Monday, December 31, 2012

నల్ల బియ్యం పాకం..!!

పెపంచికం లో అదృష్టమున్న అందరికీ తినడానికి తిండి దొరుకుతుంది.
దంతసిరి ఉన్న ప్రతి ఒక్కరికీ రుచికరమైన ఫుడ్డు దొరుకుతుంది.
చేతులు దురదెక్కిన ప్రతి తింగరి జీవికీ వండిపెట్టే అవకాశం వరిస్తుంది.
గతి లేని ప్రతి దరిద్రుడికీ అది తినాల్సిన దౌర్భాగ్యం దాపురిస్తుంది.

ఇలాంటి సిల్లీ స్టేట్మెంట్లని దిగంబర సత్యాలు గా ప్రవచించడానికి నేను ధైర్యం చెయ్యడానికి గల కారణాలూ, అనుభవాలూ, అనర్ధాలూ, అవస్థలూ,అగచాట్లూ, అఘాయిత్యాలూ, ఆక్రందనలూ (ఫ్లో బాగుంది కదా అని వాడా) మీకు చెప్పి నాలాంటి వాళ్ళతో కలిసిపోడానికీ, నాలాంటి వాళ్ళని నాతో కలుపుకుపోడానికే ఈ ఊకదంపుడు ఉపోధ్ఘాతం.

పీజీల్లో పెట్టే ఉడికీ ఉడకని, రుచీ పచీ లేని గడ్డి తినలేనని నా నాలుక నిరాహార దీక్ష మొదలెట్టిన దినములు అవి.
ఆంధ్రా మెస్సుల్లోనూ, కర్ణాటకా రెస్టారెంట్లలోనూ తిన్న తిండి కడుపు లో కల్లోలం సృష్టిస్తుండటంతో ఆ బాధ, నాలోనూ ఒక గద లేని భీముడు మడిగట్టుకొని కూర్చున్నాడనీ, వాడికి చాన్సిస్తే తొడగొట్టి తాళింపు పెట్టగలడనీ  గుర్తు చేసింది. రూం తీసుకొని మన వంట మనమే చేసుకుతిందాం అన్న ఐడియాని ప్రతిపాదించాను నా ఫ్రెండ్స్ దగ్గర.

"అమ్మో... వంటా...?? పాతికేళ్ళు గా తినటం, తిన్నది అరాయించుకోవటం నేర్చుకున్నాం గానీ వండటం మన వల్ల అవుతాదంటావా? ?"......... అనుమానం వ్యక్తం చేశాడు మనోజ్ గాడు.

"మగాడు వంట చెయ్యడం అనేది అందరూ చూస్తుండగా నూడుల్స్ తినడం లాంటిదిరా.. తినేవాడికి బానే ఉంటాదేమో గానీ చూసేవాడికి చండాలంగా ఉంటాది. అది ఆడాళ్ళు ఇంట్లో  చేసి అంట్లు కడగాలి. మగాళ్ళు హోటల్లో చేసి నోట్లు లెక్కెట్టాలి".......... తేల్చి చెప్పేశాడు సుధాకర్ గాడు.

అప్పటికి ఆరేళ్ళబట్టీ పెనం-దోసా-అట్లకాడల్లా క్లోజ్ ఫ్రెండ్షిప్ మాది. మా వాళ్ళ ఉద్దేశ్యాలని కొట్టి పారెయ్యలేను. నా చుట్టూ సందేహాలు జోరీగల్లా మూగాయి.
అంటే పురుషులు తినడానికే గానీ వండటానికి పనికి రారా?? అది ఆడోళ్ల సొత్తా?
ఏం??? వంట చేతగాని వయ్యారులు లేరా? పాకశాస్త్రం లో పండిపోయిన పురుషాధములు...ఆఆఆఅ సారీ.... పురుషాగ్రేసురులు లేరా?? తెలియాలంటే నా గతం మీకు చెప్పాల్సిందే.
ఈ పిక్చర్ లో సెంటర్ పాయింట్ ని చూస్తూ... మీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వచ్చేయండి...


************************************************************************************
నాకు పెసరట్టంటే ఎంతిష్టమో మీ అందరికీ తెలుసన్న సంగతి నాకు తెలుసు. అట్టు కంటే ముందు నా మనసు దోచుకున్న పదార్ధం ఉప్మా అనీ, అసలు పెసరట్టు ని అంతిష్టపడటానికి సగం కారణం ఈ ఉప్మానే అనీ, ఆ సంగతి పదినిమిషాల క్రితమే తెలిసిందనీ మొహమాటం లేకుండా సిగ్గుపడుతూ మీకు చెప్పడానికి గర్వపడుతున్నాను.
నన్ను స్కూళ్ళో పడేసి మా అమ్మ చేతులు దులుపేసుకొని మనఃశ్శాంతిని పొందడానికి ముందు, మా తాతయ్య తో పాటూ సైకిల్ మీద రోజూ స్కూల్ కి వెళ్ళేవోడిని గంట లేట్ గా. "అంత లేటెందుకు అయ్యేదీ?" అని అడుగుతారేమో. అమ్మమ్మ వంట పూర్తయ్యేదాకా మా కిరాణా షాప్ తాతయ్యే చూసుకునేవాడు. ఆ తర్వాత తొమ్మిదింటికి మా తాత స్నానం చేసి, నుదుట మీద శోభన్ బాబు రింగు తీసీ, మొహానికి పాండ్స్ పౌడరూ, కాష్మీర్ స్నో కలిపి కొట్టి, తెల్ల చొక్కాకి పిఠాపురం నూర్జహాన్ సెంట్ పక్కనున్నోడు మొహంతిరిగి పడిపోయే రేంజ్ లో అంటించి, నల్లకళ్ళద్దాలు పెట్టి పూలరంగడి లా తయారయ్యేసరికి ఆ మాత్రం లేటయ్యేది. స్కూల్ కెళ్ళే సరికి ఇంటర్వెల్ లో పెట్టే "గోధుమ నూక ఉప్మా" కోసం పిల్లకాయలంతా బొడ్డాకులు కోన్ షేప్ లో కుట్టుకొని రెడీ గా ఉండేవారు.ఆ వంట చేసే ముసలావిడ నాకోసం ప్రత్యేకంగా ఒక డబ్బాతో ఉప్మా తెచ్చి పెడితే ఒక చెక్క పెట్టె మీద కూర్చొని సగం తింటూ, సగం చుట్టూ జల్లేస్తూ తన్మయత్వం తో అలౌకికానందాన్ని పొందుతూ ఉండేవాడిని. అదిగో అలా ఉప్మాకి దాసుడనయ్యేను. ఆ తర్వాత రోజూ ఉప్మా చేసిపెట్టమని మా మాతని యాతన పెట్టడం మొదలెట్టేను.

ఓ రోజు అమ్మకి జొరమొచ్చింది. ఆరోజు దాకా ఉల్లిపాయలు,మిరగాయలూ సన్నగా, ఓపిగ్గా తరగడానికి  మాత్రమే పరిమితమైన మా నాన్నకి వంట చేసే చాన్సొచ్చింది. ఇప్పుడంటే 2 నిమిషాల్లో మ్యాగీ రెడీ అంటున్నారు గానీ, అంతకు ముందు తొందరగా సింపుల్ గా అయిపోయే టిఫినీ ఉప్మానే నాకు తెలిసి. సో... ఇదే ఆలోచనతో నాన్న లుంగీ సగానికి మడతెట్టి సమాయత్తమయ్యాడు. "అబ్బాయిలూ... ఈ రోజు నల భీమ పాకం రుచి చూద్దురూ గానీ" అనేసి వంట గదిలోకి దూరిపోయాడు. "నల్ల బియ్యం పాకం అంటే ఏటమ్మా? అది కూడా తియ్యగానే ఉంటాదా?" అని కొండంత ఆశతో అడిగాను అమ్మని. "ఓరి నా నత్తి పకోడీ పుత్రా... అది నల భీమ పాకం రా...నేను వండాననుకో...దాన్ని వంట అంటారు, మీరు తింటారు. అదే మీ నాన్న చేశాడనుకో దాన్ని నల భీమ పాకం అంటారు. అది తినగలిగేలా ఉంటే తింటారు" అని నాకర్ధమ్ కాని రిప్లై నాన్నకి వినపడేలా చెప్పింది అమ్మ.

గంట తర్వాత ఉప్మా తీసుకొచ్చి నాకూ తమ్ముడికీ పెట్టి సైలెంట్ గా జారుకున్నాడు నాన్న. రెండు స్పూన్లు అతికష్టం మీద తిని ఇంక తినలేనని అమ్మకి కంప్లెయింట్ చేయడం తో కొంచెం నోట్లో వేసుకొని రుచి చూసి, కళ్ళు, ముక్కు పెద్దవి చేసి నొసలు చిట్లించింది.
"ఉప్మా కరాచీ నూకతో చేస్తారు... ఉప్పు తో కాదు. ఎన్ని చెంచాలేశారు ఇందులో?? "
నోరు తెరిచి మాట్లాడకుండా....సీరియస్ గా చెయ్యెత్తి నాలుగేళ్ళు చూపించారు నాన్నారు.
 "నా....లుగు చెంచాలా? నూక కలిపే ముందే చూసుకోవద్దా?"
"ఎసరు రుచి చూశాను...అప్పుడు సరిపోయింది... నూక కలిపాక సరిపోదేమోనని డౌటొచ్చి.. ఇంకో రెండు చెంచాలేశాను"........ అమాయకత్వం తో కూడిన పితృదేవుల రిప్లై.
అంత నీరసం లోనూ "ఏడిసినట్టుంది..." అని అరిచేసీ, ఉప్మా లో పెరుగు కలుపుకొని తినెయ్యమని అమ్మ అద్బుతమైన ఐడియా ఇవ్వటం తో నా జీర్ణాశయం శాంతించిందీ...  మా ఇంట ప్రశాంతత తాండవించింది.

**************************************************************************************
"చేపల పులుసెట్టాలన్నా, గుత్తొంకాయ కూరొండాలన్నా నీ తర్వాతే అక్కా..."  అని లొట్టలేస్తూ నాన్న పొగిడేస్తుంటే, కట్టించుకున్న ముందుపళ్ళు కాంతులు వెదజల్లేట్టూ నవ్వేసి మరి కొంచెం వడ్డించే మా అమ్మమ్మని చూసీ "వంట అనేది అమ్మో, అమ్మమ్మో చెయ్యాలీ... నేనూ, నాన్నా, తాతయ్యా తినాలీ" అని నా పసి హృదయం మీద నట్రాజ్ పెన్సిల్ తో రాసుకున్న రాతల్ని, నాన్ డస్ట్ ఎరేజర్ లాంటి వేయించిన చికెన్ ముక్కల్తో చెరిపేశాడు మా తాతయ్య.

సెలవులకి అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళినప్పుడూ.. అప్పుడప్పుడూ మా తాత, అమ్మమ్మ కబంధ హస్తాలనుండి వంటగది ని స్వాధీనపరుచుకొని కోడికూర వండేవాడు. అది ఎంత అద్బుతం గా ఉండేదీ అంటే... నేనూ, మా చిన్నమాయా కూర దాక పక్కనెట్టుకొని నాకేసేవాళ్ళం. "నాన్న చికెన్ వండితే... పీస్ నోట్లో పెట్టగానే కరిగిపోతుంది..ఎలా చేస్తాడో ఎవరికీ తెలీదు" అని మా చిన్నపిన్ని పొగుడుతుంటే... మా అమ్మమ్మ మాత్రం "మరికొంత నూనేసి, అంత జీడిపప్పేసి వేపితే రుసిగా ఉండదా మరీ..? రెండు గిన్నెల తో పోయేదానికి పది గిన్నెలకి అంటిస్తాడు. వంటగదంతా వరద చేసి పారేస్తాడు.. అంట్లు తోమలేక నడుం పడిపోతుంది. " అని తనదైన శైలి లో విరుచుకుపడేది. "కూర బాగుందా తాతా....? మీ మామ్మ అలాగే అంటాది. నేను బాగా వండానని కుళ్ళు దానికి. అన్నీ అమ్మ బుద్ధులే. కంచం లో భోజనం పెట్టినపుడు, పక్కన గ్లాసు తో మంచినీళ్ళెట్టాలని కూడా తెలీదు ఈ రోజు దాకా.. చారు గిన్నెలో కన్నాల గరిట పెట్టే ఇది కూడా చెప్పెయ్యడమే నాకు " అని దెప్పిపొడుపులు మొదలెట్టేవాడు మా తాత.
నలుడూ, భీముడూ గరిటని గద తిప్పినట్టు తిప్పిన వంటోళ్ళని మా తాత వండిన కూరలు రుచి చూశాకే నమ్మేను నేను.

*************************************************************************************
అందుకే... నా మిత్రబృందం వద్దన్నా గానీ, తాత ఇచ్చిన ఈ ధైర్యమే నేను స్టౌ, సిలిండర్ కొనేలా పురిగొల్పాయి. అమ్మ ఇచ్చిన సలహాలు నా చేత పెనం, ప్రెషర్ కుక్కర్ కొనేలా ప్రోత్సహించాయి. అల్లం వెల్లుల్లి పేస్టులూ, ఎమ్టీఆర్ మసాలా పౌడర్లూ,  కంచాలూ-చెంచాలూ, గిన్నెలూ-గరిటలూ, కత్తిపీట-పట్టకారు, పామాయిలూ - ప్రియా పచ్చళ్ళూ,ధనియాలూ-మిరియలూ నంజుకోడానికి వడియాలూ, పప్పూ- బియ్యం, ఉప్పు - కారం  కొని నా కిచెన్ లో అలంకరించాను. ముచ్చట గా ఉన్న కిచెన్ ని చూసి, పక్కోడు బిల్ కడతానన్నప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్ళి ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందమేసింది. "పోపులంటే ఏంటీ?"అనే బేసిక్ క్వైరీ నుండి మొదలుకొని "బిర్యానీ చెయ్యడం ఎలా?" వరకూ అమ్మ ఫోన్ లో ఇచ్చే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి నేను చెయ్యితిరిగిన వంటగాడిగా... కాదు కాదు "కండలు తిరిగిన వంటగాడిగా" రూపాంతరం చెందాను.

అడుగుమాడిన అత్తెసరన్నం, ముక్కలుడకని దుంపల పులుసుల కాంబినేషన్ లో కాలం ఆవిరవుతుండగా....ఏతెంచిన ఒకానొక వారాంతపు దినమది. రాత్రంతా జర్నీ చేసి పొద్దున్నే బస్సు దిగిన నిద్రమొహం లా దరిద్రంగా ఉంది ప్రకృతి.వంట మొదలెడదాం అనుకునేసరికీ కాయగూరల బుట్ట ఖాళీ గా కనిపించింది. బయటకెళ్ళి తెద్దామంటే నాకు చారెడు చాదస్తం, బారెడు బద్దకం కాబట్టీ.. ఆల్టర్నేటివ్ ఏంటా ఆలోచించాను.  మంచింగ్ లేకుండా మందెయ్య లేమూ... కూరగాయలు లేకుండా కూరొండలేము కనుక... ఈ రోజు కి నూడుల్స్ చేసుకుందాం అని డిసైడ్ చేశాను. "ఒట్టి నూడుల్స్ ఏం తింటాం రా.. ఎగ్ నూడుల్స్ చెయ్యి " అని సలహా ఇచ్చాడు సుధాకర్ గాడు. "అదెలాగో నాకు తెలీదు...నువ్వే హ్యాండిల్ చెయ్యి" అన్నాన్నేను. "వెజ్ బిర్యానీలో చికెన్ పీసులేస్తే చికెన్ బిర్యానీ అయినట్టే... మ్యాగీ నూడుల్స్ లో గుడ్డు గిలక్కొట్టేస్తే ఎగ్ నూడుల్స్ అవుతాది... సో.. సింపుల్" అని పండుఒలిచి నోట్లో పెట్టినట్టు వివరించడం తో నేను ప్రిపరేషన్ మొదలెట్టాను. నీళ్ళు  గిన్నెలో పోసాను. నూడుల్స్ అందులో వేశాను. గిన్ని పొయ్యి మీద పెట్టాను. కింద మంటెట్టాను. కాసేపయ్యాక నూడుల్సూ, మసాలా వేసి... "ఇప్పుడేం చెయ్యాల్రా?" అనడిగాను. వాడు సెల్ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడుకుంటూ వచ్చి... "ఎగ్స్ అందులో వేసి కలిపెయ్యి.. పెంకులు పారెయ్యి" అన్నాడు.
"ఓస్..ఇంతేనా... " అనుకొని వాడు చెప్పినట్టే వేసి తిప్పడం మొదలెట్టాను...తిప్పాను..తిప్పాను.. తిప్పాను..... ఫైనల్ గా అది ఇలా అయ్యి కూర్చుంది.


 దరిద్రుడు నిద్దరపోతే అలార్మ్ మోగినట్టు కలొచ్చినట్టూ... మన ప్రయోగం ఇలా బెడిసికొట్టిందేంటీ? అనిపించింది.
కష్టపడి చేసుకున్నది... పారేసుకుంటామా? ఆకలి మీద ఉన్నామేమో..."బానే ఉన్నాది" అనిపించి తినేశాం. ;)
********************************************************************************
ఈ బెమ్మీల వంటకాలన్నీ ఇట్టాగే తగలడాతాయి అని మీరు అనుకుంటే చింతపండు లేకుండా చారెట్టినంత దారుణం. పసుపు లేకుండా పులిహోర చేసినంత పాపం. ఆడలేడీసేమీ తక్కువ తినలేదు.
లాస్ట్ ఇయర్ మా రవీంద్ర గాడి పెళ్ళి పుణ్యమా...అని నాలుగేళ్ల తర్వాత మా ఇంజినీరింగ్ క్లాస్మేంట్సందరం అనుకోకుండా కలిశాం. ఇల్లు విశాలం గానూ, వంటకాలు రుచికరం గానూ, పరిమాణం భారీగానూ ఉంటాయని చెప్పి మా ఊళ్ళో నా ఏకైక ఫ్రెండ్ మేరీ వాళ్ళింట్లో గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. అందరం అందర్నీ పలకరించుకుంటూ, పళ్ళు ఇకిలించుకుంటూ ఆనందిస్తున్న గొప్ప సమయం.

నేనుః ఏంటి మేరీ...ఏం సంగతులు? ఆఫీస్ లో వర్క్ బాగా తొక్కేస్తున్నారా?
మేరీః నేను స్కూల్లో ఇచ్చిన హోమ్ వర్కే మా డాడీ తో చేయించేదాన్ని..ఆఫీస్ లో వర్కెందుకు చేస్తాను చెప్పు? సంగతులు చెప్తాను గానీ... ఎవ్వరికీ చెప్పకూడదు మరి..! ప్రామిస్?
నేనుః "సంగతులు చెప్పమంటే... సీక్రెట్స్ చెప్తున్నావా....సరే ప్రామిస్"
మేరీః "ఆ మధ్య... మార్నింగ్ వాకింగ్ మొదలెట్టాను రాజ్కూ...మా ఇంటి నుండి రామా ధియేటర్ దాకా"
నేనుః "అవునా... హఠాత్తుగా అంత పనెందుకు చేశావు?...ఐనా మంచిదే కదా...కానీ ఇందులో సీక్రెట్ ఏముందీ?"
మేరీః "అంటే...అంత దూరం నడిచేసరికి ముందు ఆయాసమొచ్చింది, తర్వాత నీరసమొచ్చింది, ఈ వాకింగులు మనకి పడవని తెలిసొచ్చింది. అందుకే...రిక్షా కట్టించుకొని ఇంటికి తిరిగొచ్చేశాను"
నేనుః  "(@*$#%&((@#$...."
మేరీః "అది సరే గానీ.... మా పేరెంట్స్ బయటకెళ్ళారు...కాబట్టీ నేనే మీ అందరికీ కాఫీ పెట్టి, నూడుల్స్ చేసి పెడతానేం"
ప్రసాద్ గాడుః ఇప్పుడవన్నీ ఎందుకులే....నీకు శ్రమా.. మాకు రిస్కూ...!
మేరీః తినకుండా వెళతామంటే నేను అరిచి ఊరుకునే టైప్ కాదు. కరిచి ఉసురు తీసే టైప్.
మస్తాన్ గాడు : అదింకా రిస్క్ కదా....నాకసలే ఇంజక్షన్లంటే బయ్యం. ఇంతకీ ఎగ్ నూడుల్సా...చికెన్ నూడుల్సా?"
(నాకు ఎక్కడో కలుక్కుమందీ...ఎగ్ నూడుల్స్ పేరు వినగానే)
మేరీః  "మీ మట్టి మొహాలకి మ్యాగీ నూడుల్సే ఎక్కువరా.."
మనోజ్ గాడుః ఇదిగో...ఇంటికి పిలిచి మమ్మల్ని  ఇలా అవమానించడం ఏం బాలేదు.
మేరీః మరిగిస్తే పాలు పొంగినట్టూ, పారబోస్తే నీళ్ళు పారినట్టూ మీలాంటి డిప్పకాయ ఫేసులు చూస్తే నాకు అలా మాటలు ప్రవాహం లా తన్నుకొచ్చేస్తాయ్.
సత్తిమాయః ఏటి.. మేరీ ఇల్లంతా వెతుకుతున్నావ్... ఏదన్నా కనిపించట్లేదా??
మేరీః మా వంట గది ఎక్కడుందా అని వెతుకుతున్నా...! కనిపించింది ఇప్పుడే...! కాఫీ తెస్తున్నానుండు...!
మనోజ్ గాడు: సత్తి మాయా.. నాకేదో తేడా కొడుతుంది రా...!
కృష్ణబాబుః అమ్మా...శాంభవీ... కప్పు చిన్నదిగా ఉందీ... కాఫీ సగానికే ఉందీ... చిక్కదనం మిస్సయ్యిందీ..!
 మేరీః పాలు పావులీటరే ఉన్నాయి. మీరు పదిమందున్నారు. అందుకే వాటర్ వాల్యూం పెంచీ, కప్పు సైజ్ తగ్గించాను. చండాలంగా నట్టింట్లో ఏడవకు... శని. మీ అందరికీ వేడి వేడి నూడుల్స్  రెడీఈఈఈఈఈఈఈఈఈఈఈ...!

ఆ పదార్ధం వండేటప్పుడు ఇలా కనిపించింది...
 వండాక ఇలా అయ్యిందీ....


తినడానికి ఎలా ఉన్నాదో... నాకు తెలీదు.
తిన్నాక ఏమయ్యిందో మా మస్తాన్ గాడు సిగ్గుతో చెప్పలేదు. అదో రకమైన సౌండ్ ఇచ్చాడు.

మేరీః ఎలా ఉంది మస్తానూ? బానే ఉంటాదిలే నేను చేస్తే... కొంచెం నీళ్ళు తక్కువయ్యాయి...అంతే..!
మస్తాన్: "ఆనందం తో ఊళ వేసే నక్క అరుపుకీ, బాధ తో మూలిగే కుక్క ఏడుపుకీ తేడా తెలియట్లేదామ్మా....? ఎవడొస్తాడో గానీ... వాడి బతుకు బుగ్గిపాలే..."
మేరీః  ఏదో నీ అభిమానం మస్తానూ... ఇంకొంచెం వెయ్యనా?
-------------------------------------------------------------------------------------------------------------------------------------

సెమీ ఫైనల్ గా నేను చెప్పేదేమంటే...
తిండి ఒక అవసరం.వండే అవకాశం వరం. వంటకం బాగా రావటం మన అదృష్టం.చక్కగా వండిపెట్టేవాళ్ళు మనకి ఉండటం పూర్వజన్మ సుకృతం.
________________________________________________________________________________

సాటి బ్రహ్మీలకి, బాల వంటగాళ్ళకీ/గత్తెలకీ ఇవియే నా సూచనలుః

1. వంటల్లో చాలా రకాలున్నాయని అపోహలతో భ్రమపడీ భయపడుతుంటారు మన యువత.  ఉన్నవి మూడే. 1. ఇగురు 2. పులుసు 3. వేపుడు.
పోపులు నూనెలో మాడబెట్టి, అందులో ఉల్లిపాయలు వేయించి, కూరగాయ ముక్కలు పడేసి ఉప్పు, కారం జల్లేసి, కొంచెం నీరుపోసి కలిపేసి మూత పెడితే అది "ఇగురు". నీళ్ళెయ్యకుండా, మూత పెట్టకుండా మరికొంచేమ్ నూనేసి వేయిస్తే అది "వేపుడు". చింతపండు పులుసేస్తే  అది.."పులుసు". 

2. నాన్వెజ్జీ ల కోసం ప్రాణాలు అర్పించే బ్రాయ్లర్ కోళ్ళు లోకం లో కోకొల్లలుగా ఉండటం మన అదృష్టం. "బాగుంటాదో లేదో, ఉడుకుతాదో లేదో" అన్న టెన్షన్ అక్కర్లేదు. ఉప్పు-కారం వేసి ఉడకేస్తే అదే బాగుంటుంది.

3. ఉప్మా చేసేటప్పుడు ఉప్పెయ్యటం మరిచిపోవటం అనేది నమ్మిన మనిషి దగ్గర నమ్మకం పోగొట్టుకోవటం లాంటిది. అది ఒకసారి జరిగిపోతే మన చేతుల్లో ఏం ఉండదు. కాబట్టీ తస్మాత్ జాగ్రత్త.

4. దోసలు వెయ్యటం ప్రాక్టీస్ చేసినోడికి  స్టీరింగ్ తిప్పడం బాగా వస్తుంది. పవర్ స్టీరింగ్ కాకపోయినా ఒంటి చేత్తో డ్రైవింగ్ చేసీగల్రు.

5. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతాదంటారు. కానీ నీళ్ళెక్కువైనప్పుడు అరిటికాయ కూరా,చింతపండు ఎక్కువయినప్పుడు చారు, ఉల్లిపాయలెక్కువైనప్పుడు ఎగ్ బుర్జీ ల పరిమాణం పెరుగును. (FYI... గత్యంతరం లేని అత్యవసర పరిస్థితుల్లో వాడుకోండీ).

6. మొదట్లో ఉప్పు, కారం, పులుపు మొదలైనవి ఎక్కువ తక్కువలవుతాయి. అది సహజం. అందుకే ముందు జాగ్రత్త గా ఎంతోకొంత వెయ్యాలి. సరిపోలేదంటే మరికొంత వేసుకోవచ్చు. మన లక్ కిక్కిచ్చి ఎక్కువైపోతే మరికొన్ని నీళ్ళు పోసి మరిగించడమే.

7. వండేవాడికే అందరికంటే ముందు వంటకం టేస్ట్ తెలుస్తుంది. మన కర్మ కాలి ఎప్పుడైనా పదార్ధం తేడా కొట్టేసినట్టు తెలిస్తే, మినిమం గంట సేపు కూర పొయ్యి మీదుంచి కాలయాపన చేసెయ్యాలి. ఈ లోపు తినేవాళ్లకి  బాగా ఆకలి వేస్తుంది. మంచినీటి రుచి దాహమేసినప్పుడూ, మాడిన కూర రుచి ఆకలేసినప్పుడూ తెలుస్తుంది కాబట్టీ మనం సేఫ్ జోన్ లోకి పోతాం.

8. తినేవాడికి వండేవాడెప్పుడూ లోకువే. వాళ్ళిచ్చే నెగటివ్ కమెంట్స్ కట్ చేసేటప్పుడు ఉల్లిపాయల్లా కన్నీళ్ళు పెట్టిస్తూ మనల్ని మానసికం గా కృగదీస్తాయి. మన ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొడతాయి. మన పాక ప్రయోగం బెడిసికొట్టినప్పుడు అలాంటివి జరగకుండా రివర్స్ ఎమోషనల్ డ్రామాతో సన్నివేశాన్ని రక్తి కట్టించాలి. పాజిటివ్ కమెంట్స్ మాత్రమే ఏక్సెప్ట్ చేస్తామన్న విషయాన్ని మనం క్లియర్ గా తెలియజేయాలి.

9. మసాలాలు నూరెయ్యాలీ, అల్లం-వెల్లుల్లి దంచెయ్యాలీ, ఎండు మిరపకాయలు చిదిమెయ్యాలీ, చింతపండు పులుసు పిసికెయ్యాలీ... లాంటి రూల్స్ పక్కన పెట్టండి. పాలు కొని మరిగించాలి..  తోడుచుక్క కోసం పక్కింటికెళ్ళాలీ లాంటి పాతకాలపు పనులకి దూరంగా ఉండండి. మనకి రెడీ మేడ్ మసాలా పేస్టులున్నాయ్, పెరుగు ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయ్. అంత గొప్పటేస్ట్ రాకపోయినా టైం వేస్టవ్వకుండా ఉంటుంది.

10. వంట చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నీ కుదిరితే తిండానికి ఇష్టం గా ఉంటుంది. కానీ అంట్లు తోమాలంటే  కష్టం గా ఉంటుంది. అవి అలాగే వదిలేస్తే  మాత్రం వాసన భరించలేనిదిగానూ, పరిస్థితి పాథటిక్ గానూ ఉంటుంది. కాబట్టీ చెయ్యి కడిగినప్పుడే అంట్లు కూడా కడిగెయ్యండి. (ఇది కొంచెం కష్టమే గానీ తప్పదు)

11. నేటీ హీరోయిన్లే రేపటి ఐటెం బాంబులు. నేడు మిగిలిపోయిన అన్నమే రేపటి కమ్మని పులిహోర. అన్నం ఇళయరాజా స్వరూపం. వేస్ట్ చెయ్యకండి.

12. మనమెన్ని వంటలు చేసినా, బయట ఎన్ని రుచులు చూసినా, అమ్మ చేసే వంటే గొప్పది. ఎందుకంటే అమ్మ మన కడుపు నిండాలన్న ప్రేమ తో వండి పెడుతుంది. హోటల్ వాడు వాడి జేబు నిండాలన్న ఆశతో వండిపెడతాడు. ఇక్కడ బిజినెస్ మాత్రమే ఉంటుంది, ఆ ప్రేమ మిస్సవుతుంది.

నోరూరించక పోయినా గానీ కడుపు మాడకుండా చేసే వంటకి నా ఈ 12 సూత్రాలూ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీరు ఫాలో అవ్వగలరని ఆశిస్తున్నాను. మీలో నిజంగా వంటొచ్చినోళ్ళు ఉంటే ఈ పాపిని క్షమించాలని వేడుకుంటున్నాను. మా మేరీ ఈ పోస్ట్ చదివి నన్ను కొట్టడానికి రాకూడదని కోరుకుంటున్నాను.
-------------------------------------------------xxx------------------------------------------------

మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 
మన  పరిచయాలూ, కబుర్లూ, స్నేహాలూ ఇలాగే కొనసాగాలనీ, మీ అందరికీ కొత్త సంవత్సరం గొప్ప గొప్ప అనుభూతులని ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తూ.....


జై హింద్..!!!

Monday, December 3, 2012

ఇది కధ కాదు 9 : తుది అశ్రు బిందువులు

ప్పించు కోడానికి చిన్న ప్రయత్నం కూడా చెయ్య లేదు రామరాజు. అతని మీద ఎన్ని నమ్మకాలు? ఎన్ని కధలు?? ఎన్ని అభియోగాలు? "మహిమలున్నాయంట అతనికి..! అతనికి గురిపెట్టిన తుపాకీ పేలదట. ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమవుతాడట". ఈ నమ్మకాలకి అతన్ని పట్టుకున్న అళ్వారు నాయుడు, జామేదార్ కంచుయేనన్ లు అతీతులు కారు. అలాంటి అల్లూరి శ్రీ రామరాజుని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాణాలతో పట్టేశారు. ఆలస్యం చెయ్యలేదు ఇక. ఒక నులకమంచం తెప్పించి  దాని మీద రాజుని పడుకోబెట్టి, అంగుళం కూడా శరీరాన్ని కదిపే వీలు లేకుండా తాళ్ల తో కట్టేశారు. రాజు ని సజీవంగా పట్టుకున్నట్లు మద్రాస్ కి టెలిగ్రాం ఇచ్చి,  ముందు కొయ్యూరు సైనిక శిబిరానికీ, అక్కడ నుండి కృష్ణదేవీ పేట కి తీసుకొస్తామని అక్కడి పోలీసులకి సమాచారం అందించారు. స్థానిక గిరిజనులని పిలిచి, రాజుని కట్టిన మంచాన్ని భుజాలకెత్తించారు. మంప గ్రామం నుండి కొయ్యూరు వెళ్ళాలి అంటే ఆరు మైళ్ళు అడవి లో వాగులు దాటి, వెదురు పొదలు దూరి ప్రయాణించాలి. ప్రయాణం మొదలైంది. మధ్యాహ్నం వేళకి కొయ్యూరు సరిహద్దులలోకి ప్రవేశించగా అప్పుడు జరిగిందో సంఘటన. తన బృందంతో పెట్రోలింగ్ చేస్తున్న అస్సాం రైఫిల్స్ అధిపతి మేజర్ గుడాల్ ఎదురయ్యాడు వీళ్లకి. విషయం తెలుసుకొని, రాజు ని తనకి అప్పగించవలసిందిగా ఆదేశించాడు.కంచుయేనన్ దానికి ఒప్పుకోకుండా మద్రాస్ ప్రెసిడెన్సీ ఆదేశాల మేరకు రాజు ని స్వయం గా కృష్ణదేవిపేట తీసుకెళ్ళి కలెక్టర్ కి అప్పగిస్తానన్నాడు. మరి రాజుని పట్టిస్తే వచ్చే డబ్బు, అంతకు మించి వచ్చే వెలకట్టలేని కీర్తినీ ఎవరు మాత్రం వదులుకుంటారు?? దీనితో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. అది సంవాదం కాదు..  పక్కనే మంచానికి కట్టి వేయబడి ఉన్న రాజు ప్రాణాలు ఉండాలా? వద్దా?? అన్న విషయం మీద పరోక్షం గా జరుగుతున్న వాదన.గుడాల్ తన హోదానీ, అధికారాన్నీ, మొండితనాన్నీ ఉపయోగించి బెదిరించడం తో రామరాజుని అప్పగించక తప్ప లేదు కంచుయేనన్ కి.

మేజర్ గుడాల్ రామరాజుని తన శిబిరం వద్దకు తీసుకెళ్ళాడు. ఉద్యమానికీ, దాడులకీ సంబంధించి ఇద్దరి మధ్యా చిన్నపాటి వాగ్యుద్ధం జరిగింది. ఏ తెల్లవాడూ సమాధానం చెప్పలేని ప్రశ్నలున్నాయ్ రాజు వద్ద. తన పోరాటానికి బలమైన కారణం ఉంది. నిస్వార్ధమైన ఆశయముంది. న్యాయముంది. నిజాయితీ ఉంది. కానీ ఎదురుగా ఉన్న గుడాల్ చేతిలో గన్ మాత్రమే ఉంది. రాజు ని ఒక చింతచెట్టుకి కట్టివేయించాడు. అతని తల కి ముసుగు తొడిగించాడు. గన్ గురి చూసి కాల్చలేదు గుడాల్. గుండెల మీద పెట్టి కాల్చాడు. మూడుసార్లు తుపాకీ నిప్పులు కక్కింది. అల్లూరి శ్రీరామరాజు విడిచిన ఆఖరి శ్వాస అతనిచ్చిన గుండె ధైర్యం తో శత్రువులనీ, అతన్ని మోయబోతున్న గిరిజనులనీ, చెట్లనీ, పుట్లనీ, పువ్వులనీ ఎటువంటి వివక్షా చూపించకుండా స్పృశిస్తూ వెళ్ళిపోయింది. ఈ మన్యం వీరుడి చావు కి తను వెన్నుదన్ను గా నిలిచానని బాధ పడిందో?? లేకా  రాజుగారు  తన ఒడిలో  ప్రాణాలు విడుస్తున్నందుకు గర్వ పడిందో... ఆ చెట్టు.

రాజు మరణించిన విషయాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ కి వైర్లెస్ లో కొయ్యూరు నుండి సమాచారం పంపించాడు గుడాల్. ప్రాణాలతో పట్టుకున్న వాడిని ఎందుకు చంపవలసి వచ్చిందో సంజాయిషీ చెప్పమనడం తో "కొయ్యూరు చేరాక లఘుశంక కొరకు రాజు కట్లు విప్పమని కోరాడనీ,విప్పిన తర్వాత  తప్పించుకొని పారిపోడానికి ప్రయత్నించడం తో కాల్పులు జరుపవలసి వచ్చిందని" కధ అల్లి చెప్పాడు. తర్వాత రామరాజు భౌతిక కాయాన్ని అదే మంచానికి కట్టి  "బ్రిటీష్ సింహాసనాన్ని ఎదిరిస్తే... ఎవరికయినా ఇదే గతి పడుతుందనీ " గ్రామగ్రామానా ఊరేగింపు తీశారు.

చీకటి పడే సమయానికి రాజు శవాన్ని కృష్ణదేవీపేట కి చేర్చారు. రాజు సజీవం గా పట్టుబడ్డాడని మాత్రమే తెలిసిన  ప్రజలు , రాజు శవమై వచ్చాడని తెలిసి కలత చెందారు. "రూధర్ ఫర్డ్" మాత్రం గుడాల్ చేసిన పనికి అతని పై మండి పడ్డాడు. "తను చేసింది తప్పే అయితే... తనని సంజాయిషీ అడగవలసింది బెంగాల్ గవర్నర్ మాత్రమే అనీ, తనని ప్రశ్నించే అధికారం ఇక్కడ ఏ అధికారికీ లేదనీ" మొండికేశాడు మేజర్ గుడాల్. వేరే దారి లేక అతను అల్లిన కధనే యదార్ధ ఘటన గా ప్రకటించాడు రూధర్ ఫర్డ్.

ఎక్కడయితే కృష్ణదేవీపేట ప్రజలకి శ్రీ రామరాజు పరిచయమయ్యాడో, ఎక్కడ యోగిగా ఆధ్యాత్మిక బోధనలు చేశాడో, ఎక్కడ మన్యం వాసులకి ఆయుర్వేద వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టాడో, ఏ స్థలం లో పంచాయితీ పెద్ద గా తీర్పులిచ్చాడో, ఆఖరికి ఎక్కడ ఒక విప్లవకారుడై దర్శనమిచ్చాడో... సరిగ్గా అక్కడే , ఆ రామాలయం దగ్గరే ఆయన మృతదేహాన్ని ప్రదర్శనకి పెట్టారా రోజు.

నమ్మలేదు మన్యం..
తూటాలూ, తుపాకులూ ఆయన్నేం చేయగలవు??
అసలు అవతార పురుషులకి అంతం ఏంటి?
శ్రీ రామరాజు ఆ భద్రాద్రి రాముడి అవతారం. ఆయనకి చావేంటి??

కానీ ఊహలూ, నమ్మకాలూ గొప్పగా ఉంటాయి. వాస్తవాలు తట్టుకోలేనంతగా, బాధాకరంగా, ఒక్కోసారి అసహ్యం గా ఉంటాయి. 

శవ పంచాయితీ మొదలైంది దీపాల వెలుగు లో.. వీధి వీధినా పోలీసులే... ఆనందోత్సాహలతో కేరింతలు కొడుతున్నారు..ఊరంతా కదం తొక్కుతున్న మిలిటరీ బూట్లు...లాఠీలు...!
"మీ రాజొచ్చాడు... పాలు ఇవ్వండి... తాగుతాడు"
"మీ రాజు గారు పంచాయితీ పెడుతున్నారు రండీ.."   వెటకారాలు.. ఎకసెక్కాలు...
"మీ దేవుణ్ణి చంపేశాం....వచ్చి చూస్కోండి" .. కోపం... పగ... ఇన్ని నెలలు గా తమకి కంటి మీద కునుకు లేకుండా చేసిన రామరాజంటే ద్వేషం. ఇక ఈ అడవి లో భయపడుతూ తిరగాల్సిన పనిలేదన్న ఆనందం.
గుండె భారం దించుకొనేలా, గుండెలవిసేలా ఏడ్చే స్వాతంత్ర్యం కూడా లేదు గ్రామ ప్రజలకి.

రాజు చేత "అన్నగారూ" అని పిలిపించుకున్న చిటికెల భాస్కరనాయుడు గారు... రాజు విప్లవకారుడయ్యాక అతన్ని కలవడానికి ఇష్టపడని  భాస్కరనాయుడు గారు వచ్చారు రాజుని చూడ్డానికి. చనిపోయింది శ్రీరామరాజే అని గుర్తించే బాధ్యత అతనిదే మరి. రాజుతో పరిచయమున్న 50 మంది మున్సబులొచ్చారు రామరాజు ని గుర్తించడం కోసం. కట్లు విప్పి రాజు శవాన్ని చెట్టుకి జారేశారు. ఫోటోలు తీసే కార్యక్రమం ప్రారంభమైంది. హృదయ విదారకంగా ఉందా దృశ్యం.. చాతీ మీద పాయింట్ బ్లాంక్ లో కాల్చిన దానికి ఫలితంగా మాంసపు పీలికలు వేలాడుతూ మూడు పెద్ద రంధ్రాలు. రక్తం లో ముంచి తీసినట్టున్నాయ్ బట్టలు. తెల్లవాళ్ల రక్తపుటేరులు పారించిన రామరాజుని మాంసపు ముద్ద చేసి, అతని నెత్తురుని కళ్ళజూసి ప్రతీకారం తీర్చుకుంది వలసదారుడి ప్రభుత్వం....!


తెల్లవారిపోతుంది. శవం నుండి వాసన మొదలైంది. ఊరి శివార్ల లో దొరికిన కట్టెలతో చితి పేర్చారు. చితికి నిప్పంటించే ముందు గా రాజు ధరించిన ఖాకీ నిక్కరు లో లభించిన రక్తంతో తడిచిపోయిన మొల గడియారం, పుస్తకం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వందల మంది చూస్తుండగా, సూర్యోదయం అవుతుండగా, రెండో సూర్యుడి లా చితి మండటం మొదలైంది. ఎన్నో భయాల మధ్య పోలీసులే చితా భస్మాన్ని తాండవ నది లో కలిపేశారు.

******************************************************************************

రాజు చనిపోయాక బ్రిటిష్ సేన కి కొండంత ధైర్యం వచ్చింది. ప్రత్యేక దళలాని వెనక్కి పంపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. రాజుదళం లో ప్రధమ సేనాని అయిన "గంటం దొర" నాయకుడయ్యాడు. అతన్ని పట్టుకొనే పని మీద 15 కి పైగా పోలీస్ దళాలు గాలిస్తున్నాయి. ఆ సమయం లోనే "నడింపాలెం" గ్రామానికొచ్చిన గంటందొర "రామరాజు బ్రతికే ఉన్నడనీ, ముగ్గురు అనుచరులతో మాంచ్ ఖండ్ వెళ్ళాడనీ...జూన్ 2 నాటికి తానేంటో చూపిస్తానని" ప్రకటించాడు. అయితే పోలీసులకి పట్టుబడిన అగ్గిరాజు నుండి సమాచారం రాబట్టిన పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమం మొదలు పెట్టిన రామరాజు లేకపోవడం, పోలీసులు పెట్టే బాధలు, సహకరిస్తే వచ్చే బహుమతులు ప్రజల్లో చాలా మార్పు తీసుకొచ్చాయి. ఏ గ్రామం ఉద్యమకారులని ఆ గ్రామ ప్రజలే కొట్టి చంపేయ్యడమో, ప్రాణాలతో పట్టుకొని పోలీసులకి అప్పగించడమో చేయడం సాధారణమయ్యింది.

మే 26 న జరిగిన ఒక సంఘటన మాత్రం ఉద్యమాన్ని పునాదులతో సహా పెకలించడానికి వీలుచేసింది. రాజుదళం లో ప్రధాన సభ్యుడయిన ఎండుపడాలు ని చంపేసినప్పుడు అతని దగ్గర రాజు వాడే "పూజ పెట్టె" (ఇది ఎవరో బ్రిటిష్ అధికారి వాడే లెదర్ బ్యాగ్. దాన్ని రాజు స్వాధీనం చేసుకొని వాడేవాడు.) దొరికింది పోలీసులకి. అందులో పుస్తకాలు, మ్యాపులూ దొరికాయి. ఏ యే గ్రామం నుండి ఎవరెవరు ఉద్యమం లో చేరినది, ఎప్పుడు చేరినదీ? ఎప్పుడు సెలవు తీసుకొని వెళ్ళిపోయినదీ మొత్తం వివరాలు రాసి పెట్టుకున్నాడు రామరాజు. అలాగే ఏ యే పోరాటాలలో ఎవరెవరు చనిపోయారో, ఎవరు కొండదళాన్ని పట్టివ్వడానికి ప్రయత్నించారో, ఆ గ్రామ ప్రజల మీద రామరాజు విధించిన సుంకాల వివరాలు కూడా అందులోనే ఉన్నాయి. ఈ సమాచారమంతా పోలీసుల చేతికి రావడం తో మొత్తం ఉద్యమకారులంతా పిట్టల్లా రాలిపోయారు.
 1924, జూన్ 7
గంటం దొర  చిన్న భార్య పోలీసులకి చిక్కింది. సరిగ్గా మూడు రోజుల తర్వాత అతని పెద్ద భార్య, పిల్లలు అతనికి భోజనం తీసుకువస్తుండగా "వలసం పేట" గ్రామం లో పోలీసులకి దొరికిపోయారు. గంటం దొర ఉన్న ప్రాంతం గురించి చెప్పక తప్పలేదు వాళ్ళకి.గంటందొర దళం, పోలీసు బెటాలియన్స్ కి మధ్య కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఎడమ తొడ విరిగి, తూటాలు శరీరం లోకి చొచ్చుకుపోయి కొనప్రాణం తో పోలీసులకి దొరికిపోయిన గంటందొరని బయొనెట్ తో పొడవటం తో కన్నుమూసాడు.కృష్ణదేవీపేట కి అతని శరీరాన్ని తీసుకొచ్చి, రాజు కి దహన సంస్కారం చేసిన చోటనే అంత్యక్రియలు జరిపారు. 

గోకిరి ఎర్రేసు ని పోలీసులు పట్టుకున్నారు. మల్లుదొరకి ఉరిశిక్ష విధించి, ఆ పై దానిని జీవిత ఖైదుగా మార్చారు. చాలామంది తెల్ల సైన్యం జరిపిన కాల్పుల్లో చనిపోగా, ఉద్యమం ముగిసిన తర్వాత సుమారు 300 మంది  జైలుకి పంపించ బడ్డారు. అందులో  నెల రోజుల శిక్ష నుండీ జీవిత ఖైదు వరకూ విధింపబడ్డవారు ఉన్నారు.
జూన్ నెలాఖరుకి, అంటే అల్లూరి శ్రీరామరాజుచనిపోయిన నెల రోజులకి,  ఫితూరీ ఆనవాలు లేకుండా పోయింది. పోరాటం ముగిసింది...!

****************************************************************************
12 సంవత్సరాల తర్వాత...
Indian national congress ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రిగా ఉన్న C. రాజ గోపాలాచారి గారి చొరవ తో  చాలామంది మన్యం వీరులు విడుదల  అయ్యారు. ఇలా విడుదలయ్యి స్వేచ్చా ప్రపంచాన్ని చూసిన వారిలో మల్లుదొర, గోకిరి ఎర్రేసు కూడా ఉన్నారు.

ఉద్యమం లో కీలక పాత్ర వహించినా గానీ  వ్యసనాల కారణం గా రామరాజు చేత వెలివేయబడి, పోలీసులకి పట్టుబడిన మల్లుదొర, జైల్ నుండి విడుదలయ్యాక, 1952 లో పార్లమెంట్ కు నామినేట్ అయ్యి హస్తిన లో అడుగుపెట్టాడు.

రామరాజు ని చివరి వరకూ నమ్మి, అందరికీ దూరమైన గోకిరి ఎర్రేసు. .. ఒక సొరకాయ తంబురా చేత బూని కృష్ణదేవి పేట వీధులలో తత్వాలు పాడుతూ, భిక్షక వృత్తి చేపట్టాడు తన చివరి రోజుల్లో.

 ఏమయిపోయాడో లోకానికి తెలియని అగ్గిరాజు 1936 లో అండమాన్ సెల్యులర్ కారాగారం లో  అనామకం గా కన్నుమూసాడు.
ఇక రామరాజు వెనకే వెన్నంటి నడిచీ, రాజు ఆశయాలకి అనుగుణం గా మసలుకొన్న గంటందొర. ఆ రాముడి తో ఆ లక్ష్మణుడు అడవికి నడిస్తే, ఈ రామరాజు తో చావు లోనూ తోడు వెళ్ళిన గాం గంటం దొర  ఇదిగో..... ఇలా రాజుగారి పక్కనే , విప్లవాగ్ని అల్లూరి శ్రీరామరాజు తో పాటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
(కృష్ణదేవి పేట లో అల్లూరి మరియు గంటం దొరల సమాధులు. కొద్ది కాలం కిందట వీటికి మెరుగులు దిద్దారు)
*******************************************************************************

"ఉద్యమ సాఫల్య వైఫల్యాల మీద చర్చ అనివార్యం. ఉద్యమ నేత దృష్టి, పంధా, తాత్వికతల గురించి అంచనాలూ అవసరమే. నిజానికి అదొక పాఠం. అంతకంటే కూడా, ఒక సదాశయం కోసం జరిగిన రక్త తర్పణలనీ, త్యాగాలనీ, ఆ ఆశయం కోసమ్ ఒక తరం పడిన వ్యధనీ,బాధనీ, క్షోభనీ, అన్నిటికీ మించి ఆ తరం  కార్చిన కన్నీళ్లని అలా గాలికి వదిలివేయడం ఒక తప్పిదం. ఒక ద్రోహం. కాబట్టే ముందు తరాలు, ఆ ఉద్యమం నీడ, ఆ నేత నీడ కాలం మీద ఎలా పరుచుకున్నాయో చూడాలి. అదొక స్పూర్తి."
--- శ్రీ గోపరాజు నారాయణరావు

*********************************************************************************
అల్లూరి సీతారామరాజు గారి మీద ఎవరెవరు పుస్తకాలు రాశారో, అవి ఎక్కడ దొరుకుతాయో పెద్దగా సమాచారం లేదు.నిజానికి శ్రీరామరాజు మీద రాయబడిన పుస్తకాలు ఉన్నాయి కానీ వాటి వివరాలు తెలియవు. పైగా రామరాజు స్వాతంత్ర్యం వచ్చేవరకూ బతికే ఉన్నాడనీ, అతనికి 8 మంది భార్యలనీ,బెండపూడి లో ఉన్న సాధువే రామరాజనీ విచిత్రమైన కధలూ, వాటిని సొమ్ము చేసుకుని హడావిడి చేసే టీవీ కార్యక్రమాలూ, రామరాజుని ఒక బందిపోటు దొంగ, భూకబ్జాదారుడి గా చిత్రీకరించిన కధనాలు పుట్టుకొచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఈ తెలుగు గడ్డలో పుట్టి ,పాతికేళ్ళ వయస్సు లో ప్రపంచం లోని అతిపెద్ద సైనిక శక్తి పై అమాయకప్రజల చేత తిరుగుబాటు చేయించీ, దాదాపు రెండేళ్ల పాటు పోరాటం చేసి, అతి తక్కువ వయస్సులోనే వీరమరణం పొందిన ఒక మహనీయుడి గురించి భావి తరాలకి తెలియజేసే ప్రయత్నాలు జరగకపోవడం బాధాకరం.  రాజకీయనాయకుల మీదా, క్రీడాకారుల మీదా, కవుల మీదా స్కూల్ పాఠ్యపుస్తకాల్లో పాఠాలున్నాయి గానీ ఈ తెలుగోడి మీద ఏ తెలుగు పాఠ్యపుస్తకం లోనూ, ఏ సోషల్ స్టడీస్ పుస్తకం లోనూ లేకపోవడాన్ని ఏమనాలో?.  అతని గురించి తెలుసుకోడానికి అందరికీ అందుబాటులో ఉన్న, అందరికీ అర్ధమయ్యే విధంగా ఉన్న ఏకైక మార్గం... అల్లూరి సీతారామరాజు సినిమా. రామరాజు గురించి ఎంతో రిసెర్చ్ చేసి,  తెలుగు చలన చిత్రాలలో గర్వంగా చెప్పుకోదగ్గ గొప్ప సినిమా తీసి,(అందులో కొన్ని కల్పితాలున్నా సరే) తన అద్బుతమైన డైలాగ్ డెలివరీ తో మంత్రముగ్ధుల్ని చేసి, అల్లూరి గురించి తెలుసుకోవాలనే తపనని నాలో కలుగజేసిన  సూపర్ స్టార్ కృష్ణ గారికీ, ఆ సంభాషణలు అందించిన మహారధి గారికీ, రామరాజు మీద రాయబడిన పుస్తకాలన్నిటినిటి మీదా పరిశోధన చేసి,  ఓ గొప్ప పుస్తకాన్ని రాసిన శ్రీ గోపరాజు నారాయణ రావు గారికీ ఈ సిరీస్ అంకితం.

సరదా పోస్టులు రాసుకునే నా చేత ఇలాంటి సిరీస్ రాసేలా ప్రోత్సహించిన ఆలమూరు  సౌమ్య గారికీ, తమ విలువైన సమయాన్ని వెచ్చించి ప్రతీ పోస్టుకీ వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహించిన నా మిత్రులకీ ప్రత్యేక కృతజ్ఞతలు.

జై..హింద్..!