Sunday, April 28, 2013

షాడో.... ది ఎండో..!!


 "గాలిని ముట్టుకోలేవ్.. మంటని తట్టుకోలేవు... ఈ షాడోని పట్టుకోలేవ్... నేనొక మిస్టరీ... మీరంతా చూడబోయేదీ... నా విక్టరీ"సరికొత్త విచిత్ర కేశాలంకరణ తో కడుపంతా గరిటపెట్టి దేవేసేంత స్టైలింగ్ తో ఎంకటేష్ బాబు మెరిసిపోతుండగా తుపాకీ మోతలతో కార్ల కీచు శబ్దాలతో కూడిన ట్రైలర్ చూసినప్పుడే డిసైడైపోయాను ఇది U SQUARE movie కాదూ శక్తి స్క్వేర్ మూవీ అని.
"వెంకటేసుల తర్వాత సినిమా మెహర్ రమేష్ దర్శకత్వం లో భారీ గా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుందీ" అన్న వార్త రాంగానే నాకు బాబు మీద జాలేసింది. కానీ ఈరోజు మాత్రం గర్వం గా ఉంది. మా ముత్తాతల కాలం నాటి కధని దాదాపు అదే టేకింగ్ తో తీస్తానంటే చెయ్యడానికి ఒప్పుకున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలీ? ఎంత త్రెడ్ తెగింపు ఉండాలీ??

ఇదేమీ సస్పెన్స్ సినిమా కాదు గనక...కధ చెప్పినా మీరు మిస్సయ్యేదేమీ లేదు గనక.. ఆ మాటకొస్తే కధే లేదు గనక మొదట్నుండీ చెప్తాను.
మొట్టమొదటేమో... సింహం ఒకటి పరిగెట్టుకుంటూ వస్తాదన్న మాట. ఏ సర్కస్ కంపెనీ నుండో పారిపోయి వచ్చేస్తుందేమో అనుకున్నా. హాల్ నుండి బయటకెళ్ళేటప్పుడు "మీ పరిస్థితి ఇంతే" అని సింబాలిక్ గా చెప్పేడు మన రమేషు.

మన "తమ్ముడన్నయ్య" నాగబాబు ఉన్నాడు కదా. సినిమాలో తన పేరు "రఘురాం" ఆ బాబు అడ్డపాయ తీసి హెయిర్ స్ట్రైటెనింగ్ చేయించిన విగ్గుని నెత్తి మీద పెట్టుకొని(అది శక్తి సినిమాలో ఎన్టీఆర్ కి వాడిన విగ్గే అని నా డౌటనుమానం) ఒక "డాన్" దగ్గర నమ్మకంగా పని చేస్తూ వాడి రహస్యాలన్నీ కనిపెట్టి "Operation Shadow" అనే పుస్తకం (ఆధారాలతో ఉన్న ఫైల్) రాస్తాడు.ఈ పొడుగైన బాబుకి ఒక తెల్లని భార్య, చిన్నారి కూతురు, పగపూరిత కొడుకు(హీరో.. హీరో బాలషాడో). ఇంత రిస్క్ చేసి విలన్ల దగ్గర అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నాడంటే నాగబాబు "పోలీసాఫీసరేమో??" అనుకున్నాన్నేను. కానీ అదే ట్విస్ట్.... నాగ బాబు తను పనిచేసే న్యూస్ పేపర్లో విలన్ చరిత్ర ప్రచురించడానికి అంతకు తెగిస్తాడు. విలన్ కి అసలు విషయం తెలిసిపోయి అందర్నీ చంపేసి ఆధారాలు పట్రమ్మని మనుషుల్ని రఘురాం ఇంటికి పంపిస్తాడు. భార్య, కూతురు తప్పిమ్చుకొని పడవెక్కేయగా, రఘురాం, కొడుకు రాజారాం విలన్లకి దొరికేస్తారు. "దేశం కోసం చెడుపక్కనే తిరుగుతూ మంచి కోసం పని చేసిన" రఘురాం ని కొడుకు కళ్ళముందే చంపేస్తాడు విలన్. కోపమొచ్చిన పిల్లాడు చాకచక్యంగా పక్కవిలనీయుడి కత్తి తీసుకొని తెగువగా ఒకడ్ని చేతి మీద పొడిచేసీ తెలివిగా తప్పించుకొని ధైర్యంగా పారిపోతాడు (అంత మంది రౌడీలని తప్పిమ్చుకొని ఎలా పారిపోయాడూ? అని అడగొద్దు. అదో మిస్టరీ). అమ్మ, చెల్లి ఎక్కిన పడవ దగ్గరకి వెళ్ళేసరికీ, విలన్ గ్రూప్ లో ఒక గోవిందం ఆ పడవ మీద బాంబ్ వేసేయడంతో పడవ పేలిపోద్ది. 

ఆ రోజు రాత్రి విచారం తో వర్షం లో కూర్చొని పగతో రగిలిపోతున్న బాలషాడో రాజారాం కి ఒక రౌడీ బ్యాచ్ చేత తరుముకు రాబడిన కొందరు పిల్లలు, ఒక ముసలి ముసల్మాన్ (నాజర్) పరిచయమవుతారు. వాళ్ళని కాపాడడానికి రౌడీ బ్యాచ్ ని పిచ్చకొట్టుడు కొట్టేస్తాడు పిల్లషాడో. ఒక ఎలిమెంటరీ స్కూల్కెళ్ళే కుర్రోడు అంతమంది రౌడీలని ఎలా కొట్టేసేడూ? అనే డౌటు మీకొస్తుందని నాకు తెలుసు. మీరో బేసిక్ పాయింట్ మరిచిపోతున్నారు... "ఈ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్".
బాలా షాడో కధ విన్న  నాజర్ "నీ ఆశయానికి తగినట్టూ నేను నిన్ను పెంచుతాను" అని మంగమ్మ శపధం చేస్తాడు.

కట్ చేస్తే....
ఇరవై యేళ్ళ తర్వాత....మలేషియా లో...!

నాజర్ ముసలోడవుతాడు. పెంచిన మగ పిల్లలు గాడిదల్లా ఎదుగుతారు. ఆడ పిల్ల కత్తిలాంటి ఫిగర్ గా రూపాంతరం చెంది పొట్టి బట్టలేసుకొని పోష్ గా తిరుగుతా ఉంటాది. వీళ్ళంతా షాడో తో కలిసి మలేషియా లో పాతుకుపోయిన విలనీ బ్యాచ్ ని చంపెయ్యడానికి ప్లాన్లు గీస్తూ, గూగుల్ మేప్లు, డాన్ల ఫోటోలూ గోడమీద అతికించుకొని లోక కళ్యాణం కోసం తపిస్తూ ఉంటారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కి ముందు ఫైట్ ఉండాలి కాబట్టీ సిల్లీ గా ఒక మాస్టర్ ప్లేన్ వేసీ ఫైట్ చేసీ ఒక డాన్ అసిస్టెంట్ ని చంపేస్తాడు షాడో.

ఇప్పుడు పాట....!!

డీడబడీడబడీడబ డబడబడబడబడబడబ యముడికి మనవడు షాడో......!!


ఈ పాటలో పావు మీటరు గుడ్డ ఒంటిమీద వేసుకున్న ఫారిన్ ఫిగర్స్ + షాడో బ్యాచ్ లోని స్వదేశీ లేడీ ఒళ్ళు విరుచుకొని అరుస్తూ ఉండగా... పాత బట్టలు ఒంటి మీదేసుకున్న గంగిరెద్దు లాగా షాడో తలాడిస్తూ ముందుకీ వెనకకీ తూలతా ఉంటాడు.

పాటయిపోయాక, సందట్లో సడేమియా లాగా డాక్టరు హీరోయిన్ తాప్సీ (గ్లామర్ ప్యాకేజ్ లో భాగం), ఆళ్ల చీపు డాక్టరు ఎమ్మ్సెస్ నారాయణ (కుళ్ళు కామెడీ ప్యాకేజ్.. ఒన్ మేన్ ఆర్మీ), సైలెంట్ స్టార్ శ్రీకాంతు (యాక్షన్ + సెంటిమెంట్ + ఆటలో అరిటిపండు పాకేజ్ లో భాగం) మలేషియా ఎంటరవుతారు. నెత్తి మీద కాకి గూడు పెట్టిందేమో అన్నట్టు ఉండే తాప్సీ కీ అందగాడైన తింగరి సుబ్బరాజు కాకుండా ముసలి కోతికి మేకప్పేసినట్టు ఉన్న గెడ్డం హీరో హ్యాండ్సమ్ గా ఉన్నాడని భ్రమించి ప్రేమించేస్తుంది.

పోలీస్ స్టేషన్ లో ఐపీయల్ మ్యాచులు చూస్తూ టైంపాస్ చేసే టాలెంట్ ఉన్న తెలుగోళ్ళకి పోలీసుజ్జోగం ఇచ్చిన మలేషియా పోలీస్ డిపార్ట్మెంట్ కి సహాయం గా పుడింగి పోలీసాఫీసర్ శ్రీకాంత్ వస్తాడు మాఫియా డాన్లని పట్టుకోడానికి. తీరా చూస్తే మన షాడో ఒక్కో విలన్ నీ మెదడు మోకాల్లో ఉండగా వచ్చిన ఐడియాలతో చంపేస్తూ ఉంటాడు. అసలు అడివి మనిషి గెటప్ లో వెంకీ బాబు అరెస్ట్ అయ్యి, తను లాకప్ లో ఉండి బయట తిరుగుతున్న పోలీసుని లోపలకి లాగి తన ప్లేస్లో పడుకోబెట్టి, మర్డర్ చేసి తప్పించుకునే సీన్ చూసి తీరాలి. రమేషుడి దర్శకపిత్వానికి జేజేలు కొట్టాలి. ఆ తర్వాత పు.పో ఆఫీసర్ తను వచ్చిన పని మరిచిపోయి, అసలు విలనీయులని గాలికొదిలేసి, ఐఫోన్ అప్లికేషన్స్ తో గన్ షూటింగ్ చేసి మర్డర్లు చేస్తున్న షాడోని పట్టుకోడానికి వెంట పడతాడు. ఆ చేజింగులలో షాడో కి ఏక్సిడేంట్ అయ్యి తల వెనక భాగం లో  దెబ్బ తగిలి నుదుటి నుండి రక్తం వస్తుంది. చిన్నమెదడు లో స్టోరేజ్ ఏరియా లో రక్తం గడ్డ కట్టడం వల్ల వెంకీ గతం మరిచి పోయి పిచ్చోడయిపోతాడు. (యెస్.. .మీరు చదివింది కరెక్టే)

పిచ్చోడంటే పూర్తి స్థాయి పిచ్చోడు కాదు. స్వాతి ముత్యం సినిమా లో కమల్ హాసన్ ( ఆ రేంజ్ సీన్స్ ఉంటాయి అని చెప్పి ఒప్పించి ఉంటాడు రమేషు) లాగా చిన్నపిల్లోడి లా నంగి గా మాట్లాడుతూ అందర్నీ అంకుల్ అని పిలుస్తూ, తాప్సీని ఆంటీ అని పిలుస్తూ అమాయక కామెడీ పేరుతో ఊచకోత కోస్తాడు. కంత్రీ, బిల్లా, గబ్బర్ సింగ్ మొదలగు సినిమా పేరడీలూ, గబ్బర్ సింగ్ గెటప్ లో బాబు చేసే అంత్యాక్షరీ సీన్లూ, "అవి వీటికి పేరడీ సీన్లు సుమా" అని చెప్పడానికి ఒరిజినల్ సినిమాల్లోని సీన్లూ తెరమీద కదులుతూ తెర చించెయ్యాలన్న బలమైన కోరికని కలిగించడమే కాక డైరెక్టర్ని పీక కొరికి రక్తం తాగెయ్యాలన్నంత కసిని ప్రేక్షకుల గుండెల్లో కలిగిస్తాయి.

ఇంటర్వెల్ కి పావుగంట టైం ఉందనగా Ipad లో HD Quality తో తన భార్య తో వీడియో చాట్ చేస్తుంటాడు శ్రీకాంత్. వీడియో చాట్లో శ్రీకాంత్ అత్తగారిని చూసిన షాడో కి విపరీతమైన తలనొప్పి వచ్చి గతం గుర్తొచ్చేస్తుంది. ఎందుకంటే ఆవిడెవరో కాదు షాడో తల్లి. శ్రీకాంత్ స్వయానా తన బావ. అందేంటీ షాడో తల్లీ, చెల్లీ పడవలో బాంబ్ పేలి చనిపోయారు కదా? అన్న డౌట్ మెదడు మోకాల్లో ఉన్నోళ్ళకి కూడా వస్తుంది. అక్కడే పాలలో ఉప్పేసారు. పచ్చట్లో పులుసేసారు. బాంబ్ పేలడానికి కొన్ని సెకన్ల ముందే వాళ్ళు నీట్లోకి దూకేసి తప్పించేసుకుంటారు. (మహానుభావా... మెహర్ రమేషా... తుసీ గ్రేట్ హో)

షాడో చిన్నప్పుడు కత్తి తో పొడిచిన విలన్ ని చంపుతూ...
"పగతో పెరిగాను.. కోపంతో రగిలాను. ఇన్నాళ్ళూ తిరిగి తిరిగి.. దేశాలు వెతికి వెతికి, నీ వైపే దూసుకొస్తున్న చావుని నేనే రా... షాడోఓఓఓఓఓఓఓఓఓఓ.
భయం ఎంత భయంకరంగా భయపెడతాదో చూస్తావా??" అని ఒక పొడుగు డైలాగ్ చెప్పేసి తల్లి, చెల్లిలని చూడటానికి ఇండియా వచ్చేస్తాడు. ఫస్టాఫ్ లోనే మెయిన్ విలన్ ని తప్ప అందరినీ చంపేసిన షాడో కి సెకండ్ హాఫ్ లో చంపడానికి విలన్లే ఉండరు.

ఇక్కడే రమేష్ లోని క్రియేటివ్ రైటర్ నిద్రలేచి కళ్ళు నులుముకొని మొహం కడుక్కొని రెడీ అయ్యాడు. దెబ్బకి సెకండ్ హాఫ్ సాగదీయడానికి స్టోరీ రెడీ అయిపోయింది. షాడో తండ్రిని చంపినట్టే , వాళ్ల మావయ్యని కూడా చంపేస్తారు మరికొంత మంది హైదరాబాదీ విలన్స్. వీళ్ళు కూడా మెయిన్ విలన్ కి అసిస్టెంట్స్ అన్నమాట. ఇక షాడో వేట క్లైమాక్స్ వరకూ సాగి మన దుంప తెంచేస్తుంది. మెయిన్ విలన్ చచ్చే టైంకి టికెట్ కొనుక్కొని ఏసీ నరకం లోకి ఎంటరయిన దౌర్భాగ్యులకి జీవితం మీద విరక్తి వచ్చేసి, ముందు సీట్ కేసి తలకొట్టుకొని చచ్చిపోవాలని కోరిక పుట్టినా గానీ ఓపిక లేక మిన్నకుండిపోతారు.

టూకీగా ఇదీ స్టోరీ...ఇంత కంటే వివరంగా స్టోరీ చెప్పి పాపం మూట కట్టుకోవటం నాకిష్టం లేదు కాబట్టీ చెప్పట్లేదు.  ఇప్పుడు కొన్ని హైలైట్స్ చెప్పుకొని ఆనందిద్దాం.


మ్యూజిక్ :  పెళ్ళిళ్ళకీ, దినాలకీ బ్యాండ్ మేళం వాయించినట్టు వాయించొదిలాడు తమన్ బాబు. టైటిల్ సాంగ్ మాత్రం బాగుంది (ఎక్కడ నుండి కొట్టుకొచ్చాడో మరి). ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే స్టీల్ సామాను గచ్చు మీద పడేసి అదే టైం లో "షా..డో.. షాడోఓ..." అని అరిపించి అదరగొట్టాడు.
ముఖ్యంగా "ఏయ్ ఐతలకా..ఉస్క్ లకా..తద్దినకా జజ్జనకా డంకనకా జింకుచికా హోయ్" అనే పల్లవి తో మొదలయ్యే పాట సాహిత్యం, పిక్చరైజేషన్... మహాద్భుతం.


హీరోయిన్ః హీరో కి హీరోయిన్ ఉండాలి కాబట్టీ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది. పాటల్లో తక్కువ కాస్ట్యూమ్స్ వాడి బడ్జెట్ తగ్గించాలి కాబట్టీ తాప్సీ ఉంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే తాప్సీ అయితే ఐటెం సాంగ్స్ కి కూడా సరిపోద్ది కాబట్టీ ఖర్చు కలిసొస్తాది.
ఇక ఆ పాటల్లో కుక్కల చింపిన విస్తరిని ఒంటికి కట్టుకున్నట్టూ ఉన్న ఆ బట్టలూ, ఆ కాకిగూడు లాంటి హెయిర్ స్టైల్సూ చూసి భరించి బాధపడాలి గానీ మాటల్లో చెప్పటం కష్టం బాబా..!!

 


అన్నట్టు ఒక అరాచకపు సీన్ చెప్పాలి. అబ్బో ఇది హైలైటు.

తలకి దెబ్బ తగిలి స్పృహ కోల్పోయిన షాడో కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది డాక్టర్ తాప్సీ. సాధారణం గా ఇలాంటి కేసుల్లో తలకి కట్టుకడతారు లేకపొతే గుండు చేసి కుట్లేస్తారు. "కానీ హీరో కి గెడ్డం గీసి, హెయిర్ కట్ చేస్తుంది" ఇదేం చోద్యమో...!!!!!!
నాయనా రమేషా... నీ దర్శకత్వ పటిమ కీ, నీ స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ కీ తల వంచి సలాములు చేస్తున్నాను తండ్రీ.

హైలైట్ సీన్స్ః  1.    గణేశ్ నిమజ్జనం జరుగుతూ ఉంటాది. విలనీయుడిలో ఒకడైన పోలీస్ కమీషనర్ కి జనాల్లో "నాగ బాబు" (చనిపోయిన షాడో బాబు) కనిపిస్తాడు. ఇరవై యేళ్ల క్రితం చనిపోయిన "రఘురాం" ఎలా బతికొచ్చాడా? అని ఆశ్చర్య పోతాడు తెరమీది పోలీసోడు.
సినిమా బిగినింగ్ లో చనిపోయిన నాగబాబు బతికొచ్చాడా? అని తెరముందు అవాక్కయ్యాను నేను. హీరో అమ్మ, చెల్లి బతికున్నట్టే వీడు కూడా బతికున్నాడేమో??  అన్ని సార్లు ఇనపరాడ్ తో కొట్టి, గుండెల్లో కాల్చి, తల మీద షూట్ చేశాక ఎలా బతికుంటాడూ?? ఏమో ఈ కంత్రీ డైరెక్టర్ సినిమా లో ఏదయినా సాధ్యమే సుమీ. ఒక వేళ బతికుంటే పాపం తన వాళ్ళని చంపారనుకొని హీరో షాడో అవతారం ఎత్తి అన్యాయంగా మాఫియా డాన్లని చంపేస్తున్నాడే అని బాధ పడ్డాను. నా కోడి మెదడు లో సవాలక్ష సందేహాలు.
ఇంతలో నాగబాబు అక్కడ నుండి పరిగెడతాడు. పోలీసాఫీసరు వెంబడిస్తాడు. ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాక నాగబాబు ఆగి వెనక్కి తిరుగుతాడు. "అది ఆ పోలీసోడి భ్రమ కాదు. నిజంగా నాగబాబే. ఓర్నాయనోయ్... వీడెలా బతికొచ్చేసాడ్రా దేవుడోయ్.." అని నేను ఆశ్చర్యపోతుండగా నాగబాబు తన మొహం మీది మాస్క్ తీసేస్తాడు. పొడుగు జుత్తున్న నాగబాబు, పొట్టి జుట్టున్న వెంకటేష్ బాబు లా మారిపోతాడు. ఆ...హా ఏమి ట్విస్ట్ రాజా...??  ఇక ఆ తర్వాత వేల మంది జనాల మధ్య పోలీసాఫీసర్ని షాడో కత్తి తో పొడిచి చంపేస్తాడు. అంత మంది జనం లో తాప్సీ, ఎమ్మెస్ నారాయణ తప్ప అక్కడున్న జనంగానీ, ఒక్క పోలీసోడు గానీ చూడరు. అసలు పట్టించుకోరు.
2. మలేషియా లో షాడో - పోలీసుల మధ్య చేజింగ్ జరుగుతూ ఉంటాది. అందులో హీరో ఎనకాల వచ్చే పోలీసు కార్లు గార్లో ఎగరడం కోసం విశాలమైన మలేషియా రోడ్ మధ్యలో రెండు మీటర్ల పొడవైన "ఇండియన్ స్టైల్" డివైడర్ ని అత్యంత నాసిరకం గా పెట్టిన డైరెక్టర్ సారు అతి తెలివితేటలని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో..!

3. తెలుగు హీరోల్లో "నటుల" వర్గానికి చెందిన అతి కొద్ది మందిలో ఉన్న వెంకటేషు లోని "భరించలేని" నటవిపరీతాన్ని తోడిన డైరెట్రు ఓ కొత్త విలన్ నీ, పదుల సంఖ్యలో విలన్లనీ, ఆర్టిస్టులనీ, గెస్ట్ అప్పీరెన్స్ లో "సుమన్" నీ వాడిన తీరుకీ, ఓ పెద్ద హీరో చేత పవన్ అంకుల్, మహేష్ అంకుల్, ఏన్టీఆర్ అంకుల్, చరణ్ అన్న అని పదే పదే జపం చేయించి పరువు తీసేసిన విధానానికీ, కుదిరితే కాలు మీదో, కుదరకపోతే నెత్తి మీదో కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకోవాల.

4. ఒకే ఒక్క ఫోన్ కాల్తో హీరో మిమిక్రీ చేసి హోం మినిస్టర్ ని బురిడీ కొట్టించి వాడుకునే సీన్ల పరంపర.. వాటి నుండి పుట్టించిన అద్బుత కితకితల కామెడీ.. హిష్షోఓఓఓఓఓఓఓఓ.....!!!!!!!


స్వామీ... హే రమేషా.... ఏమి నీ లీలలు తండ్రీ..!! తెలుగు సినిమాలు చూస్తున్నోళ్ళు ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా?

5. మూడుగంటలు మానసిక క్షోభ అనుభవించీ, రక్త కన్నీరు కార్చీ, బాధని పంటి బిగువున భరించిన పిమ్మట "హమ్మయ్యా..అయిపోయిందిరా దేవుడా" అనుకున్న టైం లో
మె.రమేష్ నల్ల కళ్ళజోడు పెట్టుకొనొచ్చి... అక్కడికేదో దేశాన్ని ఉద్ధరించే సినిమా తీసేసినట్టూ "డీడబడీడబ డబడడబడడబడ షాడో" అని అరుస్తూ ఊగిపోతుంటే నా ఫీలింగ్ చెప్పడానికి మాటలు రావట్లేదు.కధ - డైలాగులుః " పగ బాబాయ్.. పగ.. నా తండ్రినీ, తల్లినీ, చెల్లినీ తమ్ముడినీ.............etc చంపిన ఆ దుర్మార్గులంటే నాకు పగ బాబాయ్ పగ" అనే లైన్ తో రొట్ట స్టోరీని, ప్రాస తో కూడిన పకోడీ డైలాగులతో రచించిన శ్రీ కో. వెంకట్, గో. మోహన్ గార్లకీ, ఎక్కడ సినిమా పొరపాటున హిట్టయిపోయి క్రెడిట్ వాళ్లకి పోతుందో అన్న భయం తో మధ్యలో తన పైత్యపు పెన్ పెట్టి కెలికేసి "కధ మాటలు దర్శకత్వం" కార్డేసుకున్న మె.రమేష్ లకి నా సాష్టాంగ ప్రణామాలు. సహస్ర కోటి అభివందనాలు.

"మీరు కొడితే పోకిరిలో మహేష్ బాబు లా మైండ్ బ్లాక్ అయిపోద్దనుకుంటే... వీడి మైండ్ బ్లాంక్ అయిపోయిందేంటీ?"
"మా వాడికి నీ అడ్రస్ తెలిస్తే.. నువ్ అడ్రస్ లేకుండా పోతావ్"
"ఎవడి మీదన్నా చేయ్యేసే ముందు, చెయ్యేస్తే ఎవడోస్తాడో ఆలోచించాలి"

ప్రాస కోసం ప్రాణాలు తీసేస్తారా సార్ మీరూ??
రైమింగ్ బాగుంటే రాసిపారేస్తారా అయ్యోర్లూ??

మీ పంచ్ డైలాగులు నాలోని రచయితని నిద్రలేపాయి. మీ నెక్స్ట్ సినిమాల్లో వాడుకోండి సార్లూ. వాడుకున్నోళ్లకి వాడుకున్నంత.

"పేడని ముట్టుకోలేవు.. ముక్కుకి పెట్టుకోలేవు... ఆ వాసన తట్టుకోలేవ్.... అదొక హిస్టరీ... మీరంతా తినబోయేదీ... పేస్ట్రీ.....!!!"
 "అడ్రెస్ చెప్పరా... డ్రెస్సేసుకొని వస్తానూ..గుమ్మం లోకొచ్చి కొట్టానంటే ఖమ్మం లో పడతావు"
"అరిచేత్తో కొట్టేనంటే అరిచే చాన్స్ కూడా ఉండదు."
"నేను పిన్ను పీకేసిన బాంబు లాంటోణ్ణీ... పేలే ముందు ఇలాగే సైలెంట్ గా ఉంటా"
"నిన్ను కట్ చెయ్యడానికి నేను టచ్ చెయ్యక్కర్లేదురా... పంచ్ ఏస్తే చాలు"
"పదునెక్కిన కొడవలీ..పిచ్చెక్కిన నేనూ చాలా ప్రమాదకరం"
"నా ఆశయం కోసం అడ్డంగా నరికేస్తా... ఎదురొచ్చినోడిని నిలువుగా చీరేస్తా "
"నా కోపం బ్రేకుల్లేని కారు లాంటిది డామేజ్ జరిగాకే ఆగేది"
"డిక్షన్ లేని వాడి ఏక్షన్లకి నా రియాక్షన్ ఇలాగే ఫ్రిక్షన్ తో కనెక్షన్ కట్టయ్యేలా ఉంటుంది" (అబా బ్బా.. ఏమి రైమింగూ..)
"షాడో తో పెట్టుకోవద్దు.. మాడు పగిలిపోద్ది"
"ఎగిరి తన్నానంటే ఆకాశం లోకీ, దుమికి తొక్కానంటే పాతాళానికీ పోతావ్రా"
"వేలెడంతే ఉన్నానని వీజీగా తీసుకోవద్దురా... సానబెట్టిన గొడ్డలి కన్నా తుప్పట్టిన పిన్నీసే డేంజరస్"
"నే తలచుకుంటే గాడిద చేత గుడ్డు పెట్టిస్తా.. బ్రాయిలర్ కోడితో పొదిగిస్తా....నీ ఆత్మ చేత నిన్నే చంపిస్తా"
.
.ఇలాంటివి బోల్డు చెప్తా..!

రమేషుడి తరువాతి సినిమాకోసం ఆతృత గా సిగ్గులేకుండా ఎదురు చూస్తూ....!!!!!

జై హింద్.

Monday, April 15, 2013

సంగతేటంటే...!


ఏహే..ఏహే.. ఓహో..ఓహో...

ఏమిరా నీ అంబర చుంబిత అకాల వికార వికృత అనన్య సామాన్య  స్వీయఘోషా విలాస కేళీ??


అంతరాత్మగాడివి అట్టర్ ఫ్లాపిచ్చిన స్టార్ హీరోలా సైలెంట్ గా ఉండాలి గానీ అర్ధంకాని తిట్లు తిడతావేట్రా?

"వద్దురా.. వద్దురా" అని మొత్తుకున్నా మొన్న బాద్షా సినిమా చూపించావు అప్పట్నించీ ఇలా..! అంతగా ఎగురుతున్నావు ఇంతకీ మేటరేంటీ?

చెప్తా.. చెప్తా...రెండు సంవత్సరాలు, 46 పోస్ట్లు, 56603 హిట్లు, 1500 కమెంట్లు, 98 మంది....

ఆపరా బాబూ నీ తొక్కలో లెక్కలు.. ఏ బ్లాగు బర్త్ డే చూసినా ఏమున్నది గర్వకారణం? పోస్టు సమస్తం నిందా స్తుతి ముసుగు లో సొంతడబ్బాల నాదం..! ఆ పోస్టుల్లో ఐదో ఆరో  పేరాగ్రాఫంత టైటిలూ ఫుల్ స్టాపంత మేటరూనూ. ఆ హిట్లూ, కమెంట్లలో సగం నీవే ఉంటాయి. 

సన్నాయికి కన్నాలున్నాయని వెక్కిరించాడంట నీలాంటోడే...

ఆ... నీ వాడేసిన విస్తరాకు మొహానికి సామెతలొకటీ.. ఫ్లాపు సినిమాల ఆర్తనాదాలూ, అరాయించుకున్న దోశలూ, తోమాల్సిన అంట్లూ, తిన్న తిట్లూ, తన్నించుకున్న తాపులూ, టోటల్ గా నువ్వూ-నీ దరిద్రం తప్ప ఇంకేమన్నా ఉన్నాయా నీ బ్లాగులో?


ఆ మధ్య చరిత్ర మీద సీరియస్ పోస్ట్లు రాసేను చదివి ఏడవరా  చెదపురుగు నాలుకున్నోడా...!

మనం నిజాలు మాటాడుకుందామా..? చరిత్ర పుస్తకాల్లో ఉంటాది. ఆ పుస్తకాలు ఉన్నోడు, చదివినోడూ ఎవడన్నా చూసి ఎక్కించేస్తాడు. అందులో నువ్ చేసిందేమిటి ప్రాసకోసం పిల్లిమొగ్గలెయ్యటం తప్ప?
ఏనాడైనా జ్ఞానాన్ని పంచే విషయాలు, భావుకత్వపు కవితలు, హత్తుకునే కధలు రాసిన, అట్ లీస్ట్ ట్రై చేసిన మొహమేనా నీదీ?
అంటే ఇప్పుడు ఏటంటావ్రా?


నీ పనికిమాలిన ఆరాటం, అనవసరపు ఆర్భాటం తప్ప అరచి గెంతాల్సిన పని లేదంటాను.
ఓ..కే. నువ్వింతగా చెప్పాక కాదంటానా...

"అమ్మలాలా.. అయ్యలాలా..ఈయాల్టి రోజున నా బ్లాగుకి రెండో పుట్టినరోజు... రెండేళ్ళు నా బ్లాగుని నడిపించిన బ్లాగ్లోక జనులకి సవాలచ్చ దండాలు. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే వచ్చే ఏడాది కూడా ఇలాంటి పోస్టేస్తాను"
----ఇతి వార్తాః  ----