Tuesday, July 31, 2012

దిద్దు.... సరిదిద్దు.. తీర్చిదిద్దు..!

సమయం : తెలీదు.
సంవత్సరం: గుర్తు లేదు. 
ఎప్పుడూ?:  ఏమో.. మర్చిపోయాను.(ఎయిత్  క్లాస్ లో అనుకుంటా)
ప్రదేశం: మా స్కూల్ లో.. ఎగ్జాం హాల్ లో..!

నేనేం జరగకూడదనుకున్నానో... అదే జరిగింది. ఆఖరి  పరీక్ష రోజున ఇన్విజిలేటర్ గా మా క్లాస్ టీచర్లు రాకూడదనీ,  కస్తూరమ్మ గారు అస్సలు రాకూడదు అనీ బలంగా కోరుకున్నా.. కానీ కోరిక లే మనిషి దుఃఖానికి కారణం కదా...అవి తీరకపోతే...  :-) ).
చాకిరేవు లో బలమైన శ్రామికుడు బండకేసి బట్టల్ని బాదుతున్నంత శ్రద్ధ గా పరీక్ష రాస్తున్నాను.
ఆ సంగతి నా చుట్టూ మూగి, అంతకంటే శ్రద్దగా కాపీ కొడుతున్న నా "ఉపగ్రహ" మిత్రులకీ, "ఏయ్.... ఏంటా గోలా?" అని కంట్రోల్ చేస్తున్న మా కస్తూరమ్మ టీచర్ గారికీ తెలుసు గానీ, మర్నాటి నుండి దసరా సెలవులు అని తెలిసినా గానీ, నా గుండెల్లో గందరగోళం గుసగుసలాడుతుందనీ, తొందరపాటు తొణికిసలాడుతుందనీ, దిగులు దెయ్యం లా తరుముతుందనీ నాకే తెలుసు. నా ఒక్కడికే తెలుసు.


"ఒరే... రాజ కుమారూ.. .నీ వెనకోడూ, పక్కోడూ నీ పేపర్లో చూసి రాసేస్తున్నార్రా...! చూస్కో.. " బహిరంగంగా హింటిచ్చారు కస్తూరమ్మ గారు జాంకాయలు నములుతూ, పిప్పి కూర్చున్న కుర్చీ పక్కన ఊసేస్తూ.
మరొకరైతే అక్కడ సీన్ మరో రకంగా ఉండేది కాపీ కొడుతున్నందుకు. ఈవిడ ఏమిటీ ఈ రకం గా చెప్తున్నారు అని నేను అదోరకం గా చూడ్డం మొదలెట్టాను ఆవిడ వైపు, ఆఖరి ప్రశ్న కి జవాబు రాసేసీ, ఆన్సర్ షీట్ అట్ట కింద మూసేసీ.

మాకు సోషల్/ఇంగ్లీష్ చెప్పేవారు ఆవిడ. అంతెత్తూ, ఇంత లావూను. చాలా నెమ్మదిగా నడిచేవారు. ఏడున్నర అడుగులు పైన పొడవుండే వాళ్లబ్బాయ్ బండి మీద డ్రాప్ చేసేవాడు రోజూ. ఎప్పుడన్నా కోపం రావటం గానీ, ఏ పిల్లోణ్ణయినా కొట్టడం గానీ చూళ్ళేదు నేను. అంతకు ముందు మా అమ్మగారికి కొలీగ్ అవ్వటం తో కొంచెం చనువుంది నాతో.


అప్పుడప్పుడూ హైవే రోడ్ మీద పోయే లారీల గోల, మేడమ్ కస కసా నముల్తున్న జాంకాయల హాహాకారాలు మినహా ఏ శబ్దం లేదు.
"ఏట్రా ఆబ్బాయ్..అలా చూస్తున్నావ్? చదువంటే ఈ క్లాసు పుస్తకాలూ- పాఠాలూ, భట్టీలూ-మొట్టికాయలూ, ఎగ్జామ్సూ- మార్క్సూ మాత్రమే కాదురా.. జీవితం లో నేర్చుకోవాల్సినవీ, అలవర్చుకోవాల్సినవీ బోల్డున్నాయ్. అది పరీక్షలతో పూర్తయిపోయేదీ కాదు, ఆకలి కడుపు నిండాక ఆగిపోయేదీకాదు, అసలీ మార్కులు మేటరే కాదు. సామర్ధ్యానికి కొలమానాలు అస్సలు కాదు" .... చెప్పుకుంటూ పోతున్నారు.

గణ గణా బెల్ మోగిందీ. వెళ్ళిపోయేముందూ... "రేపు మా ఇంటికొచ్చేయ్ రా... పేపర్లు దిద్ది పెట్టేద్దువూ" అనేసి  నా మనసులోని కంగారుకీ, తొందరపాటుకీ, దిగులు కీ గల కారణాన్ని బయటపెట్టేసి వెళ్ళిపోయారు. బాగా చదువుతాడూ అనే పేరున్న వాడు ఆటోమేటిక్ గా క్లాస్ లీడర్ అవుతాడు. ఇంగ్లీష్ లో లీడర్ అంటే తెలుగు లో "పెద్ద పాలికాపు" అని అర్ధం.

దసరా సెలవులు రెండ్రోజులు ఎంజాయ్ చేసీ, ఏడుస్తూ, కాళ్ళీడుస్తూ మా మేడమ్ ఇంటికి నడుస్తూ ఉంటే కొన్ని పనికిరాని పరిశీలనలు మెదడు లో మెదిలాయి.
స్కూళ్ళలో ఈ ఎగ్జాం పేపర్లు కరెక్ట్ చేసే విధానాలు చెప్ప్పాలి మీకు. యెస్.. ఐ హేవ్ టూ టెల్ ఇట్ నౌ.

ఒకటో రకం :
ఉదాహరణకి... మా మాతా, పితా.  మా వాళ్లని చెప్పడం కాదు గానీ
రూల్స్ విషయం లో అపరిచితుడు సినిమా లో రామానుజం టైపు. పరీక్ష పెట్టిన రోజే  పేపర్లు  దిద్ది మార్కులు రిజిస్టర్ చెయ్యక పోతే కడుపు నిండా తిన్నా, ఆకలేసినట్టు గానూ, బిందెడు నీళ్ళు తాగినా దాహమేస్తున్నట్టు గానూ ఉంటాది వీళ్ళకి. వీళ్ళ హార్డ్ వర్క్ తో నాలాంటోళ్ళకి పెద్దగా ప్రాబ్లెంస్ ఉండవు.

ఒకటిన్నర  రకం:
ఉదాః మా లెక్కల మాష్టారు వెంకట్రావు గారు. ఈయన అందరి మెయిన్ పేపర్లూ బుద్ధిగా కరెక్ట్ చేసేసీ, బిట్ పేపర్లు రాండమ్ గా క్లాస్ లో స్టూడెంట్స్ కి పంచేసీ, ఆన్సర్స్ బోర్డ్ మీద రాసేసీ ఒక్కొక్కళ్ళ చేతా ఒక్కో పేపర్ కరెక్ట్ చేయించేసేవారు. ఐదు నిమిషాల్లో మేటర్ ఫినిష్.. దీన్నే సాఫ్ట్ వర్క్ అంటారని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యి హార్డ్ వర్క్ చేస్తుండగా తెలిసింది.

రెండో రకం...ఆ చెప్పడం ఎందుకూ?... మేడంగారి ఇల్లొచ్చేసిందీ.. రండి మీరు కూడా..!

కస్తూరమ్మగారుః వచ్చావా.... నువ్ ఏ ఊరికో చెక్కేసుంటావనుకుని ఎంత టెన్షన్ పడ్డానో..! ఎక్కడికి పోయావ్ ఈ రెండ్రోజులూ? ఒకటా రెండా? గాడిదల గుంపు లాగా నూట ముప్పై మంది. ఒక్కదాన్నీ ఎన్నని దిద్దేదీ?
నేనుః ..........
క.గాః టిఫిన్ తిని, టీ తాగమ్మా... కొంచెం ఓపిక వస్తుందీ..!
నేనుః వద్దండీ.. ఇంట్లో తినొచ్చాను.
క.గాః నిన్ను కాదురా... మా పెద్దదానికి ఒంట్లో బాలేదు. దాన్నీ అడుగుతుంటా..! ఇదిగో పేపర్ల కట్ట.
నువ్ నీది తప్ప మిగిలినవన్నీ దిద్దెయ్యి..  నీ పేపర్ నేను కరెక్ట్ చేస్తానూ.

అది పేపర్ల కట్ట కాదు..

"క్లాస్ లో నాకు కాంపిటీషన్ వచ్చినోళ్ళ జుట్టు నా చేతికిచ్చే" వరం,
"నా ఫ్రెండ్స్ కి మంచి మార్కులేసి నన్ను హీరోని చేసే" లాభం.
"వందమంది జుట్టుకున్న చమురు నా చేతికంటే" నష్టం.
నా పండగ సెలవుల్ని సర్వ నాశనం చేసే"  శాపం.

క.గాః ఏరా.. నిన్నా, మొన్నా ఇక్కడకి రాకుండా ఎన్నెస్సమ్మ (Natural science madam) ఇంటికి పోయావా ఈ పని మీద? అయినా నీకు  నా కంటే ఆవిడే ఇష్టం లే. (నా పక్కనే కూర్చొని బియ్యం ఏరుకుంటూ)

నేనుః లేదండీ... అక్కడకి సాయంకాలం వెళతానండీ. లేదంటే ఆళ్ళ ఎదురింట్లో ఉండే మా క్లాస్ అమ్మాయిల బ్యాచ్ తో కరెక్ట్ చేయించేస్తున్నారండీ. మొన్నటికి మొన్న ఆ జయంతీ, ఝాన్సీరాణీ ఏం చేశారనుకున్నారు? వాళ్ళు రాసిన సోదికి ఫుల్ మార్క్స్ వేసేసుకొనీ, నాకు పాస్ మార్క్స్ వేశారు. అప్పటి నుండీ ఆ మేడమ్ గారు కూడా నాకే అప్పజెప్పారు. (పరా... పరా ఎగ్జాం పేపర్లు కరెక్ట్ చేసుకుంటూ)

క.గాః హ...మ్మా.. మాయిదారి గుంట్లూ... అంత పని చేసేరా?

నేను(మనసులో..) : కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.... ఈ నాగేష్ గాడికి  నోట్లో సున్నుండ పెట్టీ కడుపు లో గుద్దాలి. వరల్డ్ మేప్ లో దేశాల్ని గుర్తించమంటే, మా మండలం లోని ఊరి పేర్లన్నీ మేప్ నిండా రాసేశాడు. (నిజంగానే జరిగిందిది). కానీ వాడుండేది తెలుగు మాష్టారి పక్క పోర్షనే.. నా మార్కులు వాడి చేతుల్లోనే ఉన్నాయ్.  రిస్క్ తీసుకోకూడదు..
వేసేశా... వాడికి ఫుల్ మార్క్స్ వేసేశా...

************************************************************************
నాల్రోజుల్లో అందరి ఇళ్లళ్ళోనూ ఈ చాకిరీ అంతా అయిపోయింది. అహో... ఆనందమే ఆనందం. బ్లాడర్ ఫుల్లయిపోయిన వాడు పాట పాడాక కలిగే ఆనందానికి సాటి రాగల ఆనందం.
మిగిలిన నాల్రోజుల సెలవులు ఎంజాయ్ చేయడానికి పెట్టె పట్టుకొని
పరుగులు పెడుతూ అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయాను.

విధి వండిన వింత పాయసాన్ని గిన్నెల కొద్దీ తాగిన నేను అడుగు పెట్టగానే.. మా తాతయ్య కళ్ళలో మెరుపు చూశాను.

తాతయ్యః "ఒరే శిలపడా...(అర్ధం అడక్కండీ.. నాకు తెలీదు)... ఈ పెద్ద బొరికీ, చిన్న బొరికీ (మా మాయలు) నాకు పనికొచ్చే పనులు ఎప్పుడు చేసేర్రా? మీ చిన్న పిన్ని కొంచెం హెల్ప్ చేసిందీ... ఇయ్యిగో మిగిలిన పేపర్లు నువ్ దిద్దెయ్యరా..! "

నేనుః ...................
నేను(మనసులో): భగవంతుడా.. ఎందుకు తండ్రీ నన్ను ఇలా బడిపంతుళ్ళ మధ్య పుట్టించావూ?

తాతః మొహానికి మట్టి కొట్టి, పేడెట్టి అలికినట్టూ ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా తాతా..!
నేనుః తాతా... రాత్రికి నాకు రొయ్యల కూరా, చికెన్ కర్రీ కావాలి..నువ్వే చెయ్యాలి. (మరే.. వేడిగా ఉన్నప్పుడే పిజ్జా తినెయ్యాలి, చల్లగా ఉన్నప్పుడే బీరు తాగెయ్యాలి, కరిగిపోక ముందే ఐస్క్రీం నాకెయ్యాలి).
తాతః ఒసే.. పారోతీ... పెద్ద మనవడు వచ్చేడు కదా నేను బజారు కెళ్ళి కూర పట్టుకొస్తానే...! (ఒక వైపు  లుంగీ పంచ ఒక చేత్తో ఎత్తి పట్టుకొని బజార్ లో కి పోతూ)

 మా చిన్నపిన్నిః ఒరే బుజ్జీ.. ఎప్పుడొచ్చావ్ రా? దా... నేనో కవిత రాసేనూ.. ఆంధ్రభూమి కి పంపిద్దాం అనుకుంటున్నాను. విను..

"ఆకాశానికి ఆకలేసిందీ..."
"భూగోళానికి బాధేసిందీ.."
"యమలోకానికి ఏడుపొచ్చిందీ.."
""పాతాళం పగలబడి నవ్విందీ.."

 నేనుః పిన్నీ.. అర్జెంట్... బాత్రూంకి వెళ్ళొస్తానేం.. ఇక్కడే ఉండూ.. ఇప్పుడే వచ్చేస్తాను.

************************************************************

ఛీ.. నా దరిద్రం... రాజమండ్రి పోయి గోదాట్లో దూకినా, అమెరికా పోయి అమేజాన్ లో మునిగినా వదిలేలా లేదు. పనిలేని పిచ్చమ్మ కుంటి కుక్క కి కాలిగోళ్ళు తీసిందనీ...ఏమిటీ అరువు సేవ నాకూ? అనుకొని దిద్దుడు కార్యక్రమం ప్రారంభించాను.

తాత(బజార్ నుండి తిరిగొస్తూ) : ఎంత వరకూ వచ్చేయి రా ?
నేనుః చాలావి ఉన్నాయ్ తాతా ఇంకా అవ్వలేదు.
తాతః హ్మ్మ్.... నా కూతుళ్ళు బంగారు కొండలు అయితే.. కొడుకులు పోరంబోకులయ్యేర్రా..! మీ మాయలున్నారే.. దున్నపోతులకి జొన్నపొత్తులు మేపుతున్నట్టూ మేపుతుంటే, విలాసాలు ఎక్కువయ్యీ, ఎటకారాలు లావయ్యీ, పొగర్లు పెరిగిపోయి పనికొచ్చే పనులకి పదడుగుల దూరం పరిగెడ్తున్నారు. రోజంతా ఆ బెడ్డ (కార్క్ బాల్) ఇసురుకోడాలూ, తెడ్డు (క్రికెట్ బ్యాట్) తిప్పుకోడాలు తప్పా పనీ పాటా లేదురా ఎదవలకీ...!  మీ అమ్మ నాకు ఎంత హెల్ప్ చేసేదనుకున్నావ్? చదువుకుంటూ నాకు వ్యాపారం లో హెల్ప్ చేసేది. ఇంట్లో చెప్పిన పని చెప్పినట్టూ చేసుకుపోయేది. నీకన్నీ దాని పోలికలే..!

నేనుః చపాతీ లాంటి మొహాన్ని పూరీలాగా పొంగిస్తూ (ప్యాచ్ పడిన సైకిల్ టైర్ కి పంప్ కొడుతున్న సీన్ ని ఊహించుకోగలరు)

మా చిన్న మాయః అజారుద్దీన్ బ్యాటింగ్..అజారుద్దీన్ బ్యాటింగ్..!

తాతః అజారుద్దీన్ బ్యాటింగా?? వచ్చే.. .వచ్చే...  ఈ అజారుద్దీన్ మా పెద్దోడి లాగే ఉంటాడ్రా..! (టీవీ దగ్గరకి పరిగెడుతూ..!)
నేనుః ఎండాకాలం లో కప్పుకొనీ, శీతాకాలం లో విప్పుకుతిరిగేవాడిలాగా ఫేస్ పెట్టీ.
మా అమ్మమ్మః ఇయ్యన్నీ.. ఒక  తాను ముక్కలేరా...! ఆ  కిరికెట్టు ఆటంటే ఒంటి మీద తెలివుoదడు  మీ తాత కి.

************************************************************
రెండ్రోజులయ్యాక.. చేయగలిగినంతా చేసీ, బిక్క మొఖమేసి, చేతులెత్తేసిన నా మీద జాలి పడి మా తాతయ్య అద్బుతమైన ఆలోచన చేశారు.

తాతః హ్మ్మ్..శిలపడా... ఒక్కో పేరూ చదువు...!
నేనుః కంకిపాటి వెంకట లక్ష్మి..
తాతః ఆ.. ఈ పిల్ల బాగా చదువుతాది రా... ఓ ఎనభై మార్కులెయ్యి.
నేనుః పిల్లి నూకరాజు
తాతః వీడూ.. బానే చదువుతాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఓ డెబ్బై ఐదేస్కో..
నేనుః బండారు నాగదేవి.
తాతః ఆ... మనింటి పేరే ... కానీ ఈ పిల్ల ఏవరేజ్ స్టూడెంట్.. యాభై..ఎయ్యి.
నేనుః యలమంచిలి చందర్రావు
తాతః అబ్బే.. వీడు ఒట్టి సన్నాసెధవ. నలభై ఐదెయ్యి చాలు..
.
.
.
.
.
.
.
ఎందరో ఎవాల్యువేటర్స్.. అందరికీ వందనాలు