Sunday, August 30, 2015

ఆకర్ష... ఆకర్ష..!!

ది 2012..!! 
యుగాంతం అయ్యేలోపు పెళ్ళి చేసేస్కోవాలని పాకెట్లో ప్రింటవుట్ తీసిన ప్రొఫైల్ పెట్టుకొని చేతికి  తాయెత్తులు, కాలికి కే.పీ.జే వారి కడియాలూ కట్టుకొని తిరుగుతున్నా వర్కౌటవ్వని దరిద్రపు రోజులు. ఆ దరిద్రానికి తోడు శూన్యమాసం దాపురించడం తో ఆఫీస్ లో ఆన్సైట్ ట్రిప్ (ఎప్పటిలాగే సౌత్ కొరియా) కి ఓకే చెప్పేశాను. నేనూ, సుధాకర్ గాడూ వారం ఐదు రోజులూ ఆఫీసు లో కొట్టించుకుంటూ, శనాదివారాలు దేశం మీద పడితిరుగుతా కిమ్చీలు
చప్పరిస్తూ,సోజూ గుటకలేస్తా కొరియాని ఉద్దరిస్తూ ఉండేటోళ్ళం.

ఒకానొక ఆదివారం అదేదో దిక్కుమాలిన షాపింగ్ కాంప్లెక్స్ నుండి బయటకొస్తుంటే...మమ్మల్నే టార్గెట్ చేస్తూ ఇద్దరు కొరియన్ అమ్మాయిలూ, ఒక అంకులూ మేం నడుస్తున్న వైపే మా దారికి అడ్డంగా రావడం మొదలెట్టారు. వాళ్ళు మా వైపు ఎందుకొస్తున్నారో తెలుసు కాబట్టీ మేం నడకలో వేగాన్ని పెంచాం.

"నమస్కార్..ఆప్ కహా సే ఆయా?" అని అని స్వచ్చమైన హిందీ వినిపించడం తో ఆశ్చర్యంతో ఆగిపోయాం.
"నీ కక్కుర్తి తగలడ... అమ్మాయి కనిపిస్తే చాలు... నోరెళ్ళ బట్టి చూస్తా నుంచుండి పోవటమే?" అని అంతరాత్మ ఆక్రోశించింది. "నోర్ముయ్ ఎదవకానా...ఏనాడైనా ఏ పిల్లైనా పిలిచి నీతో మాటాడిందా ?? పుట్టి బుద్దెరిగాక ఒక అందమైన అమ్మాయి పిలుస్తుంటే ఆ మాత్రం స్పందించమా? పైగా కరువులో కటకటలాడతా ఉన్నాం" అని అంతరాత్మని కోప్పడీసేన్నేను.

"మేరా నామ్ ప్రియా.. ఆప్ కహా సే ఆయా???" ఈ సారి ఇంకా తియ్యగా అడిగింది.
"ఇండియా....!!"
"ఆఆఆఆఆఆఆఆఆ...యేయేయేఏఏఏఏఏఏఏఏఏఏ" అని కొరియన్ స్టైల్ లో ఆనందపడిపోయి చప్పట్లు కొట్టేసి ఆ బ్యాచ్ మొత్తం మమ్మల్ని చుట్టు ముట్టేశారు... (దానర్ధమ్... ఆ..... దొంగల్లారా.... దొరికేశారూఊఊఊఊఊఊ)

"హిందీ వచ్చా మీకూ?? "( ఆ పిల్ల హిందీ లోనే అడిగింది.. కానీ నాకు హిందీఎలర్జీ కదా ...హోమియోపతి వాడినా తగ్గలేదు. అందుకని తెలుగులో చెప్తున్నా)

నేనుః ఆ.... ఇదర్ ఆయియే..... యే మే రాజహా...యే మేరా ఘర్ మేరా ఆశియా... (జై పవన్ కళ్యాణ్)

కొ.అమ్మాయి నా వైపు అదోరకంగా చూసింది. నేను మా సుధాకర్ గాడిని చూపించి "మా ఓడు హిందీ కుమ్మేస్తాడు" అని చెప్పి  "భలే బుక్ చేశాను కదా" అని లుక్కిచ్చా. ఫోకస్ వాడిమీదకి పోయి డిస్కషన్ మొదలైంది.

ఇదేంటీ ఈ కొరియా పిల్ల హిందీ లో పుట్టి పెరిగినట్టు ఇలా ఇరగదీసేస్తుందీ.. అన్న ఆశ్చర్యం లోంచి మేం తేరుకునే లోపే... "మీరు రోజూ భగవంతుడు కి ప్రార్ధన చేస్తారా?" అని అసలు పాయింట్ కి వచ్చేసింది.
"నాకు దేవుడి మీద నమ్మకం లేదు.. ఇదిగో ఈడు రోజూ చేస్తాడు" అని నన్ను చూపించి ప్రతీకారమ్ తీర్చుకున్నాడు సుధాకర్ గాడు.
ఇక మొదలైంది. మేమ్ దేవుని సేవకులం, మీ ఫోన్ నంబర్ ఇవ్వండీ, అడ్రెస్ ఇవ్వండీ, ఈ పాడు ప్రపంచానికి పోయే కాలం వచ్చేస్తుంది.  కానీ మన కోసం పెద్ద పడవ వస్తాదీ, మనమందరం మీటవుదాం... వగైరా వగైరా...చాలా చెప్పుకుంటా పోతుంది.
కొ.అమ్మాయి మరీ అందంగా ఉండి ముద్దు ముద్దుగా మాటాడ్డం వల్ల అనుకుంటా...సూటిగా సుత్తి తో కొడుతున్నా సుతిమెత్త గా ఉండటం తో నేను తలూపడం ఆపలేదు.
"ఏంట్రా ఈళ్ళ గోలా?" అన్నాడు సుధాకరు.
"తొందర్లో ప్రళయం వస్తాదంటరా.... వీళ్ళు చెప్పినట్టూ వింటే వీళ్ళ షిప్ ఎక్కే చాన్స్ తో పాటూ బెర్త్ కన్ఫర్మ్ చేస్తారంట" అన్నాన్నేను. 
"అది ఎక్కే షిప్పు కాదురా... ముంచేసే టైటానిక్ షిప్" అనేసి సుధాకర్ గాడు చెయ్యట్టుకొని లాక్కుపోతుండగా "మిసెస్ లీ... మేం ఇంట్లో  పొయ్యి మీద పప్పు పెట్టొచ్చాం. అర్జెంట్ గా వెళ్ళీ పోపు పెట్టాలి. మళ్ళీ కలుద్దాం" అని వీడ్కోలు చెప్పాను.
"నా అసలు పేరు నీకెలా తెలుసూ ?" అంది. దానికి సమాధానం చెప్తే వినిపించేంత దూరం లో లేకపోవడం తో "మీ దేశం లో ఉన్నవే రెండు పేర్లు... 1. మిస్. లీ, 2. Mr. kim. ఓ రాయి వేస్తే తగిలింది" అని మనసులో అనుకుని ఇచ్చిన pamphlet చేత్తో పట్టుకొని వచ్చేశాను.

ఆ రకంగా అదృష్టం కొద్దీ  ప్రియ నీ, రాని ప్రళయం లో లేని పడవ ప్రయాణాన్నీ మిస్సయ్యాను.
***************************************************************************************************************************************
2012 చివర్లో ప్రళయం రాలేదు గానీ 2013 మధ్య  లో నాకు పెళ్ళయ్యింది. ఆ రెండూ ఒకటే అని ఆ తర్వాత తెలిసింది.
నాకు ఎన్ని రకాల వంటలొచ్చో, నేనెంత గొప్ప వంటగాడినో  సైద్దాంతికంగానూ, ప్రయోగాత్మకం గానూ  మా ఆవిడకి నిరూపిస్తూ నా గొయ్యి నేనే తవ్వుకుంటున్న అమాయకపు రోజులవి.

ఓ రోజు మా ఆవిడకి 31వ వ చెప్పుల జత కొనడానికి  సెంట్రల్ మాల్ కి వెళ్ళాను ఆవిడని వెంటేసుకొని. ఎంట్రన్స్ లో చిన్న ఫార్మ్ ఇచ్చి  మీ డీటెయిల్స్ ఫిల్ చెయ్యండి సార్.. లక్కీ డ్రా తీస్తాం అని మొహమాట పెట్టెయ్యడం తో చేసిచ్చాను. నా అదృష్టం ఏ లెక్క లో ఉంటాదో నాతో పాటూ మీ అందరికీ తెలుసు. కాబట్టీ నేను దానిగురించి అక్కడే మరిచిపోయాను. కానీ ఒక వారం తర్వాత "మీరు లక్కీ డ్రా లో విన్ అయ్యారు.. యు ఆర్ ది లక్కీయెస్ట్ కపుల్.. రేపు సాయత్రం మీరు తప్పకుండా జంటగా వచ్చి గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకోండి.. గుర్తుంచుకోండి జంటగానే రావాలి" అని
ఫోనొచ్చింది. ఎత్తున కట్టిన గంటని ఎగిరికొట్టినప్పుడు కలిగే ఆనందం తో నేను మా ఆవిడ వైపు ఆరాధన గా చూశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చే లాటరీ టికెట్ కొని రిజల్ట్ వచ్చే ముందురోజు పారేసుకొనే నా జాతకానికి మంచిరోజులొచ్చాయని మూగగా పొంగిపోయాను.
సాయంత్రం అరగంట ముందే ఆఫీసు నుండి బయలుదేరి చెప్పిన అడ్రెస్ కి వెళ్ళాము. ఎంట్రన్స్ లోసెక్యూరిటీ మీసాలాయన మా వైపు జాలిగా చూశాడు. ఎప్పుడూ చరణ్ బాబు లా ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండే సెక్యూరిటీ ఆయన కళ్ళల్లో కరుణరసం కనిపిస్తుందేంటా అని ఆలోచిస్తూ
లోపలకి వెళ్ళాను.  నాకు దూరంగా ఎక్కడో... "మే.......మే....." అని లీలగా వినిపిస్తుంది.
రిసెప్షన్ లో "మేము... లక్కీ కపుల్. ఎక్కడ మా గిఫ్ట్స్?" అని ముఖం దాకంత చేస్కొని అడిగాను. ఒక హాల్ లోకి దారి చూపించింది. అందులో ఓ పాతిక టేబుల్స్.. ప్రతి టేబుల్ కి ఒక అభాగ్యపు జంట మరియు వారి పాలిట ఒక నక్షత్రుకుడు కూర్చొని ఉన్నారు. చెత్తకుప్పల దగ్గర ఈగల రొదలా గోల గోల గా ఉంది అంతా. మరునిమిషం లో మేమ్ కూడా మా పాలిట రక్తకింకరుడి తో ఒక టెబుల్ దగ్గర కూర్చున్నాం. వాడు ఏదో వల్లకాడు రిసార్ట్ తాలూక బుక్ ఓపెన్ చేసి..." టెంప్ట్ చేసే టూరిస్ట్ ప్యాకేజీలూ, దానికి మేం కట్టాల్సిన అమౌంట్,వాడిచ్చే ఫెసిలిటీస్, డిస్కౌంట్ల" గురించి
క్లాస్ పీకుతూ మాకు మాటాడే చాన్సివ్వకుండా అల్సేషియన్ కుక్కకి అర్నబ్ గోసామి పూనినట్టూ సోది ఆపకుండా సుత్తి కొట్టడం మొదలెట్టాడు . "సమ్మెట పోటు" కి స్పెల్లింగ్ రాశామంటే అది అతిశయోక్తి కాదు. చెవుల్లోంచి రక్తాలు ఏరులై పారుతుంటే తుడుచుకోడానికి కర్చీఫ్ ఇస్తున్నాడు తప్ప చలించలేదు ఆ చెక్కేసిన పనసకాయ మొహం వాడు. వాడు చెప్పేదానికి ఒప్పుకోక పోతే నేనొక అసమర్ధ పీనాసి భర్త ని అని లోకం కాకులై కూస్తుందనీ,  గోహత్యా పాపం గోరుచుట్టులా చుట్టుకుంటుందనీ, ఆ ఆఫర్ మిస్ అవడం కన్నా ఏ మ్యాగీ నూడుల్సో తిని సచ్చిపోడం బెటరనీ మా బ్రెయిన్ ని రిన్ సబ్బు పెట్టి వాష్ చెయ్యడానికి  వాడి సర్వశక్తులూ ఒడ్డి రాక్షస ప్రయత్నం చేశాడు. థ్రిల్లర్ మంజు రేంజ్ లో ఫైటింగ్ చేసి చంపెయ్యాలన్నంత విరక్తిగా ఉన్నాగానీ ఓపిక లేక ఊరుకుండి పోయాను. రెండు గంటల పాటు "రేయ్" సినిమా చూపించి, చివరాఖరున మా ఆవిడ నోటికి భయపడి ముంబై బజార్ లో టోకున కొన్న Rs99 ల గ్లాసుల సెట్టు గిఫ్ట్ గా ఇచ్చి పంపించాడు.

ఈ లక్కీ డ్రా ఒక అందమైన స్కెచ్ అనీ, మన డీటెయిల్స్ తీసుకొని మనకే స్పాట్ పెట్టి, గిఫ్ట్లు ఆశ చూపెట్టి, మొహమాట పెట్టి ఆపై మట్టి కొడతారనీ తెలుసుకున్నాను.
బెమ్మీగా ఉన్నా, కుటుంబరావునయినా నా సుడికి తిరుగు లేదనీ, మడమతిప్పడం నా ఐరెన్ లెగ్గుకి అలవాటులేని పని అని ఋజువు చేసుకున్నాను.
***************************************************************************************************************************************
రెండు వారాల క్రితం నాకు మా కింది ఫ్లోర్ ఆయన పరిచయం అయ్యాడు. వారం గడిచేసరికి వాళ్ళావిడా, మా ఆవిడా ఫ్రెండ్స్ అయ్యారు.  రాకపోకలు జరిగి మేం కొంచెం క్లోజ్ అయ్యాము.
మూడ్రోజుల కిందట ఆయన మా ఇంటికి వచ్చారు.
అప్పుడూ.........

"బిజీ గా ఉన్నారా రాజ్?"
"అవునండీ...!! ఇప్పటిదాకా  నిద్రపోయి ఇప్పుడే లేచి టీవీ చూస్తూ ఉన్నాను"
"హ్మ్... మీ వైపోళ్ళకి బాగా వెటకారం కదా..!! సరేగానీ రాత్రి 8pm కి ఏమైనా ప్లాన్ ఉందా? లేకా ఇంట్లో ఏమైనా పనులున్నాయా?"
"ఇంట్లోనే ఉంటానండీ...పిచ్చ ఫ్రీ..ఏంటి సంగతి?"
"అలా బయటకి వెళ్ళొద్దామా??"
"సూపర్..ఇంట్లో నాకు బోర్ కొట్టేస్తుంది. నేను రెడీ" (ఏదో హోటల్ కెళ్ళి కుమ్మేసి, పార్సిల్ తెచ్చేస్తే.. ఈరోజుకి వంట-అంట్లు తప్పుతాయి అని నా ఎదవైడియా )
"దెన్..ఫైన్. ఒక "బిజినెస్ మీటింగ్" ఉంది. ఎనిమిదింటికి రెడీగా ఉండండీ. నా కార్ లోనే వెళ్ళొద్దాం."
"బిజినెస్ మీటింగ్?? ఈ పదాన్ని ఎక్కడో.... ఎప్పుడోఓఓఓఓ విన్నట్టుందే..!!" (నా అంతరాత్మ గాడు అలార్మ్ కొట్టి ఏదో చెప్పాలనుకుంటున్నాడు)
"ఎంత కాలం ఈ జాబ్స్ చేస్తాం రాజ్.. వి షుడ్ డూ సమ్ సేఫ్టీ బిజినెస్..దిస్ ఈజ్ ది రైట్ టైమ్..!! నెలకి లక్ష నుండీ 8 లక్షలు సంపాదించే పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయ్ తెలుసా మీకూ?? "

ఈ డైలాగు విని నా అంతరాత్మకి క్లోరోఫాం చుక్కలు ముక్కులో పోసి పడుకోబెట్టేశాను. వాడు నిద్రలోకి పోతూ పోతూ "పోతావ్రా రేయ్... దుం....ప నా...శ...న....మే" అన్నాడు.
ఫిగర్ కొంచెం టెంప్టింగ్ గా ఉంది గానీ ఈ పార్ట్ టైం జాబ్ కీ ఆ లకారాలకీ సింక్ అవ్వట్లేదు అనుకొని "ఇంతకీ ఏంటా మీటింగ్... ఎలా?? హౌ?? " అని అడిగాను.

"Amway గురించి విన్నారా...? Top products in the world... profit for users.. bla bla...jil jil jiga jiga"
ఆ ఐదక్షరాల పదం వినబడగానే నా గుండెల్లో హిమేష్ రెష్మియా విషాద గీతం పాడటం మొదలెట్టాడు. ఫ్రీగా ఉంటానని చెప్పేశా. వస్తానని ఆల్రెడీ కమిట్ అయిపోయాను.. ట్రాఫిక్ జామ్ లో మున్సిపాలిటీ చెత్త లారీ వెనకాల ఇరుక్కున్నట్టూ అయిపోయింది నా పరిస్థితి.
గతి లేని పరిస్థితుల్లో కార్లో ఆయనతో బయలుదేరాను. దార్లో నాలాంటి కాబోయే బిజినెస్మేన్ లని పికప్ చేస్కొని వెళ్ళాం.

అదో పెద్ద... ఆడిటోరియం. కొంతమంది మైకాసురులు మార్కర్ తో స్టాలిన్ సినిమా లో సిరంజీయిలా 'ట్రీ' బొమ్మలేసి మరీ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు.  చాలా మంది తన్నుకొస్తున్న పొట్ట కనిపించకుండా  సూట్లేసుకొని కూర్చున్నారు. 
మరి కొంతమంది టైట్ అయిపోయిన సూట్లేసుకొని లోపల సిక్స్ ప్యాక్ ఉన్నట్టూ కటింగిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు.మధ్య మధ్య లో నాలాంటి ప్రాణులు బిక్క చూపులు చూస్తూ చెప్పింది వింటూ తలాడిస్తుండగా నాలాంటి వాళ్లని తీసుకొచ్చిన వాళ్ళు మేం పారిపోకుండా కాపలా కాస్తున్నారు.

రిటైల్ వ్యాపారులు మనల్ని ఎలా దోచుకుంటున్నారో, Amway ప్రాడక్ట్స్ ఎంత గొప్పగా ఉంటాయో, ఈ బిజినెస్ ఎలా చెయ్యాలో, ఎంత లాభం గడించొచ్చో కుళ్ళి జోకులతో కలిపి చెప్తూ కొందరు మెదడు మేతగాళ్ళు మేయడం మొదలెట్టారు. ఆ తర్వాత ప్లాటినమ్,గోల్డ్, డైమండ్, అనబడు వర్గాల ఆమ్ ప్రజలు...అనగా ఆ సూట్లు వేసుకున్న బాబాయిలూ, మేకప్ వేస్కొని దిగిపోయిన పిన్నిగార్లూ వచ్చి మైక్ పట్టుకొని వంతులు వంతులుగా కనికరం లేకుండా "కసి ప్రేలాపన" తో కుమ్మి వదిలారు.

ఇలాంటి మీటింగ్స్ కి బలయిన నా సాటి అభాగ్యులకి నా సానుభూతి తెలియజేస్తూ, ఇలాంటివాటికి బుక్ అవ్వకుండా తప్పించుకునేదుకు వీలుగా, వాళ్ళు చెప్పే సోదంతా బుల్లెట్ పాయింట్స్ లో ఇస్తున్నాను.

1. Amway చైన్ బిజినెస్ లా కనిపిస్తుంది గానీ ఇది చైన్ బిజినెస్ కాదు. చైన్ బిజినెస్ లో ఇనిషియల్ గా డబ్బులు కట్టాలి. ఇక్కడ అక్కర్లేదు. మీరు మా బెస్ట్ ప్రోడక్ట్స్ కొనండీ. వాడండి. నచ్చక పోతే తిరిగిచ్చెయ్యండీ. మీ డబ్బు మీకు వాపస్. సో ఇక్కడ రిస్క్ లేదు.
మీరు జాయిన్ అవ్వండి. వీలయినంత మందిని జాయిన్ చెయ్యండి.
[టీవీ లో శనిహనుమాన్ యంత్రాలు, గుప్తనిధులు ప్రవహింపజేసే ధనలక్ష్మి యంత్రాలూ, రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇలాగే చెప్తారు. డబ్బు వాపస్.. అని.  ఇది కూడా చైన్ బిజినెస్సే.. ఎందుకో పాయింట్ 3 చదవండి ]
2. మేమంతా IIT, IIM లలో చదివొచ్చిన వాళ్ళం, IT,banking fields లో  పనిచేస్తున్న వాళ్లమూ. ఆమ్వే ఒక అద్భుత వ్యాపార విధానం. మొదట్లో మాకూ మీలాగే ఏమీ తెలీదు. అర్ధం కాలేదు కానీ రైట్ డిసిషన్ తీస్కొని ఎంటరయ్యాం. ఇప్పుడు మాకు జాబ్ చెయ్యాల్సిన అవసరమే లేదు.
[జనాలని అట్రాక్ట్  చెయ్యడానికి IIT,IIM లని వాడటమే కాక కన్ఫ్యూజన్ తో ఉన్న జనాలని లాగేసే ప్రయత్నమన్నమాట]
3. మొదట గా మీరు Rs10,000 ల ప్రాడక్త్స్ కొనండి. అన్ని రకాలూ... అది చాలా మంచిది మీ బిజినెస్ కి. నచ్చితే మీ సన్నిహితులకి రిఫర్ చెయ్యండి. మీ నెట్వర్క్ పెంచుకోండి. వాళ్ళనీ మన ఫ్యామిలీ లో కలపండి.. ఎంత మందిని జాయిన్ చేస్తే మీకు అంత లాభం.
[హాలీవుడ్ హారర్ సినిమాల్లో ఒక దెయ్యం/వైరస్ ఉన్నోడు ఇంకోకణ్ణీ కరిస్తే వాడూ దెయ్యమ్ అయిపోయి ఇంకొకణ్ణి కరుస్తాడు చూశారా.... డిట్టో అదే జరుగుద్ది ఇక్కడ.]
4.నేను ఆమ్వే ఫెయిర్నెస్ క్రీంస్ వాడటం మొదలెట్టగానే.. నా అందం త్రిబుల్ అయ్యింది. చూసిన అమ్మాయిలంతా పడిపోవడం మొదలెట్టారు. రియాల్లీ. ఆమ్వే ప్రొటీన్ పౌడర్ వాడాక
, నడవలేని స్థితిలో ఉన్న మా ఫ్రెండ్ మామ్మగారు లేచి నడవడం మొదలెట్టారు. ఇదొక అద్భుతం. మణిపాల్ హాస్పిటల్స్ లో మా ప్రాడక్ట్సే రికమెండ్ చేస్తారు..!
[ఈ టైప్ కతలు టీవీ లో పత్తివిత్తనాల యాడ్స్ వచ్చినట్టూ పుంఖానుపుంఖాలుగా వారి నోటి వెంట వస్తానే ఉంటాయి వినేవాళ్ళుంటే ( కొందరికి పని చేసి ఉండొచ్చు గాక) ]
4. మీకు తెలుసు.. IT jobs ఎప్పుడు పోతాయో తెలీదు. ఒక  ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వస్తుందన్న కాన్ఫిడెన్స్ మీకుండొచ్చు. ఉద్యోగం చేసే ఎబిలిటీ పోతే ఏం చెయ్యాలో మీకు తెలుసా?? అందుకే ఇందులో జాయిన్ కండి.
[లాజిక్ ఉంది .. అనిపిస్తుంది కదా..!! రేప్పొద్దున్న వీళ్ళు బోర్డ్ తిప్పేసి తూర్పుకి తిరగమంటే ఏం చేస్తారు? ముఖ్యంగా వీళ్ళందరి లోనూ సైకిక్ వైబ్రేషన్స్ కనిపిస్తాయి. వాళ్ళ మనసిక స్థితి లో "తేడా" బయటివాళ్ళకి వింతగా ఉంటాయి.
ఈ వ్యాపారమ్ కోసం పెంచుకొనే  పరిచయాల్లో మాటల్లో నవ్వుల్లో స్వచ్చత ఉండదు. కష్టపడకుండా సంపాదించెయ్యాలనే ఆశతో ఒక రకమైన మానసిక రోగులవుతారు. వారి మాట వినని ఫ్రెండ్స్/పరిచయస్తులని దూరం పెడతారు. వీరి సోది తట్టుకోలేక పరిచయస్తులంతా వీళ్ళని చూసి దెయ్యాన్ని చూసినట్టూ పరిగెడతారు]

ఈ ప్రెజెంటేషన్స్ అయిపోయాక... కొత్తగా వచ్చిన నాలాంటి బకరాల చుట్టూ ఆ బకరాని తీస్కొచ్చినవారూ, ఇంకో ఇద్దరు సూట్ బాబులూ అన్వేషిత సీరియల్లో కరకింకర భక్తుల్లాగా చుట్టుముట్టీ, ఉద్యోగాన్ని నమ్ముకోడం ఎంత చేటో, ఈ బిజినెస్ వల్ల ఎంత లాభమో ఎంతో ప్రేమ,గౌరవం ఒలకబోస్తూ బిస్కెట్ నవ్వులు నవ్వుతూ బ్రెయిన్ వాష్ చేస్తారు.
నా అనుభవం ప్రకారం ఇదంతా "పిచ్చోళ్ల హడావిడి". పొరపాటున టెంప్ట్ అయ్యి ఈ బురద లోకి దిగామా.... ఊబి లోకి కూరుకుపోవడం... ఇంకొంత మందిని లాగి బురదంటించడం తప్ప ఇంకెం జరగదు.

"అయ్యో... నా క్లోజ్  ఫ్రెండ్ కదా... తన కోసం జాయిన్ అవ్వాలి అనుకుంటారేమో.... నెత్తి మీద రెట్టేసింది రాజహంసయినా తల స్నానం చెయ్యాల్సిందే కదా!! సో మొహమాట పడకుండా ఈ చైన్ బిజినెస్ దూరంగా ఉండండి."
పువ్వు మీద కాలేసి బాధపడొచ్చు.. పేడ మీద కాలేసి కడుక్కోవచ్చు. కానీ ముల్లు మీద కాలేసి తీస్కోవడం అంత తేలిక కాదు కదా..!

మీలో చాలామందికి ఇవన్నీ తెలిసే ఉండొచ్చు కానీ నా తరుపున చెప్తున్నా..!!
"జాగ్రత్త వహించండీ" (గార్నియర్)