Tuesday, June 25, 2013

తూర్పు కి పోయే రైలు

॥ధూమం ఇంధన వాహనేన అభివృధ్ధిః
ఇతఃపరం పర్యావరణం ప్రాణాపాయ స్థితిః
పరంతు, న ధనం కీటక డింభ ప్రయాణః
అమిత ధనేన సుఖ ప్రయాణం ప్రాప్తిః ॥

కంగారు పడకండి కంగారు పడకండి మీ తొందర పాడుగానూ. నా మెదడు ఎప్పట్లాగే మోకాల్లోనే ఉంది. పోస్ట్ ని బలంగా మొదలెడదాం అని అలా కానిచ్చాను. భాష అర్ధం కాకపోయినా భావం బోధపడితే  చాలు కదా.

ఈ పాడు లోకం లో ఒక్కో మడిసికీ ఒక్కో రకమైన వాహన వెర్రి ఉంటాది. కొంతమందికి బైకుల మీద బలాదూర్ తిరగడమంటే ఇష్టం, కొందరికి కార్ల మీద ఊరేగడమంటే సరదా. ఇంకొందరికి విమానాలెక్కి ఎగరటమంటే మోజు. నాకు మాత్రం బాగా చిన్నప్పుడు తాటికాయ బండేసుకొని మట్టి రోడ్లంట తిరగటమంటే పిచ్చి ప్రేమ. ఈ తాటికాయ బండి తోసుకుంటూ అమ్మమ్మ వాళ్ళూరు దాకా వెళ్ళలేమనే తెలివి వచ్చాకా, జట్కాలూ, రిక్షాలూ, బస్సులూ, ఫ్లైట్లూ (మా ఊరి మీద నుండి ఎగిరే విమానాలకి టాటా చెప్పీ చెప్పీ) బోర్ కొట్టేశాక "రైలు ప్రయాణం" మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. అయితే ట్రైన్ ఎక్కి వెళ్ళేంత దూరం లో చుట్టాలు లేకపోవటం వల్లా, చుట్టాలున్న ఊళ్ళలో రైల్వేస్టేషన్లు లేకపోవటం వల్లా ఎప్పుడూ మా పిచ్చికుక్క ఎక్కే వెళ్ళాల్సొచ్చేది. "ఏయ్..ఏయ్.. స్టడీ...." పిచ్చికుక్క అంటే మా ఊరి బస్సు పేరు. రోజూ ఆరేడు ట్రిప్పులు ఊళ్ళోకీ, బయటకీ తిరుగుతుందని ఆ పేరెట్టేరు జనాలు. 
ఎప్పుడో ఏడాదికోసారి ఏ తిరపతి వెళ్ళేటప్పుడో రైలు ప్రయాణ భాగ్యం దక్కేది. అసలే అంతంతమాత్రమైన నా గ్లామర్ ని తిరప్తి గుండు గోతిలో పాతేస్తాదన్న భయాన్ని, తిరుమల ఎక్స్ప్రెస్ లోని స్లీపర్ కోచ్ డామినేట్ చేసేది. ఇండియన్ రైల్వే మీదున్న ఈ ప్రేమ తోటే RRB ఎగ్జాం కి కూడా ప్రిపేర్ అయ్యాను చిన్నప్పుడు. విధి వక్రాసనం వేసి ఎగ్జాం రోజు జ్వరం రావటం తో మూడంకేసుకొని నిద్దరపోయేను.

లోకం లో అండర్ గ్రౌండ్ లో కూడా అన్ని దిక్కులకీ పరిగెట్టే రైళ్ళుండగా.. నేను "తూర్పు కి పోయే రైలు" అని టైటిలెందుకు పెట్టానంటే.... "మా ఊరు అటు వైపే ఉంది కాబట్టీ".

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx*********xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

బెంగుళూరు నుండి మా ఊరికి కి డైరెక్ట్ బస్స్సులు ఉన్నాయని తెలియని అమాయకపు రోజులు. తెలిసినా టికెట్ రేట్ చూసి గుండెలు బాదుకునే బడ్జెట్ రోజులు. 

ఆశ్చర్యార్ధకం, ప్రశ్నార్ధకం కలగలిపిన మొహంతో బెంగుళూరొచ్చి, ఆర్నెళ్ళ తర్వాత ఆఫర్ లెటర్ తో ఆనందంగా  ఇంటికెళుతున్నరోజు.
అడవి గడ్డిలా పెరిగిన జుట్టుని స్ట్రైటనింగ్ చేయించిన అప్రాచ్యపు లుక్ తో అప్పల్రాజు గాడూ, ఫేస్బుక్ వాల్ మీద పిడకలు కొట్టే మొహంతో నేనూ ప్రశాంతీ ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాం. కిటికీ పక్క కూర్చొని బయటి ప్రపంచాన్ని చూస్తూ అలౌకికానందాన్ని పొందుతున్నాన్నేను.

అప్పిగాడుః "ఓరి బాబూ.. టికెట్ కొనకుండా లాటరీ ప్రైజ్ కొట్టినోడిలాగా ఆ ఎక్స్ప్రెషన్లేంటి రా? బోర్ కొడుతుంది నాకు.

నేనుః ఏంజెయ్యమంటావ్రా... ఇంజినీరింగ్ ఇరగదీసీటప్పుడు కూడా ఎర్రబస్సునే నమ్ముకున్నాను. అందుకే ఇలా..!
అయినా వచ్చేవారం సింహాచలం లో మొక్కుందన్నావు.. ఇప్పుడు హెయిర్ స్టైల్ మార్చావేంట్రా?

అప్పిగాడుః నేను బెంగుళూర్ నుండి వచ్చానని మా ఊళ్ళో తెలియాలి కదా... అందుకే మున్నా సినిమా లో ప్రభాస్ హైర్ స్టైల్ చేయించాను. (నెత్తి మీది గడ్డిపరకల్ని చేత్తో తోసుకుంటూ..)



"స్సమ్మోస్సై.... అ వేడి వేడిగా.....స్సమ్మోస్సై.... వేడి వేడిగా....." అన్న పిలుపులు నాలోని జఠరాగ్ని ని రగిలించాయి.

నేనుః ఒరే.. ఆకలేస్తుందిరా...!!

అప్పిగాడుః ఆ సమోసా ఈరోజుది కాదు. కానీ ఈ రోజు వేయించినదే. మనం కొనకుండా ఉంటే రేపు కూడా వేపి వేడిగా అమ్ముతారు.అది గాని తిన్నావనుకో అటు బెర్త్ కీ ఇటు బాత్రూంకీ కాకుండా పోతావు. కాసేపు ఆగు. హిందూపూర్ రానియ్యి.

నేనుః అలాగా...! అయినా అలా ఎలా చెప్పేస్తావుబే నిన్నటిదనీ?

అప్పిగాడుః వాటం చూసి వ్యక్తిత్వాన్నీ, వాసన చూసి వంటనీ పసిగట్టేస్తాన్రా నేను. ఈ మాత్రం జీ.కే లేకుండా గ్రాడ్యువేట్ ఎలా అయిపోయావో ? అసలెవడ్రా నీకు జాబిచ్చింది?

నేనుః  బీటెక్ సబ్జెక్ట్స్  లో మనకి G.K లేదు కదరా..?

అప్పిగాడుః లాభం లేదు రా.. నిన్ను చాలా ఎడ్యుకేట్ చెయ్యాలి. ట్రైన్ లో అమ్మే ఫుడ్ తినే బదులు రూపాయ్ పెట్టి కొని మోషన్ టాబ్లెట్ మింగి టీ తాగటం మేలు. రిజల్ట్ ఒకటే. కడుపులో వర్పూల్ వాషింగ్ మిషన్ తిరిగేసి ఫ్లష్ కొట్టేసిన ఎఫెక్ట్ ఉంటాది. కానీ గోదావరీ ఎక్స్ప్రెస్ లో బిర్యానీ బాగుంటాది. రాజధానీ ఎక్స్ప్రెస్ లో ఫుడ్ శుభ్రంగా ఉంటాది. పిఠాపురం స్టేషన్ లో పుణుకులు రుచిగా ఉంటాయి.

నేనుః ఇన్ని తెలిసిన ఎదవ్వి , ట్రైనెక్కేముందు పార్సిల్ కట్టించొచ్చు కదా...?

అప్పిగాడుః మ్మ్.... మర్చిపోయేన్రా... ఐనా... ఓరే... ఎర్రర్స్ , వార్నింగ్సు రాకుండా కోడ్ రాయొచ్చు గానీ, బగ్స్ లేకుండా రాయగలమా? ఇది కూడా అంతే.

మస్సాలా వడే...య్య...మస్సాలా వడే...య్య...!!

అప్పిగాడుః  అద్దీ లెక్క. వీటి కోసమే వెయిటింట్. హిందూపూర్ అనంతపూర్ ల మధ్య లో అమ్మే ఈ మసాలా వడలు  కమ్మగా ఉంటాయి.  ఆ గారెల్తో నంజుకోడానికి పచ్చిమిరగాయలు ఇస్తాడూ... రెండూ కలిపి నములుతుంటే...రాజూ.. 
ఒకటి తిన్నాక ఇంకోటి తినాలని అనిపించకపోతే ఆడు మనిషీ కాదు. వాడిది నాలుకా కాదు. ఆ...!

నేనుః నిజమా??

అప్పిగాడుః అలా డౌట్ గా అడుగుతావేట్రా? నీకో సంగతి తెలుసా? మనూర్లో ఆగుతాదీ అన్న ఒక్క పాజిటివ్ పాయింట్ తప్పితే ప్రయాణం లో అశాంతి ని మిగిల్చే ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎందుకు ఎక్కించాననుకుంటున్నావ్?? ఆ గారెల కోసమే. ఓ నాలుగు ప్లేట్లు తీసుకో.. మూడు ప్లేట్లు నాకిచ్చేయి. వాడికి డబ్బులిచ్చెయ్.

నేనుః ఆహా..ఓహో అద్భుతం రా. కానీ ఇలాటి ఫుడ్ తినకూడదని రూలెట్టావు కదా?

"ఆకలెయ్యనప్పుడూ, బోర్ కొట్టినప్పుడూ నేను లచ్చ చెప్తాను. అయన్నీ పట్టించుకోకూడదు. అయినా ఎవడో పెట్టిన రూల్ ని బ్రేక్ చెయ్యడానికి  భయపడాలిగానీ నీ రూల్ ని బ్రేక్ చేసుకోడానికి భయమెందుకురా?" అనేసిన అప్పిగాడు.. ఇప్పుడే వస్తానని చెప్పి, హడావిడిగా టోయ్లెట్ లోకి పరిగెట్టాడు.

"టప్" మన్న శబ్దానికి తలెత్తి చూశాను. ఆరడుగుల ఎత్తున్న ఒకాయన చీరగట్టుకొని కాంచన సినిమా చూపించడానికి సిద్దంగా ఉన్నాడు. టికెట్ ఇవ్వడం కోసం అనుకుంటా, లిప్స్టిక్ వేసిన ఎర్రని నోటితో డబ్బులడిగాడు. భయాందోళనలని కళ్ళల్లోనూ, జేబులోని వంద తీసి చేత్తోనూ చూపిస్తూ "చిల్లర లేదు" అన్నాను తెలివిగా. "చిల్లర నా దగ్గర ఉంది" అన్నాడు తాపీగా. చిన్నపిల్లోడి చేతిలోంచి బూందీ పొట్లాం ఎత్తుకుపోయినట్టూ వంద నోటు ఎత్తుకుపోయాడు. "నా డబ్బులు..నా డబ్బులు... చిల్లర.... చిల్లర" అంటా వెంటబడ్డాను అందరూ నన్నే చూస్తున్నా పట్టించుకోకుండా. "నన్ను చూసి బాత్రూం లోకి పారిపోయి తలుపేసుకున్నాడే.....ఆడ్నడుగు" అనేసి దిక్కులు పిక్కటిల్లేలా చప్పట్లు కొట్టి పక్కభోగీకి పోయింది కాంచన.

ఇల్లు కాలిపోయాక ఫైరింజన్ వచ్చినట్టూ వచ్చాడు అప్పిగాడు

 "ఈ రూట్ లో ఇదో ప్రాబ్లెం ఉందిరా. అందుకే షర్ట్ జేబులో పదులు పెట్టుకోవాలి. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు. ఆళ్ల మీద జాలిపడాలీ, కనిపిస్తే భయపడాలి. కానీ అసహ్యపడకూడదు రా.. పాపం తగుల్తాది"

"నీకు వాళ్ళ మీద జాలీ కాదూ, భయమూ కాదు. పీనాసితనం. పక్కోళ్ళని బుక్ చేసే సాడిజం. ఎదవ కానా"

"నా ఏబ్రాసితనం గురించి నీకు తెలియనిదేముంది రా.. చిన్నప్పట్నుండీ చూస్తున్నావ్."

************************************xxxx******************************************
IRCTC లో టికెట్ బుక్ చెయ్యడం అనేది ఒంటెద్దు బండి మీద ఒంటరిగా కాశీ కి ప్రయాణం కట్టడం లాంటిది. అవుతాదో లేదో చెప్పలేం. ఏ క్షణాన ఏం జరుగుతాదో ఊహించలేం. టికెట్ బుక్కయ్యి, పేమెంట్ చేసే లోపు పేజ్ సైనౌట్ అయిపోవడాలూ, పే మెంట్ అయిపోయ్యీ టికెట్ కన్ఫర్మ్ అయ్యేలోపు వెబ్సైట్ maintenance లోకి పోవడాలూ ఇలాంటివి పౌరాణిక సినిమాల్లో SVR డైలాగులు చెప్పినంత సులభంగా అయిపోతుంటాయి. ఇక తత్కాల్ టికెట్ బుక్ చెయ్యడం గురించి జనాలకి చెప్పడం అనేది, అర్ధరాత్రులు నిద్రపోకుండా మొరగడం ఎలాగో బెంగుళూరు కుక్కలకి ట్రైనింగ్ ఇవ్వడం లాంటిది. హై కాన్ఫిగురేషన్ లాప్టాప్ అందుబాటులో ఉన్నా, హైస్పీడ్ ఇంటర్నెట్ అనుసంధానమై ఉన్నా ఒరిగే లాభమేమీ లేదు. మామూలు జనాల పరిస్థితే అలా ఉంటే, సదా శనీశ్వరుడితో సాల్సా డాన్సాడే నా పరిస్థితి చెప్పక్కర్లేదు.  అంతు లేని సహనం , అణువణువునా అనుమానం, భారంగా అడుగులేసే కాలం , ఏం జరుగుతుందోనన్న భయం, ఎం జరిగినా పర్లేదు అనుకునే తెగింపు , గుండెలు వణికే గగుర్పాటు, బుర్ర బద్దలయ్యే భావోద్వేగాల మధ్య సక్సస్ఫుల్ గా తత్కాల్ టికెట్ బుక్ చేసినప్పుడు కలిగే ఆనందం ప్రపంచాన్ని జయించినప్పుడు అలగ్జాండర్ కి కూడా కలిగి ఉండదు. ప్రతీ ఏడూ కోట్లాది రూపాయలు రైల్వే బడ్జెట్ పెడతారు గానీ ఈ ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీని మాత్రం గాలికొదిలేస్తారు ఈళ్ల జిమ్మడిపోనూ. జనాలు ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వకపోతే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయి చెప్పండి?? (ఆ వార్త మిస్సవ్వకండి. ఆ అపరిచిత వ్యక్తి ఎవరో మీ ఊహలకే వదిలేస్తున్నా).



నేనెప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా వెయిటింగ్ లిస్ట్ లోనే వస్తాది. అది కూడా WL 1 లోనో 2 లోనో ఆగిపోతాది. (నిజం..!!) కన్ఫర్మ్డ్ టికెట్ తీసుకోడమనేది నా చరిత్ర లోనే లేదు. .

ఒక వేళ నా అదృష్టం అందలమెక్కించీ, దేవతలు పూలవర్షం కురిపించీ నా బెర్త్ కన్ఫర్మ్ అయితే, దానవుల చిలిపి చేష్టల వల్ల భగ భగ మండే ఎండల్లో భోరున వర్షం కురిసీ, వరదలొచ్చేసి బ్రిడ్జీలు కూలిపోయి ట్రైన్ కాన్సిల్ అయిపోవటమో, రాక్షసుడిలాంటి మా మేనేజర్ లీవ్ కాన్సిల్ చేసేయటమో, రైల్ రోకోలో నేనెక్కిన ట్రైన్ నాలుగైదు గంటలు నిలిచిపోవటమో కచ్చితం గా జరుగుతాది.
ఇన్ని నెగటివ్ పాయింట్లు ఉన్నా రైలు ప్రయాణం మీద నాకున్న మోజు తగ్గకపోడానికి కారణమేంటో తెలుసునా?

"చూడాలనివుంది" సినిమా వచ్చినప్పటి నుండీ చూస్తున్నా. సినిమాల్లోనీ, నవలల్లోనీ  నూటికి నలభై లవ్ స్టోరీలు రైల్వే స్టేషన్ లోనో, రైలు భోగీ లోనో మొదలవుతాయి. రైలంత పొడుగు సా.....గుతాయి. ఈ ఆప్షన్ ప్రపంచం లోని ఏ ఇతర వాహనాలకీ ఇవ్వరు ఈ సినిమావోళ్ళూ, రచయితలూనూ. మామూలుగానే రైళ్ళు రావాల్సిన టైం కన్నా లేట్ గా వస్తాయి. ఈ హీరోయిన్లు ఇంకా లేట్ గా వస్తారు. 

మూవ్ అయిపోతున్న ట్రైన్ లోంచి హీరో చెయ్యందిస్తాడు -> స్పర్శ ది టచ్. రొమాన్స్
బెర్త్ కి నలుగురు చొప్పున కూర్చొని ప్రతొక్కడూ జోకులేసేస్తారు -> కామెడీ.
ఇలన్లొచ్చి హీరోయిన్నేడిపిస్తే హీరో ఇరక్కుమ్మేస్తాడు ->  యాక్షన్
ఆ తర్వాత అదే రైల్లో డ్యూయట్లూ    -> టిమటిమలు
కుదిరితే ఐటెం గర్ల్ తో ప్లాట్ ఫాం మీద గ్రూప్ డాన్స్లులు -> సామూహిక టిమటిమలు
చిన్న హీరో అయితే హీరో హీరోయిన్లు అదే ట్ర్తైనెక్కి లేచిపోతారు -> తట్టుకోలేని టిమటిమలు.
పెద్ద హీరోలయితే  విలన్ రైల్లో పారిపోతుంటే హీరో హెలికాప్టర్ తో చేజింగ్ చేస్తాడు. కుదరకపోతే బైకేస్కొని 
ఎంటపడి ఎగిరించి ట్రైన్ మీదకి దూకేస్తాడు. తిక్కరేగితే తొడగొట్టి ఎనక్కి పంపించేస్తాడు -> అరాచకం.
చిన్నప్పుడు రైల్లో మిస్సయిపోయిన హీరో క్లైమాక్స్ లో ఏ రైల్వే స్టేషన్లోనో తల్లిని కలుసుకుంటాడు -> సెంటిమెంటు.

అబ్బబ్బా.. ఏం వాడకమయ్యా... ఇండియన్ రైల్వేస్ ని అన్నిరకాలు గా వాడేది సాధారణ జనాలు కాదు. సినిమా జనాలే. వీటికి బాగా ట్యూనైపోయాన్నేను. 

ఓ సారేమయ్యిందంటే........

(గమనికః ఈ కింది రొమాంటికి ఎపిసోడ్ ని 18 యేళ్ళ లోపు యువతీ యువకులు కూడా చదవొచ్చు.. నష్టమేం లేదు )
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx00000xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

"నా పక్క బెర్త్ లో కత్తిలాంటమ్మాయ్ కూర్చుంటాదేమో....?? కిటికీ పక్కన నా ఎదురుగా కూర్చొని నేను చదూతున్న పుస్తకం అడుగుతాదేమో...? ఓఓఓఓఓఓ... హౌ రొమాంటిక్  హౌ రొమాంటిక్" అని ఊహలు ఊరేసుకుంటూ సామర్లకోట రైల్వే స్టేషన్ లో కనెక్టింగ్ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న నాకు "రాజ్ కుమార్ గారూ.. దయ చేసి వినండీ.. రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ తన బనియన్ విప్పి పట్టాలు తుడవటానికి పూనుకోవడం వల్ల మీరు ఎక్కాలనుకుంటున్న రైల్ రెండు గంటలు ఆలస్యంగా తగలడును" అని ద.మ రైల్వే ఆకాశవాణి వినిపించింది. నేను ఊహల్లోంచి ఇహలోకి వచ్చి, ఎలా టైం పాస్ చెయ్యాలో తెలీక అమ్మ చేసిచ్చిన చపాతీ, పెరుగన్నం తినడం మొదలెట్టాను.
"జీవితం లో మొదటి సారి చివరి నిమిషం లో బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది...టేక్ కేర్ డూ...డ్" అని  నా సిక్స్ సెన్స్ చెప్తుంటే నేనే దానికి జండూబామ్ రాసి పడుకోబెట్టేసి రైలెక్కేశాను.

ఎప్పుడూ కూడా ఫాంటసీస్ ఫెంటాస్టిక్ గానూ, నిజాలు నికృష్టంగానూ ఉంటాయి. తిరప్తి ప్రయాణం పెట్టుకున్న ఓ "బంగారు కుటుంబం" మధ్య లో నా బెర్త్ కన్ఫర్మయ్యింది. కృష్ణవంశీ "లో బడ్జెట్" లో కుటుంబ కధా చిత్రం తీసినట్టు ఓ బామ్మ గారూ, కొడుకులు, కోడళ్ళు, వాళ్ల సంతానం తో కళకళ లాడిపోతూ గోల గోలగా ఉంది. రాత్రి తినాల్సినది సాయంత్రం నాలుగింటికే తినేయడం వల్ల అనుకుంటా ఎనిమిదింటికల్లా నా కడుపులో డైనోసర్లు దౌడు తీస్తున్నాయి. సరిగ్గా అదే టైమ్ లో బామ్మ గారు బ్యాగ్ లోంచి దబ్బకాయ పులిహోర బైటికి తీసి తన రెండు తరాలకీ వడ్డించడం మొదలెట్టారు. గుప్పు మన్న ఆ సువాసనకి డైనోసర్లు గర్జించడం మొదలెట్టాయి. అందరూ ఆబగా తినేస్తుంటే నేను బ్రమ్మానందం లా బేల చూపులు చూడటం మొదలెట్టాను సిగ్గులేకుండా.

అప్పుడు ఆ వృద్ధ దేవత కరుణా వీక్షణాలు నాపై ప్రసరించి "ఇదిగో బాబూ...పులిహార తీసుకో" అన్నాది పేపర్ ప్లేట్ ఇస్తూ. "అయ్యో...వద్దండీ బామ్మగారూ..నేను ఆల్రెడీ తినేశానండీ" అన్నాను ప్లేట్ తీసుకుంటూ. ఈ బామ్మలూ అమ్మమ్మలూ, నానమ్మలూ ఉన్నారు చూశారూ...  వంటలు తపస్సులాగా తర తరాలుగా చేసీ చేసీ చేతుల్లో అమృతపు ఊటలు సిద్ధిస్తాయి వాళ్ళకి. "తత్ పులిహోర పరమాద్భుతః". పీకల దాకా మెక్కేసి మూతి తుడుచుకున్నాను.

బామ్మగారుః  ఎందాకబ్బాయ్?
నేనుః బెంగుళూరు దాకా నండి.
బామ్మగారుః మరి తిరప్తెళ్ళే ట్రైనెక్కావేటీ?
నేనుః తిరుపతి మీద నుండి బెంగుళూరెల్తాదండీ.
బామ్మగారుః ఆ...హా...! మే తిరప్తి లో దిగేస్తాం లే. సదుంకుంటున్నావా? ఉజ్జోగం చేస్తున్నావా?
నేనుః ఉజ్జోగమేనండీ..
బామ్మగారుః ఏ ఉజ్జోగమో? ఇంజినీరు అయ్యింటాది లే.... ఏ మాత్రం వత్తుందేటి నెలకి?.....బానే వత్తాదిలే.
నేనుః ఆ... అదీ... ఏదో బెంగుళూరికి సరిపోయేలాగా..!
బామ్మగారుః ఏ మాత్రం ఎనకేసేవూ?
నేనుః బాగానే... లోన్లూ, అప్పులూనూ.
బామ్మగారుః ఆహా.... నాన్నగారేం చేస్తుంటారూ? ఎంతమంది సంతానం?
నేనుః టీచరండీ. నేనూ తమ్ముడూనూ..!
బామ్మగారుః బడిపంతులుజ్జోగమాఆఆఆఆ.... ఇంతకీ ఏమింట్లూఊఊఊ???
బామ్మగారబ్బాయిః నువ్వు కాసేపు ఊరుకోవే అమ్మా.. అలా అడక్కూడదే..!!

ప్రశ్నల పరంపరకి ఆనకట్ట వేయడానికి ట్రై చేసిన అబ్బాయి గారి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాను.
ఆయన మాత్రం నాకేసి "ఊరికినే పెట్టిందనుకున్నావా దబ్బకాయ పులేరా? మా అమ్మకి భలే టైం పాస్ " అన్నట్టు చూశాడు. "ఏమింట్లో తెలీకుండా పెళ్ళి సంబంధం ఎలా చూడమంటావబ్బీ?" అన్నారు బామ్మ గారు. నేను ఆశ్చర్యంతో ఆనందంతో ఆరాధనగా చూశాను ఆవిడ వైపు.

"మాకు తెలిసినోళ్ళమ్మాయి బెంగుళూర్లోనే చేస్తుంది. బానే పెడతారు. ఇంతకీ ఎలాటమ్మాయి కావాలా?"

"అలాగా మామ్మ గారూ...   నాకు..."

"ఎలా ఉంటే ఏట్లే...? నువ్వేమన్నా పాలరాయిలా తెల్లగా ఉన్నావా? నాపరాయిలా నల్లగా నిగనిగలాడుతున్నావ్"

నాకేమనాలో తెలీక  అబ్బాయి గారి వైపు అభ్యర్ధనాపూర్వకంగా చూశానీసారి. ఆయన మొహం తిప్పుకొని కిటికీ లో నుండి చీకట్లోకి చూస్తూ గెడ్డం గోక్కుంటున్నాడు. "నాకు తలనొప్పిగా ఉందండీ ఇక పడుకుంటాను" అన్నాను మోకాలు రుద్దుకుంటూ.

"అయ్యో అలాగా..నాయనా పడుకో.. పడుకో.. నాకీ దిక్కుమాలిన రైల్లో నిద్రపట్టదు.... వేరు శనగుండలు ఉన్నాయి 
 తింటావేటీ?" 
"శనగుండలా.... ఆ.. తింటాను"
"ఉత్తుత్తి కకృత్తి కాదు రా బాబూ నీది" పొరపాటున బయటకే అనీసేడు అబ్బాయి గారు.
ఆత్రం గా ఉండ తీసుకొని తింటుంటే బామ్మ గారు ఇందాక ఆపేసిన దగ్గర మొదలెట్టేరు

"ఇప్పుడు చెప్పు... నీకెలాటి పిల్ల కావాలీ?? చూడగానే గంతకి తగ్గా బొంత అనేలాగుండాలి గానీ కాకి ముక్కుకి దొండపండులా ఉండకూడదు అంటాను... ఏటంటావ్?"

"శనగుండలు బాగున్నాయండీ... మీరే చేసేరా?"

"తలకి కొబ్బిరి నూనీ, మొహానికి పొగడ్రీ రాయవా నువ్వూ? చూడెలా ఉన్నావో.. ఇలా అయితే పెళ్ళవ్వుద్దా?"

నేను :  "శనగుండలకి లేత పాకం పట్టాలా? ముదరపాకం పట్టాలా మామ్మగారూ?"

"కళ్ళజోడేట్టేవు తలనొప్పికా? చత్వారమా?? చత్వారమే అయ్యుంటాదిలే"

నేనుః ............................................... 
  

"మాటాడవేటబ్బీ.... అంతేలే... తల్నెప్పి కీ, తల తిరుగుడుకీ మందులున్నాయి గానీ తింగరితనానికి లేవు మరి"

ఆ రోజు మామ్మగారు నన్ను జీడి నమిలినట్టు నమిలేసేరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఏమ్ జీవితమో ఏమో గానీ  ఎప్పుడూ ఇలా బుర్ర తినేసే బామ్మగార్లూ, రాత్రంతా ఏడ్చి ప్రాణాలు తోడేసే చంటిపిల్లలూ, కంపార్ట్మెంట్
 కంపించిపోయేలా గురక పెట్టి హింసించే అంకుల్సూ తప్ప ఇంకేం లేదు నా దైద్రమా...ని దైద్రం.

******************************************xxxxx**********************************
అది మండే ఎండలకి బెంగుళూరు సైతం భగభగ మండుతున్న ఒకానొక వేసవి. మా ఏరియా లో దొరికే మామిడిపళ్ళు ఆస్తులమ్ముకొని కొనుక్కున్నా గానీ, వాటి ఆకారం చూసి మామిడిపళ్ళు అనుకోవాలి తప్ప 1% కూడా  వాసన గానీ, రుచి గానీ ఉండవు. ఇదే సంగతి ఇంట్లో చెప్తే, "ఎంత కష్టమొచ్చిందిరా మనవడా" అని కరిగి కన్నీరు కార్చిన మా తాతయ్య బుట్ట మామిడి పళ్ళు కొని మా ఇంటికి పంపించారట. "ప్రశాంతీ ఎక్స్ప్రెస్ లో పార్సిల్ చేసెయ్యండి.. ఇక్కడ నేన్ తీసుకుంటా" అని మా పితృదేవులని యుద్ధ ప్రాతిపదికన పరుగులు పెట్టించాను.

హాలీడేస్ ఎంజాయ్ చెయ్యడానికి పూణే నుండి బెంగుళూరొచ్చిన మా ఫ్రెండ్ శ్రీహరి గాడిని తోడుతీసుకొని ఉరిమే ఉత్సాహం తో మెజిస్టిక్ రైల్వేస్టేషన్ కి వెళ్ళాను గంట జర్నీ చేసి మరీ. ఎంక్వయిరీ చేస్తే పార్సిల్స్ అన్నీ పక్కనున్న 
గొడౌన్ లో కలెక్ట్ చేసుకోవాలని చెప్పారు. "యే ఆమ్ కా ఆరాటం హై" అనుకుంటా గొడౌన్ చేరుకునేసరికి అరగంట పట్టింది. "ఎక్కడ? ఎక్కడ నా మామిడి పళ్ళు?" అని కనిపించిన ఆఫీసర్ని అడిగితే "గత వారం రోజులుగా దిగిన సామానంతా అక్కడ ఉందీ... పోయి వెతుక్కోండీ" అని దారి చూపించాడు. మోచేతుల్దాకా చొక్కాలూ, మోకాళ్ళ దాకా ప్యాంట్లూ మడిచీ వెతికాం.. వెతికాం...ఎంతకీ కనపడదే...!! ఇదే ముక్క అక్కడున్న ఓ కూలీ తో  చెప్తే... "ఇక్కడ లేదంటే ప్లాట్ ఫాం మీదనే ఉంటాది" వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు.

"ఓర్నాయనోయ్... ఎండకి బంగారం లాంటి బంగినపల్లి మ్యాంగోస్ పాడైపోతాయ్ దేవుడోయ్" అనుకుంటా ప్లాట్ ఫాం మీదకి పరిగెట్టాం. రెండు కిలోమీటర్ల పొడవున్న ప్లాట్ ఫాం మీద రెండు గంటల పాటు అమెరికా వాడు లాడెన్ కోసం వెతికినట్టూ వెతికాం. ఫలితం శూన్యం. పొద్దున్న తిన్న ఆరిడ్లీలూ అరిగిపోయాయి. మధ్యాహ్నం భోజనం లేదు. మామిడిపళ్ళ మీద ఆశ చావలేదు. మా కష్టాన్ని చూసి చలించిపోయి గుండెలు బాదుకున్న ఓ గార్డ్.. స్టేషన్ అవతలి వైపున ఇంకో ఆఫీసుందీ. అక్కడకి పోతాయి అన్నీనూ. వెళ్లి ఫాం ఫిల్ చేసి, డబ్బులు కట్టి తెచ్చుకోండి అని జ్ఞాన బోధ చేశాడు. సరే అని కాళ్ళీడ్చుకుంటూ ఆఫీస్ కి వెళితే ముందు డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకోండీ. మీ పార్సిల్ ప్లాట్ ఫాం మీదే ఉంటాది పోయి వెతుక్కోండి అని చావు కబురు చల్లగా చెప్పింది ఆ ఆఫీసరమ్మ.

నా నీరసం విరక్తి గా మారి "మామిడి పళ్ళూ వద్దూ మట్టి గడ్డలూ వద్దూ.. పోదాం పదరా" అన్నాను శ్రీహరి గాడితో.
" "ఆరంభించరు నీచ మానవుల్..." మనం మొదలెట్టాం.. మధ్యలో వదిలే ప్రసక్తే లేదు. మామిడిపళ్ళు వచ్చుడో కేసీఆర్ చచ్చుడో తేలిపోవాలి" అని విక్రమార్కుడిలా నన్ను వెంటేసుకొని, రిసిప్ట్ తీసుకొని బయలుదేరాడు
శ్రీహరిగాడు. సాయంత్రం నాలుగైపోతుంది టైం. ఈ సారి కళ్ళు పెద్దవి చేస్కొని ఇద్దరం చెరో దిక్కుకీ వెళ్ళి వెతగ్గా వెతగ్గా పాత స్మశానం లో కొత్త శవం లాగా కనిపించింది మా మామిడిపళ్ళ పెట్టె. అక్కడికక్కడే వీణ స్టెప్పేసుకొని, పీడకల వచ్చి నిద్రలేచిన కోతిపిల్లల్లాగా గెంతుకుంటూ, బాక్స్ తోడెట్టుకొని ఓవర్ బ్రిడ్జ్ మీంచి వస్తున్నాం. అప్పుడే ఏదో ట్రైనొచ్చింది అనుకుంటా... ఒకటే జనమ్. "చూశావా... మనిషన్నాక సహనం, కృషీ, పట్టుదలా ఉండాలి... కష్టాలు డైలీ సీరియల్ లాంటివి రా. ఎంత పెద్దవైనా ఏదో ఒకరోజు అయిపోవాల్సిందే" విజయానందంతో చెప్పుకుపోతున్నాడు శ్రీహరిగాడు.

"హల్లో...సార్...సార్" అని పిలిచింది ఒక అపరిచిత స్త్రీ మూర్తి. వెనక్కి తిరిగి చూశాను. నన్నే పిలుస్తుంది. "అయ్యో పాపం...ఏ అవసరమో ఏమిటో..మనకెవడూ హెల్ప్ చెయ్యలేదు. మనమన్నా ఒకరికి చేద్దాం" అని బాక్స్ అక్కడే వదిలేసి వెనక్కి వెళ్ళాను.

నేనుః ఏంటండీ ఏం కావాలీ??

అ.స్త్రీ.మూః టికెట్..!

నేనుః టికెట్ ఇక్కడ కాదండీ కౌంటర్లో ఇస్తారు.

అ.స్త్రీ.మూః నాది కాదు మీ టికెట్ ఇవ్వండీ. కమాన్ క్విక్. (చేతిలో ఉన్న నల్ల కోటు భుజాన వేసుకుంటూ..షర్మిలక్క శృతి లో)
నేనుః (దొరికేశాం రా దేవుడోఓఓఓఓ T.C నా? )  మేము జర్నీ చేసి రాలేదండీ... జస్ట్ ప్లాట్ ఫాం మీదకి వెళ్ళాం. లగేజ్ తెచ్చుకోడానికి.

T.C :    ఓహో... అయితే ప్లాట్ఫాం టికెట్ చూపించండి.

నేను + శ్రీహరి గాడు ః అ....క్కాఆఆఆఅ....! మేమ్ స్టేషన్ లోంచి ఎంటరవ్వ లేదు. గొడౌన్ నుండి ఎంటరయ్యాం. ప్లాట్ ఫాం టికెట్ తీస్కోడం మరిచిపోయాం.

T.C :   ఏం పర్లేదు.. చెరో 500 ఫైన్ కట్టండి.

నేనుః  తొందర పడకక్కా... ఇదిగో ఈ రిసిప్ట్ చూడు. పార్సిల్ తెచ్చుకోడానికే వెళ్ళాం.

T.C : ఒకే రిసిప్ట్ మీద ఇద్దరిని ఎలో చెయ్యను. 500 ఫైన్ కట్టండి.

నేనుః తమ్ముడి లాంటోణ్ణక్కా..  నీ తమ్ముణ్ణి నువ్వు నమ్మవా? సారీ.. యే... ఈ సారికి వదిలెయ్వా ప్లీ...జ్జ్.

T.C : నిన్ను నమ్మాను కాబట్టే ప్లాట్ ఫాం టికెట్ తీయనందుకు ఫైన్ రాస్తున్నాను తమ్ముడూ. లేకపోతే టికెట్ తియ్యకుండా ట్రావెల్ చేసినందుకు 1000 వేసేదాన్ని. ఇందా రిసిప్ట్ తీసుకో.

చేసేదేమీ లేక శ్రీహరి గాడు ఫైన్ కట్టేశాడు. నిశ్శబ్దం గా నడుస్తున్నాం. "ఒరే...అన్ని వందల మంది ఉండగా నిన్నే ఎందుకు పిలిచిందిరా??? పిలిస్తే పిలిచింది... "నేను కాదా లెజెండ్?" అనుకుంటా పోయేవ్. నీ దరిద్రాన్ని గొయ్యి తీసి పాతెయ్యా..!నీతో తిరిగితే చుచ్చు పోసిన చంటిపిల్లోడు ఇల్లంతా పాకినట్టూ పాకేస్తాది దరిద్రం" అంటా కట్టలు తెంచుకున్న ఆవేశంతో కళ్ళంట నీళ్ళతో అరిచాడు శ్రీహరిగాడు.

"ఇదంతా వద్దువద్దంటున్నా మనకి ఎదురొచ్చిన అప్పల్రాజుగాడి వల్లేరా" అనేసి నేరం అప్పిగాడి మీదకి తోసేశాను. తెలివిగా. "రాత్రంతా నైటవుట్ చేసి కష్టపడి పేకాట్లో గెలిచిన డబ్బుల్రా...మొత్తం దొబ్బేసింది పెంటకుప్పకి ఫోటో తీసి
వాసన రాకుండా సెంటుకొట్టే చుంచు మొహంది" అంటూ కళ్ళు తుడుచుకుంటున్న శ్రీహరిగాడీ ఆవేశాన్ని కరెంట్ గా మార్చి ఉంటే ఇండియాలో కరెంట్ కి కొదవే ఉండేది కాదు.

స్టేషన్ బయటకి రావడానికి మూడు చెకింగ్ గేట్లు ఉన్నాయ్. ప్రతీ గేట్ లో లగేజ్ చూసి చెయ్యి చాపిన ప్రతొక్కడికీ 
చెయ్యి తడిపేసరికి జేబులో పదిరూపాయల చిల్లర మిగిలింది. దానితో ఓ కొబ్బరికాయ కొని రైల్వే స్టేషన్ కీ, స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్న రైల్వే ఉద్యోగులకీ, చేతిలో డబ్బులు పెడితే పార్సిల్ లో ఏముందని కూడా అడగని చెకింగ్ ఆఫీసర్లకీ, ఇండియన్ రైల్వే మొత్తానికీ దిష్టి తీసి కసితీరా నేలకేసి కొట్టేసి, కొబ్బరి ముక్కలు తినుకుంటా బస్సెక్కి  బయలుదేరాం.

ఇంటికొచ్చి ఘుమఘుమలాడే మామిడిపళ్ళని చూస్తుంటే కిలుంపట్టిన రాగిబిందిని చింతపండెట్టి తోమాక తళతళలాడుతుంటే కలిగే ఆనందం నాకు. ఆ రోజు రాత్రి ఆకలి తో కాదు... విధి మీద కసి కొద్దీ తినడం మొదలెట్టాం 
మామిడి పళ్ళు. 

"ఎలా ఉన్నాయి రా మామిడిపళ్ళూ?" అనడిగాన్నేను.

"ఉన్నదంతా అమ్మి ఒంగోలావుని కొంటే, బండెడు గడ్డితిని పావులీటరు పాలిచ్చి పిడికెడు పేడేసిందంటరా..అలా ఉంది" అన్నాడాడు.
 xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx000xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని జోకులేసినా గానీ రెండు ట్రాకుల మీద అన్నేసి బళ్ళని పద్దతిగా, అనుకున్న టైం కి కొంచెం అటు ఇటుగా నడిపేస్తూ, ఆటోవాడు పక్క వీధికి కూడా తీసుకెళ్ళని డబ్బుల్తో  జనాన్ని ఊళ్ళు దాటిస్తూ, ఎన్నో గొప్ప పరిచయాలనీ, అనుభూతులనీ కలిగిస్తూ, సౌకర్యవంతమైన, క్షేమకరమైన ప్రయాణాన్ని అందిస్తున్న "ఇండియన్ రైల్వేస్" అంటే నాకిష్టం.