Thursday, November 29, 2012

ఇది కధకాదు 8 : బీటలు వారిన ఉద్యమం

1923 డిసెంబర్.
కాకినాడ లో  జాతీయ  కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయ్. మౌలానా మహమ్మదాలీ ఆ సభలకి అధ్యక్షుడు కాగా, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కొండా వెంకటప్పయ్య గారు ఆహ్వాన సంఘం అధ్యక్షులు. చిత్తరంజన్ దాస్, వల్లభాయ్ పటేల్ మొదలైన ప్రముఖులు సమావేశాలకి వచ్చారు. నాయకుల, ప్రతినిధుల సందేశాలు చదువుతుండగా ఒక సిక్కు వాలంటీరు ఒక చీటీని వేదిక మీదకి పంపి దానిని తన సందేశంగా చదివి వినిపించమని కోరాడు. అధ్యక్షులు మహమ్మదాలీ తిరస్కరించాడు. ఆ సిక్కు వాలంటీరు వత్తిడి చేసేసరికి వేదిక మీద ఉన్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి ఇచ్చేసారు ఆ చీటీని. ఆ చీటీలో విషయం ఏంటంటే...
"తాను సాయుధ సమరం చేస్తున్నాననీ, వీలైతే కార్యకర్తలను పంపడం, కాస్త ధన సహాయం చెయ్యడం తప్ప, తన దారికి అడ్డురావద్దని".
అసలు విషయం ఏంటంటే.. ఆ గెడ్డం సిక్కు వాలంటీరు ఎవరోకాదు మారు వేషం లో వచ్చిన రామరాజు . తను కనిపిస్తే చాలు.. ఉన్న పళంగా ఉరికొయ్యకి వేలాడదియ్యడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి తెలిసీ కాకినాడ రావడం ఒక సాహసం అయితే తన పేరున సందేశం వినిపించాలని కోరడం మరొకటి.

*******************************************************************************
1924 జనవరి 27
 700 మందికి పైగా పోలీసులు, 30 మంది ఆఫీసర్లు సంవత్సరం ఆరు నెలల పాటు తిరుగుతానే ఉన్నారు. రోజు కూలీ ఆరు అణాలు ఉన్న టైం లో 13 లక్షల రూపాయల ఖర్చు.

పూర్తి స్థాయి సైనిక చర్య కి ముందుగా ఆఖరి ప్రయత్నంగా  ప్రభుత్వం భావించిన అస్సాం రైఫిల్స్ దళం ( 400 మంది )  నర్సీపట్నం రైల్వేస్టేషన్ లో దిగి కోట ఉరట్ల మీదుగా మన్యం చేరింది. రామరాజు వెంట వంద మంది ఉన్న ఆ సమయానికి, మన్యం లో సైనిక బలగాల సంఖ్య 1000 కి చేరింది. మేజర్ గుడాల్ తన దళాన్ని బృందాలు గా విడదీసి గాలింపు ప్రారంభించాడు. పోలీస్ పదఘట్టనలతో అడవి గ్రామాలన్నీ కంపించిపోతున్నాయ్.
1924 నాటికి 1200 మంది పోలీసులు,  అస్సాం రైఫిల్స్ దళం,  16 మంది ఉన్నతాధికారులు, 450 మంది ఇతర స్థాయిఅధికారులు తిరుగుతున్నారు. మోత కోసం 106 గాడిదలు, 12 ట్రక్కులు ఉన్నాయి
మరో వైపు రామరాజు సేన కూడా 3 బృందాలుగా తన కార్యకలాపాలని సాగిస్తుంది. ఉద్యమ కారుల కుటుంబ సభ్యులు ఎవరు ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలో, ఎక్కడ భోజన సామాగ్రి, బట్టలు ఇవ్వాలో అక్కడ ప్లాన్ చేసిన ప్రకారం ఎవ్వరికీ అనుమానం రాకుండా జరిగిపోతున్నాయ్. అయితే రాజు ప్రధాన అనుచరుల్లో ఒకడయిన వీరయ్య దొర భార్య ఇలాంటి ప్రయత్నం లోనే అస్సాం రైఫిల్స్ కి దొరికిపోయింది. అతని కుటుంబం మొత్తం రాజు వెనకే తిరిగేది. ఆమె నుండి పోలీసులు రాబట్టిన సమాచారం తో "సుద్ధగంట" కొండలలో దాచిన కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి.
***************************************************************************
1924 ఏప్రియల్
మించాలపాడు సత్యాగ్రహం లో కన్నెగంటి హనుమంతు ని తుదముట్టించి, ఉద్యమాన్ని దిగ్విజయం గా అణచివేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ "టి.జి. రూధర్ ఫర్డ్" ఏజన్సీ లో స్పెషల్ కమిషనర్ గా నియమింప బడ్డాడు. చినుకు పడే లోపు ఉద్యమాన్ని రూపు మాపేయాలని రూధర్ ఫర్డ్, గుడాల్ లు నిర్ణయించారు. రామరాజు ని పట్టి ఇస్తే ఇచ్చే బహుమతి ని Rs. 1500 నుండి Rs. 10,000 కి పెంచడమే కాక  మరో ఏడుగురిని క్షమించరాని నేరస్థులు గా ప్రకటించాడు. ఉద్యమ క్షేత్రమైన మన్యాన్ని బెదిరించడానికి, తన లక్ష్యం సాధించడానికి తనకి తెలిసిన అన్ని విద్యలూ, వికృతులూ ప్రదర్శించడం మొదలు పెట్టాడు రూధర్ ఫర్డ్. పల్లె పల్లెనీ వేధించే పని మొదలైంది. రాజు ని పట్టించాల్సిన బాధ్యత ప్రజలదే అనీ, అలా కాని పక్షం లో మన్యం మొత్తాన్నీ తగలబెట్టేస్తాననీ, ప్రతీ ఊరికీ కిరోసిన్ పీపాలు దింపుతాననీ ప్రకటించాడు. అనడమే కాదు చినమల్లం పేట, కంఠారం మొదలైన గ్రామాలు మొదలుకొని ఊళ్లకి ఊళ్ళు తగలబెట్టి తనేంటో ప్రజలకి చెప్పాడు. రాజు కి ఎంతో ఇష్టమయిన "ధారమఠం" మీద దాడితో పాటూ విధ్వంసం జరిగింది. ఉద్యమానికి మద్దతు ఇస్తున్న మున్సబులు, ప్రజలు వేరే విచారణ లేకుండా జైలుకి పంపబడ్డారు.  ఉద్యమం మొదలు కావడానికి ఎటువంటి పరిస్థితులు దారి తీశాయో, అంతకంటే భయంకరమైన పరిస్థితులు దాపురించాయి. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మగవారికి చిత్రహింసలూ జరుగుతున్నాయ్.   ఇవన్నీ రామరాజు కోసం వేసే వలలు అనుకోవచ్చు, రాజు ని దెబ్బకొట్టడానికి పోలీస్ పధకాలు కావచ్చు. కావాలి...రామరాజు ప్రాణాలతోకావాలి. తమ చేతికి రాజు చిక్కేవరకూ ఇవే పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరికలు పంపాడు రూధర్ ఫర్డ్. కారణం ఏదయినా మన్యం ప్రజల పరిస్థితి పెణం మీద నుండి పొయ్యి లో పడ్డట్టు అయ్యింది. ఒక వైపు పంటలు లేవు. మరో వైపు పోలీస్ ల దారుణాలు. వీటి తో ఉద్యమానికి సహాయం చేసే వారు కాదు కదా కనీసం భోజనం పెట్టేవారు కూడా కరువయ్యారు. అంతే కాక కొంతమంది విప్లవకారులని పట్టించడం మొదలు పెట్టారు. దీనితో ఉద్యమకారులలో అసంతృప్తి భగ్గుమంది. పట్టించిన  వారిని తీవ్రంగా దండించడం మొదలు పెట్టారు.
మే నెలలో రాజు ప్రధాన అనుచరుడు వీరయ్య దొర  పోలీసులకి పట్టుబడ్డాడు.

ఇలాంటి పరిస్థితులలో పైడిపనుకుల గ్రామం లో సమావేశమైంది కొండదళం. తెల్లదొరలు గుడారాలు దాటి రారు. నల్ల పోలీసులని చంపకూడదని నియమం. కానీ అలాంటి నియమం వాళ్లకి లేదు. శత్రువు రక్త పిపాసి. "మరి ఉద్యమం ఎలా నడుస్తుంది??" అన్న ప్రశ్న సూటిగా తాకింది రామరాజు ని. "భారతీయులని చంపకూడదు" అన్న విచక్షణ కి స్వస్తి పలకాలని గట్టిగా అభిప్రాయ పడ్డారు కొందరు. చేతిలో తుపాకి ఉండీ ఊరుకోవడం వల్ల ప్రజల్లో నమ్మకం పోతుందని, బ్రిటిష్ సేన రెచ్చిపోతుందనీ వాదించారు. అయినా తన పంధా మార్చుకోనని తెగేసి చెప్పాడు రాజు. మారాల్సిందేనని పట్టుబట్టింది ఒక బృందం. "అయితే నన్నే పట్టివ్వండి" అన్నాడు రాజు. దళం లో చీలిక వచ్చింది. ఆ బృందం రాజు దగ్గర సెలవు తీసుకుంది.
******************************************************************************

1924 మే 5
శ్రీ రామరాజు, గంటందొర, అగ్గిరాజు కొండపల్లి వచ్చారని తెలిసి ఇంటెలిజన్స్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర పట్నాయక్ తన బలగం తో వెళ్ళాడు. రాజు ఆచూకీ కోసం గ్రామాన్ని ధ్వంసం చెయ్యడం మొదలెట్టాడు. అప్పటికే రామరాజు వెళ్ళిపోయాడని తెలియడంతో వేట మొదలైంది. కొంత దూరం వెళ్ళేసరికి కనిపించడం తో ఇరువైపులా కాల్పులు మొదలయ్యాయి. అగ్గిదొర పోలీసులకి దొరికి పోగా ఎర్రేసు, గంటందొర, ఎండుపడాలు మొదలగువారు తప్పించుకున్నారు. అయితే ఆ మర్నాడు మధ్యాహ్నం మూడుగంటల సమయం లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. కొందరు చనిపోయారు. కొందరు దొరికి పోయారు. ఒకే ఒక్కడు ఒంటరి గా మిగిలిపోయాడు. ఆ ఒక్కడూ... రామరాజు. చీకటి పడింది. ఆ చీకట్లోనే కొత్తరేవళ్ల మీదుగా మంప  గ్రామానికి చేరుకున్నాడు. ఎదురుగా జొన్న చేను. చేను మధ్యలో మంచె. ఎక్కి పడుకున్నాడు.
రాజు మనసులో ఆలోచనలు కుదిపేస్తున్నాయి.
అవును.. మన్యం లోని అశాంతిని  పారద్రోలి, స్వేచ్చని ప్రజలకిద్దామనుకున్నాడు. అందుకే పోరు మొదలెట్టాడు. పోరాడాడు. సాధారణ జనానికి ధైర్యం నూరిపోసి తిరుగుబాటు చేయించాడు. కానీ చివరకి ఏమయ్యింది? పరిస్థితులు "కొరడా దెబ్బల మీద కారం" నుండి "కొడవళ్ల తో వాతలు" వరకూ వచ్చాయి.  మర్రివాడ లోని "ఎలచూరు ఎల్లమ్మ" అనే గిరిజన మహిళ. తను ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా  ఆత్మీయత తో పాలు పంపించేది. రామరాజు పై చూపించిన ఆ అభిమానమే రాజద్రోహమయ్యింది. రాజు ఆచూకీ చెప్పమని ఎర్రగా కాల్చిన కొడవలి ఆమె వీపు కి అంటినప్పుడు ఆమె చేసిన ఆర్తనాదానిది ఏ భాష??
ఒక ఉద్యమకారుడి పేరు, తన పేరు ఒక్కటే అయిన పాపానికి ఒక అమాయక యువకుడి ని పీకలవరకూ గొయ్యి తీసి పాతి, తాటాకు నిప్పంటించి తల మీద పెట్టి సజీవ దహనం చేసినప్పుడు ఆ అమాయకుడు చేసిన రోదన తనని పట్టి చిత్రవధ చెయ్యటం  లేదూ?? నేరం ఎవరిదీ? పరాయి వాడి పాలన కింద బతుకీడ్చాల్సి వచ్చిన పరిస్తితులదా? ఉద్యమం లేవనెత్తిన తనదా? విచక్షణ మరిచిన శత్రువుదా?
తన సంస్కరణ వాదం, సిద్ధాంతాలూ, నియమాలూ ఏం మార్పు తీసుకురాగలిగాయి??
తాగి తన అనుచరుడు పట్టుబడిపోయిన  సంఘటన తన ఆశయాన్ని అవహేళన చెయ్యటం లేదూ?
ఏ ప్రజలని రక్షిద్దామని పోరు మొదలెట్టాడో, అదే ప్రజలని  ఉద్యమాన్ని నిలబెట్టుకోడానికి తన మనుషులే హింసిస్తున్నప్పుడు, అది తను సహించాల్సి వచ్చినప్పుడూ, ఉద్యమకారుల పేరుతో కొందరు ప్రజలని దోచుకుంటున్నప్పుడూ, తను ఆపలేనప్పుడూ మన్యం ప్రజలని తన కారణం గా చిత్ర హింసల పాలుచేస్తుంటే తను ఇలా ప్రాణాలు దక్కించుకోడానికి తప్పించుకు తిరుగుతున్నప్పుడూ ఈ పోరాటం ఎందుకు? ఎవరికోసం??

ఉద్యమం  లో శత్రువుకీ విచక్షణ ఉంటుందని, వుండాలని ఆశించడం పొరపాటు. కానీ ఉద్యమకారుడు కూడా విజ్ఞతని విడిచిపెట్టడానికి సిద్ధపడితే అది గ్రహపాటు.
 ఇక మిగిలేవి లక్ష్యాలు కావు.... కక్ష్యలు.
 జరిగేది పునర్నిర్మాణం కాదు... విద్వంసం.
దీనికి అవతల్నుండి జవాబు... మళ్ళీ విధ్వంసం... రక్తపాతం...!
దీన్ని కొనసాగించడానికి ఇందరు అమాయకులని బాధించాలా??


1924 మే 7 ఉదయం 7.30  తరువాత....
రాజు నిద్ర లేచి, ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించిన రాజన్న పడాలు ఇంటికి దగ్గర లోని కుండం లో స్నానం ముగించాడు. చుట్టూ చింతల తోపులు. సరిగ్గా అప్పుడే... ఆ చింతల తోపుల నుండి కొంత సాయుధ సైన్యం రాజుని చుట్టి ముట్టింది.  ఆ ప్రాంతం లో నిఘా నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ పెట్రోలింగ్ సబ్ ఇన్స్పెక్టర్ "ఆళ్వార్ నాయుడు" రాజుని పట్టుకున్నాడు. అతి సంక్లిష్టమయిన సమస్యలకి చాలా సులభమైన సొల్యూషన్ దొరుకుతుందన్నట్టూ, సంవత్సరం పది నెలలపాటు బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన అల్లూరి శ్రీ రామరాజు పోలీసుల చేతికి చిక్కాడు.

ఈ సారి ఏ అద్బుతాలూ జరగలేదు..
మలుపులు లేని ముగింపు.... వచ్చే భాగం లో.....!!

Monday, November 26, 2012

ఇది కధ కాదు 7 : ఆగని సమరం..!

క దేశం తో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలందరినీ శత్రువులు గా భావించాలా??
మన శత్రువు యొక్క అనుచరులంతా వేరే ఏ కారణం లేకుండా మన శత్రువులేనా??
ఆ శత్రువు పరిపాలనా వ్యవస్థే అయితే అందులో భాగమైన వారందరిపై యుద్ధం చెయ్యాల్సిందేనా??
మన అయిష్టాన్నీ, ద్వేషాన్నీ చూపించాల్సిందేనా??

వీటికి సమాధానం అవును అయినా కాదు అయినా రామరాజు మాత్రం పోరాటం పేరుతో అనవసర హింస కి ఎప్పుడూ పాల్పడలేదు తను హింసా పద్ధతిలో నడుస్తున్నా సరే. 1923 ఆగస్ట్ 4 న జరిగిన ఒక చిన్న సంఘటన దీనికి మరో ఉదాహరణ.
 పెదవలస సమీపం లోని రంపులఘాటీ లో ఇద్దరు పోలీసులని రాజు దళం పట్టుకుంది. శత్రువు కి కూడా మర్యాద ఇవ్వడం రామరాజు గుణం.  ఆ ఇద్దరు పోలీసుల నుండీ కొన్ని రొట్టెలని సేకరించాడు. పెద్దవలస పోలీస్ శిబిరం నాయకుడైన పీటర్సన్ కి ఒక పోస్టల్ రశీదు వెనక ఉత్తరం రాసిచ్చాడు.

ప్రియమైన పీటర్ సన్!
                               నా సహచరుడు అగ్గిరాజు జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రొట్టెలు అతని కొరకు మీ వారి నుండి తీసుకున్నాను. అందుకు మీకు ఒక బుట్ట పండ్లు పంపుతున్నాను. నన్ను గురించి చెడుగా భావించరని తలుస్తాను. 

సం॥ శ్రీ రామరాజు.

ఇదే ఆగస్ట్ నెలలో ఒకరోజు ఉదయం, రాజుదళాన్ని కోరాపుట్ రిజర్వ్డ్ పోలీస్ బెటాలియన్ చుట్టుముట్టి కాల్పులు జరిపింది. కానీ రాజు తప్పించుకున్నాడు. ఒకప్పటి లాగా ముందే సమాచారం ఇచ్చి దాడి చేసేందుకు గానీ, పట్టపగలే పోలీసుల ఎదురుగా సంచరించేందుకు గానీ పరిస్థితులు అనుకూలంగా లేవన్న మాట వాస్తవం. అయితే.. ఒకప్పుడు రాజు తరుముతుంటే పారిపోయిన పోలీసులు, ఇప్పుడు రాజు వెంట పరిగెడుతున్నారు. పోలీస్ లకి ఆ భయం తో కూడిన పరుగు మాత్రమ్ అప్పుడూ తప్పలేదు. ఇప్పుడూ తప్పట్లేదు.  మళ్ళీ ఉద్యమ వేడి రగులుకుంది. బ్రిటిష్ సైన్యానికీ, రామరాజు సేన కీ మధ్య కాల్పులూ, ఇరువైపులా రక్తపాతం జరుగుతుంది. అప్పటికి రాజు ఉద్యమం మొదలు పెట్టి సంవత్సరం పూర్తవుతుంది.  వార్తా పత్రికలలో ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మరక్షణ లో పడింది ప్రభుత్వం. యుద్ధం లో  ఉద్యమకారుల మరణానికి రామరాజే కారణమనీ, మన్యం లో రాజ్యస్థాపన చెయ్యడమే అతని ఉద్దేశ్యమనీ, దీనికీ సహాయనిరాకరణ ఉద్యమానికీ సంబంధం లేదనీ, మన్య ప్రజల ప్రశాంత జీవితాన్ని భంగపరిచినది రామరాజేననీ అప్పటి ఏజన్సీ కమిషనర్ హెప్పెల్ సరికొత్త వాదనలని తీసుకొచ్చాడు.

1923 ఆగస్ట్ 28 న ఆంధ్రపత్రిక లో ప్రచురితమైన కధనం ఇక్కడ. చదవ వచ్చు.  లేదా ఈ కింది పిక్చర్ మీద క్లిక్ చేసి చదవవచ్చు.
 బాస్టియన్ నే రాజు ఉద్యమానికి మూలకారణం అని అయిష్టంగానే ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణదేవీ పేట లో అతని మీద విచారణ మొదలైంది. అన్ని గ్రామాల పెద్దలనీ, మున్సబులనీ సమావేశ పరిచి రాజు ఫితూరీ ని అణగదొక్కడానికి  ప్రభుత్వానికి తోడ్పాటునందివ్వాలనీ, ప్రజలెవ్వరూ ఉద్యమకారులకి సహాయం చెయ్యకూడదనీ ఆదేశించింది. అదే రోజు సాయంత్రం ఆ మున్సబులందరూ, రాజుని కలిసేట్టుగా మాకవరం పొలాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు రాజు ప్రధాన అనుచరుల్లో ఒకడయిన మల్లుదొర.  రాజు పట్ల పూర్తి విశ్వాసాన్ని చూపిన మున్సబులందరూ అతనికి  సాష్టాంగపడి, ఉద్యమానికి సహాయ సహకారాలు అందించేట్టుగా తమ మద్దతు ప్రకటించారు.
ఈ సంఘటన తర్వాతనే రాజు తన ముఖ్య అనుచరుడు మరియూ గాం గంటం దొర తమ్ముడు అయిన "గాం మల్లు దొర" ని తన దళం నుండి శాశ్వతం గా బహిష్కరించాడు. ఉద్యమం మొదలు కాక ముందు నుండీ తన వెన్నంటి ఉన్న మన్యం వీరుడు మల్లుదొర. రాజువెంట అన్నవరం వచ్చిన నలుగురిలో ఒకడు. అతన్ని ఎందుకు వెలివేశాడు?? అంటే.... కారణం వ్యసనాలు. రాజు ఉద్యమం మొదలు పెట్టినప్పుడే తన సేన ఎంత క్రమశిక్షణ గా ఉండాలో, తన సిద్దాంతాలేమిటో స్పష్టం గా తెలియజేశాడు. అయితే రాజు దళం కృష్ణదేవి పేట పోలీస్ స్టేషన్ ని కొట్టిన రోజునా , ఆ తర్వాత కొన్ని సంధర్భాలలో రాజు అనుచరుడి హోదాలో డబ్బులివ్వకుండా మద్యం సేవించడం, సామాగ్రిని ప్రజల నుండి సేకరించడం మొదలైనవి చేశాడు. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి ఘటనలే పునరావృతం కావడం తో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్ప లేదు రామరాజు కి. అయితే దాని ఫలితం ఎలా ఉంటుందో ఆలోచించలేదు. ఇదే విధంగా సరయిన కారణం లేకుండా ఒక హిందూ పోలీసు చావు కి కారణమైన గోకిరి ఎర్రేసు ని 15 రోజుల పాటు బహిష్కరించాడు రాజు.

1923 సెప్టెంబరు 17 రాత్రి....
 మల్లుదొర తన స్వగ్రామానికి దగ్గర లో ఉన్న నడింపాలెం లో తన ఉంపుడుగత్తె అయిన "సుమర్ల సింకుబుల్లి" తోఉన్నాడనీ, అతని కోసం మద్యం పట్టుకొచ్చే ఏర్పాట్లు కూడా జరిగాయనీ, నల్లగొండి మున్సబు నుండి సమాచారం రావడం తో కృష్ణదేవీపేటశిబిరం లో ఉన్న అధికారి "కీరన్స్" పోలీసులతో బయలుదేరి వెళ్ళీ మల్లు ఉన్న ఇంటిని చుట్టు ముట్టాడు. మల్లు అటక ఎక్కి ధాన్యం దాచిపెట్టే గరిసె లో దూరాడు. పోలీసులు ఇల్లంతా గాలిస్తూ ఉండగా "జామేదార్ నారాయణ్ కురూప్" గరిసెను కత్తి తో పొడవడం తో గాయమయ్యే సరికి బయటకి రాక తప్పలేదు.  మల్లు వ్యసన పరుడే కావచ్చు కానీ జగమొండి. రాజు తనని బహిష్కరించాడన్న కోపంతో పోలీసులకి రహస్యాలు చెప్పెయ్యలేదు. మల్లుదొరని కృష్ణదేవీపేట పోలీస్ స్టేషన్ లో చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి చావగొట్టారు.  ఆ హింస అక్టోబర్ 4 వరకూ సాగింది. "చనిపోవడానికి సిధ్ధం" అనే అభిప్రాయం మనసు లో ఉండొచ్చుగాక. కానీ హింస కి శరీరం సిద్ధంగా ఉండదు.....  కొన్ని రహస్యాలు బయటకి వచ్చాయి.
అక్టోబర్ 12 న ఒక ప్రకటన వెలువడింది.

"రామరాజు ముఖ్య అనుచరుడు, ఫితూరీ దార్లలో కడు సాహసి, అత్యంత అపాయకరుడు అయిన గాం మల్లుదొర పట్టుబడ్డాడు. కొత్త పధ్ధతులతోనూ, అవిరళ కృషీ వల్లనూ సెప్టెంబరు 18 , 1923వ సంవత్సరం లో వాస్తవమైన ఈ విజయం సాధించడమైనది"


మల్లుదొర దొరికిపోయినంత మాత్రాన ఉద్యమం ఆగదనీ, తమ పంధాలో మార్పుండబోదనీ గంటందొర  ప్రకటించాడు.
సెప్టెంబర్ 29 న రాజు పాడేరు పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. కేవలం నాలుగు తుపాకులు లభించాయి.
పోలీసుల కోసం వస్తున్న సామగ్రి, ఆహార పధార్ధాలపై రాజు దళం దాడులు మాత్రం కొనసాగుతున్నాయ్.
కాల్పులు కొనసాగుతున్నాయ్.
శిక్షా సుంకాలు విధించినా, పెంచినా, బెదిరించినా ప్రజల్లో రాజుకున్న పలుకుబడి తగ్గటం లేదు. ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడింది తెల్లసేన.
 ***************************************************************************
1923 అక్టోబర్ 25

గూడెం లో "హ్యూమ్" నేతృత్వం లో ఏర్పాటు చెయ్యబడిన పోలీస్ సైనిక శిబిరం ఉద్యమ విస్తృతికి ప్రధాన ఆటంకం గా మారడం తో ఆయుధాల కోసం శిబిరం పై దాడి చెయ్యాలని తలచాడు రాజు. రాజు పధకాలు ఎంత పక్కాగా ఉంటాయో చెప్పడానికి మరొక ఉదాహరణ ఇది.
ఆ రోజు రాత్రి సైనిక శిబిరం లో దాదాపు అందరూ నిద్రపోతున్న సమయం. రాజుదళం శిబిరం దగ్గరకి చేరుకుంది. తన సేన ని మొత్తం నాలుగు బృందాలు గా విభజించాడు రాజు. మొదటి బృందం శిబిరం వెనుక భాగం గుండా ప్రవేశించి ఆయుధాలు సేకరించాలి. రెండవ బృందం సాయుధులది. రాజు ఆదేశం ఇవ్వగానే తుపాకులు, బాణాలతో దాడి చెయ్యాలి. మూడవ బృందం లో ఆయుధాలు కాకుండా కేవలం డప్పులూ, డోలులు ఉంటాయ్. నాల్గవ బృందం ఆదేశం ఇచ్చినప్పుడు "మేం కూలోల్లం బాబూ.. మేం కూలోల్లం బాబూ" అని అదే పని గా అరుస్తూ ఉండాలి.
మొదటి బృందం శిబిరం లోకి ప్రవేశించింది. అయితే తుపాకులన్నీ తుపాకి స్టాండ్ కి ఒక ప్రత్యేక పద్ధతి లో అమర్చి ఉండటం తో వాటిని తియ్యడం కొండదళ సభ్యులకి తెలియ లేదు. అంతేకాక ఇలాంటి ప్రమాదాలని నివారించడానికి తుపాకులని అన్ లోడ్ చేసి, తూటాలు తలగడల కింద దాచేసి ఉంచుతున్నారు పోలీసులు. ఇంతలో పోలీసులకి మెలకువ వచ్చి విషయం అర్ధమైపోయింది. ఒక సెంట్రీ కాల్పులు మొదలు పెట్టాడు. వెంటనే రాజు తన బృందాలకి ఆదేశమివ్వటం తో బాణాలూ, తూటాలు శిబిరం లోకి దూసుకురావడం మొదలైంది. అప్పుడే హఠాత్తుగా మొదలైన డప్పుల మోత తో హోరెత్తిపోతుంది. "మేం కూలోల్లం బాబూ.. మేం కూలోల్లం బాబూ" అరుపులతో పోలీసులకి గందరగోళం గా ఉంది. సైనికాధికారులు ఇస్తున్న ఆదేశాలేవీ ఈ గోల లో వినిపించటం లేదు. బ్రిటిష్ సైన్యం ఆయుధాలతో రెడీ అయ్యే సమయానికి కొండదళం పారిపోయింది.ఆయుధాలు దొరకలేదు గానీ, కొండదళం కాల్పులలో "లాన్స్ నాయక్ హుస్సేన్" మరణించాడు.

1923 డిసెంబర్ లో కృష్ణదేవీపేట కి సమీపం లోని కిత్తలోయ లో కొండదళం ఉన్నట్టు తెలిసి పోలీసులు రైడ్ చేశారు. వారికి రాజుబృందం కనిపించ లేదు గానీ ఒక బట్టల మూట, మన్యం మ్యాప్ లభ్యమయ్యాయి. ఎప్పుడు ఎక్కడ కి ఎలా వెళ్ళాలీ? అడవి లో అందరికీ తెలియని అడ్డదారుల గురించిన ఇన్ఫర్మేషన్, పధకాలతో ఉద్యమం నడుస్తుం డటంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఉద్యమం చల్లారినట్టే కనిపిస్తుందీ... ఒకేసారి విశ్వరూప ధరిస్తుంది. ఉద్యమకారుల గెరిల్లా యుద్ధాలతో గుండెలు దడదడలాడుతున్నాయ్.

ఈ స్థితి లో అస్సాం లోని కుకీల తిరుగుబాటుని విజయవంతంగా అణచివేసిన "అస్సాం రైఫిల్స్" దళాలని మన్యానికి రప్పించాలని మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది.  మొదటి ప్రపంచ యుద్ధం లో పని చేసిన అనుభవం ఉన్న "మేజర్ గుడాల్" దీనికి అధిపతి.

సరిగ్గా గుర్తు పెట్టుకోండీ పేరు ని..."మేజర్ గుడాల్"

Monday, November 19, 2012

ఇది కధ కాదు 6 : పోరాటం సాగిందిలా...!

1922 డిసెంబర్ మాసాంతం

రాజు సేన విచ్చిన్నమయిపోయిందని ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వానికీ, పోలీసులకీ మళ్ళీ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సమాచారం కోసం వేసిన టెలీఫోన్ లైన్లని నాశనం చెయ్యడం, పోలీసుల కోసం వస్తున్న సామాన్లనీ, ఆహార పదార్ధాలనీ కొల్లగొట్టడం ద్వారా తన ఉనికిని చాటుకుంది రాజుదళం. అయితే కొండల్లో డ్యూటీ చెయ్యమని మొండికేశారు పోలీసులు. దీనికి కారణం లేకపోలేదు. మన్యం లోని వాతావరణ పరిస్థితులనీ ముఖ్యంగా ఏ సౌకర్యాలు లేని చోట చలి, వర్షం, అంటు రోగాలు, విషజ్వరలాని తట్టుకోవడం చాలామందికి దుర్లభమనిపించింది. పెద్ద మొత్తం లో ఆహారం, ఇతర సామగ్రీ, ఆయుధాలూ, ఫిరంగులూ, మందుగుండూ మోసుకుంటూ తెలియని అడవి దారుల్లో కొండలు ఎక్కుతూ దిగుతూ, ఎప్పుడు రాజుదళం చేతుల్లో చస్తారోనన్న భయం తో చాలామంది రాజీనామాలు చేశారు. అప్పటికే పోలీసుల్లో ఒక నమ్మకం ఉంది. "రాజు మంత్రమేస్తే కండిషన్ లో ఉన్న తుపాకీ కూడా పేలదని". పోలీసులు రాజుకి భయపడుతున్నారన్న విషయం రూఢీ అవ్వటమే కాకుండా, రాజు దళం తో కుమ్మక్కు అయ్యారనే అభిప్రాయం కూడా ప్రభుత్వానికి కలగడంతో రాజీనామాలని ఆమోదించి, మొత్తం పోలీసుదళాన్నే మార్చెయ్యాలన్న నిర్ణయానికొచ్చింది ప్రభుత్వం.

అప్పటికే చాలామంది దళసభ్యులు పోలీసుల చేతికి దొరికేసినాగానీ, 1923 జనవరి లో 16 మంది తో రాజు మన్యం గ్రామాల్లో సంచరిస్తున్నాడనే వార్త మళ్ళీ హడావిడి సృష్టించింది. సుమారు 800 మంది తో కూడిన పోలీసు బృందం రాజు ఆచూకీ కోసం వెతకడం మొదలెట్టింది. అందులో భాగంగా పోలీసు సామాగ్రి మొయ్యడానికి అమాయక మన్యం ప్రజల చేతనే బలవంతం గా తీసుకెళ్ళి పనిచేయిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలని భయపెట్టీ, బతిమాలీ, సారాపోయించీ ఎలాగోలా రాజు సేన గురించిన వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.ఒక ఊళ్ళోకి రాజు వచ్చిన సంగతి ఆయన ఆ ఊరు విడిచి వెళ్ళిన తరువాతే పోలీసులకి తెలిసేది. ప్రభుత్వానికి సహకరించని అటువంటి ఊళ్ళ మీద అధిక మొత్తం లో సుంకం విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య  కొత్త సభ్యుల కోసం అన్వేషిస్తూ, గిరిజన గ్రామాలని తట్టి లేపుతూ మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేసే పనిలో పడ్డారు రాజు, అతని అనుచరులు...!

*********************************************************************************
1923 ఏప్రియల్ 17
అన్నవరం లో అడుగెట్టిన అల్లూరి

ఆయుధాల కోసం అన్నవరం పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు రాజు. కేవలం నలుగురు అనుచరులతో.
చెరుకూరి నరసింహ మూర్తి అనే గృహస్థుకి ప్రజలు పరిగెడుతూ కన్పించడం, కారణం అల్లూరి శ్రీరామరాజు రాక అని తెలియడం తో ఆయన స్వయం వెళ్ళి రాజుని కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నారు. రాజు ఎలా ఉన్నాడూ? ఎంత వయసు? అతని మాటల్లో మర్యాద ఎలాంటిది? అతని అలవాట్లేమిటీ? అతని అనుచరులెలాంటి వారు? ఉద్యమం మీద రాజు అభిప్రాయాలేమిటీ? మన్యం బయట గ్రామాల్లో కూడా రాజు కి ఎంతటి ప్రజాకర్షణ ఉన్నదీ? మొదలైన విషయాలన్నీ ఆ తర్వాత ఆయన ఆంధ్రపత్రిక విలేఖరి ని కలిసి చెప్పడం తో 1923 ఏప్రియల్ 21 నా "ఆంధ్రపత్రిక" లో అన్నవరం ఘటన గురించిన పూర్తి కధనం ప్రచురించబడింది. (తప్పని సరిగా చదవవలసిన ఆర్టికల్ ఇది)

(ఆ రోజు వార్తా పత్రిక ని ఇక్కడ చదవవచ్చు. లేదా కింద స్క్రీన్ షాట్స్ లో చూడవచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేయండి.)

(head line)


(వార్త)


 


 రాజు ఇచ్చిన ఇంటర్వ్యూ లో గమనించినట్లయితే.. గయ లో జరిగిన సమావేశాన్ని, స్వయంగా వెళ్లక పోయినా, తన సూక్ష్మ శరీరం ద్వారా  చూశానని చెప్పాడు. తన తపశ్శక్తి ద్వారానో, యోగ విద్య ద్వారానో అటువంటి స్థితి కి చేరుకోగలిగాడేమో అనిపిస్తుంది. ఒకే సమయం లో రెండు చోట్ల రామరాజు ఉన్నట్టు బలమైన సాక్షాలు ఉండటం, తప్పించుకోడానికి వీలు లేని పరిస్థితుల్లో కూడా శత్రువు నుండి తప్పించుకోవటం మొదలైన వాటికి కారణం ఇదీ సరిగ్గా చెప్పలేం. రాజుకి నిజంగా దివ్య శక్తులున్నాయన్న నమ్మకం మాత్రం ప్రజల్లోనూ, పోలీసుల్లోనూ బలంగా ఉన్నాదనీ ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అయితే పోలీసులని చిత్తు చెయ్యడానికీ, భయపెట్టడానికీ రాజు వేసిన పధకాలుగా కూడా అనుకోవచ్చు. మరొక సంగతేంటంటే వార్త హెడ్ లైన్స్ లో "అల్లూరి సీతా రామరాజు" అని వేశారు. అప్పటికి గిరిజన కార్యకలాపాలన్నీ భద్రాచలం నుండే నిర్వహించేవారు. భద్రాచలంలో సీతారాముల వారి గుడి ఫేమస్ అవ్వడంతో  బ్రిటిష్ వారికి "సీతారాముడు" అనే పేరు తో ఎక్కువ పరిచయం. ఈ కారణం గానే శ్రీ రామరాజుని  సీతా రామరాజు గా పిలిచారనీ, అదే అందరికీ అలవాటయ్యి ఆ పేరు స్థిరపడిందని  ఒక వాదన ఉంది. రాజు కి ఎంతో ఇష్టమయిన తన చెల్లెలు "సీత" పేరు ని తన పేరులో కలుపుకున్నాడన్న వాదన కూడా ఉంది. అయితే రాజు రాసిన ఉత్తరాలలోనూ, సెర్టిఫికేట్స్ లోనూ "అల్లూరి శ్రీ రామరాజు" అని మాత్రమే ఉంది.

అన్నవరం పోలీస్ స్టేషన్ లో తుపాకులు,మందుగుండూ లభించలేదు గానీ కత్తులు మాత్రం స్వాధీన పరచుకున్నాది రాజు బృందం. రామరాజుని సబ్ ఇన్స్పెక్టర్, పోస్టుమాస్టర్, డిప్యూటీ తహశీల్దారులు  తమ ఇళ్ళకి ఆహ్వానించారు. వారింట స్త్రీలు ఆయన కాళ్ళు కడిగి గౌరవించారు. రాజు సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నాక ప్రజలు రాజుకి బట్టలు పెట్టారు. ఫలాలు, కొంత డబ్బు ఇచ్చారు. రాజు వెనక ఉన్న ఆ నలుగురి లో ఆ రోజు గాం గంటందొర, అతని సోదరుడు గాం  మల్లుదొర కూడా ఉన్నారు. రాజు అన్నవరం విడిచి వెళ్ళిపోయాక వచ్చిన అధికారులు, ప్రజలు అతనికి బ్రహ్మరధం పట్టారన్న విషయం తెలుసుకొని అన్నవరం మీద Rs 4000 ల శిక్షా సుంకం విధించారు.

అయితే.. రాజు కీ, అతని ఉద్యమానికి ప్రజల మద్దతు ఎంతగానో ఉందనీ, ఒక్క ఎదురుదెబ్బకి భయపడి రామరాజు తన పోరాటాన్ని ఆపే ఆలోచనలో లేడనీ, ఇది సోమవారం మొదలెట్టి శుక్రవారం ముగింపు పలికే ఉద్యమం కాదనీ ప్రభుత్వానికి తెలిసొచ్చింది అన్నవరం ఘటన వల్ల.

**********************************************************************************

1923, మే నెల
 రాజుదళం లోకి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వేగిరాజు సత్యనారాయణ రాజు అనే వ్యక్తి సేనాని గా ప్రవేశించాడు.
మన్యం ప్రజల తిరుగుబాటు కి కారణం, కఠిన అటవీ చట్టాలతో పాటూ "బాస్టియన్" విధానాలే కారణం అని భావించింది ప్రభుత్వం. అయిష్టంగానే బాస్టియన్ ని నెల్లూరికి బదిలీ చేసి అతని స్థానం లో "కందర్ప మూరెన్న పంతులు" ని నియమించింది. సుంకం వసూలు కోసం కొయ్యూరు వచ్చిన అతన్ని రాజు అనుచరులు కిడ్నాప్ చేసి గంటందొర దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఉద్యమం ఉద్దేశ్యం, దానికి గల కారణాలని వివరించి అతన్ని వదిలేశాడు గంటందొర.అంతేకాక స్వతంత్ర పోరాటం కోసం ప్రతీ గ్రామాన్నీ తట్టిలేపడం, ఉద్యమకారులని పట్టిస్తున్న గ్రామ మున్సబులని శిక్షించడం, నాటు తుపాకీలని సేకరించడం మొదలైన  కార్యక్రమాలు మొదలెట్టారు. ఇందులో భాగంగా విప్లవకారులని ప్రభుత్వానికి పట్టించిన ఈబోలు గ్రామ మున్సబు చెవి నరికేశాడు అగ్గిరాజు. జూన్ 8 నాటికి 30 మంది, జూన్ 17 నాటికి 60 మంది రాజుబృందం లో ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. రాజు విధానాలకి ఆకర్షితులైన మైదాన ప్రాంత ప్రజలు కూడా ఉద్యమం లోకి వచ్చి చేరుతున్నారు.

రామరాజు సేన పఠిష్టమయ్యే దిశ గా అడుగులు వేస్తుంది....!!!

Thursday, November 15, 2012

ఇది కధ కాదు 5 : ఫిరంగి దెబ్బ

రాజుదళం సాగుతుంది. విజయ పరంపర తో... గర్వంగా...!
అప్పటి వరకూ చేసిన దాడులన్నీ దొంగచాటుగా కాదు. "ఈ రోజు మీ పై దాడికి వస్తున్నాం" అని ముందే చెప్పి, పెట్టిన ముహూర్తానికి బయలుదేరి చెప్పిన చోటుని కొట్టినవే. అయితే ఈ సారి పోలీస్ యంత్రాంగం కొన్ని జాగ్రత్తలు తీసుకున్న మాట వాస్తవం.

1922 అక్టోబరు 15
బ్రిటిష్ పోలీస్ అధికారగణాలు మోహరించిన ముఖ్య కేంద్రాలలో ఒకటి  "అడ్డతీగల" పోలీస్ స్టేషన్.
 డెబ్బై మైళ్ల దూరం అడవి లో ప్రయాణం చేయాలి అక్కడకి చేరాలంటే."అడ్డతీగల" పోలీస్ స్టేషన్ ని కొట్టబోతున్నాననీ, చేతనయితే ఆపుకోమనీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బ్రేకన్ కీ,  ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారి "సదావర్తి ఆదినారాయణ" కీ ముందే సమాచారం అందించాడు రాజు. రాజు దండు ని ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే స్టేషన్ లోని ఆయుధాలన్నీ ముందే దాచేశారు. స్టేషన్ ఖాళీ చేసేసి పోలీసులంతా పారిపోవటం తో రాజు బృందానిది వృధా ప్రయాస అయింది. ఆ రోజు రాత్రి తొంబై మంది సభ్యులతో రాజు స్టేషన్ లో బస చేసినప్పుడు గానీ, మర్నాడు వాగులో స్నానం చేస్తున్నప్పుడు గానీ రాజు యొక్క ప్రతీ కదలికా పోలీసులకి తెలుస్తూనే ఉంది.తను ఎన్ని గంటల వరకూ అడ్డతీగల లో ఉంటాడో కూడా రామరాజు ముందే చెప్పాడు. కానీ రాజుని ఎదుర్కొనేంత ధైర్యం గానీ, రాజుదళం తో పోరాడే తెగువ గానీ తెల్లదళం లోని ఏ పోలీసు కీ లేదు. అంతకు ముందు జరిగిన ఫితూరీ లలో ఆ పోలీస్ స్టేషన్ మూడు సార్లు ధగ్దమయ్యింది. ఒక్క అగ్గిపుల్ల గీసి తగలెట్టెయ్యడం చిటికె లో పని. కానీ ఉద్యమం లో విధ్వంసం ఒక సంస్కృతిగా పెరిగి పెద్దది కావడం రాజు ఉద్దేశ్యంకాదు. రాజు ఉద్దేశ్యమే రాజుదళానికి ఆజ్ఞ. ఆసుపత్రి నుండి అవసరమైన మందులు మాత్రం తీసుకొని చోడవరం ప్రయాణమయ్యాడు.

1922 అక్టోబరు 19
మాట్లాడే పని ఉందని రాజు స్వయంగా పిలిచినా గానీ ధైర్యం చేయని కలెక్టర్ బ్రేకన్, తహశీల్దార్ అప్పలనర్సయ్య పంతులు ని, చోడవరం చేరిన రాజుతో మంతనాల కోసం పంపించాడు. అప్పలనర్సయ్య కి రాజుతో గతం లోనే పరిచయం ఉండటం తో ఈ ఉద్యమం ఉద్దేశ్యమేమిటి? స్వాతంత్ర్యం మీ ఒక్కరి వల్లా సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించాడు.
"వ్యాపారం కోసం వచ్చిన వలసదారులు, మనలో ఐక్యత లోపించిన విషయాన్ని పసిగట్టి, లోకువగట్టి, ఆర్ధికంగా, రాజకీయం గా, శక్తిని కూడగట్టుకొని అధికార బలంతో భారత జాతి మీద సవారీ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు మార్గాలలో స్వాతంత్ర్య పోరాటం జరుగుతుంది. అందులో అతివాద ధృక్పదం తోనే నేను ఉన్నాను. మన్యం పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ శాంతియుత పోరాటం పనికిరాదు. రక్తపాతం తప్పదు. ఇది ఆరభం మాత్రమే. అసలు పోరాటం మొదలైనప్పుడు నేను లేకపోయినా నా అనుచరులు ఉద్యమాన్ని నడిపిస్తారు" అని సమాధానం చెప్పాడు రాజు. భారతీయుల సహాకారం వల్లే తెల్లవాళ్ళు ప్రాణాలతో బతికున్నారనీ, పరిపాలిస్తున్నారనీ తేల్చి చెప్పాడు. తాను పట్టుకొచ్చిన అరటి పళ్లని రాజు కి సమర్పించి, నమస్కరించి వెళ్ళిపోయిన తహశీల్దార్, చర్చా నివేదిక ని కలెక్టర్ కి పంపించాడు.
 అదే రోజు చోడవరం స్టేషన్ పై దాడి చేశాడు రాజు. సిబ్బంది మొత్తం అతనికి సాష్టాంగ పడిపోయారు. అయితే ఎటువంటి ఆయుధాలూ దొరకక పోవటం తో స్టేషన్ సిబ్బంది తో మాట్లాడి, సాయంకాలం వెళ్ళిపోయాడు. సమీపంలోకి వచ్చినా రాజుని అరెస్ట్ చేయనందుకు పోలీసుల మీద దర్యాప్తు మొదలైంది.

నాలుగు రోజుల తర్వాత....
రామవరం లో సాండర్స్ నాయకత్వం లోని సేన రాజుదళం తో తలపడింది. ఫలితం అప్పటికి వరకూ తెల్లసైన్యానికి అలవాటు అయినదే. "దొరికిపోవటం, చచ్చిపోవటం, చావు తప్పించుకు పారిపోవటం." బ్రిటిష్ సేన లోని కెప్టెన్ స్టువర్ట్ మాటల్లో చెప్పాలి అంటే " రాజు వ్యూహాలు ఊహలకి అందవు. తను ఎక్కడ ఉన్నాడో ముందే సమాచారం పంపుతాడు. పోలీసులు పట్టుకోడానికి బయలు దేరుతారు. అయితే అదంతా గొప్ప పధకం. పోలీసులు వెళ్లేసరికి అక్కడ ఎదుర్కోడానికి సిధ్ధంగా కాపుకాసి ఉంటాడు. పోలీసులు అతని వల లో ఇరుక్కుపోతారు".
ఇదే అక్టోబరు నెలలో ఏజన్సీ లలో ఎక్కువగా వచ్చే విషజ్వరాలు విలయతాండవం చెయ్యడంతో కొన్నాళ్ళు ఇరుపకక్షాలూ పోరాటం ఆపవలసిన పరిస్థితి వచ్చింది. పెంచిన పోలీసు దళం కోసం ఆస్పత్రులు, వాహనాలు, ఇతర పరికరాలు ఏర్పాటు చెయ్యవలసి వచ్చింది.
************************************************************************

1922 నవంబరు
రామరాజు ఆచూకీ కోసం గాలిస్తున్న నిత్యానంద పట్నాయక్ అనే పోలీస్ అధికారి రాజు దళానికి దొరికాడు. ఏయే ఊళ్ళలో ఎంత పోలీసు బలగం ఉందో అతని ద్వారా తెలుసుకొన్నాడు రాజు. "తమ ఆచూకీ కోసం గ్రామ పెద్దలని బెదిరించినా, ప్రజలని వేధించినట్లు తెలిసినా, అది ఎవడయినా సరే.. ప్రాణాలు తీస్తా..! " నని హెచ్చరించి వదిలేశాడు. పట్నాయక్ మాటల ప్రకారం శ్రీ రామరాజు అప్పుడు తన కొలువు లో ఎలా ఉన్నాడంటే...
"రాజు ఖాకీ నిక్కరు, చొక్కా వేసుకొని మంచం మీద కూర్చొని ఉన్నాడు. పక్కనే 303 తుపాకీ ఉంది. మరో పక్క మంచం మీద 303 రైఫిల్స్, బాణాలు ఉన్నాయి. చుట్టూ ఎనభై మంది దాకా ఉద్యమకారులు ఉన్నారు"
***************************************************************************

అనుమానమున్న గ్రామప్రజలని విచారిస్తున్నా, రాజు ఉద్యమానికి మద్దతిచ్చిన గ్రామాలపై అధిక సుంకాలని విధిస్తున్నా, బెదిరిస్తున్నా గానీ ప్రజలంతా రాజు కి సహాయం చెయ్యడం, పోలీసులు రాజుకి భయపడటం ప్రభుత్వాకి తలనొప్పిగా తయారయ్యింది.

నవంబరు నెలాఖరు నాటికి స్పెషల్ పోలీస్ దళాలు వేల సంఖ్యలో పెరిగాయి. యుధ్ధాలలో వాడే లూయీ ఫిరంగులు వచ్చి చేరాయి. సమాచారం కోసం వైర్ లెస్ సెట్లు దించారు. టెలీఫోన్ లైన్స్ వేశారు{అయితే టెలీఫోన్ వ్యవస్థని రాజుదండు నాశనం చేసింది.}. చిన్నా చితకా స్టేషన్లలో కూడా ఆయుధాలు, డబ్బు ఉంచకుండా ఏర్పాట్లు చేశారు. అందువల్ల పోలీస్ స్టేషన్ల పై రాజు చేస్తున్న దాడులన్నీ వృధా అయ్యాయి.
అంటే గత కొన్ని నెలలుగా కళ్ల ఎదుట కనిపించి సవాలు చేస్తున్నా రాజు ని అరెస్ట్ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్న తెల్లవాళ్లకి అతన్ని  ఎదుర్కోడానికి అనుకూల పరిస్థితులు వచ్చాయి.
కానీ 1922 డిసెంబరు నెలనాటికి రాజు ఆరోగ్యం పాడయ్యిందనీ, దళం లో చీలికలు వచ్చి కొందరు ఉద్యమకారులు బయటకి వచ్చేశారనీ వదంతులొచ్చాయి.

అదే డిసెంబరు లో జరిగిందో సంఘటన. వరుస విజయాలతో తెల్లోళ్ల గుండెల్లో గుబులు పుట్టించి పరుగులు పెట్టిస్తున్న రాజుసేన కి ఒక చేదు అనుభవం. రామరాజు పౌరుషాన్నీ, ప్రతాపాన్నీ, పోరాటపటిమనీ చూసి మురిసి పోతున్న మన్యం ప్రజల్లో మళ్ళీ భయాందోళనల బీజం నాటిన ఘటన.

1922 డిసెంబర్ 6
రామరాజు దళం ఆచూకీ కోసం తమ బెటాలియన్ తో వెతుకుతున్న జాన్, చార్స్లీ  అనే అధికార్లకి రాజు దళం లోని ఇద్దరు సభ్యులు చిక్కారు. పోలీసు చిత్ర హింసల తో రాజు "పెదగడ్డ పాలెం" లో ఉన్నాడన్న సంగతి వారినుండి రాబట్టారు. బెటాలియన్ పెద్దగడ్డపాలెం వైపు ఫిరంగులతో దారి తీసింది. రాజు సేన తమ స్థావరం నుండి బయటకొచ్చి వరిపొలాలు, నిలువెత్తు జొన్న చేను, చింత తోపుల చాటు నుండి యుద్ధం చెయ్యడం మొదలెట్టింది.  కానీ ఫిరంగులకి ఎదురు నిలిచి తుపాకుల తో యుద్ధం చెయ్యడం కష్టమవ్వడం తో రాజుసేన ప్రాణరక్షణ కోసం పారిపోవాల్సి వచ్చింది. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది ఉద్యమకారులు మరణించారు. మందుగుండు సామాను, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పారిపోయిన వారి కోసం స్వెయిన్ నేతృత్వం లో వేట మొదలైంది. రాజు స్థావరం లింగాపురం లో ఉన్నదన్న సమాచారం రాబట్టింది తెల్లదళం. పగలంతా తిండి లేకుండా యుద్ధం చేసి, అలసి, నీరసించి పోయిన రాజు సేన లింగాపురం లోని తమ స్థావరం లో విశ్రాంతి తీసుకుంటున్నారు. చీకటి పడింది. ముందే చెప్పి దాడి చెయ్యడం రాజు నైజమేమో గానీ తెల్లసైన్యానికి అటువంటి నీతులేమీ లేవు.  పహారా కాస్తున్న వాళ్ళని మట్టుబెట్టి, స్థావరాన్ని మూడువైపుల నుండి చుట్టు ముట్టింది పోలీస్ దళం. ఆ రాత్రి... ఆ చీకట్లో అప్రతిహతంగా జరుగుతున్నాయి కాల్పులు. పిట్టలు రాలిపోయినట్లు రాలిపోతున్నారు ఉద్యమకారులు. బ్రిటిష్ సైన్యం ఆ రోజు ఎంత పైచేయి సాధించిందంటే రాజు పరుపు మొత్తం చిల్లులు పడిపోయింది తూటాల దెబ్బకి. తెల్లారేసరికి మరో ఎనిమిది మంది కొండదళ సభ్యులు మరణించారు. అయితే... ఎలా సాధ్యమయ్యిందో తెలీదు... మిగిలిన అనుచరులతో రాజు తప్పించుకున్నాడు.
 ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే రామరాజు తన పక్క మీద కాక వేరొక చోట నిద్రపోయేవాడు. యుద్ధ తంత్రాలలో అదొక భాగం.

చనిపోయిన ఉద్యమకారుల శవాలని ఊరేగిస్తూ.. "ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తే.. ఎవ్వడికయినా ఇదే గతి"
అని బెదిరించి, తమ మొదటి విజయం తో బలంగా చాటి చెప్పింది తెల్లదళం.

"శ్రీ రామరాజు ని పట్టి ఇచ్చిన వారికి Rs.1500, దళ సభ్యులని గానీ తుపాకీలని గానీ పట్టి ఇచ్చిన వారికి Rs.50 బహుమతి. ప్రజలంతా ప్రభుత్వాదేశాలని శిరసావహించాలి. "కాదూ..కూడదూ" అంటే రాజు దళం నాశనమయ్యేంత వరకూ స్పెషల్ పోలీసు బలగాలు గ్రామాల లోనే ఉంటాయ్. వారి ఖర్చంతా ప్రజలే భరించాలి" . ఈ ఆదేశాన్ని ప్రతీ గ్రామానికీ జారీ చేసింది ప్రభుత్వం.

ప్రభుత్వానికి సమాచారం అదించటం లేదన్న నెపంతో చాలామంది మున్సబులపై కేసులు నమోదయ్యాయి. అయితే తలలకి వెల అనే పథకం కొంతవరకూ పని చేసింది. ఎంతయినా డబ్బు పాపిష్టిది కదా..! కొందరు మున్సబులు దళ సభ్యులని పట్టించే పనికి శ్రీకారం చుట్టి, ఉద్యమానికి తూట్లు పొడిచే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మిగిలిన సాధారణ ప్రజానీకం నిశ్శబ్దం గా ఉంది..!
పోలీసులకి ధైర్యమొచ్చింది. రాజు , అతని ప్రధాన అనుచరులు, మరికొంతమంది తప్ప తక్కిన వారు మరణించడం, దొరికిపోవటం జరిగిందని పోలీసులు భావించారు. లభించిన ఘన విజయానికి వేడుకలు జరుపుకున్నారు. ఎక్స్ట్రా ఫోర్స్ నీ, పరికరాలనీ వెనక్కి పంపించెయ్యొచ్చనే ఆలోచనలో ఉంది తెల్లసేన..!

రాజు ఏమయిపోయాడో...ఎక్కడ ఉన్నాడో... తెలీదు.
ఉద్యమం చితికి పోయినట్టేనా??
అంతేనా ఇక???

పోరాటం ఆగిందా?? కొనసాగిందా??

Monday, November 12, 2012

ఇది కధ కాదు 4 : విప్లవాగ్ని రగిలింది.

విజయానందంతో గిరిజన గ్రామాలన్నిటినీ పర్యటిస్తున్న రాజు సైన్యానికి ప్రజల నుండి గొప్ప స్పందన లభించింది.
అడుగు పెట్టిన ప్రతీ చోటా "స్వాతంత్ర్య సమరం" గురించీ, దాని ఆవశ్యకత గురించీ, తాము సాధిస్తున్న విజయాలని గురించి ప్రజలకి తెలియజేస్తున్నాడు రామరాజు.ఎక్కడ బస చేసినా సరే, ఆ గ్రామ మునసబులు, సమీప గ్రామాల మునసబులు, ప్రజలు, బియ్యం, వంట సామగ్రి, బట్టలు, కోడి, మేక వంటివి కొండదళానికి పంపిస్తున్నారు. సిరిబలి, కిలంకోట లమీదుగా సెప్టెంబరు 3 వ తేదీ నాటికి పాడేరు సమీపం లోని "ఒంజేరి" చేరుకున్నారు.
అప్పుడు జరిగిందో సంఘటన.

ఐదు ఏనుగుల మీద సామాగ్రి తో సుమారు ముప్పై మంది పోలీసులు అటువైపు వస్తున్నారని సమాచారం అందింది. రాజు దళం అటాక్ చేసింది. పోలీసుల నుండి ఎదురు కాల్పులు జరిగాయ్. కానీ రాజుదండు ధాటికి పోలీసులు తోకముడిచి పరుగులు పెట్టారు. ఒక పోలీస్ మరణించాడు. ఏనుగుల మీద ఉన్న పెట్టెల లోని బట్టలు, కంబళ్ళు,ఇతర సామాగ్రి  అక్కడికక్కడే తన వాళ్లకి పంచి పెట్టాడు రాజు. మన్యం వీరుల ఖాతా లో మరో విజయం.

రాజమండ్రి నుండి వెలువడే "గోదావరి పత్రిక", నెల్లూరు నుండి "ఆర్యావర్తనము", "న్యాయదీపిక", "ఆంధ్ర పత్రిక" మొదలుకొని తెలుగు పత్రికలన్నీ రామరాజు పోరాటాన్ని గురించీ, దానికి సంబంధించిన విశ్లేషణలనూ ప్రచురించాయి. కానీ ఆ తరువాత కాలంలో "కాకినాడ నుండి వెలువడే ఆర్యపత్రిక" మొదలైన కొన్ని మాత్రమే ఎక్కువగా కధనాలని రాసింది.

*******************************************************************
తూర్పుగోదావరి జిల్లా,"తుని" వీధులలో "పేరిచర్ల సూర్యనారాయణ రాజు" అనే వ్యక్తి కోసం రామరాజు మనుషులు వెతుకుతున్నారు. వారి చేతుల్లో ఒక ఉత్తరం. అది స్వయంగా రామరాజు , తన మిత్రుణ్ణి పోరాటం లోకి ఆహ్వానిస్తూ రాసిన ఉత్తరం.

మిత్రమా!
              నేను యుద్దమును ప్రారంభించితిని. ఇంతవరకూ  నాలుగు ప్రదేశములలో మన సైన్యం బ్రిటిష్ సైన్యాన్ని ఓడించినది. రామరాజు మూడు పోలీస్ స్టేషన్లు కొట్టాడు. అయితే ఉత్తరం లో పేర్కొన్న ఆ నాలుగో విజయం ఏదో అస్పష్టం. ప్రతి పోరాటమునను భగవానుని దయవలన జయము మన పక్షమునకే లభించినది. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకొని నీవు బయలుదేరి రావలెను. మృత్యువు, జననమును వెన్నంటియే యుండును.ప్రతి మానవుడు తన వంతు వచ్చినప్పుడు మరణించవలసినదే. కర్మ పరిపక్వమై, కాలము సమీపించిన,ఎక్కడున్నను ఏ మానవుడు మరణించడు? ఎంత శ్రద్ధతో ఈ శరీరమును పెంచి పోషించిననూ ఒకరోజు అది నాశనము కావలసినదే. మానవ శరీరములు శాశ్వతములు కావు. కానీ కీర్తి, అపకీర్తి శాశ్వతములు. మంచి, చెడులు చిరకాలము నిలుస్తాయి.క్షత్రియులకు యుద్ధము సహజము. ఎవరైతే జయాపజయములను, కష్ట సుఖములను చీకటి వెలుగులను చూడగలరో వారే ఆత్మ సాక్షాత్కారము పొందగలరని భగవద్గీత బోధించుచున్నది.మనకు యుద్ధం లో విజయము లభించిన ఎడల భౌతికానందము పొందగలము. యుద్ధం లో మరణించిన ఎడల మనము వీరస్వర్గము నలంకరించి ఆనందించగలము. అందువలన ఈ విషయములన్నిటినీ నేను జాగ్రత్తగా ఆలోచించి, దేశ క్షేమము కొరకు యుద్ధము అనివార్యమని పూర్తిగా విశ్వసించి ఈ సమరమును ప్రారంభించినాను. ఈ ఉత్తరము చేరిన వెంటనే నీవు తప్పక బయలుదేరి వస్తావని పూర్తిగా నమ్ముచున్నాను. ఇంకను ఎవరైనా వస్తే నీతో తీసుకొని రావలెను. ఒకసారి నీవు బయలుదేరి వచ్చి, ఇచ్చట నేను పోరాటమును సాగించుటకు చేసిన ఏర్పాట్లు చూడవలెను. అవి నీకు నచ్చకపోయిన ఎడల తిరిగి వెళ్ళిపోవచ్చును. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. అక్కడ పేకేటి వారి అబ్బాయి ఉంటే తప్పక నీతో తీసుకొని రావలెను. మిత్రులకు నా అభినందనలు.

-సం॥ అల్లూరి శ్రీరామరాజు.

ఈ ఉత్తరం చేరాల్సిన చోటకి చేరి ఉంటే, అందాల్సిన సహకారం అంది ఉంటే వేరేలా ఉండేదేమో. కానీ అప్పటికే ఏజన్సీ ప్రాంతాల మీద, ఆ ప్రాంతాల నుండి వచ్చిన మనుషుల మీద నిఘా పెట్టడమూ, పోలీసు శిబిరాలూ, చెక్ పాయింట్ల సంఖ్య పెంచడం తో రామరాజు మనుషులు పోలీసులకి చిక్కారు. వారితో పాటూ ఈ ఉత్తరం కూడా. దానికి ఇంగ్లీష్ అనువాదం పై అధికారులకి పంపించబడింది. వీరే కాకుండా దళానికి ఆహారం సమకూర్చుతున్న మరికొందరు పోలీసుల చేతికి చిక్కారు. జరిగిన దాడుల గురించిన విషయాలు రాబట్టారు.  రామరాజు ఆలోచనలు,వ్యూహాలు, విజయాలు వెరసి విషయ తీవ్రత, ప్రభుత్వానికి అర్ధమయ్యింది. ఇది ప్రభుత్వం మీద యుద్దం అని భావించింది.
************************************************************************

సమయం: 1.30Pm
ప్రదేశం: నర్సీపట్నానికి 25 కిలోమీటర్ల దూరం లోని ఘాటీ.
కమాండర్ ట్రెమన్ హౌర్, గూడెం డిప్యూటీ తాహశీల్దార్ బాస్టియన్  కొంత సైన్యం తో కలిసి, రామరాజు దళం ఆచూకీ వెతుకుతూ, తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న రామరాజు వ్యూహం సిద్ధం చేశాడు.
అదును చూసి కాల్పులకి సంజ్ఞ చేశాడు రాజు. యుధ్దం మొదలైంది. ఇరువైపుల నుండీ తుపాకీ మోతలతో ఆ ప్రదేశం అంతా దద్దరిల్లింది. బ్రిటిష్ సైన్యం చేతులెత్తేసింది. కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోగా, మరికొందరు ప్రాణాలు చేత్తో పట్టుకొని దొరికిన దిక్కుకి పారిపోయారు. కమాండర్ ట్రెమన్ హౌర్ తూటా దెబ్బ రుచి చూశాడు.
మన్యం ప్రజల ఆవేదనకీ, ఆక్రోశానికీ ప్రధాన కారణమయిన బాస్టియన్ కి ఆరోజు ఆఖరి రోజు అవ్వవలసింది. అతనికి గురిచూసి విసరబడిన ఒక కత్తి నుండి వెంట్రుక వాసిలో తప్పించుకొని పారిపోయాడు. ఆ కత్తి విసిరింది వేరెవరో కాదు బాస్టియన్ ఎవరి మీదయితే తప్పుడు కేసులు బనాయించి తన మున్సబు పదవిని పోగొట్టాడో, ఎవడైతే  సొంత భూమికోసం తన కాలితో తన్నులు తిన్నాడో.. ఆ గిరిజన నాయకుడు..రామరాజు ప్రధాన అనుచరుడు
"గాం గంటందొర".
**********************************************************************

ఉద్యమ అణచివేతకు ప్రయత్నాలు ఎక్కువ అయ్యాయి.కొయ్యూరు, కృష్ణదేవీపేట, గుర్తేడు, పెదవవలస, గూడేం, చింతపల్లి, లంబసింగి, మంప, ఇలా అనుమానమున్న ప్రతీ చోటా పోలీసు శిబిరాలు ప్రతీ శిబిరానికీ 50 మంది జవానులు ఆధునిక ఆయుధాలతో ఏర్పాటు చెయ్యబడ్డారు.

మొదటి ప్రపంచ యుద్ధం లో పాల్గొన్న అనుభవం ఉండటమే కాక, కేరళలోని మలబార్ అల్లర్లని అణచేసి వచ్చిన "నైవెల్లి హైటర్" నీ, తిరుగుబాట్లని తొక్కెయ్యడంలో సిధ్దహస్తుడని పేరున్న "స్కాట్ కవర్ట్" లని రంగం లోకి దించింది బ్రిటిష్ ప్రభుత్వం.

1922 సెప్టెంబర్ 24

ఆ రోజు రాజుదళం కృష్ణదేవి పేటకి ఆరున్నర మైళ్ల దూరం లో ఉన్న "దామనపల్లి ఘాట్" లో ఉందన్న సమాచారం హైటర్, కవర్ట్ లకి తెలిసింది. వారిద్దరి నేతృత్వం లో పోలీసులు బయలుదేరారు.  అయితే ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడానికి రాజుదళం లో ఏర్పాట్లు ఉన్నాయ్. పోలీస్ బెటాలియన్ వస్తుందన్న సంగతి రాజుదండు కి మున్సబ్ తమ్ముడు బొర్రంనాయుడి ద్వారా చేరవేయ బడింది.

సుమారు మూడొందల మంది పోలీసులతో బ్రిటిష్ పటాలం నాలుగు వరసల్లో కదలివస్తుంది. ముందు యాభైమంది అడ్వాన్స్ పార్టీ, తర్వాత నల్ల పోలీసు(ఇండియన్స్) దళం. ఆ వెనక హైటర్,  కవర్ట్స్, వెనకాల మిగిలిన పోలీసులు. అందరూ సాయుధులు. కానీ భయం భయం గా, పది మైళ్ళ పొడవున్న ఆ సన్నని కాలిబాటలో అడుగులు వేస్తున్నారు.

అప్పటికే గొరిల్లా యుద్ధం లో ఆరితేరిపోయాడు రామరాజు. మొత్తం ఐదు గ్రూప్ లు గా తన దళాన్ని విడగొట్టి వేరు వేరు చోట్ల మొత్తం దళాన్ని చుట్టుముట్టే విధంగా వ్యూహం పన్నాడు. హఠాత్తుగా రాజుదళం నుండి రెండు రౌండ్లు పేలాయ్. మొదటి రౌండ్ కి తూటా కవర్ట్ కణతలోకి దూసుకు పోయింది. రెండవ రౌండ్ కి తూటా  హైటర్ భుజంలోకి చొచ్చుకుపోయింది. బ్రహ్మాస్త్రాలని బ్రిటిష్ ప్రభుత్వం దించిన ఆ ఇద్దరి ప్రాణాల్ని చిటికెలో గాల్లో కలిపేసిన వాడు - విలువిద్య లో మొనగాడైన "గోకిరి ఎర్రేసు". అంతే... మొత్తం బ్రిటిష్ సైన్యం అంతా తప్పించుకునే వీలు లేకుండా చుట్టూరా కాపు కాసిన రాజు దళానికి దొరికేసింది.
ఏ ఒక్క భారతీయుడూ చంపబడకూడదు.. అన్న నియమానికి రాజు కట్టుబడి ఉండకపోతే , "ఊ... చంపెయ్యండి" అని రాజు ఒక్క మాట అని ఉంటే, ఆ రోజు అక్కడ నరమేధం జరిగుండేది. పచ్చని అడవి ఎర్రబడేది. ధామన్ ఘాట్ లోని వాగులో నీటికి బదులు రక్తం ప్రవహించి ఉండేది. ఎటువైపు నుండి బాణం వస్తుందో తెలిసేలోగా శరీరం లోకి దిగబడేది. దిగిందని తెలిశాక, గొంతు లో కేక గాల్లోకి చేరే లోగా ప్రాణాలు పోయుండేవి. అదే అవకాశం పోలీసు దళానికి వచ్చి ఉంటే రాజు దళం లోని ఏ ఒక్కరూ బ్రతికి ఉండేవారు కాదు. రామరాజు మాత్రం శత్రు సైన్యం లో ఉన్నా కూడా వారిలో భరతమాత బిడ్డల్నే చూశాడు. యుద్ధం మొదలైన కొద్ది నిమిషాలలో జరిగిన అలజడిలో మరో ఇద్దరు పోలీసులు మరణించగా, కొందరు గాయపడ్డారు. మొత్తం ఆయుధాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. ప్రాణాలు మాత్రం విడిచి పెట్టబడ్డాయ్. ఇద్దరు పోలీసులని మాత్రం కొండదళం బందీలుగా తీసుకెళ్ళారు. ఆ ఇద్దరు పోలీసుల ద్వారా వశపరచుకున్న "303 రైఫిల్స్" నీ, ఇతర ఆయుధాలనీ వాడే పద్ధతిని నేర్చుకుంది రాజుబృందం. వారు ఉన్న రెండ్రోజులూ భోజన సదుపాయాలతో మర్యాద గా చూశాడు రాజు. తర్వాత వారిని కూడా విడిచి పెట్టేశాడు.

అయితే చనిపోయిన హైటర్, కవర్ట్ ల శవాలు ఏమయిపోయాయో తెలియలేదు. కవర్ట్ కి అత్యంత సన్నిహితుడైన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ "అర్మిటేజ్" స్వయంగా బయలుదేరి వచ్చాడు. కొండదళాన్ని ఢీకొట్టడానికి బెటాలియన్ తో రెడీ అయ్యాడు. ఈ సారి జరిగిన పోరు లో ఒక తూటా అర్మిటేజ్ టోపీ దగ్గరగా దూసుకుపోయింది. చావుతప్పి కన్ను లొట్టపోయినట్టవ్వడంతో వెనుదిరిగి, శవాల కోసం స్థానికుల ద్వారా రాజుని సంప్రదించి బ్రతిమలాడుకోవడం తో Rs 500 జరిమానా కట్టి తీసుకెళ్ళేటట్టుగా ఒప్పందం జరిగింది. వారి మృత దేహాలని నర్సీపట్నం తీసుకెళ్ళి అంతిమ సంస్కారాలు జరిపించారు.(ఇప్పటికీ వారి సమాధులు R&B అతిధి గృహం లో ఉన్నాయ్).

యుద్ధం మొదలై నెల రోజులు మాత్రమే అయ్యింది. పరిస్థితుల్లో ఎంతటి మార్పు??
ఏ గిరిజన యువకుడి నైనా సరదాకోసం కాలెత్తి తన్నే పోలీస్ అధికారులు, గొంతెత్తి అరవడానికి గానీ, ఏ స్త్రీ నైనా కన్నెత్తి చూడటానికి గానీ సాహసించడం లేదు. భయం... ఇది రగిలే విప్లవాగ్ని అల్లూరి శ్రీరామరాజు నడయాడే చోటు. ఒక మన్య స్త్రీకి కీడు చేస్తే రామరాజు కి సంజాయిషీ చెప్పుకోవాలన్న భయం. ఆ సంజాయిషీ కి రూపం చావేనన్న భయం. ఒక భారతీయుడి కి చెడు తలపెడితే తలలు తెగుతాయన్న భయం.
మరి జరినవి సాధారణ యుద్ధాలా? దక్కినవి సామాన్య విజయాలా? నిరాయుధులైన సాధారణ జవాన్లనో, నలుగురైదుగురు పోలీసోళ్లనో, అరాచకాలు చేసిన  బాస్టియన్ నో చంపి "మేం.. గెలిచాం" అనడం కాదు. "విప్లవాగ్ని ఆర్పేస్తా.. తిరుగుబాటుని తొక్కేస్తా" అని భుజాలు చరుచుకు వచ్చిన వాళ్లంతా కొండని ఢీకొన్న పొట్టేళ్ళలాగా భంగపడ్డారు. రాజు ఆశయం తాత్కాలిక పరిష్కారం కాదు. చిన్న, చితకా వాళ్లని కొట్టడం కాదు.తన యుద్ధం ఒక వ్యక్తి మీద కాదు. ఒక వ్యవస్థ మీద. ఒక జాతి మీద. వలసదారుడి పెత్తనం మీద. మీదకి దూకడానికొచ్చిన కుక్క కళ్ళ ఎదురుగా పెద్దపులిని చంపేస్తే,  కుక్క కి మొరిగే ధైర్యం ఉండదు. దాన్ని కొట్టాల్సిన అవసరమూ ఉండదు. ఇక్కడ జరిగిందదే.

ఇది "రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం" అని ఎగిరిపడుతున్న తెల్లవాడి గర్వానికి దెబ్బ.
అత్యాధునిక ఆయుధాలు కలిగిన అతి పెద్ద సైన్యాన్ని ఒక సాధారాణ గిరిజన బృందం కొట్టిన దెబ్బ.
బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్ట కి దెబ్బ.
బ్రిటీష్ సైనిక శక్తి కి సవాల్.

రామరాజునీ అతని సైన్యం యొక్క సామర్ధ్యాన్నీ చూసిన I.G ఆర్మిటేజ్ "ఈ తిరుగుబాటుని ఆపడం కష్టమనీ, సాధారణ పోలీస్ దళాలూ, సైన్యాలూ సరిపోవనీ, అడవుల్లోనూ, కొండల్లోనూ యుద్దం చేసిన అనుభవం ఉన్న సైనికులు అవసరం అనీ" మద్రాస్ సర్కార్ చీఫ్ సెక్రటరీకి టెలిగ్రాం పంపించాడు.

యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయబడ్డాయ్. కొత్త చట్టాలు చేయబడ్డాయ్. కొత్త అధికారులూ, కొత్త టీం లూ, తిరుగుబాటు దార్లని విచారించేందుకు కోర్టులూ ఏర్పాటు చేయబడ్డాయి.ఫితూరీ లో పాల్గొనడమే కాదు, వారికి సహాయం చేయడం, ఆచూకీ ఇవ్వకపోవడం అన్నీ నేరాలే. అనుమానం ఉన్న గిరిజనులందరినీ లారీలలో ఎక్కించి విశాఖపట్నం తీసుకెళ్ళడం పోలీసుల దినచర్య అయ్యింది.
విప్లవకారుల జాబితా తయారయ్యింది. వారికి ఆహారమే కాదు మంచినీరిచ్చినా నేరమే. గ్రామల్లో ఏ ఒక్కరూ ఆయుధాలు కలిగి ఉండకూడదనీ, అన్నీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేతలే అనీ ఆంక్షలు పెట్టింది. పోలీస్ స్టేషన్ల పై దాడులని ఆపడానికీ, ముఖ్యంగా రాజు దళానికి ఆయుధాలు దొరకకుండా ఉండడానికీ చర్యలు తీసుకుంది.

క్రమ క్రమంగా మిలిటరీ సైన్యం విడతలు విడతలు గా వచ్చి చేరుతుంది. పూర్తి సైన్యాన్ని సమీకరించుకునే వరకూ రామరాజు అనే పర్వతాన్ని ఢీకొట్టకూడదని భావించింది ప్రభుత్వం. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తుంది....

ఆ అవకాశం బ్రిటిష్ సేనకి లభించిందా??
ఎప్పుడు?
ఎక్కడ???
ఎలా????

Thursday, November 8, 2012

ఇది కధ కాదు 3 : రాజు పంజా...!

 రాజు బయలుదేరాడు.. నేపాల్ కి కాదు. గూడెం తాలాకా కి ప్రధాన కేంద్రం అయిన చింతపల్లికి దగ్గర లో ఉన్న పెద్దవలస.ఎవడైతే అధికార గర్వం తో, అమాయక ప్రజల మీద తన రాక్షసత్వాన్ని చూపించి వారికి నరకం చూపిస్తున్నాడో..ఆ తహశీల్దార్ "బాస్టియన్" ఉండే చోటుకి కనుచూపు మేరలోని ఊరది.

ప్రజల దృష్టిలో ఫితూరీ అంటే ఒక దుందుడుకు చర్య. అల్లర్ల తో కొత్త సమస్యలని తెచ్చే అక్కర్లేని గోల.గతం లో జరిగిన తిరుగుబాట్లన్నీ ఆర్ధికం గా, నైతికం గా సామాన్య ప్రజల మీదే ఆధారపడ్డాయ్.అయితే అది ఎప్పుడయితే అదనపు భారమయ్యిందో , ఎప్పుడయితే కొత్త సమస్యలు తీసుకొచ్చిందో అప్పుడే ప్రజలకి ఉద్యమం మీద గౌరవం, నమ్మకం వాటితో పాటూ సహకారం తగ్గాయి.చాలా మంది దృష్టి లో "ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడానికి ఒక అవకాశం" మాత్రమే.

అయితే.. రామరాజు ప్రజలలో ఆ భావనలని పోగొట్టడానికి ప్రయత్నించాడు. గతంలో జరిగిన తప్పులని పునరావృతం కాకుండా ఉండేలా చూశాడు. అప్పికే ప్రిాజ ఉన్నమ్మం, గౌరం, క్తి,  ితూరీ కి మద్దు ఇచ్చేలా చేసింది.గంటందొర, మల్లు దొర, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు, కర్రి కణ్ణిగాడు, పనసల కణ్ణయ్య పడాల్ మొదలగు వారందరూ రామరాజు ప్రధాన అనుచరులుగా పెద్దవలస చేరారు.

తనేం చెయ్యాలనుకుంటున్నాడో చెప్పే ముందు, తనకెలాంటి ఉద్యమకారులు కావాలో, తన సిద్ధాంతాలేమిటో వివరంగా చెప్పాడు శ్రీ రామరాజు.

రామరాజు తన సైన్యానికి ఉద్భోధించిన విషయాలుః

1. ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం చేసే ఈ ఉద్యమం లో ప్రతీ ఉద్యమకారుడి పోషణా ప్రజలే చూసుకోవాలి. కానీ అది వారికి భారం కాకూడదు. తాము తిరిగే పల్లె లో ఒకటి - రెండు పూటలకి కావల్సిన భోజన సామాగ్రి మాత్రమే తీసుకోవాలి.

2. క్రమశిక్షణ, బ్రహ్మచర్యం, దుర్వ్యసనాలకి దూరం గా ఉండటం, స్తీల యెడల మాతృభావన కలిగి ఉండాలి.

3. ఉద్యమం అంటే హింసకి ప్రతి హింస కాదు. ప్రజా సంక్షేమం కోసం పాలక వ్యవస్థ మీద నిరసన. కనుక, గతి లేక తెల్లవాడి కింద పని చేస్తున్న ఏ ఒక్క భారతీయుడూ బలి  కాకూడదు. వాడు పోలీసయినా, వేరే ఏ అధికారి అయినా. 
"మన జోలికొస్తే చంపెయ్యగలం" అని వాళ్లకి తెలియాలి. చావు భయం కలిగించాలి గానీ అనవసర హింస కూడదు.
4. ఈ పోరాటం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడకూడదు. అవసరమైనదాని కంటే ఎక్కువ సహాయాన్ని (వస్తు,ధన రూపేణా) అందించడానికి సిద్ధం గా ఉన్నాసరే, దాన్ని నిరాకరించాలి

5. మన్యం లో కత్తులకీ, విల్లమ్ములకీ, నాటు తుపాకీ లకీ కొదవ లేదు కానీ శత్రువు బలమైన వాడు కాబట్టీ తగిన ఆయుధాలు సమకూర్చుకోవాలి.

ఎలా?? ఆయుధాలు ఎలా వస్తాయ్??
రాజు మనసులో ఆలోచన.. "పోలీస్ స్టేషన్ల పై దాడి". ఈ ఆలోచన ఇప్పటిది కాదు అప్పటికి కొన్నేళ్ల క్రితం "తుని" లో చదువుకునేటప్పుడు తన స్నేహితులతో కలిసి చర్చించిన పధకం అది.

అది విన్న క్షణం లో అందరి లోనూ గగుర్పాటు, భయం. పోలీసులు కనిపిస్తే హడలిపోయే ప్రజలు, వాళ్ల బూటు కాళ్లతో తన్నులు తినడానికి అలవాటు పడిపోయిన ప్రజలు. "ఆయుధాల కోసం పోలీస్ స్టేషన్ల పై దాడి" అన్న ఆలోచనే వారి ఊహకందని విషయం.
కానీ మరుక్షణం తేరుకున్నారు. ఎందుకంటే తమ ముందుండి నడిపించేది....సాక్షాత్తూ తమ స్వామి.
గాం గంటందొర, ఎండు పడాల్, శ్రీ రామరాజుల నాయకత్వం లో మూడు బృందాలు ఏర్పడ్డాయ్. మరునాడు "చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి" కి ముహూర్తం పెట్టాడు రాజు. అందుకు నాందిగా మహారుద్రాభిషేకం చేశాడు రాజు. వ్యూహం సిద్ధమైంది.
************************************************************************

1922, ఆగస్ట్ 22

జవాను తో కలిసి నర్సీపట్నం వెళుతున్న ఈరెన అప్పల్నాయుడు స్వామి ని కలిసి, తాము చింతపల్లి స్టేషన్ మీద దాడి చేయబోతున్న విషయం చెప్పాడు రాజు. అదిరిపడ్డ ఆ అప్పల్నాయుడు ఎదురు చెప్పలేక మెల్లగా జారుకున్నాడు. అతనెవరో కాదు చింతపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్.మధ్యాహ్నం మూడు గంటల సమయం, సుమారు మూడొందల మంది కొండదళం, చేతుల్లో విల్లమ్ములు, కొడవళ్ళు, ఈటెలు, బరిసెలు, నాటు తుపాకులు లతో చుట్టు ముట్టింది కొండమీది పోలీస్ స్టేషన్ ని. కాపలా ఉన్న పోలీస్ లని స్థంభానికి కట్టేశారు. స్టేషన్ లోని కుర్చీ లో కూర్చొన్న రాజు, దొరికిన తుపాకుల్నీ, తూటాలనీ, బాయినెట్లనీ అక్కడికక్కడే సహచరులకి పంచేశాడు.

స్టేషన్ డైరీ లొ ఉత్తరం రాసి సంతకం చేశాడు.

"అల్లూరి శ్రీరామరాజు అను నేను  నా సహచరులతో ఈ పోలీస్ స్టేషన్ ని ముట్టడించి, సెంట్రీని ఆయుధాగారం గది తాళాలు అడిగాను. తాళాలు ఇవ్వడానికి అతను అంగీకరించలేదు. స్థంభానికి కట్టి వేసి తాళాలు తీసుకున్నాను. ఆయుధాలు సేకరించబడినాయి."

-- అల్లూరి శ్రీ రామరాజు [సంతకం]

పోలీసుకు కనిపిస్తే కాళ్ళు తడుపుకునే కొండదళం, వాళ్ల కేంద్రం మీదనే దాడి చేసింది. కొడతానని ముందే చెప్పి, గురి తప్పకుండా  ప్రధాన పోలీస్ కేంద్రాన్ని కొట్టింది. విజయానందం తో బయటకొచ్చారు దళ సభ్యులు. ఆర్తనాదాలకే అలవాటు పడ్డ వారి చేత ఉత్సాహం పెల్లుబికేటట్టుగా, మొదటిసారిగా విజయ నినాదాలు చేయించాడు రామరాజు.

"గాంధీజీ కీ "


"జై...."


"వందేమాతరం"


"మనదే రాజ్యం"


మన్యం గ్రామాలు తిరుగుతూ దారిలో కనిపించిన పోలీసుల దగ్గర ఆయుధాలని కూడా స్వాధీనం చేసుకున్నారు. పర్యటిస్తున్న ప్రతీ గ్రామం నుండీ ఉత్సాహవంతులైన వీరులు ఉద్యమం లోకి వచ్చి చేరారు.
కృష్ణదేవీ పేట చేరుకుంది కొండదళం. సూచన గా గాల్లోకి కాల్పులు జరిగాయ్.

కొండదళం ఊళ్ళోకి చేరుకునే విషయం ముందే తెలిసిన ఊరి ప్రజలందరూ ఇళ్లకి తాళాలేసుకున్నారు, రాజు కి అత్యంత సన్నిహితుడయిన భాస్కరనాయుడు గారితో సహా. పంచాయితీ పాలన కి ఉపాధ్యక్షుడిగా ఉన్నా గానీ, రామరాజు ఉద్యమం బాట పట్టడం ఆయనకి కలవరం కలిగించింది. తెల్లవారితో విరోధం తన వల్ల కాదని తన నిస్సహాయతని చెప్పేశారు భాస్కర నాయుడు గారు.

ఇందుకు కారణం లేకపోలేదు. ఫితూరీ (ఉద్యమాలు) వారికి కొత్త కాదు. అవన్నీ మరిచిపోవాల్సిన పీడకలలు. గర్రమండ మంగరాజు ఫితూరీ, గొలుగోండ లో శాంతభూపతి, ద్వారబంధాల చంద్రారెడ్డి పితూరీ, రేకపల్లి లో అంబుల రెడ్డి ఫితూరీ.. ఇవన్నీ రామరాజు కంటే ముందు మొదలయ్యి హింసా, రక్తపాతాలతో నిండిపోయి, అణగారిపోయిన, అణగదొక్కబడిన ఉద్యమాలు.

 క్రమశిక్షణ లేని అనుచరులు, శిక్షణ లేని సహచరుల తో కూడిన లక్ష్యం లేని ఉద్యమాలు సామాన్య ప్రజల మీద పడి దోచుకున్నాయి. ఉద్యమం మొదలెట్టిన నాయకులు ఉన్నతాశయాల తో ఉన్నాగానీ, ఈ కారణాల వల్ల బందిపోట్లుగా చిత్రించబడి ఉరికొయ్యలకి వేళ్ళాడారు.

ఇది దొరతనం మీద వ్యతిరేకత తో చేసే స్వాతంత్ర్య పోరాటం తప్ప, అల్ప ప్రయోజనాలకోసం చేసే ఉద్యమం కాదనీ, "ఇది కృష్ణదేవి పేట నమ్మిన శ్రీ రామరాజు మాట" అని ఊరంతా చాటింపు వేయించారు రాజు. తమందరికీ రెండు పూట్లకి సరిపడ భోజన సామగ్రిని మాత్రం ఇవ్వవలసిందిగా కోరారు.

జనం కదిలొచ్చారు. గుమిగూడారు. అంతకు ముందు తెల్లని పంచ అడ్డుకట్ట వేసి, యోగిలా కనిపించే శ్రీ రామరాజు ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్క, మెడలో తూటాల దండ తో(పోలీస్ స్టేషన్ లో స్వాధీనం చేసుకున్నవి), చెప్పులు లేని కాళ్ల తో ఎవరో వాల్చిన మంచం మీద కూర్చొన్నారు.  యుద్ధం లో అలసి, సేద తీరుతున్న సైనికుడి లా కనిపిస్తున్నారాయన. చుట్టూ ప్రధాన అనుచరులు. ఆ వెనక వేరు వేరు విచిత్ర వస్త్ర ధారణలతో, రక రకాల తెగలకి చెందిన కొండ జాతి వీరులు.

పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశిస్తే కాల్చేస్తామని చెప్పారు కృష్ణదేవీ పేట స్టేషన్ సిబ్బంది. అలా అయితే తలపడటానికి సిద్ధంగా ఉండమని బెదిరించి, మనుషుల్ని పంపి ఆయుధాలని స్వాధీన పరుచుకున్నారు రాజు.

ఆ మరుసటి రోజే "రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్" మీద దాడి జరిపింది రామరాజు దళం. అప్పటికే పోలీసులు అప్రమప్తం అవడంతో పోలీసుల కాల్పులు స్వాగతం చెప్పాయ్. 36 రౌండ్ల కాల్పుల తర్వాత, పోలీసులు లొంగిపోవటంతో, ఆయుధాలు స్వాధీనమయ్యాయి. అంతే కాదు గతం లో జరిగిన ద్వారబంధాల చంద్రయ్య ఫితూరీ లో పాల్గిన్నందుకు అరెస్ట్ కాబడీ, విచారణకి నోచుకోకుండా స్టేషన్ లో మగ్గుతున్న మరొక ప్రముఖ మన్యం వీరుడు "మొట్టడం వీరయ్య దొర" ని చెర నుండి విడిపించాడు రాజు.

1922,ఆగస్ట్ 28 న ఆంధ్రపత్రిక లో ఈ దాడిని గురించిన కధనం ప్రచురించబడింది.

{ http://www.pressacademyarchives.ap.nic.in  ఈ లింక్ లో తేదీని, ఆంధ్రపత్రిక ని సెలెక్ట్ చేసుకొని పై కధనాన్ని చూడవచ్చు.లేక ఇక్కడ క్లిక్ చేసి ఆ ఆర్టికల్ ని చదవ వచ్చు.}

1922, august 28 నా రాజమండ్రి నుండి వెలువడే కాంగ్రెస్ పత్రిక లోనూ , 1922 సెప్టేంబరు 2 న మచిలీపట్నం నుంచి కృష్ణపత్రిక లోనూ "ఒక యువ క్షత్రియ నాయకుడు కోయతెగ ప్రజల్లో సహాయ నిరాకరణని వ్యాప్తి చేస్తూ స్వాతంత్ర పోరాటాన్ని చేస్తున్నాడని" కధనాలు వెలువడ్డాయి.ఆ రోజు వరకూ మన్యం గ్రామాల్లో మాత్రమే సుపరిచితమైన "అల్లూరి శ్రీ రామరాజు" పేరు మన్యాన్ని దాటి బయటకి వచ్చింది.
రామరాజు ఎవరో, అతని సామర్ధ్యం ఏంటో, మైదాన ప్రాంతం లోని సాధారణ ప్రజలకి తెలిసింది. దొరతనానికి చెంప చరిచిన అనుభవమయ్యింది.

నర్సీపట్నం దగ్గర తిరుగు బాటు జరిగిందనీ, ఆయుధాలని దోచుకున్నారనీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదనీ, గతం లో కొంతకాలం ఇంటరన్ అయ్యి, నేపాల్ యాత్రకి అనుమతి పొందిన రామరాజు దీనికి నాయకుడనీ, కారణాలు తెలియలేదనీ మద్రాస్ లోని ప్రభుత్వ కార్యదర్శి R.A గ్రాహం కు టెలిగ్రాం వెళ్ళింది. తిరుగుబాటు అణచడానికి స్పెషల్ ఆఫీసర్ల నేతృత్వం లో ,అధిక సంఖ్యలో పోలీస్ దళాలని మన్యం వైపు పంపించడానికి ఏర్పాట్లు జరిగాయి...!

మరి.... ఆ అదనపు పోలీస్ దళాలని రాజదండు తట్టుకోగలిగిందా??

Monday, November 5, 2012

ఇది కధ కాదు 2 : అగ్గి "రాజు"కుంది
(మొదటి భాగం ఇక్కడ చూడండి).
 
"న్యం లో గిరిజన పోరాటాలని రగిలించి స్వాతంత్ర పోరాట చైతన్యాన్ని దీప్తివంతం చేసిన ఇరవై ఏడేళ్ల బ్రహ్మచారి.

తాను ముముక్షువు గా జీవిస్తూనే, దేశమాత దాస్య శృంఖలాలను తెంచి, స్వాతంత్ర సాధన కొరకు మన్యసీమని వేదికాగా చేసుకొని మహోద్యమం నడిపిన దేశ భక్తుడు.
అల్లూరి సీతారామ రాజు గా పిలవబడిన శ్రీ రామరాజు.

శ్రీ వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకి 1897 జూలై 4 న పాండ్రంగి లో జన్మించిన రామరాజు పసిప్రాయం మోగల్లులో గడించింది. రాజమండ్రీ,రామచంద్రాపురం,విశాఖపట్నం,నరసాపురం, కాకినాడ లలో అతుకుల బొంతగా సాగింది రామరాజు చదువు.అయితే ఆయన చదువుకున్న ప్రతీ చోటా వినిపించిన మాట "వందేమాతరం". కాకినాడలో చదివేటపుడు తన ఎదురుగా "వందేమాతరం" అన్నందుకు "కృష్ణారావు" అనే విద్యార్ధిని, బ్రిటిష్ అధికారి "కెప్టెన్ కెంప్" కొట్టి చంపేసిన ఘటన గురించి తెలుసుకున్నాడు. ఒక నిండు గర్భిణి ని తన్ని, ఆమె మరణానికి కారణమైన ఒక బ్రిటిష్ పోలీసు పైశాచికత్వాన్ని గురించి విన్నాడు."వందేమాతరం" అని అరిస్తే చదువులు ఆగిపోతున్నాయ్. ఉద్యోగాలు ఊడిపోతున్నాయ్.ఇవన్నీ రామరాజు లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆలోచనలు నాటాయి. మొదటి నుండీ బ్రిటిష్ పాలన, వాళ్ల సంస్కృతి, చదువుల పట్ల అయిష్టతని పెంచుకున్న రామరాజు "తుని" లో సంస్కృతాంధ్రాలూ,జ్యోతీష్యశాస్త్రం, యోగవిద్య, గుర్రపుస్వారీ, విలువిద్య అభ్యసించాడు.(విద్యార్ధి గా ఉన్నప్పుడు అల్లూరి శ్రీరామరాజు)

విద్యార్ధి దశ నుండీ "వందేమాతరం" అన్న మాటనీ, వెనుక ఉన్న ఉద్దేశ్యాన్నీ అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మన్యం లోని పరిస్థితులు ఆయన అన్వేషణ కి ఆఖరి మజిలీ అయ్యాయి.

మన్యం గ్రామాల్లోని ప్రజలూ, ముఖ్యంగా కొండజాతి ప్రజలూ అడవినే నమ్ముకున్న వాళ్ళు. తినే తిండీ, వాడే మందూ, ఉండే చోటు, దున్నే భూమీ అన్నీ అడవి తల్లి ప్రసాదించినవే. అడవి తప్ప వారికి వేరే ప్రపంచం తెలీదు.
 రాజులు రాజ్యం చేసినా, జమీందార్లు మారినా, అడవిని, ఆ అమాయక ప్రజలకి దూరం చెయ్యాలనీ, ఆంక్షలు పెట్టాలనీ, వాళ్ల హక్కులని ప్రశ్నించాలనీ ఎవ్వరూ ప్రయత్నం చెయ్యలేదు. ఆ ఆలోచన మొట్టమొదట చేసింది బ్రిటిష్ వాడే. అటవీ చట్టాలు చేశారు. అడవిని సర్వే చేశారు.  ముక్కలు గా విడగొట్టారు. ఆ ముక్కలపై సుంకాలు విధించారు. ఒక్కో భూభాగానికీ ఒక ముఠాదారీ వ్యవస్థని ఏర్పాటు చేశారు. తరతరాలు గా తిండి గింజలు పండిస్తున్న తన భూమిని దున్నుతున్నందుకు ప్రభుత్వానికి పన్ను కట్టాలి. కొండల్నీ, అడవులనీ చదును చేసి పంటల్ని పండించే "పోడు వ్యవసాయం" చెయ్యకూడదు. అడవిలో చెట్టు కొట్టకూడదు. రిజర్వ్డ్ ఫారెస్ట్ లోకి ఏ గిరిపుత్రుడూ ప్రవేశించకూడదు. పశువులని మేపకూడదు. తేనే, మందులూ, మాంసం వంటి ఎటువంటి వస్తువ ప్రభుత్వ అనుమతి లేకుండా, పన్ను కట్టకుండా అడవి నుండి  తెచ్చుకోకూడదు. అంటే అడవిలోనే పుట్టీ, పెరిగీ, ఆ మట్టి లోనే కలిసిపోయే అడవి బిడ్డలకి ప్రకృతి సంపద మీద ఉన్న హక్కు లాక్కోబడింది.  ఈ చట్టాలన్నీ కఠినంగా అమలు చెయ్యడం మొదలెట్టింది ప్రభుత్వం. కొత్తగా వచ్చిన ఈ చట్టాలు గిరిజనుల చేత ఆకలి కేకలు పెట్టించాయ్.

ఇలా అయితే ప్రజలెలా బ్రతకాలీ? దీనికి సమాధానం గా తెల్లవాళ్ల దగ్గర గొప్ప ఆలోచన ఉంది. మన సంపదని మనం అనుభవించకూడదు గానీ వాళ్ళు దోచుకోవచ్చు. అది తరలించడానికి  రోడ్లు కావాలి. అవి కావాలంటే వెట్టి చాకిరీ చెయ్యడానికి మనుషులు కావాలి. రోడ్లు వేసే పనిలో చేరి కూలి తీసుకొని బతకాలి. అయితే అది పని చేసేవాడి ఇష్టం కాదు. బలవంతం. శ్రోపిడీ. "రాను.. చెయ్యను" అని చెప్పే ధైర్యం లేదు. "చెయ్యలేను" అని చెప్పే అవకాశం లేదు. ఎదిరించిన వాడికి దారుణమయిన శిక్షలు.ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా ఒంటిని చీరేసే కొరడా దెబ్బలు.

ఇవన్నీ ప్రభుత్వ ఆజ్ఞలకి, చట్టాలకీ అనుగుణంగా జరుగుతున్న అరాచకాలు. ప్రజలు భరించారు. అయితే అధికారం చేతిలో ఉన్న తహశీల్దారులు, అడిగే వాడు లేడని ఎగిరే బ్రిటిష్ అధికారులు,పోలీసులు, మరిన్ని  అరాచకాలకి పాల్పడ్డారు. వారిలో ముఖ్యుడు, పరమ క్రూరుడూ అయిన ఆ గూడెం డిప్యూటీ తహశీల్దార్ మరియూ రోడ్ కాంట్రాక్టర్ అయిన "బాస్టియన్". బ్రిటిష్ ప్రభుత్వం కూలీ 6 అణాలుగా నిర్ణయిస్తే, 2 అణాలు మొహాన కొట్టి పొమ్మనే వాడు. "ఇది అన్యాయం" అని ఎదురుతిరిగిన మగాళ్లని తన గుర్రానికి కట్టి చనిపోయిన జంతువులని లాగినట్టూ లాగీ, తలక్రిందులుగా వ్రేలాడదీసి, ఆసనం లో సీమ మిరపకాయల ముద్ద కూరుతున్న దారుణాలు. ఆడవాళ్ల వక్షాలపై మిరపకాయల ముద్ద రాస్తున్న ఘోరాలు.  చెట్లకింద పడుకోబెట్టిన చంటిపిల్లలు ఆకలితో ఏడుస్తుంటే వాళ్లకి పాలిచ్చే అవకాశం కూడా పనిచేసే ఆ తల్లులకి ఉండేది కాదు. మన్యం జాతి స్త్రీల దగ్గర వ్యభిచారం కుదరదు. కచ్చితమైన కట్టుబాట్లు ఉంటాయ్ వారికి. కానీ అది ఈ రాక్షసులకి అర్ధం కాదు. వాళ్ళ దృష్టిలో కొండజాతి వాళ్ళంటే అనాగరికులు. పద్దతీ పాడూ లేని వాళ్ళు. వాళ్లని ఎంత హీనంగా అయినా చూడొచ్చు. ఏమయినా చెయ్యొచ్చు. ఒక కత్తికున్న పదును ని ఒక ఇండియన్ తలని మొండెం నుండి ఒక్క వేటుతో దూరం చెయ్యడం ద్వారా దృఢపరచుకున్నారు. తమ భుజబలాన్ని ఒక పసికందు కాళ్ళు పట్టుకొని చీల్చెయ్యడం ద్వారా బేరీజు వేసుకున్నారు. ఇలాంటి దారుణాలు ఎన్నో...ఎన్నెన్నో. పోలీసులు వస్తున్నారంటే మగవాళ్లు ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటే, స్త్రీలు మానరక్షణ కోసం పిచ్చిదాని లాగానో, రోగిష్టి లాగానో నటించాల్సి వస్తున్న భయంకరమైన రోజులు.  [ఈ ఘటనలన్నిటికీ ప్రత్యక్ష మూగ సాక్షి అయిన అప్పటి ప్రభుత్వ వైద్యుడు అయిన తేతలి సత్యనారాయణ గారు తన డైరీ లో రాసుకొన్నారు]

అయితే ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా ఎవ్వరూ తిరగబడ లేదా?? అనే ప్రశ్న సహజం.
ఎందుకు లేదూ? కొడితే పడి ఉండడానికి వాళ్ళు గర్జించడం మరిచిపోయిన సర్కస్ సింహాలు కాదు. అడవి బిడ్డలు. ప్రాణం మీదకి వస్తే పిల్లి కూడా పులవుతుంది. గురిచూసి కొట్టడం, వేటాడటం,కౄర జంతువుల మధ్య తిరగడం,వాళ్ల జీవితం లో ఒక భాగం. తిరుగుబాట్లు జరిగాయ్. అయితే అవన్నీ అత్యంత కిరాతకం గా అణచివేయబడ్డాయి.అన్నీ ఉద్యమం పేరుతో ప్రజలకి కొత్తకష్టాలు తెచ్చేవే గానీ, ధైర్యాన్నిచ్చేవి కావు. వాటికి కారణాలు అనేకం. 

"నా వాళ్ళు" అనుకున్న వాళ్లకి అన్యాయం జరుగుతుంటే జాలిపడే వాళ్ళూ, బాధ పడేవాళ్ళూ చాలామంది ఉంటారు.
కోపంతో రగిలిపోయి ఆ అన్యాయాన్ని ఆపాలని అనుకునే ఆవేశపరులు కొంతమందే ఉంటారు.
ఆ కొంతమందినీ కూడగట్టి ఒక శక్తిగా నిలబెట్టి దుర్మార్గులను మట్టుబెట్టే వాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. చరిత్రలో నిలిచిపోతాడు.
ఆ ఒక్కడూ ఇప్పుడు కావాలి.
ఆ అడవి బిడ్డల ఆవేశాన్ని ఆశయ సాధన కోసం ఉపయోగించగల తెలివి కావాలి.
వారి లోపాలని సరి చేయగల శక్తి కావాలి.
బలమైన శత్రువు ని ఎదుర్కొనే యుక్తి కావాలి.
వారి ఆక్రోశాన్ని అర్ధం చేసుకోగల ప్రతినిధి కావాలి.
మన్యం మట్టిని శిరస్సున ధరించగల మనిషి కావాలి.
మన్య గ్రామాలన్నిటినీ ఒక త్రాటి పైకి తేగల నేత కావాలి.
నడిపించగల నాయకుడు కావాలి.
బ్రిటిష్ వారి ముఠాదారీ విధానం తో వీధిన పడ్డ కంకిపాటీ బాలయ్య పడాలు, గాం గంటందొర, గాం మల్లుదొర, బొంకుల మోదిగాడు, గోకిరి ఎఱేసు మొదలైన గిరిజన నాయకులు, కొండజనాన్ని కాపాడగల ఆ నాయకుడు "శ్రీ రామరాజు" మాత్రమే అని నమ్మారు. ఈ పరిస్థితులన్నిటినీ రామరాజు కి ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉన్నారు.  భారత దేశ మంతా గాంధీజీ సహాయనిరాకరణోద్యమం తీవ్రతరమౌతున్న ఆ రోజుల్లో అదే సహాయనిరాకరణని మన్యం లో చేయడానికి  రామరాజు సంకల్పించారు. ఒక మహా ఉద్యమానికి బీజం పడింది. 

కుల వ్యవస్థలూ, ఉన్నవాడు లేని వాడిని దోచుకోడాలూ, నీచంగా చూడటాలూ,అగ్రకులం, నిమ్నకులం మొదలైనవి ఎక్కడయినా ఉండేవే. మన్యం దానికి మినహాయింపు కాదు. మన్యం ప్రజల్లో బగతలు, కొండదొర,కొండకాపు,గదబలు, వాల్మీకులూ, ఖోదులు మొదలైన కులాలూ, వాటి మధ్య పేద, ధనిక అంతరాలు, అంటరానితనాలూ ఉన్నాయ్. ఎన్ని అంతరాలున్నా అందరికీ ఉన్న ఒక ఉమ్మడి వ్యసనం -తాగుడు. 
జీలుగ కల్లు, తాటికల్లు, మద్యాలకి అంతులేదు అక్కడ. ఎవరికి ఎక్కువ "జీలుగ చెట్లు" ఉంటే వారే ధనవంతులక్కడ. 
ఐకమత్యం లేని ప్రతిఘటన ఎంత సేపు నిలబడుతుందీ? వ్యసనాల్లో మునిగిన వారు గొప్ప ఆశయాన్ని ఎలా సాధించగలరు??  
రామరాజు మొదట తన దృష్టి కేంద్రీకరించింది ఈ విషయాల మీదనే.
ఒక శక్తివంతమైన నిరసన ని తెలియజెయ్యాలంటే ముందు ఆ అంతరాలని తొలగించాలి.  ఈ దుర్వ్యసనాలని దూరం చెయ్యాలి.  
శ్రీ రామరాజు జీలుగ చెట్లని కొట్టెయ్యమనీ, గిరిజన తెగల మధ్య గల అంతరాలని మరిచిపొమ్మనీ, డబ్బు ఇవ్వని పని కోసం ఎవ్వరి దగ్గరకీ వెళ్ళొద్దనీ, పోలీసులని కలసి కట్టుగా ఎదిరించమనీ ఉద్భోదించాడు.
తన అధ్యక్షతన "పంచాయితీ పాలన" ని  ప్రవేశ పెట్టాడు. ఏ తగాదా అయినా ప్రభుత్వం కోర్టులో కాకుండా పంచాయితీ లోనే పరిష్కరించుకోవాలన్నాడు.

ఒక్క మనిషి చెప్పిన మాట విని అన్ని గ్రామాల ప్రజలు తరతరాలుగా తమలో జీర్ణించుకుపోయిన అలవాట్లనీ, ఆచారాలనీ,అంతరాలనీ వదిలేశారా??? అతని రూపం లో అంతటి ఆకర్షణ ఉందా? అతని మాటల్లో అంతటి శక్తి ఉందా? అతని వ్యక్తిత్వం లో అంతటి గొప్పతనం ఉందా? అని అడిగితే.....

అవును... శ్రీ రామరాజు అంటే.. సాక్షాత్తూ భద్రాద్రి రాముడి అవతారం గిరిజన ప్రజల్లో.. ఆ మాటకి తిరుగులేదు.
జీలుగ చెట్లు కూలుతున్నాయ్..
గొడవలు పంచాయితీకే వస్తున్నాయ్...
186 గ్రామాలు ఒక్కటయ్యాయ్... 
పోలీసుల కి ఎదురు చెప్తూ గొంతెత్తుతున్నాయ్...

అల్లూరి శ్రీ రామరాజు నేతృత్వం లో ఉద్యమం లేచిందన్న వార్త గుప్పుమంది. ప్రభుత్వానికి ఉప్పందింది. కృష్ణదేవీ పేటలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహారాలు నడుపుతున్నాడన్న కారణం గా 1922 జనవరి 29 న పోలీస్ కమిషినర్ "స్వెయిన్" రాజుని అదుపు లోకి తీసుకొని విచారణ జరిపాడు.తాను అధ్యాత్మిక విషయాలు మాత్రమే బోధిస్తున్నాననీ, ప్రజల ఆరోగ్యం కోసం మాత్రమే కల్లు/మద్యం మానివేయమన్నాననీ, సహాయనిరాకరణ గురించి ఉద్భోధించలేదనీ రామరాజు చెప్పినాగానీ, పోలీసులు ఆయన్ని కస్టడీ లోకి తీసుకొని నర్సీపట్నం లో ఉంచారు. 16 రోజుల తర్వాత రామరాజు ని విడుదల చేసినా, అతని ప్రతీ కదలిక మీదా పోలీసులు కన్నేసుంచారు.
రోజూ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి రావడం రాజు దిన చర్యలో భాగమయ్యింది. పోలీసులతో గౌరవంగా వ్యవహరించేవాడు. ఎవ్వరితోనూ ఎటువంటి గొడవల్లోనూ కల్పించుకోలేదు. ఈ కారణం తో అతని మీద మంచి రిపోర్ట్ తయారయ్యింది. 
"నేపాల్ ఆధ్యాత్మిక యాత్ర" చెయ్యడానికి వినతి పత్రం సమర్పించి, ప్రభుత్వం నుండి అనుమతి తెచ్చుకున్నాడు. 
తన తల్లినీ, తమ్ముడినీ ఎడ్లబండి మీద నరసాపురం ప్రయాణం చేయించి, తాను గుర్రం మీద అనుసరిస్తూ కృష్ణదేవీపేట పొలిమేరలు స్వయం గా దాటించాడు.

మన్యం ప్రజలు తమ ఆశాజ్యోతి అనుకున్న శ్రీరామరాజు ఇంత పిరికితనం గా ఎందుకు మసలుతున్నాడు?
పోలీసులకి బెదిరి, తనని నమ్మిన జనాన్ని వదిలి నేపాల్ పారిపోతున్నాడా?
అసలతని ఆలోచన ఏంటీ?? వ్యూహం ఏంటీ? 

సింహం వెనక్కి అడుగు వేసేది పంజా విసరడానికే.....!


 (అల్లూరి శ్రీరామరాజు గారి ఒరిజినల్ ఫోటో ఆధారంగా గీసిన పెయింటింగ్)