Monday, June 27, 2011

ఈటీవీ సుమనుడి తాజా పైత్య ముత్యం "మమత" : కెవ్యూ


పిచ్చెక్కిన ప్రజలారా..! సుమన్ అభిమాన పిశాచులారా..! రండో..రారండో...  సుమనుడి తాజా పైత్యం "మమత" కెవ్యూ ( రివ్యూ కాదు ) చదివి తరించి హరించబడండీ.
పేరుకొత్తగా ఉందేంటీ? లేడీ ఓరియంటెడ్ స్టోరీనా? అనుకుంటూన్నారా?? హహహహ్.. "ఐ లవ్యూ డాడీ" కి ఇంకో వెర్షన్ ఇదీ.. (సుమన్ క్యారెక్టర్, అమాయకత్వ్యం ,మంచితనం, గొప్పతనం అలాగే ఉన్నాయ్, మిగిలిన క్యారెక్టర్లూ, వాటి పేర్లూ మారాయి అంతే..) ఎప్పటి లాగానే.. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పీ మన చెప్పెట్టుకొనీ మనల్నే కొట్టుకోవలనిపీంచే వందల పేజీల డవిలాగులూ..జీడిపాకం సాగినట్టూ సాగే సీన్లూ డిస్కషన్లతో అబ్బో.. అద్భుతం గా సాగిందీ... మొత్తమ్ రాయాలంటే నా నెక్స్ట్ బర్త్ ఉండదు నాకు.. వీలయినంత టూకీగా చెప్తాను వినుకోండీ.. 

ఈ టెలీఫిల్మ్ చూస్తాను అనగానే మా ఫ్రెండ్ "రివ్యూ రాయడానికి ఇంతకి దిగజారతావా? ఈ దారుణాన్ని ఎలాగయినా ఆపుతాను మోనిటర్ బద్దలుగొట్టయినా సరే" అని ఆవేశం గా అరవటం తో వాడిని రూమ్ లో పెట్టీ, బయట గెడపెట్టీ, హాల్ లోకొచ్చీ వాల్యూమ్ ఫుల్ గా పెట్టీ కూర్చున్నా..


ఈ సారి ప్రార్ధనా గీతాన్ని మిస్సయ్యాను. కాబట్టీ గుర్తున్న వాళ్ళంతా లేచి నించొని పాడెయ్యండి.

మమత మొదలయ్యింది ఇలా..!


అనగా అనగా క్లాస్ లు జరగని, ఒకే ఒక లేడీ లెక్చరర్ గల ఒక కాలేజ్ లో కలర్ తక్కువ, కళ ఎక్కువ ఉన్న హీరోయిన్ మమత ని "ఆపరేషన్ దుశ్శాసన" సినిమాకి వెళదాం అని వారం రోజుల నుండీ వాయించేస్తూ ఉంటాది.
మమతేమో.. "లేదూ.. నాకు తెలుగు లో మార్కులు సరిగా రావటం లేదు.. మన భారతీ మ్యాడమ్ దగ్గరకెళ్ళి స్పెషల్ క్లాసులు చెప్పించుకుంటానూ..నువ్ లైబ్రరీ లో లేతగా కనిపించిన కుఱోళ్లకి లైనేస్కో" అని సమ్మగా సలహా ఇచ్చేసెళ్ళి పోతుందీ.

కేమేరా.. తెరచి ఉంచబడిన ఒక తెలుగు పుస్తకమ్ మీదకి ఫోకస్ అవుతుందీ. పేజీలు స్లోమోషన్లో తిప్పబడుతూ ఉంటాయి. ఎరువు తెచ్చిన అరువు కళ్లద్దాలు పెట్టుకొనీ ఒకనాటి మేటి టీవీతార "కృష్ణశ్రీ" ఊఊఊ చదివేస్తూ ఉంటాది.

మమతః మ్యాడమ్.. నాకు అన్ని సబ్జెక్ట్స్ లోనూ అరవైకి పైన వస్తుంటే, తెలుగు లో థర్టీకి తక్కువ వస్తున్నాయ్. మీరే నాకు ఎక్స్ప్లైన్ చెయ్యాలి. అయినా ఈ పద్యాలూ, ప్రతిపదార్ధాలూ, వ్యాకరణాలు, గ్రామకరణాలు, చెకోడీలూ చందస్సులూ ఈ రోజుల్లో ఏం ఉపయోగపడతాయ్?
భారతీ మ్యాడమ్ః  వాటి గొప్పదనం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావ్. సుమన్గారు రాసిన సుమనోహరాలు విని కూడా నువ్వీమాట ఎలా అనగలుగుతున్నావ్? పద్యాలూ, ప్రతిపదార్ధాలూ పానకం చేసి నీ చేత తాగించేసీ, చందస్సు చెవిలో ఊదేసే బాధ్యత నాదీ..
ఏదీ నిన్నటి పద్యం అప్పజెప్పూ..!
మమతః  "అంతరంగాలూ......(టిరడిర...టిరడిర) అనంత మానస చదరంగాలూ...ఆ..ఆ...ఆ"
           "అంతే తెలియని ఆలోచనలా సాగరాలు..."


భారతీ మ్యాడమ్ః వావ్.... అరుపు..పరుపు..కురుపు.. సూపరు.. సుమనూ...!
మమతః అలాగా..! అయితే ఈ సంగతి ఇప్పుడే మా డాడీ కి చెప్తాను.. you know one thing madam..? i love my daddy very much. he is my best friend.he is great, greater, greatest.Worst..
(తెలుగు సీరియల్ లో ఇంత ఇంగ్లీషా? అనుకుంటున్నారా? హిహిహి సుమన్  స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లకి వెళుతున్నాడటా.. ఫలితంగా ఇంగ్లీష్ ఏరులై పారిందీ)
భారతీ మ్యాడమ్ః నీ సోది సిల్క్ గుడ్డలో కుక్కీ శీకాకుళం పార్శిల్ చెయ్యా.. ఎప్పుడూ నీ బాబు గురించి చెప్తూ బాదేస్తూ ఉంటావ్.! మీ అమ్మగారి గురీంచి చెప్పవేమిటీ?

 ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో బాంబులు పేలినట్టూ మ్యూజిక్ దద్దరిల్లి పోతుందీ..

మమత నల్లులు కుట్టినట్టూ లేచి నించొనీ " plz Dont ask about her. ఆవిడ గురించి అడగొద్దూ..i hate her. నాకు అసహ్యం...  వస్తాను"  అని లైబ్రరీకి పోతుందీ.
అక్కడ ఫ్రెండేమో బీటెయ్యడానికీ, బిల్లు కట్టడానికీ బకరాలెవ్వరూ దొరకలేదని బాధ పడుతూ..లేటయ్యినందుకూ
గేదె గొంతేసుకొనీ కాసేపు మమతని తిడుతుందీ. మమత "మా నాన్న సుమన్" అని మొదలెట్టడంతో " మీ నాన్న చాలా గొప్పల గోవిందయ్యంట కదా.. పిచ్చెక్కిన సైకియాట్రిస్ట్ అంట కదా.. పేషెంట్లని ఇంట్లో పెట్టుకొని మరీ
బలవంతంగా ట్రీట్మెంట్ పేరుతో పీడిస్తాడట కదా.." అని రివెర్స్ గేర్ లో తగులుకొనీ మధ్యలో వాళ్లమ్మ టాపిక్ తీసుకొస్తుందీ. వెంటనే మమతకి B.P బాగా పెరిగిపోయీ  ఇందాక భారతీ మ్యాడమ్ దగ్గర వేసిన క్యాసెట్ మళ్ళీ వేసీ "ఆ రాక్షసి గురించీ నా దగ్గర మాట్లాడకు. నా చిన్నప్పుడే
నన్నూ, మా నాన్న ని అనాధల్ని చేసీ తన సుఖం కోసం వేరే వాడితో లేచిపోయిందీ... (*%&#$%(*$#& మార్తాం(*(*$#శర్మ=సిగ్గు)@(*#$ " అని చెప్తూ ఉండటంతో ఆ దరిద్రాన్ని వినలేకా మళ్ళీ మీ నాన్న చాలా గొప్పోడూ అని  సోపేసీ ఇంటిదగ్గర కార్లో డ్రాప్ చెయ్యమంటుందీ.

మమతః పద.. కార్లో కూర్చొ..
ఫ్రెండ్ః కార్లో కూర్చోకుండా నించుంటారా? మార్తాండ కధలు మీ నాన్న చేత సినిమా తీయించా..!

******************************************************
......హీరో ఇంట్రడక్షన్....
తలకాయకి తీసిన ఎక్స్రే మీద తల వెంట్రుకలు లెక్కపెడుతూ ఒక చెయ్యి కనిపిస్తుందీ... ఆ చెయ్యి నల్ల చొక్కాకప్పబడిన వీపు చూపిస్తున్న వింత మనిషిది. నెమ్మదిగా కెమేరా వెనక నుండీ ముందుకు రోలవుతూ సగంలో ఆగిపోతుందీ.. హఠాత్తుగా.. (నేపధ్య సంగీతం హోరెత్తి పోతూ ఉంటాది)
ముఖం నిలువు కోత కి కలర్ పోటో....ఎడమకన్ను... కన్ను కవర్ చేస్తూ సగం కళ్ళజోడూ.. మెరుగులుగల నల్లటీ మీసం నెత్తిన దట్టమయిన విగ్గు.   కుడికన్ను క్లోజప్ లో..
ము.ని.కో. కలర్ పోటో..  కుడీ కన్నూ... ఎక్స్రే మీద కుడీచెయ్యి... ము.ని.కో. కలర్ పోటో..  కుడీ కన్నూ... ! ఎనకాల బ్యాక్ గ్రౌడ్ అదిరిపోతూ ఉంటాది.. మండుటేండ లో పిడుగు పడ్డట్టూ అరివీర భయంకరం గా సుమనోహరుడి దివ్య మంగళ స్వరూపం..
సుమన్ వెనకాల స్క్రీన్ మొత్తం నల్లగా మారిపోతుంది... కళా విహీన, కళా కర్కశ, కళా మర్కట.. నటనా వైకల్య్త, గార్ధభ వాచస్పతి "సుమన్"... "SUMAN".. "सुमन"...!

******************************************************

ఎదురుగా విధి సీరియల్ అయిపోవటం తో నమ్మలేకా, తట్టుకోలేక కోమాలోకి పోయిన ఒక పేషేంట్, తండ్రిగా పక్కనే పదిపైసలకి రూపాయ్ ముప్పావలా యాక్షన్ చేస్తూ సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.
పేషెంట్ తండ్రిః సార్.. మీరు మనిషా? చిన్నిక్రిష్ణా? పేషేంట్లదగ్గర అన్నిరకాల టెస్ట్లకీ డబ్బులు లాగే బుద్ధున్న డాక్టర్ లని చూశాను గానీ.. తిరిగి డబ్బ్లు పెట్టీ, మనిషిని ఇంట్లో పెట్టి వైద్యం చేసే బుద్ధి లేని సైకో డాక్టర్ ని మిమ్మల్నే చూశాను. మీరు నిజంగా దేవుడూ బాబుగోరూ..దేవుడూ..!
సుమన్ః      ట్రేడ్ మార్క్ చిరునవ్వు.. ఇందులో నేనేం చేశాను? i love my proffession. పైగా నా దగ్గరకి పేషెంట్స్ ఎవరొస్తారు చెప్పండీ? వచ్చినోళ్ళకి నేను రాసిన కధలు  విన్పించీ, తీసిన సీరియళ్ళు చూపించీ పీడించాలంటే ఇదొక్కటే మార్గం.
పేషెంట్ తండ్రిః  మీరు అంతకు తెగించిన అసాధ్యులే దేవరా..! నాకు తెలిసిన ఒక వ్యక్తి మీలాగే లేడీ ఓరియెంటేడ్ కధలు రాస్తూ ఉంటాడు. మీ నెక్స్ట్ సీరియల్ టైటిల్ సాంగ్ కి అతను మొన్న గ్రహణం నాడు పాడిన పాటని పెట్టుకుంటారా?
సుమన్ః      హహహ... అలాగే తప్పకుండా.. కావలిస్తే నేనూ గొంతు కలుపుతాను. అది సరే గానీ ఇదిగో నేను ప్రిస్క్రైబ్ చేసిన మందులు స్నేహ సీరియల్ టైటిల్ సాంగ్ వింటూ  ప్రియా పచ్చడి తో కలిపి పూటకి పావుకిలో చొప్పున జుట్టుకు రాస్తూ ఉండండీ. పిచ్చి పెరగకుండా ఉంటాది. పెద్ద కాస్ట్లీ కాదు.
    కుదరకపోతే చెప్పండీ నేనే పంపిస్తాను. అవసరమయితే అర్ధరాత్రయినా కాల్ చేయండీ నాకేమన్నా పనా పాటా?

పేషెంట్ తండ్రిః  అమ్మమ్మా.. మీరు మరీ అంతకి బరితెగించొద్దు.. మా మందులు మేమే కొనుక్కుంటాం. ఏది ఏమయినా మీరు ఈటీవీ దేవుడు సార్. ఆ దరిద్రుడు ఓంకార్ గాడు మీముందు అప్పుడే గోకిన గుండు తో సమానం..
సుమన్ః      పళ్ళు కన్పించకుండా బూరెల్ల్లాంటి బుగ్గలు పొంగడాల్లా పొంగేలా చిరునవ్వు.

వాళ్ళు వెళ్ళిపోయాకా....!
సుమన్ ఏకపాత్రాభినయం... బిగిన్స్...

"ఏమిటీ రోజూ.. మమత ఇంకా రాలేదూ.. సాయత్రం ఆరున్నర అయిపోతుందీ... ఏమ్ చెయ్యాలి ? " అని కాసేపు అటూ ఇటూ తిరిగీ పోన్ వైపు స్లోమోషన్ లో చూసీ కాలేజ్కి ట్రై  చేస్తాడు.(పాపం కూతురుకి కార్ కొనిచ్చీ, సెల్ ఫోన్ కొన్నివ్వలేని కటిక దారిద్ర్యం)
"చ్చీ.. చీ.. ఎదవ ఫోనూ.. వెధవ కాలేజూ.. ఎప్పుడూ రింగవ్వదూ.. అయ్యినా ఎవ్వరొ తియ్యరూ...ప్రభాకర్ ఉంటే ఇలా జరిగేదా?" అని కుర్చీ లో కూర్చొని కళ్ళు మూసుకొని బాధ పడుతున్నట్టూ నటీస్తున్నాను అనుకుంటాడు.
ఇంతలో మన చిలిపి మమత మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ వెనకనుండీ వచ్చీ కళ్ళు మూస్తుందీ.. (వెనకాల ఆనందభైరవి రాగమ్ లో వీణ వాయించబడుతూ ఉంటుందీ)

సుమన్ః
ఏమిటమ్మా ఈ ఆటలూ.. నీ గురించి ఎంత కంగారు పడ్డానో తెల్సా?
మమతః కంగారు దేముంది డాడీ.. ఖాళీ గా ఉన్నప్పుడు పడుదువు గానీ. అయినా నీకిదేం రోగం? నీలాగా కాకుండా నాకు బుఱ లో బ్రెయిన్ అనే పదార్ధం ఉండటం వల్లా తలనొప్పి వస్తుందీ.. నువ్ కలిపిన కాఫీ తాగితే తలనొప్పి ఎగిరిపోతుందీ.. వెళ్ళిపట్రా.. 
సుమన్ః ఇది నయమయ్యే రోగం కాదులే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది (ఎయిడ్స్ లక్షణాల్లో ఇది కూడా ఉందా? ). అయినా నేను కలిపిన కాఫీ తాగితే లేని తలనొప్పి వస్తుందీ తెలుసా? (కాఫీలో ముల్తానా మట్టి ఏమన్నా కలుపుతాడేమో?)

కాసేపు సీన్ ని బాఆఆఆఆఆఆఆగా సాగదీశాకా(ఓ నాలుగు పేజీల డవిలాగులు) .. కాఫీపెట్టడానికి వెళతాడు.

**********************************************************
కట్.. చేస్తే....

సుమన్ ఈ ఎండాకాలం లో దళసరి దుప్పటి కప్పుకొనీ కడుపుతో ఉన్న దున్నపోతులాగా నిద్రపోతూ ఉంటాడు. "ఒక సినిమాని ముప్పైగంటల నిడివి తో తీసినందుకు గానూ గిన్నీస్ బుక్ లో తన పేరు రాస్తున్నప్పుడూ పెన్ లో ఇంకయిపోయినట్టూ" పీడకలొచ్చినట్టూ
ఏ ఎక్స్ప్రెషనూ లేని ఆ మొద్దుమందారం లాంటి మొహం చిత్ర విచిత్రమయిన సంకోచ వ్యాకోచాలకి లోనవుతుందీ.. ఎవరో అరికాలు మీద అట్లకాడతో వాత పెట్టినట్టూ లేచీ "నా సీరియల్ నా ఇష్టం నేను ఏడుస్తా.." అని ఏడవటం మొదలెడతాడు.

జరగబోయే ఈ సెంటి"మెంటల్" సీను ని సున్నిత మనస్కులు చూడకూడదని తెలియజేయడానికి సిగ్గుపడుతున్నాను.

మమతః what happend daddy? why r u crying?
సుమన్ః నీకు పెళ్లయ్యి, అత్తవారింటికి వెళ్ళిపోయినట్టూ కలొచ్చిందీ. అప్పుడు నేను ఇంతపెద్దింట్లో ఈగలు తోలుకుంటూ ఉండాలి. అందుకే ఇల్లరికం వచ్చే అల్లుడినే వెతుకుతా నీకోసం.
మమతః కూతురు పెళ్ళయ్యిందని కలొస్తే కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకునే శాల్తీని నిన్నే చూస్తున్నా. నాకు పెళ్ళీ వద్దూ పెనాయిలూ వద్దూ...
సుమన్ః (విషాద వదనంతో.. గద్గద గాడిద స్వరంతొ..) నువ్ లేకుండా నేను ఉండలేనమ్మా.. నాకు నువ్వూ.. నీకు నేనూ.. అంతే.. (అదేమిటో గానీ శిలావిగ్రహానికి డబ్బింగ్ చెప్తున్నట్టూ సుమను వారి నోరు మాత్రమే కదులుతుందీ)
సుమన్ +  మమతః వాఆఆఆఅఆఆఆఆ......  వాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ.....
[మా ఫ్రెండ్ : దబ దబా తలుపు బాదేస్తూ.. ఒరేయ్.. ఆపరా.... తలుపులు తియ్యి.. ఆ డవిలాగులు భరించ లేక పోతున్నా.. ఆపకపోతే నీ లాప్టాప్ని మడతెట్టీ కిటికీ లోనుండీ పారేస్తా.. ]**********************************************************

కాలేజ్ లో... భారతీ మ్యాడమ్ మమత కి అర్ధ రాత్రి రెండింటివరకూ నిద్రపొకుండా రాసిన తెలుగు మెటీరియల్ ఇస్తుందీ. తను ఒంటరి దాన్ననీ ఎవరూ లేరనీ చెప్పటంతో మమత ఆనంద భాష్పాలు + కన్నీళ్ళు మిక్స్ చేసి డ్రాప్ చేసి థాంక్స్ చెప్తుందీ.

**********************************************************
ఇక్కడ నుండీ ప్రజలారా సీన్ లో కనిపించిన ప్రతీ క్యారెక్టర్ అయితే అరుస్తూనో లేకుంటే వికారంగా ఏడుస్తూనో ఉంటాది.

ఇంటీకొచ్చేసరికీ.. సుమన్ తన సైజుకి తగ్గ కుర్చీలో కూర్చొని మళ్ళీ ఏడుపు మొహం పెట్టీ వికారంగా ఏడుపు నా జన్మ హక్కూ అన్నట్టూ అరవై ఏళ్ళొచ్చిన అముల్ బేబీ లాగా ఏడుస్తూ ఉంటాడు.

మమతః మళ్ళీ ఎందుకు డాడీ ఏడుస్తున్నావ్.. నువ్ అలా ఏడుస్తుంటే... I am feeling like crying.
సుమన్ః ఈ రోజు నవంబరు 5. నాకు బ్లాక్ డే.. ఇందా.. ఈ ఉల్లిపాయ ముక్కలు తీస్కో.. కళ్ళమీద పెట్టుకో.. నా లాగా..
మమతః నా ఏడుపు తర్వాత .. ముందు నీ ఏడుపు ఎందుకో ఏడు.
సుమన్ః నా గతం నన్ను పీడిస్తుందీ. ఈరోజు మీ మమ్మీ నన్నొదిలేసిన రోజు. ఇంకోటీ కూడా ఉందీ. మీ అమ్మ రెండో పెళ్ళి జరిగిన రోజు కూడా ఇదే. సాంప్రదాయాల్నీ, సమాజ కట్టుబాట్లనీ తుంగలో తొక్కీ (నిన్ను తొక్కాల్రా ముందూ) రెండో పెళ్ళీ చేస్కుందీ. నీ చిన్నప్పుడూ ఇదే రోజు నీ ఆరోగ్యం బాగోలేదూ.. వచ్చి చూడమని బతిమాలితే వాళ్ళాయన ఇంటికొచ్చే టైమ్ లో వచ్చి మూడ్ చెడగొట్టోద్దనీ మొహం మీద తలుపేసేసిందీ.  అది మనిషి కాదు పశువు (మరే.. అందుకే వీడిని చేస్కుందీ). i loose control over myself. atleast i can share with you now.
(మొహానికి మసి పూసుకొనీ మూగగా రోదించే వాడిలాగా ఫేస్ పెట్టీ).

మమతః అసలిదంతా ఎలా జరిగిందీ?
సుమనుః నేను 24 గంటలూ  మీ అమ్మని మోడల్ గా పెట్టీ అందమయిన బొమ్మలేసీ ఆమెకే చూపించేవాడిని. కానీ నా బొమ్మలని అసహ్యించుకొనీ, ఎవరో  ఇస్త్రీ వాత పైత్యకధారచయిత కి అట్రాక్ట్ అయి, తర్వాత అడీక్ట్ అయ్యీ, ఫైనల్ గా ఎలోప్ అయ్యిందీ. 
దానికి మన మమత " Life is precious Dad.. అంటే తెలుసు కదా.. నిజంగా She should feel shame about herself & U should celebrate.
"Life is a flow"- జీవితం ఒక ప్రవాహం " (ఇది కేక డవిలాగ్) అని ఊఊఊ స్పీచ్ దంచేసీ.. రూం లో కెళ్ళీ ఒక లేడీ బొమ్మ గీసీ దానిమీద "నా తల్లి రాక్షసి" అని రాసి (ఐ లవ్యూ డాడీ గుర్తొచ్చిందా???)
"You.. Dirty bitch.. donkey.. monkey.. animal.. you will bare for it" అని నానా బూతులూ తిట్టేసీ, దాని మీద క్రాస్ చేసీ, కాలికిందేసి తొక్కీ, ముక్కలు ముక్కలు గా చించేసీ.. అగ్గిపుల్ల రంగదీసి కాల్చేస్తుందీ.. (అబ్బో..ఇలా బూతులు తిట్టే సీన్లు రెండు మూడున్నాయ్.)

*********************************************************
మమతకి తెలుగులో మంచి మార్క్స్ వచ్చేసీ అందుకు గురుదక్షణ గా గిఫ్ట్ ఇవ్వడానికి భారతీమాడమ్ ఇంటికెళుతుందీ.. (ఇక్కడేం జరిగిందీ అన్నదే ట్విస్ట్ అన్నమాట)
*********************************************************


సుమన్ ఒక "బాల గజినీ" ని వీల్ చైర్ లో ఇంటీకి తీస్కొచ్చీ మమత కి పరిచయం చేస్తాడు. ఆ గజినీకి ఎవరూ లేరనీ, ట్రీట్మెంట్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాడనీ అంటాడు. వాడేమో ఏదడిగినా తల అడ్డంగా ఊపుతాడు. వీడు అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగి చికాకు పెడతాడు వాణ్ణి కాదు మనల్ని.  మూడు నెలలకి గజినీ రజినీ లాగా అవుతాడు. తన కొడుకు గా ఇంట్లోనే ఉంచేసుకుందామ్ అనుకునేంత లో పిల్లాడి తల్లి సుమన్ దగ్గరకి వస్తుందీ తీస్కెళ్ళిపోడానికి.

ఇదే ట్విస్ట్.. ఆ తల్లి ఎవరో కాదు.. మమత వాళ్ల భారతీ మ్యాడమ్..... మరియూ సైకో డాక్టర్ శరత్ చంద్ర (మన సుమనే..) మాజీ భార్య. (వీడి ట్విస్ట్ తగలడా.. మనకి ఫస్ట్ సీన్ లోనే అర్ధం అయిపోతుందీ.)
మాజీ భార్య ని చూడగానే సుమన్ లోని ఎమోషనల్ దెయ్యం నిద్ర లేస్తుందీ.. గొలుసు తెగిన కుక్క లాగ కేకలేస్తూ,  నిగ్రహాన్ని కోల్పోయి, ఆగ్రహం తో ఊగిపోతూ  తోక తెగిన డైనోసార్ లాగా అరుస్తూ...  "నువ్వెందుకొచ్చావ్ ఇక్కడికీ? I dont want to see ur dirty face. just getout"
ఆపకుండా ఆయాసపడుతూ తిడతాడు. [రౌద్ర రసాన్ని ఏమాత్రం కరుణ లేకుండా  కురిపించాడు  ] చిత్రం గా భారతీ మ్యాడమ్ నన్ను కాదు అన్నట్టూ అక్కడె నిలుచుంటాది.


సుమన్ః మమతా.. ఎలా చెప్పాలి నీకూ? ఈ మహా తల్లే నీతల్లి. నాకు "భయంకరమయిన అసహ్యం" (కొత్త రకం ఫీలింగ్ కదూ..!), ఈ పిశాచి వల్లే " జీవచ్చవం లా జీవనం కొనసాగిస్తున్నాను" (ఇదెలా సాధ్యం??). ఈ పిశాచి అంటే నాకు చాలా కోపం తో కూడిన మంటా.. ( దొంగకోడి ని వండుకు తినేసీ, ఈకలెక్కడ దాయాలో తెలీని వాడిలాగా ఫేస్ పెట్టీ )
అదోరకమయిన డవిలాగులు చెప్తాడు.

ఇక్కడ నుండీ ట్విస్ట్ లే ట్విస్ట్ లూ... (కొన్ని వందల పేజీల రిపీటేడ్ డవిలాగులుంటాయ్..అన్నీ రాస్తూ కూర్చుంటే ... యుగాంతం అయ్యే టైమొచ్చేస్తుందీ;) )

భారతి మ్యాడమ్ తన తల్లే అని ముందే తెలుసనీ, వాళ్ళింట్లో ఉన్న బాల గజిని వాళ్ళబ్బాయే అని, అసలు సుమన్ ద్వారా కి తెలియకుండా ఆ పిల్లాడిని ఇంట్లో పెట్టించింది తనే అని చెప్తుందీ మమత.
సుమన్ః "నేను కధా, మాటలూ, పాటలూ రాసీ, బొమ్మలేసీ, నిర్మించి, నా దర్శకత్వ పర్యవేక్షణ లో నేనే హీరోగా చేసిన సీరియల్ లో నాకు తెలీకుండా ఇన్ని ట్విస్ట్ లా?" ( నేను ఇంత వెఱి పీనుగ నా? అన్నట్టూ ఫేస్ పెట్టీ )
మమతః "భారతీ మ్యాడమ్ ఇప్పటికే "పశ్చాత్తాపంతో రగిలి పోతుందీ"(కొత్తగా ఉంది కదా? సుమన్ కలానికి పదునెక్కువ) ఆవిడ భర్త అప్పుడే చనిపోయాడూ.. నువ్ నీలో ఉన్న ప్రేమికుణ్ణి నిద్రలేపూ.. సుమన్ లా కాకుండా మనిషిలా ఆలోచించూ.. ప్రేమ కు ఎంతో శక్తి ఉందీ.. అన్నిటికన్నా గొప్పది ప్రేమ. దానితో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కూడా గెలవచ్చు. "
    FYI.. నేను మా కాలేజ్ లో ఒకడిని గోకుతున్నాను. వాడిని ఇల్లరికం రమ్మంటే ఎల్లెహే అంటాడూ. వాడితో  ఎత్తెయ్యడానికి జెండా కూడా సిద్దం చేస్కుంటున్నా.. "ఈ వయసులో నీకు, అమ్మకీ తోడు అవసరం. మీ కన్న కొడుకు కి మీ ప్రేమ అవసరం  (*$#%&*($&%$#(*%&()విమోచన $&రమణీయ%(*$&#*%&$(*&%$. నవ(*$#@మందార)౫చెరశాల పైత్య౧౨౭౪౦వితంతు($@+రెల్లివీ($/ " అని చెప్పీ డబ్బాడు జండూబామ్ గ్లాసుడూ నీట్లో కలిపీ సుమన్ చేత తాగిస్తుందీ.
బామ్ ఒక్కటే అయినా పనులు మూడు కాబట్టీ. సుమన్ మూడ్ మారిపోయీ...

సుమన్ః అవునమ్మా... నేనెంత ఎదవనో నాకిప్పుడే తెలిసిందీ.. మమతని పంచీ సార్ధక నామధేయురాలివి అనిపిమ్చుకున్నావ్. ఎంత గొప్పగా ఆలోచించావ్? I am proud of u.
(మనసులోః దీనెంకమ్మా జీవితం... దీని పెళ్లి కోసం మా ఆవిడకి మూడో పెళ్ళి నాతో చేస్తుందా? పైగా దాని రెండో పెళ్ళయ్యాక పుట్టినోడీని నాకు కన్నకొడుకు అంటుందా? వాఆఅ.. అహ్హాహ్హ్హా....వాఆఆఆఆఆ అహ్హాహాఅ...)

కూతురు దిద్దిన కాపురం తో కధ సుఖాంతం (మన సుఖం అంతమవుతుందీ) అవుతుందీ


LOVE IS UNCONDITIONAL & UNIVERSAL

ఎండ్ టైటిల్స్...


Wednesday, June 22, 2011

పునాది రాళ్ళు


పునాది రాళ్ళు పడ్డాయి.
చిరునవ్వుల చిన్నారుల బంగారు భవితకి...
మీకు మేమున్నాం అని భరోసా ఇవ్వడానికి...
సంస్కారం గల మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది ఈ సమాజానికి అందివ్వడానికి..
ఒక మంచి పనికోసం సొమ్మునీ, సమయాన్నీ వెచ్చించిన దాతలు పెట్టుకున్న నమ్మకానికీ...
తనతో పాటూ తన చుట్టూ ఉన్నవారిని సేవా ప్రపంచం లో తీసుకెళదామన్న మంచి మనసున్న  ఒక మామూలు వ్యక్తి యొక్క గొప్ప ఆశయానికి……. పునాదిరాళ్ళు పడ్డాయి.గత సంవత్సరం నవంబరు లో జీవని ని మొదటిసారి విజిట్ చెయ్యడానికి వెళ్ళాం. అప్పటికి పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు జీవని సంరక్షణ లో.   వచ్చే సంవత్సరానికల్లా వంద మంది  పిల్లలకి మంచి
విద్యనీ, వసతినీ ఏర్పాటు చెయ్యడానికి జరుగుతున్న ప్రయత్నాలనీ, అవరోధాలనీ  ప్రసాద్ గారు వివరించారు. అసాధ్యం కాకపోయినా అనుకున్నంత సులభం కాదు కదా...మరి!
వాటన్నిటినీ అధిగమించీ జీవని విద్యాలయానికి శంఖుస్థాపన చేసే రోజు రానే వచ్చింది జూన్-19-2011 న.అదృష్టవశాత్తూ ఈ సంధర్భంగా పూజ్యులు శ్రీ చిలమకూరు విజయమోహన్ గారినీ, స్నేహితులు ఒంగోలు శ్రీను గారినీ, తెలుగు బ్లాగ్స్ రీడర్ అయిన చంద్రశేఖర్ గారినీ మొదటిసారి కలవటం జరిగిందీసారి. ముఖ్య అతిధి గా విచ్చేసిన శ్రీ మాంచూ ఫెఱర్ గారు, జీవని స్వచ్చంద సంస్థ కి వెన్నుదన్ను గా నిలిచి ప్రసాద్ గారికి తన సహాయ సహకారాలు అందిస్తున్న SRIT కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ సాంబ శివారెడ్డి గారూ, మానసిక విశ్లేషకులు ఆకెళ్ళ రాఘవేంద్రగారూ,
తెలుగు బ్లాగర్ల తరుపున తన గొంతు వినిపించిన శ్రీ ఒంగోలు శ్రీను గార్లు చెప్పిన నాలుగు మంచి మాటల్ని వినే అదృష్టం దక్కింది.

జీవని ప్రసాద్ గారు మాట్లాడుతూ.. " మీ చుట్టూ ఉన్నవాళ్లలో సహాయం కోసం ఎంతో మంది చూస్తూ ఉంటారు. మీ టైం లో 1% , మీ డబ్బు లో 1% వారికి కేటాయించండి చాలు " అన్నారు.
 1% నా? నేనిచ్చే 100 రూపాయలు జీవితాల్ని నిలబెడతాయా? అని అనుకుంటున్నారా నాలాగా? అవును నిలబెడతాయి. నా లాంటి వాళ్ళు 100 మంది ఏకమయితే ఖచ్చితం గా నిలబెడతాయి.  జీవని విషయం లో జరిగింది అదే.
ఒక్కరి ఆలోచన కొందరి ఆచరణ గా మారి మనందరినీ తమలో కలుపుకుపోతూ మహా వృక్షమయి నీడనిస్తుందీ.

ఈ బృహత్కార్యం లో తమ కాలేజ్ ఫ్యాకల్టీనీ, విద్యార్ధులనూ భాగస్వాములుగా చేసిన సాంబ శివారెడ్డి గారు మాట్లాడుతూ "ఆర్ధిక సహాయం చెయ్యడానికి చాలా మంది ఉన్నారు.  మీ సమయం లో 1% మాత్రం ఇవ్వండీ చాలు . సంవత్సరంలో ఒక్క రోజు లో కొన్ని గంటలు ఆ పిల్లలతో గడిపి వెళ్ళండీ. మాకోసం చాలా మంది ఉన్నారూ.. మేము ఒంటరి వాళ్ళం కాము అనే ఫీలింగ్ ని కలిగించండీ " అని.
నిజమే కదా..! ఎంతయినా డబ్బుకన్నా విలువయినది కదండీ కాలం.!

RDT ద్వారా అనంతపురం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మాంచూ ఫెఱర్ గారి ఉపన్యాసం నాకు చాలా చాలా నచ్చింది. ఆయన స్టేజ్ మీద కూర్చొని వక్తలు మాట్లాడుతున్నప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ ఉంటే
"ఇతనికి ఏమ్ అర్ధమవుతుందబ్బా?" అనుకున్నా..!
మైక్ తీసుకొని "సభ కు నమస్కారం" అనగానే ఈ ఒక్క ముక్కా నేర్చుకొచ్చుంటారు అనుకున్నా..! (ఇంగ్లీష్ లోనో, స్పానిష్ లో మాట్లాడతారని నా స్ట్రాంగ్ ఫీలింగ్).
ఆ తరవాత సీమయాస లో తప్పులు లేని తెలుగు లో సాగిన ఆ ప్రసంగానికి నోరుతెరచి చూస్తూ ఉండి పోయాను. ఆయన తెలుగు లో మాట్లాడినందుకే గాదు.. ఆయన చెప్పిన విషయాలు విని. (వీడియో మిస్సవ్వద్దేం..! :-)  )పిల్లల్నందరినీ అందరికీ పరిచయం చేస్తున్నప్పుడూ ఒక పిల్లాడు అన్నాడు " అమ్మా,నాన్న లేరని నాకు బాధ లేదు.. మీరంతా మా కోసం ఉన్నారు కాబట్టీ " అని. ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలీలేదు నాకు.. మీకో??ఇప్పుడు ఒక కేకలాంటి సంగతి చెప్తా..

ఎవరి పేరు చెప్తే ఒంగోలు మొత్తం ఒళ్ళు విరుచుకుంటుందో..
ఎవరి పేరు చెప్తే కయ్యానికి కాలు దువ్వేవాళ్ల కాళ్ళు వణుకుతాయో..
ఎవరు పోస్ట్ వేస్తే బజ్ లో కామెంట్ల బాక్స్ డిజేబుల్ అవుతుందో..
అతనేనండీ అతనే.. మేమంతా శీనన్నా అని పిలుచుకునే ఒంగోలు శ్రీను అలియాస్ వికటకవి అలియాస్ ఎవర్ గ్రీన్ బాస్. ;) స్టేజెక్కిన తెలుగు బ్లాగర్ల ఖ్యాతి ని చూస్కోండీ ఈ కింద వీడియో ల్లో.. (ఇది అస్సలు మిస్సవ్వద్దూ.. ;)  )

సాయంత్రం పిల్లలతో గడిపిన క్షణాలూ, కొత్తగా చేరిన పిల్లల పరిచయాలు, కమెంట్ బాక్స్ లలో మాత్రమే కనిపించిన స్నేహితులు కళ్ళెదురుగా రావటంతో పడిన ప్రయాసలన్నీ మరిచిపోయి మాట్లాడుకున్న మాటలూ, చిందించిన నవ్వులూ ఎప్పటికీ మరిచిపోలేను. 2011 లో మరిచిపోలేని రోజు నాకు.

   

ఈ కార్యక్రమం గురించి వివరంగా ఇప్పటికే శ్రీ చిలమకూరు విజయమోహన్ గారు రాసి ఉన్నారు. 
ఇక్కడ  చూడండీ.
మరిన్ని ఫొటోలకోసం ఇక్కడ చూడండీ..

Sunday, June 12, 2011

బాబోయ్.. బద్రీనాధ్..!


గధీర లాంటి బ్లాక్ బస్టర్ మళ్ళీ తీసేద్దాం.. భారీ గా బడ్జెట్ పెట్టేద్దాం అనీ, బాక్సాఫీస్ షేక్ చేసేద్దాం అనీ ఆల్రెడీ బన్నీ కి ఒక హిట్టీచ్చిన వినాయక్ ని డైరెట్రు గా పెట్టీ ఎక్కడా రాజీపడకుండా అంతా బాగానే సెట్ చేశాను అనుకున్నాడు బావ అరవిందు. కానీ  క్రియేటివిటీ ని కేజీల్లెక్కన కుమ్మరించే "జీనియస్" రైటర్ చిన్నికృష్ణ గారిని, వారి గొప్ప కలగూర  కధ నీ నమ్ముకోవటం అనేది కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదటం లాంటిదనీ
ఎందుకు తెలుసుకోలేక పోయాడో ఏమో..! ఫలితం గా సినిమాలోనూ, అది చూసే జనాల కళ్ళల్లోనూ రక్తం ఏరులై పారిందీ..కొన్ని సినిమాలకీ రిలీజ్ కి ముందే డైరెక్టరో, మ్యూజిక్ డైరెక్టరో మరొక సన్నాసో కొన్ని హింట్లు ఇస్తారూ.. "ప్రజలారా.. మిమ్మల్ని పీడించడానికి రాబోతున్నాం" అని. ఈ సినిమాకి చాలా ఇచ్చారు.

చిన్నికృష్ణ : ఈ సినిమా స్టోరీ.. ఒక అధ్బుతం. నేను చాలా యేళ్ళుగా నా దగ్గరే ఉంచుకున్నా.. (అనగా.. ఎవ్వరూ తీసుకోలేదు అని.. రీసెంట్ గా అరవింద్ బావ చెవిలో పుచ్చపువ్వు పెట్టుకొని కనిపించాడు ;))
వినాయక్ : ఈ సినిమా స్టోరీ ని అర్ధం చేసుకోడానికే నాకు చాలా టైం పట్టిందీ ( అర్ధం లేని స్టోరీ ని అర్ధం చేసుకోడానికి అంత టైం ఎందుకు పట్టిందో గానీ..?)
కీరవాణి : ఈయన మాటల్లో చెప్పలేదు. పాటల్లో వినిపించాడు. (నా ఉద్దేశ్యం లో ఈ సంవత్సరం వచ్చిన అన్ని ఆడియోల్లోనూ వరస్ట్ సాంగ్స్ ఇవే).
ఇవిగాక.. సినిమా సంతకెళ్ళ బోతుందీ అని చెప్పే 2 నిమిషాల ట్రైలర్.

ఇన్ని హింట్లు చెప్తున్నావ్.. సినిమాకి ఎందుకెళ్ళావ్? అంటారా? కేవలం అల్లు అర్జున్ డ్యాన్స్ కోసం  & ఏదో ఒక మూల పిచ్చి ఆశ. సరే... ఇప్పుడు మీకు  ఈ కహానీ ని 3D లో నేరేట్ చేస్తానూ.. ఎంజాయ్ చెయ్యండి.. (మీ కర్మ బర్న్ అయ్యింది ఈరోజు.)
 
పూర్వ కాలం లో మనదేశం లోని ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలూ నాశనం అయిపోయాయ్ కదా దండయాత్రల వల్ల. అవి ఇంకా కంటిన్యూ అవుతున్న్నయనీ అలాంటివి జరగకుండా నివారించడానికి ఒక ఊరిలో జనాలంతా  చిన్న పిల్లలందరికీ  యుద్ధ విద్యలు నేర్పించీ ఒక సైన్యాన్ని తయారు చెయ్యాలని తీర్మానించీ తక్షశిల లోని ఒక పేద్ద ఫైటర్ దగ్గరకి (ప్రకాష్ రాజ్) పంపుతారు. (నరసింహనాయుడు గానీ శక్తి సినిమా గానీ గుర్తొస్తుందా?? తప్పులేదు హిహిహి అవే సీన్లు ఉంటాయ్ దాదాపుగా).ప్రకాష్ రాజ్ ఏమో కుంగ్ ఫూ పాండా సినిమా లో మాస్టర్ షీఫూ లాగా పిచ్చెక్కించే ఫైటర్ అన్నమాట. 

బద్రీనాధ్ అనే ఒక కుఱోడిలోని టాంలెంట్ ని గుర్తించీ ఈ పిల్లలతో పాటూ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చీ
"బద్రీనాద్" కి క్షేత్రపాలకుడిగా నియమిస్తాడు. బద్రీనాధ్ ఫైటీంగ్ లు బాగా నేర్చుకొనీ శక్తిమాన్ లాగా గాల్లో ఎగిరి పిచ్చి పిచ్చి గా కొఠేస్తుంటాడు అందరినీ. ఇంతలో దైవభక్తి గల ఒక బాగా బలిసున్న తాతగారూ, భక్తి లేకుండా ఆపాదమస్తకం బలుపుండీ,
చూడటానికి బక్క పలచగా ఉండే మనవరాలితో కలిసీ బద్రీనాధ్ వస్తాడు. చనిపోయిన హీరోయిన్ పేరెంట్స్ కి పిండం పెట్టీ హీరోయిన్ ని పడగొట్టీ, ఆవిడగారి  కోసం ఫైటింగ్ లు చేస్తాడు హీరో (మరే.. "పిండం పెట్టిన ప్రేమికుడు" ;) ).
ఆవిడేమో ఒన్సైడ్ లవ్వులో మునిగిపోయీ ఫస్టాఫ్ లో రెండూ, సెకండ్ హాఫ్ లో మూడూ పాటలేసుకుంటాది. నాస్తికురాలు కాస్తా ఆస్తికురాలు అవుతాది. ఇదే టైం లో ప్ర.రా ఏమో హీరోని తన వారసుడిగా చేద్దాం అనుకుంటాడు.అందుకు నిబంధన గా
హీరో ప్రేమకీ, పెళ్ళీకీ,పప్పన్న్నానికీ దూరంగా ఉండాలనీ హీరో పేరెంట్స్ దగ్గర మాట తీసుకుంటాడు. ఇది తెలుసుకున్న హీరొయినూ కొంప మునిగేలా ఉందనీ బ్రహ్మకమలం సమర్పించీ దేవుడికి మొక్కుకునీ, ఆరునెలల తర్వాత బద్రీనాద్ వచ్చి దైవదర్శనం చేస్కుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుందనీ హీరో ద్వారా తెలుసుకోనీ, తనే తన చేత దైవదర్శనం చేయించాలనీ వీరో దగ్గర మాట తీస్కుంటాది. ఈ లోగా దుర్మార్గులయిన ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కొడుకూ హీరోని చంపీ(చంపాం అనుకొనీ), హీరోయిన్ ని బదరీనాధ్ లో కిడ్నాప్ చేసీ బల్లారి తీస్కెళ్లిపోయి, తాతగార్ని చంపేస్తారు. (దేశముదురు సినిమా లా అని పిస్తే నేనేం చెయ్యలేను.).
ఆరు నెలల తర్వాత హీరో హీరోయిన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? లేకా గురువుకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? హీరోయిన్ కోరిక నెరవేరిందా? అనేది క్లైమాక్స్.

అయ్యా... క్లుప్తంగా ఇదీ స్టోరీ..

అల్లు అర్జున్ కొత్త హైర్ స్టైల్, కొత్త గెటప్, డ్రెస్సింగ్ అంతా ఓకే. ప్రతీ సీన్ లోనూ అయితే పరిగెడుతూనో, ఎగురుతూనో ఉంటాడు లేక పోతే కత్తి పట్టుకొనీ నరుకుతూ ఉంటాడు. క్యారెక్టర్ కి అవసరమయినంత వరకూ తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూపెట్టాడు.
 చాలా సీన్ ల లో హింస ఎక్కువ అయిపోవటం వల్ల సెన్సార్ వాళ్ళు కత్త్రిరించేశారు. మాటీ మాటికీ  స్క్రీన్ తెల్లబోతుందీ. బన్నీ డ్యాన్స్ లు మాత్రం ఇరగదీసాడు. ఆ పాటలు విన్నప్పుడు వికారం గా అనిపించాయ్ గానీ చూసేటపుడు తన డాన్స్ వల్ల పర్లేదు
అన్పించాయ్. ఓంకారేశ్వరి (భం భం బోలే సాంగ్ లా ఉంటాది) , ఇన్ ద నైట్, అంబదరీ, కన్ను మూస్తే బద్రీనాద్, పాటల్లో స్టెప్స్ ఉతికి ఆరేసి పాతరేశాడు. కానీ ఇంకా బాగా ప్రెజెంట్ చేసిఉండాల్సిందీ అన్పించిందీ. ఆర్య2 లో కన్నా గొప్ప స్టెప్స్ వేశాడు గానీ 
అంత కిక్ ని ఇవ్వలేక పోయాయ్. తమన్నా ఎంట్రన్స్ చాలా సింపుల్ గా తీసేసాడు. ఎప్పటిలాగానే బిర్లా వైట్ సిమెంట్ కొట్టినట్టూ తళ తళా మెరిసిపోయిందీ.  ఎంత తెల్లగా ఉన్నా ఆ తొక్క కప్పిన బక్క ఎముకలని చూడటం కష్టమే.  బాగా సన్నబడిపోయింది ఎందుకో మరి (బొక్కు దవడలు, ఎత్తు పళ్ళూ కనిపిస్తున్నాయ్.) ;). చక్కనమ్మ చిక్కినా అందమే అనుకుంటే చూడచ్చు కానీ 100% లవ్ లోనే బావుందీ. వీలయినంత వరకూ చిన్నప్పటి చాలీ చాలని బట్టలేసుకొని వచ్చేసి సంతోష పెట్టింది ;) ;) ;).విలన్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా లేదు. వాడు ఉండేదే నాలుగో, ఐదో సీన్లు. ఆటలో అరిటి పండన్నమాట. విలన్ వైఫ్ గా వేసిన నటీమణి ఎవరో తెలీదుగానీ. తెలుసుకోకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది.(శక్తి సినిమా గుర్తొస్తుంది తప్పని సరిగా). గొంతులో ఇసకేసుకుని అరిసినట్టూ , కంటికి కారం రాసుకొని ఏడిసినట్టూ రచ్చ రచ్చ చేస్తుంది. 
మామూలుగా వినాయక్ సినిమాలో కామెడీ బావుంటుంది. ఈ సినిమాలో మాత్రం దాదాపు నిల్లు. ఇంద్రా సినిమా లో ఫస్టాఫ్ అరువు కామెడీ నే అవే క్యారెక్టర్ లతో అవే డైలాగులతో నస పెట్టి హింసించాడు. "బ్యాటీంగ్ బాబా 2000 ఇయర్స్" గా
బ్రహ్మీ ఎంట్రన్స్ అదుర్స్. ఏదో కొన్ని సెకన్లు నవ్విమ్చడానికి ట్రై చేశాడు.

సినిమా బిగినింగ్ లో ప్రకాష్ రాజ్ యుద్దవిద్యలు నేర్పించే ప్లేస్, సెట్స్, సూపర్ గా ఉంటాది. ప్ర.రా పొడిచెయ్యడానికి ఏమీ లేదు ఆ క్యారెక్టర్ లో. వసుధార సెట్ కూడా బానే ఉంటాది. హీరోయిన్ బ్రహ్మ కమలాన్ని కోసే సీన్ లో మగధీర సినిమా లోని
"బైరవ కోన" సెట్ నే ఆ శివుని విగ్రహం తీసేసి , మంచుతో మేకప్ చేసి వాడేసారు. ఓవరాల్ గా చూసుకుంటే ఆర్ట్ వర్క్ సూపరు. సినిమాటోగ్రఫీ కూడా అదుర్స్. దాదాపు ప్రతీసీనూ కంటీకింపుగానే కనిపిస్తుందీ. గంగానది ఒడ్డున, మంచి మంచి లోకేషన్స్ లో తీశారు.
కీరవాణి చేత బలవంతం గా చేయించారో తెలీదు, ఖర్చు కలిసొస్తుందనీ కీరవాణి పేరు మీద అల్లు అరవింద్ కంపోజ్ చేశాడో (కక్కురి ఎక్కువ అసలే) తెలీదు గానీ పాటలతో పాటూ,  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సో సో గానే ఉందీ.
ఏదో "కసకస బిసకస నసనస రుసరుస బద్రీనా.....ధ్" అని వస్తూ ఉంటాదీ బ్యాక్ గ్రౌండ్ లో... ప్చ్....!

డైలాగ్స్ కూడా అంతగా గుర్తుంచుకోదగినవి లేవు.. ;( బాగున్నవి చాలా తక్కువ.. నాకు గుర్తున్నవి ఇంకా తక్కువ.

1. ఇక్క్దడే ఆగిపోతే ఒక తల తోనే పోద్ది.. తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయ్.
2.భ్రహ్మీః  నేనే బ్రహ్మీ బాబా..2000 years. డైనోసర్లని చూడటం ఏమిటిరా వాటి గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుతినేవాడిని.. "నాకు పెట్టవా..నాకు పెట్టవా" అని టిప్పు సుల్తాన్ అడిగేవాడూ.
  బ్రహ్మీ గాందీని, మధర్ థెరీసా ని వాళ్ళ చిన్నప్పుడు ఎత్తుకుని తీయించుకున్న పోటోస్ కేక లాగా ఉంటాయ్.. సూపర్ అది మాత్రం ;)   
౩. క్షేత్రపాలకుడు అంటే??? క్షేత్రం తో పాటూ, దాని పవిత్రతని కూడా కాపాడే వాడూ అని.


ఇప్పుడూ కొన్ని అధ్బుతమైన సీన్లు - డైరెట్రు గారి క్రియేటివిటీ + చిన్ని క్రిష్ణుని పైత్యం :

1.మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో హీరో "నేల మీదా, నీటి మీదా కాదు గురువుగారూ మీరు అనుమతిస్తే ఆకాశం లోకి తీస్కెళ్ళి కొడతాను" అని చెప్పేసి అపొనెంట్ తో సహా గాల్లోకి మాట్రిక్స్ సినిమాలో హీరో లాగా రాకెట్ ఎగిరినట్టూ ఎగిరి పోతాడూ. ఫైటింగ్ షురూ...!
2. బద్రీ........ అని పిలవగానే.. గాల్లో ఎగురు కుంటూ, జలపాతాల నుండి దూకేస్తూ (పులి సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా) ఎగ్జాట్ గా లొకేషన్ కి వచ్చేస్తాడు హీరో.

౩. ఇప్పుడొక అద్భుతమైన సీను చెప్తా.. ఇదే హైలైట్.  అమర్నాధ్ యాత్రీకులని టెఱరిస్ట్లు కిడ్నాప్ చేస్తారు. పైగా టీవీ లో లైవ్ కూడా. అది ప్ర.రా చూసీ, లొకేషన్ కి వెళ్ళిపోయీ టెఱరిస్ట్ లని బెదిరించేస్తాడు. వాళ్ళు బెదరకపోయే సరికీ
వీరోగారు కత్తిపైట్ కాంతారావు లాగా టెఱరిస్ట్ లందర్నీ నరికేస్తాడూ. "ఏం వాళ్ళదగ్గర A.K 47 లు లేవా?" అంటారా? ఉంటాయ్. పాపం కాలుస్తారు కూడా. కానీ హీరో కత్తి గిఱున తిప్పీ బుల్లెట్స్ అన్నిటీనీ తిప్పి కొట్టేస్తాడు. ఒక్క బుల్లేట్ కూడా తగలదు. కొంతమంది గన్నులని కూడా కత్తితో సగానికి కట్ చేస్తాడు. (ఉన్నారా? ఢాం అని పడిపోయారా?)
వాళ్ళు మాత్రం మొత్తం మఠాష్.  ఒక్క పోలీసు గానీ, ఆర్మీ వాళ్ళు గానీ ఉండరు అక్కడ. చుట్టూ చానల్స్ వాళ్ళు మాత్రం ఉంటారు. అదేం చిత్రమో?  కలికాలం. బ్రమ్మం గారు ఆనాడే చెప్పారు ఇలాటి సినిమాలు వస్తాయ్ అనీ.
4. వీరో బళ్లారి వస్తాడు విలన్ ఇంటికీ. రైల్వేస్టేషన్ లో విలన్లు టోకున కొన్న ఒకే డిజైన్ కత్తులు పట్టుకొని ఉంటారు. హీరో పేద్ద..కత్తి తో అందర్నీ నరికేస్తాడు. స్టేషన్ మొత్తం శవాల సమూహం. "పోలీసులు ఊరుకున్నారా??" అని అడుగుతున్నారా? ఇదిగో
ఇలాంటి ప్రశ్నలడిగితే నేను చెప్పనంతే.. ఈ సినిమాలో పోలీసులు క్లైమాక్స్ లో కూడా రారు.
 ఈ కాలం లో కత్తి ఫైటీంగ్ లేమిటో.. !
అతిగా తింటే పూతరేకులు కూడా మొహం మొత్తుతాయ్. ఈ సినిమా లో కత్తి ఫైటీంగ్ ల లాగా. ;( నిజానికి అర్జున్ చాలా కష్టపడ్డాడు ఫైట్స్ కోసం.. కానీ..ప్చ్... ఏదో వీడియో గేం ఆడినట్టూ అనిపిస్తుంది.

5. మధ్య మద్య లో సమయమ్ సంధర్బం లేకుండా హీరోయిన్ గారి ఊహల్లో పాటలూ, సో కాల్డ్ కామెడీ సీన్లూ వచ్చేస్తూ ఉంటాయ్. హేమిటో ఈ వినాయక్ కి పొట్ట పెరిగింది గానీ కపాలం లో ఖర్జూరం హరించుకుపోయింది.6.హీరోయిన్ తాత కి హార్ట్ ఎటాక్ వస్తే మన బద్రీనాధ్ కొండ మీది మట్టి తెచ్చీ గుండెలకి రాస్తాడు. టక్కున తగ్గిపోద్ది. (ఏటీ నిజమే? ఇది గనక నిజమని నమ్మితే ఈ సినిమా చూసినోళ్ళంతా ఆ కొండ తవ్వి పారేస్తారేమో..)
7. వసుధార అని ఒక జలపాతం ఉంటాది. దాని కిందకి పాపాత్మ్లులు/ నాస్తికులు వెళితే జలపాతం పక్కకి జరిగి, ఆ తర్వాత వాటర్ ఆగిపోతుందీ. పుణ్యాత్ములు వెళితే మళ్లీ స్టార్ట్ అవుతాది. (ఎంత జలపాతం సెట్ వేస్తే మాత్రం... ఇంతకు తెగిస్తారా?)

అబ్బో... సినిమా అంతా ఇలాగే ఉంది జనులారా..! కాసేపు భక్తి చిత్రం అనుకున్నా... హీరోయిన్ ని చూసి రక్తి అనుకున్నా. కొన్ని సీన్లు చూసి ఇదేదో మంత్రాల సినిమా అన్కున్నా.. అంతలోనే ఫైటీంగ్స్... నవ్వించే  ఏడుపులూ.. ఏడిపించే కామెడీ సీన్లూ .....   భగవంతుడా....!
మొత్తానికి మగధీర తీద్దామనుకొనీ కిచిడీ కాబడిన శక్తి సినిమాని మళ్ళీ తీశారు.... హ్మ్మ్... .

ముఖ్య గమనికః "జీనియస్" చిన్నికృష్ణా.. మామూలుగా నే నువ్వన్నా, కుక్కలన్నా నాకు పరమ  చిరాకూ.. అసహ్యం తో కూడిన  కోపం, కంపరం వగైరా..! నువ్ బెంగుళూర్ వస్తే గనకా వస్తే ఆ సంగతి నాకు తెలీనివ్వకు. నీ మంచికే చెప్తున్నా..! నీకు జంబో సర్కస్ లో జోకర్ వేషం వేసీ మా వీధి కుక్కలకి వనభోజనాలు ఏర్పాటు చేస్తా.. జాగ్రత్త.

Wednesday, June 1, 2011

బీరు వీరుడు...!

జీవితం అంటే వద్దు వద్దంటున్నా, వినమంటున్నా, వినమని తెలిసినా, వినిపించుకోకుండా  గంటల కొద్దీ పీకే క్లాసులూ, అటెండెన్స్,  ఇంటర్నల్స్, ల్యాబ్ లో కసిరేసే లెక్చరర్లూ, విసిరేయబడ్డ రికార్డ్లూ, సెమిస్టర్ ఎగ్జామ్లూ, రిజల్ట్సూ, బ్యాక్లాగ్స్ రిలీజయిన కొత్త సినిమాలూ మాత్రమే అనుకొని గుడ్డి గుఱం లాగా గమ్యం తెలీకుండా గడిపేస్తున్న రోజులు.

ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అయిపోతుందనగా మా కాలేజ్ కి అంత సీన్ లేదు కాబట్టీ.., పక్క కాలేజీల్లో క్యాంపస్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని తెలియగానే మూడడుగులున్న ఎస్వీ రంగారావు లాగా కనిపించే మా సీతయ్య (ప్రిన్సీ) మా కాలేజ్ బస్ అరేంజ్ చేసి,డ్రయివర్ కి డబ్బులు మమ్మల్నే ఇచ్చెయ్యమని ఆర్డరేసి, హోల్సేల్ గా సెలెక్ట్ అయిపొమ్మని కమాండ్ చేసీ, "నువ్ నాకు ఇవ్వాల్సిన పది లచ్చలూ ఇవ్వక్కర్లేదు.. మాఫీ చేశాను.పో.." అన్నట్టుగా ఒక లుక్కిచ్చి పొట్టకి ప్యాంట్ తొడుగుతున్నట్టూ ప్యాంట్ రెండంగుళాలు పైకి లాగి పర పరా కాళ్ళీడ్చుకుంటూ పోయాడు. ఆ.... ఇది ప్రతీ సారీ ఉండేదే కదా.. అనుకొనీ రేపు ఐటీ, సీ.యస్.సీ అమ్మాయిలు మాతోపాటూ వస్తారన్నఆనందం తో అలా అలా ఆలోచిస్తూ ఇంటికి పోయాం. ఇలా ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలకి అటు వైజాగో, ఇటు కాకినాడో, రాజమండ్రో వెళ్ళడం, రిటెన్ టెస్ట్ రాసేసీ, రిజల్ట్స్ వచ్చేలోపు టౌన్ కెళ్ళీ మాంచి హోటల్ చూస్కొని కుమ్మెయ్యటం, తిరిగొచ్చీ, ఫస్ట్ రౌండ్లోనే పల్టీ కొట్టేశాం అని కన్ఫ్రర్మ్ చేసుకొనీ, వచ్చిన బస్సు ఎక్కి కూర్చొనీ, అమ్మాయిలతో అంత్యాక్షరి ఆ(పా)డుకుంటూ, ఆవేశం తో అరుచుకుంటూ, అలిసిపోయి, ఎవరి ఊళ్లలో వాళ్ళు దిగిపోయి పీకల దాకా తినేసి పడుకోవటం ప్రతీసారీ జరిగేదే..మర్నాడు పొద్దున్నే నా స్టాప్ లో బస్సెక్కగానే, రంగు రంగులతో జిగేల్ జిగేల్ మంటూ ముందు వరసలన్నీ వెల వెలా వెలిగిపోతుండగా... "మా...మా.. ఎనక్కొచ్చెయ్యరా. " అన్నకేక వినపడగానే మధ్యలో కాలమతులు కొందరూ R.S agarval బుక్ ని ఆర్తీ అగర్వాల్ ముఖచిత్రం చూసినంత శ్రద్ద గా చూస్తున్నా, పట్టించు కోకుండా.. గుడుంబా శంకర్ బావుంటూందా?, బంగారం బావుంటుందా? జానీ జస్ట్ హిట్ గా మిగిలిపోడానికి గల కారణాలేమిటీ? అన్న చర్చ లో పీకల్లోతు మునిగిపోయి మధ్యలో గొడవొచ్చీ, కోపంతో రగిలిపోతున్న కుక్కల్లాగా కోట్లాడుకుంటూ ఉండగా కాలేజ్ వచ్చేయడం తో పళ్ళీకిలించుకుంటూదిగిపోయాం.

రిటెన్ టెస్ట్ కి ముందు అలా అలా బుక్స్ తిరగేసి వెళ్ళడం తో ప్రతీ ప్రశ్నా తెలిసినట్టే ఉందీ, మల్టిపుల్ చాయిస్ లో ప్రతీ ఆన్సర్ కరెక్టే అనిపించింది. అన్నీ కరెక్టే అయినప్పుడు ఏది టిక్ పెడితేనేం? అందుకని కళ్ళు మూసుకొని కస కసా రాసేసి
బయటకొచ్చేశా. కాసేపటీకి మా వాళ్లందరం సమావేశమయ్యాం.

శీనుమాయ : ఒరే.. రిజల్ట్ రావడానికి 2 అవర్స్ పడుతుందంట గానీ మనం పోయి తినొద్దాం
అప్పల్రాజు   : ఏటెహే తినేది? చుట్టుపక్కల ఒక్క హోటల్ కూడా లేదు. అన్ని కాలేజీలూ ఇలా ఊరు చివర కడతారేటీ తొక్కలాగా?

నేను        : ఆటోలున్నాయ్ గా.. హోటల్ పట్టుకోవటం ఎంతసేపెహే..
మనూ      :  ఊరు చివరయితే స్థలం చీప్ గా వస్తుందనీ. ప్రశాంత వాతావరణం అని చెప్పుకోవచ్చు. పైగా బస్ ప్రొవైడ్ చేసీ డబ్బులు దొబ్బెయ్యొచ్చు.
బుల్లిరాజా   : కాదెహే.. శ్మశానాలూ, ఇంజనీరింగ్ కాలేజ్ లూ ఊరు చివరనే ఉంటాయ్. అక్కడ శవాలు తగలడుతుంటాయ్. ఇక్కడ జీవితాలు తగలడుతుంటాయ్.
విలాస్      : నువ్ హరిశ్చంద్రుడి లాగా నిజాలే చెప్తావ్ రా!
సుధాకర్    : హరిశ్చంద్రుడి తో ఈడిని  పోల్చావా? ఇద్దరికీ శ్రీ కృష్ణుడికీ, నికృష్ణుడికీ ఉన్నంత తేడా ఉందీ. మాటలు తర్వాత..ముందు ఆటో ఆపండ్రా..

మెయిన్ రోడ్ కెళ్ళి మొత్తానికి ఒక ఆటో క్యాచ్ చేసాం. అరవైలో పోతుందీ ఆటో.. నూటిరవై కి రీచవుతుందీ మీటరు. ఏపక్క చూసినా ఒక్కహోటల్ కూడా కనిపించటం లేదు. అలా "వేడిగాలిలో... మండుటెండ లో ఆటోలో ప్రయాణం.... హోటలెక్కడో..లంచ్ ఏమిటో తెలియదు పాపం..తెలియదు పా..పమ్... " అని పాడుకుంటూ ఉండగా.. వై.వి.యస్ చౌదరి డైరెక్షన్ లో విజయ్ కాంత్ హీరో గా సినిమా వచ్చి హింసించినట్టూ,"xxxx బార్ & రెస్టారెంట్" కన్పించి కవ్వించింది. ఆటో ఆపించేసి దిగిపోయాం.
"బార్ కి తీస్కొచ్చారెట్రా? మా ఇంటా వంటా లేదు తెల్సా? " అన్నాన్నేను అమాయకంగా (నేను చా...లా.... అమాయకుడిని. నమ్మాలి మీరంతా)
"మరి మా ఇంట్లోవాళ్ళు మాత్రం రోజూ ఇక్కడికొచ్చి తింటారనుకున్నావా?? ఇది తప్ప వేరే దిక్కులేదు. మూస్కొని రా రా" అని శీనుమాయ చాలా మర్యాదగా చెప్పడంతో చెట్టాపట్టాలేసుకొని చలాకీ గా లోపలికెళ్ళాం.

నేను, సుధాకరూ, విలాస్ లాంటి లోకం తెలీని పసోళ్ళం అంతా ఒక పక్క కూర్చొని చికెన్ బిర్యానీ ఆర్డరిచ్చి లొట్టలేస్తుండగా... "డ్రింక్స్ ఏమన్నా కావాలా సర్?" అనడిగాడు వెయిటర్. మనూ గాడి మొహం లో ఎక్స్ప్రెషన్ మారింది. చటుక్కున తలతిప్పి చూడగా మిగిలినవాళ్ళ మొహం లోనూ అదే ఆనందం తాండవిచిందీ. మూకుమ్మడిగా సౌండ్ రాకుండా చిరునవ్వు నవ్వీ.. "YES" అని అరిచారు.

కట్ చేస్తే..
మా వైపు వేడి వేడి బిర్యానీ ప్లేట్లూ(చెప్పాను కదా మేము చిన్నపిల్లల బ్యాచ్ అనీ), అవతల వైపు చల్ల చల్లని బీరకాయలూ నించొని ఉన్నాయ్. అప్పల్రాజు మొహమాటం తో చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ లు ఇస్తూండటం తో "ఎందుకురా మా దగ్గర మొహమాటం? అయినా ఏం మనిషివిరా నువ్వూ? మందిలో ఉంటే మొహమాట పడతావ్.. ఒక్కడివీ ఉంటే కక్కుర్తి పడతావ్. నీకెంత వీలయితే అంతే తాగూ" అన్నాడు శీనుమాయ. అలా అందిన ఇసకరేణువంత ఎంకరేజ్మేంట్ ని అడ్వాంటేజ్ గా తీస్కొనీ, వాడి మగ్గే కాక అందరి మగ్గులూ ఎత్తి దించేసీ "తినగా తినగా వేపాకు తియ్యగా ఉంటూందీ, గియ్యగా గియ్యగా గెడ్డం గరుగ్గా అవుతుందీ..తాగగా తాగగా బీరు కూడా బావుంటుంది రా" అన్నాడు అప్పల్రాజు. ఇది అందరికీ ప్రెస్టేజ్ ఇష్యూ అయి కూర్చుంది ముఖ్యంగా శీనుమాయ కి. "బేరఱ్...టూ మోర్..." అన్నాడు.

కట్ చేస్తే... 30 నిమిషాల తర్వాత..

యుద్ధం అయిపోయాక మిగిలిన గ్రౌండ్ లాగా, మ్యాచ్ ముగిసిన స్టేడియమ్ లాగా, బ్యాచిలర్స్ రూమ్ లాగా చూడముచ్చట గా తయారయ్యింది మా ప్లేస్ మొత్తం. బిర్యానీ తినేసి, బిల్ పే చేసి బయటకొచ్చి, ఆటొ పట్టుకొని కాలేజ్ కి వెళూతుంటే
ఒట్టి బిర్యానీ తిన్న నాకే నిద్ర ఒక లెక్క లో ఊపేస్తుంది. వీళ్ళ సంగతి ఏమిటా? అని ఆలోచిస్తూ నిద్ర పోయాను. కాలేజ్ దగ్గర దిగుతుండగా శీను గాడి ఫోన్ రింగయ్యింది. 4 సెకన్ల తర్వాత "యా...హూ.. " అని అరుచుకుంటూ, గెంతుకుంటూ క్యాంపస్ లో కి పరిగెట్టాడు.
విషయం ఏంటంటే.. మా బ్యాచ్ లో ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యిన  ముగ్గురిలో వీడూ ఉన్నాడూ. ఇంకొద్ది సేపట్లో ఇంటర్వ్యూ.. మనోడి గెటప్ చూస్తే.. చెదిరిన జుట్టూ, మాసిన గెడ్డం, ఎండలో జిడ్డెక్కిన మొహం, కాళ్ళకి చెప్పులూ, కడుపులో రెండు బీరకాయలూ,కళ్ళల్లో వాటి ఎఫెక్టూ కొట్టొచ్చినట్టూ కనిపిస్తూ అదో రకమైన స్థితి లో ఉన్నాడు. ఒక్కొక్కడి దగ్గరా షర్ట్, షూ, బెల్టూ, దువ్వెనా అరువు తీసుకొనీ ఇంటర్వ్యూ కి రెడీ అవ్వబోతుండగా, నోరు తెరుచుకొని చూస్తున్న మా వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.. "మ్మా..మా.. మామూలుగా కన్న్నా ఇప్పుడే కరెక్ట్ గా ఉంటాను చూడు... కాకి కి కలర్ ఫోటొ తీసినా కలర్ మారదు కదరా..ఇది కూడా అంతే" అని అర్ధం కానీ లాజిక్  చెప్పి లోపలికెళ్ళి పోయాడు.మిగిలిన వాళ్ళందరం ఏమాత్రం సిగ్గు పడకుండా ఇంటికేళ్ళిపోయాం.

మర్నాడు క్లాస్ లో మా లెక్చరర్ క్లాస్ పీకుతూ... నిన్న హాఫ్ క్యాంపస్ లో మనోళ్ళు ఎవరన్నా సెలెక్టయ్యారాండీ? అని అడిగారు.
అప్పుడే తెలిసిన వారు ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండగా, అసలు విష్యం తెలిసిన వారు విరగబడి నవ్వుతూ ఉండగా.. సిగ్గు పడుతూ చిరునవ్వుతో స్లో మోషన్ లో లేచి నుంచున్నాడు మా "శీనుమాయ" అందరి చప్పట్ల మధ్య.....