Monday, May 16, 2011

శునక చరిత్ర..


మయం : సాయంత్రం 5 అనుకుంటా..
సంధర్భం  : బయటికెళ్ల డానికి తలుపుతియ్యగా.. ఒక శాల్తీ నిలబడి సెల్యూట్ పెట్టి, చేతులు నులుపుకుంటూ, కాలిబొటన వేలితో ముగ్గేస్తూ, సిగ్గుపడుతూ నిల్చుంది.

నేనుః  ఎవరు నాన్నా నువ్వూ?
శాల్తీః గూర్ఖా సార్.
నేనుః అవునా? ఏ వీధి కీ? ఆరు నెలల నుండీ ఇక్కడే ఉంటూన్నా.. ఎప్పుడూ కన్పించలేదు.??
గూర్ఖాః ఈ ఏరియా నే.. హిహిహిహ్.. ఇక్కడే.. హిహిహిహిహ్ సార్... గూర్ఖా సార్.. హిహిహిహిహి.
నేనుః "అవునా?? మరి మొన్న రాత్రి నేను ఆఫీస్ నుండీ వస్తుంటే కుక్క్కలు వెంటబడ్డాయి..ఒకటీ రెండూ కాదురా... పిక్కలు పట్టి పీకేసి ఉంటే ఒక్కోదానికీ తులం ముక్క కూడా దక్కేది కాదు... అన్ని ఉన్నాయ్.. ఏం పీకుతున్నావాటైం లో?? నీకు కూడా  కుక్కలంటే భయ్యమా??" అని అడగాలని మనసంతా పీకినా... "ఒరేయ్..వెంకీ...... ఎవరో వచ్చారు చూడు నీకోసం" అని కేకేసి సెల్ఫొన్ చెవి దగ్గర పెట్టుకొని బయటకి పోయాను.

అలా మొబైల్ పట్టుకొని మేడెక్కాక... "నాకు కుక్కలంటే భయం" అన్నసంగతి గుర్తొచ్చీ.. "ఎప్పటి నుండి చెప్మా.....?" అని మోకాలు మసాజ్ చేసుకుంటూ మెదడు మధించాను.. 
["అమ్మో... కొంపదీసి కుక్కల పురాణం మొదలు పెడుతావా?" అని అనుకుంటున్నారు కదూ?
అవును.. సరిగ్గా గెస్ చేసారు.. అయినా గతంలో గొప్ప గొప్ప బ్లాగర్లందరూ కుక్కల మీద పోస్ట్లు రాసి అరిపించారనీ (కుక్కల చేత కాదు.. చదివి కామెంట్లు పెట్టిన వాళ్ళచేత) బ్లాగ్ చరిత్ర గెంతి మరీ చెబుతుంది.]

నా శునక చరిత మొదలెడతా కాస్కోండీ.. ఉస్కో..ఉస్కో అంటూ ఎంకరేంజ్ చెయ్యండి.


అక్కడ..ఇక్కడ ఎక్కడికక్కడ కనపడ్డ కాలుకి కోత పెడతా... 
(కోరస్ః ఒకటే కాటుకి గాటు పెడతా.. ఉరుకు ఉరుకు ఉరకరో....)
కాటుకు అబ్బని గుర్తుకు తెస్తా... నెత్తుటి ధారనే పారిస్తా.
(కోరస్ః పంటికి కండనే ఎరగ వేస్తా..ఉరుకు ఉరుకు ఉరకరో...)
కచ్చ కట్టినంటే నేనె మొరగకుండ ఉండనంతే
మొరగకుండ ఉంటినంటే.. కరవకుండ ఉండనంతే..
నిన్ను నిన్ను నిన్నుకరిచి నీ ముక్కల తోటే రాస్తా... శునక చరిత శునక చరిత శునక చరిత శునక చరిత శునక చరిత
a bark of night a sleep of day
a dream of watching a free way
hit me once.. chase you twice
hit me more.. I bite you at sight..

you better keep running if you want to survive
because every "day" I dream I am wanting you bite... 
దొరికితే చస్తావూ.. దొరికితే చస్తావూ.. ఉరుకు..ఉరుకు..ఉరుకు..ఉరుకు..



పాటయ్యి పోగానే ....

1991 ... మే నెలలో నా కర్మ కాలిన  ఒకానొక దినాన.

నాకు ఊహ తెలిసాకా వచ్చిన ఒక వేసవి లో స్కూల్ కి సెలవులిచ్చాకా అమ్మమ్మా వాళ్ళింట్లో ఆనందతాండవం చేస్తున్న బంగారు కాదు కాదు ప్లాటీనం రోజులు. 
ఒకరోజేమో.. అమ్మమ్మ ఆర్డర్ మేరకూ సంచి పట్టుకొని వెళ్ళి రొట్టెల బాబూరావు కొట్లో రొట్లు కొనుక్కొని నా ఫేవరెట్ కొబ్బరి రొట్టి ని మాత్రం కాకులు ఎత్తుకు పోకుండా చొక్కా కప్పి, వస్తూ ఉండగా... మా ఇంటి దగ్గరలో ఒక బక్కచిక్కిన నల్ల కుక్క చూసింది.
నేను కూడా దానివైపు చూసాను. అది ఒక కోపంగా ఒక నవ్వు నవ్వీ  గుర్ ర్ ర్ ర్ ర్ అంది. నేను నా నడక కి ప్రమోషన్ ఇచ్చి పరుగు గా మార్చాను. అది హఠాత్తుగా యువరాజ్ సింగ్ లాగా డైవ్ చేసి నా వెనకనుండి తొడ ని క్యాచ్ చేసి దోరజాంకాయ లోకి దించినట్టూ దారుగా పళ్ళు దించేసిందీ. అప్పటీవరకూ  తోకూపుతాయని మాత్రమే తెలిసిన నాకు, కుక్కలు కరుస్తాయనీ... అవి కరిస్తే మనం అరుస్తామనీ ఆ నాడే తెలిసింది. సరిగ్గా అదే టైమ్ లో వాకిలి ఊడుస్తున్న మా అచ్చీరత్నం పెద్దమ్మ చీపురు కట్ట తిరగేసి వీపుమీద బాదడం తో (నన్ను కాదు మహా జనులారా...కుక్కని) గజేమోక్షం కధ లో విష్ణుమూర్తి దెబ్బకి ఏనుగు కాలొదిలేసిన మొసలి లాగా, నా కాలు వదిలేసి, ముక్క లాగకుండా, మూతి నాక్కుంటూ (అబ్బబ్బా.. నాది కాదండీ.. దానిదే) వెళ్ళిపోయింది. 
ఇది నాకు కలిగిన మొదటి దిగ్భ్రాంతి.  First psychic vibration.


అప్పటి నుండీ కుక్కల్ని చూడగానే నాలోని భయస్థుడు బిక్కు బిక్కు మంటూ తొంగి చూడటం మొదలెట్టాడు. 


1996 .. సమయం ..ప్చ్.... గుర్తులేదు.. 

ఇది నేను ఆరో తరగతి చదివేటప్పుడూ అనుకుంటా. మా ఫ్రెండ్ వాళ్ళింట్లో ఒక తెల్లని బొచ్చుకుక్క ఉండేది. ఒక రోజు వాడూ, అదీ వాళ్ళ అరుగు మీద పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. దాన్ని చూశాక నాకు భలే నచ్చేసింది. ఒకపక్క భయపడుతూనే వెళ్ళి పక్కనే కూర్చొన్నా.. ఏమీ అనలేదు.. హా....య్.. అని దాని నెత్తి మీద చెయ్యేసి నిమరబోయా.. అంతే.. అమీర్ఖాన్ లాగా పొట్టిగా ఉన్నా బొచ్చుకుక్క, పిచ్చెక్కిన అమ్రిష్ పురి లాగా అరుస్తూ నా మీద పడీంది. ఇంతలో మా వాడు ఆపి, "ఎవడైనా నెత్తి మీద చెయ్యేస్తే నచ్చదురా దానికీ.." అని చెప్పి దాన్ని బలవంతంగా లాక్కెళ్ళి పోయాడు. మృత్యువు మొహం మీదకొచ్చి, మూడ్ లేదని సైడయిపోయినట్టయ్యింది నాకు.  ఇది రెండవ దిగ్భ్రాంతి. Second psychic vibration.

అది రెండు వేల ఒకటవ సంవత్సరం..ఫిబ్రవరి ఇరవై నాల్గవ తేదీ.. (కీ.శే. శ్రీ నూతన ప్రసాద్ గారి స్టైల్ )

ఈ ఇన్సిడేంట్ ని మాత్రం నేనెప్పుడూ మరిచిపోలేను. కుక్కల్ని కౄర మృగాల జాబితా లోకి చేర్చాలని డిసైడ్ అయిన రోజు. నేను టెంత్ లో ఉన్నప్పుడన్నమాట. మురారీ సినిమా సెకండ్ షో చూసి, ఆ టైం లో బస్సులు ఉండవ్ కాబట్టీ.. మా పిన్నీ వాళ్ళింటీకి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ పోతున్నా.. సరిగ్గా ఆ కాలనీ కి ఎంటర్ అయ్యేసరికీ.. ఆ వీధి మధ్యలో సుమారు ఇరవై గ్రామసింహాలతో కూడిన శునక సామ్రాజ్యాన్ని చూసి అవాక్కయ్యాను. నాకు తెలుసు.. అక్కడే నిలబడీతే అరవటం మొదలెడతాయని.. పరిగెడితే వెంట పడతాయనీ, ఇంటికి వెళ్ళ లేననీ. సో పరిగెట్ట కూడదు, ధైర్యంగా చంద్రబాబులా ముందుకి పోవాలని దారుణంగా డిసైడ్ అయ్యి నడవటం మొదలెట్టాను.. నెమ్మదిగా కొన్ని గు గుర్ ర్ ర్ ర్ ర్ మంటూ కవ్వించడం మొదలెట్టాయి. అయినా నేను అదే అ"ధైర్యం" తో నడుస్తున్నాను.. పద్మవ్యూహం లాంటి ఆ గ్రామసింహాల గుంపు లోకి వెళ్ళాను. దాదాపుగా బయటకి వచ్చే టైం లో ఒక కుక్క నా వెనకాలే అనుమానంగా అరుస్తూ రావటం మొదలెట్టీంది. పరిగెట్ట కూడదని నా తలకాయకి తెలుసు కానీ,కాళ్ల కి తెలీదు గా .. అవి పరిగెట్టాయ్.. అంతే.. మొత్తం మందంతా AXE body spray యాడ్ లో అమ్మాయిలు హీరోని తరిమినట్టూ.. తరిమాయ్.. నేను నా లోని మిల్ఖాసింగ్ ని మేల్కొలిపీ, పోకిరి లో మహేష్ బాబులాగా  పరిగెడుతూ ఎదురుగా కనిపించిన ఇంట్లో కి పర్మిషన్ అడక్కుండా దూరేసి చివరి సెకన్ లో తప్పించుకున్నాను. This is third psychic vibration. మూడవ దిగ్భ్రాంతి. అప్పటి నుండీ కుక్కలంటే కోపం, అసహ్యం, పగ, భయం,వణుకు ఇంకా చాలా... చాలా.. హ్మ్..

కాబట్టీ ప్రజలారా.. ఈ శునకరాజాల విష్యం లో ఈ కింది సూచనలు మనసులో పెట్టుకోండి.

శునకాలూ - సత్యాలు - సూచనలుః
1. నక్క తోక తొక్కితే లక్కొస్తుందో లేదో తెలీదు గానీ, కుక్క తోక తొక్కితే ముందు గాట్లు తరవాత కుట్లూ పడటం ఖాయం.
2. కుక్కల పక్కగా వెళుతున్నప్పుడూ... నడకని తలపించే పరుగుతో (ఇది చాలా కష్టం... ప్రాక్టీస్ చెయ్యాలి..) ఎదురుగా ఉన్న బిల్డీంగ్ పై పెట్టీన నిత్యామీనన్ కటౌట్ ని చూస్తూ (లేకపోయినా ఊహించుకోని) మారు మాట్లాడకుండా వెళ్ళాలి..
3. కుక్కల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాటికి కాలుద్ది. ఎప్పుడూ చూడమాకండి. (కంటి చూపుతో కుక్కల మనసు మార్చెయ్యడానికి మనం నరసింహ నాయుడు  సినిమా లో  బాలయ్యబాబులం కాము కదా .)

4. పడుకున్న కుక్కల తోకపట్టుకు లాగడం, చెవిలో నీళ్ళెయ్యడం, ఊరుకున్న కుక్క ని రాయిచ్చి కొట్టడం లాటీ తింగరి చిన్నెలు చెయ్యకూడదు.
5. (ఇది బెంగళూర్ వాసులకి) అర్ధరాత్రుళ్ళు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటపుడు, " ఆ సందులోకి అంత దూరం బండీ పోదూ..ఇది డెడ్ ఎండ్ సార్... కార్ యూ టర్న్ తీసుకోడానికి అవ్వదూ..ప్లీజ్ అండర్ స్టాండ్" అని క్యాబ్ డ్రైవర్ కాళ్లా వేళ్ళా పడీ కన్నీళ్ళెట్టుకున్నా,కన్నడా లో బూతులు తిట్టుకున్నా, గెడ్డం పట్టుకొని బతిమాలుకున్నా.. ముక్కు చీది మూలుగుతున్నా, కరిగిపోయో , భయపడీపోయో.. దిగి నడిచి వెళ్ళడానికి సిద్దపడీతే.. కాసేపయ్యాక అదే రూట్లో ఆంబులెన్స్ లో పడుకొని వెళతారు. గుర్తుంచుకోండీ.  

ఇక్కడికొచ్చిన కొత్తలో  పెద్దలు చెప్పగా విన్నాను (బ్లాగుల్లో చదివాను అనుకుంటా..) ..." బెంగుళూర్ లో  కళ్ళు మూసుకొని ఒక రాయి విసిరితే అది ఖచ్చితంగా కుక్క కి కానీ, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి కానీ తగులుతుంది " అనీ. అది నిజమే. ప్రపంచం లో కుక్కలు ఎక్కువగా ఉన్న నగరం ఏది? అంటే "Bangalore" అని బల్లగుద్దీ మరీ బుకాయించేస్తాను. నడిచే వాళ్లవెనుకా, పరిగెట్టే వాళ్ళవెనుకా పడే కుక్కల్ని మా వూళ్ళో చూసాను గానీ...  టూ వీలర్ లనీ, కార్లనీ చేజ్ చేసి జాతర చేసుకునే జాగిలాలని ఇక్కడ మాత్రమే చూశాను.
పగలంతా చక్క్గగా నిద్రపోయి, ఆంధ్రా స్టైల్ హొటళ్ళ దగ్గర మూడు పూట్లా మెక్కీ, తిన్నదరక్క నిశీధివేళ లో నిత్యం నికృష్టం గా అరుస్తూ, అంతర్ కాలనీ శునకాల యుద్ధం లో అలుపెరగ కుండా అరిచి మన నిద్ర చెడగొట్టే ఈ కుత్తే ల కౌంట్ తగ్గించడాన్ని  వ్యతిరేకించే... నీచ్, కమీనే, కుత్తేగాళ్ళని కుదిర్తే కొత్తేం మీద పీకి, వీలయితే వాటిచేత కరిపించీ బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్ లు చెయ్యించాలని డిమాండ్ చేస్తున్నా. 
ఎందుకంటే రోజూ నా పరిస్థితి ఇలా ఉంది.. ;( 


రక్త సిక్త వర్ణమైన  తరతరాల శునక చరిత్రా.... శునక..శునక..శునక శునక శునక  
ఆధిపత్య పోరు కొరకు సాగుతున్న శునక చరిత్రా...శునక..శునక..శునక శునక శునక 
తుది లేనిది ఈ సమరం.. చీకటీ పడితే చావుభయం..
బతికేందుకు ఈ సమరం .. వెనకాలే ఓ సైన్యమ్..



ఇంతే సంగతులు,
చిత్తగించవలెను.

Tuesday, May 10, 2011

మొక్కు తీర్చలేదు...!



లిమెంటరీ స్కూల్ చదువుని మూడు మొట్టికాయలూ, ఆరు అరుపులూ, ఏడు ఏడుపులతో వెలగబెట్టీ, హైస్కూల్ లో అడుగుపెట్టీ, ఆరవతరగతి ని ఇరగదీసి ఏడు లో అడ్డూ ఆపూ లేకుండా ఎగిరెగిరి పడుతున్న రోజులవి.
నేనూ, అప్పల్రాజూ, అనీలూ, ఫణీ నలుగురం జాన్ జిగిడీ దోస్తులం. అయితే రోజూ ఇంటర్వెల్ లో ఉసిరి కాయలూ,జామ కాయలూ , ఆశా చాక్లెట్ లూ కొనిపెట్టడం వల్లా నాకు ఫణి గాడితో బాగా దోస్తీ ఉండేది. అనిల్ గాడు A-సెక్షన్ కాగా, మిగిలిన వాళ్ళందరం C-సెక్షన్.
ప్యాచ్ పడిన సైకిల్ లాగా పూటకి పదిమైళ్ళ వేగం తో నడుస్తుంది కాలం......

ఒకరోజూ కొంపలు మునిగే పరిస్థితొచ్చీ, అర్జెంట్ గా వెళ్ళాల్సిన అవసరమొచ్చీ, మా ఇంగ్లీష్ సర్ స్కూల్ కి సెలవెట్టీ హడావిడిగా వెళ్ళిపోయారు. మునిగింది ఆయన కొంప కాదూ, కాలింది నా కొంపా అనీ తర్వాత తెలిసింది నాకు. ఆయన లేరు కాబట్టీ ఆరోజు కి మమ్మల్నందర్నీ A-సెక్షన్ తో కంబైండ్ చేసేశారు. నేను క్లాస్ లోకి వెళ్ళీ వెళ్ళగానే మా అనిల్ గాడు ఫస్ట్ రో లోంచి లేచి వాడి ప్లేస్ నాకిచ్చి, నువ్ కూర్చోరా అనేసి, నా వైపు అదోరకంగా చూసేసి, ఇంకో రకంగా నవ్వేసి వాడి బ్యాచ్ తో చివ్వరి లైన్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. పరలోకం నుండి దిగొచ్చిన దేవ దూతల్లాగా, తింగరి మొహాలేసుకున్న తేజోమూర్తుల్లాగా ఆ అతిధి మర్యాదలకి పూరీ పొంగినట్టూ పొంగి పోయి తిష్ట వేసుకొని కూర్చున్నాం. కానీ అప్పుడే తెలిసింది మాకు ఆ క్లాస్ తీసుకోబోయేదీ "సింహాచలం" మాష్టారని.

సింహాచలం మాష్టారి గురించి అంతకు ముందు కొంచెం విన్నాను. దుర్వాసుడి లాగా కోపిష్టి అనీ, ప్రకాష్ రాజ్ లాగా సాడిస్ట్ అనీ, చండశాసనుడనీ, అతను ఎంటరయితే హెచ్.ఎం కూడా లేచి నించుంటారనీ వగైరా..వగైరా. ఇంతలో చూడ్డానికి పొడుగ్గా, నల్లగా, లావుగా ఉన్న ఒక వ్యక్తి చేతిలో సిమెంట్ కవర్ తో చేసిన సంచి తో, మూర్ఖత్వం మూర్తీభవించిన ముఖం తో, వడియాలు వేపుతున్నట్టూ కరక్....పఱక్ అని చెప్పులు చేస్తున్న శబ్దాలతో లోపలికొచ్చారు. క్లాస్ అంతా పుష్పక విమానం సినిమాలో నటశిఖామణుల్లాగా.. సైలెంట్ అయిపోయి, సైగలు చేసుకోవటం మొదలెట్టారు. వచ్చీ రాగానే మా ఫణి గాడిని లేపి " నిన్న పాఠం ఎంతవరకూ చెప్పుకున్నాం రా? " అనడిగారు. ముందురోజు ఏం చెప్పారో మాకేం తెలుసు?. మా వాడు బెబ్బెబ్బే అన్నాడు. "బాబోయ్ బాబోయ్" అని అరిసే లాగా అరిసలూ, బుగ్గ మీద బొబ్బట్లూ అసలూ, వడ్డీ , కొసరుతో కలిపి వడ్డించి కూర్చోబెట్టారు. తరవాత నా వంతే. ఈ గ్యాప్ లో నిన్న ఏ పాఠం ఎంతవరకూ చెప్పారన్న ఇన్ఫర్మేషన్ గేధర్ చేసి ధైర్యం గా నిలబడి దర్జాగా చెప్పాను. "సరే అక్కడివరకూ చదువు" అన్నారు. నేను మొదటీ నాలుగు లైన్ లూ గడగడా చదివేసి, ఒకానొక పదం చదవటం రాక, బఠాణీ లు తింటూంటే మధ్య లో తగిలిన గులకరాయి నమలడానికి ట్రై చేస్తున్న వాడిలాగా రక రకాల ఎక్స్ప్రెషన్ లు పెట్టి, పెట్రోలయిపోయిన పల్సర్ కి డిస్క్ బ్రేకులు వేసినట్టూ ఆగిపోయాను. మెల్లగ తల యెత్తి చూశాను. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. "నల్లగా ఉండే ఆయన మొహం కోపంతో ఇంకా నల్ల బడిపోయింది. ఆయన మనిషిలా కాదు మండే అగ్ని గోళం లా కనిపించారు."
దవడ పగిలేట్టు కొన్నీ, నాది వీపా? విమానాశ్రయమా? అని నాకే డౌట్ వచ్చేటట్టు బోల్డన్నీ ఇచ్చి కూర్చోబెట్టారు. ఆ డీటీయెస్ కి మా క్లాస్ పక్కనే చింత చెట్టు మీద ఉన్న కాకుల గుంపు కావ్ కావ్ మంటూ దూరం గా ఎగిరిపోయింది. (ఈ సీన్ నే తర్వాత సినిమాలో కాపీ కొట్టేశారు ;().
చంప దెబ్బ కొడితే అంత సౌండ్ వస్తుందనీ, గూబ గుయ్య్ మనడం అంటే ఇదేననీ, దిమ్మతిరిగి మైండ్ బ్లాకయితే చెవులు వినిపించవనీ అనుభవ పూర్వకం గా తెలుసుకున్నాను. (నిజం చెప్పొద్దూ.. నా ఎడమ చంప నుండి వేడి వేడిగా ఆవిర్లు రావటం చూశాను). ఆ వెంటనే అప్పల్రాజు గాడిని లేపారు. వాడిని కూడా నాలుగు పీకబోతుండగా వాడు దొరక్కుండా దూరంగా పారిపోయి.. "నేను ఈ సెక్షన్ కాదు సార్..." అని అరిచాడు.

సార్ : అవునా? మరి వీళ్ళిద్దరూ??
అ.రాః వాళ్ళు కూడా కాదు సార్. ఈ రోజు రెండూ సెక్షన్లూ కంబైండ్ చేశారు
సార్: మరా ముక్క ముందు చెప్పి ఏడవచ్చు కదా..
నేను (మనసులో) : అంత టైమిచ్చావా మాకు? ( ఒక కంట్లోంచి గోదావరీ, ఇంకో కంట్లోంచి కృష్ణా, ముక్కులోంచి పెన్నానదీ పారుతుండగా.. )

క్లాస్ అయిపోయాక అనిల్ గాడోచ్చి.. "ఇప్పుడర్ధమయ్యిందా? నేను లాస్ట్ లైన్ కి వెళ్ళి ఎందుకు కూర్చున్నానో? అతను ఫస్ట్ లైన్ లో వాళ్ళని మాత్రమే అడుగుతారు. పైగా ఎవరి మొహాలూ గుర్తుండవ్. " అని చిదంబర రహస్యం చెవినేసి పోయాడు.

ఇటువైపు ఒక లుక్కేశాను. ఫణిగాడు ఏకాగ్రత తో ఏడుస్తున్నాడు. అటువైపు ఓ లుక్కేశాను. అమ్మాయిలంతా అదోరకంగా చూస్తున్నారు.మా సెక్షన్ అమ్మాయిలే కాదు పక్క సెక్షన్ అమ్మాయిల దగ్గర కూడా పరువు పోయిందన్న బాధ ఒకవైపు, వీపు మండిపోతున్న బాధ ఒకవైపు, అప్పల్రాజుగాడికి దెబ్బలు మిస్సయి పోయాయన్న కడుపుమంట మరోవైపు. యే భగవాన్..!
సాయంకాలం ట్యూషన్ సెంటర్ కి వెళ్ళేసరికి ఈ న్యూస్ కళ్ళ కలగలు వ్యాపించినట్టూ అన్ని స్కూళ్ళ వాళ్ళకీ వ్యాపించింది. ఆఖరికి మా ట్యూషన్ సర్ కూడా "ఏరా.. ఈరోజు దంతాలు కదిలాయంట మీకు?" అని అడగడం తో మా కోపం కిరోసిన్ పోసిన కుంపటి లో మంట లాగా ఎగసి పడింది.
నేనూ ఫణి గాడూ, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సర్ పై మాకు కోపం.... అన్యాయంగా కొట్టారని, బాధ ...క్లాస్ లో పరువు పోయిందనీ, చికాకు... మేమేం చెయ్యలేమనీ..

నేను : సింహాచలం మాష్టారు చచ్చిపోతే బాగుంటుందిరా.
ఫణి : అవున్రా.. నాకూ అదే అనిపిస్తుంది. రోజూ క్లాస్ కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ రోజు చర్చ్ లో ఇదే కోరుకుంటా..
నేను: దేవుడా... ఆ మాష్త్తారు చనిపోతే ఆంజనేయ స్వామి గుళ్ళో 100 కొబ్బరికాయలు కొడతాను. ఆయనంటే నాకస్సలు ఇష్టం లేదు.

4 రోజులు గడిచాయి. ఎప్పటీలాగానే సాయంకాలం ట్యూషన్ కి వెళ్లాను. ఫణిగాడు ఆందోళన గ పరిగెత్తుకుంటూ వచ్చి "ఒరేయ్.. సింహాచలం సార్ చనిపోయారంటా" అన్నాడు. నా జీవితం లో ఒక చావు వార్త వినడం అదే మొదటిసారి. నాకు భయం తో కాళ్ళు వణికాయి. గుండె గుభేల్ మంటుండగా "నిజమా?" అని అడిగాను. పక్కనే ఉన్న మా ట్యూషన్ సార్ చెప్పారు హార్ట్ ఎటాక్ వల్ల ఆ రోజు పొద్దున్నే చనిపోయారని. మేమిద్దరం ముఖాలు చూసుకున్నాం. మనమే కదరా ఆయన చనిపోవాలని కోరుకున్నదీ? "నేనే కదా వంద కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నదీ?" ఏమ్ చెయ్యాలిప్పుడూ? మా వల్లేనా ఇదంతా?
ఆ రోజు తెలిసింది మాకు పైకి చూడ్డానికి అలా కనిపించినా ఎంత మృదుస్వభావో?అంతకు కొన్ని వారాల ముందు బెస్ట్ టీచర్ అవార్డ్ రావడానికి కారణమయిన అతనికి తన వృత్తిపట్ల ఉన్న నిబద్దత ఎంతో.., తన సొంత తమ్ముడు 15 సం॥ లనుండీ ఏకధాటీగా ఎమ్మెల్యే గా చేసినా, ఆ దర్పం చూపకుండా ఆర్టీసీ బస్సులో సిమెంట్ సంచి చేతికి తగిలించుకు వచ్చే అతని నిరాడంబరత ఎంతో. హైబీపీ తో బాధ పడుతూ కోపం వచ్చినప్పుడు కంట్రోల్ తప్పే ఆయనకి మాపై ఉన్న కోపం ఏపాటిదో....

బాధేసింది...వారి కుటుంబాన్ని తలచుకొని.
సిగ్గేసింది...అసహ్యమేసింది.. నా మీద నాకే.. అలా మొక్కుకున్నందుకు.
కోపం వచ్చింది.. ఆ దేవుడి మీద... తెలియనితనం తో కోరిన నా కోరిక ని తీర్చినందుకు. అందుకే మొక్కు తీర్చలేదు. తీర్చను.!!

[ఇది జరిగి 14 సం॥ అవుతున్నా.. తలచుకున్న ప్రతీ సారీ బాధేస్తుంది ఎంత సర్ది చెప్పుకున్నా సరే. ఒక్కొక్క సారి మన కంటికి కనిపించేవీ , చెవులకి వినిపించేవీ, మనకి అన్పించేవీ నిజాలు కావు.. అందుకే ఎవరి మీద కోపం వచ్చినా, వారివల్ల నేను ఎంత బాధ పడినా, వారికి చెడు జరగాలని అనుకోను..పైన తధాస్తు దేవతలుంటారట... హ్మ్మ్...]