Monday, November 28, 2011

నా పేరంటే నాకు బయ్యం........!


కోతులకి ప్రసిద్ధి చెందిన మా ఊరి రైల్వే స్టేషన్ లో రైలెక్కి కుక్కలకి పేరెన్నిక గన్న బెంగుళూరు కొచ్చిన కొత్తల్లో సంగతి.

అటెండయ్యిన అన్ని ఇంటర్వ్యూలూ చీదేస్తుండగా, విలాసాల మాట మరిచిపోయి అవసరాల కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్న రోజులు అవి.

ఒకానొక దరిద్రపు  దినాన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, నేను అప్లై చేసిన ఆరు నెలల తర్వాత ప్రసాదించిన నా ఒక్కగానొక్క ఏటీఎమ్ కార్డ్ ని SBH ఏటీఎమ్ లో పెట్టీ  Rs.3000 డ్రా చేశాను.(చేసేను అనుకున్నాను). డబ్బులు రాలేదు గానీ రిసిప్ట్ వచ్చింది.
దానిమీద "Error code: SBI X SBH = -3000 + $%#(@" అని ప్రింటయ్యి ఉంది. దానర్ధం "నీ మూడువేలూ మొగ్గలేశాయి. పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోరా దరిద్రుడా.." అనీ, మినీ స్టేట్ మెంట్ తీశాక అర్ధమయ్యింది.వార్నాయనోయ్ ఇప్పుడు హాస్టల్ బిల్ ఎలా కట్టాలీ? మెస్ వాడికి డబ్బులెక్కడ నుండి తేవాలీ? అన్న ఆలోచనలతో బుఱ హీటెక్కిపోయి, చేతులు చల్ల బడిపోయాయి.  ఆ బాధలో, ఆ భయం లో, ఆ హడావిడి లో చెప్పులో రాయి పెట్టుకొని ఒలింపిక్స్ లో పరిగెట్టే వాడిలాగా అడుగులేస్తూ మా మనోజ్ గాడికి ఫోన్ చేసి విషయం చెప్పాను. కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వరా అన్నాడు.
"నిజమే సుమీ.." అనుకొని ఫోన్ చేశా. రింగయ్యిన చాలా సేపటికి గానీ తియ్యకపోతే నాలాంటి లక్కీఫెలోస్ వల్ల బిజీ గా ఉన్నారేమో అనుకున్నా. ఈగలు తోలుకునే పనిలో బిజీగా ఉన్నారని తీశాక తెలిసింది..

విషయాన్ని వినయపూర్వకం గా విన్నవించి చాలా చీప్ గా వేడుకోటం మొదలెట్టాను. దానికి వాడు "ఇది ఎస్బీఐ సార్. మేము ఆన్ లైన్ లో కంప్లైంట్స్ తీసుకోము. మీరు మనీ డ్రా చేసిన బ్రాంచ్ లో కంప్లైంట్ ఇవ్వండి" అని చావు కబురు చల్లగా చెప్పాడు.
"కంప్లైంట్స్ తీసుకోరా?... మరి ఏం పీకడానికిరా కస్టమర్ కేరూ? నా వాయిస్ వినీ ఆకులు తినే కూర జంతువు టైప్ అనుకుంటున్నావేమో... కుత్తుకలు కొరికే కౄర జంతువు టైపు.. " అని అర్ధం వచ్చేట్టూ చాలా మర్యాదగా అడిగేను.
 దొరికిందే చాన్సు అనుకొనీ " క్రెడిట్ కార్డ్ తీసుకోండీ, కార్ లోన్ తీసుకోండీ 8% మాత్రమే వడ్డీ.. హోమ్ లోన్ తీసుకుంటే విరుగుతుంది మీ నడ్డి " అని ఆ తొక్కుడు లడ్డూ మొహం గాడు  క్యాసెట్టేశాడు.
"ఒరే... టైం చూసుకొని కొడుతున్నావు కదరా..నీ కస్టమర్ కేర్ కూలా.." అనుకొనీ, "పోరా పున్షూక్ వాంగ్ డూ" అని తిట్టేసీ, రూమ్ కెళ్ళీ ఇంటికి ఫోన్ చేసి చెప్పీ, పోయిన బ్యాంక్ బ్యాలెన్సూ, తరిగి పోయిన ఫోన్ బ్యాలెన్సూ చూసుకొని బావురుమంటూ బజ్జున్నాను."ఏటీఎమ్ మాదయినా కార్డ్ ఎస్బీఐ ది కాబట్టీ మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి" అని ఎస్బీహెచ్ వాడు, "ఇది ఆంధ్రా అకౌంట్. మీరు మీ హోం బ్రాంచ్ లో అడగండి" అని ఎస్బీఐ వాడూ ఆడుకున్నారు.(ఆ డబ్బులు ఇప్పటికీ రాలేదనుకోండీ..అది వేరే విష్యం).

అయితే ఆ రోజు నుండీ  ఎస్బీఐ అంటే కోపం తో కూడిన కంపరం మొదలయ్యిందీ. జన్మలో మళ్ళీ ఆ బ్యాంక్ జోలికి పోకూడదనుకొనీ రొటీన్ గా తొడ కొట్టకుండా వెరైటీ గా నెత్తీ నోరూ కొట్టుకొని ఒట్టు పెట్టుకున్నాను. కానీ... విధి వంగదీసి వాయించే రోజులు వరదలా వస్తున్నాయని ఊహించలేక పోయాను.

*****************************************************************************
ప్రోజెక్ట్ లో ఉన్నప్పుడు పని చేసుకుంటూ, బెంచ్ లో ఉన్నప్పుడు బ్లాగులు చదువుకుంటూ, హెచ్.డీ.ఎఫ్.సీ వారి సేవలో ఆనందంగా గడిపేస్తున్న రోజులు. ఒకానొక నెలాఖరు రోజు సాలరీ క్రెడిట్ అయిన ఆనందం లో మనీ డ్రా చేద్దామని చాలా బలంగా ధైర్యంగా వెళ్ళాను హెచ్డీఎఫ్సీ ఏటీఎమ్ కి. నిండుకుండ లాగా ఉండాల్సిన నా బ్యాలన్స్, కాకి వేసే రాళ్ల కోసం ఎదురు చూస్తున్న  కుండ లాగా కనిపించింది.
 "నిన్నే కదా డబ్బుల్ పడినియ్యీ..ఇదేటి ఇడ్డూరం?" అనుకొని స్టేట్మెంట్ చెక్ చేస్తే... వచ్చిన సాలరీ వచ్చినట్టే వెనక్కిపోయినట్టూ తెలిసింది. బ్యాంకోణ్ణి అడిగితే "మీ నేమ్ మిస్ మ్యాచ్ అయ్యిందీ. అందుకే  రివెర్ట్ చేశాం" అన్నాడు.

"ఒరే.. బుఱ తక్కువ బాబ్జీ.. సంవత్సరం నుండీ ఇదే అకౌంట్ వాడుతున్నాను. సడెన్ గా ఈ రోజు ఏమయ్యిందీ??" అని అడిగితే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా "కరెక్ట్ నేం తో ప్రూఫ్ సబ్ మిట్ చేసేదాకా మీ అకౌంట్కి నో ఇన్ కమింగ్. ఓన్లీ ఔట్ గోయింగ్" అని
బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అసలీ హెచ్డీఎఫ్సీ వాళ్ళందర్నీ పిక్కలు కనిపించేలా నిక్కర్లేసి మా వీధి లో కుక్కలు ఖాళీగా ఉండే అర్ధరాత్రి పూట  పరిగెత్తీంచాలి. తాటాకు లో తాంబూలాలు కట్టించుకు నమిలే తింగరి సచ్చినోళ్ళు అని నాకొచ్చిన రీతి లో తిట్టుకున్నాను.

ఇక్కణ్ణించి ప్రతీ సీనూ క్లైమాక్స్ లాగా ఉంటాది. మొగుడు సినిమా మళ్ళీ చూసినట్టూ ఉంటాది.  ట్విస్టులన్నీ చెప్తాను కేర్ ఫుల్ గా వినండీ.

నా పేరు "Neelam venu ram raj kumar".  షార్ట్ కట్ లో  N.V.R Rajkumar అని రాసుకుంటాను.

1.  మా ఆఫీస్ వాళ్ళు నా పేరుని Rajkumar N.V.R అని ఇంటి పేరు మధ్యలోనూ, చివరి పేరు మొదటా, మధ్య పేరు ని చివరా ఇచ్చారు.
2. నా PAN card లో Rajkumar neelam అని పొరపాటున పడింది (పూర్తిగా పడకపోయినా.. అదీ నా పేరే కదా అని ఊరుకున్నా..)
3. అదే పాన్ కార్డ్ ని నా బ్యాంక్ అకౌంట్ కి ప్రూఫ్ గా ఇచ్చాను. (యే..జజ్జనక జజ్జనక)

ఇంకేముందీ? అఫీస్ రికార్డుల్లో చేంజ్ చెయ్యటానికి హెచ్చార్ వాళ్ళు ఒప్పుకోరు. సాలరీ క్రెడిట్ చెయ్యడానికి బ్యాంకోళ్ళు ఒప్పుకోరు. నా పేరు మార్చుకోడానికి నేనొప్పుకోను.
అలా మూడు నెలలు మార్చుకోలేని చెక్కులతో, అరిగిపోయిన చెప్పులతో బ్యాంక్ ల చుట్టూ తిరిగీ తిరిగీ కొత్త చెప్పులూ, కాళ్ళు నెప్పులూ వచ్చాయ్ గానీ పని జరగలేదు.


ఈ ట్రాజెడీ స్టోరీ ఇలా రన్నవుతూ ఉండగా మా డామేజర్ నన్ను పిలిచీ నువ్ అర్జెంట్ గా ఆన్సైట్ వెళ్ళాలీ. ఈ శనివారమే ప్రయాణం. కాబట్టీ నువ్వు పాస్పోర్ట్ గట్రా సబ్మిట్ చేసేసీ, తట్టా బుట్టా సర్దేసుకో అన్నాడు. నేను రెక్కలొచ్చిన కోతి పిల్లలాగా ఎగురుతూ,
మధ్య మధ్య లో మొగ్గలేస్తూ రూంకెళ్ళి పోయి, సిపాయిలు తిరుగు బాటు చేసిన కొత్తలో తీసుకున్న బూజు పట్టిన నా పాస్పోర్ట్ దుమ్ము దులిపి, చూసీ నోరు తెరిచేసీ, కళ్ళు పెద్దవి చేసీ అవాక్కయ్యి ఉండిపోయేను.

పాస్ పోర్ట్ లో నా పేరు "Venu ram raju kumar" అని ఉంది. బాబోయ్... raj పక్కన U ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో అర్ధం కాకా ముందు బుర్ర, తర్వాత వీపూ గోక్కున్నాను. గోక్కొని గోక్కొని గోళ్ళరిగాయ్ తప్పా నా బాధ తీరలేదు.
మా నాన్నారికి చెప్తే " ప్రూఫ్ లలో ప్రింటయిన తప్పు పేర్లనీ, తల్లో తిరుగుతున్న పేలనీ, తాడు తెంచుకున్న కుక్కనీ తేలిగ్గా తీసుకోకూడదు. నిర్లక్ష్యం... అన్ని విషయాల్లోనూ నీకు నిర్లక్ష్యం... ($(%&$(%#$%(" అన్నారు.

ఈ లేటెస్ట్ హాటెస్ట్ న్యూస్ ఆఫీస్ లో చెప్తే.. ఏం పర్లేదు వీసా కి అప్లై చేసేస్తాం. కాకపోతే నువ్విదే పేరు మీద కంటిన్యూ అయిపోవాలి అని సై....తిగా చెవిలో ఊదారు. " అది సరే గానీ మరి నా సాలరీ మాటేమిటీ? మూడు నెలలుగా మీరిచ్చే చెల్లని చిక్కని చెక్కులు
మడిచీఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈఈ.. నా పర్స్ లోనే పెట్టుకు తిరుగుతున్నా" అని హృదయ వికారకరం గా అనిపించే తిట్లని అభ్యర్ధనని తలపించే విధంగా తిట్టాను. ఎందుకంటే "కోపం లో ఉన్న హెచ్చార్ వాళ్ళు, కోరపళ్ళున్న కుక్కకి పిచ్చెక్కినంత ప్రమాదం"

దీపావళీ నాడు పాము బిళ్ళలు వెలిగించి చెవులు మూసుకునే సున్నితమయిన మనసున్న  మా హెచ్చార్ హెడ్ "Today.....we'll resolve this problem..don't worry..!" అన్నాడు.
****************************************************************************

సాయంత్రం నన్నొక కాన్ఫెరెన్స్ రూం లోకి తీసుకెళ్ళారు. నేను ఎంటర్ అయ్యేసరికీ మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళూ, హెచ్చార్ వాళ్ళూ, బ్యాంక్ మేనేజర్లూ (మొత్తం దాదాపు పది మంది) ట్రాఫిక్ జాం లో సిగ్నల్ వైపు చూస్తున్నట్టూ నన్నే తీక్షణం గా చూస్తున్నారు.
"మీ రికార్డ్స్ లో నేమ్ అప్డేట్ చెయ్యండీ" అని ఒకే డైలాగ్ ని ఇరుపక్షాల వాళ్ళూ డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో అరుచుకున్నారు. అవతలి వాళ్ళు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పే టైప్.. మా వాళ్ళు ఎన్ని చెప్పినా వినిపించుకోని టైప్...
ఫైనల్ గా బ్యాంక్ మేనేజర్ నా నేం చేంజ్ చెయ్యటానికి ఒప్పుకొనీ నా దగ్గర ఉన్నా ప్రూఫ్ లన్నీ తీసుకొనీ చూసి షాక్ కొట్టిన కాకిలాగా ఉండిపోయిందీ. ఎందుకంటే ఏ ఒక్క ప్రూఫ్ మీదా నా పేరు ఒకేలా లేదు. (ఇందాక రెండు చెప్పాను కదా.. ఇప్పుడు మిగిలినవి)
నా డ్రయివింగ్ లైసెన్స్ మీద నా పేరు కరెక్ట్ గా ఉన్నాగానీ, దాని మీద ఉన్న ఫోటో నాదే అంటే నేనే నమ్మనూ. కానీ వేరే దారిలేకా నమ్మడానికి బరితెగించారు. అందులో నా పేరు "V R RAJKUMAR NEELAM" అని ఉంది.
"కరెక్ట్ గానే ఉందిగా" అన్నాను నేను.

"నీ టెంత్ సెర్టిఫికేట్ లో  RAJ కీ KUMAR కీ గ్యాప్ ఉంది. నీ డ్రయివింగ్ లైసెన్స్ లో RAJKUMAR అని ఉందీ." అని ఒకడు లా పాయింట్ లేవదీశాడు. (RAJ కీ KUMAR కీ గ్యాప్ ఇవ్వాలో లేదో నాకూ తెలీదు)
అప్పటికే పిచ్చెక్కి పోయిన బ్యాంక్ డామేజర్ నా గడ్డం పట్టుకొనీ "మీ ఇతర బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ ఉంటే ఇవ్వు నాయనా. పేరు కరస్ట్ గా ఉంటే చాలు, అడ్రస్స్ బోగస్ అయినా పర్లేదు" అని బతిమాలింది.
నేను మా ఊరి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ బుక్ ఇచ్చాను. దాని మీద నా పేరు "ram raj kumar neelam venu" అని నా పేరు నేనే మరిచిపోయే విధం గా ఉందీ.


పిచ్చి పీక్ కి వెళ్ళిపోయిన బ్యాం.డా  : ఒక్కటీ....! ఒక్క ప్రూఫ్ చూపించ లేరా సాఆఆఆఅర్?.

నేను : మా పింక్ కోటా కార్డ్ మీద నా పేరు కరెక్ట్ గానే ఉందీ.

బ్యాం.డాః మరింకేం.. అది ఇవ్వండీ.. మీ మోకాళ్ళు మొక్కుతా బాంచన్.. అరికాళ్ళు అందేంత వంగలేను. (చిగురిమ్చిన ఆశల వల్ల వచ్చిన చిరునవ్వుతో.)

నేనుః  అందులో నా పేరు తెలుగు లో ఉందీ. అందులో నా ఫోటో లేదు.... లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. కోటా కార్డ్ మా ఇంట్లో ఉందీ.

పాపం పిచ్చితల్లి!.. నేను ఇలా అనగానే "జుత్తున్న మామ్మ కి ఏ కొప్పయినా పెట్టొచ్చు. బోడిగుండు బాబాయ్ కి ఏ విగ్గయినా పెట్టొచ్చూ. కానీ ఈ పిల్లోడికి అకౌంట్ ఇవ్వటమ్ నా వల్ల కాదురా బగమంతుడాఆఅ...!" అని అరిచేసీ, కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంటూ, సగం చీరని నోట్లో కుక్కేసుకొనీ దీనంగా రోదిస్తూ బయటకెళ్ళి పోయిందీ.
మిగిలిన వాళ్ళందరూ  కాయంచూర్ణ కాఫీలో కలుపుకు తాగినోళ్ళలాగా నీరస రసాన్ని ఒలికిస్తూ  "అందుకే ఇంత పెద్ద పేర్లు పెట్టుకోకూడదు" అనేసేసీ ఒక్కొక్కరూ నన్ను వదిలేసి బయటకి వెళ్ళిపోయారు."నేను ఏటీఎమ్ లో కార్డ్ పెడితే డబ్బులు పోవటం, స్క్రాచ్ చేస్తే బిల్ ఎక్కువ రావటం, నెట్ బ్యాంకింగ్ చేస్తుంటే నెట్ డిస్కనక్ట్ అవ్వటం, బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్ 1 దగ్గర ఆగిపోవటం, నేనెక్కిన ట్రైన్ రైల్ రోకో లో నిలబడిపోవటం, నా పుట్టిన రోజు నాడు జ్వరం రావటం, నే వెళ్ళిన సినిమాలు ఫ్లాపయిపోవటం, నేను కొన్న కాస్ట్లీ ప్రోడక్ట్ కి మర్నాడే 50% డిస్కౌంట్ ఇవ్వటం"...ఇలాంటివీ...... ఇలాంటివి నాకు కొత్త కాదు...రోజూ జరిగేవే..!కానీ... కానీ...ఇలా నా పేరే నన్ను తొక్కి నార తీస్తుంటే ఎలా యువరానర్????? అని ప్రశ్నించాను.

నున్నగా ఉన్న గున్న ఏనుగు లాగా ఉండే మా మేనేజర్  నా దగ్గరకొచ్చీ.. "నా పదిహేనేళ్ళ ఎక్స్పీరియన్స్ లో నీలాంటి కేస్ ని ఎక్కడా చూడలేదు. అయినా ఇన్ని పేర్లు ఎందుకు వేస్ట్ చేశావ్? ఎనీ వే... నీ దరిద్రం డిస్కో డ్యాన్స్ ఆడుతున్నట్టుందీ.
వెళ్ళి శాంతి పూజలు చేయించుకో. కుదిరితే తిరపతి వెళ్ళి గుండు చేయించుకో. యెదవ ఆన్సైట్ పోతే పోనీ గానీ.. నీకు టెన్ డేస్ లీవిస్తున్నా.. నీ ప్రూఫ్ లన్నీ మార్చుకొని నింపాదిగా..రా " అని వరమిచ్చాడు.

వెకేషన్ హ్యాపీ గా కంప్లీట్ చేసుకొనీ, సరికొత్త ప్రూఫ్ లతో వచ్చిన నేను, మా ఆఫీస్ రికార్డ్ లలో ఉన్న నా పేరు తో అకౌంట్ ఇవ్వడానికి ఒప్పుకున్న ఒకే ఒక్క బ్యాంక్ లో కొత్త అకౌంట్ తీసుకున్నాను. అదీ.........
"నేను మళ్ళీ నీ మొహం చూడనూ"..అని మంగమ్మ శపధం చేసిన SBI. ఏం చేస్తాం? అదే విధీ...!

MNC లో పని చేస్తూ ఎస్బీఐ అకౌంట్ వాడటం అనేదీ "కాఫీ డే కి వెళ్ళి కలర్ షోడా తాగడం లాంటిది" అని వెక్కిరించే నా మిత్రులకి నేనిచ్చే సమాధానం

ఓడిపోయే యెదవకి బలుపెక్కువ
మాడిపోయిన దోస కి మసెక్కువ
జుట్టు రాలిన నెత్తికి నునుపెక్కువ.
నా తిక్క మొహానికి లక్కు తక్కువ.
ఈ ఎస్బీఐ వాళ్ళకి సుడెక్కువ.


జై హింద్..!

81 comments:

Sharada said...

Fantastic :)
:)

Zilebi said...

హన్నా,

SBI కుర్చీ మాను చదివినాడంటే నీకున్న ఆ అకౌంటు కూడా ఊడ గొట్టును. వెంటనే వేరొక బ్యాంకులో అకౌంటు పెట్టుకోవాల్సిన ఆగత్యము వచ్చును.!

Really Marvellous, Hilarious,and Funtastic! Keep it up!

Cheers
zilebi.

స్వర్ణమల్లిక said...

Bagundi raj. Nee peru kashtalu chaduvutu, bemmi poses chustunte navvagadamledu.

మధురవాణి said...

హహ్హహ్హ్హా రాజ్.. Excellent.. Superb... hilarious!!

<<"నీ మూడువేలూ మొగ్గలేశాయి. పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోరా దరిద్రుడా.."

ఇక్కడ మొదలైన నవ్వులు చివరికొచ్చేదాకా కొనసాగాయి. నవ్వీ నవ్వీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే నమ్ము.. :))))))
Gif లు అయితే టూ మచ్.. నువ్వు రాసిన వాక్యాలకి ఎక్కడెక్కడ ఏమేం ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో సరిగ్గా అవే బొమ్మలు పెట్టావ్ భలేగా.. :D

కానీ, అసలా బ్యాంకుల వాళ్ళ సర్వీస్, మన వాళ్ళ పనితీరు చూసి కోపం కూడా వచ్చింది. ఇప్పుడు నువ్విలా చెప్తుంటే నవ్వొస్తున్నాగానీ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది కదా! :(

రసజ్ఞ said...

హహహ మీరసలు భలే వ్రాస్తారండీ! తాటాకు లో తాంబూలాలు కట్టించుకు నమిలే తింగరి సచ్చినోళ్ళు బాగుంది! నాకు నచ్చినవన్నీ రాస్తే మొత్తం టపా కాపీ పేస్టు చేయాలి అందుకే ఒకటి ఎంచుకున్నాను మచ్చుకకి. హతవిధీ! మీ పేరెన్ని కష్టాలు తెచ్చి పెట్టిన్దండీ! నాకు కూడా నా పేరుతో చాలా ఇబ్బందులు పేరు చిన్నదే కాని ఆంగ్లంలో దానినేలా వ్రాయాలో అర్ధం కాక పాపం వాళ్ళే అవస్థ పడేవారు. ఇహ SBI ని ఒక్కమాట అన్నా ఊరుకునేదే లేదు! అదంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను మా హాస్టల్ నించి ఇంటికెళ్ళడానికి ఎప్పుడు online లో ట్రయిన్ టికెట్ బుక్ చేసుకున్నా నా ఎకౌంటు నుంచి పది రూపాయలకి మించి తీసుకునేవాడు కాదు! ఇలా 5 -6 సార్లు జరిగింది. ఇదేదో బాగుందే అని ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే మళ్ళీ టికెట్టు డబ్బులు తీసేసుకున్నాడనుకోండి అది వేరే విషయం!

శేఖర్ (Sekhar) said...

పంచ్ ల తో పరిగేట్టించావ్ గా ....
హ హ హ హ హ హ....బాబు మాకు కోడ నువ్ తీసుకున్న ప్రోడక్ట్లు లు sms చెయ్ తరువాత రోజు కొనుక్కుంటాం.... ;-)

durvasudu said...

Adirindi

durvasudu said...

Adirindi tambi.

RAMU VALIVARTHI said...

"పిక్కలు కనిపించేలా నిక్కర్లేసి మా వీధి లో కుక్కలు ఖాళీగా ఉండే అర్ధరాత్రి పూట పరిగెత్తీంచాలి. తాటాకు లో తాంబూలాలు కట్టించుకు నమిలే తింగరి సచ్చినోళ్ళు" Simply Superb..

Sravya Vattikuti said...

హ హ ఏంటో పాపం మీ హృదయవిదారక పేరు కష్టాలు చూసి సానుభూతి చూపిద్దామని ఎంత ప్రయత్నం చేసినా నవ్వు పొరలు కుంటూ , దూసుకుంటూ వచ్చేస్తుంది :)))
పోనీలెండి ఇప్పుడున్నా మీ పేరు సరిగా రాస్తున్నారా ?:P

గీతిక బి said...

చాలా బాగుంది రాజ్ కుమార్ గారూ.

ఇలాంటి సున్నితమైన హాస్యాన్ని చదివి చాలా రోజులైంది.

Kathi Mahesh Kumar said...

:) :) :) :)

వేణూ శ్రీకాంత్ said...

హహహ రాజ్ ఎప్పటిలానే పంచ్ లు అదరగొట్టేశావ్ :-)))
శేఖర్ గారు అడిగినట్లు నువ్ కొనే ప్రాడక్ట్స్ గురించి మాత్రం నాకు చెప్పడం మర్చిపోకే :-))

SHANKAR.S said...

పోస్ట్ అదిరింది N.V.R Rajkumar సారీ సారీ Rajkumar N.V.R మళ్ళీ సారీ Rajkumar neelam అయ్యయ్యో పోరపాటయింది Venu ram raju kumar ఓకేనా? కాదా? పోనీ V R RAJKUMAR NEELAM (రాజ్ కి కుమార్ కి మధ్య గ్యాప్ తో ఒకసారి, గ్యాప్ లేకుండా ఒక సారి ) హతవిధీ ఇదీ కాదా? అయితే ఖచ్చితంగా ram raj kumar neelam venu అయ్యుంటుంది. ఇంక నాకు ఓపిక లేదు రాజ్ నువ్వే ఏదో ఒకటి ఫిక్స్ చేసేసుకో :))

(అన్నట్టు నాదీ ఇదే సమస్య :)))) )

ఆ.సౌమ్య said...

"మా ఆఫీస్ వాళ్ళు నా పేరుని Rajkumar N.V.R అని ఇంటి పేరు మధ్యలోనూ, చివరి పేరు మొదటా, మధ్య పేరు ని చివరా ఇచ్చారు."

హహహ్హహ...పాపం, ఎన్ని కష్టాలో నీకు :))))

అయితే ఇవన్నీ ఇప్పుడూ నవ్వుకోవడానికి బావుంటుందిగానీ, ఆ టైములో ఎంత టెన్షన్ గా ఉంటుందో కదా!

కృష్ణప్రియ said...

:) hilarious!

అన్నట్టు, చాలా కాలం నేను వేణూ రాం, రాజ్ కుమార్ లు వేరు వేరు అనుకున్నా..

..nagarjuna.. said...

కెవ్వు కేక...
అక్కడ అంబాని ఫేమిలీస్ అంబా అంబా అరుపులు ఇక్కడ తాటాకులతో తాంబూలాలు... మొత్తానికి మీ ఇద్దరికి ఏదో ఐపోనాది నాయ్నోయ్ limit as (punch lines, creativity) tends to infinity తో మా పొట్టలు పగలగొడుతున్నారు :))))))

నేస్తం said...

>>>>>>దీపావళీ నాడు పాము బిళ్ళలు వెలిగించి చెవులు మూసుకునే సున్నితమయిన మనసున్న మా హెచ్చార్ హెడ్

>> ట్రాఫిక్ జాం లో సిగ్నల్ వైపు చూస్తున్నట్టూ నన్నే తీక్షణం గా చూస్తున్నారు.

ప్రొద్దున్న ప్రొద్దున్నే తెగ నవ్వించావ్ :))))))))

sunita said...

నవ్వీ నవ్వీ బుగ్గలు నెప్పెట్టాయి కానీ, మంచి ఆన్సైటు అవకాశం పోగొట్టుకున్నారు. పోనీలేండి better luck next time.నేను కూడా passport లో పుట్టింటి పేరు నుంచి అత్తింటి పేరు మార్చుకోవడానికి ఇక్కడైతే ఎక్కువ కిరికిరి పెడతారని Newyork లో మార్చుకున్నాను. ఇప్పుడు ఇండియా వచ్చాక సింకార్డ్ కు ప్రూఫ్ కింద passport పెడితే ఇది Newyork లో ఇంటిపేరు మార్చి రెన్యూ చేసి ఉంది కనుక చెల్లదు అని కట్టిన డీల్ డబ్బులు బ్లాక్ చేసాడు గుంటూరులో .తిక్క సన్యాసీ, ఇదేమైనా మోసమైతే నన్ను ఇక్కడిదాకా రానివ్వడు అక్కడే ఉంచి Newyork జైలు మర్యాదలు ఎలా ఉంటాయో చూపెట్టేవారు అని చెప్పినా వినలేదు. ఇహ విసిగిపోయి మా తమ్ముడు వాడిపేరుతో తీసి ఇచ్చాడు . ఇప్పుడు అదే వాడుతున్నాను:((

Ruth said...

హ హ... సూపర్ గా నవ్వించారు.
నాది కూడా పొడుగు పేరే అందుకే నేను ఎప్పుడూ పాస్పోర్ట్లోని పేరునే కట్ కాపీ పేస్ట్ చేస్తుంటాను :)
btw మీ ఇంజినీరింగ్ క్లాస్మేట్ మేరీ నాకు క్లోస్ ఫ్రెండ్. నీకు తెలుగు చదవటం వచ్చా?... అన్నదగ్గర మొదలైన డిస్కషను, అరే, బ్లాగులు రాసే రాజ్ కుమార్ నాకెందుకు తెలీదు!... దగ్గరకొచ్చేక తెలిసింది మీరిద్దరూ క్లాస్మేట్సని :)

శ్రీనివాస్ said...

ఇంతకీ వేణురాం అంటే ఎవరు అని ఒకరోజు మొహనే అడిగినట్టు గుర్తు నిన్ను :D...మొత్తానికి తీవ్రంగా నవ్విన్చేసావ్ కానీ గూగులమ్మని నీ పేరు మీద సెర్చ్ చేస్తే ఇంకేక్కడికో తీసుకెళ్తుంది . మరి బ్యాంకు పాస్ బుక్ స్కాన్ చేసి పెట్టి నువ్వు ఫేక్ కాదని నిరూపించుకో.

మనసు పలికే said...

రాజ్.. నీ టపాకి వ్యాఖ్యలు పెట్టాలంటే ఎక్కడైనా కాస్త ట్రెయినింగ్ అయ్యి పెట్టాలేమో అనిపిస్తుంది బాబూ.. నాకు తెలిసిన పదాలన్నీ వాడేశా మరి.. అందులోనూ అవి సరిపోవు మరి.

ఇక లాభం లేదు రాజ్, నేను ట్రెయినింగ్ కి వెళ్లి వచ్చి మళ్లీ వ్యాఖ్య పెడతా.. అంత వరకూ ఇది మాత్రం దాపెట్టుకో.. "కేకో కేకస్య కేకః" ;);)

శశి కళ said...

జజ్జనక...జజ్జనక....చిన్నగా నవలెదు బాబు...
కడుపు పట్టుకొని.....అరె పాపం రాజ్ బాధ లొ
ఊన్నాడు...నవ్వకూడదు...అని బుద్ది చెపుతూనె ఉంది...అసలీ హెచ్డీఎఫ్సీ వాళ్ళందర్నీ పిక్కలు కనిపించేలా నిక్కర్లేసి మా వీధి లో కుక్కలు ఖాళీగా ఉండే అర్ధరాత్రి పూట పరిగెత్తీంచాలి. తాటాకు లో తాంబూలాలు కట్టించుకు నమిలే తింగరి సచ్చినోళ్ళు అని నాకొచ్చిన రీతి లో తిట్టుకున్నాను...))))))))

Raviteja said...

హ హ హ తాటాకు లో తాంబూలాలు కట్టించుకు నమిలే తింగరి సచ్చినోళ్ళు వాట్ అం తిట్లు సిర్జి :D మీ బ్లాగ్ కీ నేను అభిమాని గా మారిపోయను

Raviteja said...

హ హ హ తాటాకు లో తాంబూలాలు కట్టించుకు నమిలే తింగరి సచ్చినోళ్ళు వాట్ అం తిట్లు సిర్జి :D మీ బ్లాగ్ కీ నేను అభిమాని గా మారిపోయను

sagittarian@26 said...

keko keka !! babu garu... mimmalani okasari chudali, kalavali. :)
Luck gurinhchi chepinanduku kaadau.... mee blogs keka !! yentha sunnithamaina telugu haasyam sir. super. jandhyalani talapisthunaru, trivikram ni maripisthunaru !! Hatsoff. tollywood lo arangetram chesaara?? FB page undaa??
pl reply me Bro...Mr.Raju !:P

శిశిర said...

అద్భుతం..చాలా బాగా రాశారు. ఒక్క వాక్యం అని చెప్పడానికి లేదు. పోస్ట్ అంతా చక్కటి హాస్యం. మంచి రచయిత మీరు. keep writing.
అన్నట్టు వేణూరాం, రాజ్ కుమార్ ఈ రెండు పేర్లేంటి? ఒకే వ్యక్తి రెండు ఐ.డిలతో ఉంటారేంటి? అని పెద్ద సందేహం ఉండేది నాకు. మీ పేరు మొత్తం చూశాక అర్థమయింది. మీరు మీ పేరులోని పార్ట్స్ తో ఇంకో పది ఐ.డిలు అయినా క్రియేట్ చేసుకోవచ్చు.

హరే కృష్ణ said...

Error code: SBI X SBH = -3000 + $%#(@" అని ప్రింటయ్యి ఉంది. దానర్ధం "నీ మూడువేలూ మొగ్గలేశాయి. పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోరా దరిద్రుడా.." అనీ, మినీ స్టేట్ మెంట్ తీశాక అర్ధమయ్యింది

ROFL :)))

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఏమి వ్రాయాలి ఎలా వ్రాయాలి కామెంటు?

సూపర్, ఫంటాస్టిక్, బ్రిలియంట్ వీటి అన్నిటికి కలిసి ఒక మాట ఉంటే అదన్నమాట. ఇంత హిలారియస్ గా వ్రాయడం మీకొక్కరికే సాధ్యం.
అంతే మరో మాట లేదు.

చాణక్య said...

నవ్వలేక సచ్చామండీ బాబు. ఆ జిఫ్‌లు ఎక్కడ దొరికాయండి మీకు? కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేకలు పెట్టించారు.

KumarN said...

Extremely good :-))

పానీపూరి123 said...

> మొత్తం దాదాపు పది మంది
ఆహా, మొత్తం పదిమంది పెద్దోళ్ళు కూడా మీ issue ni resolve చెయ్యలేకపోయారంటే మీరు చాలా గ్రేట్. :-)
ఇంతకూ మడిచి పర్స్ లో పెట్టుకున్న ఆ చెక్కులు పరిస్తితి ఏమిటి?

శ్రీనివాస్ పప్పు said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ రాజ్ వామ్మో అద్దరగొట్టేసావంతే
(నాదీ ఇదే పరిస్థితి కాకపోతే కొంచ వెరైటీ గా. అడ్రస్ ప్రూఫ్ కి నా దగ్గర ఉన్న ఒక్కటీ పనికిరాదు ఇప్పటికీ,ఎలాగంటే డ్రైవింగ్ లైసెన్స్-విశాఖపట్నం,పాన్ కార్డ్-ముంబై,పాస్‌పోర్ట్-రాజమండ్రి,రేషన్ కార్ద్-లేనే లేదు,ఓటర్ ఐడీ-పేర్లూ అడ్రస్ ఏ భాషలోనూ ఎవరికీ అర్ధం కాదు,అదీ పరిస్థితి)

తృష్ణ said...

:))) hilarious !!

Raj said...

కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.....

ఇంతకంటే ఏం చెప్పలేనేమో...

simple superb...

రాజేష్ మారం... said...

Excellent .. :)

డైలాగులు అదిరాయ్... .


:)

రాజ్ కుమార్ said...

శారద గారూ ధన్యవాదాలు!

జిలేబీ గారూ... ఆ.. చదవనివ్వండి చూసుకుందాం వాడి పెతాపమో, మన పెతాపమో... ;) థాంక్యూ వెరీ మచ్ అండీ

స్వర్ణమాలిక గారూ.. నవ్వు ఆగనివ్వకండీ.. ;) హిహిహి థాంక్యూ..

రాజ్ కుమార్ said...

మధురవాణి గారూ.. థాంక్యూ అండీ... నిజ్జం గా నిజం అండీ.. ఆ మూడు నెలలూ చాలా ఇబ్బంది పడ్డాను. పేరుకు పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తూ.. ఇంటి నుండి డబ్బులు తెప్పించుకోవల్సి
వచ్చిందీ.. ;(

రసజ్ఞ గారూ.. ధన్యవాదాలండీ.. వామ్మో...పది రూపాయలా? సూపరో సూపరు... ఇలాటి స్కీమ్స్ ఏమన్నా ఉంటే చెప్పుదురూ.. ;) ఇలాంటిదే వోడాఫోన్ తో ఒకటి ఉండేది. ఫుల్ల్ గా యుటిలైజ్ చేస్కున్నాం


శేఖర్.. అల్లాగలాగే.. ;) థాంక్యూ

దుర్వాసుడు అన్నా.. థాంక్యూ

RAMU VALIVARTHI గారూ.. థాంక్స్ అండీ

రాజ్ కుమార్ said...

శ్రావ్యగారూ ఏం చేస్తాం అలా కామెడీ బతుకయిపోయిందండీ.... తప్పుతాదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తున్నా ఇప్పుడు ;)

గీతిక గారూ థాంక్యూ వెరీమచ్ అండీ

కత్తి మహేష్ కుమార్ గారూ.. ఈ సారి ఒక స్మైల్ తగ్గించారా? ;) వాకే.. వాకే.. థాంక్యూ..!

రాజ్ కుమార్ said...

శ్రావ్యగారూ ఏం చేస్తాం అలా కామెడీ బతుకయిపోయిందండీ.... తప్పుతాదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తున్నా ఇప్పుడు ;)

గీతిక గారూ థాంక్యూ వెరీమచ్ అండీ

కత్తి మహేష్ కుమార్ గారూ.. ఈ సారి ఒక స్మైల్ తగ్గించారా? ;) వాకే.. వాకే.. థాంక్యూ..!

రాజ్ కుమార్ said...

థాంక్యూ వేణూజీ.. మీకు కూడానా? హ్మ్.... వద్దులెండీ నా బ్యాడ్ లక్ మీకు లక్క లాగా అతుక్క్కుంటే.. ???? ;)

శంకర్ గారూ.. సింపుల్ గా రాజ్ అని పిలిచేయండీ.. మీదే సమస్య అండీ? మీది చిన్ని పేరే కదా?

అవును సెగట్రీ... గారూ అన్ని కష్టాలూ నాకే.. ;( యెస్ ఆ టైం లో పడ్డ టెన్షన్ మామూలుది కాదు..

రాజ్ కుమార్ said...

కృష్ణప్రియగారూ.. ధన్యవాదాలు. అలా అనుకోకుండా రెండు ఐడీలు పెట్టేసుకున్నానండీ.... కన్ఫ్యూజ్ అవుతున్నారనే మార్చేశాను ఇప్పుడు.


చారీ... ఏదో అలా కలిసొచ్చేస్తుందబ్బాయ్.. ;) థాంక్యూ..!

రాజ్ కుమార్ said...

నేస్తం అక్కా... నాకూ ఆ లైన్ బాగా నచ్చిందీ..హిహిహి థాంక్యూ వెరీ మచ్..!

సిరిసిరిమువ్వ said...

:).

ఈ పేర్లతో గొడవలు అంతా ఇంతా కాదే!

ఇప్పుడు నవ్వుకుంటున్నా..అప్పుడు మీరెంత ఇబ్బంది పడి ఉంటారో!

రాజ్ కుమార్ said...

సునీత గారూ.. ఆన్సైట్ మిస్సయ్యి అప్పుడు చాలా మిస్సయ్యానులెండీ.. మీ కేస్ ఇంకా బాగుందీ.. ;) మనం ఏం చెయ్యలేం.. నాకు అప్పట్లో వాడే పొరపాటున తప్పు ప్రింట్ చెయ్యటం వల్ల
వారం రోజుల్లో కొత్తది ఇచ్చేశాడు గానీ.. అదే మన మిస్టేక్ అయ్యి ఉంటే ఎంత హింస పెట్టి ఉండేవాడో? ;) థాంక్యూ..

రూత్ గారూ ధన్యవాదాలు.. హా తెలుసండీ.. రీసెంట్ గా నే చెప్పింది తను ;) భలే ఆశ్చర్యం గా అనిపించిందీ. మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్సూ, మేమిద్దరం జిగిడీ దోస్తులం.. ఒకే ఊరు కదా.. ;)

రాజ్ కుమార్ said...

శీనన్నా.. హా.. అడిగావ్.. చాలా హర్టయ్యాను ఆరోజు హిహిహిహి.. ఇంతకీ ఏం చూపిస్తుందీ గూగులమ్మా? బ్యాంక్ పాస్ బుక్ ఏది పెట్టమంటావ్? ఏ పేరు కావలిస్తే ఆ పేరు పెడతా ;)

మనసుపలికే..ఇన్ని కేకలు సంస్కృతం లో అన్నాక అంతకన్నా ఎలా చెప్తారూ బాగుందనీ? ధన్యవాధః

శశిగారూ ధన్యవాదాలండీ.. ;) నేను బాధ లో ఉన్నారని తెలిసి కూడా నవ్వుతారా? చెప్తా చెప్తా ;)

రాజ్ కుమార్ said...

రవితేజ గారొ ధాంక్యూ.. ఏదో మీ అభిమానం ;)

sagittarian@26 గారూ ఆగండాగండీ నేను ఎక్కిన చెట్టు విరిగిపోయేలా ఉందీ. థాంక్యూ.. ఫేస్ బుక్ లో ఉన్నానండీ.. కానీ ఏక్టివ్ గా లేను ;)


శిశిర గారూ థాంక్యూ వెరీమచ్.. మూడేళ్ల క్రితం బ్లాగ్ పెడతానని నాకు తెలీదండీ.. అనుకోకుండా ఫోటో బ్లాగ్ లో వేణూరాం అని పెట్టుకున్నా.. కొత్తగా ఉంటాదని.. తర్వాత ఇది పెట్టాను. సో మీలా
చాలా మంది కంఫ్యూజ్ అయ్యారు. ;)

రాజ్ కుమార్ said...

రవితేజ గారొ ధాంక్యూ.. ఏదో మీ అభిమానం ;)

sagittarian@26 గారూ ఆగండాగండీ నేను ఎక్కిన చెట్టు విరిగిపోయేలా ఉందీ. థాంక్యూ.. ఫేస్ బుక్ లో ఉన్నానండీ.. కానీ ఏక్టివ్ గా లేను ;)


శిశిర గారూ థాంక్యూ వెరీమచ్.. మూడేళ్ల క్రితం బ్లాగ్ పెడతానని నాకు తెలీదండీ.. అనుకోకుండా ఫోటో బ్లాగ్ లో వేణూరాం అని పెట్టుకున్నా.. కొత్తగా ఉంటాదని.. తర్వాత ఇది పెట్టాను. సో మీలా
చాలా మంది కంఫ్యూజ్ అయ్యారు. ;)

రాజ్ కుమార్ said...

ధాంక్యూ వెరీమచ్ హరే... ;)

గురువు గారూ.. అంతా మీ ఆశీర్వాదం.. ధన్యవాదాలు ;)

గిఫ్ లు అనుకోకుండా అలా టైమ్ కి దొరికాయండీ.. ;)

కుమార్ గారూ ధాంక్యూ వెరీ మచ్..

రాజ్ కుమార్ said...

పానీ పూరి గారూ.. ఎందుకొచ్చిన చెక్కులండీ.. చించి అవతల్ పారేశాను ;) థాంక్యూ

పప్పుసారూ ధన్యవాదాలు. మీది కొంచెం వెరయిటీ కాదండీ చాలా వెరయిటీ.. ;) ఇంతకీ ఓటర్ ఐడీ ఎక్కడిదండీ?

తృష్ణగారూ, రాజ్ గారూ, రాజేష్ మారం గారూ థాంక్యూ వెరీ మచ్..!

జేబి - JB said...

నేను పెడదామనుకున్న‌ వ్యాఖ్య‌ శిశిర‌గారు‌ చెప్పేశారు‌, మీరు‌ జవాబిచ్చాశారు‌ (అదే‌ వేణూరాం-రాజ్‌ గురించి‌).

పేరు‌లో కష్టాలు‌ చాలామందికి‌ ఉంటాయండి‌, కానీ మీరు‌ స్పోర్టి‌వ్గా తీస్కొని‌ మాకు‌ హాస్యాన్ని‌ పంచారు‌.

నిషిగంధ said...

:)))) suuuuuuuuuuuper like... నవ్వీ నవ్వీ కళ్ళనీళ్ళొచ్చేసాయి.... ఒకసారి మీ పేరుని బ్యాక్‌గ్రౌండ్ చెక్ కి పంపాలీ.. భలే ఉంటుంది :))))

రహ్మానుద్దీన్ షేక్ said...

:)

MURALI said...

. అసలీ హెచ్డీఎఫ్సీ వాళ్ళందర్నీ పిక్కలు కనిపించేలా నిక్కర్లేసి మా వీధి లో కుక్కలు ఖాళీగా ఉండే అర్ధరాత్రి పూట పరిగెత్తీంచాలి

MURALI said...

. అసలీ హెచ్డీఎఫ్సీ వాళ్ళందర్నీ పిక్కలు కనిపించేలా నిక్కర్లేసి మా వీధి లో కుక్కలు ఖాళీగా ఉండే అర్ధరాత్రి పూట పరిగెత్తీంచాలి

ఇదయితే కెవ్వ్ రాజ్. మీ కుక్కల్ని ఇలా వినియోగిస్తున్నావన్నమాట.

రాజ్ కుమార్ said...

జేబీ గారూ ధన్యవాదాలు అండీ

నిషిగారూ.. బ్యాక్ గ్రౌండ్ చెక్ నా? మీకేంటండీ ఇలాంటి అవిడియాలొస్తున్నాయీ? ;)వాఆఆఆఅ..వాఆఆఆ
ధన్యవాదాలండీ

రెహ్మానూ.. ;)

రాజ్ కుమార్ said...

మురళీ ఎక్కడ వినియోగిమ్చడం బాబూ? ఏదో కక్షతో కూడిన తీరని కోరిక అంతే.. నా వెనక పడకుండా ఉంటే చాలు.
థాంకులు

VENKAT said...

ఇంత పెద్ద బ్లాగ్ రాసారు అందర్ని తెగ తిట్టుకున్నారు, కాని ఒక్కసారైనా మీకు అనిపించలేదా? మీదే తప్పు అని మీ అశ్రద్ధ వల్లే ఇన్ని ఇబ్బందులు వచ్చాయని? ఏది ఏమైనా మీ బాధ మాత్రం చాల బాగా చెప్పారు .

నేను స్టేట్ బేంక్ లో పనిచెయ్యటం లేదు లెండి భయపడడ్డు.

Ravitheja said...

ROFL...............

Srikanth Eadara said...

:)))

రాజ్ కుమార్ said...

వెంకట్ గారూ.. మొత్తం నా అశ్రద్ధ నే కారణం కాదు గానీ, కొంతవరకూ నేనూ కారణమే.. ఆ ముక్క చెప్పాను కూడా కదండీ.. మీ ఎస్బీఐ లో పని చేసేవారయినా పర్లేదు లెండీ. నేన్ భయపడే టైప్ కాదు ;) ;) ధన్యవాదాలండీ

రవితేజ గారూ థాంక్యూ..

శ్రీ కాంత్ గారూ ;)

kiran said...

రాజ్

నా నిద్రంతా పోయింది నవ్వి నవ్వి :(

ప్రోజెక్ట్ లో ఉన్నప్పుడు పని చేసుకుంటూ, బెంచ్ లో ఉన్నప్పుడు బ్లాగులు చదువుకుంటూ, హెచ్.డీ.ఎఫ్.సీ వారి సేవలో ఆనందంగా గడిపేస్తున్న రోజులు - LOL
ఒరే.. బుఱ తక్కువ బాబ్జీ. - హిహిహి
మొగుడు సినిమా మళ్ళీ చూసినట్టూ ఉంటాది - ఇంత సాడిస్ట్ అనుకోలేదు..

నేను రెక్కలొచ్చిన కోతి పిల్లలాగా ఎగురుతూ, -- కుక్క పిల్లలా అనుంటే సూపరుండేది :)
ప్రూఫ్ లలో ప్రింటయిన తప్పు పేర్లనీ, తల్లో తిరుగుతున్న పేలనీ, తాడు తెంచుకున్న కుక్కనీ తేలిగ్గా తీసుకోకూడదు.- kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv

ఇంకా బోలేడున్నాయ్ కానీ...అవి పేస్టు చేయలేను :)..అప్పుడు పోస్ట్ mottam ఇక్కడే ఉంటుంది :)

MNC లో పని చేస్తూ ఎస్బీఐ అకౌంట్ వాడటం అనేదీ "కాఫీ డే కి వెళ్ళి కలర్ షోడా తాగడం లాంటిది" -- ఇది ULTIMATE ...!!

త్వరలో..అతి త్వరలో మీరు చాలా బుజి అయిపోతారు అనిపిస్తోంది (మీ స్క్రిప్ట్స్ కోసం డైరెక్టర్ లు వెయిట్ చేస్తూ ఉంటారు కదా... :))

namu lo emundi anukuntam కానీ...chalane undi :D...

kiran said...

రాజ్
నా నిద్రంతా పోయింది నవ్వి నవ్వి :(

ప్రోజెక్ట్ లో ఉన్నప్పుడు పని చేసుకుంటూ, బెంచ్ లో ఉన్నప్పుడు బ్లాగులు చదువుకుంటూ, హెచ్.డీ.ఎఫ్.సీ వారి సేవలో ఆనందంగా గడిపేస్తున్న రోజులు - LOL
ఒరే.. బుఱ తక్కువ బాబ్జీ. - హిహిహి
మొగుడు సినిమా మళ్ళీ చూసినట్టూ ఉంటాది - ఇంత సాడిస్ట్ అనుకోలేదు..

నేను రెక్కలొచ్చిన కోతి పిల్లలాగా ఎగురుతూ, -- కుక్క పిల్లలా అనుంటే సూపరుండేది :)
ప్రూఫ్ లలో ప్రింటయిన తప్పు పేర్లనీ, తల్లో తిరుగుతున్న పేలనీ, తాడు తెంచుకున్న కుక్కనీ తేలిగ్గా తీసుకోకూడదు.- kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv

ఇంకా బోలేడున్నాయ్ కానీ...అవి పేస్టు చేయలేను :)..అప్పుడు పోస్ట్ mottam ఇక్కడే ఉంటుంది :)

MNC లో పని చేస్తూ ఎస్బీఐ అకౌంట్ వాడటం అనేదీ "కాఫీ డే కి వెళ్ళి కలర్ షోడా తాగడం లాంటిది" -- ఇది ULTIMATE ...!!

త్వరలో..అతి త్వరలో మీరు చాలా బుజి అయిపోతారు అనిపిస్తోంది (మీ స్క్రిప్ట్స్ కోసం డైరెక్టర్ లు వెయిట్ చేస్తూ ఉంటారు కదా... :))

namu lo emundi anukuntam కానీ...chalane undi :D...

కొత్తావకాయ said...

ఎప్పటిలానే నవ్వించారు. బ్రహ్మానందం gif ల కంటే మీరు ఎంచి పెట్టే ఫొటోలే బాగుంటాయ్. :)

Pavani said...

అదరగొట్టేశారు. Simply superb!

రాజ్ కుమార్ said...

కిరణ్.. ఇప్పటీవరకూఒ బిజీ అయినది చాలు.
ఇక వద్దు బాబోయ్..

కుక్క పిల్ల మొగ్గలెయ్యదు కదా అని కోతిపిల్ల అన్నాను ;)
థాంక్యూ వెరీమచ్. ;)

రాజ్ కుమార్ said...

కొత్తావకాయ గారూ.. థాంక్యూ థాంక్యూ అండీ

పావని గారొ ధన్యవాదాలండీ

Suguna said...

You are just too good, toooo good.

రాజ్ కుమార్ said...

సుగుణగారూ ధన్యవాదాలు ;)

S said...

Hilarious!! :)

నేను SBI వీరాభిమానిని. ఏ పనైనా భలే ఇట్టే అయిపోతూ ఉంటుంది (ఎందుకవ్వదూ? ముప్పై రెండేళ్ళ బట్టీ మా అమ్మ అక్కడ పని చేస్తూంటేనూ!). అదేంటో, నేనూ, మా అమ్మలాంటి ఎంప్లాయీలూ తప్ప ఎస్.బీ.ఐ. ఫాన్స్ ఎవరూ కనబళ్ళా నాకు ఇప్పటి దాకా... ;)

Found In Folsom said...

hahaha ante saripodu comment..nenu navvutune unnanu....ninna office nundi intiki bayalu dere appudu ipad lo page open chesi pettukuni dari poduvuna chaduvuta unna..appudu comment pettataniki internet ledu..anduke gurtu unchukuni mari ivala podduna vachina ventane aa pani chestunna...mee lanti peru kastalu podugu perlu unna friends ki chala mandike unnai..anduke maa pillalaki maa varu no middle name ani kachitanga cheppesaru...:-)

రాజ్ కుమార్ said...

@Found In Folsom

ముందుగా ధన్యవాదములు ;) యెస్ పెద్ద పెద్ద పేర్లు ఉన్నవాళ్ళు చాలా మందికి ఇలాంటి ప్రోబ్లెంస్ సహజం అనుకుంటాను. మీ పిల్లలకి బుల్లి పేర్లు పెట్టి మంచిపని చేశారు. ;)

Chinni said...

మీ పోస్టులన్ని చదివేసినా మళ్లీ ఇంకొకసారి చదివి బాగా నవ్వుకునే లాగా ఉంటాయి..చాలా బావుంటాయి.

రాజ్ కుమార్ said...

చిన్ని గారూ, సౌమ్య గారూ ధన్యవాదాలండి

Kishore Bitra said...

సూపరో ..సూపరూ... నవ్వి నవ్వి .. పొట్ట పగిలిపొయింది..

Santosh B said...

Super raju gaaru

Srikanth Gutti said...

narration super bava:)

no said...

రాజ్ కుమార్ గారూ ... నమస్తే. మీ ఆర్టికల్ చాలా బాగుంది . దీన్ని కొంత సంక్షిప్తంగా మా ఆంధ్రజ్యొతి ఆదివారం బుక్ లొ 30.8.2015 నాడు ప్రచురిస్తున్నాము - ధన్యవాదాలు - సండే డెస్క్

Pavan Kumar Kampalli said...

Sir...chaala baga rasaru.ee roju Andhra jyothi lo chadivanu...aripincharandi.naaku na anubhavaale gurtochai.na peru Kampalli S V R Naga Pavan Kumar.ee peru tho nenu padda tippalu anni inni kavu,10th certificate lo NagaPavan ani unte,degree certificate lo Naga Pavan ani untundi.Pan Card kosam 3 sarlu apply chesukovalsi vachindi...ee roju Andhra jyoti chusaka,na lage marokaru unnarani chaala aanandamanipinchindi...��.meku abhimani aypoya...carry on ur good work.��.all the best.

Bhavana Lakshmi said...

Very Nice Artical, Keep up the good narration.

Bhavana Lakshmi said...

Very Nice Article.