Wednesday, September 24, 2014

A Sreenu Vaitla Film : ఆగడు

ప్రజలారా..  తెలుగువారిగా మనందరికీ తెలుసు మహేష్ బాబు కి మేకప్ అక్కర్లేదనీ, శ్రీనువైట్ల సినిమా కి స్టోరీ అక్కర్లేదనీ, మనం కామెడీ  మాత్రం మనం కనెక్ట్ అయిపోతామనీ. కానీ నెత్తి మీద పిడుగు పడినప్పుడూ,
పాము కాటేసినప్పుడూ, గేదె పేడేసినప్పుడూ ఒకటే మంత్రం వేస్తానంటే  జుత్తు కాలిపోయి, నోట్లోంచి నురగలొచ్చేసి, సీన్ కంపు కొడతాది... సినిమా తీసినోళ్ళకీ, చూసినోళ్లకీ కూడా.! ఆ తర్వాత ఇదిగో... ఇట్టాంటి పోస్టులు చదవాల్సిన కర్మ పడతాది మీకు.

చిన్న ఊక దంపుడు కార్యక్రమంః

గుడుంబా శంకర్ తో మొదలయ్యి ఫెయిలయిన ఒక స్టోరీ టెంప్లేట్ నీ, మార్పులు చేసి బంపర్ హిట్ లు కొట్టిన ఘనత శ్రీమాన్ శ్రీను వైట్ల దే. అది ఎలాంటి ఘనతంటే
ప్రస్తుతం తెలుగు సినిమాలకి డైరెక్టర్లు వేరై ఉండొచ్చు, హీరోలు మారి ఉండొచ్చు, హీరోయిన్లు కామన్ అయి ఉండొచ్చు, రైటర్లకీ, డైరెక్టర్లకీ పడకపోయి ఉండొచ్చు, విడిపోయి విడివిడి గా దాడి చెయ్యొచ్చు కానీ "ఆవు వ్యాసం" లాగా అదే టెంప్లేట్.
ఈ ఎదవ ఫార్ములా పుణ్యమా అనీ తెలుగు హీరోలు కమెడియన్లు గానూ, హీరోయిన్లు , ఐటెం నంబర్లు గానూ, విలన్లు బఫూన్లు గానూ, కమెడియన్లు హీరోలుగానూ రూపాంతరం చెందారు. హరిశ్చంద్రుడి జీవిత చరిత్రైనా, సిపాయిల తిరుగుబాటు కధ అయినా ఈ టెంప్లేట్ లో పెట్టాక
ఒకలాగే తయారవుతాయి.
ఉదాహరణకి రామాయణాన్ని సినిమాగా తీయమని వీళ్ల చేతిలో పెడితే ఈ కమర్షియల్ టెంప్లేట్ లో పెట్టి, అవసరం అనుకుంటే కామెడీ బిట్లు హిందీ సినిమాల నుండీ, కాన్సెప్ట్  కొరియా సినిమా నుండీ, ఫైట్లు హాలీవుడ్ సినిమా నుండీ లేపేసి కలిపేసి పులిహోర చేసి హిట్ చేసెయ్యగలరు.

సపోజ్... పర్ సపోజ్... ఇదే శ్రీనుగారికి మహేష్ బాబుని రాముడుగా పెట్టి రామాయణాన్ని తీయమంటే......... అది ఈ ఆవు వ్యాసం టెంప్లేట్ లో ఇల్లా అవుతుంది.

(గమనికః ఇదో భయంకరమైన, మా చెడ్డ ఊహ మాత్రమే. నాకు రామాయణం అంటే ఇష్టం, గౌరవం)

సినిమా బిగినింగ్ లో బాల రాముడు-దశరధుడి మీద రెండు సెంటిమెంట్ సీన్లు, అడవి లో ఫస్ట్ ఫైట్, ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్, తొట్టిగ్యాంగ్ ఫ్రెండ్స్ తో కామెడీ, సీత తో పరిచయం-డ్యూయెట్, సూర్పణఖ తో లక్ష్మణుడి ఐటెం సాంగ్.(క్షమించాలి)
ఇంటర్వెల్ బ్యాంగ్ కి రావణాసురిడి తో చాలెంజ్, సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం ఎంట్రీ (దీనికి లాజిక్కులతో పని లే..!!) బ్రహ్మానందాన్ని బకరాని చేసి, ఆ అడ్డెట్టుకొని రావణాసురిడింట్లో మకాం. విలన్ గ్యాంగ్ ని మొత్తాన్నీ వెధవల్ని చేసి, ఇంద్రజిత్ తో ఫైటింగ్ చేసీ చంపేసీ,చివరాఖర్న రావణాసురిడి లో మార్పు తెచ్చి, శాంతిని నెలకొల్పి సీతని విడిపించుకొని శుభం కార్డ్ వేసి, టికెట్ రేటు వందా, ధియేటర్లు వెయ్యీ పెంచి ఫస్ట్ వీక్ కలెక్షన్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేస్తారు. ఈ వారం రోజులూ  టీవీ నైన్ లో లైవ్ షో దగ్గర నుండీ దూరదర్శన్ లో పందుల పెంపకం
ప్రోగ్రాం దాకా గెస్ట్లు గా వీళ్ళే ఉంటారు. ఏ రియాలిటీ షో జూసినా ఏమున్నది గర్వకారణం..  హిట్టయిన సీరియల్ ఆర్టిస్టులూ, ఫ్లాపయిన సినిమా బృందాల ఓవరాక్షన్లూ తప్ప. ఆ సినిమాని ఏ  పండక్కో టీవీ లో వేసే లోగా, యూట్యూబ్ లో పెట్టే లోగా బస్సు యాత్రా, నా వల్లకాడు యాత్రానూ..!!

అసలు సంగతి వదిలేశాను. కీలక మైన పంచ్ డైలాగులు. ఇప్పుడు SuperStar in & as శ్రీరాముడు గా అద్దిరి పోయే పంచ్ డైలాగ్స్.
[మరే.... పంచ్ డైలాగుల ప్రభావం జనాల మీద గట్టి గానే ఉంది]

మధ్య మధ్య లో ముక్కు ఎగబీలుస్తూ...
కీచు గొంతుతో.... రవణా...(రావణా) ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.... బాణం దిగిందా లేదా ?

రవణా..... మధురై ని కాపాడ్డానికి మీనాక్షమ్మ ఉందీ.. నా సీత ని కాపాడుకోడానికి నేనున్నాను

బాణం తీశాకా.. బ్లైండ్ గా వేసెయ్యటమే (నీ దూకుడూ... సా...టెవ్వడూ... )

విభీషణుడు హ్యాండిచ్చాడంటగా.. మండోదరి హ్యాపీసా? యుద్ధా.......నికొస్తున్నారంటగా? గెలుపూనాదే సీతా నాదే... ఎప్పుడిస్తున్నావ్ సీతనీ ఆ .....?

పడుకున్న పులినీ, వనవాసం చేసుకుంటున్న నన్నూ కెలికితే..... వేటే

దూకుడు లేకపోతే ఈ రాముడుకీ కీ ఆ రావణుడికీ తేడా ఏం ఉంటదీ?

నేను యుద్దానికొస్తే నరకం లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి

బాణాలకి బెదరని బాడీ రా నాదీ..!

మా నాన్నెప్పుడూ ఒకటి చెప్తుండేవాడు "మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మూకుడు లో వేపుడైపోద్ది బతుకూ.. అని"

విల్లు చూడాలనుకో.... తప్పులేదు.. కానీ బాణాన్ని చూడాలనుకోకు చచ్చిపోతావ్.

మహేశ్ః రావణాసురుడు గారు.. మీరు చేసింది తప్పు.
రావణాసురుడుః తెలుసయ్యా.. కానీ మానలేకపోతున్నాను. పూర్వం పది డబ్బాలు వాడేవాడిని.ఇప్పుడు తగ్గించా.
మహేశ్ః నేను మాట్లాడేది మెంతోప్లస్ గురించి కాదండీ.
రావణాసురుడుః కొంపదీసి సీత గురించా? చూడు రామా... నువ్ ఇప్పుడొచ్చావ్.. నేను ఆల్రెడీ జటాయువు రెక్కలు తెగ్గొట్టోచ్చాను. అది తెలిస్తే మీ వాళ్ళకి హార్ట్ ఎటాక్ వస్తుందీ.. రామసేతు దగ్గర రెడీగా ఉండు

నేను ఈ లంకా నగరం చేత &$*$(@% కొచ్చాను.

ఈళ్ళేంటీ.. ఇంగ్లీష్ మాట్లాడ్డం ఏంటీ అనుకుంటున్నారా??  "సినిమాల్జూట్టం లేదేటీ??"

ఇంకేముందీ... పంచ్ డైలాగులకి సినిమా  హిట్టు. మనోభావాలు గాయపడినందుకు ధియేటర్ బయట ధర్నా చేసిన ప్రజానీకం. రెండో వారం ఊపందుకున్న కలెక్షన్లు. సినిమా సూపర్ డూపర్ హిట్టు.
***********************************************************************************************************************

ఏదో రాద్దామని మొదలెట్టి ఇంకేదేదో రాసినట్టున్నా... ఫ్రస్ట్రేషన్..  ఫ్రస్ట్రేషన్..!!! ఇంట్లో మా ఆవిడ ప్రేమ పూర్వక హింస , ఆఫీసులో మా డామేజరు అధికారిక హింస. రిలాక్స్ అవ్వడానికి  సినిమా కెళ్తే  వినోదాత్మక హింస.
పొద్దున్న తొమ్మిది నుండి రాత్రి ఎనిమిదింటిదాకా ఆఫీసు లో అఘోరించి, బజారు చేసీ, ఇంటి కొచ్చి, అంట్లు తోమి, వంట చేసీ (కంట్రోల్...కంట్రోల్... అబ్బెబ్బే అదేం లేదు...అంతా తూచ్..)  పదింటికి   ఐదొందలు పెట్టి టికెట్ట్ కొనీ "ఆగడు" సినిమాకెళ్ళి మహేష్ బాబు ఎంట్రన్స్ కి విజిలేసి
అలసిపోయిన పాపానికి ఇదా ప్రతిఫలం???
ఈ సినిమాకి రివ్యూ రాసే ఓపిక మాత్రం నాకు లేదు బగమంతుడా..!!  ఓ ఉత్తరం ముక్క మాత్రం రాస్తున్యా.
నాకు చాలా డౌట్లు ఉన్నాయ్... ఐ వాంట్ ఆన్సర్స్ రైట్ నౌ.

గౌరవనీయులైన శ్రీను వైట్ల సారు కీ,

మీ కొత్త సినిమా "ఆగడు" బాధితుడు పిచ్చాసుపత్రి నుండి అశ్రు నయనాలతో , రక్త కర్ణాలతో, శిరోభారం తో, స్వహస్తాలతో  రాస్తున్న విన్నపం ఏమనగా,

అయ్యా... గత కొన్నేళ్ళుగా  మీ సినిమాలకి కామెడీ సీన్లు తీశాక స్టోరీ అల్లుకుంటారనిన్నూ, బ్రహ్మానందం లేని మీ సినిమా బాస్మతీ రైస్ లేని బిర్యానీ లాంటిదనిన్నూ సమైక్య వాదులూ, తెలంగాణా వాదులూ మూకుమ్మడి గా ఒప్పుకునే  ఒకే ఒక్క గోప్ప వాస్తవం. సర్వ కధ సమ్మేళనం లాంటి మీ ఏకైక కధ భిన్నత్వం లో ఏకత్వాన్ని ఎలుగెత్తి
చాటుతూ  ఎక్కడ మొదలవ్వుద్దో , ఏడేడ తిరుగుద్దో  ఎవ్వరూ పట్టించుకోరనీ, మీ చేతకాని తనాన్ని క్షమించేసి
హాస్యాన్ని మాత్రం ఆస్వాదించి డైలాగులు నెమరేసుకొంటూ హాలు బయటకొస్తారన్నది జనమెరిగిన సత్యం.1. సినిమా మొదలవ్వటమే దుమ్ము, ధూళి తో మొదలయ్యింది. అది చూసి  "బెంగుళూర్ లో పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసీ, మరో వైపు పొగ" అనేసుకొని నేను తెగ ఇదైపోయాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యి పోనీ లే  ఔట్ డోర్ షూటింగ్ అక్కడ ప్లాన్ చేశారు అనుకున్నాను. మొదటి పాట కూడా
ధూళి బాంబులు పేలుస్తూ, ఆ దుమ్ము లోనే తీశారు. ఎందుకలగా?? "సినిమా దుమ్ము లేపుతాది" అని చెప్పడమా? లేకా మీ టీం తల విదిలించగా రేగిన మట్టా??


2.అసలు మా గురించి మీరేం అనుకుంటున్నారు??

"అవునండయ్యా.. మా ఇండస్ట్రీ లో మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ & డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు జనాలకి కావల్సినవన్నీ కొలిచి వాళ్ల టెంప్లేట్ లో మసాలాలు  దట్టించి వదుల్తారు. ఎందుకంటే మా ప్రేక్షకులకి ఇవే కావాల.
మన జనాలున్నారే?? తీసిన సినిమాని మళ్ళీ మళ్ళీ తీసి చూపించినా, హిట్టయిన సినిమాలని మిక్సీ లో వేసి వండేసినా, కామెడీ బాగుంటే కాంప్రమైజ్ అయిపోతారు. ఆ కామెడీ లేక పోతే హారర్ సినిమాలు కూడా చూడరు తింగరి కుంకలు. (నిజమే కదా??)
ఈళ్ళ మొహాలకి హాలీవుడ్ రేంజ్ సినిమాలొద్దు గానీ, హాలీవుడ్ సినిమాలనుండి లేపేసిన సీన్లు,  ఫైట్లూ చాలు.
ఎవడైనా ధైర్యం చేసి "1" లాంటి సినిమాతీస్తే అరాయించుకొనే శక్తి లేదు. మిధునం లాంటి సినిమాలకి ధియేటర్లు దొరికే పరిస్థితి లేదు. చూసే ఓపిక అస్సలు లేదు.  ప్రాసలు రాసే రైటర్లు, తన్నులు తినే బ్రమ్మానందం, ట్రయిలర్లు చూసి ఫేస్బుక్ లో
కొట్టుకు చచ్చే ఫ్యాన్సుండగా మా కేల చింత??"

ఇదేనా మాపై మీ అభిప్రాయం?? అందుకేనా మిగిలిపోయిన పలావునీ, పాచిపోయిన పులిహోరనీ కలిపి పోపెట్టి పార్సిల్ చేసేసి మా ప్రాణాల మీదకి తెచ్చారు??

౩. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న.
సినిమా లో క్యారెక్టర్లన్నీ, ఎవరో తరుముకొస్తున్నట్టూ, పాడైపోయిన లౌడ్ స్పీకర్ మింగినట్టూ హడావిడిగా, హై పిచ్ లో అరుస్తాయెందుకనీ?? దీన్నేనా ఏక్టర్ల భాషలో టైమింగ్ అంటారు??
దూకుడు సినిమా క్లైమాక్స్  లో బ్రహ్మీ చూపించిన ఎనర్జీ కి జనాల రియాక్షన్ బాగుందని ఈ సినిమా మొదటి  నుండీ చూపించాలన్న దురాశే అలా చెయ్యించిందా?? మహేష్ చేత బ్రహ్మీ ని ఇమిటేట్ చేయించినట్టుగా అనిపించలేదా?? అవి డైలాగులు చెప్పినట్టు లేవు దేవరా.... కాకా హోటల్ లో సప్లయిర్ "ఇడ్లీ,వడా,పూరీ,ఉప్మా, పొంగల్, దోసా,పెసరట్,మినపట్," అని గ్యాప్ లేకుండ లిస్ట్ చదివినట్టూ, సాఫ్ట్వేర్ కంపెనీ పేర్లకి అబ్రివేషన్స్ వింటున్నట్టూ ఉన్నాది.  ఒక్క డైలాగన్నా పూర్తిగా చెవులోకెళ్తే మీ నెక్స్ట్ సినిమాకి నాకు ఫ్రీ టెకెట్స్ పంపించి పగదీర్చుకోండి.

4. ప్రాస ఉన్న ప్రతి మాటా పంచ్ డైలాగ్ ఐపోతుందా?? అవసరం ఉన్నా లేకపోయినా రైమింగ్ కోసం రాసి పారేస్తారా?? ఆ రైమింగ్ కోసం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పక్కనెట్టుకొని రాసినట్టూ బొచ్చెడు ఇంగ్లీష్ పదాలు
గ్యాప్ లేకుండా రాసి పొలాల్లో మందుకొట్టినట్టూ మా చెవుల్లోకి పిచికారీ చేశారు. వై దిస్ కొలవెర్రి ఢీ గోవిందా?? బాద్షా
సినిమాని హిట్ చెయ్యలేదని ఇంత పగబడతారా??

5. నేను ఒక శ్రీను వైట్ల  సినిమాకి వెళ్ళీ, ఒక్క సారి కూడా నవ్వకుండా రావడం. ఇదొక రికార్డ్ మాషారూ..!  మా తాత చనిపోయినప్పుడు కూడా అంత సీరియస్ గా లేను నేను.
ఫస్టాఫ్ లో బ్రహ్మీ వచ్చాక నవ్వుదామని వెయిట్ చేశాను. బ్రహ్మీ వచ్చాక సినిమా ఎప్పుడైపోద్దా అని వెయిట్ చేశాను. బహుశా నాలో హాస్యగ్రంధులు హరించుకుపోయాయేమో..!!

5. ఫస్టాఫ్ గబ్బర్ సింగ్ నీ ( హీరో ఇంట్రొడక్షన్, హీరోయిన్ కాస్టూంస్ తో సహా పోలిక కనిపించేలా) , సెకండ్ హాఫ్ దూకుడునీ కలిపేసి రీమిక్స్ చేసి వదిలేస్తానంటే చేసెయ్యడానికి మేం ఏక్టర్స్ కాదూ.. రిసల్ట్ డిసైడ్ జేసే ఫ్యాక్టర్స్. (ఇదీ పంచ్ డైలాగుల ప్రభావమే)
తమరికి షార్ట్ టైం మెమొరీ లాస్ గానీ ఉందా లేకా మాకుందని మీ ఫీలింగా?? ఈ రోజుల్లో జనాలు చాలా షార్ప్ గా ఉన్నారయా.. సీన్ చూసి ఏ సినిమా నుండి లేపేశారో, ట్యూన్ విని ఏ ఆల్బం కాపీ కొట్టారో ఫేస్బుక్ లో పెట్టి దులిపేస్తున్నారు. అంచేత "నో చెవిలొ పువ్వెట్టింగ్...నో చెవిలొ పువ్వెట్టింగ్"

6.తమన్ బాబు గారి మొబైల్ లో ఇంటర్నెట్ ప్యాకేజ్ వెయ్యించలేదా??  కొట్టెయ్యడానికి కొత్త పాటల్లేక వారు సొంత ట్యూన్స్ ఇచ్చినట్టున్నారు. ఏంది సార్ ఆ పాటలో?? అసలేంటంటున్నాను?? దూకుడు పాటల్నే మళ్ళీ పెట్టుకోవాల్సింది. మిమ్మల్ని ఎవరాపగలరు?? ఇహ ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాబా...
పాలరాతి నేల మీద అందమైన అమ్మాయి హై హీల్స్ తో క్యాట్ వాక్ చేసినట్టూ "టిక్కుం..టిక్కుం..ట్రియ్యుం ట్రియ్యుం"

7. ఇందాకే వీడియో లో చూశా. ఆ డైలాగులు అర్ధం చేస్కోడానికి రెండో సారి చూడాలనీ, ఆ పై ఎల్లలు లేని ఎంజాయ్మెంట్ మీదేననీ సెలవిచ్చారు.... అడ్డెడ్డె... అర్ధం చేసుకోడానికి మళ్ళీ మళ్ళీ చూడ్డానికి ఇది క్రిస్టోఫర్ నోలన్ సినిమా కాదు గదా శ్రీను వైట్ల కామెడీ సినిమా.

8.పాపం ప్రకాష్ రాజ్ ఎమోషనల్ స్పీచ్ ని ఏజిటీజ్ గా వాడేసుకుని కమ్మగడతారా? తప్పు కదూ?? పోనీ ఆ డైలాగు అక్కడ విలన్ కి సూటయ్యి ఏడ్చిందా అంటే అదీ లేదు." గిసుంటివి మస్తు జేసినం.  గిదేమన్నా ఫస్ట్ టైమా? నాకు నచ్చకపోతే నెక్స్ట్ సినిమా లో క్యారెక్టర్ ని చేసి కసి దీర్చుకుంటా" నంటారా?? వాకే...!

9. సినిమా మొత్తం అయిపోయాక, చూశాక "సినిమా ఏంటి ఇంత చెత్తగా ఉందీ?" అని మీకు ఎందుకు అనిపించలేదూ అని ప్రశ్నిస్తా ఉన్నా?? సోనూ సూద్ లాంటి విలన్ని పెట్టుకొని,  క్లైమాక్స్ లో బ్రహ్మీ చేత గ్రాఫిక్స్
డాన్సులు చేయించడమేందో.. జనాల్ని నవ్వించీడానికే?? ఆ...హా??


10. కేవలం పంచ్ డైలాగుల కామెడీ, పాత సినిమాల పేరడీ ఒకసారి చూడొచ్చు. రెండో సారి భరించొచ్చు. కానీ మళ్ళీ
మళ్ళీ చూపిస్తుంటే వాటికోసం రిపీటెడ్ గా ఎగబడే రోజులు కావండయ్యా. యూట్యూబ్ లో బొచ్చెడు కామెడీ షార్ట్
ఫిల్మ్స్ ఉన్నాయ్. టీవీ లో వచ్చే జబర్దస్త్ కీ,  సినిమాలకీ కొంచెం తేడా చూపెట్టండి. అప్ డేట్ అవ్వండి అయ్యోరా..!

"సినిమాని విమర్శించడం కాదు..  నువ్వు తియ్యగలవా..?? అసలు సినిమా గురించి మీకేం తెల్సు?" అని, టికెట్టు
కొనుక్కొని ఆ తర్వాత నెత్తి కొట్టుకొని ఏడ్చే మా లాంటి ప్రేక్షకుల మీద పడకండి. మాకు స్క్రీన్ ప్లే లాంటి పదాలకి
స్పెల్లింగులు కూడా రావు. (అందుకే తెలుగు లో రాశా).
కొత్తగా ఉంటే కధ బాగున్నట్టూ, పాత కధయినా ఆసక్తి గా చూస్తుంటే స్క్రీన్ ప్లే బాగున్నట్టూ, పాటలొచ్చినప్పుడు ,
ఫైట్లొచ్చినప్పుడు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉంటే సినిమా సూపరన్నట్టు.

మీ నెక్శ్ట్ సినిమాలు వస్తాయి కదా... ఒంగడు,దాగడు,దగ్గడు, మింగడు,కక్కడు.. మున్నగు టైటిల్స్ తో. మా లాంటి బాధితుల ఆవేదనని అర్ధం చేసుకొనీ వాటిని కొంచెం చూడదగ్గ సినిమాలుగా తీసి వదలాల్సిందిగా వేడుకుంటున్నాను.
"లేదూ... ఆ శీనువైట్ల ఆనందం, వెంకీ సినిమాలకే పరిమితం, ఇప్పుడు స్టార్ డైరెక్టర్నీ.... సరికొత్త శీను ని , పూర్తిగా
మారిపోయాను" అంటారా?
ఇట్టాంటి సినిమాలు ఇంకా తీసి మమ్మల్ని చచ్చేలా చావగొట్టండి. ఆ తర్వాత హృదయకాలేయం, మూత్రపిండాలూ, అరుస్తున్న పేగులు, మెదడు వాపు, లాంటి టైటిల్స్ తో మరిన్ని సినిమాలొచ్చి మీరు ఇత్తడి చేసొదిలేసిన  మా మీద ఇంత మట్టేసి పోతాయి. దరిద్రం వదిలిపోద్ది.

చివరిగా...
ఈ సినిమా లో కొన్ని డవిలాగులున్నాయిగా  కత్తి తో మామిడికాయ కోసినట్టూ.. కస్ కస్ కస్ లాడుతా.... ఆ స్టైల్ లో చెప్పుకుంటే
ఈ సినిమా ఒక Senseless,worthless,time killing,money wasting,torturing,brain damaging,bone breaking,,boring, blunderful,harmful,pathetic,predictable,unbearable,unstoppable, routine,రొట్ట , చచ్చు, పుచ్చు చెత్త సినిమా.

ఇల్లాంటి డైలాగులు మాకు ధియేటర్లో ఎలా వినిపించినియ్యో తెలుసునా??
Senselessworthlesstimekillingmoneywastingbraindamagingbonebreakingtorturingboringblunderfullharmful
patheticpredictableunbearableunstoppableroutineరొట్టచచ్చుపుచ్చుచెత్తసినిమా.

ఇంతే సంగతులు
చిత్తగించవలెను.

జై హింద్.!!!