Tuesday, September 11, 2012

అట్టు ముట్టని వాడు మట్టిగడ్డై పుట్టున్...!

తెలుగు భాష లో నాకు బాగా నచ్చిన పదాల్లో ఒకటది.
నేను ఎంతగానో మెచ్చిన పదార్ధాల్లో మొదటిది.
కడుపు నిండుగా ఉన్నా చూడగానే నోటికి ఆకలి తెప్పించే అట్టు అది.

కొంచెం డీటెయిల్డ్ గా చెప్పాలంటే నేను చాలా  ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. మీరు అంతకంటే ఓపిగ్గా వినాలి.

అట్ల మీద నా నాలుక ఎప్పుడు మనసు పారేసుకుందో, ఎందుకు పారేసుకుందో, ఎలా పారేసుకుందో నాకు గుర్తు లేదు గానీ అర్ధ రాత్రుళ్ళు నిద్ర లేచి
"భౌఔఔఔఔఔఔఔ... అట్టు..... అట్టు కావాలీ" (భౌఔఔఔఔ... అంటే ఏంటని అడగొద్దు.. నాకూ తెలీదు) అని
ఏడుపు మొదలెట్టే నాకు, మా పెద్దమ్మమ్మ అప్పటికప్పుడు పిండి కలిపి, పొయ్యి రాజేసి అట్టేసి పెడితే రెండు 
ముక్కలు తినీ, ప్లేటు పక్కలో పెట్టుకొని పడుకునే వాడినట. ఆ ఆకారం లోనే ఆ ఆకర్షణ ఉందో, ఆ పేరు లో ఏ మేజిక్కుందో, అట్టేసే మా అమ్మమ్మ ప్రేమ వల్లే ఆ రుచి వచ్చేదో  తెలీదు గానీ పిండేదయినా, పచ్చడి ఉన్నా లేకపోయినా నా ఈ పిచ్చి రోజు రోజు కీ, నాతో పాటూ పెరిగి పీక్ కి వెళ్ళిపోసాగింది.

ఎప్పుడూ శనగపిండి అట్టో, వరిపిండి అట్టో, చోడి పిండి అట్టో, కోడిగుడ్డట్టో తింటూ పెపంచికం లో అన్నిటీకంటే రుచికరమైన పద్దార్ధం ఇదే అని
మురిసిపోయే నేనూ.. ఓ రోజు, ప్రతీ రోజు లాగే కడుపునిండా పెరుగన్నం తినేసీ, పక్క వీధి లో ఉన్న మా మావయ్య వాళ్ళీంటికి వెళ్ళాను. మా అత్తేమో పచ్చరంగులో ఏవో అట్లేసీ, మధ్య లో ఉప్మా పెట్టి మావయ్యకీ, బావలకీ వేస్తోంది. నాకూ ఒకటి వేడి వేడిగా వడ్డించింది.

ఈ అట్టూ-ఉప్మా కాంబినేషనేమిటో, ఆ కలరేంటో, ఆ వాసనేంటో... అంతా వింతగా అనిపించింది. అప్పటికే జాలువారుతున్న నోట్లోని లాలా జల ప్రవాహాలనీ, నాసికా రంధ్రాల గుండా దూకుతున్న జలపాతాలనీ సంగమీంచనివ్వకుండా ముక్కు ఎగబీల్చి, అట్టు ముక్క నోట్లో వేసుకున్నా...అంతే. "ఇదేరా.. ఇదే.. ఈ రుచికోసమే ఇన్నాళ్ళూ నువ్వు పెట్టిన అడ్డమైన అట్లూ రుచి చూశాను.. ఇన్నాళ్ళకి నా జన్మ సార్ధకమయ్యింది.. రానియ్.. రానియ్యి.. ఇంకోంచెం పెద్ద ముక్క తుంచు.. ఆ ఉప్మాతో కలుపు..ఆ..అదీ.. చెట్నీతో తాకించడం కాదురా..గాడిదా  ముంచు బాగా.. పెట్టూ నోట్లో.. కమాన్...డూ ఇట్ ఐ సే"  అంటూ నా నాలుక మెదడుని ఆధీనం లోకి తెచ్చేసుకొని ఆర్డర్స్ వెయ్యటం మొదలెట్టీంది..




మా అత్త స్టౌ ఆర్పేసీ, అట్ల రేకు తిరగేసేసే వరకూ తినేసి ఇంటికి బయలు దేరాను. ఇంటికొచ్చేసరికి కడుపంతా బరువుగా అనిపించింది. ఊపిరాడటం లేదు. పొట్ట ఉబ్బిపోయి గట్టిగా అప్పుడే ఊదిన బెలూన్ లాగా అయిపోయింది. మంచం మీద వెల్లకిలా పడుకొనీ....."అమ్మోయ్... కడుపు నొప్పెడుతుందీ" అంటూ తన్మయత్వంతో విషాద గీతం పాడుతున్న హిమేష్ రిషమియా లాగా అరవటం మొదలెట్టాను. 

అమ్మః అయ్యో.. అయ్యో.. పొట్టేమిటి ఇలా ఉబ్బిపోయిందీ? ఏమండీ.. ఇలా వచ్చి చూడండి.. బుజ్జిగాడినీ..
నాన్నః ఏమయ్యిందిరా?? ఏం తిన్నావ్??
నేనుః  పెసరట్టు.. అత్త పెట్టిందీ...!
నాన్నః పెసరట్టా?? ఎన్ని తినేశావ్??
నేనుః ఒకటే... (ఎన్ని తిన్నానో రివైండ్ చేసుకుంటూ..)
నాన్నః ఓరి నీ కక్కుర్తీ..... తగలెయ్య... పొద్దున్నే కదా కడుపునిండా మెక్కావు? ఆకలెక్కువ - పీక సన్నం ఎదవకీ.
నేనుః కడుపు నొప్పేడతుందీఈఈఈ....

ఇంతలో మా నానమ్మ (మా ఇంటీ ఓనరు) విషయమ్ తెలుసుకొని, నిప్పుల కుంపటి తెచ్చీ చేత్తో కాక పట్టి కడుపు మీద పెట్టేసరికి రిలీఫ్ అనిపించింది. చాలా కాలం పాటు నాకు అర్ధం కాలేదు పెసరట్టు తిండానికీ, కడుపునొప్పి రాడానికీ సంబంధం ఏంటో...!

నా ఈ అట్ల యావ అర్ధం చేసుకునీ, ఏదీ లేకపోతే కనీసం ఆమ్లెట్టన్నా వేసి పెట్టే మా నానమ్మ, అట్లతద్ధికి ఎవరో ఇచ్చిన పుల్లట్లు తెచ్చి "బుజ్జియ్యా.. నీకోసం పప్ప 
తెచ్చేనయ్యా" అని ఒక అట్టు నా చేతిలో పెట్టింది ఒకనాడు. ఇదేంట్రా బాబూ అట్టుకెక్కువా, రొట్టికి తక్కువా అన్నట్టూ ఇలా ఉందీ అని అనిపించింది మొదట. గుండు గీయించుకున్న ఫ్రెండు ని డిప్ప మీద పీకాలనిపించడం ఎంత కామనో, చేతిలో పుల్లట్టెట్టినప్పుడూ తినాలనిపించడమూ అంతే కామన్ కదా?? తిన్నాను. ఒకసారి పుల్లట్లు రుచిమరిగినోడు ఇంకోటి 
తినాలనుకోడా? పెద్దలు మీరే చెప్పండీ..! ఇంకోటి పెట్టమన్నాను. ఒకటే వాయినం ఇచ్చేరూ... ఇంక లేవూ అన్నాది. మా అమ్మని చెయ్యమని అడిగాను. "నాకు రాదురా" అనేసింది.
నేనూరుకుంటానా? ఎండిపోయిన నూతిలో చేదేసి నీళ్ళు తోడేసినట్టూ ఈళ్ళిద్దరి ప్రాణాలూ తొడెయ్యటం మొదలెట్టేను.
ఇలా అయితే లాభం లేదనీ "పిల్లోడు తింటాడు కదా అని అట్టుముక్క చేతిలో పెట్టాను గానీ, ఇలా నన్ను పీక్కు తింటాడని కలగన్నానా.. మేష్టారూ?" అని ఏంగ్రీ యంగ్ మేన్ అయిన మా పితృదేవులకి కంప్లయిట్
ఇచ్చింది. మా ఆగ్రహ యువకుడు నన్ను ఈడ్చితన్ని,  echo ఎఫ్ఫెక్ట్ లో నా చేత అరిపిస్తాడు అని భయపడ్డాను.

కానీ ఆరోజు బ్రహ్మ రాత నాకు పాజిటివ్ రాసి ఉంది.
"కోతి చేతిలో టూత్ బ్రష్ పెడితే అది పళ్ళు తోముకుంటుందా? వీపు గోక్కుంటుందా?..లేకా పీకి పారేస్తుందా? అంటే ఏం చెప్పగలం పిన్నిగారూ?? అది కోతి. ఏమయినా చేస్తుంది..ఈ ఎదవా అంతే.. అదేదో వండి పెట్టండి" అని అంతిమ తీర్పిచ్చారు నాన్నారు.

ఆ తరవాత పుల్లట్ల స్పెషలిస్టు అయిన ఎదురింటి గున్నిమామ్మ చేత చేయించి పెట్టాక నేను రాక్షస సంహారం చేసిన అమ్మోరిలాగా శాంతించాననుకోండీ.. అది వేరే విషయం.

******************************************************************************************
ఉల్లిపాయలు -- 5Kg --------- ఆ
3kg - ఉప్మా నూక ---------ఆ
kg - చనా పిండి ---------ఆ
2 kg - దుంప ---------ఆ
కేజీ.. మంచి నూని---------ఆ
.
.
.
.
.
లిస్ట్ వెరిఫికేషన్ అలా ఫ్లో లో పోతా ఉంది. మా తాతయ్య గారికి అప్పట్లో కిరాణా షాపు ఉండేది. తాతయ్య స్కూల్ కి వెళ్ళిపోయాక అమ్మమ్మ నడుపుతూ ఉండేది. అప్పట్లో వేసవి సెలవుల్లో నేను బాలకార్మికుడి అవతారం ఎత్తుతూ ఉండేవాడీని.. ఊరికినే కాదు లెండీ... గళ్ళా పెట్టె దగ్గర కూర్చొని బిస్కెట్లు, బిళ్ళలూ, జీళ్ళూ, 
చాక్లెట్లూ, లాగిస్తూ అమ్మమ్మకి హెల్ప్ చెయ్యడానికి. 
ఊళ్ళో ఉన్న హోటల్స్ అన్నీ మా కొట్టు లోనే కొనేవోళ్ళు  సరుకులు... అందులో పెద్ద ఖాతా "ఇందేసు ఒటేలు" అన్నమాట. పైన చెప్ప్పిన లిస్ట్ వెరిఫికేషన్ ప్రతీ రోజూ రాత్రి జరిగే సీన్ అన్నమాట.

రోజూ పొద్దున్నే పెరుగన్నం తినేసి, నాన్న చెయ్యి పట్టుకొని స్కూల్ కి వెళ్ళిపోవటం తప్ప బయట తిండి అలవాటు లేని  నాకు "బుజ్జీ... ఇందేసు ఒటేలుకెళ్ళీ దోస తెచ్చుకో" అనే అమ్మమ్మ మాటలు నాకు శ్రియాఘోషల్ పాడిన రొమాంటిక్ సాంగంత సమ్మగా అనిపించేవి. బారెడు పొద్దెక్కినా, మొద్దుల్లాగా నిద్రపోయే మా మాయలకీ, చీపురు కట్ట పట్టుకోడం కూడా చేతగాని మా చిన్నపిన్ని కీ టిఫిన్ తీసుకురమ్మనటమే అందులోని ఆంతర్యమని ఆ పాల
బుగ్గల బాల రాజ్ కుమార్ కి తెలీదు అప్పట్లో.. అందుకే  నిక్కరు ఎగదోసుకొని బయలుదేరేవాడిని.

ఇందేసు ఒటేలు అంటే పెద్ద హోటలేం కాదు. మా ఇంటికి పదడుగుల దూరం లో బజార్లో రావి చెట్టుకింద చిన్న చీకటి పాక. పొద్దున్న టైం లో చాలా బిజీ గా ఉండేది. 
ఎప్పుడు చూసినా ఇందేసు గారు చెక్కబల్ల మీద కూర్చొని, రెండోవైపు అరిగిపోయి, కత్తిలాగా పదునుగా తయారయిన గరిట తో ఉల్లిపాయలూ, పచ్చిమిర్చీ, అల్లం కసాబిసా కోసేస్తా ఉండేవాడు ఎవ్వరితోనూ మాట్లాడకుండా.

అయితే ఇక్కడ నేను బాగా ఎంజాయ్ చేసే విషయం ఒకటుంది. మోకాళ్ల వరకూ నిక్కరేసుకొనీ, పొయ్యి మీద దోశల పెణం పెట్టీ చెక్క పెట్టెమీద "ఇది నా చీకటి సామ్రాజ్యం, ఇదే నా సింహాసనం" అన్నట్టూ మహారాజ ఠీవి తో
కూర్చొని దోశలు పోసే రాజారావ్ పెదనాన్న(ఇందేసు గారి కొడుకన్నమాట). ఒక చేత్తో పొయ్యిలో మంట ఎగదోస్తూ, పెణం మీద చుయ్య్ య్ మనేలా నీళ్ళు కొట్టీ, చీపురు తో తుడిచేసీ, నూనేసీ, ముందుగా ఉల్లి, మిరమ మిక్స్ జల్లీ, వాటి మీద బాగా కలిపిన పిండిని చిన్న గ్లాస్ తో నేర్పుగా గుండ్రంగా సింగిల్ టేక్ లో పోసీ, అది కాలేలోపు జేబు లో బీడీ కట్ట లోంచి ఒక బీడీ నోట్లో పెట్టీ పొయ్యిలోని కొరకంచె తో బీడీ వెలిగించి పొగ వదులుతూ ఉంటే ఆ దృశ్యం
చూడటం ఎన్ని సార్లయినా బోర్ కొట్టేది కాదు. సినిమాల్లో సిరంజీవి ని చూసినట్టూ ఫీలయిపోయేవాడీని.

ఉల్లిదోసా,సాదాదోసా, మినపట్టూ ఇలా పోస్తూ, ప్లేట్లోకి తీస్తూ, బేరాలు చూస్తూ, నన్ను మాత్రం ఒక అరగంట కూర్చోబెట్టే వాడు.(మనం డబ్బులు ఇవ్వం కదా.. సాయంకాలం కొట్లో  సామాన్లు కొనే టప్పుడు లెక్క చూసుకునేవారు). 

నా రిక్వైర్మెంట్ ఏంటో తెలుసు కాబట్టీ అన్నీ వేసి మా అచ్చీరత్నం పెద్దమ్మకి ఇచ్చీ "బాబబా డ్బబడబడబ గుర్ గురురగుర్ మినప.. గర్ గర్ ఉల్లి..సాదా. డగడగడగ" అనే వాడు నాతో. (చాలా ఫాస్ట్ గా లొడలొడా మాట్లాడటం తో అతని మాట నాకు అర్ధమయ్యి ఏడ్చేది కాదు).

అప్పుడు, అడ్డాకుల్లో దోసలు చుట్టీ, దారం కట్టీ, ప్యాకింగ్ చేస్తూ 
"ఈ మినపట్టు మీ చిన్నమాయకంటా, ఈ ఉల్లి దోశ మీ పెద్దమాయకి, ఈ పలచగా రేకుల్లా కాల్చిన దోస మీ పిన్నికీ, ఈ సాదా దోస నీకూ.. స్పెసల్ గా ఈ గ్లాస్ లో  పోసిన బొంబాయ్ చెట్నీ కూడా నీకే.. కారం ఉండదు.. ఏడి చల్లారకముందే గమ్మున పరిగెత్తుకెల్పో ఇంటికి..  జాగ్రత్త రా బాబూ తన్నుకొని పడిపోగలవు"
అని ఆ మాటల్ని  డీకోడ్ చేసీ, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేది అచ్చీరత్నం పెద్దమ్మ. నాకు అక్కడే హోటల్లో అందరిలాగా కూర్చొని తినాలని ఆశగా ఉండేది. కానీ ఒప్పుకునేవారు కాదు ఎప్పుడూ :( :(




ఇక ఇంటికొచ్చి ఆ దోసలు తింటుంటే రాజా... నో పాస్టెన్సో.. నో ఫ్యూచరు. నా ఒంట్లో కరెంటు. ఇంట్లో అమ్మ చేసే
దోసలు ఇంత రుచిగా ఉండవూ? అనిపించేది ప్రతీసారీ..!

ఆ టేస్టంతా పెణం తుడిచే ఆ జిడ్డు చీపురుదే అనీ, అదే చీపురుతో పొద్దున్న పూట వాకిలి తుడుస్తారనీ అంటా
ఉండేవాడు మా తాత.(ఎంతవరకూ నిజమో తెలీదు)
ఆ టేస్టు దగ్గర ఈ కామెంట్లన్నీ ఇరగ డాన్సాడుతున్న చిరంజీవి పక్కన ఎక్స్పోజింగ్ చేస్తున్న హీరోయిన్ లాగా ఫేడయిపోయేవి.

దీన్ని బట్టి మీకేమర్ధమయ్యిందీ? మూలుగు కి రోగం పెరిగినట్టూ, వయసు కి చాదస్తం పెరిగినట్టూ, కృష్ణవంశీ కి మూర్ఖత్వం పెరిగిపోయినట్టూ... నాకు అట్ల మీద ఆప్యాయత అలా అలా పెరిగిపోయిందని తెలీట్లేదూ?
******************************************************************************************************

ఇహ బెంగుళూర్ కి వచ్చాక రంగా....మోహన్ బాబుకి మైకిచ్చినట్టూ, పిచ్చోడికి రాళ్ల కుప్ప చూపించినట్టూ
అయ్యింది నా పరిస్థితి. రెచ్చి రంకెలేసానంటే నమ్మాలి మీరు.
చిన్న హోటలూ, పెద్ద హోటలూ,దోస కార్నరూ అని లేదు...కనిపిమ్చిన చోటల్లా ఎటాక్
చేసేసీ, మసాలా దోస,సెట్ దోస,,రవ్వ దోస, ఆనియన్ దోస, రవ్వ-ఆనియన్, రవ్వానియన్ మసాల, ఓపెన్ బట్టర్ మసాలా, గోభీ దోస, కాప్సికమ్ దోస, రాగి దోస, పన్నీర్ దోస, పెసర దోస, ఆనియన్ పెసర దోస, ఆనియన్ మిర్చీ పెసర దోస, నా దినం దోస, అప్పం, ఊతప్పం మొదలైనవన్నీ మొహమాటం లేకుండా, సిగ్గు పడకుండా తినీ, అరిగించుకొనీ అట్టు/దోసల మీద మీద నా ప్రేమని చాటుకొన్నానని బ్లాగ్ ముఖంగా చెప్పుకోడానికి గర్వ పడుతున్నాను. 




అసలు దోసల పేర్లు వింటుంటేనే.... 

"రసాతలం లో మసాలా దోసా... పెసరట్టుప్మా తినాలని ఆశా.." 
"అల్లం, ఉల్లీ కసకసా కట్ చేశా... రవ్వా మిక్స్ తో దోసలు పోసా"
"చక్కని దోసకై పెన్నాన్ని గీసా... ముక్కలైన దోసని పక్కన పారేసా"


అని ప్రాస తో కూడిన  భావకవిత్వం లావాలాగా పొంగుకొచ్చేస్తుంది నాకు.

అయితే నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద హోటల్స్ లో డబ్బులు సమర్పించుకొని బ్రేవ్ మనటం తప్పితే టేస్ట్ అంతగా బాగోదు. 
బెంగుళూర్ లో మా రూం కి దగ్గర్లో ఓ చిన్న హోటలుంది. మన తెలుగు వాళ్లదే. సాదా/ఆనియన్/కారం దోసలు వాళ్ళ  స్పెషలు.(దోస Rs.15 డెడ్ చీపు) ఆ ఆంటీ రెండు స్టౌల మీద బుల్లి బుల్లి పెనాల మీద చక చకా వేసిస్తారు. మామూలుగా పిండి గరిటతో వేసీ గుండ్రంగా పరుస్తారు కదా... ఆవిడ పెనం గాల్లోకి ఎత్తి గుండ్రంగా తిప్పుతారు. చాలా పలచగా టేస్టీగా వస్తాయ్ లెండీ.. ఒక్కొక్కళ్ళదీ ఒక్కో ఫార్ములా. ఆ హోటల్ లో దోసలు బాగా ఇష్టం నాకు. మినిమం నాలుగు ఐదు దోసలు ఊదేస్తాను నేను.

సాటి అట్టు/దోస ప్రేమికులకి సూచనలు - నా పరిశీలనలుః

1. మొదట వాయ తో తీసిన ఇడ్లీ, ఆఖరిగా వేసిన అట్టూ అద్భుతంగా ఉంటాయ్.

2. హైజెనిక్ ఫుడ్డూ తొక్కా తోటకూరా అంటారు గానీ రోడ్ సైడ్ కాకా హోటల్లోనూ, తోపుడు బళ్లల్లోనూ ఉండే రుచి ఇంకెక్కడా రాదు. 

3. హిట్టయ్యే మాస్ సినిమా కి ఐటెం సాంగులూ,బూతు డైలాగులూ ఎంత ముఖ్యమో, దోసలకి చెట్నీ,సాంబారూ అంత ముఖ్యం.
   చాలా మంది చట్నీ కి టచ్ చేస్తే షాక్ కొడుతుందేమో అన్నట్టూ చెంచాడు చెట్నీ తో తినేస్తూ ఉంటారు. ఏదో పేజీలు తిప్పినట్టూ ఉంటాది యవ్వారం. పాపం తగులుతాది అలా తింటే. ఒక అట్టుకి కనీసం మూడ కప్పుల చెట్నీ/సాంబారు మింగితే అప్పుడే దాని జన్మకీ ఒక అర్ధం పరమార్ధమూనూ.

4. నాన్ స్టిక్ పెనం మీదేసిన అట్టు పారెయ్యడానికి కూడా పనికిరాదు నా దృష్టి లో. మట్టి పెనం, మామూలు అట్లరేకు మీద వేసిన అట్టుకొచ్చే రుచే వేరు.
5. కొంత మంది దోసల్ని కూడా కత్తులతో కోసి, ఫోర్కులతో పీక్కుతింటారు. అలాంటి వాళ్లని చూసి జాలి పడండి. చేత్తో తుంచీ, చెట్నీలో ముంచీ, నాన్చీ, తినడానికి గర్వపడండి.

6. అట్లెప్పుడూ వేడి వేడిగా ఊదుకుంటూ తినేయాలి. "మాకు తెలుసు లే" అంటారేమో... కొంచెం వివరిస్తాను.  ఇంట్లో అట్లేసేటప్పుడు ఒకటి పూర్తిగా తినకముందే ప్లేట్లో ఇంకొకటీ వేసేశారనుకోండి. పాతది కంప్లీట్ చేశాక ఇది తినటం కన్నా, మోస్ట్ రీసెంట్ గా వేసినది ముందు తినెయ్యటం ఉత్తమం.

7. హోటల్ నుండి దోసల్ని పార్సిల్ తీసుకెళ్ళడం కన్నా ఆవురావురుమంటూ అక్కడే తినెయ్యటం మంచి పద్దతి. (చల్లారి పోయి, స్మూత్ నెస్ పోయిన దోస ఏజ్ బారయిపోయిన హీరోయిన్ లాంటిది) పైగా కావల్సినంత చెట్నీ
లాగించొచ్చు.

8. మీకోసం మీరే దోసలు వేసుకొని తినడం దరిద్రమయిన దురదృష్టం. ఎవరయినా ఒకదాని తర్వాత ఒకటీ వేసి పెడుతుంటే తినడం మహా  అదృష్టం .


ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైపోవటం తో మహాభారతం లాగా సాగుతున్న నా ఈ అట్ల పురాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.  ఈ పురాణాన్ని
విన్నవారికీ, చదివిన వారికీ అష్టరకాల అట్లు సిద్ధిస్తాయనీ నేను నొక్కి వక్కాణిస్తున్నాను.

॥సర్వేజనాం సుఖినో భవంతు॥
॥శ్రీఘ్రమేవ అట్లు ప్రాప్తిరస్తు॥





జైహింద్...!