Monday, April 25, 2011

బస్ కండక్టరూ - మానవ సంబంధాలూ


ఫిజిక్స్ లో గుడ్ కండక్టరూ, బాడ్ కండక్టరూ, సెమీ కండక్టరూ అని చదువుకున్నాంగా? అలాగే బస్ కండక్టర్ లలో కూడా ఈ రకాలు కనిపిస్తారు పరిస్థితులని బట్టీ. బస్సు రష్ గా ఉన్నప్పుడూ కండక్టర్ టికెట్లు కొట్టొచ్చే లోపు అతని సీట్ ఆక్రమించి సేద తీరేవారినీ,పక్కనే కూర్చొని మచ్చిక చేసుకొనీ స్టాప్ లేకపోయినా కావల్సిన దగ్గర బస్సు ఆపించుకుని దిగే వాళ్లనీ, "మావయ్య ఒళ్ళో కూర్చోరా నాన్నా కాసేపు" అని పిల్లోణ్ణి కండక్టర్ మామయ్య కి తగిలించే లౌక్యం తెలిసిన అమ్మలనీ చూసే ఉంటాం.


ఇలాంటివి గాక నాకు బాగా గుర్తుండిపోయి, తలచుకున్నప్పుడు నవ్వొచ్చేవీ, నొచ్చుకునేవీ కొన్ని అనుభవాలు.

"తొందరగా పద నాన్నా.. లేటయితే హెడ్ మాస్టారు నిన్ను కొట్టేస్తారూ" అని నాన్న చెయ్యి పట్టుకొని బుద్దిగా స్కూల్ కి వెళ్ళేరోజులు. (క్లాస్ లో మాస్టారు పిల్లల్ని కొట్టినట్టే, స్టాఫ్ రూం లో హెడ్ మాస్టారు, మాస్టర్లని కొట్టేస్తారని మన ఫీలిన్గు)

ఒకసారి నేనూ, మా తమ్ముడూ అమ్మమ్మ తో కలిసి ఊరెళుతున్నాం. నన్ను పక్కన కూర్చోబెట్టుకొనీ, తమ్ముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొనీ, "వైజాగ్ ఒక ఫుల్లూ, ఒకా ఆఫూ" అంది. "అమ్మమ్మా.. నాకో టికటూ?" అన్నాడు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి మా తమ్మి. కండక్టర్ కూడా అదే ఎక్స్ప్రెషన్ పెట్టీ కళ్ళెగరేశాడు.

అమ్మమ్మ : ఇంకా మూడే యేడు నిండలేదు బాబూ.

తమ్ముడూ : అమ్మమ్మా నాకు మొన్నే నాలుగేళ్ళు నిండిపోయాయి. కావలిస్తే అన్నయ్యనడుగు. ఎందుకు అబద్దం చెప్తావ్?

అమ్మమ్మ : నువ్ నోర్ముయ్యరా ఎదవ కానా.. ఎలకపిల్లంత బరువుండడండీ వాడికీనా?

" మూడేళ్ళు దాటితే తియ్యాలమ్మా...పిల్లోడు చెప్తున్నాడుగా " అని టికెట్ చించి చేతిలో పెట్టాడు. కండక్టర్ చేసింది కరెక్టే అయినా "దొంగ సచ్చినోడు"అని వినపడేటట్టు తిట్టింది అమ్మమ్మ ఎందుకోమరి. :) :)

------------------------------------xxxx-----------------------------------------------------------------


జేబులో రెండు రూపాయలుంటే వాటికి ఎన్ని "ఆశ" చాక్లెట్ళొస్తాయీ? ఎన్ని ఊరేసిన ఉసిరికాయలొస్తాయీ? ఎన్ని ఆరేసిన మామిడి తాండ్ర ముక్కలొస్తాయీ?" అని లెక్కలేసే రోజులు అవి.

ఫుల్ టికెట్ తెసుకునే వయసొచ్చేసినా, భూమికి బెత్తెడుండీ, నుదుట ఆంజనేయస్వామి బొట్టెట్టుకోనీ , నెత్తికి నూనె రాసుకొని, నలిగి పోయిన నిక్కరేసుకొని, "అమాయకుడు" అనే బోర్డ్ మెళ్ళో వేసినట్టూ ఉండే నేను ఎప్పుడు బస్సెక్కినా కండక్టర్ తో "హాఫ్ టికెట్" అని గర్వం గా చెప్పేసి దర్జాగా కూర్చునే వాడిని , మిగిల్చిన డబ్బులు అమ్మ చేతిలో పెట్టీ, "నువ్వే దాచుకో" అనే మాట వినపడగానే జీళ్ళుమామ్మ కొట్ళో వెరైటీలన్ని స్లో మోషన్ లో స్క్రోల్ అవుతుంటే మెరిసేవి నా కళ్ళు. కానీ అన్ని రోజులూ నావి కావనీ, అందరు కండక్టర్లూ ఒకలా ఉండరని అర్ధమయ్యిందో రోజు.ఆ రోజు ఎప్పటీ లాగానే బస్సెక్కి "హాఫ్ టికెట్" అన్నాను. కండక్టర్ నా వైపు చూసి "ఏమ్ చదువుతున్నావ్?" అన్నాడు. ఊహించని ఆ ప్రశ్న కి అదిరిపడీ రెండు క్లాస్ లు తగ్గించి చెప్పా. "నిజం చెప్పు.. నువ్ మా అబ్బాయితోనే గా చదువుతున్నావ్? మనూళ్ళో నన్నెప్పుడూ చూడలేదా? ఫుల్ టికెట్ తీస్కోవాలి గా?" అని అడిగేసరికీ చికెన్ షాప్ లో బ్రాయిలర్ కోడి దొరికినట్టూ దొరికేసానని అర్దమయిపోయిందీ. అలా నాకు హాఫ్ టికెట్ నుండి ఫుల్ టికెట్ కి ప్రొమోషన్, నా పాకెట్ కి డిమోషన్ వచ్చిందన్నమాట. నాకు నచ్చక పోయినా మంచి కండక్టరే కదా? :)

--------------------------------------------xxxx---------------------------------------------------

ఇంట్లో ఏమీ ఎరగనట్టో బ్యాగ్ భుజానేసుకొని బయల్దేరిపోయి కాలేజ్ సెలవు ప్రకటించేసి, " ఏ సిన్మాకెళదాం" అని బస్సెక్కాక డిసైడయ్యే రోజులవి.

కానీ అందరు కండక్టర్లూ కూడబలుక్కున్నట్టూ టికేట్ అనగానే బస్ పాస్ లు చూపించే మాపై కత్తి కట్టినట్టూ, మమ్మల్ని సీట్లలోంచి లేపేసి టికేట్లు తీసుకున్న పాసింజర్స్ని కూర్చోపెట్టేవారు. ఎంత దారుణం?? ఏమిటీ అన్యాయం? ఎన్నాళ్ళూ?? ఎన్నేళ్ళూ?? నాలోని విప్లవ కారుడు నిద్రలేచి, పళ్ళు తోముకొని, క్లోజప్ ఆడ్ లో మోడల్ లాగా "హ....హా" అనుకొని, నా తోటి ఉద్యమకారుల్తో ఆ బ్యాడ్ కండక్టర్ తో గొడవెట్టుకున్నాడు.

నేను : ఏం పాసింజర్స్ వస్తే మేం ఎందుకు నించోవాలి? మమ్మల్ని ఫ్రీ గా తీసుకెళ్తున్నారా? మా బస్ పాస్ లు ఫ్రీ గా ఇస్తున్నారా? డబ్బులిచ్చే పాస్ లు తీసుకుంటూన్నాం. మాకు హక్కుందీ.. హక్కుల్ని కాలరాయొద్దు.. (తీన్ మార్ లో అర్జున పాల్వాయ్ టైప్ లో.)

కండక్టర్ : అవును.. డబ్బులిస్తున్నారు. ఎంతా? పదికి మూడు రూపాయలు. స్టూడెంట్స్ కి దాదాపు 7౦% రాయితీ ఇస్తుందీ ప్రభుత్వం. యేటా కోట్లు నష్టం మీకిచ్చే డిస్కోంట్ వల్ల A.P.S R.T.C కి. ఇప్పటికే ప్రతీ అడ్డమైన గొడవకీ తేరగా దొరికేవి ఈ ఎర్ర బస్సులే.మీరు ఎక్కినా ఎక్కక పోయినా మాకు ఒరిగేది లేదు. ఎవడూ పట్టించుకోడు. అలా అని మిమ్మల్ని ఎక్కొద్దూ అనటం లేదుకదా?. టికెట్ తీసుకునే పాసింజర్స్ కి సీట్ లేకుంటే బస్సెక్కరు. ఆటొలు ఫుల్లు.. మా కలెక్షన్ నిల్లు. కలెక్శన్ నిల్లయితే మీ రూట్లొ సర్వీసులు తగ్గించేస్తారు. నష్టపోయేది మీరే కాదు, జనాలు కూడా. ఎప్పుడూ మీ స్వార్ధమే చూసుకోవద్దు.

నేను : స్టాలిన్ సినిమాలో చిరంజీవీ, పెదరాయుడు సినిమాలో మోహన్ బాబూ, గణేష్ సినిమా లో వెంకటేష్ బాబూ కలిసొచ్చి క్లాస్ పీకుతుంటే, మెడ వాల్చేసి , నోరు తెరిచేసి , కళ్ళు తేలేసిన క్యాండిడేట్ లా మొహం పెట్టి.........

ఆరోజు కండక్టర్ పీకిన క్లాస్ విన్నట్టూ , క్లాస్ లో లెస్సన్స్ వినుంటే ఈ పాటికి నేను ఐన్ స్టీన్ అంత గొప్పోణ్ణి అయ్యి అమెరికా లో సెటిల్ అయ్యేవాడిని.హ్మ్మ్.. ఇతనూ గుడ్ కండక్టరే..

----------------------------------------------xxxx------------------------------------------------------

డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టడం కాదు.. నీళ్ళకోసం రోజూ డబ్బులు ఖర్చుపెడుతున్న రోజులివి..

బెంగుళూరు బీ.ఏమ్.టీ.సీ కండెక్టర్ల గురించి ఒక్కమాట లో చెప్పాలీ అంటే, వీళ్ళు ప్లగ్ లో వేలెట్టీ స్విచ్ ఆన్ చేసినా షాక్ కొట్టదు. అంత బ్యాడ్ కండక్త్గర్లు. :) :) (అవును ఇది అతిశయోక్తి నే. అందరూ కాదు... చాలా మంది.)

బస్సెక్కీ మినిమం చార్జ్ కూడ ఇవ్వకుండా నెక్స్ట్ స్టాప్ అని నమ్మకం గా చెప్పీ, రెండ్రూపాయలు చేతిలో పెడితే చాలు. మన మొహం ఒకసారి చూసి డబ్బులు జేబులో వేస్కొని పోతారు.ఇంకొంత మంది ఉంటారు. నెక్స్ట్ స్టాప్ అని పది రూపాయల నోట్ చేతిలో పెడితే టికెట్ ఇవ్వకుండా చేతికందిన చిల్లర రూపాయలు మర్యాదగా చేతిలో పెట్టేస్తారు మహానుభావులు. ఇది మామూలు కక్కుర్తి. వీళ్ళవల్ల లాభాలే కానీ సాధారణంగా పెద్ద ప్రోబ్లంస్ ఏవీ ఉండవ్ ఎప్పుడైనా స్క్వాడ్ వస్తే తప్ప. అప్పుడు సుబ్బరం గా తిట్లు తినేసి, చక్కగా ఫైన్ గా కట్టేసుకోవచ్చు :) :)

కానీ ఇంకొంత మంది ఉంటారు పది రూపాయల టికెట్ కి Rs100 నోట్ ఇస్తే, వాడి దగ్గర చిల్లరున్నా సరే Rs90 కి చీటీ రాసిస్తాడు. మనం దిగిపోయేటప్పుడు అడిగితే విసుక్కుంటూ జేబులో సెపరేట్ గా పెట్టిన డబ్బులు లెక్క కూడా పెట్టకుండా ఇస్తాడు. మరిచిపోతే అంతే సంగతులు చిత్తగించవలేను. పొద్దున్న ట్రిప్ కి అయితే చిల్లర లేదని సరి పెట్టుకోవచ్చు , రోజులో ఆఖరి ట్రిప్ అయినా చిల్లర (ఇక్కడ చిల్లర అంటే Rs50 పైన అయినా సరే ) లేదంటారు, చీటీ రాసిస్తారు. "ఫైవ్ రుపీస్ ఇల్లా సార్" అంటారు దిగిపోయేముందు అడిగితే. ప్రతీ రోజూ ఇదే తంతు. వాల్వో బస్సుల్లోనూ ఇదే గోల. తిరిగి డబ్బులివ్వాలంటే తిమ్మిరెక్కి పోతాయి చేతులు. అ టైం లో జ్వరమొచ్చినట్టూ వళ్ళు మండిపోయీ, నాటు సారా మరిగినట్టూ రక్తం మరిగిపోయీ, కళ్లకలగలొచ్చినట్టూ కళ్ళు ఎర్రబడిపోయీ,బఠాణీలు కొరుకుతున్నట్టూ పళ్ళు పట పటా కొరికేసి "ఎవడి సొమ్మని దోచేస్తార్రా? ఒక్కరూపాయి తక్కువిస్తే నువ్ టికెట్ ఇస్తావా? "అని అరవాలనిపిస్తుందీ. ఎన్ని సార్లు, ఎన్ని ఐదులు, ఎన్ని పదులు నావీ, నాలాంటి ఎంతమందివి ఎగిరిపోయాయో? దిగిపోయేటపుడు హడావిడీ, ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళ మధ్య గుర్తుండదు కదా.. ప్చ్.. ఇది కక్కుర్తి కాదు. దోపిడీ. గడిచిన మూడు సంవత్సరాలలో వీలైనంతా వేసేద్దాం అనే కండక్టర్ లని వందల మందిని చూస్తే, చిల్లర లేదని తన రూపాయిని వదులుకోడానికి సిద్దపడ్డ కండక్టర్ ని ఒకే ఒక్కణ్ణి చూశాను. హ్మ్మ్....


(పోయిన వారం శ్రీ రమణ గారు రాసిన "గుత్తొంకాయ కూర - మానవ సంబంధాలు" పుస్త్సకం మొదలెట్టాను. రోజూ జరిగే విషయాలను, చుట్టూ ఉండే రక రకాల మనుషులతో, వస్తువులతో మన సంబంధాలని ఎంత బాగా రాశారో కదా అనిపించిందీ. పుస్తకం సగం చదివాక ఇవన్నీ గుర్తొచ్చాయి. బరకడానికి బ్లాగుందీ.. పబ్లిసిటీ ఇవ్వడానికి అగ్రిగేటర్లున్నాయి. చదివి అక్షింతలు వెయ్యడానికి చదువరులున్నారు కదా అనీ... ఇలా పోస్ట్ పెట్టానన్న మాట :))


Saturday, April 23, 2011

Mr.Perfect … నాకు నచ్చేసింది.


నిన్నటి నుండీ వర్షం..ఓ ఓఓఓఓఓ కుమ్మేస్తుందీ. మా ఇంటి చుట్టూ జలమయం అయిపోయి ద్వీపకల్పం లాగా తయారయ్యింది.. మొన్ననగా అన్ని డబ్బులు తగలేసి టిక్కేట్లు బుక్ చేసుకున్నాక వెళ్లక తప్పుద్దా? సో పడవ లేక పోయినా గొడుగేసుకొనీ “గాలి వానలో..వాన నీటిలో పడవ ప్రయాణం..” అని గ్రూప్ సాంగ్ పాడుకుంటూ, తడుచుకుంటూ బయలుదేరాను “Mr.perfect” సినిమాకి మా ఫ్రెండ్స్ తో…ఆ…. వినపడింది… ఆపేస్తున్నా..


డార్లింగ్ లాంటి లవ్ స్టొరీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సకుటుంబ సపరివార సమేతం గా చూడదగ్గ మరొక ప్రేమకధా చిత్రం.. “Mr.Perfect”. సినిమా ఎలా మొదలైందీ అంటే…..

మమ్ము కాచిన వా…..డు మా…. మనసు దోచిన వాడూ..ఊ..ఊ ఊ..ఊ ఊ..ఊ...

మంగళాకారుడు.. మా ఆ..ఆ.. శ్రీనివాసుడూ….

అలా తిట్టకండీ.. మరీ ఇంత డీటైల్డ్ గా చెప్తే మీరు డిప్రెస్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టీ. నా అభిప్రాయం మాత్రం చెప్తా టూకీగా.. :) :)

పెళ్ళి చేసుకోడానికి మనసులు కలవాలా? అభిప్రాయాలు కలిస్తే చాలా?(రెండూ ఒకటి కాదు అంట) మనం ఇష్టపడే వాళ్ళ కోసం, మనల్ని ఇష్టపడే వాళ్ళ కోసం ,మన ఇష్టాల విషయం లో కాంప్రమైజ్ అవ్వాలా?? ఒకరి గురించి మనం మారిపోతే మన జీవితం మనకే బోర్ కొట్టదా?. జీవితంలో మనకి నచ్చినట్టూ ఉంటే కలిగే ఆనందం గొప్పా? అందరికీ నచ్చినట్టూ ఉంటే కలిగే ఆనందం గొప్పా? ” అనే థీం మీద తీసిన సినిమా. ఈ విషయాలని ఏ కన్ఫ్యుజన్స్ లేకుండా, బోర్ కొట్టకుండా దశరధ్ తీసాడు అనిపించింది నాకైతే.

తనకి నచ్చింది చేస్తేనే అది ఆనందం అనీ, ఎవరి కోసమూ దేనినీ త్యాగం చెయ్యకూడదని నమ్మి ఆచరించే క్యారెక్టర్ లో ప్రబాస్, తనకి నచ్చిన వారి కోసం తన ఇష్టాలని త్యాగం చేసి ప్రేమికుడి ఇష్టమే తన ఇష్టంగా మార్చుకున్న అమ్మాయిగా కాజల్ బాగా చేశారు

ఫస్టావ్ మొత్తం మాంచి కామేడీ తో, సూపర్ సాంగ్స్ తో, వాటికి తగ్గా పిక్చరైజేషన్ తో సరదా సరదాగా సాగిపోతుంది బోర్ కొట్టకుండా. నాకొచ్చిన భాషలో చెప్పాలి అంటే “పొలికేక”. డైలాగ్స్ చాలా వరకూ బాగా పేలాయి. కామెడీ అంటే విరగబడి నవ్వేలా పంచ్ డైలాగ్స్ కామెడీ కాదు గానీ, సరయిన టైమింగ్ తో కామెడీ సీన్లు చాలా ఉన్నాయి. హీరో ఇంట్రడక్షన్ కి వచ్చిన రెస్పాన్స్ కి పది రెట్లు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది “జల్సా కిషోర్” గా బ్రహ్మీ ఎంట్రీ కి. బ్రహ్మీ ఎంట్రన్స్ అతడు సినిమా ని గుర్తుకు తెస్తుంది. కాకపొతే అంతగా చెప్పుకోడానికి లేదు(జస్ట్ ఓకే అన్నమాట).

హీరో విష్యానికి వస్తే ప్రభాస్ ఇంకో రెండంగుళాలు పెరిగినట్టున్నాడు. కొత్త హైర్ స్టైల్ డిప్పకటింగ్ తో (నెత్తిమీద నాలుగెకరాలు పోయినట్టుందీ J ) కనిపించాడు. కాజల్ సూపరో సూపరు.చీరల్లో చాలా పద్దతి గా అందంగా అదరహో.. కొన్ని సీన్లలో అదోరకమైన విగ్గులు పెట్టి చెడగొట్టారు గానీ, ఫస్టాఫ్ మొత్తం మ్యాజిక్ చేసేసింది. సాంగ్స్ అన్నీ సరైన టైమ్ లో వస్తూ, కరుణాకరణ్ తీశాడా? అనిపించేటట్టు, పల్లెటూరి నేపధ్యంలో(మొదటి సాంగ్ మినహా) చక్కని సినిమాటొగ్రఫీ తో సూపర్ గా ఉన్నాయి. ముఖ్యం గా “చలి చలిగా అల్లిందీ, నింగి జారిపడ్డ,అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల” పాటలు విండానికి ఎంత బాగున్నాయో చూడ్డానికీ అంతకన్నా బాగున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కుమ్మేశాడు. ఫైట్స్ కూడా ఓకే.

సెకండ్ హాఫ్ లో “తాప్సీ” ఎంట్రన్స్. పిచ్చిక గూడు లాంటీ జుత్తేసుకుని, హాట్ హాట్ గా అరుపులు అరిపించిందీ. ఓన్ డబ్బింగ్ అనుకుంటా. గొంతులో గసగసాలు వేసుకొని మాట్లాడినట్టూ, వినేవాళ్లకి చెవుల్లో ఇసకేసినట్టూ గర్ గర్ గర్ మంటుందీ. కాకపోతే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది కాబట్టీ కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఒక పాటలో కాజల్, తాప్సీ పక్క పక్కనే నించొని డాన్సేస్తుంటే, “గుళ్ళొ పెట్టిన పులిహారనీ, బవార్చీ లో కొన్న బిర్యానీ ని ” పక్క పక్కనే పెట్టినట్టూ, ఏం సెలక్ట్ చేసుకోవాలో, ఎవర్ని చూడాలో తెలియనట్టూ ఉంటుంది. రఘుబాబు కామెడీ ముందు కొంచెం చికాకు తెప్పించినా, తరవాత బాగానే పండింది. కె.విశ్వనాధ్ ఎప్పడూ చేసే హెడ్ మాస్టార్ (రూల్స్ రామానుజం లాంటి ఇంటి పెద్ద ) పాత్రనే చేసారు. సెకండ్ హాఫ్ ఫుల్ ఫామిలీ డ్రామా (ముఖ్యంగా క్లైమాక్స్) అవ్వడం వల్ల అందరికీ నచ్చక పోవచ్చు. బట్ ఫస్టాఫ్ చూడ్డానికే మళ్ళీ వెళ్ళొచ్చు J J .

గుర్తున్న కొన్ని డైలాగ్స్ (కొంచెం అటూ ఇటు గా) :

1. నీకు నచ్చిందే చేసావనుకో.. ఇంతే ఆనందం.. నలుగురికీ నచ్చింది చేశావనుకో “ఇంత” ఆనందం.

2. హీరోః

(i)ఇద్దరూ కొట్టుకుంటేనే అది ఫైట్.. ఒక్కడే కొడుతుంటే అది ఫైటెలా అవుతుందిరా?

(ii) పెర్ఫ్యూమ్ బావుందిరా.. మీ ఆవిడ సెలెక్ట్ చేసిందా? మగాళ్ళదయితే ఇంకా బావుండేది.

(iii). (గోల్ఫ్ గురించి) అయినా ఇదేం గేం? ఇంత బంతిని అంత పెద్ద గ్రౌండ్ లో కొట్టి, మళ్ళా దాన్ని వెతకాడానికి జీపేసుకొని బయలుదేరడమా?

(iv) దేవుడు మనలాగా సైకో కాదమ్మా.. గుడికి రాకపోతే కార్ టైర్ బరస్ట్ చెయ్యడానికీ..

(v) తెలివైన వాణ్ణీ బలంతో కొట్టాలి.. తెలివి తక్కువ వాణ్ణి తెలివి తో కొట్టాలి. నీ లాంటి వాణ్ణి ఎలా పడితే అలా కొట్టోచ్చు.

(vi) ఇష్టపడ్డ వాళ్ళకోసమ్ ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి ? అనుకునే వాడిని. ప్రేమ ఉన్నప్పుడూ అడ్జస్ట్ మెంట్లే ఉండవని అర్దం అయ్యింది.

3. బ్రహ్మీ : ప్రేమలోనే కాదు రా.. పగలో కూడా మనసులు మాట్లాడుకుంటాయి.

దున్నపోతుకు బట్టలేసినట్టున్నావ్.. పందిపిల్ల లాగా దొర్లుతూ ఉంటే.. బండనాయలా అనకుండా..తింగరినాయాలా అంటారా? బండ నాయాలా..

4. హీరోయిన్ః నువ్వంటే ఎందుకిష్టమో చెప్పలేను.. ఎలానో చూపించలేను.. కానీ నా గుండె కొట్టుకున్నంత వరకూ నిన్నే ఇష్టపడతాను.

5. హీరో తండ్ర్తి, హీరో తో : నీకిష్టమైన అమ్మాయిని నువ్వు సెలక్ట్ చేసుకున్నావ్.. నిన్నిష్టపడ్డ అమ్మాయిని నేను సెలక్ట్ చేశాను.

6. ప్రకాష్ రాజ్ : ఆరున్నర లక్షల మంది లో మేము మాత్రమే సెలక్టయ్యామని వీళ్ళంటున్నారు. వీళ్ళని వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ రిజక్ట్ చేశారని నేనంటున్నాను.

ప్రేమించుకోవటం అంటే ఇద్దరూ ఒకే బ్రాండ్ కాఫీ తాగటం కాదు. ఇద్దరూ కలిపి ఒకే కాఫీ తయారు చేసుకుకోవడం. మీకా ఓపిక లేదు.

7. వీడెవడో తెలుసా? హనుమాన్ జిమ్ ఓనరు.. మా వూరి వరల్డ్ ఫేమస్.

8. దేవుడా.. ఈ పెళ్ళి కుదిరితే.. మా అయన్ని మోకాళ్ళతో నీ కొండకి తీస్కొచ్చి, గుండు కొట్టిస్తా తండ్రీ..

విలన్ లు లేని ఈ సినిమా చూస్తుంటే ఒకానొక దశ లో ఆరెంజ్ సినిమా(ఆస్ట్రెలియా బాక్డ్రాప్, హీరో క్యారెక్టర్ చూసి) గుర్తొచ్చింది J J . సినిమ అయిపోయాక ఆరెంజ్, బృందావనం, బొమ్మరిల్లు, ఇంకా కొన్ని సినిమాలను మసాలా వేసి మిక్సీ లో వేసి మిక్స్ చేసినట్టూ అనిపించింది. బట్ ఫైనల్ చెప్పొచ్చేదెంటంటే “ఫామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ”.

కొన్ని సెంటిమెంటు సీన్లు కొంచేం ఓవర్ అయి బోర్ కొట్టీంచాయి గానీ.. ఓవరాల్ గా చూస్తే ఈ మద్య కాలం లో నాకు తలనొప్పి తెప్పించని సినిమా.

Thursday, April 21, 2011

ఔను ..చిత్రమాలిక లో పోస్టేసాను

చిత్రమాలిక లో నా మూడవ పోస్ట్.. ః)
2011 లో ఇప్పటివరకూ చూసి ఆనందించిన సినిమాలూ, భరించిన సినిమాలు, భరించలేక బావురుమన్న సినిమాల సమాహారం..

http://chitram.maalika.com/2011-%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%88%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B0%82-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81/


Tuesday, April 19, 2011

तीनमार.... "నా" view


"తీన్ మార్"... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం లో అతి తక్కువ కాలం లో తయారయ్యి, అత్యధిక ప్రింట్లతో, అంతకన్నా ఎక్కువ అంచనాలతో రిలీజ్ అయ్యి, మొదటి రోజు నుండీ పాజిటివ్ టాక్ తో రన్ అవుతున్న సినిమా..


రిలీజ్ కు మూడు రోజుల ముందు నుండీ ట్రై చేస్తే రిలీజ్ అయిన మూడు రోజులకి దొరికాయి టికెట్లు.. అసలు నాలుగో రోజు కూడా 500 - 1000 బ్లాక్ అమ్ముతుందీ అంటే.. పవర్ స్టారా మజాకా నా? ఆ ఆ...ఆపేస్తున్నా.... సరే..సరే.. సోదాపి సంగతి చెప్తా...

మూడు ముక్కల్లో చెప్పుకుంటే " ఈ రోజుల్లో ప్రేమలకీ, ముప్పై యేళ్ళ కిందటి ప్రేమలకీ ఉన్నా తేడా ఏమిటీ? ఏది నిజమైన ప్రేమ?? ఏది గొప్ప?" ఇదీ స్టోరీ...

నాకు నచ్చినవీ...

పవన్ "మైఖేల్ వేళాయుధం" గా ఎప్పటిలాగానే ఎనర్జిటిక్ (కొన్ని కొన్ని సీన్లలో తట్టుకోలేనంతగా) గానూ, "అర్జున్ పాల్వాయ్" గా ఒక గంభీరమైన పాత్ర లోనూ ఇరగదీశాడు. ముఖ్యం గా అర్జున్ క్యారెక్టర్ కి డైలాగ్స్ చాలా స్పష్టం గా నెమ్మది గా పవర్ ఫుల్ల్ గా చెప్పాడు. పదేళ్ళ క్రితం ఎలా ఉన్నాడొ ఇప్పుడూ అంతే గ్లామర్ గా ఉన్నాడు కుర్రోడిలాగా.
ఒక రకంగా చెప్పాలీ అంటే ఈ కధ కి హీరో అర్జున్ పాల్వ్యాయ్ అయితే, విలన్ వేళాయుధం (కధ కే కాదు అప్పుడప్పుడూ చూసే వాళ్ళకి కూడా). అర్జున్ పాల్వాయ్, వసుమతి (కృతి) ల క్యారెక్టర్స్, లవ్ స్టోరీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందీ. నాకైతే ఈ క్యారెక్టర్స్ సినిమా అంతా ఉంటే బావుంటుంది కాదా అనిపించింది. కృతి ని చూసి సౌండ్ రాకుండా విజిల్స్ వెయ్యొచ్చు డీసెంట్ గా..మనసులో :). పాటలు బాగున్నాయి.. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా బాగుంది. వయ్యారాలా, జగమేలు శివ శంకరా సాంగ్స్ కూడా ఈ క్యారెక్టర్స్ కి తగ్గట్టూ మాంచి పిక్చరైజేషన్ తో ఉన్నాయి. వయ్యారాలా పాటలో పవన్ వేసిన ఒక స్టెప్ కి నవ్వు రాక మానదు. తను సీరియస్ గా వేశాడో కామెడీకి వేశాడో..? :)
త్రివిక్రం రాసిన కొన్ని డైలాగ్స్ కేకలు పెట్టిన్చాయి. క్లైమాక్స్ లో మైఖేల్ రియలైజ్ అయినప్పుడు పవన్ డైలాగ్స్ సూపర్ గా ఉంటాయి. ఆలీ ఉన్నా కొద్ది నిమిషాలు సూపర్ కామెడీ గా ఉంటుందీ.

నచ్చనివీ & కొన్ని పనికి రాని పరిశీలనలు :

ఇక మైఖెల్ క్యారెక్టర్ పవన్ కి కొట్టిన పిండే. తొలిప్రేమ తరహా లో కొన్నిసీరియస్ సీన్స్ సూపర్ గా చేశాడు. కాక పోతే కొన్ని సీన్లలో ఓవర్ యాక్షన్ ఓవర్ టైం చేయటం వల్లా.. చిరాకేసి "ఇంక ఆపరా బాబూ.." అనాలనిపిస్తుందీ. పవన్ ఇటాలియన్ లో మాట్లాడే లెంగ్తీ సీన్లు, అది చూసి హీరోయిన్ పడిపోవడం కొందరికి కొత్తగానూ వింతగానూ , కొందరికీ చెత్తగానూ రోత గానూ ఉంటాయి. ఇంకా కొన్ని సీన్లు అనవసరమైన సాగదీత. త్రిష మాత్రం బాగా...మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్.:) :) పబ్ లో కలుసుకొన్న రోజే లవ్ లో పడిపోయి, సంవత్సరానికి బోర్ కొట్టేసి,విడీపోయి “నేను ఒకదాన్ని తగులు కున్నాను.. నువ్వెవడీని తగులు కున్నావ్? “ అని ఫోన్ లలో మాట్లాడుకునే ఈ విపరీతపు లవ్ స్టోరీని జనాలు డైజెస్ట్ చేసుకోవడమ్ కష్టం. ఇది బిగినింగ్ మాత్రమే... చెప్పాల్సిన చండాలం చాలా ఉంది. చెప్పను .. చెప్పలేను. నిజానికి అది ప్రేక్షకులకి నచ్చకూడదని, అది తప్పు అని చెప్పడమే కధ లో మెయిన్ పాయింట్ అనుకోండీ.:) :)

మామూలు గా పవన్ టచ్మీ నాట్ అన్నట్టూ ఉంటాడు గా హీరోయిన్ లతో.. ఈ సినిమా లో మాత్రం అవన్నీ పెట్టె లో పెట్టి పాతరేసేశాడు. మొదటి సాంగ్ చూడగానే అర్ధమయిపోతుందీ. పాపం ఆ డాన్సర్లకీ పావుమీటర్ గుడ్డ తో పది మందికి బట్టలు కుట్టించి గెంతించారు. త్రిష కూడా వీలైనంత తక్కువ బట్టలు వేసుకొని తిరుగుతుందీ (బడ్జెట్ తగ్గించొద్దూ?? ఎంతైనా గణేష్ బాబు తెలివే తెలివి). ఇక మిగిలిన పాటల విష్యానికొస్తే పవన్ ఎప్పటి లాగానే నడుస్తూ, ఎండాకాలం లో ఈగలు తోలినట్టూ, సుతిమెత్తగా దోమలు కొట్టుకున్నట్టూ చేతులు ఊపి సరిపెట్టేశాడు. మరీ జగపతి బాబు లాగా రిధమ్ లేని బాడీ కాదు గా.. కాస్త కష్టపడి కాళ్ళూ, చేతులూ ఊపితే సొమ్మేంపోయేదో?. ఎప్పుడొ నా స్కూల్ డేస్ లో వేశాడు డాన్స్. ఇంకెంత కాలం ఖుషీ తో పోల్చుకోవాలో? కాకుంటే గత సినిమాలతో పోల్చితే ఇందులో బాగానే వేశాడు డాన్స్. సెకండ్ హాఫ్ లో ఫైట్స్ అంతసేపు ఎందుకు సాగదీశాడో జయంత్ కే తెలియాలి. ఆ ఫైట్స్ పవన్ ఫైట్స్ లాగా పవర్ ఫుల్ గా లేవు.:( :( కొన్ని సీన్లకయితే ఫార్వార్డ్ చెయ్యడానికి నా చేతిలో రిమోట్ లేదని ఫీలయ్యాను.గాయత్రి భార్గవి పవన్ తో చెప్పే డైలాగ్స్ త్రివిక్రమ్ రాయలేదనిపిస్తుందీ. త్రివిక్రం గత సినిమాలతో పోల్చితే కామెడీ, తన మార్క్ పంచ్ లూ తక్కువ. హా.. మర్చిపోయా.. పాపం ఈసినిమాలో సొనూసూద్ ని చూస్తే జాలేస్తుందెవరికైనా. "పశుపతీ.. అఘోరాధిపతీ" అని అరిచి అదరగొట్టీనవాడిని ఆటలో అరిటి పండు చేసి ఆడుకుంటుంది త్రిష... ;)

కొన్ని అద్భుతమైన డైలాగ్స్ (ఇంచుమించు గా గుర్తున్నంతవరకూ) :


గీత దాటొద్దు... చెరిపేస్తాం. హక్కులు కాలరాయొద్దు.. తొక్కేస్తాం.

దేవుడు చాలా గొప్పోడు.. డిప్పకాయ మీద పీకి, ఏడ్చే లోపు చేతిలో చాకొలేట్ పెట్టేస్తాడు. (కెవ్వ్ ...కెవ్వ్ )

నచ్చిన అమ్మాయ్ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడానికి నేనేమన్నా హచ్ కుక్కపిల్లనా ?

అందంగా లేదని అమ్మనీ, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేస్తామా చెప్పు?

సంపాదిస్తే డబ్బొస్తుంది గానీ సంస్కారం రాదు.

యుద్దం లో గెలిచే యోధుడు ఓడిపోయే వాడికి ఎలా కనిపిస్తాడో అలా ఉంటాడు వాడు. (ఇక్కడ విజిల్స్... :) )

రోమియో-జూలీయట్, దేవదాస్ పార్వతి, లైల మజ్నూ లాంటీ గ్రేట్ లవర్స్ కావాలీ అనుకుంటే.. చచ్చిపోవాలా ? మనం మారుద్దాం.. బ్రతికున్న గ్రేట్ లవర్స్ అని నిరూపిద్దాం..
ఈరోజుల్లో మనదనుకున్న అమ్మాయి స్ట్రీట్ దాటితేనే గారంటీ లేదు. అలాంటిది సముద్రాలు దాటేల్లిపోతుంది.. ఇంకేం గారంటీ?

కారణం లేని కోపం.. గౌరవం లేని ఇష్టం.. బాధ్యత లేని యవ్వనం.. ఙ్ఞాపకంలేని వృద్ధాప్యం అనవసరం

హీరో , హీరొయిన్ తో : ఇకపై నీ వెంట పడను. నీ తో మాట్లాడను. నీ జోలికి రాను. నిన్ను డిస్టర్బ్ చెయ్యను.. చదువుకో.. బాగా చదువుకొని .ఎగ్జామ్స్ బాగా రాసి , పాసయ్యి వచ్చాక నిన్ను పెళ్ళి చేసుకుంటాను.. (విజిల్స్..)
ఎన్ని సార్లు కలిసినా, విడి పోయే ముందు చివరి సారి కలిసినప్పుడు ఎందుకో ప్రత్యేకం గా ఉంటుంది.

ఒకడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే పోనీలే బాధలో ఉన్నాడు అనుకుంటారు. అదే నవ్వుతున్నాడనుకో.. పిచ్చోడనుకుంటారు.. నా పరిస్తితి ఆ పిచ్చ కి దగ్గర గా ఉంది.. (కేకలు.. అరుపులు..)

ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే.. చచ్చేటప్పుడే వదిలేది.


క్షమించరాని తప్పులు మరియూ ధర్మ సందేహాలు :
పవన్ కళ్యాణ్ డబ్బీంగ్ చెప్పుకోలేదనుకుంటా.. మనోడికి లైవ్ రికార్దింగ్ మీద మోజో, లేకా డబ్బింగ్ చెప్పాలంటే బద్దకమో తెలీదు. చాలా సీన్ల లో వాయిస్ క్లారిటీ లేదు అండ్ లిప్ మూమెంట్ కూడా సరిగా సింక్ అవ్వదు. డైలాగ్స్ అర్ధం కావు. అర్దం కాని ఇటాలియన్ లో
ఐదు నిమిషాలు అనర్గళంగా మాట్లాడినా పర్లేదు.అసలు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియకుండా ఉండేలా చేస్తే ఎలా?

లవ్ ఆజ్ కల్ సినిమా హిందీ కాబట్టీ ఓకే. తెలుగు సినిమా లో కూడా కాశీ అనీ, అలహాబాద్ అనీ నార్త్ బాక్ గ్రౌండ్ ఎందుకు తీసుకున్నారో తెలీదు. పోనీ అక్కడి వాళ్ళా అంటే అదీ కాదు. పేరు తప్పా కట్టూ, బొట్టూ, భాషా అన్నీ తెలుగు వాళ్ళవే.. A.P లోనే తీసుంటే కొంచెం మననేటివిటీ తో ఉండేది
కదా..!


ఆసలీ సినిమాకి "తీన్ మార్" అని టైటిల్ ఎందుకు పెట్టారు?? (ఐ డిమాండ్ యువరానర్..!)

( మామూలు గా చిన్న చిన్న తప్పుల్ని కూడా రివ్యు లలో ఏకి పారెస్తారు గా? పవన్ ఫాన్ అయిన నాకే ఇన్ని కనిపిస్తున్నాయి.. ఇవన్నీఏ రివ్యులోనూ ఎవ్వరూ చెప్పలేదూ అంటే ఇదేదో "ఊహూ...ఆహూ." ఎవ్వారం లాగా అనిపిస్తుందీ.)

ఇంతకీ సినిమా ఎలా ఉంది? అంటారా? "బాగా ఆకలి గా ఉన్నపుడూ , ఉడకని అన్నం లో ఉప్పులేని పప్పేసుకొని, కమ్మని నెయ్యి కలిపేసుకొని, చికెన్ జాయింట్ నంచుకు తిన్నట్టూ.. రక రకాలుగా ఉంది ".

ఫైనల్ చెప్పొచ్చేది ఏమిటంటే తప్పులు, తోటకూరలూ పక్కనెట్టేసి.. అభిమానులంతా పవన్ షో చూసి పండగ చేసుకోండి..
ఎందుకంటే..
పవన్ నవ్వాడు ... నవ్వించాడు...
ఏడ్చాడు.. ఏడిపించాడు..
అరిచాడు.. అరిపించాడు..
డాన్స్ వేసాడు.. డాన్స్ వేయించాడు..
ఊగాడు.. ఊపు తెచ్చాడు.
ఫైనల్ గా రాక్ చేసి .. షేక్ చేసాడు..

మిగిలిన వాళ్ళు వీలయితే పులి సినిమాతో పోల్చుకొని సహించండీ...
సినిమా బాగుందో లేదో, అసలు నాకు సినిమా చూడటం వచ్చో రాదో కూడా చెప్పలేని నా లాంటి పవన్ అభిమానులైతే భరించండీ..

జై హింద్.

Friday, April 15, 2011

నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా?


నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా?


అసలు ఏమి రాయాలో , ఎలా రాయాలో తెలియక పోయినా, నా చేతులు దురదెక్కి పోయి, మెదడు మత్తెక్కి పోయి, పుర్రె కి పిచ్చెక్కి పోయి ,తలకాయ తిమ్మిరెక్కి పోయి, ఒళ్ళు కొవ్వెక్కి పోయి, మీ కర్మ కాలిపోయి, అసలు రాద్దామా... ? వద్దా ... ? అని ఆగుతూ , ఊగుతూ , జోగుతూ ,పడుతూ , లేస్తూ, ఆలోచిస్తూ........., నాకిన్ని రోగాలున్నాయా? అని సందేహిస్తూ, భయపడుతూ... , తడబడుతూ బుడి బుడి అడుగులు వేస్తూ, వడివడి గా , "వాడి"గా, వేడిగా ఏదో ఒకటి రాసేద్దాం లే అని డిసైడ్ అయిపోయి నా మొదటి పోస్ట్ వేసేస్తున్నా ........ మేటర్ లేకుండా...!

ఇదీ... మేటరు!