Thursday, July 14, 2011

ఆ దేవుడికి ఇదేం బుద్ధీ?


రిగ్గా ఇరవై రోజుల కిందట....
ఆఫీస్ నుండీ క్యాబ్ లో ఇంటికెళుతున్నాను. ఇంటినుండి అమ్మ ఫోన్.
"అప్పారావు సార్ కి ఆరోగ్యం బాలేదంటరా... కారణం సరిగ్గా తెలీదు 15 రోజుల కిందటే ట్రాన్స్ఫర్ అయ్యి మన స్కూల్లోనే జాయినయ్యారు.హఠాత్తుగా ఏమయ్యిందో తెలీదు. సీరియస్ గా ఉందనీ ఇప్పుడే తెలిసిందీ" అనగానే ఎందుకో ఏదో తెలియని భయం.

చాలా కాలం అయిపోయిందీ మా మాష్టారికి ఫోన్ చేసి మాట్లాడి. దాదాపు ఎనిమిది సంవత్సారాలు గడిచిపోయాయి ఆయన్ని చూసి. వర్క్ ఎక్కువగా ఉండటం ఒక కారణం అయితే.. నా బద్దకం, నిర్లక్ష్యం  అసలు కారణమ్.
అన్నట్టూ మీకు తెలీదు కదూ మా సార్ గురీంచీ...

మా ఫ్యామిలీ లో అమ్మగారి వైపు చూసుకున్నా, నాన్నగారి వైపు చూసుకున్నా మ్యాత్స్ అంటే మైలు దూరమ్ పరిగెట్టే వాళ్ళే గానీ చదివిన వాళ్ళు లేరు. నేను కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఒకటవ తరగతి కంప్లీట్ అయినా ఒకటి నుండి పది వరకూ
అంకెలు చెప్పమంటే మధ్యలో ఐదు తర్వాత ఏడూ అని చెప్తూ మా నాన్నగారి గుండెల్లో రైళ్ళు పరిగెట్టీంచే వాడిని. ఆయన నన్ను ఊరంతా పరిగెట్టించి, అలిసిపోయి ఇంటికొచ్చాకా పడేసి తొక్కేవారు. అలా నాతో పాటూ లెక్కలంటే నాకున్న భయం కూడా పెరిగి ఆరో తరగతి లో కి ఎంటరయ్యింది.
నన్ను ట్యూషన్ లో జాయిన్ చేశారు. నా తోటివాళ్లందరూ అన్ని సబ్జెక్ట్లూ చదువుతుంటే..నేను ఫుల్ టైమ్ లెక్కలు మాత్రమే చేసేవాడిని. రెండు సంవత్సరాల తర్వాత సెవెన్త్ లో మనమే స్కూల్ ఫస్ట్. నా మ్యాథ్స్ మార్కులు మాత్రం 54. మా ట్యూషన్ సార్
చేతులెత్తేసీ నా వల్ల కాదనేశారు. నేను సగర్వంగా కాలరెగరేశాను.

సరిగ్గా అప్పుడే మా నాన్నగారు నన్ను అప్పారావు సార్ ట్యూషన్ కి తీసుకొచ్చీ.. "మా వాడిని మీ చేతుల్లో పెడుతున్నా. మీరేం చేస్తారో తెలీదు.. లెక్కల్లో కనీసం ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేలా చూడండీ. కనీసం వాడి భయం పోయేలా చూడండీ " అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు.

కొత్త మాష్టారు, కొత్త వాతావరణం, అంతా కొత్తే. మొదట్లో భయం ఆయన్ని చూస్తే. మా సార్ వయసు అప్పటికి 40 దాటదు. కానీ జుత్తంతా పండిపోయి ఒక్క నల్ల వెంట్రుక కూడా ఉండేది కాదు. రోజూ పది కిలోమీటర్లు సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళొచ్చేవారు. పొద్దున్న వెళ్ళే ముందూ, సాయంత్రం
వచ్చిన తర్వాత ట్యూషన్ అన్నమాట. చిన్న పిల్లలందరికీ వారి శ్రీమతిగారు చెప్తూ ఉంటే, మా లాంటి ఘటాలని ఆయన చూసుకునే వారు.  తెలుగు, హిందీ తప్ప అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసేవారు. ఆయన లెస్సన్ ఎప్పుడూ మధ్య మధ్య లో జోకులేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది. మా అందరికీ చాలా ఇష్టం ఆయనంటే.
ఎంతంటే ఎప్పుడయినా అల్లరి చేసి ఆయనకి దొరికేస్తే.. ఆయనకి కోపం వస్తుందేమో అన్న భయం కన్నా, ఆయన్ని నొప్పించామన్న  బాధ ఉండేది. అలా ఉండేది ఆయన ట్రీట్మెంట్. సార్ కి  ఎప్పుడన్నా కోపం వస్తే  ఆ  కోపాన్ని  2,3 సెకన్లు  మాత్రమే ముఖం  లో ఉంచీ , అలిగినట్టు గా కొద్ది సేపు చూసి  నవ్వుగా మర్చేసేవారు. ఆ నవ్వు చూడగానే రిలాక్స్ అయిపోయేవాళ్ళం.  ఆ సమయం లో అతని మొహం చూడటం చాలా ఇష్టమయ్యేది నాకు. 
రోజూ వారి ఇద్దరు పిల్లల ముద్దు మాటలతో, ఆటలతో  మాకు టైమే తెలిసేది కాదు.

క్రమంగా నాకు లెక్కలంటే భయానికి బదులుగా ఆసక్తి రావటం మొదలయ్యిందీ నాకు తెలీకుండానే. ఎంతగా అంటే టెంత్ లో మ్యాథ్స్ టెక్స్ట్ మొత్తాన్నీ వారం రోజుల్లో పొద్దుట నుండీ రాత్రి వరకూ ఒక్క లెక్క కూడా వదలకుండా చేసేటంత.
నాకు చదువంటే మొట్టమొదటి సారిగా ఇంట్రస్ట్ కలిగింది అప్పుడే (అప్పటివరకూ పరీక్షల భయం తోనో, హోమ్వర్క్ చెయ్యకపోయినా, మార్కులు తక్కువ వచ్చినా తిడతారని మాత్రమే చదివేవాడిని ). అంతటి ఇంట్రస్ట్ నాకు ఆ తర్వాత మళ్ళీ దేనిమీదా ఎప్పుడూ కలగలేదు. ;( ;( .

టెంత్ పరీక్షలు ఇంకో మూడు నెలలున్నాయనగా నేనూ, నాతో పాటూ మా ఫ్రెండ్స్ అందరం వాళ్ళింటిలోనే ఉండి పోయాం. దాదాపు పది మంది.ప్రొద్దుటే ఇంటికేళ్ళీ స్నానం గట్రా చేసేసీ
మళ్ళీ ట్యూషన్ కి, తర్వాత స్కూల్, ఇంటికొచ్చి రెడీ అయిపోయి మళ్ళీ సార్ వాళ్ళింటికీ. ఇదే మాలోకం.. మా స్కూల్ కన్నా, ఇల్లు కన్నా వాళ్ళింటిలో ఉండటమే నచ్చేది మాకు.
రాత్రుళ్ళు మేము చదువుతూ  కునికి పాట్లు పడుతూ ఉంటే మ్యాడమ్ గారు మాకోసం రాత్రి పదకొండు కి టీ లు చేసిచ్చేవారు రోజూ. సార్ కి మాత్రం కాఫీ.ప్రతీ రెండు గంటలకీ ఒక కప్పు కడుపులో పడిపోవాలి ఆయనకి. అప్పుడప్పుడూ ఆయన కాఫీ మేము తాగేసీ, మా "టీ" సార్ కి ఇచ్చేవాళ్ళం( పొరపాటున) .
"రేయ్.. నా కాఫీ ఎవరయ్యా తాగేశారు? నువ్వేనా...? ఎంజాయ్.. దాని టేస్ట్ అమృతానికి కూడా ఉండదూ. మిస్స్స్స్...నాకు  ఇంకో కాఫీ.." అనేవారు నవ్వ్యుతూ. మేము మాత్రం కడుపు నిండా టీ తాగి కంటి నిండా నిద్రపోయేవాళ్ళం.

"గోళ్ళు కొరకబాకు రా సభా పిరికి అవుతావూ..."
"ఏంటి నాన్నా.. టైం ఎంతయిందీ? ఇంత లేట్ గానా రావటం?"
"అరేయ్.. బకెట్ సాంబార్ లో ఒక ఇడ్లీ ముక్క పడేసీ అందులో నీ తలకాయ ముంచుతా"
["ఇడ్లీ ముక్కెందుకు సార్ పడేయటం ?" అని అడిగేవాళ్ళం
" సాంబార్ లో ముంచినప్పుడూ ఆ ముక్క కోసం వెతుకుతాడు రా" అనేవారు.]
"ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ !"
ఈ మాటలు, ఆ పద్యమూ ప్రతీరోజూ ఒక్కసారన్నా ఎవరో ఒకర్ని ఉద్దేశించి అనేవారు..  ఆ పద్యమయితే మాష్టారు మొదటి పాదం పాడగానే అన్ని క్లాసుల వాళ్ళం, చదువుతున్నదీ, రాస్తున్నదీ, చేస్తున్నదీ ఆపేసీ "నొప్పింపక తానొవ్వక తప్పించుకు
తిరుగువాడు ధన్యుడు సుమతీ" వంతపాడి నవ్వేవాళ్ళం.
నెలలో మొదటివారం దాటేలోపు  ఫీజివ్వలేక పొతే ఇక రానక్కరలేదు అని చెప్పే స్కూళ్ళూ, ట్యూషన్ సెంటర్లూ తెలుసు నాకు. ఆయన మాత్రం నెల మధ్యలో ఒకసారి "ఫీజ్ రిమైండ్ చెయ్యండమ్మా ఇంట్లో " అని కామన్ గా అందరికీ ఒకే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేవారు అంతే.. ఇచ్చినోళ్ళ  దగ్గర తీసుకునే వారు. లేదంటే లేదు. 
"ఎంత పంచినా తరగనిది చదువొక్కటే " అనేవారు ఎవరైనా అడిగితే.
ఆయనకీ నేనంటే ఎంత ఇష్టమంటే.. సెలవులకి వాళ్ళూరు వెళ్ళోస్తే నాకోసం  గోంగూర పచ్చడి తెచ్చిచ్చి "గుంటూరు గోంగూర" రుచి చూడవోయ్ అనేవారు.
క్రికెట్ మ్యాచ్ వస్తుంటే మాతో కలసి చూసేవారు. పిక్నిక్ కి తీసుకెళితే మాతో కలసి ఆడేవారు. ఆరోజులు మళ్ళీ రావనుకుంటా..! 

మొత్తానికి టెంత్ ఫైనల్ ఎగ్జామ్ లో మ్యాత్స్ నా చేతులారా చేసుకున్న తప్పువల్ల 4 మార్క్స్ తగ్గీ 96/౧౦౦ వచ్చాయి ..! నా కన్నా ఎక్కువ ఆనంద పడ్డారు మా నాన్నారు 90 దాటాయని. నా కన్నా ఎక్కువ బాధ పడి ఉంటారు మా సారు... సెంట్ రాలేదని...!

ఆ తర్వాత సార్ ఫ్యామిలీని తీసుకొనీ వైజాగ్ వెళ్లిపోయారు ట్రాన్స్ఫర్ మీద. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడ్డం తప్పా.. కలవలేదు.

మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ న్యూస్...

మర్నాడే ఆఫీస్ కి సెలవు పెట్టీ డైరెక్ట్ గా వైజాగ్ వెళ్ళాను. వెళ్ళే ముందుగా విన్నదాన్ని బట్టీ ఆయనకి చిన్న ప్రేవులు పాడయ్యి, డైజెషన్ సిస్టమ్ స్తంభించిపోయిందటా. గత పది రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా సెలైన్ మీదనే ఆధారపడుతున్నారు. ఆపరేషన్ చెయ్యాలో వద్దో కూడా డాక్టర్లకి తెలీని పరిస్థితి.
భయపడుతూ  భయపడుతూ వెళ్ళాను హాస్పిటల్ కి. నన్ను చూసేసరికీ "హా.. వచ్చావా నాన్నా... నీ కోసమే ఎదురుచూస్తున్నాను" అంటూ పలకరించారు. ఎలా ఉన్నారు సార్ అని అడగలేనీ, గురువు గారి  దగ్గరకి వెళ్ళినప్పుడు పండో, కాయో తీసుకెళ్ళి ఇవ్వలేని పరిస్థితి . సరిగ్గా ఆరోజు నుండే ఆరోగ్యం కాస్త కుదుట పడిందటా. ముందు రోజు వరకూ వంటికి ఉన్నవైర్లన్నీ తీసేశారట. మ్యాడమ్ గారు కూడా నవ్వుతూ మాట్లాడారు. హమ్మయ్యా అనుకున్నాను. సార్ మాటలకి అవధులే లేకుండా పోయాయి. బెడ్ మీదనే పడుకొనీ ఎన్ని కబుర్లు చెప్పారో..!

"ఏం లేదు నాన్నా.. సీరియస్ ప్రాబ్లమే గానీ డాక్టర్స్ సరయిన సమయానికి గుర్తించారు. కాఫీ తాగడం తప్ప ఏ అలవాటూ లేని నాకే ఎందుకొచ్చిందీ అంటావా? అలా అని ఇక్కడ రాసుందీ..! కాకపోతే జీవితం లో ఏ సమస్య కీ తలోంచని నేను ఒకానొక దశ
లో భయపడ్డాను. నా  పిల్లలూ, ఫ్యామిలీ ఏమయిపోతారూ? అని.  కానీ ఒక్కటే ధైర్యం .. మనకి తెలిసీ నలుగురికి సాయం చేసి ఆదుకున్నామే తప్పా.. ఎప్పుడూ ఎవర్నీ బాధ పెట్టలేదు... ఇది దేవుడు పెట్టిన పరీక్ష అంతే..నాకు అన్యాయం చెయ్యడూ..
నాకున్న బలాలు రెండే రా.. ఒకటి నాకున్న మిత్రవర్గం, రెండు నా స్టూడేంట్స్.. అంతే ఇంకెవరూ లేరు. మీరంతా ఉండగా నాకేం అవుతుందీ..? నాలుగు రోజుల్లో డీశ్చార్జ్ చేసేస్తారు.రోజూ పదివేలు ఖర్చు పెట్టాలీ అంటే మనలాంటి  బడి పంతుల్లకీ అయ్యే  పనా ?   అవసరమయితే రెండు రోజుల కొకసారి చెకప్ కి వచ్చేస్తాను  .
కాకపోతే.... "దాహమేస్తుండీ  గుక్కెడు నీళ్లు ఇవ్వండీ" అని  డాక్టర్ల ని అడుగవలసిన ఇలాంటి పరిస్థితి, కాఫీ సంగతీ పక్కనెట్టూ.... గొంతెండిపొతే నీళ్ళు పుక్కిలించి ఊసెయ్యాల్సిన పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. చెప్తున్నానని కాదు గానీ ఫ్యామిలీ అంతటికీ హెల్త్ ఇన్షూరెన్స్ చేయించూ. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు.. ఈరోజు నువ్వొచ్చావ్ కదా..నా నీరసం మొత్తం ఎగిరిపోయిందీ" 

ఇలా ప్రస్తుతం టీచర్ల పనితీరు గురించీ మొదలుకోనీ చిన్నప్పుడు ఆయన పేరు వచ్చేటట్టుగా అమ్మ చేత అల్లించి ఇచ్చిన బ్యాగ్ వరకూ, అన్నీ గుర్తుచేసుకుంటూ,గుర్తు చేస్తూ   గలగలా మాట్లాడుతూనే ఉన్నారు. నా పెళ్ళీ తన చేతులమీద గానే జరగాలన్నారు. 5 రోజులు జరిపిస్తానన్నారు.  ఎప్పటిలాగానే జోకులేశారు. పాత ఫ్రెండ్స్ అందరినీ ఎవరేం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. నా నుదుట కుంకుమ పెట్టీ, ఏదో శ్లోకం
చదివీ ఆశీర్వదించారు.. నేను బయలుదేరే ముందు వెనక్కి పిలిచీ "
రెండు విష్యాలు చెప్తానూ గుర్తుంచుకో 
1. నీ మంచితనాన్ని, నిజాయితీనీ ఎప్పుడూ నిలబెట్టుకో 
2. నీ ఫ్రెండ్స్ కి కానీ, హెల్ప్ కావల్సిన వాళ్ళెవరయినా కానీ, నీ చేతిలో పని అయితే మాత్రం
తప్పకుండా హెల్ప్ చెయ్యి. అంతే..
" అన్నారు.

గుండెల నిండా గాలి పీల్చుకొనీ, తేలిక పడిన మనసు తో బయలుదేరాను. ఇంటికి మా వూరు వచ్చేసిన మర్నాడే పొద్దున్నే నాన్నగారు "సడెన్గా  బీపీ తగ్గిపోయీ అప్పారావ్ సార్ ఎక్స్పైర్ అయ్యారటరా తెల్లవారుజ్హామున" అని  చెప్పిన మాటకి నిద్ర ఎగిరిపోయి ధిగ్గున లేచి కూర్చున్నాను.
ఆయన్ని చూడటానికి వెళ్లలేదు నేను. అది తప్పో, ఒప్పో తెలీదు. నేను ఆయన్ని అలా నిర్జీవంగా చూడలేను. ఏ జన్మ  పుణ్యమో ఆ ముందురోజు ఆయనతో కలిసి ఆ క్షణాలు పంచుకోవటం. అంత లోనే అలా.....ప్చ్.. ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షల పేరుతొ మంచి మనుషులకు శిక్షలు వేస్తున్టాడో? . ఇది కూడా  మా మేడం గారికీ, నా చిన్నారి  చెల్లెళ్ళకీ పెట్టిన పరీక్షే అనుకోవాలా ?

15 comments:

Mauli said...

ఏ దేవుడికి :)

SHANKAR.S said...

మీ పోస్ట్ చదవగానే ఎందుకో ఈ పాట గుర్తొచ్చింది. నిజంగా ఇలాంటి గురువు దొరకడం మీ అదృష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.
"నూటికో కోటికో ఒక్కరు
ఎప్పుడో ఎక్కడో పుడతారు
ఆ దేవుడు మీరే మాస్టారూ
మా దేవుడు మీరే మాస్టారూ"

Chandu S said...


 మీరు ఆయనని చూడటానికి వెళ్లలేదన్నారే.... అది చాలు మీకు మాస్టారు ఎంత ఇష్టమో మాకు తెలియడానికి.

చిలమకూరు విజయమోహన్ said...

అప్పారావు మాష్టారుగారి ఆత్మకు శాంతిని,సద్గతిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.

ఇందు said...

:( ఏం మాట్లాడాలో తెలీట్లేదు! మీరు చేయగలిగింది ఒక్కటే...మీ సార్ చెప్పిన ఆఖరిమాటలు జీవితంలో ఎప్పటికి మరిచిపోకుండా గుర్తుపెట్టుకుని ఆచరించడం! ఆయన నమ్మకం కూడా మీలాంటి తన స్టూడెంట్స్ మీదే కాబట్టి...మీకు తోచినంత,చేయగలిగినంత సాయం మీ మేడంగారికి, చెళ్ళెళ్ళకి(వారికి అవసరమైతేనే) చేస్తే...మీ సార్ ఏలోకంలో ఉన్నా....తన మాటకి మీరిచ్చిన విలువ చూసి ఆనందిస్తారు!

Mauli said...

hmm didn't check last paragraph about the bad news. you may ignore my prev comment if you get it wrong (jus asked as i couldn't get the post title)

may his soul rest in peace!

ఆ.సౌమ్య said...

చాలా బాధగా ఉంది రాజ్...కళ్ళచివర్న నీరు నిలిచింది. ఇప్పుడు ఆయన్ని ఎక్కువగా ఇష్టపడేవాడిగా నువ్వు చెయ్యాల్సినది వాళ్ళ కుటుంబానికి సాయం చెయ్యడం. ఆయన భార్యని పిల్లలకి నువ్వే రకమైన సహాయమైనా చెయ్యగలవేమో ఆలోచించు. సహాయం అంటే డబ్బు ఒక్కటే కాదు. ధైర్యం ఇవ్వడం, వాళ్ళ పిల్లలకి చదువల గురించి infomation ఇవ్వడం కూడా సహాయమే. బాధపడకు.....మీ గురువుగారి ఆత్మ కి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను.

బంతి said...

హ్మ్మ్ రాజ్ బాధగా ఉంది చదువుతుంటే. ఆయన ఆత్మకు శాంతి కలగాలి మేడం గారికి , పిల్లలకు ఈ కష్టాన్ని ఎదుర్కునే ధైర్యాన్ని ఇవ్వాలి అని భగవంతుడిని కోరుకుంటున్న

Vinay Chakravarthi.Gogineni said...

paapam......mee maastaaru chaala manchi vaaru..........valla family ki antha manche jaragaali jarugutundi.

రవికిరణ్ పంచాగ్నుల said...

ఏమనాలో తెలియడం లేదు సార్.. కొన్ని రోజుల క్రితం నేను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నా.. "మా రెండో అబ్బాయి.."అని అందరికి పరిచయం చేసిన పెద్దమనిషి.. మా మాష్టారు.. కాకపోతే, నేను చూసి వచ్చిన మూడోరోజు నిద్రలోనే కాలం చేసారు.

శశి కళ said...

aayanaki aayana kutumbaaniki devudu manchi cheyaalani korukuntunnanu

బులుసు సుబ్రహ్మణ్యం said...

కొన్ని కొన్ని ఘటనలు అనూహ్యంగా జరిగిపోతాయి. నమ్మలేకపోతాం.
వారి కుటుంబానికి ధైర్య స్థైర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుందాం.

durgeswara said...

నిజంగా మాష్టారు ధన్యజీవి
వారికున్న మీలాంటీ శిష్యవర్గమే వారికుటుంబానిక్ అండకావాలి.

Anonymous said...

"మేము మాత్రం కడుపు నిండా టీ తాగి కంటి నిండా నిద్రపోయేవాళ్ళం."
baboi....!!!

Palla Kondala Rao said...

సరదాగా ఉండే రాజ్ పోస్టులు వీలున్నప్పుడు చదువుతాను. నేను రెగ్యులర్ గా చిన్ని ఆశ బ్లాగు చూస్తుంటాను. అప్పుడప్పుడూ వెన్నెల్లో గోదావరి, వనజా వనమాలి కూడా , ఈ మధ్య రాజ్ బ్లాగు చూస్తున్నాను. ఈ రోజు నాకోసం అని లేబుల్ ఉంటే వేరే అంచనాతో చదివాను. సారీ.రాజ్ ! ఈ పోస్టు చదివాక నేనొకటి నిర్ణయించుకున్నాను. ఇక మీదట నిన్ను మీరు అని పిలవను. ఇప్పటిదాకా నేను చాలా తక్కువ మందిని ఫాలో అవుతూ వాళ్లలో నాకు నచ్చిన అంశాన్ని మాత్రమే పంచుకునే అలవాటుంది. అందుకే నీ ప్లస్ లో కామెడీగా ఉండేవాణ్ణి. 'నా కోసం' అని రాసుకున్న ఈ పోస్టు ఈ సమాజం కోసం , ఇప్పటి సమాజం కోసం చాలా అవసరం. మీ మాష్టారి కుటుంబం బాగుందా? ఇప్పటి గురువులు,శిష్యులూ తప్పనిసరిగా చదవాల్సిన పోస్టు ఇది. నా బ్లాగు జనవిజయం లో సేకరించిన ఆర్టికల లో ఇది ఉంచాను. ఈ పోస్టులో ఇదొక్కటే బాగాలేదు అనిపించింది ఎందుకో.-- ;( ;( -- వీలైతే వెంటనే తొలగించు.
మాష్టారు అన్న మాటల్లో " రోజూ పదివేలు ఖర్చు పెట్టాలీ అంటే మనలాంటి బడి పంతుల్లకీ అయ్యే పనా ?"," ఫ్యామిలీ అంతటికీ హెల్త్ ఇన్షూరెన్స్ చేయించూ. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు" ఈ పరిస్తితినుండి మన సమాజం బయటపడేందుకు కృషి చేయాలి.
కనీసం మాస్టారు చెప్పిన చివరి వాక్యాలు :
1. నీ మంచితనాన్ని, నిజాయితీనీ ఎప్పుడూ నిలబెట్టుకో
2. నీ ఫ్రెండ్స్ కి కానీ, హెల్ప్ కావల్సిన వాళ్ళెవరయినా కానీ, నీ చేతిలో పని అయితే మాత్రం
తప్పకుండా హెల్ప్ చెయ్యి. అంతే.."
ఎవరికైనా శంకర్ గారు చెప్పిన విశ్వరూపం పాట గుర్తుకు రావడం సహజం. మాస్టారు లాంటివాళ్లు అలా ఉంటారు నిజం.