Friday, December 30, 2011

నా చదువు - చాకిరేవు

నా ఎలిమెంటరీ స్కూల్ చదువంతా దాదాపుగా గంటకి గ్రాము లెక్కన మెంటలెక్కే పరిస్థితుల్లో సా....గింది.
నా  బై బర్త్  మా నాన్నగారు స్కూల్ టీచర్ అవ్వటం తో నాకు ఇంటికీ, స్కూలు కీ పెద్దగా తేడా తెలిసేది కాదు.
స్కూల్ లో నాన్న, మిగిలిన పిల్లలందరి ముందూ రన్ వే మీద లాండవుతున్న  విమానాన్ని తలపించేటట్టూ, వీపు మీద అరిచేత్తో డీటీయెస్ ఎఫెక్ట్ తో తగు మోతాదు ఘర్షణ తో అంటించేస్తుంటే, 
 ఇంటికొచ్చాక మా అమ్మ టొక్కూటొక్కూ  నెత్తిమీద మొట్టికాయలు మొట్టేసేది. స్కూల్ లో నా పరిస్థితి అద్దంలో ఐస్క్రీం చూపించీ, కరిగిపోకముందే చప్పరించ మన్నట్టే ఉండేది. ఎలాగంటారా? నేను ఒకటో తరగతి చదివేటప్పుడు నా ప్లేసు మా నాన్న గారి కుర్చీ పక్కనే స్టూడెంట్స్ కి అభిముఖంగా "నిండు చందురుడు ఒక వైపూ.. చుక్కలు ఒక వైపు.. నేను ఒక్కడిని ఒకవైపూ..లోకం ఒకవైపూ" అన్నట్టూ ఉండేది.
ఎదుటివాడితో మాట్లాడ్డానికి లేదు. పక్కోడితో పోట్లాడ్డానికి లేదు. జారబడ్డానికి గోడ ఉంది కదా అని కూసింత కునుకు తీద్దామన్నా కంటికి కనిపించని వేగం తో వచ్చే నాన్నారి చెయ్యి నా కొత్తెం తో అనుసంధానమయ్యేది. సూక్ష్మ మండలం లో విహరిస్తున్న నా అంతరాత్మ ఆగమేఘాలమీద ఎగిరొచ్చి ఆగేది. ఆ పై క్లాస్ రూం దద్దరిల్లేలా లక్ష్మీ బాంబులు పేలినట్టూ సౌండ్స్ వచ్చేవి. 
"వాళ్ళబ్బాయ్ సంగతే ఇలా ఉంటే మన సంగతేటబ్బాయ్?" అని సైలెంటయ్యిపోయి భయం, జాలీ మిక్సయిన ఫీలింగ్ తో మూగనోము నోచేవారు పిల్లకాయలు. 
ఒకడేడుస్తుంటే, అది వంద మంది చూస్తుంటే, ఆ ఒక్కడూ మీరే అయితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటాదో తెలుసా?
మహేష్ బాబు చూపులు ఇలియానా వీపు కి గుచ్చుకున్నట్టూ, సానుభూతి చూపులు ఒళ్ళంతా పచ్చిగా  గుచ్చుకుంటే కలిగే మంట, అప్పుడే తగిలిన దెబ్బ మీద అయొడీన్ పోసినట్టూ ఉంటాదంట.[రాజ్ కుమారుని ఉవాచ]


ఇలాంటి పగబట్టిన పరిస్థితుల మధ్య నేను ఒకటో తరగతి మొదటి తరగతి లో పాసయ్యాను. హమ్మయ్యా.... హాలీడేస్...! అనుకునే లోపలే వేసవి లో సెకండ్ క్లాస్ కి స్పెషల్ క్లాసులు మొదలయ్యాయి మా ఇంట్లో..! ఏటనుకుంటున్నారూ? ఎక్కాలు ఇరవైల వరకూ అప్పజెప్పాలి. పై నుండి కిందకీ కింద నుండి పైకీ. అది గాక మధ్యలో ఏది అడిగితే అది చెప్పాలి. సూపర్ మేన్ కి కూడా సాధ్యం కాని ఫీట్లివి. బాలయ్య బాబు కూడా పడకూడని పాట్లివి.

**********************************************************************************
ముదిరిన ఎండలు చెదిరిపోయాయి. మధించబడిన మేఘాలు వర్షించాయి. ఎండిన చెరువులు నిండాయి.(నాకేటీ కపిత్వం ఇలా తన్నుకొచ్చేస్తుందీ?) 
లోకం లో ఇన్ని మార్పులు జరిగినప్పుడు నా జీవితం లో జరగవా??????????  జరిగాయి.

నేను రెండో తరగతి కి ప్రమోటయ్యాను. కానీ అదే క్లాస్ రూం లో నా పక్కనే కుర్చీలో నాన్నగారు. నా ఎదురుగా కొత్తగా జాయినయ్యిన ఒకటో తరగతి పిల్లకాయలు...! పక్కగది లో నా క్ల్సాస్ మెట్స్. (టూ... బ్యాడ్ కదా? సో... సాడ్ కదా? )   
పరీక్షల టైం లో మాత్రమే నా క్లాస్మేట్స్ అందరినీ చూసీ, పరీక్ష రాసేసీ, ఎగ్జాం అయిపోయిన ఆనందం లో అందరూ ఇళ్ళకి పోతుంటే , నేను మాత్రం జిడ్డు కారుతున్న మట్టిమొహం వేసుకుని మళ్ళీ నా క్లాస్ కి అఘోరించేవాడిని. తప్పదూ... అది నాన్నగారి కమాండ్.

 క్లాస్ ఒక్కటే అయినా, రూములు వేరయినా , ఇంటర్వెల్ లో ఆడుకోడానికి మాత్రమే స్కూల్ కెళ్లడానికి ఇష్టపడే  నాకు  కఠారి భాను ప్రసాదూ, చలపాకల వీరభద్రం, గంటా వీరబాబూ, రామోజి రాజా, పైడిపాల రమేషూ, గెడ్డమూరి నాగేశ్వర్రావులు టూత్ బ్రష్షూ -టంగ్ క్లీనరూ, సిగరెట్టూ-అగ్గిపెట్టే, అరిటి పండూ - అగరుబత్తీ,  జ్వరమూ-జలుబూ, కఫం-దగ్గూ, గజ్జీ-దురదల్లాగా  క్లో....జు ఫ్రెండ్సయ్యి పోయారు. అప్పట్లో హాజరు పట్టీ (అదేనండీ అటెండన్స్ రిజిస్టర్) లో మా నాన్న గారు షార్ట్ కట్స్ వాడకుండా ఇంటి పేరూ, పూర్తి పేరూ రాసీ, అలాగే పిలుస్తూ ఉండటం తో మాకూ అలాగే అలవాటయి పోయాయి. ఇంటి పేరు తగిలిస్తే గానీ వాళ్లని తలచినట్టుండదు నాకు. వాళ్లని తలచుకోగానే నా మొహం అప్పుడే కొన్న స్టీలు బిందె లాగా మెరిసిపోతుంది. ;)

పై లిస్ట్ లో గెడ్డమూరి నాగేశ్వర్రావు నాకు సీనియరే అయినాగానీ, వాళ్ళిల్లు మా ఇంటి పక్కనే అవ్వటం తో ట్యూషన్కని మా ఇంటికి తగిలేసేవాడు వాళ్ల నాన్న. వాడు కూడా క్రమం తప్పకుండా రోజూ మా ఇంటికొస్తూ, కాపీరైటింగ్ బుక్ లో అచ్చుతప్పులు రాస్తూ మా నాన్న చేతిలో తన్నులు తినేసీ, కొట్టకుండానే కింద పడిపోయీ, గతి తప్పిన శృతి లో  రాగాలు తీస్తుండేవాడు.  

ఇలా గులకరాళ్ల మీద మోకాళ్ళ నడకలా సాగుతున్న నా జీవితం లోకి మొదటి సారిగా "ఎగ్జామ్స్" ఎంటరయ్యాయి. 
అప్పట్లో ఫస్ట్ క్లాస్ కి, ఇప్పటి లాగా ఐయేయస్ రేంజ్ లో ఎగ్జాంస్ ఏం ఉండేవి కాదు కదా..! కానీ రెండో తరగతికొచ్చాక, మూడు నెలలు గడిచాకా హఠాత్తుగా... రేపు మీకు "తెలుగు పరీక్ష" అని అనౌన్స్ మెంట్ వచ్చింది సాయంకాలం జనగణమన టైం లో.

అది విన్న నా గుండె గుభేల్ మన్నాది.
"అంటే ఏంటండీ?" అన్నాడు భద్రం.
ప్రసాద్ గాడు గజ గజా వొణికేస్తున్నాడు.
రమేష్ గాడు కళ్ళు తిరిగి పడిపోయాడు.
వీరబాబు గాడు.. ."మేష్టారండీ.. అర్జెంటండీ..!" అన్నాడు వాడికి తోచిన వేళ్ళు చూపించి.
"పరీక్ష ఇప్పుడు కాదురా.. రేపు" అన్నారు సూర్యనారాయణ మేష్టారు.
"అప్పిడి దాకా ఉండలేనండీ" అనేసి పర్మిషన్ కోసం చూడకుండా బయటకి పరిగెట్టేడు. ఆ రాత్రికే ఆడికి జొరం కూడా వచ్చింది.

ఆ మరుసటి రోజు......  మేష్టారు చెప్పినట్టు ఎగ్జాం పేపర్ మీద అందరం పేరు రాసి, నంబర్ వేశాం. ఇప్పుడు ప్రశ్న జాగ్రత్తగా చదువుకొని జవాబులు  మీరే రాస్కోండ్రా అని చెప్పేసేసీ ఆయన పేపర్ చదువుకోటం లో మునిగిపోయారు.
నేను చక చకా రాసేసీ " ఓస్... ఇంతేనా... ఎగ్జాం అంటే?" అనుకొని చక్కా ఇంటికి పోయాను. 

ఆ మర్నాడు పేపర్లు కరెక్ట్ చేసిన మా మాష్టారు చేత్తో పేపర్ల కట్ట పట్టుకొనీ, క్లాస్ రూం అని కూడా చూడకుండా కిందపడి దొర్లి నవ్వుతున్నారు. 
"ఏమయ్యింది మాష్టారూ?" అని మా నాన్న అడిగితే కట్ట చేతిలో పెట్టి, అలాగే దొర్లుకుంటూ స్టాఫ్ రూం కి వెళ్ళిపోయారు.
పేపర్లు చూసిన మా నాన్న ఇదిగో కొంచేం అటూ ఇటుగా ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు.



విష్యం ఏమిటంటే... 
"మీ నాన్న గారి పేరేమిటీ?" అన్న ప్రశ్న కి నేను మా నాన్న పేరు రాస్తే క్లాస్ మొత్తం నా ఆన్సర్ ని కాపీ కొట్టారు. :) :)  [ఈ సంగతి ఇప్పటికీ చెప్పుకుని నవ్వుకుంటారు మా ఇంట్లో]
*****************************************************************************************
ఎగ్జామ్స్ ని తెలుగు లో "పరీక్షలు" అని అంత బలం గా ఎందుకంటారో తెలుసా మీకూ? నాకు బాగా తెలుసు. మీకు చెప్తాను వినండి.
నేను పరీక్ష రాసేటప్పుడు ఏమన్నా తప్పులు రాస్తే డిప్పకాయలూ, టెంకి జెల్లలూ, వేడి వేడి అట్లూ,  పెఢేల్ పెఢేల్ మని పడేవి. ఎందుకు పడేవో తెలిసేది కాదు ఆ టైం లో.
అదే రోజు సాయంకాలం ఇంట్లో పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు ఒక్కో  తప్పుడు జవాబుకీ ఒక్కొక్కటి చొప్పున తినేవాడిని. (దీన్నే కర్మ అంటారు మాష్టారూ..!)
మర్నాడు పేపర్స్ ఇచ్చేటప్పుడు అందరితో పాటూ ఫ్రెష్ గా ఇంకో డోసు. (మరే.. అందరి నెత్తి మీదా సుడి ఉంటే నా నెత్తి మీద వట్రసుడి కదా మరి.)
*****************************************************************************************

ఈ చాదస్తపు చదువుల టెన్షన్లని కాసేపు పక్కనెడితే, అప్పట్లో నేను ఎంజాయ్ చేసినట్టూ ఇంకెవ్వరూ చెయ్యలేదేమో అనిపిస్తాది. ఎన్నని చెప్పనూ? 

మా గ్యాంగ్ అంతా ఆకుపచ్చని తమలపాకు తోటల్లో తిరిగీ, చల్ల చల్లని కొబ్బరి బొండాలు తాగిన మద్యాహ్నాలవి.
ఏటి ఒడ్డున సరుగుడు తోటల్లో ఏరుకొచ్చిన పల్లేరు కాయలూ, గచ్చ కాయలూ  ( గచ్చ కాయలు గచ్చు మీద నూరీ ఒంటికి తగిలిస్తే సుర్ర్ర్ర్ మంటాది. స్కూల్ లో ఫుల్ టైం పాస్ )
ఉసిరితోటల్లో గుత్తులు గుత్తులు గా కోసుకొచ్చిన ఉసిరికాయలు.. ఆ ఉసిరికాయల్ని ఉప్పు + కారం కలిపిన నీళ్ళ లో ఊరబెట్టీ, ఊరేలోపుగానే ఊదేసిన గొప్ప రోజులవి.
సైకిల్ టైర్, పుల్లముక్క పట్టుకొని ఊరంతా బలాదూర్ తిరిగిన మండే ఎండల్ని లెక్కపెట్టని వేసవులవి.
సైకిల్ మీద ఐస్ బాక్స్ తో వచ్చే కృష్ణ దగ్గర ఐస్ కొనుక్కొని తినక పోతేగానీ గడవని రోజులవి.
ఇంట్లో తెలియకుండా జుట్టు తడవకుండా ఏట్లో స్నానం చేసొచ్చిన తిరిగిరాని గొప్ప సాయంకాలాలవి.
క్లాస్ లో ఎవ్వరి దగ్గరా లేని లేపాక్షి నోట్ పుస్తకాలు నా దగ్గర ఉన్నాగానీ, "కాగితాల ఆట" లో గెలిచిన కాగితాలతో  పుస్తకం కుట్టుకుని మురిసి పోయిన మరపురాని రోజులవి. 
జీడిమామిడి తోటలూ, బత్తాయి తోటలూ, సపోటా తోటలూ ఒకటా రెండా? ఎక్కని చెట్టులేదు, కోయని కాయ లేదూ, తిని పారెయ్యని పండు లేదు.
ఊళ్ళో టైర్ దొర్లించుకుంటూ పోతుంటే.. "ఓ.. మేష్టోరి బుజ్జీ..!" అని ఇంట్లోకి ఎవరెవరో పిలిచేవారు. పిలిచిన వాళ్ళ ఇంటికెళ్ళిపోయి, పెట్టినవి తినేసీ, నచ్చినవి జేబులో పెట్టుకొని "టాటా అత్తా" అనేసి బండెక్కి(అదే.. సైకిల్ టైర్) బయలుదేరేవాడిని.
బేసిగ్గా నాకు చదువంటే పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవటం తో (ఈ కూడికలూ, తీసివేతలూ ఎక్కాలూ, లెక్కలూ, గుణకారాలు, వికారాలూ ఎవణ్ణి ఉద్ధరించడానికో ఎంత  థింకినా, తినికినా అర్ధమయ్యేది కాదు) నా టైం ఎక్కువగా ఇలాగే స్పెండ్ చేసేవాడిని.

అలాంటి ఆ పార్ట్ టైం స్వర్ణయుగం లో... ఇంకో సంవత్సరం గడిచింది.... నేనిప్పుడు మూడో తరగతి.

నా ఎదురుగా... ఆ ఏడాది కొత్తగా జాయినయ్యిన ఒకటో తరగతి పిల్లలున్నారు... 
(*&(*&($ర్ (*$)*#@)$*)*#@
(*&(*&($ర్ (*$)*#@)$*)*#@
(*&(*&($ర్ (*$)*#@)$*)*#@

మరో సంవత్సరం గడిచింది..... ప్చ్.. అబ్బే.... పెద్ద మార్పులేం లేవు..!

కానీ ఆ తరువాతి సంవత్సరం మాత్రం పెనుమార్పు సంభవించింది. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పుట్టి పెరిగిన ఊరినీ, ప్రాణం గా చూసుకునే స్నేహితులనీ, "మా సొంత నానమ్మ ఈవిడే" అని అపోహ పడేంత గొప్పగా నన్ను చూసుకున్న మా నానమ్మనీ (మా ఇంటి ఓనరు) వదిలేయాల్సి వచ్చింది.
కొత్త ఊరు.. కొత్త స్కూల్... కొత్త టీచర్... ఆ టీచర్ ఎవరో కాదు కొత్తగా గవర్నమెంట్ టీచర్ గా  జాయినయ్యిన మా మాతృదేవత.(నా దరిద్రం మీకు తెలియనిది కాదు).
మా నాన్న కొడితే సౌండెక్కువా, స్టామెనా తక్కువ. కానీ మా మాతాశ్రీ అలాక్కాదు. బాడీలోని బలమంతా పిడికిలి లోకి తీసుకొచ్చీ శక్తి వంచన లేకుండా సౌండ్ రాకుండా మొట్టే మొట్టికాయలు భరించటం చాలా కష్టం అయిపోయేది.
ఇదే ముక్క మా చిన్నమాయ కి చెప్తే.. "నన్నుమాత్రం వదిలిందనుకున్నావా? నా సంగతి వదిలెయ్. మీ పెదమాయని అయితే డిగ్రీలో కూడా డింగూ డింగూ మొట్టేసేది" అనేసేడు.
"మరి పెదమాయ ఊరుకునేవాడా?" అడిగాన్నేను.
"లేదులే.. జండూబామ్ రాసుకునేవాడు" అనేసీ "నువ్ మన ఇంటికొచ్చెయ్యరా... ఇక్కడుండి చదువుకుందువూ గానీ" అని సలహా ఇచ్చాడు. ఈ సలహా తలనొప్పికి సారిడన్ పని చేసినట్టూ పనిచేసింది నా మీద.
ఆరునెలలు గడిచాక స్కూల్ నచ్చలేదనీ, లెక్కల మాష్టారికి ఎక్కాలు కూడా రావనీ, నూకరత్నం మ్యాడమ్ స్కూల్ కి సరిగ్గా రావటం లేదనీ, అమ్మమ్మా వాళ్ళింటికెళ్ళి చదువుకుంటాననీ గోలెట్టాను(అక్కడ మా వాళ్ళిద్దరూ ఉండరని నా ఎదవయిడియా..). అయిష్టంగా నాన్న పంపించారు. నా కొత్త టీచర్ వేరెవరో కాదు సాక్షాత్తూ కటకటాల రుద్రయ్య అయిన మా "తాతయ్య".
మా నాన్న దగ్గర చదూకోటం కాలిన పెణం మీద కాలుపెట్టడం లాంటిదనీ, మా తాతయ్య దగ్గర చదూకోటం రగులుతున్న నిప్పుల కుంపటి మీద కూర్చోటం లాంటిదనీ అనుభవం మీద అర్ధం చేసుకున్నాను.
నా తలరాత మారటం లేదని తేదీ మారకుండా ఉంటాదా? కాలం ఆగకుండా ఉంటాదా?
నెక్స్ట్ ఇయర్ హై స్కూల్ లో అడుగుపెట్టాను. మళ్ళీ కొత్త స్కూల్.. కానీ అమ్మ వేరే స్కూల్ లో, నాన్న వేరే ఊళ్ళో. నేను ఉచిత పక్షిని (ఫ్రీ బర్డ్).  ఎడారిలో ఒయాసిస్సు మాత్రమే చూసినోడికి మహాసముద్రాన్ని చూసినప్పుడు కలిగే ఆనందం అది. పాత అప్పుల వడ్డీ కట్టడానికి కొత్త అప్పు పుట్టినప్పుడు కలిగే సంతోషం అది.



ఇక్కడే... ఫణిగాడూ, అనిల్ గాడూ, ఒన్ & ఓన్లీ అప్పల్రాజు గాడూ జిగిడీ దోస్తులయ్యారు. వీళ్ల గురించి ఒక ఐడియా రావాలీ అంటే... ఇక్కడ చూడండీ...

 సినిమా పోస్టర్ కి మైదా పిండి లాగా, చిరిగిన కాగితానికి తుమ్మ జిగురు లాగా , చితికిన నా జీవితాన్ని చిత్తడి చేయడానికి నన్ను అతుక్కున్న అప్పలరాజు గాడూ, వాడి లీలలూ... వగైరా వగైరా
"అప్పిగాడి ఆగడాలు" ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం లో... !

--------------------------------------------***--------------------------------------------

మిత్రులందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ న్యూ ఇయర్ వేడుకలని ఇంత ఉత్సాహం తో జరుపుకోవాలనీ..


మీ కోరికలన్నీ ఈ రేంజ్లో  నెరవేరాలనీ కోరుకుంటూ..


Monday, November 28, 2011

నా పేరంటే నాకు బయ్యం........!


కోతులకి ప్రసిద్ధి చెందిన మా ఊరి రైల్వే స్టేషన్ లో రైలెక్కి కుక్కలకి పేరెన్నిక గన్న బెంగుళూరు కొచ్చిన కొత్తల్లో సంగతి.

అటెండయ్యిన అన్ని ఇంటర్వ్యూలూ చీదేస్తుండగా, విలాసాల మాట మరిచిపోయి అవసరాల కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్న రోజులు అవి.

ఒకానొక దరిద్రపు  దినాన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, నేను అప్లై చేసిన ఆరు నెలల తర్వాత ప్రసాదించిన నా ఒక్కగానొక్క ఏటీఎమ్ కార్డ్ ని SBH ఏటీఎమ్ లో పెట్టీ  Rs.3000 డ్రా చేశాను.(చేసేను అనుకున్నాను). డబ్బులు రాలేదు గానీ రిసిప్ట్ వచ్చింది.
దానిమీద "Error code: SBI X SBH = -3000 + $%#(@" అని ప్రింటయ్యి ఉంది. దానర్ధం "నీ మూడువేలూ మొగ్గలేశాయి. పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోరా దరిద్రుడా.." అనీ, మినీ స్టేట్ మెంట్ తీశాక అర్ధమయ్యింది.



వార్నాయనోయ్ ఇప్పుడు హాస్టల్ బిల్ ఎలా కట్టాలీ? మెస్ వాడికి డబ్బులెక్కడ నుండి తేవాలీ? అన్న ఆలోచనలతో బుఱ హీటెక్కిపోయి, చేతులు చల్ల బడిపోయాయి.  ఆ బాధలో, ఆ భయం లో, ఆ హడావిడి లో చెప్పులో రాయి పెట్టుకొని ఒలింపిక్స్ లో పరిగెట్టే వాడిలాగా అడుగులేస్తూ మా మనోజ్ గాడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వరా అన్నాడు.
"నిజమే సుమీ.." అనుకొని ఫోన్ చేశా. రింగయ్యిన చాలా సేపటికి గానీ తియ్యకపోతే నాలాంటి లక్కీఫెలోస్ వల్ల బిజీ గా ఉన్నారేమో అనుకున్నా. ఈగలు తోలుకునే పనిలో బిజీగా ఉన్నారని తీశాక తెలిసింది..

విషయాన్ని వినయపూర్వకం గా విన్నవించి చాలా చీప్ గా వేడుకోటం మొదలెట్టాను. దానికి వాడు "ఇది ఎస్బీఐ సార్. మేము ఆన్ లైన్ లో కంప్లైంట్స్ తీసుకోము. మీరు మనీ డ్రా చేసిన బ్రాంచ్ లో కంప్లైంట్ ఇవ్వండి" అని చావు కబురు చల్లగా చెప్పాడు.
"కంప్లైంట్స్ తీసుకోరా?... మరి ఏం పీకడానికిరా కస్టమర్ కేరూ? నా వాయిస్ వినీ ఆకులు తినే కూర జంతువు టైప్ అనుకుంటున్నావేమో... కుత్తుకలు కొరికే కౄర జంతువు టైపు.. " అని అర్ధం వచ్చేట్టూ చాలా మర్యాదగా అడిగేను.




 దొరికిందే చాన్సు అనుకొనీ " క్రెడిట్ కార్డ్ తీసుకోండీ, కార్ లోన్ తీసుకోండీ 8% మాత్రమే వడ్డీ.. హోమ్ లోన్ తీసుకుంటే విరుగుతుంది మీ నడ్డి " అని ఆ తొక్కుడు లడ్డూ మొహం గాడు  క్యాసెట్టేశాడు.
"ఒరే... టైం చూసుకొని కొడుతున్నావు కదరా..నీ కస్టమర్ కేర్ కూలా.." అనుకొనీ, "పోరా పున్షూక్ వాంగ్ డూ" అని తిట్టేసీ, రూమ్ కెళ్ళీ ఇంటికి ఫోన్ చేసి చెప్పీ, పోయిన బ్యాంక్ బ్యాలెన్సూ, తరిగి పోయిన ఫోన్ బ్యాలెన్సూ చూసుకొని బావురుమంటూ బజ్జున్నాను.



"ఏటీఎమ్ మాదయినా కార్డ్ ఎస్బీఐ ది కాబట్టీ మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి" అని ఎస్బీహెచ్ వాడు, "ఇది ఆంధ్రా అకౌంట్. మీరు మీ హోం బ్రాంచ్ లో అడగండి" అని ఎస్బీఐ వాడూ ఆడుకున్నారు.(ఆ డబ్బులు ఇప్పటికీ రాలేదనుకోండీ..అది వేరే విష్యం).

అయితే ఆ రోజు నుండీ  ఎస్బీఐ అంటే కోపం తో కూడిన కంపరం మొదలయ్యిందీ. జన్మలో మళ్ళీ ఆ బ్యాంక్ జోలికి పోకూడదనుకొనీ రొటీన్ గా తొడ కొట్టకుండా వెరైటీ గా నెత్తీ నోరూ కొట్టుకొని ఒట్టు పెట్టుకున్నాను. కానీ... విధి వంగదీసి వాయించే రోజులు వరదలా వస్తున్నాయని ఊహించలేక పోయాను.

*****************************************************************************
ప్రోజెక్ట్ లో ఉన్నప్పుడు పని చేసుకుంటూ, బెంచ్ లో ఉన్నప్పుడు బ్లాగులు చదువుకుంటూ, హెచ్.డీ.ఎఫ్.సీ వారి సేవలో ఆనందంగా గడిపేస్తున్న రోజులు. ఒకానొక నెలాఖరు రోజు సాలరీ క్రెడిట్ అయిన ఆనందం లో మనీ డ్రా చేద్దామని చాలా బలంగా ధైర్యంగా వెళ్ళాను హెచ్డీఎఫ్సీ ఏటీఎమ్ కి. నిండుకుండ లాగా ఉండాల్సిన నా బ్యాలన్స్, కాకి వేసే రాళ్ల కోసం ఎదురు చూస్తున్న  కుండ లాగా కనిపించింది.
 "నిన్నే కదా డబ్బుల్ పడినియ్యీ..ఇదేటి ఇడ్డూరం?" అనుకొని స్టేట్మెంట్ చెక్ చేస్తే... వచ్చిన సాలరీ వచ్చినట్టే వెనక్కిపోయినట్టూ తెలిసింది. బ్యాంకోణ్ణి అడిగితే "మీ నేమ్ మిస్ మ్యాచ్ అయ్యిందీ. అందుకే  రివెర్ట్ చేశాం" అన్నాడు.

"ఒరే.. బుఱ తక్కువ బాబ్జీ.. సంవత్సరం నుండీ ఇదే అకౌంట్ వాడుతున్నాను. సడెన్ గా ఈ రోజు ఏమయ్యిందీ??" అని అడిగితే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా "కరెక్ట్ నేం తో ప్రూఫ్ సబ్ మిట్ చేసేదాకా మీ అకౌంట్కి నో ఇన్ కమింగ్. ఓన్లీ ఔట్ గోయింగ్" అని
బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అసలీ హెచ్డీఎఫ్సీ వాళ్ళందర్నీ పిక్కలు కనిపించేలా నిక్కర్లేసి మా వీధి లో కుక్కలు ఖాళీగా ఉండే అర్ధరాత్రి పూట  పరిగెత్తీంచాలి. తాటాకు లో తాంబూలాలు కట్టించుకు నమిలే తింగరి సచ్చినోళ్ళు అని నాకొచ్చిన రీతి లో తిట్టుకున్నాను.

ఇక్కణ్ణించి ప్రతీ సీనూ క్లైమాక్స్ లాగా ఉంటాది. మొగుడు సినిమా మళ్ళీ చూసినట్టూ ఉంటాది.  ట్విస్టులన్నీ చెప్తాను కేర్ ఫుల్ గా వినండీ.

నా పేరు "Neelam venu ram raj kumar".  షార్ట్ కట్ లో  N.V.R Rajkumar అని రాసుకుంటాను.

1.  మా ఆఫీస్ వాళ్ళు నా పేరుని Rajkumar N.V.R అని ఇంటి పేరు మధ్యలోనూ, చివరి పేరు మొదటా, మధ్య పేరు ని చివరా ఇచ్చారు.
2. నా PAN card లో Rajkumar neelam అని పొరపాటున పడింది (పూర్తిగా పడకపోయినా.. అదీ నా పేరే కదా అని ఊరుకున్నా..)
3. అదే పాన్ కార్డ్ ని నా బ్యాంక్ అకౌంట్ కి ప్రూఫ్ గా ఇచ్చాను. (యే..జజ్జనక జజ్జనక)

ఇంకేముందీ? అఫీస్ రికార్డుల్లో చేంజ్ చెయ్యటానికి హెచ్చార్ వాళ్ళు ఒప్పుకోరు. సాలరీ క్రెడిట్ చెయ్యడానికి బ్యాంకోళ్ళు ఒప్పుకోరు. నా పేరు మార్చుకోడానికి నేనొప్పుకోను.
అలా మూడు నెలలు మార్చుకోలేని చెక్కులతో, అరిగిపోయిన చెప్పులతో బ్యాంక్ ల చుట్టూ తిరిగీ తిరిగీ కొత్త చెప్పులూ, కాళ్ళు నెప్పులూ వచ్చాయ్ గానీ పని జరగలేదు.


ఈ ట్రాజెడీ స్టోరీ ఇలా రన్నవుతూ ఉండగా మా డామేజర్ నన్ను పిలిచీ నువ్ అర్జెంట్ గా ఆన్సైట్ వెళ్ళాలీ. ఈ శనివారమే ప్రయాణం. కాబట్టీ నువ్వు పాస్పోర్ట్ గట్రా సబ్మిట్ చేసేసీ, తట్టా బుట్టా సర్దేసుకో అన్నాడు. నేను రెక్కలొచ్చిన కోతి పిల్లలాగా ఎగురుతూ,
మధ్య మధ్య లో మొగ్గలేస్తూ రూంకెళ్ళి పోయి, సిపాయిలు తిరుగు బాటు చేసిన కొత్తలో తీసుకున్న బూజు పట్టిన నా పాస్పోర్ట్ దుమ్ము దులిపి, చూసీ నోరు తెరిచేసీ, కళ్ళు పెద్దవి చేసీ అవాక్కయ్యి ఉండిపోయేను.

పాస్ పోర్ట్ లో నా పేరు "Venu ram raju kumar" అని ఉంది. బాబోయ్... raj పక్కన U ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో అర్ధం కాకా ముందు బుర్ర, తర్వాత వీపూ గోక్కున్నాను. గోక్కొని గోక్కొని గోళ్ళరిగాయ్ తప్పా నా బాధ తీరలేదు.
మా నాన్నారికి చెప్తే " ప్రూఫ్ లలో ప్రింటయిన తప్పు పేర్లనీ, తల్లో తిరుగుతున్న పేలనీ, తాడు తెంచుకున్న కుక్కనీ తేలిగ్గా తీసుకోకూడదు. నిర్లక్ష్యం... అన్ని విషయాల్లోనూ నీకు నిర్లక్ష్యం... ($(%&$(%#$%(" అన్నారు.

ఈ లేటెస్ట్ హాటెస్ట్ న్యూస్ ఆఫీస్ లో చెప్తే.. ఏం పర్లేదు వీసా కి అప్లై చేసేస్తాం. కాకపోతే నువ్విదే పేరు మీద కంటిన్యూ అయిపోవాలి అని సై....తిగా చెవిలో ఊదారు. " అది సరే గానీ మరి నా సాలరీ మాటేమిటీ? మూడు నెలలుగా మీరిచ్చే చెల్లని చిక్కని చెక్కులు
మడిచీఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈ.. నా పర్స్ లోనే పెట్టుకు తిరుగుతున్నా" అని హృదయ వికారకరం గా అనిపించే తిట్లని అభ్యర్ధనని తలపించే విధంగా తిట్టాను. ఎందుకంటే "కోపం లో ఉన్న హెచ్చార్ వాళ్ళు, కోరపళ్ళున్న కుక్కకి పిచ్చెక్కినంత ప్రమాదం"

దీపావళీ నాడు పాము బిళ్ళలు వెలిగించి చెవులు మూసుకునే సున్నితమయిన మనసున్న  మా హెచ్చార్ హెడ్ "Today.....we'll resolve this problem..don't worry..!" అన్నాడు.
****************************************************************************

సాయంత్రం నన్నొక కాన్ఫెరెన్స్ రూం లోకి తీసుకెళ్ళారు. నేను ఎంటర్ అయ్యేసరికీ మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళూ, హెచ్చార్ వాళ్ళూ, బ్యాంక్ మేనేజర్లూ (మొత్తం దాదాపు పది మంది) ట్రాఫిక్ జాం లో సిగ్నల్ వైపు చూస్తున్నట్టూ నన్నే తీక్షణం గా చూస్తున్నారు.
"మీ రికార్డ్స్ లో నేమ్ అప్డేట్ చెయ్యండీ" అని ఒకే డైలాగ్ ని ఇరుపక్షాల వాళ్ళూ డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో అరుచుకున్నారు. అవతలి వాళ్ళు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పే టైప్.. మా వాళ్ళు ఎన్ని చెప్పినా వినిపించుకోని టైప్...
ఫైనల్ గా బ్యాంక్ మేనేజర్ నా నేం చేంజ్ చెయ్యటానికి ఒప్పుకొనీ నా దగ్గర ఉన్నా ప్రూఫ్ లన్నీ తీసుకొనీ చూసి షాక్ కొట్టిన కాకిలాగా ఉండిపోయిందీ. ఎందుకంటే ఏ ఒక్క ప్రూఫ్ మీదా నా పేరు ఒకేలా లేదు. (ఇందాక రెండు చెప్పాను కదా.. ఇప్పుడు మిగిలినవి)
నా డ్రయివింగ్ లైసెన్స్ మీద నా పేరు కరెక్ట్ గా ఉన్నాగానీ, దాని మీద ఉన్న ఫోటో నాదే అంటే నేనే నమ్మనూ. కానీ వేరే దారిలేకా నమ్మడానికి బరితెగించారు. అందులో నా పేరు "V R RAJKUMAR NEELAM" అని ఉంది.
"కరెక్ట్ గానే ఉందిగా" అన్నాను నేను.

"నీ టెంత్ సెర్టిఫికేట్ లో  RAJ కీ KUMAR కీ గ్యాప్ ఉంది. నీ డ్రయివింగ్ లైసెన్స్ లో RAJKUMAR అని ఉందీ." అని ఒకడు లా పాయింట్ లేవదీశాడు. (RAJ కీ KUMAR కీ గ్యాప్ ఇవ్వాలో లేదో నాకూ తెలీదు)
అప్పటికే పిచ్చెక్కి పోయిన బ్యాంక్ డామేజర్ నా గడ్డం పట్టుకొనీ "మీ ఇతర బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ ఉంటే ఇవ్వు నాయనా. పేరు కరస్ట్ గా ఉంటే చాలు, అడ్రస్స్ బోగస్ అయినా పర్లేదు" అని బతిమాలింది.
నేను మా ఊరి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ బుక్ ఇచ్చాను. దాని మీద నా పేరు "ram raj kumar neelam venu" అని నా పేరు నేనే మరిచిపోయే విధం గా ఉందీ.


పిచ్చి పీక్ కి వెళ్ళిపోయిన బ్యాం.డా  : ఒక్కటీ....! ఒక్క ప్రూఫ్ చూపించ లేరా సాఆఆఆఅర్?.

నేను : మా పింక్ కోటా కార్డ్ మీద నా పేరు కరెక్ట్ గానే ఉందీ.

బ్యాం.డాః మరింకేం.. అది ఇవ్వండీ.. మీ మోకాళ్ళు మొక్కుతా బాంచన్.. అరికాళ్ళు అందేంత వంగలేను. (చిగురిమ్చిన ఆశల వల్ల వచ్చిన చిరునవ్వుతో.)

నేనుః  అందులో నా పేరు తెలుగు లో ఉందీ. అందులో నా ఫోటో లేదు.... లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. కోటా కార్డ్ మా ఇంట్లో ఉందీ.

పాపం పిచ్చితల్లి!.. నేను ఇలా అనగానే "జుత్తున్న మామ్మ కి ఏ కొప్పయినా పెట్టొచ్చు. బోడిగుండు బాబాయ్ కి ఏ విగ్గయినా పెట్టొచ్చూ. కానీ ఈ పిల్లోడికి అకౌంట్ ఇవ్వటమ్ నా వల్ల కాదురా బగమంతుడాఆఅ...!" అని అరిచేసీ, కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంటూ, సగం చీరని నోట్లో కుక్కేసుకొనీ దీనంగా రోదిస్తూ బయటకెళ్ళి పోయిందీ.
మిగిలిన వాళ్ళందరూ  కాయంచూర్ణ కాఫీలో కలుపుకు తాగినోళ్ళలాగా నీరస రసాన్ని ఒలికిస్తూ  "అందుకే ఇంత పెద్ద పేర్లు పెట్టుకోకూడదు" అనేసేసీ ఒక్కొక్కరూ నన్ను వదిలేసి బయటకి వెళ్ళిపోయారు.



"నేను ఏటీఎమ్ లో కార్డ్ పెడితే డబ్బులు పోవటం, స్క్రాచ్ చేస్తే బిల్ ఎక్కువ రావటం, నెట్ బ్యాంకింగ్ చేస్తుంటే నెట్ డిస్కనక్ట్ అవ్వటం, బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్ 1 దగ్గర ఆగిపోవటం, నేనెక్కిన ట్రైన్ రైల్ రోకో లో నిలబడిపోవటం, నా పుట్టిన రోజు నాడు జ్వరం రావటం, నే వెళ్ళిన సినిమాలు ఫ్లాపయిపోవటం, నేను కొన్న కాస్ట్లీ ప్రోడక్ట్ కి మర్నాడే 50% డిస్కౌంట్ ఇవ్వటం"...ఇలాంటివీ...... ఇలాంటివి నాకు కొత్త కాదు...రోజూ జరిగేవే..!



కానీ... కానీ...ఇలా నా పేరే నన్ను తొక్కి నార తీస్తుంటే ఎలా యువరానర్????? అని ప్రశ్నించాను.

నున్నగా ఉన్న గున్న ఏనుగు లాగా ఉండే మా మేనేజర్  నా దగ్గరకొచ్చీ.. "నా పదిహేనేళ్ళ ఎక్స్పీరియన్స్ లో నీలాంటి కేస్ ని ఎక్కడా చూడలేదు. అయినా ఇన్ని పేర్లు ఎందుకు వేస్ట్ చేశావ్? ఎనీ వే... నీ దరిద్రం డిస్కో డ్యాన్స్ ఆడుతున్నట్టుందీ.
వెళ్ళి శాంతి పూజలు చేయించుకో. కుదిరితే తిరపతి వెళ్ళి గుండు చేయించుకో. యెదవ ఆన్సైట్ పోతే పోనీ గానీ.. నీకు టెన్ డేస్ లీవిస్తున్నా.. నీ ప్రూఫ్ లన్నీ మార్చుకొని నింపాదిగా..రా " అని వరమిచ్చాడు.

వెకేషన్ హ్యాపీ గా కంప్లీట్ చేసుకొనీ, సరికొత్త ప్రూఫ్ లతో వచ్చిన నేను, మా ఆఫీస్ రికార్డ్ లలో ఉన్న నా పేరు తో అకౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్న ఒకే ఒక్క బ్యాంక్ లో కొత్త అకౌంట్ తీసుకున్నాను. అదీ.........
"నేను మళ్ళీ నీ మొహం చూడనూ"..అని మంగమ్మ శపధం చేసిన SBI. ఏం చేస్తాం? అదే విధీ...!

MNC లో పని చేస్తూ ఎస్బీఐ అకౌంట్ వాడటం అనేదీ "కాఫీ డే కి వెళ్ళి కలర్ షోడా తాగడం లాంటిది" అని వెక్కిరించే నా మిత్రులకి నేనిచ్చే సమాధానం

ఓడిపోయే యెదవకి బలుపెక్కువ
మాడిపోయిన దోస కి మసెక్కువ
జుట్టు రాలిన నెత్తికి నునుపెక్కువ.
నా తిక్క మొహానికి లక్కు తక్కువ.
ఈ ఎస్బీఐ వాళ్ళకి సుడెక్కువ.


జై హింద్..!

Monday, November 7, 2011

కృష్ణవంశీ.. ది మొగుడు.

నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరూ? అంటే రెండో మాట లేకుండా కృష్ణవంశీ అని చెప్పుకునేవాడిని. సింధూరం సినిమా తో మొదలయ్యిన ఇష్టం, ఖడ్గం సినిమా తో పిచ్చి గా మారిపోయిందీ.
 ఒకప్పుడు రెండున్నర గంటల సినిమాలో  రెండు గంటల సినిమా నచ్చేసేది.  అతని టేకింగ్ అంతా అద్భుతం గా అనిపించేది. తర్వాత తర్వాత కొన్ని కొన్ని సీన్లు అద్భుతంగానూ చాలా సీన్ లు అతి దరిద్రం గానూ అనిపించడం మొదలయ్యిందీ. అయినా గానీ కృష్ణవంశీ సినిమా అంటే కలిగే ఆసక్తి, ఇష్టం తగ్గలేదు.  బాగుండే ఆ ఇరవై నిమిషాల సినిమా కోసం భరించడానికి బరితెగించేవాడిని. కానీ కృష్ణవంశీ కి తనకున్న క్రియేటివిటీ కన్నా "నేను క్రియేటివ్ డైరెక్టర్నీ" అన్న ఫీలింగ్ ఎక్కువయ్యిపోయిందీ. గత కొన్ని సంవత్సరాలుగా కేవీ సార్ తీసిన మహత్తర కళాఖండాలు మిస్సవ్వకుండా చూస్తున్న కారణం గా నా అసహనం ఈ రోజు ఆగ్రహం గా మారిపోయిందీ.

హిట్టు కోసం మొహం వాచిన గోపీచందూ, అదే హిట్టుకోసం వొళ్ళంతా వాచిన సో కాల్డ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, హింటిస్తే టాలెంట్ చూపించి చెలరేగిపోడానికి తహతహలాడిపోయే తాప్సీల కాంబినేషన్ లో చూసిన జనాలని చావగొట్టడానికి దాపురించిన చిత్రరాజం "మొగుడు".

అహో.. ఈ సినిమా గురించి ఏం చెప్పాలీ? ఆడియో లో "మొగుడు మొగుడూ" అని పాట వినగానే ఆల్బం మొత్తం డిలీట్ చేసెయ్యాలనిపించిందీ. ట్రెయిలర్ చూశాక సినిమా శివకాశీకెళ్ళబోతూందని అర్ధం అయిపోయిందీ. మరెందుకు చూశావూ? అంటే నా కర్మ అలా తగలడింది కాబట్టి.

హీరో : నాకు గోపీచంద్ అంటే ప్రత్యేకమయిన అభిమానం. ఇప్పటి వరకూ తన కెరియర్ లో చెత్త సినిమాలు రెండో మూడో ఉంటాయ్. ఇది మాత్రం అత్యంత చెత్త సినిమా. ఈ సినిమాలో గోపీచంద్ ఈటీవీ సుమన్ బాబు సినిమాల్లో హీరో అంత మంచోడు.
కత్తి పట్టి కళ్ళు పెద్దవి చేసి "రండ్రా.. నా క్కొడకల్లారా" అని అరిచే గోపీచంద్ చేత మొహమాటపు నవ్వు మొహాన వేయించీ,  కంకఱోడ్డు మీద చెప్పుల్లేని కాలినడక లాగా ఉన్న కెరియర్ ని కకావికలం చేశాడు కేవీ.

హీరోయిన్స్ః గ్యాస్ సిలిండర్ కి సున్నమేసీ చీరకట్టినట్టూ ఉండే తాప్సీ ఇందులో "నటన" అనేదేదో వెలగబెట్టిందని టాక్. సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పింది. అది ఎలా ఉందీ? అని మాత్రం అడగొద్దు. యాక్షన్,  తెలుగూ రెండూ రాని హీరోయిన్ చేత ఓవరాక్షన్ చేయించీ, తెలుగులో డబ్బింగ్ చెప్పిస్తే ఎలా ఉంటాదో  మీ ఊహలకే వదిలేస్తున్నా.
 సినిమా అంతా క్లోజప్ షాట్ లలో నవ్వుతూ, అరుస్తూ, ఏడుస్తూ ఉంటాది.
ఇంకో హీరోయిన్ శ్రద్ధాదాస్. ఈవిడకి ఓ వంద రూపాయల్ ఎక్శ్ట్రా ఇప్పించుంటాడు కేవీ.  మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీటికీ పావు మీటర్ గుడ్డముక్క మించి అయ్యుండదు. శ్రధ్దాదాస్ అంటే గుర్తొచ్చిందీ నాకెందుకో వీళ్ళిద్దరూ అన్నాదమ్ములు అనిపిస్తుందీ.


స్టోరీ :  కేవీ సార్ యొక్క దరిద్రం, వాడి వల్లకాడూనూ.
రాజేంద్రప్రసాద్ది ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఒక కొడుకు , ముగ్గురు కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళతో కళకళలాడి పోతా ఉంటాది అందరి మూకుమ్మడి ఓవరాక్షన్ తో. స్క్రీన్ మొత్తం జనాలు హడావిడిగా పరిగెడుతూ ఉంటారు. ఆ కొడుకే గోపీచంద్. ఎంపీ అయిన రౌడీ స్టార్ రోజా, సెంటిమెంట్ స్టార్ నరేష్ ల కూతురు తాప్సీ.  రొటీన్ లవ్ స్టోరీ సక్సెస్ అయ్యి పెళ్ళి అవుతుంది కృష్ణవంశీ స్టైల్ లో.

అప్పగింతల టైం లో మాటా మాటా తేడా వచ్చీ రోజా, రాజేంద్రప్రసాద్ గారి చిన్నళ్ళుణ్ణి కొడుతుందీ.
"మా అల్లుణ్ణి కొడతావా?" అని వియ్యపురాలు అని కూడా చూడకుండా రోజాని కొడతాడు రా.ప్ర
"నన్నే కొడతావా?" అని రోజా చెప్పుతీస్కొని రా.ప్ర ని కొడుతుందీ.
"మా నాన్ననే కొడతావా?" అని గోపీచంద్ రోజా ని కొడతాడు.
"మా అమ్మనే కొడతావా?" అని తాప్సీ గోపీచంద్ ని కొట్టీ తాళి తెంచి మొహాన కొట్టేస్తూందీ. 
------------------------------------------INTERVEL------------------------------------------
ఈ "క్రియేటివ్" సీన్ చూసీ టికెట్ కొని సినిమా చూస్తున్న దౌర్భాగ్యులంతా ఎవరి చెప్పుతో వాళ్ళు కొట్టుకున్నారు లెండీ ఇంటర్వెల్ టైం లో.

ఇక ఇంటర్వెల్ తర్వాత ఉంటాదీ నా సామిరంగా... చెప్పటంకాదు చూసి ఆనుభవించాల్సిందే. హీరో, హీరోయిన్నూ ముందు కొట్టుకున్నాగానీ తర్వాత కలిసిపోతారు. ఎలా అంటారా? హీరో మీద ఇష్టం తో హీరోయిన్ విషం తాగేస్తాది. హీరో ఫ్లాట్. హీరోయిన్ సేఫ్. హమ్మయ్యా సినిమా అయిపోయిందిరా బాబూ అనుకునే టైమ్ లో  ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు. రోజా ఫ్యామిలీ లో ఇద్దరు తప్ప అందరూ మంచోళ్ళే. రా.ప్ర ఫ్యామిలీ మొత్తం మంచోళ్ళే. కానీ అందరూ తింగర తింగరగా బిహేవ్ చేస్తుంటారు.
నిన్నే పెళ్ళాడతా సెకండ్ హాఫ్ ని రీమిక్స్ చేసి సెకండ్ రిలీజ్ చేసినట్టూ ఉంటాది ఇక్కణ్ణుంచి. చివరగా అరగంటకి పైగ సాఆఆఆఆగిన ఆ క్లైమాక్స్ లో డైలీ సీరియల్ లో కన్నా అద్వాన్నంగా, మితిమీరిన నాటకీయత తో, ఏక్టర్ల ఏడుపులూ పెడబొబ్బలతో, , వొళ్ళంతా టమాటా సాస్ పులుముకొనీ హీరో చెప్తున్న సెంటిమెంట్
డవిలాగులతో రక్తి కట్టగా, ప్రేక్షకుల ఆర్తనాదాలతో, చంటిపిల్లల ఏడుపులతో, నాలాంటి సినిమా పిచ్చోళ్ళ పిచ్చి పిచ్చి నవ్వులతో ధియేటర్ దద్దరిల్లిందీ. ఈ సినిమా అయ్యేట్టు కనిపించటం లేదనీ కొంతమందీ వాపోయి విరక్తి తో వెళ్ళిపోయేరు.

పాటలు-సాహిత్యం: సిరివెన్నెల గారు రాసినట్టూ చెప్పబడుతున్న ఒక పాట కొంచెం బాగుమ్దీ. పెళ్ళిపాటలు తియ్యటం లో కే.వీ టాలెంట్ గురించి చెప్పక్కర్లేదు. దీపాలూ, పువ్వులూ, పట్టుబట్టలూ పెట్టి రచ్చ చేశాడు. మిగిలిన పాటలన్నిటిలోనూ హీరోయిన్ ఒంటిమీద చీర ఉండదూ, హీరో ఒంటిమీద చొక్కా ఉండదూ.
శ్రద్ధాదాస్ ఒంటిమీద దాదాపు ఏమీ ఉండదూ.



సుద్దాల అశోక్ తేజ గారు రాసిన మొగుడు టైటిల్ సాంగ్ ఒక ఫిలాంత్రపకిడీ.

మాటలుః  ఒకటో రెండో తప్పా మిగిలినవన్నీ పక్కా బూతు డవిలాగులే.
అవి ఇక్కడ రాస్తే టైప్ చేసిన నా చేతులు డెట్టాల్ తో కడుక్కొనీ, కీబోర్డ్ మీద పసుపు నీళ్ళు చల్లుకోవాలి. అవి చదివిన మీరు కళ్ళళ్ళో ఐ డ్రాప్స్ వేసుకొనీ నోట్లో తులసాకులు వేస్కొని నమలాలి. అప్పటికి గానీ చుట్టుకున్న పాపం చట్టబండలు కాదు.

సంస్కృతీ, సాంప్రదాయం, కుటుంబ విలువులూ అనీ పబ్లిసిటీ ఇచ్చీ, వినిపించే మాటల్లోనూ, చూపించే పాటల్లోనూ బూతు రంగరించిన ఒక చెత్త సినిమాని జనాలమీదకి వదిలిన
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నేటి యంగ్ డైరెక్టర్లందరికీ మార్గదర్శకుడు అనటం లో సందేహం లేదు. ఈ సినిమా కి Harley Davidson వాడు ఎంత పెట్టుబడి పెట్టాడో తెలీదు గానీ సినిమా మొదటీ నుండీ క్లైమాక్స్ దాకా వీలయిన ప్రతీఫ్రేం లోనూ బైక్/జర్కిన్ కనిపిస్తానే ఉంటాది. ఒక బైక్ కి రెండున్నర గంటలు టార్చర్ పెట్టే యాడ్ ఉండటం  గ్రేట్ కదా..!

ఫైనల్ గా సినిమా ఎలా ఉందీ?? : వొళ్ళంతా దురదగుండాకు పూసుకొనీ, నోట్లో జాలిన్ లోషన్ పోసుకున్నట్టూ చాలా సమ్మగా ఉందీ.

గౌరవనీయులయిన  కృష్ణవంశీ గారికీ,

నేను ఇక్కడ క్షేమంగా లేను. మీకు ఆల్రెడీ సగం పిచ్చనీ, మీ గురువు గారికి పూర్తి పిచ్చనీ తెలుసు. కానీ మీ పిచ్చి పీక్ కి వెళ్ళిందనీ నిన్ననే తెలిసిందీ. బాబ్బాబూ.. మీరు ఇంక సినిమాలు తియ్యటం మానేసీ మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాం లో టెలీకాస్ట్ చేసుకోడానికి పాటలు తీసుకోవటమో, సినిమా యాక్ట్రర్ల చేత జెమినీ టీవీలో సెంటిమెంట్ సీరియళ్ళు తియ్యటమో చేస్తే  బాగుంటుందని నా అభిప్రాయం. సీరియళ్ళయితే ఎంతకావలిస్తే అంతసేపు సాఆఆఆఆఅగదీయొచ్చు.సెన్సార్ కట్ ల ప్రోబ్లెం ఉండదు కాబట్తీ మీకు నచ్చిన బూతు డవిలాగులు విరివిగా వాడుకోవచ్చు.

ఈటీవీ లో సుమన్ బాబు నెలకోసారి రిలీజ్ చేసే కొత్త కొత్త సినిమాలు చూసి బతికి బట్టకట్టొచ్చుగానీ, మీ సినిమాలు భరించడం మా వల్ల కాదు. తొందర్లోనే మీరు వైవీయెస్ చౌదరీ, పోసాని కృష్ణమురళీ ల సరసన నిలబడీ తెలుగు సినిమాని సర్వనాశనం చెయ్యగలరని ఆశిస్తూ..

ఇంతే సంగతులు
చిత్తగించవలెను.
ఇట్లు
ఒకప్పటి అభిమాని మరియు ఇప్పటి బాధితుడు.  

Monday, October 3, 2011

బొమ్మరిల్లు ఫాదరిక్కడా.....!

జీవితం లోని వెల లేని విలువైన గొప్ప రోజులని బాధాకరమయిన భయంకరమయిన రోజులని భ్రమపడుతూ, అవి గడిచిపోయాయని సంబరపడుతూన్న రోజులు. 
టెంత్ క్లాస్ రిజల్ట్స్ చూసుకొని స్కూల్ ఫస్ట్ నేనే అని తొడకొట్టి తాండవం చేస్తున్న రోజులు.
పెణం లోనుండి పొయ్యిలో పడే రోజులు త్వరలో తరుముకు రాబోతున్నాయని తెలీక, స్విచ్ ఆన్ చేసి, ప్లగ్ లో వేలెట్టి ,  కరెంట్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నట్టూ కాలేజ్ కెళ్ళే మొదటి రోజు కోసం ఎదురు చూస్తున్న రోజులు.


"ఓరేయ్.. గాడిదా..! ఏం పాటడిపోతున్నావ్ లోపలా?" అన్న పిలుపు కి  స్వాతీ వీక్లీ లో సీరియస్ గా సెంటర్ పేజ్ చదువుతున్న నేను ఉలిక్కి పడి పేజీలు తిప్పేసీ "ఏమీ లేదు..ఏమీ లేదు" అని "ఏదో.. ఉందీ" అనేట్టు గా ఎదవేక్షన్ చేస్తూ ఎదురెళ్ళాను వాకిట్లోకి.

"ఏరా.. ఏనాడయినా నేను చెప్పకుండా నీ అంతట నువ్వు పుస్తకం తీసి పేరా అయినా చదివావా?"
నేను : మరగబెట్టిన మజ్జిగ సాసర్ లో పోసుకొనీ ఉఫ్ఫూ..ఉఫ్ఫూమని ఊదుకుంటా తాగేవాడిలాగా  ఫేస్ పెట్టీ  ఐమూల గా షెడ్ లో కట్టేసిన మా టైసన్ గాడిని (మా కుక్క పిల్ల) చూస్తూ 
{మనసులో.. పరీక్షలయిపోయి రిజల్ట్స్ వచ్చేశాక కూడా ఏం చదవాలి నా బొందా?}

మా నాన్నః "నేనిక్కడ మాట్లాడుతుంటే ఆ నేల చూపులేంటీ? నేల చూపులు చూసేవాళ్ళనీ నమ్మకూడదంటారు."

నేను : చటుక్కున తలయెత్తి మా ఇంటి మీద పెంకులు లెక్క పెడుతూ..

మా నాన్నః "ఇలాగే ఉంటే మీ మాయల్లాగా తయారయ్యి ఎందుకూ పనికి రాకుండా పోతావ్"
నన్ను తిడుతున్నంత సేపూ, బోరు దగ్గర తిట్లు వింటూ ప్రశాంతం గా అంట్లు తోముకుంటున్న మా అమ్మ, ఎండబెట్టిన గింజలు తింటానికొచ్చిన పక్కింటి నారాయణమ్మ గారి కోడి మీదకి చేతిలో ఉన్న గరిట విసిరేసీ "మధ్య లో మా తమ్ముళ్ళేం చేశారూ?" అని కళ్ళెర్రజేసింగ్స్.

"ఆ... చాలా గొప్ప తమ్ముళ్ళు. ఇంటికొస్తే నాకేనాడయినా కాళ్ళు కడుక్కోమని చెంబుడు నీళ్ళిచ్చారా? గొంతులో పోసుకోమని గ్లాసుడు మజ్జిగిచ్చారా? అయినా మీ నాన్న పెంపకం అలాంటిదీ."
మా అమ్మః  ఇంకా ఆ మాట అన్లేదేమిటా అనుకుంటున్నాను.
మా నాన్నః  అనకుండా ఎలా ఉంటానూ? ఆ టార్చరెలా మరిచిపోతానూ? అయినా.. అల్లుళ్లని కూడా చూడకుండా, అన్నం కూడా తిన్నీయకుండా అర్ధరాత్రి దాకా "నేనెందుకు గ్రేటూ? మా ఫ్యామిలీ ఎంత నీటూ? మావల్లే మారింది నీ ఫేటూ" అని పిప్పరమెంట్ బిళ్లలు చప్పరించినట్టూ అల్లుళ్ళ మెదళ్ళు చప్పరించెయ్యడానికి మనసెలా ఒప్పుతాదీ మీ నాన్న కీ? మీ సోది అందరూ వినాలిగానీ, పక్కోళ్ల ప్రోబ్లెమ్ గురించి పట్టించుకోరుగా మీ ఫ్యామిలీ మొత్తం?
మా అమ్మః  కోపం లో తోమేసిన అంట్లు మళ్ళీ తోమేస్తూ..
మా నాన్నః  ఒరేయ్.. రేప్పొద్దున్న వైజాగెళుతున్నాం. నువ్ స్కూల్ ఫస్టొచ్చినందుకూ గిఫ్ట్ గా నీకు వాచ్ కొంటున్నాను.
మా అమ్మః ఎందుకిప్పుడూ? అనవసరంగా? ఆల్రెడీ మా చిన్న చెల్లెలిచ్చిన వాచ్ ఉందాడికి. నా వాచ్ వాడి లక్కీ వాచ్ కూడాను. అదీ గాక వాడి పరీక్షలన్నిటికీ  అదే పెట్టుకెళ్ళేడు. 
నేను: ఏదీ? పిన్ని వాడిచ్చేసిన ఆ వంద రూపాయల వాచ్చా? నాకొద్దది. హ్మ్మ్..... అయినా నీ వాచ్ ఎగ్జామ్స్ కి మాత్రమే. నాకు కొత్త వాచ్ కావాలి.

నాన్న వెళ్ళిపోయాకా.. కుక్కర్ లో పడేసిన కందిపప్పులాగా కుత కుతా ఉడికిపోతున్న నన్ను చెవట్టుకొని దగ్గరకి లాగీ.. " దురదేసినప్పుడు గోక్కోవాలి, సరదా వేసినప్పుడు తీర్చుకోవాలి. మీ నాన్న వాచ్ కొనివ్వాలని సరదా పడుతున్నారుగా. నీకు నచ్చినది కొనిపించుకో. నేనలా అన్నాను కాబట్టీ..మీ నాన్న కచ్చితంగా కాస్ట్లీ వాచ్ కొంటారు"
అని మాస్టర్ ప్లాన్ ని రివీల్ చేసిందీ మా మాతృదేవత. (ఎంతయినా అమ్మ అమ్మే కదా..!) అరెరే... పెరుగువడ లాంటి మృదువయిన మా అమ్మ మనసుని చెరుకుగడ లాగా కరుకు అనుకున్నానే అని రియలైజ్ అయ్యాను.

*****************************************************************************

మర్నాడు మా బజాజ్ బాక్సర్ బండి మీద మా ఇసాపట్నం బయలెల్లాం. టైటన్ షో రూం లో లైటేసి చూపిస్తున్న ప్రతీ మోడల్ నచ్చేస్తుందీ నాకు. నా టేస్టు గానీ, అక్కడున్న ఏ ఒక్క మోడల్ కాస్ట్ గానీ నచ్చట్లేదు నాన్నారికి. చతురస్రాకారం లో పేద్ద డయల్ ఉన్న ఒక చెయిన్  మోడల్ సెలెక్ట్ చేసీ  తన చేతికి పెట్టుకొని చూసుకునీ "ఇది బావుంది కదా" అన్నారు. మా నాన్నగారు కూడా వాచ్ తీసుకుంటున్నారేమో అనుకొని "ఆ... బానే ఉంది నాన్నా" అన్నాను. 
"అయితే ప్యాక్ చేయించెయ్యనా?"
"ఏమిటీ..? అది నాకా" అని అవాక్కయ్యి..  స్లో మోషన్ లో షడెన్ బ్రేక్ వేసినట్టూ  షాక్ కి గురయ్యాను.
"ఫాస్ట్ ట్రాక్ లో తీస్కుంటాన్నాన్నా.. సూపర్ గా ఉంటాయ్, పైగా స్పెషల్ ఆఫర్ కూడానూ" అని చూపించేను. "ఇవేం వాచీలు రా? ఏమిటీ ఒక పద్దతీ పాడూ, ఆకారం ప్రాకారం లేకుండా, అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చిగా... ఛీ..ఛీ.. " అని ఛీకొట్టేశారు. 
"అది కాదు నాన్నా.. అవి లేటెస్ట్ మోడల్స్. పెట్టుకుంటే సూపర్ లుక్ ఉంటాయ్. ఆ ఫినిషింగ్ చూడూ ఎలా మెరిసిపోతున్నయో?"

"ఆరిపోయే దీపానికి వెలుగూ, రాలిపోయే జుత్తుకు మెరుపూ, మానిపోయే పుండుకు సలుపూ ఎక్కువ గానే ఉంటాయ్ అలా అని అవి గొప్పవయిపోతాయా?" అనేసీ పక్కనే ఉన్న సొనాటా షోరూమ్ కి తీసుకెళ్ళీ పన్నేండొందలెట్టీ ఆయనకి నచ్చిన సో కాల్డ్ సూపర్ వాచ్ ఒకటి తీసీ నా చేతికి ఒకసారి  పెట్టేసీ "సూపర్ గా ఉందిరా.. చాలా డిగ్నిఫైడ్ గా ఉందీ. పెర్ఫెక్ట్ " అనేసీ ప్యాక్ చేయించేసీ గర్వంగా ఒక లుక్కిచ్చేరు.

నేనుః  "అది పెద్ద బా లే.." వినిపించీ వినిపించనట్టుగా..
మా నాన్నః ఆ...? ఎంట్రా నసుగుతున్నావ్? ఎదవ నాటు తుపాకీ లో వాడేసిన తూటా వాటం నువ్వూనూ. అవతల చాలా పనులున్నాయ్... పదా..!
"అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వటం లోని ఆనందం మీకు తెలుసు... కోరుకున్నది దక్కకపోతే కలిగే బాధ మీకు తెలీదు"... ఈ హిడెన్ డైలాగ్ నాదే. అప్పుడు నేను వాడాను. తర్వాత సినిమాలో వాడుకున్నారు.

ఇంటికొచ్చాక గెలవేసిన అరిటిచెట్టు లాగా వేలాడేసిన మొహం తో ఉన్న నన్ను చూసి "ఏరా వాచ్ కొనలేదా?" అన్నాది మాతృదేవత. "కొనక పోయినా బాగుండేదమ్మా.. నాన్న నాలిక్కి రాసుకునే టేస్ట్ లే నాకు నచ్చవ్. అలాంటిది చేతికి రాసేరు చూడు. ఎప్పుడో రాక్షస బల్లుల కాలం నాటి మోడల్ ఇది" అని వాచిన ఎడమ చెయ్యి చూపించి, ఖాళీగా ఉన్న కుడిచేత్తో మొహం దాచుకున్నాను.

"అసలు కాలేజీకెళ్ళే కుర్రాడికి కొనాల్సిన వాచ్చేనా అదీ? అన్నీ ఇలాగే తగలేస్తారు.. మూర్ఖత్వం. ఆ మాత్రం దానికి వాడిని తీసుకెళ్ళడం ఎందుకూ?" అని అమ్మ మైక్ లేకుండా సువార్త సభల్లో స్పీచిస్తున్నట్టూ హైపిచ్ లో ప్రైవేట్ చెప్పడం మొదలెట్టిందీ.
 నా కడుపుమంట కూసింత చల్లారింది గానీ, నాకేం కావాలో ఎప్పుడు కావాలో అడక్కుండానే కొనిపెట్టే మా నాన్న ఆ తర్వాత ఏదీ కొనిపెట్ట లేదు. ఒక వేళ ఏమన్నా కొనమని అమ్మ అడిగినా గానీ "నేను కొన్నవి వాడికి నచ్చవ్..  వాణ్ణే కొనుక్కోమను" అనేసేవారు.

*******************************************************************************

ఇంజినీరింగ్ చదూతున్నప్పుడు కాలేజ్ ఎగ్గొట్టి మరీ బొమ్మరిల్లు సినిమా రెండు సార్లు చూసేసీ, సినిమా లో బాగా ఇన్ వాల్వ్ అయిపోయాను. మా నాన్నారికి ఎలా అయినా ఆ సినిమా చూపించాలనుకున్నాను. తమ్ముడు, నేనూ "ఈ సినిమా లో ప్రకాష్రాజ్ సేం నాన్న టైపే" అని అమ్మకి గోరింటాకు నూరినట్టూ బాగా నూరిపోసెయ్యటం తో అన్నమయ్య సినిమా తర్వాత సినిమానే చూడని మా వాళ్ళిద్దరూ బొమ్మరిల్లు సినిమా చూశారు. సినిమా చూస్తున్నంత సేపూ నేనూ, మా తమ్ముడూ మా ఫాదర్ వైపూ, ప్రకాష్ రాజ్ వైపూ మార్చి మార్చి చూసేం. ;) ;)
అయిపోయాక "సినిమా బావుంది కదా నాన్నా" అన్నాను అక్కడికేదో ఆయనకి జ్ఞాన జ్యోతి వెలిగించేనన్న ఫీలింగ్ తో.

ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి "నాకు నచ్చలేదు" అన్నారు.
"న..చ్చ.. లే దా? ఏం నచ్చ లేదూ? "

"ఆ సినిమా లో హీరోకున్న కష్టాలేమిట్రా? వాడి బాధ లో అర్ధమే లేదు.. పీకలదాకా తిండి పెట్టీ, ఏ లోటూ రాకుండా కంటికి రెప్ప లాగా చూసుకుంటుంటే ఏం తెగులు వాడికి? వాడి సంగతి వదిలెయ్యి. వాణ్ణి సపోర్ట్ చేస్తున్న నీకు చెప్తున్నాను. విను
మీ స్కూల్ లో......హాస్టల్ కి సెలవులిస్తే ఇంటికెళితే మూడు పూట్లా తిండి ఉండదని బాధ పడే నీ క్లాస్మేట్స్ గురించి తెలుసా నీకూ? ఒక టీచర్ గా నాకు తెలుసు
పిల్లల్ని పనిలోకి పంపితే గానీ పూట గడవని ఫ్యామిలీస్ గురిమ్చి తెలుసా నీకూ?
చదువవసరం లేదనీ, చదివిస్తే తన మాట వినరనీ, నన్ను మాత్రమే చదివించీ, నా తర్వాత పుట్టిన మీ చిన్నాన్నని పొలానికి పంపించిన మీ తాతయ్య మూర్ఖత్వం గురించి తెలీదు నీకు.
కొడుకేం చదువుతున్నాడో, అసలేం చదువుతున్నాడో కూడా పట్టించుకోని మా నాన్న నిర్లక్ష్యం గురించీ, గవర్నమెంట్ హాస్టల్ లో చదివే పిల్లల బాధల గురించీ, అలాంటి హాస్టల్స్ నేను తిన్న తిండి గురించీ ఏమీ తెలీదు. అసలు లోటు అనే మాటే  తెలీదు మీకు.  నేను పడ్డ కష్టాలేవీ నా పిల్లలు పడకూడదనీ,
కనీసం తెలియకూడదనీ నా తాపత్రయం. మా నాన్న నన్ను చదివించటం మీ అదృష్టం. మీకేం రా? లోకం లోని చాలా మంది కన్నా నీ జీవితం ఎన్నో రెట్లు మేలు. చక్కగా అన్నీ అమర్చిపెట్టీ, చదువుకోమని పంపిస్తే... ఏం రోగం మీకూ? ఇప్పటి వరకూ ఇన్ని చేసిన మాకు మా పిల్లల గురించి ఆలోచించే బాధ్యత ఉండదా?, నిర్ణయం తీసుకునే హక్కుండదా? "


ఆ రోజు అడిగిన ఆ ప్రశ్నలని ఎదురు చెప్పే  సమాధానం లేదు  ఊకొట్టి, తలాడించటం తప్ప.
ఎదిరించే ధైర్యం లేదు అప్పటీకీ, ఇప్పటికీ.
వారిని బాధ పెట్టే ఆలోచన రాదు ఎప్పటికీ.

హ్మ్మ్... నిజమే.. నా జీవితం పూలబాటే. నాకే కష్టాలూ లేవు. నాకున్న కష్టాలు అసలు కష్టాలే కావు. నాకోసం పరితపించే మా అమ్మా, నాన్నా ఉండగా నాకు కష్టాలే రావు.


[ఇటీవల ఇల్లు మారుతున్నప్పుడూ, అన్నీ సర్దుతూ ఉంటే సూట్ కేస్ లో  మా నాన్న కొనిచ్చిన వాచ్ కనిపించీ ఈ జ్ఞాపకాల్ని తట్టి లేపిందీ]

Sunday, September 25, 2011

"దూకుడు" డైలాగ్స్ వింటారా?

కారణం లేకుండా (నా దృష్టి లో) ఫ్లాపయిపోయిన ఖలేజా తర్వాత మహేష్ బాబు, నమోవెంకటేశా లాంటి హారర్ మూవీ తర్వాత శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన కామెడీ + యాక్షన్ ఎంటర్టెయినర్... దూకుడు.......!

దూకుడు అంటే... "ప్రజల మంచి కోసం ఎన్నికష్టాలు ఎదురయినా లెక్క చెయ్యకుండా ఎదిరించి ముందుకు పోవటమే దూకుడు"

కధ గురించి పెద్దగా చెప్పుకోడానికేం లేదు గానీ శ్రీను వైట్ల గత చిత్రాల శైలి లో అంటే ఢీ, రెఢీ, కింగ్, రీసెంట్ గా వచ్చిన కందిరీగ సినిమాల తరహానే. పూర్తి శ్రీనువైట్ల మార్క్ కామెడీ సినిమా.

పాలుగారే పిల్లోడు మహేష్ బాబు ఎప్పటిలాగే అదరగొట్టాడు. లుక్స్, యాక్షన్, డైలాగ్స్, తన ట్రేడ్మార్క్ స్టెప్స్ (అంటే.. నడుము వంచకుండా, జిమ్నాస్టిక్స్, యోగా లాంటీవి చెయ్యకుండా నించొని ఆకట్టుకునే విధంగా చేసే డ్యాన్స్) తో చింపేశాడు. ఖలేజా సినిమా లో లాగే కామెడీ బాగా చేశాడు.  చాలా సీన్ లలో తన స్టైలో పరిగెడుతూ విలన్లని కొడుతూ పిచ్చెక్కించాడు.
కానీ పాపం సమంతా ఈ సినిమా లో మహేష్ పక్కన డల్ అయిపోయిందీ. కేవలం పాటల్లోనూ, ఒకటో రెండో సీన్ల లో మాత్రమే ఉంటుందీ. ఏమాయ చేశావే సినిమాలోని మ్యాజిక్ ని కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా రిపీట్ చెయ్యలేక పోయిందీ.
అయినా నాగ చైతన్య, ఎన్టీయార్ పక్కన అయితే చూస్తారేమో గానీ మహేష్ పక్కన ఏ రకంగానూ ఆనలేదు.

ఫస్టాఫ్ మొత్తం ఇంచ్ ఇంచ్ కీ పంచ్ లతో సమ్మగా సాగిపోతుందీ సినిమా. కానీ నా వరకూ ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ బోర్ కొట్టిందీ. కావల్సినన్ని ఫైట్స్ ఫస్టాఫ్ లోనే పెట్టేసీ పోకిరి క్లైమాక్స్ ని తలపించేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు డైరెట్రు. సెకండ్ హాఫ్ లో పెద్ద విష్యం లేక
పోయినా గానీ, స్టోరీ లో సవాలచ్చ లొసుగులున్నా గానీ, సాగదీత ఉన్నాగానీ, బ్రహ్మీ, ఎమ్మెస్, ధర్మవరపు, & ప్రిన్స్ ల కామెడీ లో కొట్టుకు పోతాయ్ అవన్నీ.

హైలైట్స్ సీన్స్ః

పోకిరి లో లాగా హీరోయిన్ ఉందని తెలీక మహేష్ ఫ్రెండ్స్ తో మాటాడే సీన్

బ్రహ్మీ "ఓంకార్ ఆట, చాలెంజ్" షో లని పేరడీ చేసే సీన్..... బ్రహ్మీ ఎస్సెమ్మెస్ రిక్వెస్ట్ చేసే సీన్ మంటలు

ఎమ్మెస్ నారాయణ ప్రివ్యూ చూపించే సీన్. ఇది అరాచకం

మహేష్ బాలయ్య బాబు ని ఇమిటేట్ చేస్తూ  " కార్లోవచ్చినా సరే.. కాలినడకనొచ్చినా సరే.. డే టైం వచ్చినా సరే.. నైట్ టైం వచ్చినా సరే.. ఎప్పుడయినా సరే ఎక్కడయినా సరే... ఆఆఅయ్య్య్య్య్య్.." అని తొడగొట్టే సీన్.

పార్వతీ మెల్టన్ ఐటెం సాంగ్. బక్కగా అయిపోయీ "అవి కాళ్ళా..? ట్యూబ్ లైట్సా? అన్నట్టూ నిక్కరేసుకొచ్చీ అదోరకమయిన స్టెప్స్ వేసి రచ్చ చేసిందీ ;) ;) ;)

సోనూ సూద్ పాతపాటలు వినే సీన్స్ కూడా ఓకే. బట్ ఈ సినిమా లో పెద్దేం చేయలేదు.



పే...ద్ద పాజిటివ్ ఏంటంటే పంచ్ డైలాగ్స్ ఇరగ. మచ్చుక్కి కొన్ని కొంచేం అటూ ఇటూ గా.

౧. మహేష్ః  "చూశావా? పంచ్ పడేసరికి ప్రొఫెషన్ చెప్పేశావ్.? "

"పడుకున్న పులినీ, పని చేసుకునే పోలీసునీ కెలికితే..... వేటే"

"పరిస్థితులేంటి సార్.. ఇలా పగబట్టేశాయ్?"

"దూకుడు లేకపోతే పోలీస్ కీ పోస్ట్ మ్యాన్ కీ తేడా ఏం ఉంటదీ?"

"నేను నరకటం మొదలెడితే నరకం లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి "

కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు.

నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా...!

భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాదీ..!

మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవటమే..

హీరోయిన్ తో:   నేను పక్కన నిలబడితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నోణ్ణి చూసినట్టూ చూస్తున్నావ్. నా హైట్ ఎంటీ నీ హైట్ ఏంటీ? నా కలర్ ఏంటీ నీ కలర్ ఏంటీ? ఎదవ పిట్ట మొహమేసుకొని..

పోలీసోడికి ఫోకస్ తో పాటూ పేషన్స్ కూడా కావాలి.

మా నాన్నెప్పుడూ ఒకటి చెప్తుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని

చూస్తావ్ గా.. పర్మిషన్ ఇస్తే పేకాడేస్తాను.

డైలాగ్ అనేదీ ఇంటెన్సిటీ తో చెప్పాలి. నువ్ ఇంటెన్సిటీ కేర్ లో ఉన్నట్టూ చెప్తున్నావ్.
 

"నీ లైఫ్ లో నువ్ చాలా మంది తో పెట్టుకొని ఉంటావ్. కానీ ఒక్కడి తో మాత్రం పెట్టుకోకు. అమ్మ కడుపులోంచి ఎందుకు బయటకొచ్చానా? అని ఫీలవుతావ్. ఆ ఒక్కడినీ నేనే "

బ్రహ్మీ - ఎమ్మెస్ తో:
   ఒరేయ్ దరిద్రుడా.. నేనంటే డబ్బ్లులకి కక్క్రుర్తి పడ్డాను. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే ఎలా నమ్మేశావురా? "కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లేసుకొని ఎదవ మొహం నువ్వూనూ.."

బ్రహ్మీః క్రైం చెయ్యటం నాకు ఐస్ ఫ్రూట్ తినడం తో సమానం రా. ఐస్ ఫ్రూట్ చీకితే పుల్లయినా మిగుల్ తుందీ. నేను క్రైం చేస్తే ప్రూఫ్ కూడా ఉండదూ.. నో బడీ కెన్ స్క్రాచ్ మీ.



"పందిలాగాతిని పొట్ట పెంచడం కాదు కొంచెం బుఱ కూడా పెంచు"  -- "నంది లెవెల్లో పెర్ఫార్మెన్స్  ఇస్తే నన్ను పందంటావా? "



"ఎవరో చెప్తే ఇన్ఫర్మేషన్.. కళ్ళతో చూస్తే కన్ఫర్మేషన్. "

"నువ్వొకదానివీ.... వాడు ఆవలించినా మా అన్నయ్య పోలికే అంటావ్"

"హే.. లుకింగ్ ఫర్ సమ్ వన్? హి ఈజ్ ద వన్"

"చూడండి సార్. ఇతనికి దూకుడెక్కువయి పోయిందీ.. కుక్కని కాల్చినట్టూ ఎలా కాల్చాడో.." ----------- "నేను కాల్చింది కుక్కనే"



ఏది ఎలా ఉన్నాగానీ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు ఈ సినిమాని. కాకపోతే సినిమ చాలా పెద్దదీ. మూడు గంటలు అంటే టూమచ్. నేను నిన్న సినిమాకి వెళ్ళీ ఈరోజు వచ్చాను అదేలెండీ సెకడ్ షో.. (పది నుండీ ఒంటిగంట వరకూ )

Thursday, August 18, 2011

బీరు వీరుడు...! రీలోడెడ్


నల్ని విజయం వరిస్తే గర్వం తో కూడిన చిరునవ్వు.
మనతో పాటూ మన స్నేహితుడికీ సక్సెస్ వస్తే ఆనందం తో కూడిన  నవ్వు.  
మన స్నేహితుడికి విజయం వచ్చీ, మనకి అనుభవం మాత్రమే వస్తే  ఏడవలేక నవ్వు.
 
 మా శీనుమాయ గాడు జాక్ పాట్ కొట్టినట్టూ జాబ్ కొట్టడం తో మొహమాటపు నవ్వు నవ్వేసీ చేతికి చలిజ్వర మొచ్చిందా? అన్నట్టూ  షేక్ హ్యాండిచ్చేసీ, దేవుడేటీ మాకిలా హ్యాండిచ్చాడూ అని ఫీలవుతూ, కడుపులో రగులుతున్న కుంపటి మంట ని చల్లార్చుకోడానికి క్యాంటీన్ లో కోకా కోలా తాగుతూ ఫీలవుతున్న వేళ....  

పెసరట్టు తిరగేసినట్టూ నా వీపు మీద ఒక చెయ్యి పడిందీ. ఇంత మోటు గా మ్యాన్ హాండ్లింగ్ చేశాడంటే... ఇంకెవడూ? ఆడు అప్పల్రాజుగాడే..  అనుకొని "ఏటేహే.." అన్నాను చిరాగ్గా. ముందుకొచ్చి కూర్చొనీ "ఏట్రా ఈ మజ్జిని కొంచేం ఒళ్ళు చేస్తున్నావూ? బీరు గానీ కొట్టేత్తున్నావా?" అన్నాడు.
"మొన్న మీరు బీరేస్తుంటే స్మ్లెల్ చూసేడు కదరా.. దాని ఎఫెక్టేమో" అన్నాడు పక్కనున్న విలాస్ గాడు. 
"స్మెల్ చూసిన నేనే ఇంత ఒళ్ళుజేస్తే.. లీటర్ల లెక్కన వాటర్ లాగా తాగేసిన ఈడేమయిపోవాలీ?" అనేసి తిట్టేసీ, ప్రిన్సీ మీటింగ్ ఉందంటేనూ అందరం కలిసి సెమినార్ హాల్ కెళ్ళాం.

ప్లేస్ మెంట్స్  అనేవి ఒళ్ళు కొవ్వెక్కిన్ కాలేజీలు మాత్రమే చేసే పనికిమాలిన పని అని ఫిక్సయిపోయీ,క్యాంపస్ సెలక్షన్స్ కి స్పెల్లింగ్ కూడా తెలీకుండా ఆరేళ్ళ బట్టీ ఇంజినీరింగ్ కాలేజ్ నడుపుతున్న మా కరెస్పాండేంట్ ని,  చెప్పినదానికి ఒప్పుకోక పోతే హాస్టల్ మెస్ లో సాంబార్ మొత్తం తాగేస్తానని బెదిరించి ఒప్పించిన  మా ప్లేస్మెంట్ ఆఫీసరూ రెక్వెస్ట్ లాగా అనిపించే కమాండ్ ఇచ్చాడు మా అందరికీ.
అదేంటంటే రిలయన్స్ వాళ్ళకీ జావామీద రిక్వైర్ మెంట్ ఉందంటా, చచ్చీ చెడీ బతిమాలీ,  ఆదివారం క్లాస్ లు పెట్టీ శుక్రవారం సెలవిచ్చే మా తింగరి కాలేజీకి రిక్రూట్ మెంట్ కి రప్పిస్తున్నాడంటా. గుడ్డిలో మెల్ల లాంటి నాలాటి  కొందరిని సెలక్ట్ చేసీ సెమిస్టర్ హాలిడేస్ లో ఫుడ్డూ , బెడ్డూ, జావా కోచింగూ ఫ్రీ గా ఇచ్చీ మమ్మల్ని రెడీ చేస్తారంటా. కలా? నిజమా? అనుకొనీ హాలీడేస్ మొదలవ్వగానే, సూట్ కేస్ నిండా బట్టలూ, సంచుల నిండా స్వీట్లూ, హాట్లూ  సర్ధుకొనీ తయారయిపోయాను ఎక్కడో కొండల్లో, జనజీవన స్రవంతి కి దూరంగా వెలసిన మా హాస్టల్ కి.





మొదటి రోజూ కొత్తగా కోచింగ్ ఇవ్వడానికొచ్చిన ఆ ట్రెయినర్ "వాటీజ్ OOPs"? అన్నాడు. లైబ్రరీ లో కూడా లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పక్కోడి కాలర్ ట్యూన్ లు వినే మా గ్యాంగ్ అంతా రాజీవ్ గాంధీ చనిపోయినందుకు మౌనం పాటించడం మొదలెట్టారు. మా చెవుల్లో విత్తనాలేస్తే చెట్లు మొలుస్తాయని తెలియడానికి అట్టే సమయం పట్టలేదాయనకీ. ఈ దెబ్బతో మా కర్మ భోగి మంటలో పాత సామాను లాగా కాలీ ట్రెయినింగ్ ఇంకో రెండు గంటలు పెంచారు.పొద్దున్నే ఆరుగంటలకి మొదలెట్టీ, రాత్రి ఎనిమిది వరకూ రెండే రెండు బ్రేక్ లు ఇచ్చీ మిగిలిన టైం లో కమ్యునికేషన్ స్కిల్స్ అనీ, జీడీ లనీ, జావాలని మమ్మల్ని బ్రేక్ చేసేవారు. రెండో రోజు నుండీ నా కెందుకో క్లాస్ మొదలవ్వ గానే నిద్ర రావటం మొదలెట్టీందీ. నిద్ర అంటే అంటే అలాటిలాటీ నిద్ర గాదు. దారుణమయిన నిద్ర. పొద్దున్న ఐదు గంటలకి చలి లో చన్నీటి స్నానం చేసీ ఆరుగంటలకి క్లాస్ లో కూర్చుంటే.. ఐదు నిమిషాలు గడిచేసరికీ కునికి పాట్లు పడుతూ, ఎప్పుడు రూమ్ కి వెళతానా? ఎప్పుడు నిద్ర పోతానా అని ఆలోచించేవాడిని. మరో రెండు రోజులు గడిచేసరికీ హాస్టల్ నుండీ కాలేజ్ కి నడుస్తుంటే ఆ అర కిలోమీటర్ దూరానికి అయాసం, కాళ్ళూ, వొళ్ళూ నొప్పులూ.  త్వరలో ఇంజినీరింగ్ అయిపోయీ టాటా గుడ్ బై చెప్పేసుకునే టైం లో చుట్టూ చెట్లూ, పుట్లతో ప్రశాంత వాతావరణం, హాలీడేస్ కావటం తో మా రెగ్యులర్ లెక్చరర్ లు, స్టూడెంట్స్ ఎవరూ లేరూ. పిల్లకాయలు  గ్రద్దా - రాబందుల్లాగా, గబ్బిలం-గుడ్లగూబల్లాగా జంటలు కట్టీ క్యాంపస్ అంతా కలతిరుగుతూ పండగ చేస్తున్నారంటా ;).  నేను నిద్రమత్తులో ఇవేం పెద్దగా పట్టీంచు కోకుండా మెస్స్ లో మూడు పూట్లా తినేసీ పగలంతా రాత్రి నిద్రపోవటం గురించీ కలలు కంటూ, మెలకువ వచ్చినప్పుడు ఊడిపోతున్న జుత్తు చూస్కొని బాధపడుతూ గడిపేసేవాడిని.
ఇంకో రెండు రోజుల తర్వాత నా ఫేవరేట్ జీన్ ప్యాంట్ వేసుకున్నాక చాలా ఇబ్బందిగా అనిపిమ్చిందీ. చిత్రంగా నా ప్యాంట్ పట్టేసిందీ. వార్నీ హాస్టల్ ఫుడ్ బాగా వంటబడుతుంది మనకి అనుకున్నాను.
ఈ లోగా కాకినాడ KIET కాలేజీ లో సత్యం క్యాంపస్ సెలెక్షన్స్ జరుగుతున్నాయని తెలిసిందీ. ఎప్పటి లాగా నే మా బ్యాచ్ అందరం బస్సేసుకొని బయల్దేరాం. బాలభారతం సినిమా లో పిల్ల భీముడి లాగా తయారయిన నేను స్పెషల్ అట్రాక్షన్. బస్ లో నా పక్కనే కూర్చున్న మా ప్లేస్ మెంట్స్ ఆఫీసరూ "ఏటి రాజ్.. మొహమ్ ఉబ్బినట్టూ ఉందీ.. కాల్చేసిన అగ్గిపుల్ల లాగా ఉండే వాడివీ. కండపట్టిన కోతి పిల్ల లాగా తయారయ్యావ్. కొంపదీసి ఉబ్బు కామెర్లా?" అన్నాడు. కళ్ళద్దాలెట్టుకొనీ, జుత్తు చేత్తో ఎగదోసీ, నుదుట ఆంజనేయస్వామి కుంకుమ పెట్టుకొని బయటకళ్ళి పోటమే తప్పా అద్దం లో చూసుకొనే అల్వాటు పెద్దగా లేదు నాకు. అతనలా అనేసరికీ భయమేసీ ఇంటర్వ్యూ అయిపోయాకా డాక్టర్ దగ్గరకి వెళదాం అనుకున్నా. కైట్ కాలేజ్ భలే నచ్చేసింది నాకు. పిచ్చ కలరింగ్ తో కళ కళ లాడి పోతుందీ. ;) . లక్కీగా నా రిటెన్ టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే గ్రూప్ డిస్కషన్, & ఇంటర్వ్యూ అనటం తో నేను ఆ రోజు రాత్రి భానుగుడి సెంటర్లో ఉంటున్న మా బ్యాచిలర్ బాబాయ్ రూమ్కెళ్ళిపోయాను. రాత్రి బువ్వ తినేసీ, బాబాయ్ తో నా బాధ చెప్పుకొనీ హాస్పిటల్ కి బయల్దేరాను. ఆ పేద్ద డాక్టర్ గారేమో "ప్రకృతి పిలుపులు" ఎలా ఉన్నాయీ? ఏం గడ్డి తింటున్నావ్? నీ అలవాట్లేమిటీ? బీర్ ఎక్కువగా తాగేస్తున్నావా?( భగమంతుడా ఏటీ పరీక్ష నాకూ??) అని నానారకాలు కొచ్చెన్లూ వేసీ బెడ్ మీద పడుకోమని చెప్పీ చెక్ చెయ్యటం మొదలెట్టాడు.


డాక్టర్ :  ఇక్కడ నొప్పుందా?
నేను  :   లేదు.
డాక్టర్ : ఇక్క్డడా? 
నేను  :   లేదు.
డాక్టర్ :  ఆ హా... ఇక్కడో??

నేను  : ఆ.. ఉందీ..
డాక్టర్ : ఇక్కడో??
నేను  : ఆఆఆఅ.ఆఆఆఆఅ ఉందీ..
డాక్టర్ : మరి ఇక్కడో??
నేను  :  ఆఆఆఅ.ఆఆఆఆఅ అయ్య బాబోయ్..  ఉందీ..
డాక్టర్ :  ఏంటయ్యా? నీకు వొళ్ళంతా నొప్పులేనా? (బుఱ గోక్కుంటూ)
నేను  : మెత్తగా ఉందిగదా అని చపాతీ పిండి పిసికినట్టూ పిసికేస్తుంటే నొప్పెట్టదా? మరీ?

"ఏం లేదబ్బాయ్.. అంతా నార్మల్ గానే ఉన్నాది" అని అనేసీ వెయిటింగ్ మిషన్ మీద నించోమన్నాడు. పది రోజుల కిమ్దట 52కే.జి ఉండేవాడిని 62 కే.జి ఉన్నాను. నేను షాకయ్యి ఆ ముక్కే చెప్తే "అంతా నీ భ్రమ.. that is impossible. you are perfectly alright" అని  బై బై చెప్పేశాడు.

**********************************************
మర్నాడు గ్రూప్ డిస్కషన్ అన్నమాట. మా గ్రూప్ లో ఇద్దరు కాకినాడ అమ్మాయిలు (ఆ కాలేజ్ లో సీట్ రానందుకు చాలా ఫీలయ్యాను ఆళ్లని చూశాక ). కుంచేం పరిచయాలయ్యాక చెరోపక్కా చేరీ ఎలా మాటాడాలీ? ఏంటీ అని నన్ను తెగ సలహాలడిగేశారు.పిచ్చెదవని కదా.. బోల్డు టిప్స్ ఊదేశాను@ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జీ.డి బాగానే జరిగిందీ. "పక్కనే యానాం పోదాంరా బీరు డెడ్డు చీపురా"  అన్నారు మా బ్యాచ్ లో కోతిగాళ్ళు. "ఒక్కసారి వాసన చూసినందుకే మహాబలుడు సినిమా లో సూపర్ స్టార్ కృష్ణ లాగా అయిపోయేనూ... వద్దురా బాబూ" అనేసేసీ  ఎప్పటి లాగానే మాంచి హోటల్ చూసుకొని కుమ్మేసీ కాలేజి కి వచ్చాను. 


మా గ్రూప్ లో ఆ కాకినాడ అమ్మాయిల్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అప్పటి వరకూ నాతో తెగ మాహాడేసినోళ్ళు  నా వైపు చూసీ చూడనట్టూ చూసీ అదోరకం గా నవ్వుకుంటా ఎల్లిపోయేరు.

ఇవతల మా కాలేజ్ వాళ్ళు కూడా అమ్మాయిలందరూ ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ అయిపోయారు. "ఈ సత్యమోడు ఇంతేరా.. అమ్మాయిల్ని మాత్రమే తీసుకుంటాడూ *&#$%*(&(*" అని తిట్టేసుకొనీ, సరిపెట్టేసుకొనీ బస్సెక్కి  సొల్లు కబుర్లు చెప్పుకుంటా రాత్రి ఎనిమిది దాకా వెయిట్ చేసేమ్.
ఇంతలో రెక్కలు లేని హాలీవుడ్ దేవకన్యల్లాగా మెరిసిపోతూ జాబ్ కొట్టిన ఆనందం తో గర్వంతో మా కాలేజమ్మాయిలు బస్సెక్కారు. మధ్యాహ్నం వరకూ చాలా ఫ్రెండ్లీగా నార్మల్ గా ఉన్నాళ్ళంతా మంచులక్శ్మి లాగా తెలుగులో ధారాళం గా మహాడేస్తూ మమ్మల్ని అంటరానివాళ్ళ లాగా చూడ్డం మొదలెట్టేరు. ఆ.... మరిచిపోయేను  ఒనీడా టీవీ యాడ్ లో రాక్షసుడు ఆడవేషం వేసుకున్నట్టూ వాళ్ళ నెత్తిమీద కొమ్మ్పులు కనిపించేయ్ నాకు. చిత్రంగా ఎవడయినా కంగ్రాట్స్ చెప్తే చాలు అవి అంగుళం పొడవు పెరిగిపోతున్నాయ్. 

జీ.....వితమ్.........! ఇష్టం గా కసకసా నమిలూసేసిన కారా కిళ్ళీ బతుకయిపోయిందీ.
మమ్మల్ని ఇంత క్షోభ పెట్టిన ఆ రామలింగరాజుని తెగ తిట్టేము. మా నాలుకలకున్న పవర్ రెండేళ్ళు పోయాక తెలిసిందీ. హిహిహిహిహి హుహుఉహుహు హహ్హహ..హ్హ

**********************************************
ఆ రోజు రాత్రి మా ఇంటికెళ్ళి పోయేను హాస్టల్ కి వెళ్లకుండా. బట్టలేసుకున్న భల్లూకం లాగా ఉన్న నన్ను చూసిన మా మాతృదేవత కంగారు పడిపోయీ మా ఫ్యామిలి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళారు.
"సాధారణం గా పెళ్ళయినోళ్ళు ఇలా లావవుతారు. నీకు ఇంకా కాలేదు కదా..?" అన్నాడు మా డాట్రు.
 మా అమ్మేమో అనుమానం గా నా వైపు చూసేసరికీ నేను కంగారు పడీ "అయ్యయ్యో... రామ..రామా.. సింహరాశి సినిమా లో రాజశేఖర్ లాంటోడిని. నన్ను అనుమాస్తావా?" అని లెంపలేసుకుంటూ జాలిగా చూశాను.
కాకినాడ డాక్టర్ అడిగిన కొచ్చేన్లే మళ్ళీ అడిగీ, అడ్డమయిన టెస్ట్లూ చేయించేసీ, నిలబెట్టి ఎక్స్ రేలూ తీయిమ్చేసీ ఫైనల్ గా నా బరువు చెక్ చేశాడు. రెండు రోజుల క్రితం 62Kg ఉన్నవాడిని 65kg కి వచ్చేశాను.
 "రిపోర్ట్స్ ని బట్టీ.. చూస్తే ప్రాబ్లెం ఏం లేదమ్మా ఒంట్లో వాటర్ ఎక్కువయ్యిందంతే..పోడానికి టాబ్లెట్స్ ఇస్తున్నాను. ప్రధమ ప్రకృతి భీభత్స కాండ పదే పదే జరిగుతుందీ కంగారు పడకండీ." అని పంపేశాడు. నాకు రజినీకాంత్ సినిమా జపనీస్ డబ్బింగ్ లో చూసినట్టూ అయోమయంగా అనిపించిందీ.

**********************************************

అంతకు ముందు కొన్ని నెలల క్రితం ఇలాగే  మా చిన్నాన్న గారు హఠాత్తుగా లావయ్యి పోయీ, చాలా సీరియస్ అయిందనీ మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన కి కాల్ చేసి విషయం చెప్పాను.
ఆయన నన్నడిగిన మొదటి ప్రశ్న "నీకు నిద్ర బాగా వస్తుందా?" అని. అంతకు ముందు ఏ డాక్టరూ అడగని ప్రశ్న అది. నాకు దిమ్మతిరిగింది. సింహగర్జన లాంటి భయంకరమయిన గురక తో కూడిన నిద్ర దారుణమ్ గా వస్తుందనీ, ట్రెయినింగ్ నుండి పారిపోయొచ్చిన సుమో ఫైటర్ లాగా అయిపోయాననీ అని చెప్పాను.


లేట్ చెయ్యకుండా వైజాగ్  అపోలో లో కార్డియాలజిస్ట్ పాణిగ్రాహి అపాయింట్ మెంట్ తీసుకొని వెళ్లి కలవమన్నారు. నా బట్టలు సరిపోకా మా నాన్నారి బట్లేసుకొని మర్నాడే వెళ్ళాను. ఇలా పది రోజుల్లో పది కిలోలు పెరిగిపోయాను అనగానే  "నీ వాయిస్ చాలా ముద్దగా వస్తుందీ అబ్జర్వ్ చేశావా?" అన్నాడు. లేదన్నాను. వెంటనే చెప్పేశాడు ఆయన "This is typical Hypothyroidism" అని. కన్ఫర్మేషన్ కోసం టెస్ట్ లని, స్కానింగ్స్ అనీ చెప్పీ నా జేబులోని డబ్బులన్నీ దబాయించీ లాగేసుకొనీ, బాలెన్స్ కోసం నా ఉంగరాల వైపు చూశారు. అదో పెద్ద స్టోరీ లెండీ.
రిపోర్ట్స్ వచ్చాకా డాక్టర్ చెప్తూ ఉంటే అప్పుడర్ధమయ్యిందీ ఒక్కో సంగతీ.

శరీరం లో థైరాయిడ్ హార్మోన్స్ (T3,T4,TSH)సమతుల్యత దెబ్బతినటమ్ వల్ల వచ్చిన పాట్లివి. నాకు అన్నీ లిమిట్ దాటి గేట్లెత్తేసిన గోదారిలాగా ప్రవహిస్తుండటం తో అవి నా బ్రెయిన్ మీద ప్రభావం చూపడం వల్ల  నిద్ర ఎక్కువొస్తుందీ. ఇంకొంత కాలం ఆగి ఉంటే కోమా లోకి పోయేవాడినట. హఠాత్తుగా లావవ్వటం, జుట్టూడిపోవటం, గొంతు వాచి గురక రావటం  కూడా దాని ఎఫెక్ట్ నే. హఠాత్తుగా బరువు పెరగటం తొ నా బరువు నేను మోసుకోలేక ఆయాసం, వొళ్ళునొప్పులూనూ. హ్మ్మ్..  వేలకి వేలు టెస్ట్ ల కోసం లాగేసీ, 30 రూపాయల అయొడిన్ మాత్రలు రాసిచ్చీ రోజుకొకటి వేసుకో.. పండగ చేస్కో అన్నాడు ఆ వైధ్యో నారాయణో హరీ...!

ఇప్పుడంతా ఓకే గానీ ఆ పది రోజులూ నేను ఎప్పటికీ మరిచి పోలేని విచిత్రమయిన రోజులు.

[ఈ మధ్య కాలం లో చాలా ఎక్కువ అయ్యాయట ఈ కేస్ లు. ఇదే ప్రోబ్లెమ్ తో ఆఫీస్ లో పనిమానేసీ కీబోర్డ్ మీద తలపెట్టీ, గురకెట్టి పడుకున్న ఒక కొలీగ్ నీ, వెంటనే గుర్తించక పోవటం వల్లా చాలా సీరియస్ అయ్యీ ప్రాణాల మీదకి వచ్చిన ఇంకో ఫ్రెండ్ నీ చూశాకా చెప్పాలని పించిందీ...కాబట్టీ ప్రజలారా.. జాగ్రత్త] 

Thursday, July 28, 2011

మావయ్యల లీలలు..!


ప్రతీ మనిషికీ ఊహ తెలియక ముందు అమ్మా, నాన్న మొదటి స్నేహితులయినా, ఊహ తెలిసాక బయట నుండి ఎంత మంది మంచి స్నేహితులు వచ్చినా, అమ్మ తోబుట్టువుల తో ఉండే అనుబంధం, స్నేహం, ప్రేమా ప్రత్యేకంగా ఉంటుందీ. 
మా ఫ్యామిలీ లో మొదటీ చంటి పిల్లోడిని నేనే గనుకా నా మీద ఆ ప్రేమ మరింత గా ఉండేది అందరికీనూ. మా ఇద్దరు పిన్నులూ, ఇద్దరు మావయ్యలూ నేనంటే అబ్బో.. భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ఎగ్జాంపుల్ లాగా  ఉండే నా బొజ్జనీ నేనే మోసుకోలేనేమో అన్నట్టూ నన్ను భూమి మీద నిలబడనిచ్చేవారు కాదు. మా పెద్ద పిన్ని అయితే మిగిలిన వాళ్ళందర్నీ పక్షపాతం చూపకుండా పడేసి తన్నేసి మరీ నన్నెత్తుకునేదంట. ;) తను పెళ్లి చేసుకొని వెళ్ళి పోయాకా మా చిన్న పిన్ని కూడా అంతే.. రోజూ కాలేజ్ నుండీ వచ్చేటపుడూ తను తెచ్చే సాల్ట్ బిస్కట్స్ కోసమో, చాక్లెట్ల కోసమో తెగ ఎదురు చూసేవాడిని. 

ఆ.. ఇప్పుడు కధానాయకుల విషయానికి వద్దాం.. అదే మా మాయలు (మావయ్యలు) ఇద్దరూ చెరొక టైపూనూ (అంటే ఒక్కొక్కళ్ళూ ఒక్కో టైపనీ). 
చెయ్యి పెడితే తిరిగిరానంత దట్టమయిన ఉంగరాల జుత్తూ,తను చాచిపెట్టి కొడితే తిరిగి లేవనంత దిట్టమయిన  పెర్సనాలిటీతో, ఇంచుమించు ఎం.టీ.ఆర్ కి డూప్ లాగా ఉండే మా పెదమాయ కీ కుక్కలన్నా, క్రికెట్టన్నా ప్రాణం. సినిమాలన్నా, సినిమాల్లో చిరంజీవన్నా పిచ్చీ. వంట చేసీ, వండింది ఒక్కడే తినేయడం, తేడా వస్తే ఒంగేబెట్టీ వాయించేయడం హాబీలు.
తను బొంగరాలాటకీ బయటకెళ్ళి ఇంటీకొస్తుంటే ఊళ్ళో ఊరకుక్కలన్నీ వెనకాల తోకూపుకుంటూ, మూతి నాక్కుంటూ వచ్చేవంటా. భోజనం చేసేటప్పుడూ కుడి వైపు కుక్కనీ, ఎడమవైపు పిల్లినీ కూర్చోపెట్టేవాడు. అదిచూసీ చిఱెత్తిన మా అమ్మమ్మ, కంచం లో పెట్టేవాటితో పాటూ, తిట్టే తిట్లు కూడా ఆ రెండు జీవాలతోనూ కలిసి తినేవాడు.  (ఆయన ఎంత జంతు ప్రేమికుడంటే మా  బ్రౌణీ ని(పెట్ డాగ్)ఏదయినా  అడిగితే, అది కూడా అదే ఫ్రీక్వెంసీ  లో  రిప్లై ఇచ్చేదీ. పిలిస్తే పలికేది.)  సైకిల్ మీద నన్ను ఊరంతా తిప్పుతూండేవాడు. ఊళ్ళెళ్ళినప్పుడూ నాకోసం వేసుకోడానికీ బూట్లూ, ఆడుకోడానికి క్రికెట్ బ్యాట్లూ గట్రా తీసుకొచ్చేవాడు. 


అయితే ఇంట్ళొ చాలా  ఎక్కువ  కాలం‌ కలిసి ఉండటం వల్లా, వయసు వ్యత్యాసం తక్కువ  అవ్వటంవల్లా  పెదమాయ కంటే చినమాయ (చిన్న మావయ్య) తో  నాకు అటాచ్ మెంట్ ఎక్కువ ఉండేది.

అప్పట్లో చీపురు పుల్లకి చొక్కా, ప్యాంట్ తొడిగినట్టూ ఉండీ, కళ్ళ్లల్లో పడే జుత్తు కత్తిరించుకోడానికి పది రూపాయలూ, కారుతున్న ముక్కు తుడుచుకోడానికి ఐదు రూపాయలూ అమ్మమ్మ ని లంచం అడిగే మా చిన్నమాయ కీ కావిడిబద్దంత క్రియేటివిటీ,కొలబద్దంత తిక్కానూ. తనకి నచ్చింది జరక్కపోతే ఇంట్లో దేవుడి గదికీ, పెద్దగదికీ మధ్య దార్లోఅడ్డంగా పడుకొనీ, మనిషన్న వాడు భరించలేని శృతి లో ఆనందభైరవి రాగం లో దొర్లి దొర్లీ ఏడ్చేవాడు.  మడిచేసిన విస్తరాకుకీ, మడతెట్టిన పూతరేకు కీ తేడా తెలీ చిన్న పిల్లోణ్ణి నేనే ఎప్పుడూ ఏడవలేదూ.. ఇలాగా.. వీడేంటీ అసయ్యం గా అనుకునేవాడిని :) :) 
తన గది లోకి ఎవరయినా ఎంటరయితే కుక్క దూరిందనుకొనీ కర్ర   పట్టుకు బాదేసే మా మామ్మ (అమ్మ గారి నానమ్మ) గారి మంచం కింద ఒక ఇనపరేకు పెట్టె ఉండేది. అందులో తేదీ దాటిపోయిన ట్రెయిన్ టిక్కేట్లూ , కలర్ పేపర్లూ, ఖాళీ ఇంజక్షన్ సీసాలూ, వాడేసిన అగ్గి పెట్టెలూ, అయిపోయిన బ్యాటరీలూ లాంటి  కలెక్షన్  ఉండేది చినమాయకి. రంగు కాగితాలని  తిరిగే చక్రానికి అతికీంచీ వాటివెనకాల టార్చ్ లైట్ వేసి తిప్పుతూ సినిమా వేసేవాడు. అట్టపెట్టెలతో ట్రాక్టర్ బొమ్మలూ, కార్ లూ, బ్యాటరీలతో నడిచే బళ్ళూ, చెక్కతో పొడుగాటి తుపాకీ మోడల్స్ తయారు చేసేవాడు. ఆ తుపాకీ ఎడమ చేత్తో కాకులకి గురిపెట్టీ, ఇంట్లో ఉండే అశోక చెట్టు కాయలు కుడి చేత్తో గురితప్ప కుండా విసిరేసీ "డిష్కూ" అనేవాడు. ఖాళీ ఇంజక్షన్ సీసాలని అందమయిన ఆకృతుల్లో అతికించీ కింద బల్బ్ పెట్టీ నా చేత చప్పట్లు కొట్టించేవాడు. అయితే ఇవన్నీ చూడ్డానికి మాత్రమే నాకు పర్మిషన్.  ఆడుకోడానికి ఇమ్మంటే  అవి నాకివ్వడం అడుక్కుతినేవాడికి  అమెరికా  ప్రెసిడేంట్ ఆటోగ్రాఫ్ ఇవ్వడం‌లాంటిదనీ ఫీలయ్యేవాడో ఏమో ఒక్క సారి కూడా ముట్టుకోనిచ్చేవాడు కాదు. :( :(   

ఒకసారేం జరిగిందంటే... మా మేడమీదా అన్నంమెతుకులూ, తెల్లకాగితాలతో కుస్తీ పడుతూ చిన్నమాయా,ఆ కుస్తీని చూస్తా నేనూ చాలా బిజీ గా ఉన్నాం.. తర్వాత ఆ కాగితానికి దానికి దారం కట్టీ గాల్లోకెగరేశాడు. అప్పుడే తెలిసింది నాకు దాన్ని గాలిపటం అంటారనీ.  దాని  తోక మిగిలిన గాలి పటాల్లాగా కాకుండా రింగులు రింగులు గా భలే ఉన్నాది. 



మా మేడకి చాలా దూరం లో ఇంకో మేడ మీద ఎవరో అమ్మాయ్ చెయ్యూపుతా ఉన్నాదీ. మాయ నన్ను భుజాల మీదకెక్కీంచుకొనీ చేతులు ఖాళీగా లేవని అనుకూంటా.. "ఒరే.. బుజ్జిగా నువ్వ్ కూడా చెయ్యూపరా" అన్నాడు.
ఎంతయినా నాకు కాబోయి, కాకుండా పోయిన ఒకానొక అత్త కదా.. చేతులు పీకేవరకూ, కా.పో అత్త వెళ్ళిపోయే వరకూ తెగ ఊపేసాను. ఇంతలో కింద నుండీ అమ్రీష్ పురీ రేంజ్ లో ఒక అరుపు వినిపించిందీ.. 
"ఒరేయ్...*#(&$%$(#% అవి హాఫ్ ఇయర్లీ ఎగ్జాం పేపర్లు రా.. ఇంకా కరెక్షన్ కూడా చెయ్యలేదూ..నువ్ గాలిపటాలెగరేసేస్తున్నావా?  " అనీ. మాయ నా వైపు చూశాడు. నేను చినమాయ కళ్లల్లో భయం చూశాను.  ఆ తర్వాత కింద అరుస్తున్న తాతయ్య గారి కళ్ళల్లో కోపం చూసాను. డాబా మెట్లెక్కీ, తగువేసుకున్న వీధిలో వాళ్లనీ బూతులు తిట్టడం లో డిప్లొమా చేసిన మా తాతయ్య గారూ కటకటాల రుద్రయ్య సినిమా లో క్రిష్ణంరాజు లాగా బలంగా అడుగులేస్తూ, ఆగ్రహంతో ఊగిపోతూ మేడ మీది కొస్తున్నారు. 
ప్రమాదాన్ని పసిగట్టిన మావయ్యేమో గాలిపటాన్ని గాలికొదిలేసీ, సిగ్నల్ రాని దూర్ దర్శన్ కోసం పెట్టిన 18 అడుగుల  టీవీ యాంటెన్నా పైపు పట్టుకొనీ కిందకి దిగేశాడు. 

డాబా మీదికొచ్చిన తాతయ్య, మావయ్య లేకపోవటం తో అవాక్కయ్యీ , రోడ్ రోలర్ ని రిక్షాకి కట్టి లాగే వాడిలాగా ఒక  ఎక్స్ప్రెషన్ పెట్టీ, ఆకాశం లో ఎగురుతున్నా ఆఫ్ఇయర్లీ  ఆన్సర్ పేపర్లవైపు అయోమయం గా చూస్తూ, సభ్యసమాజం సిగ్గుపడుతూ, చెవులు మూసుకొని తలదించుకునేలాగా బూతులు తిడుతూ కిందికెళ్ళిపోయారు. (అలా చూడకండీ.. మా ఇంటి ముందుండే ఆకుల అప్పయ్యమ్మ గారు తిట్టడం మొదలెడితే మా తాతయ్యే చెవులు మూసుకునేవారు. ఆవిడ పీ.హెచ్.డీ చేసిందిలేండీ  తిట్ల మీద ;)) 

ఇది చూడండీ.. ! :)    


 కిందకొచ్చి చూసేసరికీ చినమాయా, పెద్ద మాయ వీర లెవల్లో కొట్టుకుంటున్నారు కారణం తెలీదు నాకు. వాలీ సుగ్రీవులు కొట్టుకున్నారంటే నమ్మలేదు వీళ్లని చూసేవరకూ. విడదీయడానికి మధ్య లోకేళితే ఇద్దరూ కలిసి మనల్ని కొడతారనీ అందరూ ఎవ్వరి పనివాళ్ళు చేసుకుంటున్నారూ. కన్నడ యాక్షన్ సినిమా చూస్తున్నట్టూ, ముష్టియుద్దాల పోటీ లైవ్ చూస్తున్నట్టూ, మల్ల యోధులకి ఆయుధాలిచ్చి కొట్టుకోమన్నట్టూ ఉంది సిచ్చువేషన్.  పెదమాయ వీధిలోకి పరిగెట్టాడు. వెనకాల చినమాయ కూడా పరిగెట్టాడు. చిన్నమాయకి మా గోడ పక్క పేర్చున్న ఇటుకలు దొరికాయ్. పెద్దమాయ కి ఒక మోస్తరు కర్ర  దొరికీందీ. ఈ చివర ఈయన రాళ్ళిసరడం మొదలెట్టాడు. ఆ చివర ఆయన వాటిని కర్ర తో కొట్టడం మొదలెట్టాడు.
నేను మధ్యలో అరుగు మీద కూర్చొని చూస్తున్నాను ఇంట్రస్టీంగా ఉందనీ.  రసవత్తరం గా  సాగుతోంది మ్యాచ్. అప్పటివరకూ అరుగు మీద సోది కబుర్లు చెప్పుకుంటున్న  పక్కింటి పాపా, చివరింటి నల్లమరీ  గార్లూ "ఇదేటమ్మా మాయదారి గుంట్లూ..!" అనుకొని తిట్టుకొనీ వీళ్లకి నీతులు చెప్పడం  "పిచ్చి కుక్కలకి పళ్ళుతోముకోమని పెప్సొడెంట్ ఇవ్వటం‌లాంటిదనీ" డిసైడయ్యీ లోపలికి పారిపోయేరు.
ఓ నాలుగు రాళ్ళయ్యాకా "ఇంకోంచేం పెద్ద రాళ్ళిసర్రా" అన్నాడు పెదమాయ. అప్పటి వరకూ పిచ్చోడి చేతిలో రాయి లాగా పవర్ఫుల్ గా విసిరిన చిన్నమాయ పక్కా క్రికెటర్ లా పెర్ఫెక్ట్ బౌలింగ్ యాక్శన్ తో ఫుల్ టాస్ లు వెయ్యటం మొదలెట్టాడు. ఇంకో నాలుగు రాళ్ళేసాకా ఇద్దరికీ  జ్ఞాన జ్యోతి కంబైండ్ గా వెలిగీ, బాలూ, బ్యాటూ పట్టుకొనీ చెరో సైకిలూ వేసుకొనీ ఏటి ఒడ్డున క్రికేట్ ఆడ్డానికి బయలుదేరారు గొడవ మరిచిపోయి. (వీళ్ల క్రికెట్ పిచ్చి కాకులెత్తుకెళ్ళా.. అనుకొనీ నేనూ సైకిలెక్కేను)

ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అన్నమాట. మధ్యాహ్నం టైం లో అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఇంట్లో పనిచేసే "మెంటల్ శీను" పరిగెట్టుకుంటూ వచ్చీ మా అమ్మమ్మ గారితో 
"బాప్పా..బాప్పా.... ఊరు తగలడిపోతుందే" అన్నాడు ఆందోళన గా. వెంటనే అందరూ మా పెరటి గుమ్మం వైపు పరిగెట్టారు. వెనకాల నేనూ వెళ్ళాను. ఒక్కసారిగా భయం వేసిందీ. మా పక్కన ఉన్న తాటి కమ్మలిల్లు కాలిపోతుందీ. అందరూ అరుపులూ...అంతా ఒకటే గోలా. "ఒక ఇల్లే కదా తగలడుతుందీ? ఊరు తగల బడుతుందంటారేంటీ?" అని ధర్మ సందేహం అడిగాను అమ్మనీ. "ఇది ఆర్పక పోతే మంటలు పెరిగీ అందరి ఇళ్ళూ కాలిపోతాయ్ రా" అని అనటం తో అర్ధమయ్యిందీ. 
చినమాయ మా హ్యాండ్ బోర్ లో నీళ్ళు కొడుతూ ఉంటే, అమ్మా వాళ్ళూ బిందెలతో అందిస్తుంటే, పెద్దమాయ ప్రహారీ గోడేక్కీ  ఆ నీళ్ళు, కాలుతున్న ఇంటి మీద పోయటం మొదలెట్టారు. పెదమాయ కాలు వేసిన గోడ కూలిపోయీ లోపల పడబోయి తృటి లో తప్పించుకున్నాడు.


మంటల వేడికి చుట్టుపక్కలంతా వేడిగా అయ్యిపోయిందీ. ఎటు చూసినా పొగా. అక్కడ ఉండటమే కష్టం గా ఉందీ. అయినా గానీ అక్కడే ఉండీ ఫైరింజన్ వచ్చేలోపు మంటలు ఆర్పేశారు దిగ్విజయం గా.. అందరూ ఊపిరి  పీల్చుకున్నారు.   
(క్లైమాక్ష్ ఫైట్ అయిపోయిన తరువాత పోలీసు లోచ్చినట్టూ, దొంగలు పడ్డ  ఆర్నెల్లకి  కుక్కలు మొరిగినట్టూ  మంటలు మొత్తం ఆరిపోయిన తరువాత తాపీగా ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళదేం  తప్పు  లేదు  లెండీ.. మా వూరి  రోడ్ అలాంటిదీ)

అప్పటి వరకూ  నన్నేడిపించే  మావయ్యలూ, నా బొజ్జని వెక్కిరించే మావయ్యలూ,  చిన్న పిల్లల్లాగా  గొడవాడుకుంటారనీ నేను నవ్వుకునే మావయ్యలూ  హీరో ల్లాగా కనిపించారు నా కంటికీ.....!