Sunday, April 29, 2012

దుమ్ము లేపిన దమ్ము... కానీ నాకు డస్ట్ ఎలర్జీ !

దమ్ము...దామ్.దమ్ దమ్ దమ్.  దమ్మూ....!

యంగ్ టైగర్ NTR, మాస్ మాంత్రికుడు బోయపాటి శీను ల కలయికలో లవ్, ఏక్షన్, సెంటిమెంట్, కామెడీ కలిసి పేరుకు తగ్గట్టూ రూపుదిద్దుకున్న పవర్ ఫుల్ పొట్లాం. "దమ్ము"

బోయపాటి శ్రీను ఒకే రకం సినిమాలు తీసినా గానీ, ఆ జోనర్ లో మాంచి కమాండ్ ఉంది. మాస్ కి ఎక్కేలాగా ఏక్షన్ మూవీస్ తీయటం లో చెయ్యి తిరిగినోడు కాదు కాదు కండలు తిరిగినోడు అని చెప్పాలి.

ఒక యువకుడు రెండు వంశాల మధ్య, తరతరాలుగా జరుగుతున్న గొడవలని, పే...ద్ద గొడవ చేసి ఉన్న గొడవని చిన్నది చేసీ, భయం తోనూ, బాధలతోనూ, రాక్షసుల నీడలో  బ్రతుకుతున్న
ప్రజలకి ధైర్యాన్నిచ్చీ, అడ్డొచ్చిన వాణ్ణి తన దమ్ముతో అడ్డంగా నరికేసీ, చివరికి మిగిలిన వాళ్ళని మార్చీ శాంతి ని ఎలా నెలకొస్పాడు ?? అనేదే ఈ చిత్ర కధాంశం.

నాలోని క్లాసోడుః "ఆగు..  నాన్నా..ఆగు ! వంశాలూ, తరతరాలు గా గొడవలూ, మీసం తిప్పడాలూ, తొడ కొట్టుకోడాలూ నరకుడూ, చివర్లో శాంతి సందేశం.. ఇందులో కొత్తేముందీ?? నేను నిక్కర్లేసుకొని తిరిగినప్పటి నుండీ బొచ్చెడు సినిమాలు చూసేను ఇలాటియ్యి. తులసీ, సింహా కూడా దాదాపు ఇలాగే ఉంటాయ్ కదా?

నా లోని మాసోడుః నువ్వెవర్రా?

నా.క్లాః "నేనేరా.. నీలోని క్లాస్ ప్రేక్షకుడినీ, నీ లోని విమర్శకుడినీ, ఇంకా తెలుగులో మంచి మంచి గొప్ప గొప్ప సినిమాలు ఆశించే అమాయకుడినీ,ఆశావాదినీ... "

నా.మాః  అలా పక్కకెళ్ళి కూర్చో. మాస్ మసాలా దట్టించిన బిర్యానీ తినొచ్చిన ఫీలింగ్ లో ఉన్నానూ. మూడ్ చెడగొట్టమాకు. స్టోరీ కొత్తదా పాతదా? అని కాదు. మనక్కావల్సిన ఎంటర్టైన్మెంట్ దొరికిందా? లేదా?
విజిల్సేసి, అరిపులు అరిచి, చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేశామా? లేదా?ఇదే పాయింట్. నా వరకూ ఏంటంటే ఒక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ఆశించేవన్నీ ఉన్నాయ్ ఈ సినిమా లో. (నేను చూసినప్పుడు జనాలు సైలెంట్ గానే చూశారనుకో.. అది వేరే విషయం.)
ముఖ్యం గా కీరవాణి అందించిన పాటలూ, మరీ ముఖ్యం గా బ్యాక్ గ్రౌండ్ అత్యధ్భుతంగా ప్రేక్షకులకి పూనకం వచ్చేలాగా ఉంది.(చత్రపతీ, సీతయ్య, మగధీర సినిమాల రేంజ్ లో) రూలర్ పాట ఆడియో లో విన్నంత బాగోక పోయినా, వీడియో శక్తీ సినిమాని గుర్తు తెచ్చినా ,    ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, ఫస్టాఫ్ లో కామెడీ, క్లైమాక్స్ లో ట్విస్టులు అన్నీ అమోఘం.

నా.క్లాః "అలా అని  చూసిన కధలే మళ్ళీ మళ్ళీ చూసేస్తామా?"

నా.మాః నచ్చితే, నచ్చేలా తీస్తే ఎన్ని సార్లన్నా చూస్తాం. హిట్ చేస్తాం. ఏం...డాన్ సినిమాని కొంచెం మార్చి మళ్ళీ తీస్తే ఎగేసుకొని ఎల్లిపోయేవ్. మొన్నటికి మొన్న మాయాబజార్ కలర్లో మళ్ళీ తీస్తే అహో..కళాఖండం అన్నావ్?
నిన్నటికి నిన్న లవకుశ సినిమా ని రీమేక్ చేస్తే గొప్ప ప్రయత్నం అన్నావు? టైటానిక్ 3D అనగానే ఆరుకళ్ళెట్టు కొని చూసేశావ్.పాత పాటలు రీమిక్స్ చేస్తుంటే చచ్చినట్టూ వింటున్నావే?? వేరే దిక్కులేక ఎంజాయ్ చేస్తున్నావే??

నా.క్లాః "అమంగళం అదేదో అవుగాకా... ఓరీ.. పాపాత్ముడా.. మాయాబజార్ సినిమా తో పోలుస్తావా? పోతావ్రారేయ్.."

నా.మాః అదే మరీ..! నీకు నచ్చిన సినిమాని క్లాసిక్ అంటావు. జనం మెచ్చిన సినిమాని నాసిరకం అంటావు. జనాలు ఎదగలేదంటావు. సినిమాలు చూడటం రాదంటావు. అన్యాయం గా లేదూ?? ఎక్కువ మంది జనాలు మెచ్చేదీ, లాభాలు తెచ్చేదే గొప్ప సినిమా. అది గుర్తుంచుకో.
ఇక సినిమా విషయానికొస్తే NTR గురించి కొత్తగా చెప్పేదేముందీ? నటనా, ఫైట్లూ, డ్యాన్స్లులూ కుమ్మి అవతల పారేశాడు. ఎమోషనల్ సీన్స్ చెయ్యటం లో ఇప్పుడున్న కుర్రోళ్ల లో బుడ్డోడి తర్వాతే ఎవరయినా.
కోర మీసాల గెటప్ కూడా అరుపులు. డైలాగులు పిడుగులు.

నా.క్లాః "NTR టాలెంట్ కి తగిన సినిమాలు చెయ్యటం లేదు. మంచి ఆర్టిస్ట్ చేత చెత్తంతా చేయిస్తున్నారు. అతని టాలెంట్ వేస్ట్ చేస్తున్నారు పాపం"

నా.మాః ఆపరా సామీ..నీ ఓదార్పు యాత్ర.  ఇప్పటి వరకూ తను చేసిన క్యారెక్టర్లన్నీ ఇలాంటివే కదా. వాటిని చూసే కదా "టాలెంటెడ్ ఆర్టిస్ట్" అని తెలుసుకున్నావ్? మరి జనాలకి నచ్చిన ఇవి  కాకుండా కొత్తగా ఇంకేం చెయ్యాలని నీ ఎదవ గోలా?? సినిమా లో ఇద్దరు హీరోయిన్స్. త్రిష, కార్తీక. పిచ్చెక్కించార్లే. ఈ ఇద్దరి హీరోయిన్ల తోటీ ఐటెం సాంగ్స్ ఉంటాయ్ గురూఊఊఊఒ... కేకలే. ఒక పాటలో అయితే నలుగురు హీరోయిన్లూ. అది ఒక నాట్య విపరీతం అని చెప్పొచ్చు.హీరోయిన్ల కి ఏక్టింగ్ వస్తే ఏంటీ? చేస్తే ఏంటీ? పొట్టి బట్టలేసుకొని పాటల్లో గెంతారా? లేదా? అది చాలు.


నా.క్లాః "త్రిష, NTR పక్కన పెద్దదన్లా కనిపించ లేదూ?? మర్రి చెట్టు తాటి చెట్టంత ఎదిగిందా అన్నట్టుండే ఆ కార్తీకని ఎందుకు సెలక్ట్ చేసుకున్నారో అసలర్ధం కావట్లేదు. పైగా ఎవరో లేపి నించోబెట్టినట్టూ పైగా వంకర చూపులూ, తింగర చేష్టలూనూ. ఖాళీ టైం లో కుస్తీపోటీలకి వెళతాదేమో అనిపిస్తాది. పైగా ఇద్దరూ పెద్ద కలర్ కూడా కాదూ. అయినా ఆ జానా బెత్తెడు బట్టలేంటీ?? ఆ డబల్ మీనింగ్ బూతు డైలాగులేంటీ?? ఫ్యామిలీస్ రావాలా వద్దా సినిమాకి??"

నా.మాః అంటే ఏంట్రా నీ ఉద్దేశ్యం?. పెద్ద హీరోయిన్లు, పొడుగు హీరోయిన్లూ అంటున్నావ్??
మా హీరో చిన్నా చితాకా వాడనా?? తొక్కుతా ఏమనుకున్నావో.  కార్తీక బాలేదా? తెల్లగా తళ తళలాడీ పోడానికి తమన్నా అనుకున్నావా? డైరెక్టర్ ఏ పాత్రకి ఎవరు సరిపోతారో కొలతలేసి సరయిన మెజర్మెంట్స్ తో తీసుకున్నారంట ఆళ్ళని. అదే తమిళ్ ఆర్ట్ సినిమాల్లో హీరోయిన్లు జిడ్డు మొహాలేసుకొని, మొహానికి
మసి రాసుకొని, ముతక చీరలు కట్టుకుంటే అది రియలిస్టిక్ ఏక్షన్, నాచురల్ బ్యూటీ అంటావ్. అదేంట్రా నాయనా అని అడిగితే "హీరో, హీరోయిన్లు అందంగానే ఉండాలని రూలుందా?" అని కొచ్చెన్లేస్తావ్.
అక్కడ హీరోయిన్లని పొగుడుతావూ. ఇక్కడ మాత్రం ఈ హీరోయిన్లకి పొగెడుతున్నావ్?? అయినా A సెర్టిఫికేట్ సినిమాలకి డైరెక్టర్లకి నచ్చినట్టూ వేసుకుంటారు బట్టలు. నచ్చక పోతే అసలేస్కోరు. చూస్తే చూడూ లేకపోతే కళ్ళుమూస్కో. బూతు డైలాగులా ?? కోపమొస్తే ఆఫీస్ లో బాస్ ని బూతులు తిట్టుకోవా??. ఏ.... ఇంగ్లీష్/హిందీ సినిమాలు ఏమన్నా పవిత్రం గా ఉంటాయా?అందులో మాటకి పది బూతులున్నా చెవులు రిక్కించి వింటావ్." ఛీ..ఛీ ఏంటీ బూతులూ ??" అని ఏనాడయినా అన్నావా??అనవ్. పొరిగింటి పుల్లకూర రుసెక్కువలే. అసలీ సినిమాలో డైలాగ్స్ అరాచకం మచ్చుక్కి కొన్ని.

"వాడి నెత్తురు కి పోటెక్కువ. బొట్టు బొట్టూ చురకత్తే"
"ప్రజల గుండెల్లో ధైర్యాన్ని బతికించాలి. శత్రువుల గుండెల్లో భయాన్ని బతికించాలి. ఆ తల్లి గుండెల్లో ప్రేమని బతికించాలి. అందుకు ఈ నిజాన్ని చంపెయ్యాలి"
"ఒక్క సారి ఈ వంశం నాదీ, ఈ జనం నాదీ, జనం సమస్య నాదీ అనుకొని కొట్టానంటే.... నీ వంశం లో పది తరాల వరకూ మగపిల్లాడు పుట్టడానికి కూడా భయపడతాడ్రా"
"నాకు ఏదయినా కావాలనిపిస్తే దిగనూ. జనాలు రావాలని పిలిస్తే ఆగను"
"చరిత్ర సృష్టించే వాడెవడూ చెప్పిరాడూ. కానీ ఒంటరి గా వస్తాడు, నిలబడతాడు, మొదలెడతాడు. చరిత్ర సృష్టించే వెళతాడు"
"నీ కొడుకుని పోయీ ఓపిక ఉన్నప్పుడు రమ్మను. పదినిమిషాల తర్వాత అయినా పర్లేదు. పది రోజులయినా పర్లేదు. పది నెలలయినా, పది సంవత్సరాలయినా పర్లేదు. ఒక్క గంట ముందు ఫోన్ కొట్టు. నీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటాను"
"చరిత్రేమిట్రా చరిత్రా... గేటు దగ్గర మొదలెడితే గుమ్మం ముందు ముగిసిపోయింది నీ చరిత్రా... పదినిమిషాలే పట్టీంది నాకు"

"నా దారి తప్పని చెప్పూ.. మార్చుకుంటా. నా తప్పు చూపించూ..సరిదిద్దుకుంటా.. కానీ నాకు చావుని చూపించాలనుకోకూ" (సరిగా గుర్తు లేదు ;()

"బతకండీ బతకండీ అని చెప్పాను కదరా.. వినలేదూ.. కోత మొదలైందీ.. రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడూ"
"సౌండ్ తగ్గించుకో.. ఈ సారి కొట్టానంటే గొంతులోనుండి అరుపు రాడానికి ఐదేళ్ళు పడతాదీ"
ఇలాంటి సూపర్ డూపర్ డైలాగ్స్ ఉంటే ఇవన్నీ వదిలేసీ డబల్ మీనింగులూ, బూతులూ ఎక్కువయిపోయాయ్ అంటున్నారు సో కాల్డ్ విమర్శకులు..

ఒక మరదలు బావగారితో (హీరో) "బావగారూ.. విప్పండి కడుగుతా....అదే... షూస్" అని మర్యాద గా అంటాది.
ఇంకొక మరదలు, బట్టలు తడిచిన బావగారికి తువ్వాలు తెచ్చీ "బావగారూ.. మీరు తుడుచుకుంటారా? నన్ను తుడవమంటారా? " అని అడుగుతాది. ఇందులో డబల్ మీనింగ్ ఎక్కడుందో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా
అర్ధం కావట్లేదు. నీలాగా సినిమా గురించి ఏం తెలీకుండా ప్రతీ ఒక్కడూ తెలుగు సినిమాని విమర్శించెయ్యటమే. రివ్యూలు రాసెయ్యటమే... హేమిటో కర్మ..

నా.క్లాః "రామ రామా.. హరి హరీ... ఏంటీ అశ్లీల భాషా సంభాషణలు... ఆ హింస ఏంటీ? వందల మంది నరకడం ఏంటీ? సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుందసలూ.. ఆ ఫైట్లు మరీ దారుణం గాలేవూ? చేతిలు వెనక్కి మడుచుకొని భుజాలతో గుద్దెయ్యటం ఏందయ్యా? కొడితే కిందపడ్డోడు మళ్ళీ బంప్ లేచి పడటం ఏంటీ? విలన్లంతా గాల్లో ఎగిరే ఫైట్స్ ఆపరా??  హాలీవుడ్ సినిమాల్లో సూపర్ మేన్, స్పైడర్ మేన్, హీమాన్, hulk లాంటి సూపర్ హీరోస్ చేసే ఫైట్లు ఇక్కడ పెడితే ఎటకారం గా ఉండదా ??"

నా.మాః ఇదిగో దేని గురించన్నా మాట్లాడు గానీ ఫైట్స్ గురించి వాగావంటే బాగోదు.  ఒక్క మాటలో చెప్పాలంటే ఫైట్స్ తుక్కుతుక్కు చేసేశాడు. ఆ క్యారెక్టర్ కి తగినట్టూ పవర్ఫుల్ ఫైట్లు. ఇలన్లందర్నీ ఇరగదీస్తుంటే, రక్తం పారుతుంటే సామిరంగా నా ఒంట్లో కరెంట్ జెనరేట్ అయ్యింది. క్లైమాక్స్ లో హీరో చచ్చిపోయే తమిళ్ సినిమాలు చూసి హిట్ చేస్తాం కానీ మా హీరో చచ్చిపోతే మేం ఆ సినిమాఅని తన్నవతల పారేస్తాం.  మాకు మా హీరోలే సూపర్ హీరోస్.  సూపర్ మేనా? హీ మేనా? దమ్ముంటే రమ్మనూ... తొడ గొట్టి, మీస మెలేసి నరికి పారేస్తారు మా వాళ్ళు.
A సెర్టిఫికేట్ సినిమాకి చిన్న పిల్లలతో వచ్చీ,  హీరోయిన్ క్యారెక్టర్ బూతులు మాట్లాడుతుందీ, హీరో పోరంబోకు లా బిహేవ్ చేస్తున్నాడూ, లోకం పాడైపోతుందీ అని ఏడ్చే ప్రేక్షకులకీ, విమర్శకులకీ ఎన్ని చెప్పిన అర్ధం కావు వదిలెయ్.

నా.క్లాః "సరే.. ఫైట్స్ గురించి మాట్లాడనూ...ఆ క్లైమాక్స్ ఏంటీ బాబూ.? నమిలేసిన బబూల్ గమ్ సాగదీసినట్టూ.. హీరో చేతిలో దెబ్బలు తిన్నందుకు కన్న కొడుకునే చంపేసిన విలన్ హీరో క్లాస్ పీకితే మారి పోయి పొగడటం ఏంటీ?హీరో వాణ్ణి వదిలేయటమేంటీ? దానికన్నా ఇంటర్వెల్ కే సినిమా ఆపేస్తే సూపర్ గా ఉండేది కదా?"

నా.మాః హ్మ్మ్.. సెకండ్ హాఫ్ కొంచెం తగ్గిన మాట నిజమే. క్లైమాక్స్ సాగదీత మాటా నిజమే.  కానీ ఫస్టాఫ్ బాగుంది కదా?.
నా.క్లాః "ఆ.. ఫస్టాఫ్ బాగుందన్న సంగతి సెకండ్ హాఫ్ చూశాకే తెలిసింది నాకు"
నా.మాః అయితే ఇంకేముందీ? సినిమా బాగుందన్నావ్. హిట్.. హిట్.. బంపర్ హిట్.. కలెక్షన్ రికార్డులన్నీ మావే. మా ఫ్యాన్స్ అందరం పెద్ద పండగ చేసుకునే సినిమా ఇది. కొత్త రికార్డ్ సృష్టించేస్తాదీ సినిమా.. చూస్తూ ఉండూ.

నా.క్లాః "1200 ప్రింట్లంట కదా... మూడ్రోజులు కలెక్షన్స్ రాక ఏడుస్తాయా? చేస్కో రికార్డులు ఇరగ్గొట్టుకో.. ఇప్పుడు జై కొడుతున్నతక్కిన జనాలు ఛీ కొట్టే దాకా ఇలాంటి హిట్ సినిమాల చూస్తూ ఆ దుమ్ము లో దొర్లి ఎంజాయ్ చెయ్"

నా.మాః నీలాంటి తెలివైన వాళ్ళు Rs 40 కి సీడీ కొనుక్కొనో, ఫ్రీ టొరెంట్ డౌన్లోడ్ చేసో చూసి విమర్శిస్తున్నారనే, అన్ని సినిమాలూ ఇన్నేసి ప్రింట్లు రిలీజ్ చేస్తున్నారు. ఇదేరా "డాగ్ బైట్ కి స్లిప్పర్ స్లాప్" అంటే.

నా.క్లాః ఆ... ఇదే... దమ్ము తో దుమ్ము లేపడం అంటే కూడా ఇదే..  సినిమా మొత్తం ఒక కన్ను మూసుకొని ఉండే నాజర్ కళ్ళు తెరుచుకొని పీకిన క్లాస్ కి నేను కళ్ళు తేలెయ్యాల్సి వచ్చింది. సింహా సినిమా లాప్టాప్ లో మళ్ళీ చూసేస్తే పోయేది. సినిమా టికెట్ తో పాటూ జండూబామ్, సారిడన్ టాబ్లెట్లూ ఫ్రీ గా ఇస్తే బాగుండేది.
సినిమా బిగినింగ్ లో బోయపాటి శీను "సైలెన్స్.. రెడీ బాబూ... ఏక్షన్" అన్నప్పుడే వచ్చేస్తే ఇంకా బాగుండేది.

ఓ.. లెక్క ఉన్న తిక్క అన్నయ్యా.. రా..రా. ఈ వారం రోజులూ రెస్ట్ తీసుకుంటా... మళ్ళీ నువ్ కూడా కొట్టేద్దువూ గానీ.
ఇక ఈ సినిమా రివ్యూలు ఆపేద్దామనే గొప్ప నిర్ణయం తీసుకున్నా ఇందాకే.. "ఇక చాలూ"(చత్రపతి స్టైల్)

Sunday, April 15, 2012

ఔను.. నేను బ్లాగ్ మొదలెట్టాను.. ఏడాది క్రితం.


కూడలి లో కనిపించిన పోస్టులన్నీ చదివేసీ కమెంట్లు పెట్టడానికి కూడా భయపడేవాణ్ణి నాలుగేళ్ళ క్రితం.
నచ్చిన బ్లాగులు మాత్రమే చదువుతూ... బా..గాఆఆ నచ్చిన ఒకే ఒక్క బ్లాగ్ లో కమెంట్లు పెట్టేవాణ్ణి
మూడేళ్ళ క్రితం.

అడ్డమయిన సినిమాలూ చూసొచ్చి నాకనిపించిన  నాలుగు ముక్కలు గూగుల్ బజ్ లో రివ్యూ రాసేవాణ్ణి రెండేళ్ళ క్రితం.

బ్లాగు స్నేహితుల ప్రోత్సాహం తోటీ, బ్లాగ్ మొదలెట్టకపోతే "బాగోదు" అనే వార్ణింగ్ ల తోటీ, "బ్లాగ్ మొదలెడితే లాభాలేంటీ??" అనే విషయం మీద క్లాస్ లతోటీ, బెదిరింపుల తోటీ బ్లాగు మొదలెట్టాను..  సంవత్సరం క్రితం. 

 మొదలెట్టి "ఏం చేసేవు కుర్రోడా?" అంటే...  డైరీ లు గట్రా రాసే అలవాటు లేని  నేను నా జ్ఞాపకాలని, నా అనుభవాలనీ, నాకు నచ్చిన రీతిలో నాకొచ్చిన భాష లో రాసుకున్నాను.

నా ఫేవరెట్ బ్లాగర్లూ, గొప్ప గొప్ప రైటర్లూ, సీనియర్లూ ఇక్కడకి వస్తే ఎగిరి గంతులేశాను.
వాళ్ళు మెచ్చుకుంటే మురిసిపోయాను.
బాగుందని పొగుడుతుంటే పొంగిపోయాను.
ఫైనల్ గా "మనకింత సీనుందా ?" అని సిగ్గు పడీపోయాను.

సో ప్రజలారా... నేన్ చెప్పేదేంటంటే...

1 year ఇండస్ట్రీ.. 


నా చేత బ్లాగ్ మొదలెట్టించినోళ్ళకీ, కెవ్వ్.. కెవ్వ్వ్ మని కమెంట్లు పెట్టి, కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేసి రాయించినోళ్ళకీ, "బాలేదురా అబ్బాయా..." అని చురకలేసినోళ్ళకీ, నాకు బ్లాగిచ్చినోళ్ళకీ, దానికి పేరెట్టినోళ్ళకీ, పేరెట్టిన బ్లాగు కి పేరు తెచ్చినోళ్ళకీ

అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.. మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని ఆశిస్తూ..
 
 
రాజ్ కుమార్
 


Saturday, April 14, 2012

నీకూ నాకూ డాష్.. డాష్...


దిగో టైటిల్ చూసి ఇదేదో సినిమా రివ్యూ అనుకునేరు.. కాదు కాదు..  ఆనందాన్ని పంచుకుంటే పెరుగుతుందంట, దుఃఖాన్ని పంచుకుంటే తరుగుతుందంటా..
చేసిన పాపం చెప్తే పూర్తిగా పోతుందంటా..ఏదో నా పాపాన్ని కడుక్కునే ప్రయత్నమన్న మాట.
రోజూ లేచే టైం కన్నా లేటగా లేవటం తో హడావిడిగా రెడీ అయ్యి, కబోర్డ్ లో ఉన్న అరడజన్ డియో స్ప్రే లలో ఒక స్ప్రే కంగారులో కాన్ఫిడెంట్ గా  తీసి ఒళ్ళంతా
పస్స్స్స్స్స్స్స్..పస్స్స్స్స్స్ మని కొట్టాను. కొట్టిన స్ప్రే ఏదో తెలీదు  గానీ వాసన మాత్రం చాలా ఘాటుగా వచ్చింది. కబోర్డ్ లో

డియో స్ప్రే లతో పాటూ రూమ్ ఫ్రెషనర్, నలుపు హిట్ కూడా కలిపున్నాయ్.

హ్మ్మ్... సర్లే.. మన వొంటి గంధం తో పోలిస్తే ఈ దుర్గంధం కూడా మంచి గంధమే అని సరిపెట్టుకొన్నాను.

"ఈరోజు ఈ పరిణామం దేనికి సూచన చెప్మా??" అని సందేహం మాత్రం కొడతానే ఉంది.

రచ్చ సినిమా చూశాక, మన తేజ గారి ఇంటర్వ్యూ లో రొటీన్ తెలుగు సినిమా కధల మీద ఇచ్చిన పంచ్ లు నచ్చీ, గుర్తొచ్చీ, నిజం,జై, ఒక విచిత్రం,కేక లాంటి సినిమాలు చూసి కూడా, 
ఒక బలహీన క్షణంలో "నీకూ నాకూ డాష్ డాష్" అనే వీర వెరయిటీ సినిమా చూడ్డానికి పూనుకున్నాను.



ఇక్కడ ఒక లుక్కేసి రండీ.. చెప్తాను.
మా ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ లో "బాబూ... డాష్ డాష్ సినిమాకి మూడు ఇవ్వు" అన్నాను లో వాయిస్ లో కొంచెం సిగ్గు పడుతూ.

"రచ్చ సినిమానే కదా?" అన్నాడాడు. ఓర్నాయనోయ్ వీడు కొంప ముంచేలా ఉన్నాడనుకోని
"నీకూ నాకూ డ్యాష్ డ్యాష్" అన్నాను పూర్తిగా సిగ్గొదిలేసి,కొంచెం కోపం తెచ్చుకొని.

రివ్యూలు రాయడానికి భయపడే సినిమాలు కూడా వస్తాయనీ, అవి నేను చూస్తాననీ,చూసి తట్టుకుంటాననీ అనుకోలేదేనాడూ. పంచాంగం లో ఈ సంవత్సరం నాకు బాలేదంటే తొక్కలే అనుకున్నా...
శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారూ.. సారీ అండీ.

ఇహ ఈ సినిమా గురించి చెప్పాలీ అంటే డైరెట్రు తేజా చెప్పినట్టూ ఇది లిక్కర్ మాఫియా నేపధ్యం లో భావోద్వేగాలతో  పాకే పూర్తిస్థాయి వెరయిటీ ప్రేమకధా చిత్రం.
ఇంతకన్నా స్టోరీ చెప్తే బాగోదు కాబట్టీ చెప్పను. చాలా కొత్త కధండీ నిజంగానే.. "కేక సినిమా మీద ఒట్టు ఒక విచిత్రం సినిమా హిట్ట్లు అయినంత ఒట్టు.

వెరయిటీలు ఏంటీ??

1. మామూలు రొటీన్ సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ అయ్యాక పాట వస్తుంది కదా.. ఈ సినిమా లో పాట లో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. (టైటిల్స్ అవ్వగానే పుసుక్కున పాట మొదలైపోయింది )
 సాధారణం గా గ్రూప్ డ్యాన్స్ లో డ్యాన్సర్లని వదిలేసి హీరోని మాత్రమే చూస్తాం. కానీ ఇందులో హీరో ఎక్కడున్నాడొ ఎతుక్కుంటాం. హీరో ఎవరా?? అని ఉత్కంఠత తో ఎదురుచూస్తాం.
2.రొటీన్ సినిమా లో హీరోయిన్ (హీరో పెళ్ళాం) ఎక్స్పోజింగ్ చేస్తాది. ఇందులో విలని (విలన్ పెళ్ళాం) ఎక్స్పోజింగ్ చేస్తాది.
౩. రొటీన్ సినిమాల్లాగా బూతులు సెన్సార్ కట్ చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఆల్రెడీ డ్యాష్ లు పెట్టేసి సెన్సారోళ్ళకి శ్రమ తగ్గించారు. అయినా గానీ పాపం A సెర్టిఫికేట్ ఇచ్చారు.. ;(((((((((
4. రొటీన్ గా ఇటెం గర్ల్ తో నాటు సాంగ్ లేదు. కానీ చిత్రం సినిమా టైప్ లో కేక లాంటి సాంగున్నాది.
5.జయం సినిమా లో తాడు కట్టుకొని హీరో, ఫ్రెండ్స్ సహాయం తో దిగుతాడు. కానీ ఇందులో హీరోయిన్ తాడు సెటప్ యూజ్ చేసుకుంటాది.
6.రెగ్యులర్ సినిమా లో హీరోలు అడ్వాంటేజ్ తీసుకొని సరసాలాడేస్తుంటారు హీరోయిన్లతో. ఇందులో హీరోయిన్ నా నోటితో చెప్పలేని చిత్రీ పనులన్నీ చేస్తాది.(వెరయిటీ.. వెరయిటీ)

హీరోః ప్రిన్స్ అంటా.. కొత్తబ్బాయ్. ధ్వజ స్థంభానికి చొక్కా, పేంట్ తొడిగినట్టూ పొడుగ్గా ఉన్నాడు. తేజా సినిమా లో హీరో లాగే ఉన్నాడు.
చాలా చాలా మంచి క్యారెక్టర్. (అంటే ఆ క్యారెక్టర్ చాలా మంచిదని అర్ధం.. అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్  అని అపార్ధం చేసుకోకండీ)

హీరోయిన్ః ఎప్పటిలాగే తేజా బాగా కాన్సన్ట్రేట్ చేశాడు హీరోయిన్ మీద. చక్కని కళ్ళు, పొడుగైన రెండు జడలూ బాగుంది. బాగా చేసింది. కాకపోతే నానా చండాలం చేయించాడు, నానా దరిద్ద్రాలూ వాగించాడు ఈ పిల్ల చేత పాపం ;(((((( అదే బాధేసింది నాకు. పేరు నందిత అట.

మెచ్చుకోవల్సిందేమంటే అందరూ తెలుగోళ్ళే అని విన్నాను. గుడ్డో గుడ్డు.

గుడ్డంటే గుర్తొచ్చింది ఈ సినిమాలో సుమన్ శెట్టి ని చూసి "లవ్ స్టోరీ కాదూ హారర్ సినిమానా?" అనుకున్నా మొదట్లో ఓ పది నిమిషాలు. కాకుంటే తర్వాత తర్వాత అలవాటై పోయీ సుమన్ శెట్టి కామెడీ కి కూడా నవ్వేశాను.
ఏమండీ.. వీపు మీద వాత పెట్టించుకున్నాక దాని మీద కారం రాస్తే మాత్రం తెలుస్తాదా? గియ్యగా గియ్యగా గెడ్డం గరుగ్గా అవుతాదని వినలేదా ఎప్పుడూ?? ఇది కూడా అంతే [బాబోయ్...ఏమయ్యిందీ రోజు నాకు??]

విలన్స్ః బోల్డుమంది విలన్లండీ... మెయిన్ విలన్ మాత్రం అరగుండు తో, కోరమీసాల్తో భలే కామెడీ గా ఉంటాడు. కానీ విలన్ వాళ్ళావిడ ఇంకా పెద్ద విలన్. కత్తి లా ఉంటాదీ కత్తట్టుకొని తిరుగుతాది. నిజం సినిమాలో రాశి కన్నా పవర్ఫుల్ అన్నమాట. 

మాటలుః  అబ్బబ్బా.. తేజా పెన్ తో రాశాడో కత్తి తో రాశాడో గానీ కేకలు పెట్టించాడు. (చావు కేకలా?? అని అడిగితే నేనేం చెప్పలేను)
ద్వ్యంద్య్వార్ధాలతో సినిమాలు తీయటం చేతకాదనీ తేజా వారు సెలవిచ్చారు. సో అన్నీ సింగులు మీనింగులే అన్నమాట.

హీరోయిన్ హీరో తోః  
"ఏరా డాష్ గా.. ఇలా రారా.. నేను నిన్ను డ్యాష్ చేస్తున్నాను. నువ్ నన్ను డ్యాష్ చేసే తీరాలి" (ప్చ్.. తప్పుగా అర్ధం చేసుకోకండీ ఇక్కడ డ్యాష్ ఆంటే లవ్ అండీ..)

"నన్ను లవ్ చేయకపోతే నీ డ్యాష్ పగిలిపోద్ది" (అదిగో మళ్ళీ... ఇక్కడ డ్యాష్ అంటే తల అని అర్ధం)
"ఏరా పొట్టి డ్యాష్ గా నా డ్యాష్ గాడేడీ??" (డ్యాష్ = లవరు)
"నేను ఇప్పుడే, ఇక్కడే నీతో డ్యాష్ చేస్తా.."

విలన్ తో : "నువ్ పోలీసోడివయ్యుండొచ్చు... కానీ నువ్ నన్ను కొట్టావని నా డ్యాష్ గాడికి తెలిసిందంటే.. నీ డ్యాష్ నీ చేతిలో పెట్టేస్తాడు" (అబ్బా... మిమ్మల్ని ఎడ్యుకేట్ చెయ్యటం నా వల్ల కాదు.)

విలన్ః  "చిరిగిననోటూ, కాలిరిగిన కుర్చీ, సాక్షం లేని కేసూ చెల్లవు"
          "పగ కత్తిని తీస్తుంది, ప్రేమ ప్రాణం తీస్తుంది"
లేడీ విలన్ హీరోయిన్ తోః వాంతి ఎందుకు వస్తుందే నీకు? కడుపులో ఏమీ పడకొస్తుందా? కడుపులో ఏదో పడొస్తుందా? (క్షమించాలి మిత్రులారా.. నేరం నాది కాదు)
ఇట్టాంటి కడుపులో అల్లకల్లోలం సృష్టించే పదునైన సంభాషణలు కో కొల్లలు.

కామెడీః  ఏం కామెడీ ఏం కామెడీ.? సూపరో సూపరు కామెడీ. భలే కామెడీ..అబ్బ బా బ్బ... ధియేటర్ లో చూసేవాళ్ళు చాపలు పట్టుకు పోవటం బెటరు. కింద పరుచుకొని దొర్లి దొర్లి నవ్వడానికి అనువు గా ఉంటాది. గొడుగు కూడా పట్టుకెళ్ళాలి. హాస్యపు జల్లులో తడిసి ముద్దై పోతామంతే. వికటాట్టహాసాల దుమ్ము లో తుమ్ములొచ్చేస్తాయంతే.

ఫైట్లుః ఆ... రోప్స్ అవీ పెట్టి లాక్కుండా,కొంచేమ్ నేచురల్ గా ఉన్నాయ్. కాకపోతే తేజా మార్క్ టమాటా జామ్ ఫైట్లూ, హీరో హీరోయిన్లు అడవి లో దెబ్బలతో తిరగటం విలన్లు వెతుకుతా రావటం కామన్ అన్నమాట.

క్లైమాక్స్ లో హీరోయిన్నూ, లేడీ విలనూ కొట్టుకునే ఫైట్ అరాచకం అంతే... నరాలు తెగే భావోద్వేగం, గుండె పగిలే గగుర్పాటు, ఉరిమే ఉత్సాహం, పిచ్చిగా నవ్వాలనే కోరికా కలిగాయ్ నాకయితే.

ఫోటోగ్రఫీః  ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు కెమెరామెన్ లు వర్క్ చేసినట్టు. బాగుండక చస్తుందా?? రసూల్ రచ్చ చేశాడు. అదేదో గో..ప్ప కెమెరా తో ఏసియా లోనే మొదటి సారిగా ఏదో తీసారంటా..
అదే సీనో మాత్రం తెలియలేదు నాకు. తెలుసుకోవాలని కూడా లేదు. మీకు తెలిసినా నాకు చెప్పొద్దు ప్లీజ్.

ట్విస్ట్ లు ఉన్నాయా?? : బొచ్చెడున్నాయ్.. నా మోకాలు ట్విస్ట్ అయిపోతే తలుపు ఇరుకున పెట్టి సరి చేసుకున్నాను ఇందాకే.

పాటలుః
కలికాలం లో "రామా" అన్నా బూతయిపోయిందన్నట్టూ, నాకు ఏం విన్నా.. డాష్ గానే వినిపిస్తుందీ.



చివరగా చిన్న కర్ణ పరీక్షః
http://musicmazaa.com/MMaPlayer/playsongs/?id=51040&t=MusicMazaa-1334344944612
ఈ సాంగ్ పూర్తిగా విని, సినిమా లో చూసి ఎంజాయ్ చెయ్యగలిన వాళ్ల ఇంటికొచ్చి, నా తలనీలాలు సమర్పించుకొంటాను. డ్యాష్ మీద ప్రామిస్..

నా తోటి ప్రేక్షకుల అభిప్రాయాలుః

మనోజ్ గాడుః ఇదేంట్రా షాపింగ్ మాల్ సినిమా లాగా ఉందీ??(మొదటి అరగంట కి)
రెండో అరగంటకి... నా వైపు అదోరకం గా చూసేడు తప్పితే ఏం మాటాళ్ళేదు.
"రచ్చ సినిమా కి మళ్ళీ పోయినా బాగుండేదిరా" (సినిమా అయిపోయాక)

సుధాకర్ గాడుః  
గ్రేటాంద్ర్హా వాడు 2.75 రేటింగిచ్చేసేడని చెప్పీ, డైరెక్ట్ గా ఆఫీస్ నుండి ధియేటర్ కి తీసుకొచ్చావ్ కదరా... @*#$#@$@#$(!__+_#)$

నేనుః
"ఇంత తట్టుకోలేని వెరయిటీ సినిమాలు రావటం వల్లే రచ్చ లాంటి రొట్ట సినిమాలు హిట్టవుతున్నయ్" అనుకుంటున్నారా? ప్చ్.. ఈ తెలుగు సినిమా ప్రేక్షకులతో ఇదే
ప్రోబ్లెం. హిట్టు సినిమాలిస్తుంటే కొత్తగా ఏమన్నా చెయ్యమటారు. కొత్తగా తీస్తే చెత్తగా ఉందంటారు. తమిళ్ సినిమాలు మాత్రం సూపరంటారు.
లాభం లేదు.. దాసరి వారితో చెప్పి ఈ సినిమాకి అవార్డ్ రప్పించాల్సిందే.
అవసరమయితే నేషనల్ అవార్డ్ కొట్టే సినిమా తీసి జనాల్ని చావగొట్టమని నేనే ఒక లేఖ రాస్తాను.ఆఅ.... రాస్తాను.
"ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో నిండిన సినిమాలూ, వెర్రెత్తించే వెరయిటీ సినిమాలూ ఎన్నెన్నో మరెన్నో తీయించేసీ, యంగ్ ఇండియా, పరమవీర చక్ర సినిమాలు రీమేక్ చేయించేసీ, తెలుగు సినిమా ఇండస్ట్రీని డాష్ డాష్ చేసేస్తాను... ఇదే నా శపధం.. "

Thursday, April 5, 2012

రచ్చ : ఒక "రొటీన్ రొట్ట మాస్ మసాలా" తెలుగు చిత్రం


రెంజ్ లాంటి రొటీన్ కి భిన్నమయిన సినిమా ఫ్లాప్ టాక్ తో మొదలయ్యి, మిక్స్డ్ టాక్ తెచ్చుకునే లోగా  కొంచెం

అర్ధవంతమయిన సినిమాలు తీయగల భాస్కర్ లాంటి దర్శకుడిని అడ్డమయిన తిట్లూతిట్టీ దాన్ని పాతరేసి పారేసిన మా మెగా బ్రదర్స్ ఈ సారి హిట్టయ్యే సినిమా యే కానీ, తలనొప్పి రప్పించని సినిమా తీయకూడదని ఎంచుకున్న సినిమానే రచ్చ.

"ఈ సినిమాని ఓకే చేసిందీ, నాకు పునర్జన్మనిచ్చిందీ మెగాస్టార్ చిరంజీవే..." అని ఒళ్ళు పులకరించి పులిసిపోయేట్టు, పూనకమొచ్చినట్టు డైరెక్టర్ చెప్పినప్పుడే అర్ధమయిపోయింది ఎలా ఉంటుందో. మణిశర్మ కూడా అందుకు తగ్గట్టూ
ఒక్కసారి వినగానే డిలీట్ చేసిపారెయ్యాలనిపించే పాటలు అందించాడు.

ఇహ స్టోరీ విషయానికొస్తే............ ఏంటీ స్టోరీ కావాలా??

"ఆది" సినిమా చూశారా?? బన్నీ??? వర్షం??? దేవదాసు?? బద్రీనాధ్?? చిరుత?? అతనొక్కడే?? ఊసరవెల్లి???  ఈ సినిమాలన్నీ కలిపి కిచిడీ చేస్తే అదే కధ. (ఒక్కో సినిమా నుండీ ఒక్కో సీన్ గుర్తు రాకపోతే నన్నడగండి)

హమ్మయ్యా...సింగిల్ లైన్ లో కధ చెప్పేసేను. డైరెట్రు సంపత్ నందికి నా లాల్ సలాం.

రామ్ చరణ్ ఎలా చేశాడూ??

పెద్ద పీకడానికేం లేదు సినిమాలో. అరివీర భయంకరంగా నవరసాలూ మిక్స్ చేసి మిల్క్ షేక్ చేయాల్సిన పని లేదు. ఆ అవసరమూ లేదు, అవకాశమూ లేదు. తన క్యారెక్టర్ మేరకు బాగానే చేశాడు.
కధానుగుణం గా ఫార్ములా ప్రకారం వచ్చే పాటల్లో డాన్సులేశాడు.సీరియస్ గా మూతి బిగించి ఫైట్స్ చేశాడు. మిగిలిన చోట్ల పంచ్ డైలాగులు, పవర్ఫుల్ గా చిరంజీవి ని తలిపించేట్టూ చెప్పేడు.
పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఆడియో రిలీజ్ కి ముందే అఫిషియల్ గా లీకయ్యి హిట్టయిన "రచ్చ" టైటిల్ సాంగ్ లో పెద్దగా డ్యాన్స్ లేకపోవటం. జల్సా టైటిల్ సాంగ్ లో పవన్ లాగా పాటంతా
వాకింగ్ చేస్తా ఉంటాడు. రెండే రెండు స్టెప్ లు. అవి చూసి మా ఫ్యాన్స్ అంతా "ఊఊఊఊఊఊఊఒ..ఆఆఆఆఆఆఆఅ... ఏఏఏఏఏఏఏఏఏఏఏ" అని కేకలేసుకున్నాం. (కాలికి దెబ్బ తగిలిందండీ.అయినా మా ఓడు అదేం లెక్క చెయ్యకుండా ఒక తపస్సులాగా, ఒక యజ్ఞం లాగా నడిచీ, కాళ్ళూ చేతులూ కదిపి పాటలు పూర్తి చేశాడు. అర్ధం చేసుకోరూ..)
పెద్ద పాజిటివ్ పాయింటేమిటంటే... "డిల్లకు డిల్లకు డిల్లా" సాంగ్ లో డ్యాన్స్... సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే.. టాప్ లేపేశాడు. ఇరగదీసి, అరగదీసి, వాయగొట్టి వడ్డించాడు. (ఈ పాటకే కాలు డ్యామేజ్ అయిపోయుంటాది.)

తమన్నా....

అహో.. నాకు చాలా ఇంట్రస్ట్ గా ఉంది తమన్నా గురించి చెప్పడం. రిన్ సబ్బెట్టి ఉతికీ, నీలి మందులో ముంచి తీసినట్టూ.. ఒళ్ళంతా ఫెవికాల్ పట్టేసినట్టూ... తెల్ల తెల్లగా..సూపర్ గా ఉంది.
అవసరమయినంతా అవసరమయినవన్నీ చేసీ, చూపించీ టికెట్ డబ్బులు కిట్టించింది. నటనే కాదు డ్యాన్స్ కూడా బా చేసింది. వానా వానా వెల్లూవాయి పాటలో రచ్చ చేసింది నిజంగానే... !  ష్..ష్... ఈ కింద చూడండీ..



ఫైట్స్...

అబ్బో కేక.. హీరో ఎగిరి తంతాడు. దెబ్బకి ఇలన్లు ఎగిరెగిరి అల్లంత దూరన పడిపోవాల్సిందే... ఈ కత్తిచ్చుకు పొడిస్తే కుట్లు పడాల్సిందే... గొడ్డలిపట్టుకు నరుకుతా ఉంటే.. నా సామిరంగా రక్తం చిందాల. చేతులెగిరిపోవాల. అంతేనండీ..అంతే.. మేము తెలుగు సినిమా ఆడియన్స్... మాకిలాగే ఇష్టం... ఆ మూర్ఖుడు పవన్ కళ్యాణ్  నేచురాలిటీ అని చెప్పి ఇంకా పాతకాలపు ఫైటింగ్లు చేస్తా ఉన్నాడు. ఎప్పుడు మారతాడో ఏమో.

పాటల్స్....

మెలోడీ బ్రహ్మ మణిశర్మ... కాదు కాదు ఈ సినిమా నుండీ "మాస్ బ్రహ్మ". "పెంట"స్టిక్ మ్యూజిక్కండీ. మా బాస్ హిట్ సాంగ్... "వానా వానా వెల్లువాయ్" పాటని రిమిక్స్ చేశాడూ... ఇని సచ్చిపోయినా పాపం లేదు.
డైరెక్ట్ గా స్వర్గానికి పోతాం. మళ్ళీ నరకానికి పోవాల్సిన పనిలేదు.

వానా వానా వెలూవాయె. వాయె.. వాయే... కొండా కోనా కుళ్ళీ పోయే.. పోయే.. పోయే..

ఇహ  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గిటార్ల తీగలు తెంచేశాడు.... డ్రమ్ముల దుమ్ము దులిపేసేడు. "హి ఈజ్ ది మిస్టర్ తీస్ మార్ఖాన్ రచ్చా..." (కంగారు పడకండి ఇది తెలుగు పాటే)

కామెడీ....

కామెడీ ఉందో లేదో క్లారిటీ తో చెప్పలేను  గానీ.... స్టార్ కమెడియన్లు ఉన్నారండీ.. బ్రహ్మీ, ఆలీ, రవిబాబు.. ఎమ్మెస్ నారాయణ.(వాళ్ళు కనిపించగానే నవ్వుతాం కదా కారణం లేకపోయినా)
ఒకటీ, రెండు సార్లు నవ్వేం లెండీ. మరీ ఎక్కువ నవ్వితే పిచ్చోళ్లనుకోరూ???

స్క్రీన్ ప్లే...

ఇదిగో.. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మహాడ్డం నా వల్ల కాదు. ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్  వీక్ గా అనిపిస్తాదండీ. అలా ఎందుకుందో సెకండ్ హాఫ్ లో తెలుస్తాది. అర్ధం కాకపోతే సినిమా చూడండి పోయి.

డైలాగ్స్....

ఆ.... ఇదీ అసలు పాయింటూ.. మా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే పాయింటూ.. నిజంగానే బా రాశారు. కంచాలు కిందపడేసినట్టూ... పంచులూ...పంచర్లు పడిపోయేలాగా అంచుల దాకా తీసుకెళ్ళొదిలాడు.
దాదాపు కుదిరినప్పుడల్లా... మెగాస్టార్, మా నాన్న, నా జీన్స్, నా రక్తం..., గెలుపూ, నా వెనక ఫ్యాన్స్ లాంటి డవిలాగులతో హాలంతా రచ్చ రచ్చే...
సెకండ్ హాఫ్ లో జనాల్ని రంజింప చేసిన సీన్లు ఉన్నాయీ అంటే... వాటికి సంపత్/(పరిచూరి బ్రదర్స్??) రాసిన డైలాగ్స్ వల్లే. క్లైమాక్స్ లో పరిచూరి వెంకటేశ్వర్లు, తమన్నా లు చెప్పే డైలాగ్స్ కి ఫ్యాన్స్ కి పూనకం వచ్చేస్తుంది. (మాస్ హిస్టీరియా అంటే ఇదే అన్నమాట)
నాకు కొన్ని డవిలాగులే కొంచెం కొంచెం గుర్తున్నాయ్...  ఫస్ట్ డే ఫస్ట్ షో అవ్వటం తో మిగిలినవన్నీ గాల్లో, కేకల్లో కలిసిపోయాయ్...

1.నాకు గెలుపిష్టం.. గెలుపులో బలుపిష్టం
2.కత్తిలోని పదును, బుల్లెట్ లోని స్పీడు, లావాలోని వేడీ ఉన్న మగాడి కోసం చూశాం.
౩.తాటిచెట్టంత పొడుగూ, పాపికొండంత బాడీ  ఉంటే సరిపోదురా.. కళ్ళళ్ళో పొగరుండాలీ, గుండెల్లో దమ్ముండాలి.
4.మా వాడు వచ్చిందే రికార్డ్స్ క్రియేట్ చెయ్యడానికి... (హీరో ఇంట్రడక్షను)
5. నువ్వరిస్తే అరుపులే.. నేనరిస్తే మెఱుపులే...
6.నన్ను పెంచిన తండ్రి కోసం నా ప్రాణాలే తీసుకోబోయాను. నా కన్నతండ్రి ఆశయం కోసం ఎందరి ప్రాణాలయినా తీస్తాను.
7.వెనక చూసుకొని తొడలు కొట్టే టైప్ కాదు రా నేనూ....(*&$$$$$$$$$&**)@@---------------------------- (ఆ తర్వాతి ముక్కలు గోలలో వినిపించలేద్ద్ద్ద్ద్ద్...)
8.రికార్డులు కొట్టడానికి వయసుతో పనేముందీ??
9.యుద్ధం లో మొదట చచ్చిపోయేది సైనికుడే నాన్నా అని చెప్పి మరీ పోయాడ్రా నా కొడుకూ..
10. బెట్టా?? బస్తీ వెర్సస్ మస్తీ... చమట వెర్సస్ సెంటూ.
12. గెలిచే అలవాటు నాకు బై బర్త్ వచ్చింది.

సెమీ ఫైనల్గా చెప్పేదేంటీ??? సినిమా చూడొచ్చా ?? బాగుందా?? బాలేదా???

అది చెప్పడానికి నేనెవర్నీ?? నే వెళ్ళొద్దని చెప్తే మానేస్తారా? చూడమని చెప్తే వెళ్ళీ చూసేస్తారా? ఎవరికి వారు వెళ్ళి అనుభవం మీద తెలుసుకోవాలి.
అయినా నాకు నచ్చిన సినిమాలన్నీ హిట్టయ్యాయా? నచ్చనివన్నీ ఫ్లాపయ్యాయా?
"లోకో భిన్న రుచీ" అన్నారు. అంటే లోకం లో బోల్డు రకాల రుచులున్నాయీ.. అన్నీ అందరికీ నచ్చవ్ అని అర్ధం.

ఫైనల్ గా చెప్పేదేమంటే... ఇదొక రొటీన్, మాస్ మసాలా చిత్రం. మా ఊళ్ళో ఇరగ ఆడేసే అవకాశాలున్నాయ్. మల్టీప్లెక్స్ జనాలు చూడరు. కమర్షియల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళూ, ముఖ్యంగా ఫ్యాన్స్, పండగ చేసుకోవచ్చు.
టాక్ అయితే సూపరో సూపరు అని ఉంది ప్రస్తుతానికి.
చరణ్ నుండి ఇక అన్నీ ఇలాంటి ఫార్ములా సినిమాలే చూడాలేమో కర్మ... అని ఫీలవుతున్నా.. ;( ;( ;( [ఫ్లాపయినా పర్లేదు.. ఆరెంజ్, వేదం, రంగం లాంటి సినిమాలు చెయ్యాలనీ కనీసం తనలోని నటుణ్ణీ, డాన్సర్ నీ పూర్తిగా చూపించే సినిమా చెయ్యాలని ఒక మెగాభిమానిగా నా కోరిక]

ఆడియో ఫంక్షన్ లో మా అన్నయ్య సిరంజీవి "ఆరెంజ్ లో మిస్సయినవన్నీ ఇందులో ఉంటాయన్నాడు"నిజంగా సత్య హరిచ్చంద్రుడే... అవును...
ఇందులో నాటు బీటు పాటలున్నాయ్, ఫైటింగులున్నాయ్, సెన్సార్ కట్టయిన డైలాగులున్నాయ్, వాన పాటలున్నాయ్, ఆ పాటలకి "సింగరేణుందీ..బొగ్గే నిండిందీ.." లాంటి గొప్ప సాహిత్యం ఉందీ.
అరడజను ఇలన్లున్నారు. హీరో చేత నరికించుకోడానికి వందలమంది జనాలున్నారు.ఆఆఅ.. మరిచిపోయాను.. U/A సెర్టిఫికేట్ కూడా ఉంది.


ఇంకేం కావాలీ?? మేం కోరుకునేవి ఇయ్యే... మేము తెలుగు సినిమా ప్రేక్షకులం.. పిచ్చోళ్లం...

హిట్.. హిట్.. సూపర్ హిట్.... బంపర్ హిట్...  హండ్రెడ్ డేస్ పక్కా....
రచ్చ..  మొదటి రోజు కలెక్షన్లు...  ఇన్ని కోట్లు...
మొదటి వారం కలెక్షన్లు.... అన్ని కోట్లు...
నాలుగు వారాల టోటల్ గ్రాస్... అప్ప్పుడు చెప్తాలెండి.  అప్పటిదాకా ఉంటే.


మా నెక్స్ట్ ప్రోజెక్ట్స్... ట్రయిలర్స్....

దమ్ము..... ప్రచండ చండ మార్తాండ తేజా.. రాజాధి రాజాధి రాజా....

ఈగ... గుయ్.య్ య్య్య్య్య్య్య్య్య్య్.... 1 నిన్ను చంపటం.. 2 నిన్ను చంపటం.. 3..4..5.....9 నిన్ను చంపటం.

గబ్బర్ సింగ్... నాక్కొంచెం తిక్కుందీ... కానీ దానికో లెక్కుందీ..

ఈ ఎండాకాలం ఇరగదీసుడే.....!