంటే సూపర్ గా వేసుండేవాణ్ణి" అని కవర్ చేసేశాను.
"హ్మ్... ఒకసారి మీ నాన్న మనిషి బొమ్మ వేస్తే లుంగీ కట్టుకున్న ఆదిమానవుడు లాగా వచ్చాడు. చార్ట్ నున్నగా
లేదనీ, బ్రష్ బాలేదనీ సాకులొకటీ మళ్ళీ. ఆ జీన్స్ ఎక్కడికి పోతాయ్ లే" అనేసింది మా నాన్న కి వినిపించేలాగా.


కానీ ఇక్కడే అందరి అంచనాలు పల్టీ కొట్టాయి. మహా మహులకే మతులు పోయే విధంగా, మా నాన్న కళ్ళు తిరిగేవిధంగా ఫస్ట్ ప్రైజ్ నాకే‌ వచ్చిందీ.  నా ఆనందాన్ని ఆశ్చర్యం డామినేట్ చేసిందీ. మా అమ్మ "అన్నీ నా పోలికలే ఎదవకీ" అని మురిసిపోయింది. గుండు గొరికించుకొని గంధం రాసుకున్నంత హాయిగా అనిపించింది.
ప్రైజ్ తీసుకున్న ఆనందం లో  స్లో మోషన్ వీడియో లో, డీటీయస్ ఆడియో లో గర్వంగా తొడగొట్టాను.
కానీ "నీ కెవడ్రా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడూ?" అనే ఈటెల్లాంటి మాటలు తూటాల్లాగా పేలుతూ  మా పేటంతా వినిపిస్తూ,
ఫ్యాక్షనిస్ట్  కుడితొడ మీద సెగ్గడ్డ లాగా బాధించాయి.
అడిగితే " నీకు ఫస్ట్ వచ్చినట్టు లేదురా.. ఊళెయ్యటం బాగా వచ్చని చెప్పి, నక్కల చేత కచేరీ
పెట్టించినట్టుందీ" అన్నారు చాలామంది.

ఎంతయినా మంచికి రోజులు కాదు కదండీ.. ఈ దేశం లో కళాకారులకి  తగిన ప్రోత్సాహం లేదు.. ;( ;( ;(

****************************************************************************
ఆ తర్వాత ఓ సారి ఏనుగు బొమ్మ వేసి మా తమ్ముడికి చూపిస్తే...  "పంది  భలే ఉంది అన్నయ్యా" అన్నాడు చప్పట్లు కొడుతూ... !  నోట్లో‌  తిరపతి లడ్డూ కుక్కీ, మూతి మీద గుద్దేస్తే ఎలా ఉంటాదో తెలుసా?? అలా అనిపించింది నాకు.
"మరి నేనంటే‌ ఏటనుకున్నావు..? పెద్దయ్యాకు నువ్వూ  నాలాగే వేసి మంచి పేరు తెచ్చుకోవాలి" అని క్లాస్ పీకీ, ఈ మాట ఇంకెవరితోనూ చెప్పొద్దని మాట తీసుకుని గమ్మునుండి పోయాను.

నేను ఆరో తరగతి కి వెళ్ళాకా,  మాకు వారానికోసారి డ్రాయింగ్ పిరియడ్ ఉన్నాదని తెలిసాకా మా నాన్న కన్నా పెద్ద ఆర్టిస్ట్ ని అయిపోవాలనే కోరిక పుస్తకాలకి చెద పట్టినట్టూ ఒళ్ళంతా పట్టింది నాకు.
మా  డ్రాయింగ్ సార్  "ఆచారి" గారు మొదటి క్లాస్ తీసుకున్నప్పుడూ "ఎవరెవరికి ఏ యే బొమ్మలొచ్చో  వేసి చూపించండ్రా" అన్నారు.
"నాకు బాతు బొమ్మ వచ్చు సాఆఆఆఆఆఆఅర్" అని ప్రకటించీ, పదే పది సెకన్ లలో వేసి చూపించా.
"అబ్బా.. ఇంత తొందరగా  అంత బాగా వేశావంటే నువ్వే రా నా శిష్యుడివీ , ఇదిగో బోర్డ్ మీద వెయ్యి అందరూ చూస్తారు" అని సుద్దముక్క చేతికిచ్చారు.
నేనుః "నాకు పుస్తకం లోనే బాగా వచ్చు.. బోర్డ్ మీద సరిగా వెయ్యలేనండీ"
డ్రాయింగ్ మాష్టారు: "పరవా లేదు.. నే ఉన్నా గా.... వెయ్యి..."
నేను" పుస్తకాన్ని తిరగేసి నట్టూ, బ్లాక్ బోర్డ్ ని తిరగెయ్య లేము కదండీ.. నాకు 76 ని బాతు చెయ్యడమొక్కటే
వచ్చు"
డ్రా.మాః "76 ని బాతు చేస్తావా...? ఏ.....లా... గా ??"

ఇదిగో.. ఇ...లా...గా..!నేనుః ఇలా వేసీ చివర్లో...... తిరగెయ్యాలండీ. అదే ముఖ్యం.. ముందే తిరగేసీ, తర్వాత బొమ్మేస్తే ఇంకా మంచిది.

ఇది చూసిన మా మాష్టారు, నెత్తి మీద వాలి కాకి రెట్టేస్తుంటే చేతిలో కర్ర ఉండీ కొట్టలేని గాంధీగారి శిలా విగ్రహం
లాగా కాసేపు ఏం మాట్లాడకుండా నిలుచుండి పోయీ, తర్వాత బయటకి పోయీ, రెండు సిగరొత్తులు వెలిగించీ,
కాల్చీ, పీల్చీ, కాలికింద నలిపేసీ లోపలకొచ్చారు. క్లాసంతటినీ దీర్ఘం గా ఒక సారి చూసీ "నా ఇన్నేళ్ల సర్వీసు లో 
నూనె కాగితం తో‌ బొమ్మలేసిన ఎదవల్నీ, కార్బన్ పేపర్ తో బొమ్మ గీసిన కుంకల్నీ చూశాను. ఇలా బొమ్మేసి
తిరగేసినోళ్ళని చూళ్ళేదురా శుంఠా... సరే  మీ రూట్లో నే చెప్తాను" అని పాఠం మొదలెట్టేరు.పాఠం పేరు : "ద" ని ఆనపకాయ చేయటం ఎలా??
క్లాసంతా పిశాచాలు గుసగుస లాడినట్టూ చిత్ర విచిత్రమయిన శబ్దాలతో చెవులు కొరికేసుకోటం మొదలెట్టారు.
డ్రాయింగ్ మాష్టారు:  మొదట మన త, థ, ద, ధ  లలో "ద" ని తీసుకోండీ. దాని తలకట్టు పట్టుకొని పైకి లాగీ నిలువు గా సాగదీయండీ.
నేను:   "ద " కి దీర్ఘం ఇస్తే  అక్షరం  అడ్డంగా  సాగుతాదీ, పలికితే నాలుక నిలువుగా సాగుతాది గానీ... "ద" నిలువు గా ఎలా సాగుతాదండీ? 
(బా గా అడిగాను కదా.. అప్పట్లో  క్లాస్ ఫస్ట్ నేనే)
"వస్తన్నా... వస్తన్నా...  " అని నా దగ్గరకొచ్చీ,  నా నెత్తి మీద జుత్తు పట్టుకొని పైకి లాగారు. చక్కగా మఠం వేసుక్కూర్చున్న నేనూ, ఆ  లాగుడికి లేచి నిలబడ్డాను.

"ద"  ని నిలువు గా ఎలా సాగదీయాలో  పిల్లలం దరికీ బాగా అర్ధమయ్యిందీ. నెత్తి మీద నాలుగు వెంట్రుకలు
ఊడిపోవటం తో నాకు ఇంకా బాగా అర్ధమయ్యింది.


డ్రా.మా:  అలా సాగ దీశాకా,  పైన తలకట్టుని వంకీ తిప్పీ,  కింద పీఠాన్ని పాలిష్ చేస్తే .... "ఆనపకాయ" రెడీ..!


ఇలా తన ఫస్ట్ క్లాస్ లోనే మమ్మల్ని చిత్రకారుల్ని చేసిన  ఆచారి మాష్టారు, ఎక్స్టెండ్ చేసిన మ్యాత్స్, సైన్స్ క్లాసులు
డ్రాయింగ్ క్లాస్  ల లోకి దూసుకొచ్చెయ్యటం తో,  ఎవ్వరూ డ్రాయింగ్ కి వేల్యూ ఇవ్వట్లేదన్న చింత తో ఎక్కువగా
చింత  చెట్ల కింద సిగరెట్లు కాలుస్తూ చేతికందిన కుర్రోళ్లని చావగొడుతూ తన ఉనికి చాటుకునేవారు...

కానీ ఈ స్పూర్తి తో, నేను గొప్ప ఆర్టిస్టు ననే గర్వం తో  ఖండించుకోని సరళరేఖలూ, ఖండించుకునే‌ చాప రేఖలూ,
ఇచ్చిన  కొలతలతో సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజాలు,  వక్రాలూ, పరివృత్తం, అంతర వృత్తం,
బాహ్య వౄత్తం   మొదలైన  నానా వ్యర్ధాలూ,  పెరాబొలాలూ, హైపర్ బోలాలూ, ఆకు అడ్డుకోతా, నాడీకణం నిలువు
కోతా, ఎన్నో ఎన్నెన్నో చిత్రీకరించాను పరీక్షల్లో...! ఒకానొక సారి ఉప్పు సత్యాగ్రహం మీద వ్యాసం రాస్తూ  గాంధీ గారి
గుండు పటం గీచీ భాగాలు కూడా గుర్తించాను.   కానీ ఎప్పుడూ ఎవ్వరూ నన్నొక చిత్రకారుడి గా గుర్తించలేదు.

ఈ దిగులు తో అప్పుడప్పుడూ నాకు తిండి సహించేది కాదు. మా అమ్మ ఆరు ఇడ్లీలు వేస్తే ఒక ఇడ్లీ వదిలేసే వాణ్ణి.
కూర ఎంత నచ్చినాగానీ ఎంగిలి చేయ్యి నాకెయ్యకుండా చేయి కడిగేసుకునేవాణ్ణి.
వద్దూ... మీరు నన్ను ఓదార్చొద్దు... !!!! ఎవ్వరి జాలినీ సహించలేను నేను.
*****************************************************************************
అయితే.... ఇంటర్లోకి అడుగు పెట్టాక ఇంకో ముచ్చట జరిగింది.  మా కాలేజ్ ఆనివర్సరీ కి ఆర్ట్ ఎగ్జిబిషన్
పెట్టారు.  "ఈ రోజుల్లో చిదిమి దీపం పెట్టుకునే టైప్ లో ఉండకూడదు. ఇంటికి నిప్పెట్టే టైప్ లో ఉండాలి" అని దిట్టంగా
డిసైడయ్యాను. ఈ లోకుల మీద కోపంతో, నా బొమ్మలు చూసే అదృష్టం ఈ పాడులోకానికి కలగనివ్వకూడదన్న కసి
తో (నిజం చెప్పాలంటే నాకు చేతకాని తనం తో) మా తమ్ముడి చేత ఒక
పెయింటింగ్ వేయించీ (వాడు పిచ్చ ఆర్టిస్టు) వాడి పేరు బ్లేడ్ తో గోకేసీ.. నా పేరు రాసేసీ, సబ్ మిట్ చేశా, ఆ తర్వాత
ఆ సంగతే మరిచి పోయా.

ఎగ్జిబిషన్ లో కొన్ని వందల పెయిటింగ్స్ మధ్య నాదీ ఒక చోట బుద్దిగా కూర్చుంది.
వారం రోజుల తర్వాత, ఒకరోజు  క్లాస్ జరుగుతూ ఉండగా,  మా సంస్కృతం సార్  వచ్చీ.... "మొన్నటి ఆర్ట్ ఎగ్జిబిషన్
లో బెస్ట్ 10 లో మన కాలేజ్ నుండి ఒకే ఒక్కటి సెలక్ట్ అయ్యిందీ.  రాజ్ కుమార్.... మన జూనియర్ కాలేజ్ పరువు
నిలబెట్టేవ్ " అనీ  చేతిలో  సెర్టిఫికేట్ పెట్టీ, చప్పట్లు కొట్టారు.

నాకు సిగ్గు లేదని మా పిత రోజూ తిడతా ఉండేవారు. నేనూ నిజమనే భ్రాంతి లో  బతికేసేవాడిని. కానీ  ఆరోజు
మాత్రం సిగ్గుతో సచ్చిపోడం అంటే ఏంటో తెలిసొచ్చిందీ. చీమ తుమ్మినా, ఈగ దగ్గినా వింత గానూ, విశేషం గానూ
చెప్పుకునే మా కాలేజోళ్లంతా కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే చెయ్యి వణికేసింది. నిజం చెప్పడానికి కాదు
కదా థాంక్స్ చెప్పడానికి కూడా మాట రాలేదు.
చప్పట్ల మధ్య చచ్చిపోయిన మూగ దోమ లాగా అయిపోయింది నా పరిస్థితి.

ఆరోజు చెప్పలేక పోయాను... ఈ రోజు మీకు చెప్తున్నా.... "ఆ పెయిటింగ్ వేసింది నేను కాదూఊఊఊఊ.!!!!!!
నాకసలు బొమ్మలెయ్యటమే రాదూ......!!!!! "