Tuesday, October 8, 2013

ప్రయోగం.. ప్రమాదం.!!!

టెంపుల్ రన్ లాంటి పరిగెత్తే ఆటలు ఐప్యాడ్ లో కాకుండా నిక్కరు చిరిగిపోయేలా మట్టి రోడ్డు మీద దేకురుతూ ఆడుకునే అమాయకపు రోజులవి. నేనప్పుడు  నాలుగో తరగతి వెలగబెడుతున్నాను. అప్పటి వరకూ నియంత పాలన లాంటి మా పితృదేవుల టీచింగ్ లో పిండి పిండి అయిపోతున్న నాకు ఆ సంవత్సరమే ఓ కొత్తరకమైన టీచింగ్ పరిచయమయ్యింది.అంతకంటే ముందు మా నాన్నారి బోధనా విధానమేంటో చెప్పాల.

ఏ మేష్టోరయినా ఏదయినా విషయాన్ని ఓ పిల్లకాయకి చెప్తున్నప్పుడు వాడి మనసు పాఠం మీద ఉండదు. కారణం...  తలకాయలో సవాలచ్చ ఆలోచనలు చెలరేగిపోతుంటాయి. పొద్దున్న తిన్న నేతి సున్నుండలో, ఇంటర్వెల్లో తినబోయే పుల్లైసో, నువ్వు పప్పు జీళ్ళో, కళ్ళముందు కనిపిస్తూ నాలుక లపలప లాడిపోతుంది.  ఈ కారణాల వల్ల పిల్లోడికో పిల్లకో పాఠం వచ్చేసరికి ఆ మేష్టారికో, మేడంగారికో దుంప తెగిపోతుంది. అందుకే "భయాన్నే ఇన్వెస్ట్మెంట్ " గా వాడే మా నాన్న ముందస్తుగా ఏం చేసేవారంటే పెఢేల్ పెఢేల్ మని క్లాస్ రూం దద్దరిల్లేటట్టూ  బాదేసే వారు. దెబ్బకి కుర్రోళ్ల మెదడు లో ఖాళీ బ్లాక్ బోర్డ్ ప్రత్యక్షం అయిపోయేది (నాన్నారి క్లాస్ లో పిల్లకాయల నిక్కర్లు తడిచిపోవడం అనేది డైలీ సీరియల్ లో ప్లాస్టిక్ సర్జరీ చేసి ఏక్టర్లని మార్చేసేంత ఫ్రీక్వెంట్ గా జరిగేది). అప్పుడు ఆ నల్లని మెదడు మీద  తడిపిన తెల్లని సుద్దముక్కతో మేటర్ ప్రింట్ చేసేసేవోరు చెరిగిపోకుండా. దీనితో పిల్లకాయలకి చదువబ్బింది. మా నాన్న కి "గొప్ప మేష్టోరు" అని పేరొచ్చింది ఊళ్ళో.

అట్టాంటి మా నాన్నతో రోజంతా ఉండే నేను ఈ మొట్టికాయలకీ, విమానం మోతలకీ భయపడీ ఎందుకు  పనికొస్తాయో తెలియకపోయినా గానీ ఎక్కాలు 20 x 20=400 వరకూ పై నుండి కిందకీ, కింద నుండి పైకీ బట్టీ కొట్టి అప్పజెప్పేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తున్న నాకు నాల్గో తరగతిలో మా హెడ్మాష్టారు "సూర్య నారాయణ" గారు పరిచయమయ్యేరు. భయానక రసం,బత్తాయి రసం మాత్రమే తెలిసిన నాకు "హాస్య
రసాన్ని" పరిచయం చేశారు. ఏ సబ్జెక్ట్ చెప్పినా కధల రూపం లో కామెడీ మిక్స్ చేసి చెవుల్లోంచి బుర్రలోకి కూరేసేవారాయన. నవ్వించడానికి క్లాస్ లో చంటి పిల్లాడిలా నేల మీద పాకెయ్యడానికీ, కాటన్ బట్టలు తడిని పీల్చుకుంటాయని చెప్పడానికి చొక్కా విప్పి నీట్లో ముంచెయ్యడానికీ, నైలాన్ గుడ్డని కాలిస్తే ముడుచుకుంటుంది అని చెప్పడానికి తన కర్చీఫ్ ని కాల్చెయ్యడానికీ మొహమాట పడేవారు కాదాయన. సైన్స్ ప్రయోగాలన్నీ మా ముందు చేసి చూపించేవారు
.
ఆయన మాటల్లో చెప్పాలంటే
"వంద ప్రశ్నలకి సమాధానాలు బట్టీ పట్టినప్పటి కన్నా ఒక్క ప్రయోగం లో వచ్చే వందసందేహాలకి దొరికే సమాధానాలు బాగా గుర్తుంటాయి."

అప్పట్లో ఆ మాటలు పెద్దగా అర్ధం కాలేదుగానీ "థియరీ చదివి రాసినప్పుడు వచ్చే మార్కుల కన్నా ప్రాక్టికల్ చేసినప్పుడు వచ్చే కిక్కు గొప్పగా ఉంటాది" అని ఆ తర్వాత తెలుసుకున్నాను. "థియరీ "డైలాగ్ పంచ్ లాంటిది" - మాట్లాడిన కొద్ది సేపే దాని ఎఫెక్ట్ ఉంటాది.కానీ ప్రాక్టికల్ బాక్సింగ్ పంచ్ లాంటిది - కొట్లాడిన చాలా సేపటివరకూ
గుర్తుంటాది" అనీ అర్ధమైంది. ప్రయోగాల మీద ఆసక్తి పెరిగి పేట్రేగి పోయింది.

దీంతో టీవీ స్క్రీన్ మీద అయిస్కాంతం పెట్టి రంగులు రప్పించడం, చక్కగా పాడున్న రేడియో ట్యూనింగ్ చెడగొట్టి దారుణ మైన ధ్వనులు తెప్పించడం, సుబ్బరంగా పనిచేస్తున్న ప్లగ్ బోర్డ్ లో టెస్టర్ పెట్టి రిపేర్ చేసి ఫీజు కొట్టేలా
చెయ్యడం, మా అమ్మ మిక్సీ లో పిండి రుబ్బుతున్నప్పుడు పప్పు రుబ్బుగా ఎలా మారుతుందో చూడ్డానికి మూత తీసేయడం, ఇల్లంతా రుబ్బుతో అలంకరించడం, తాతయ్య బీపీ మాత్రలు మురికి కాలవలో పడేస్తే కరుగుతాయో లేదో చూడటం, వీధిలైట్లని రాళ్ళిచ్చుకొని కొట్టడం, చీపురు పుల్లలతో విల్లమ్ములు తయారు చేసి కుక్కల మీదా, 
పందుల మీదా గురిచూసి సంధించడం వంటి ప్రయోగాలు చేసీవోడిని. ఓ సారి ఇంట్లో "కీ ఇచ్చే కార్ బొమ్మ" మీద హారతి పెట్టి వెలిగించి కీ ఇచ్చి వదిలేశాను. అది ధాన్యం బస్తాల కిందకెళ్ళి ఆగింది. ఎంత క్రియేటివ్ థాట్ అదీ? ఎవరికన్నా వస్తాదా అలాంటి అవిడియా? ఇంకోసారి ఉడుకుతున్న అన్నం లో టూత్ పేస్ట్ పిండి కలియబెట్టాను. అన్నం తిన్న కంచం లైఫ్బాయ్ సోప్ తో తోమి కడిగాను. ఎన్ని చేసినా కానీ ఈ పెద్దోళ్ళున్నారే..."వెలిగించిన కొవ్వొత్తి ఎదుగుతుందా..??"... అన్నట్టుండే నాపై నిలువునా నిప్పులు కురిపించీ,  సొంటిక్కలు తీసి, మొట్టికాయలు మొట్టీ, కాలిపోయిన సిగరెట్టు ని  కాలికిందేసి తొక్కినట్టూ తొక్కారే తప్ప.. నా ప్రయోగ తృష్ణ ని అర్ధం చేసుకోలేదు.నన్నెంకరేజ్ చెయ్యలేదు.

*************************************************************************************************
ఓ అపాయకర సాయంకాలం నేను స్కూల్ నుండి తిరిగొస్తుండగా సెకండ్ క్లాస్ చదూతున్న నా తమ్ముళ్ళిద్దరూ మా ఇంటి పక్క సందులో రహస్యం గా ఏదో చేస్తుండటం గమనించాను. "ఏం చేస్తున్నార్రా... చేస్తున్నార్రా... చేస్తున్నార్రా?" రీసౌండ్ తో కూడిన నా గద్దింపుతో సందు దద్దరిల్లింది.

"భూం భూం షకలక అన్యా.. సూపరుగుంటాది.. నువ్వూ రా తొందరగా " అన్నారు. "భూం భూం షకలక ఏంటి చెప్మా.." అనుకుంటా నేనూ వెళ్ళి నించుని గమనించడం మొదలెట్టాను. వాళ్ళు చేస్తున్న ప్రయోగం ఏందయ్యా.. అంటే

1. ఓ చిన్న గొయ్యి తీసి దానిలో కొవ్వొత్తి పెట్టి వెలించారు.
2. దాని మీద నా కంపస్ బాక్స్ లో ఉండే డివైడర్ స్టౌ లాగా పెట్టీ, ఆ పై కూల్
డ్రింక్ మూత ని పెట్టారు.
౩. ఆ మూత లో కొవ్వొత్తి ముక్కలు పడేసి కొవ్వంతా నూనెలా కరిగేట్టూ వేడి చేశారు.
4. ఆ కొవ్వు బా.....గా మరిగాకా.... (ఇదే హైలైటు) కోపం తో కుతకుత లాడిపోయి శపించేస్తున్న
మునీశ్వరుడి లాగా అరచేతి నిండా నీళ్ళూ తీసుకొని "ఓం భీం.. భుష్" అంటూ జల్లారు.
5. భగ్గున బాంబ్ పేలినట్టు అంత మంటొచ్చింది. ఎమ్మటే వీళ్ళిద్దరూ "భూం భూం షకలక
భూం భూం షకలక" అని అరుస్తా దాని చుట్టూ తిరుగుతూ గంతులెయ్యటం మొదలెట్టారు.

ఈ ప్రయోగం అద్భుతం గా అనిపించింది నాకు. తొక్కలోది చిన్న కూల్ డ్రింక్ మూతకే ఇంత మంటొస్తే చిప్ప సైజ్ పెంచితే ఇంకెంత బాగుంటాదో అనీ పక్కింటి రాజుగాణ్ణీ కూడా పిలుచుకొచ్చి పిల్లకాయలని చుట్టూరా కూర్చోబెట్టి ప్రయోగాన్ని మళ్ళీ మొదలెట్టాను. "ఏం జరుగుతుందా... అన్న ఆతృత తో రాజుగాడు మంట పక్కనే గొంతుక్కూర్చున్నాడు. నూనె బాగా మరిగాకా నేను "భూం భూం షకలకా"అని అరుస్తా నీళ్ళు జల్లాను. భగ్గున మంటొచ్చింది, ఆ సెగ కి రాజుగాడి నాలుగు పుంజీల తల వెంట్రుకలు తెల్లగా కాలిపోయి గుప్పున గబ్బొచ్చింది.
వాడు... "అమ్మోయ్.. నాయనోయ్..." అంటా ఏడుపు మొదలెట్టేడు.నేను ధైర్యవంతుణ్ణి కాబట్టీ నాకు భయం ఏం వెయ్యలేదు గానీ కాళ్ళు వణుకుతూ, గుండె దడదడా కొట్టుకోడం మొదలైంది. నా పక్కనే ఉండాల్సిన నా తమ్ముళ్ళు ఇంట్లోకి పారిపోయి కంగారు లో నా పుస్తకాలు తీసి శ్రద్ధ గా చదివేస్తున్నారు.
"ఇదేం చోద్యం చెప్మా.." అని తల పక్కకి తిప్పేసరికీ, మా పితృదేవులు నా వైపే తీక్షణం గా చూస్తా బలంగా అడుగులేస్తా వస్తున్న్నారు.

ఆ తరవాత... ఏమ్ జరిగిందంటే... ఏం.. జ రి గిం దం టేఏఏఏఏఏఏఏ.......!!!!

************************************************************************************************************
స్కూల్ డేస్ లో జరిగిన ఆ చేదెక్కిన తీపి జ్ఞాపకం కారణంగా మళ్ళా ఎక్స్పెరిమెంట్స్ జోలికి పోకుండా, బుర్ర బఠాణీ గింజంత కూడా వాడకుండా, భట్టీ మంత్రం తో క్లాస్ ఫస్ట్ గా నిలుస్తూ శభాష్ అనిపించుకుంటున్న రోజులు.

మా ఇంటర్ కాలేజోళ్ళు కూడా "భట్టీ పట్టు -  పేపర్ పై పెట్టు - మార్కులు కొట్ట్టు" కార్యక్రమాన్ని దశాబ్దాలు గా అమలు పరుస్తూ నంబర్ 1 కాలేజీగా నిలిచినోళ్ళూ కావటం తో నాకు మెదడుందనే సంగతే మరిచిపోయి ర్యాంకులనే తామర పువ్వులకోసం "కార్పొరేట్ చదువులు" అనే  బురద లో పొర్లుతూ ఎంజాయ్ చెయ్యటం నేర్చుకున్నాను. సెకండియర్ ఫైనల్ ఎగ్జాంస్ కి వారం ముందు దాకా మా కాలేజీ లో ల్యాబ్ ఉందనే సంగతి కూడా తెలీని మేము ప్రాక్టికల్ ఎగ్జాం కి రెడీ అయ్యాము.

ఆ రోజు ఫిజిక్స్ ప్రాక్టికల్స్.............

నాకు వచ్చిన ప్రయోగం... "Simple pendulum".
అప్పటిదాకా బుక్ లో దాని బొమ్మ చూసి ఉండటంతో రాత్రి వచ్చిన పీడకల పొద్దున్న నిజమైనట్టూ అనిపించీ ఎమ్మటే గుర్తు పట్టేసాను.  ఓ సారి ఆత్మీయంగా పరిశీలించాను. వేలాడగట్టిన ఇత్తడి గోళం బరువు గానూ, దారం చాలా సన్నం గానూ ఉంది. అదే సంగతి మా ఫిజిక్స్ సార్ తో చెప్తే "అలా ఉంటేనే Oscillations బాగా అయ్యీ  కరెక్ట్ వాల్యూస్ వస్తాయ్" అని చెప్పేసి కళ్ళద్దాలు ఎగదోసుకుంటూ వెళ్ళిపోయారు. 


సరే అన్జెప్పి నేను "గోవిందా....గోఓఓఓఓఓఓఓఓవిందా" అనుకొని ప్రయోగం మొదలెట్టి, గుళ్ళో ఎత్తున వేలాడ దీసిన గంట కొట్టినట్టొ గట్టిగా ఊపాను. దెబ్బకి దారం పుటుక్కున తెగిపోయి, గోళీ దొర్లుకుంటా పోయింది. అటూ, ఇటూ చూశా.ఏదో జరిగినట్టూ అందరికీ తెలిసింది గానీ ఏమ్ జరిగిందో ఎవ్వరికీ తెలియలేదు. ఎవ్వరి కంటా పడకుండా తెచ్చి ముడేసేసీ,  మిగిలిన దారపు పోగులు కొరికేసాను తెలివిగా. ప్రయోగం పూర్తయ్యాక నా ధియరీ వాల్యూసూ, ప్రాక్టికల్ వాల్యూసూ కంపేర్ చేసి చూస్తే "మానవుడు - దానవుడు" సినిమా లో కిట్టప్ప క్యారెక్టర్ల లాగా పొంతన లేకుండా ఉండాయి.
నా తెలివితేటల మీద అమితమైన నమ్మకమున్న మా సార్ వచ్చి ప్రాక్టీకల్ వాల్యూస్ చెవి లో చెప్పేసి రెండూ టాలీ చేసేశారు. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ వైవా లో ఏమ్ అడిగేస్తారో ఏమో అని గజగజ వణికిపోతున్న నన్ను ఆయిన అడిగిన ప్రశ్నేందయ్యా.. అంటే "ఫస్ట్ ఇయర్ పర్సెంటేజ్ ఎంత?" అని. నేను "95%" అని మొహం దాకంత చేసుకొని చెప్పగానే శభాష్ అనేసి పొమ్మన్నారు. (మా కాలేజోళ్ళు లాంచనాలు ఓ లెక్క లో ఇచ్చారంట. ఇంకేం అడుగుతారూ?

రెండ్రోజుల తర్వాత కెమిస్ట్రీ ప్రాక్టికల్స్......

పిల్లకాయలందరికీ చిటికెడు సాల్ట్ కాగితం లో పోసిచ్చి "ఈ సాల్ట్ ఏమిటో కనిపెట్టి రిపోర్ట్ రాయండ్రా రేయ్.." అని ఆర్డరేసేరు. నేను ఎమ్మటే చొక్కా చేతులు మోచేతుల దాకా మడతెట్టీ, ఊపిరి బలంగా పీల్చుకొనీ నా ప్రయోగం మొదలెట్టడానికి సమాయత్తమయ్యేను. ఇంతలో మా మా రసాయనిక శాస్త్ర అయ్యోరొచ్చి ఎవరెవరికి ఏ యే సాల్ట్ ఇచ్చారో చెవిలో ఊదేసి, అర్జెంటుగా దానికి తగ్గట్టూ రిపోర్ట్ రాసీయండ్రా అని ఆర్డరేసేరు. "ప్రయోగం చెయ్యకుండా రిపోర్ట్ రాయటం ఏంట్రా నీ వల్లకాడూ?" అని మీ లాటి దెర్మప్రెభువులు అంటారని తెల్సు. ఎగ్జాం కి వారం రోజుల ముందు మా  అయ్యోర్లు  ఏ సాల్ట్ ఎలా కనిపెట్టాలో, దానికి రిపోర్ట్ ఎల్లా రాయాలో రాసున్న  ఓ ముప్పై పేజీల మేటర్ చేతిలో పెట్టి దీన్ని భట్టీ కొట్టకపోతే, నలుగురు కూలీల్ని పెట్టి మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టూ కొట్టిస్తామని సెలవిచ్చారు. దాంతో మా భావి భారత ఇంజినీర్లం ఆ మేటర్ ముక్కులో పెట్టుకొని, తుమ్మడానికి ముక్కులో వేలెట్టుకొని రడీ గా ఉన్నాం. అపరిచితుడు సినిమా లో రూల్స్ రామానుజం లాంటీ నేను మాత్రం పద్దతి ప్రకారం ప్రయోగం చేసినాకే రిపోర్ట్ రాయాలని డిసైడయ్యి మా సార్ దగ్గరకి వెళ్ళి "సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కడుంది సార్?" అని అడిగాను. " రిపోర్ట్ రాయరా రంగసామీ.. అంటే యాసిడ్డూ యాపాకు పులుసూ అంటావేట్రా?" అని గసిరి ఊరుకోకుండా ఉరిమి చూసి డిప్ప మీద ఒకటీ పీకడం తో నాకు జ్ఞానోదయమయ్యి, ఆన్సర్ ఏంటో ముందే తెలియటం తో శుభం కార్డ్ నుండి మొదలెట్టి తిక్కన్న మహాభారంతం రాసినట్టూ, రిజిస్ట్రేషన్ కి దస్తావేజులు రాసినట్టూ పగడ్బందీ స్క్రీన్ ప్లే తో స్క్రిప్ట్ రాసి పారేశాను. ఆ తర్వాత ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటా బిస్కట్ నవ్వులు నవ్వుకుంటా నించున్నాం. మా అయ్యప్పస్వామి గాడు మాత్రం విచారంగా కూర్చొన్నాడు. "ఏరా అలా ఉన్నావూ..ఏమయినా హెల్ప్ కావాలా?" అని అడిగాను మెల్లిగా. "అది కాదు రా... జీన్ ప్యాంట్ కొనుక్కుంటానని మా నాన్నని డబ్బులడిగానూ... మడతమంచం గుడ్డ చేతిలో పెట్టి కుట్టించుకోమన్నాడూ.." అని కష్టాలు చెప్పుకుని కుమిలిపోవడం మొదలెట్టాడాడు.

ఇంతలో... అందరం రిపోర్ట్ రాసేశామని పక్కాగా తెలిసాక మా సారొచ్చి "అలా కాపలా కాసి అలిసిపోయ్న దిష్టి
పిడతల్లా నించున్నారేట్రా...? ఇది లాబ్ ఎగ్జాం. ఏదో ఒకటి చెయ్యండి.. ఎవడ్రా ఇందాక సల్యూరిక్ యాసిడ్ అడిగాడూ.. అదిగో అక్కడుంది తెచ్చుకో ..పో... "  అని తనదైన స్టైల్ లో బతిమాలారు.  "నేనే సార్.. నేనే.." అంటూ ప్యాంట్ మోకాళ్ళ దాకా మడతెట్టి పరిగెట్టాను. బీకర్ లో పొయ్యడానికి యాసిడ్ బాటిల్ మూత తీశాను. గుప్పున వేడి గా పొగలొస్తున్నాయ్. అది చూసి గుండె గుభేల్ మన్నాది. నోరు ఆరిపోయింది.  ఎందుకొచ్చిన రిస్క్ లే అని, బీకర్ సగానికి చేతికందిన డైల్యూటెడ్ యాసిడ్ పోసి, గ్లాస్ నిండా హైడ్రోజన్ మొనాక్సైడ్ తీసుకొని కడుపు నిండా తాగి కుదుట పడ్డాను. కాసేపు పోయాక టైట్రేషన్ కోసం  పిప్పెట్టూ, బ్యూరెట్టూ, కోనికల్ ఫ్లాస్క్, మట్టీ, మామిడికారం వగైరా తెచ్చుకొని తిరునాళ్ల లో నులకమంచం మీద పకోడీ, కారప్పూసా, చిట్టిగారెలూ, చెగొడీలూ సర్దినట్టూ టేబుల్ మీద సర్దాను.


సరిగ్గా గుర్తు లేదు గానీ ఫైనల్ గా "ద్రావకానికి లేత గులాబీ రంగు" తెప్పించి ఆ వాల్యూ నోట్ చేసుకోవాలనుకుంటా. నేను అదే పని మీద ఫ్లాస్క్ పట్టుకొని చేతికి వొణుకుడు వ్యాది వచ్చినట్టూ తిప్పుతా నానా పాట్లూ పడుతున్నాను. నా పక్కనే ఉన్న జిగిడీ దోస్త్ రఘునాధ్ గాడు టైట్రేషన్ చేస్తున్నాడో కలర్ షోడా కలుపుతున్నాడో అర్ధం కాలేదు. రక్తంచిందించి రస్నా కలిపినట్టూ ఎర్ర ఎర్ర గా కలిపేశాడు. కానీ వాడికి వాల్యూస్ కరెక్ట్ గా వచ్చాయి. నా ఫ్లాస్క్ లో ద్రావకానికి కలర్ కఱెక్ట్ గా వచ్చింది గానీ వాల్యూస్ వంకర్లు తిరిగిపోయాయి. ఇది చూసిన మా సారేమో నెత్తి, నోరూ కొట్టుకొని నా ఫ్లాస్క్ వాడికి ఇచ్చి, వాడి వాల్యూస్ నాకిచ్చి"ఇక పొండి" అనేసేరు.

"అంతం కాదది ఆరంభం... అనీ, ముంగిట్లో మొగ్గలేయించే రోజులు ముందు ముందు వస్తాయనీ, అవి ఒంగోబెట్టి వాయించేస్తాయనీ ఇంజినీరింగ్ లో జాయినయ్యి వారానికి నాలుగు సార్లు ల్యాబుల్లో అబ్జర్వేషన్ బుక్స్ బయటకి విసిరేయించుకునే వరకూ నాకు తెలీలేదు నాకు.
సెకండ్ ఇయర్లో మాకు ఎలక్ట్రికల్స్ సబ్జెక్టూ, ల్యాబూ ఉండి అఘోరించింది. ఇంట్లో స్విచ్చెయ్యాలంటేనే రబ్బరు చెప్పులేసుకెళ్ళి వేసే నా భయానికీ, దరిద్రానికీ తోడుగా బక్కగా ఎండిపోయినట్టుండే ఓ సారొచ్చేవారు. అతనికి మా కుర్రోళ్ళు పెట్టిన పేరు "ఎండు చేప". కొంతమంది "డ్రైఫిష్" అని కూడా పిలుచుకునేవారు. ఎందుకూ అంటే.. అతన్ని చూడగానే ఎండుచేపే గుర్తురావటం ఒక కారణమైతే, డిగ్రీ స్టూడెంట్స్ ని స్కూల్ పిల్లకాయల్లా ట్రీట్ చెయ్యడం మరోకారణం.మమ్మల్నందరినీ పనికి మాలిన పకోడీ గాళ్ళనీ, సినిమా ధియేటర్ల దగ్గర ఇంటర్వ్వెల్లో సమోసాలమ్ముకోడానికి కూడా పనికిరామనీ రోజూ సైద్దాంతికంగా ప్రూవ్ చేసేసి పరువు తీసేసేవారు.
అటు థియరీ చెప్పేవారు కాదూ, ఇటు ల్యాబూ తిన్నగా చేయించేవారూ కాదు. ప్రతిరోజూ టెక్స్ట్ బుక్ లో ఉండే ఎగ్జాంపుల్ ప్రాబ్లంస్ బోర్డ్ మీద  ఎక్స్ప్లెయిన్ చేసేవారు. (ఎక్కించేవాడు అనడం కరెక్టేమో).  "పనికొచ్చేవి చెప్పకుండా ఈ ఎగ్జాంపుల్ లెక్కలు మాకెందుకయ్యా సామే..అ మాత్రం మేం చూసి చేసుకోలేమా?" అని అడిగిన పాపానికీ
మా సత్తిమాయని పగబట్టేసి, "ఏం చెప్పాలో నాకు తెలుసు..మీరేమ్ ఉచిత సలహాలివ్వక్కర్లా..మళ్ళీ ఇలాంటివి రిపీటయితే నీ ఇంటర్నల్ మార్క్స్ పాస్ మార్కులు దాటవూ.. ఫైనల్ ఇయర్ దాకా ఈ ఎలక్ట్రికల్స్ లాబ్ పాసవ్వవు" మున్నగు కఠిన పదజాలం వాడి కంట్రోల్ లో పెట్టేశారు. హెవీ ట్రాఫిక్ లో హెల్మెట్ పెట్టుకొని బైకు మీద  పోయేవాడికీ నెత్తి దురదేసినంత మాత్రాన ఏం చేయగలడూ? ల్యాబ్ మార్కులనే హెల్మెట్ తీసి సబ్జెక్ట్ నేర్చుకోవాలనే  దురదని తీర్చుకోలేం కదా...నీతి చెప్పే మూడో కోతి తాలూకా బంధువుల మందలా నోర్మూసుకొని మిన్నకుండిపోయేం.

ఇహ ఎలక్ట్రికల్స్ లాబ్ లో మేం చేతబడులు చెయ్యడానికి గీసే ముగ్గుల్లాగా అనిపించే సర్క్యూట్స్ ని బుక్ లో ఉన్నదున్నట్టుగా, ఎక్కడా తప్పుల్లేకుండా (అనే మా నమ్మకం) సెట్ చేసి స్విచాన్ చేస్తే రాజా... కమ్మరేకు టపాకాయలు పేలినట్టూ ఠపేల్ ఠపేల్ మని పేలి ఫీజులు కొట్టేసేవి. కాయిల్స్ కాలిపోయి మోటార్స్ ఆగిపోయేవి. షార్ట్ సర్క్యూట్లయిపోయి బల్బులు మాడిపోయేవి. ఇట్టాంటి దయనీయమైన పరిస్థితుల్లో మా సెమిస్టర్ ఎగ్జాంస్ దాపురించాయి.

ఆరోజు ఎలక్ట్రికల్స్ ల్యాబ్ ఎగ్జాం. ఎలక్ట్రికల్స్ డిపార్ట్మెంట్ హెడ్ మా ప్రిన్సిపల్ "సీతయ్య" (ఎవ్వరి మాటా వినడు) అవ్వటం తో, వైవా అడగడానికి ఆయనే రావటం తో మా అందరికీ విష జ్వరాలొచ్చేశాయి.

ఎప్పుడూ మా నెత్తెక్కి తొక్కినట్టు మాట్లాడే మా ఎండుచేప సైలెన్సర్ పెట్టిన నాటు తుపాకీ పేలినట్టూ మెల్లిగా మాట్లాడ్డం మొదలెట్టారు.
మా బ్యాచ్ దగ్గరకొచ్చి..

"ప్రిన్సిపల్ సార్ అడిగినదానికి జాగ్రత్త గా ఆలోచించి ఆన్సర్ చెయ్యండయ్యా..  రాజ్ కుమారూ.. నా ఆశలన్నీ నీమీదే..!"

నేనుః  మీరేం ఫీలవ్వకండి సార్.. కరెక్ట్ ఆన్సర్ తెలీకపోయినా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను.

"ఓరే బాబూ.. పొంతన లేని ఆన్సర్ చెప్పి నా పీకల మీదకి తీసుకురాకండి రా.. ఆన్సర్ చెప్పమని నన్నడుగుతాడూ.."

విజయ్ గాడుః అడిగితే మాత్రం మీకేంటి సార్? మీకు సబ్జెక్టంతా ఆడించిన పిండే కదా..!

"నాకు సబ్జెక్ట్ తెలిస్తే మీకు ఎగ్జాంపుల్ ప్రోబ్లెంస్ ఎందుకు బోర్డ్ మీద ఎక్కిస్తాన్రా ?? అదే చెప్పేవాణ్ణిగా..!!"

నేనుః అంటే.........!!! మరి ఇన్నాళ్ళూ మమ్మల్ని "ఒట్టి వెధవలు.. పనికి రాని సన్నాసులూ.. పోరంబోకులని తిట్టిందంతా?

" వెధవల గురించి ఇంకో వెధవ కే కదరా బాగా తెలుస్తుందీ"


విలాస్ గాడుః  "అంతా... మోసం... దగా.. కుట్రా....గడిచిన ఆర్నెళ్ళూ నాకు నరకం చూపించారు.. మిమ్మల్నీ... నిన్నూఊఊఊ...!!"

"ఈ సంగతి ముందే చెప్తే  నా మాట ఎవడ్రా వినేదీ.........???"


ఇంతలో "రాజ్ కుమార్ ఎవడయ్యా ఇక్కడ??" అని మా ప్రిన్సీ కేక వినిపించటం తో నేను పరిగెట్టాను.


మా సీతయ్య ఏక పాత్రాభినయం... నా మూగాభినయం.

what is back emf??
........
Back emf అంటే ఏంటి?
......

what is emf equation of DC machine??
...........
What are the various types of transformer?
............

What are the types of 3 phase induction motors?
..............
What is mutual inductance?
.........
What is the difference between electrical motor and generator?

ఒరే... మనిషి వా మానువా...? అలా నాలుగు కళ్ళేసుకొని నా వైపు చూస్తావేంటి.. ఒక్కదానికన్నా సమాధానం చెప్పు.. అరగంట నుండీ గొంతు చించుకొని అరుస్తుంటే ఒక్కడూ మాట్లాడరేంట్రా?


 అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? నేనంటే ఏమనుకుంటున్నారు? నా కర్మ కి ఇలాంటోళ్ళూ దాపురించారేట్రా? ఇన్ని
 తిడుతున్నా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటావేంటి.. ఇంత చెత్త బ్యాచ్ ని ఇదే ఫస్ట్ టైం చూడటం. కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలు చూడటం కాదు. సబ్జెక్ట్ రావాలంటే బుర్ర పెట్టి చదివాలి. ఆమ్లెట్ వెయ్యాలంటే గుడ్డు పగల గొట్టాలి కదా?

నేనుః పొయ్యి మీద పెణం కూడా పెట్టాలి సార్. మాకేం చెప్పకుండా ఎలా సర్?

ఆ...  ఆన్సర్ షీట్ ఇలా పడెయ్..... ఛీ.. ఛీ...సిగ్గులేకుండా ఇక్కడే నించుంటావా....  పో బయటకి.

నేనుః  థాంక్యూ సర్.

*********************************************************************************
ఆ రకంగా బయటకొచ్చి, హమ్మయ్యా అనుకొని స్వేచ్చావాయువుని పీల్చుకొంటున్న నాకు లీలగా వినిపిస్తున్న్న మాటలు..

"ఏమయ్యా... ఇదేనా సెమిస్టరంతా... నువ్ చెప్పిన సబ్జెక్టూ.. ఒక్కడికీ మినిమం నాలెడ్జ్ కూడా లేదు.. ఇలా రా నువ్వు..."

ఏసెయ్య్ రా.. జజ్జనకా జజ్జనకా...ఏసెయ్య్ రా.. జజ్జనకా..జజ్జనకాజజ్జనకా......ఏసెయ్య్ రా.. జజ్జనకా.!!!


ఓ మాజీ విద్యార్ధి అభ్యర్ధనః

అమ్మలారా..అయ్యలారా... మీ మీ బుజ్జోళ్ళకీ, బుజ్జమ్మలకీ చేతికందిన ప్రతి వస్తువునీ పరీక్షించే అవకాశాన్నీ, చెడగొట్టే భాగ్యాన్నీ ప్రసాదించండి. ఈ కాలం స్కూల్స్ లో మార్కులకీ, ర్యాంకులకీ తప్ప వేటికీ అవకాశం ఉండకపోవచ్చు. ఇంతే సంగతులు.. చిత్తగించవలెను.


జై..హింద్.!!