Monday, June 11, 2012

ఓ చిత్రకారుడి చీకటి రహస్యాలు

వి ఇంట్లో మా అమ్మ మొట్టే మొట్టీకాయలూ, స్కూల్ లో నాన్న  పెట్టే బొబ్బట్లూ తినడం హాబీ గా మారిపోయిన దుర్గతి పట్టిన నాలుగో తరగతి రోజులు.
అప్పట్లో మా ఇంటి ముందే లైబ్రరీ ఉండేది.  లైబ్రేరియన్ మా నాన్నగారికి ఫ్రెండ్ అయిపోవటం తో  ఆకలితో ఉన్న
కుక్కకి తోలు చెప్పు దొరికినట్టూ నాకు ఆ లైబ్రరీ దొరికింది.  స్కూల్ నుండి రాగానే లిబ్ కి వెళ్ళిపోయీ  మూసేసే వేళ
వరకూ కదిలేవాణ్ణి కాదు. అవి నేనెప్పటికీ మరిచిపోలేని రోజులు లెండీ. బాలమిత్ర, చందమామా, బుజ్జాయీ,
బాలజ్యోతీ వగైరాలకి  ఈ ఆడోళ్ళంతా సీరియళ్ళు చూస్తూ ఏడవడానికీ, మా నాన్న రాజశేఖర్ సినిమాలకీ, మా తాత లంక పొగాకు చుట్టలకీ, మా నానమ్మ ఆ చుట్టపీకలు ఊడ్చడానికీ, అడిక్ట్ అయిపోయినట్టూ, అడిక్ట్ అయిపోయాను.

ఆ ఏడాది మా  లైబ్రరీ వార్షికోత్సవానికి   పలురకాల పోటీలూ పెడుతుంటే నా తరుపున మా నాన్నారు
చిత్రలేఖండనం, గానకాలుష్యం పోటీలకి నా పేరిచ్చీసేరు.  మా గోడమీద తగిలించిన పెయింట్ ని చూపించీ "ఈ
 బొమ్మ ప్రాక్టీస్  చెయ్" అని ఆర్డరేసేరు. ఆ బొమ్మేంటంటే... రెండు కొండలూ, మద్య నుండి ఉదయిస్తున్న  ఎర్రని
సూరీడూ(రూపాయి బిళ్ళతో వేయాలి) , మీద  పక్షులు ఎగురుతూ ఉంటాయ్, పక్కనే నీలి మేఘాలు ఉంటాయి. కొండల ముందు  ఏరు పారతా ఉంటాది.
అందులో రెండు తెరచాప పడవలు పోతా ఉంటాయ్. ఆ ఏటి ఒడ్డున రెండు కొబ్బరి చెట్లూ, వాటిని ఎక్కుతూ ఇద్దరు మనుషులూ..(ఇది నేను ఇంప్రొవైజ్ చేశా).




ఇహ చూస్కో నా రాజా... కనిపించిన ప్రతీ పేపర్ మీదా, గోడల మీదా, గుమ్మంమీదా రాక్షస ప్రాక్టీసు చేసేను.
పోటీ రోజు రానే వచ్చిందీ. నేను మొదలెట్టీ, ఒక కొండా, ఒక పడవా పూర్తయ్యేసరికీ నా ప్రాక్టీసు దెబ్బకి కొన ఊపిరితో
ఉన్న  స్కెచ్ లన్నీ అయిపోయాయ్.  తోటి కళాకారులని అడుక్కొనీ నా సీనరీ ని పూర్తి చేసేను.  తలతిప్పి చూసేసరికీ
ఒక్కొక్కడూ అద్భుతం గా  వేసేస్తున్నారు. కొంత మంది బ్రష్ లతో వేస్తుంటే, కొంతమంది స్కెచ్ పెన్ లోపలి కడ్డీని
నీట్లో ముంచి అద్దేస్తున్నారు. ఆ బ్యాచ్ నుండీ మా పక్కింటీ కిషోర్ గాడోచ్చీ...  "ఇదేంట్రా ఇల్లు అలికినట్టూ
అలికేశావూ.. చాలా వరస్ట్ గా ఉన్నాదిలే" అనేసి నా లేత మనసు ని గాయపరిచాడు. ఇక నాకు వడదెబ్బ కొట్టినట్టూ
డీ హైడ్రేషన్ అయిపోయిప్రిజ్ లో‌ పెట్టిన  లేతశవం లాగా బాడీ చల్లబడిపోయింది.

"ఎలా వేశావు రా బొమ్మా?"  అడిగింది మా మాతృదేవత ఇంటికి రాగానే. అసలే డిప్రెషన్ లో ఉన్న నేనూ
"ప్చ్... చెత్తలాగా నా స్కెచ్ పెన్ లు అయిపోయాయమ్మా.. లేకుంటే సూపర్ గా వేసుండేవాణ్ణి" అని కవర్ చేసేశాను.
"హ్మ్... ఒకసారి మీ నాన్న మనిషి బొమ్మ వేస్తే లుంగీ కట్టుకున్న ఆదిమానవుడు లాగా వచ్చాడు. చార్ట్ నున్నగా
లేదనీ, బ్రష్ బాలేదనీ సాకులొకటీ మళ్ళీ. ఆ జీన్స్ ఎక్కడికి పోతాయ్ లే" అనేసింది మా నాన్న కి వినిపించేలాగా.


కానీ ఇక్కడే అందరి అంచనాలు పల్టీ కొట్టాయి. మహా మహులకే మతులు పోయే విధంగా, మా నాన్న కళ్ళు తిరిగేవిధంగా ఫస్ట్ ప్రైజ్ నాకే‌ వచ్చిందీ.  నా ఆనందాన్ని ఆశ్చర్యం డామినేట్ చేసిందీ. మా అమ్మ "అన్నీ నా పోలికలే ఎదవకీ" అని మురిసిపోయింది. గుండు గొరికించుకొని గంధం రాసుకున్నంత హాయిగా అనిపించింది.
ప్రైజ్ తీసుకున్న ఆనందం లో  స్లో మోషన్ వీడియో లో, డీటీయస్ ఆడియో లో గర్వంగా తొడగొట్టాను.
కానీ "నీ కెవడ్రా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాడూ?" అనే ఈటెల్లాంటి మాటలు తూటాల్లాగా పేలుతూ  మా పేటంతా వినిపిస్తూ,
ఫ్యాక్షనిస్ట్  కుడితొడ మీద సెగ్గడ్డ లాగా బాధించాయి.
అడిగితే " నీకు ఫస్ట్ వచ్చినట్టు లేదురా.. ఊళెయ్యటం బాగా వచ్చని చెప్పి, నక్కల చేత కచేరీ
పెట్టించినట్టుందీ" అన్నారు చాలామంది.

ఎంతయినా మంచికి రోజులు కాదు కదండీ.. ఈ దేశం లో కళాకారులకి  తగిన ప్రోత్సాహం లేదు.. ;( ;( ;(

****************************************************************************
ఆ తర్వాత ఓ సారి ఏనుగు బొమ్మ వేసి మా తమ్ముడికి చూపిస్తే...  "పంది  భలే ఉంది అన్నయ్యా" అన్నాడు చప్పట్లు కొడుతూ... !  నోట్లో‌  తిరపతి లడ్డూ కుక్కీ, మూతి మీద గుద్దేస్తే ఎలా ఉంటాదో తెలుసా?? అలా అనిపించింది నాకు.
"మరి నేనంటే‌ ఏటనుకున్నావు..? పెద్దయ్యాకు నువ్వూ  నాలాగే వేసి మంచి పేరు తెచ్చుకోవాలి" అని క్లాస్ పీకీ, ఈ మాట ఇంకెవరితోనూ చెప్పొద్దని మాట తీసుకుని గమ్మునుండి పోయాను.

నేను ఆరో తరగతి కి వెళ్ళాకా,  మాకు వారానికోసారి డ్రాయింగ్ పిరియడ్ ఉన్నాదని తెలిసాకా మా నాన్న కన్నా పెద్ద ఆర్టిస్ట్ ని అయిపోవాలనే కోరిక పుస్తకాలకి చెద పట్టినట్టూ ఒళ్ళంతా పట్టింది నాకు.
మా  డ్రాయింగ్ సార్  "ఆచారి" గారు మొదటి క్లాస్ తీసుకున్నప్పుడూ "ఎవరెవరికి ఏ యే బొమ్మలొచ్చో  వేసి చూపించండ్రా" అన్నారు.
"నాకు బాతు బొమ్మ వచ్చు సాఆఆఆఆఆఆఅర్" అని ప్రకటించీ, పదే పది సెకన్ లలో వేసి చూపించా.
"అబ్బా.. ఇంత తొందరగా  అంత బాగా వేశావంటే నువ్వే రా నా శిష్యుడివీ , ఇదిగో బోర్డ్ మీద వెయ్యి అందరూ చూస్తారు" అని సుద్దముక్క చేతికిచ్చారు.
నేనుః "నాకు పుస్తకం లోనే బాగా వచ్చు.. బోర్డ్ మీద సరిగా వెయ్యలేనండీ"
డ్రాయింగ్ మాష్టారు: "పరవా లేదు.. నే ఉన్నా గా.... వెయ్యి..."
నేను" పుస్తకాన్ని తిరగేసి నట్టూ, బ్లాక్ బోర్డ్ ని తిరగెయ్య లేము కదండీ.. నాకు 76 ని బాతు చెయ్యడమొక్కటే
వచ్చు"
డ్రా.మాః "76 ని బాతు చేస్తావా...? ఏ.....లా... గా ??"

ఇదిగో.. ఇ...లా...గా..!



నేనుః ఇలా వేసీ చివర్లో...... తిరగెయ్యాలండీ. అదే ముఖ్యం.. ముందే తిరగేసీ, తర్వాత బొమ్మేస్తే ఇంకా మంచిది.

ఇది చూసిన మా మాష్టారు, నెత్తి మీద వాలి కాకి రెట్టేస్తుంటే చేతిలో కర్ర ఉండీ కొట్టలేని గాంధీగారి శిలా విగ్రహం
లాగా కాసేపు ఏం మాట్లాడకుండా నిలుచుండి పోయీ, తర్వాత బయటకి పోయీ, రెండు సిగరొత్తులు వెలిగించీ,
కాల్చీ, పీల్చీ, కాలికింద నలిపేసీ లోపలకొచ్చారు. క్లాసంతటినీ దీర్ఘం గా ఒక సారి చూసీ "నా ఇన్నేళ్ల సర్వీసు లో 
నూనె కాగితం తో‌ బొమ్మలేసిన ఎదవల్నీ, కార్బన్ పేపర్ తో బొమ్మ గీసిన కుంకల్నీ చూశాను. ఇలా బొమ్మేసి
తిరగేసినోళ్ళని చూళ్ళేదురా శుంఠా... సరే  మీ రూట్లో నే చెప్తాను" అని పాఠం మొదలెట్టేరు.



పాఠం పేరు : "ద" ని ఆనపకాయ చేయటం ఎలా??
క్లాసంతా పిశాచాలు గుసగుస లాడినట్టూ చిత్ర విచిత్రమయిన శబ్దాలతో చెవులు కొరికేసుకోటం మొదలెట్టారు.
డ్రాయింగ్ మాష్టారు:  మొదట మన త, థ, ద, ధ  లలో "ద" ని తీసుకోండీ. దాని తలకట్టు పట్టుకొని పైకి లాగీ నిలువు గా సాగదీయండీ.
నేను:   "ద " కి దీర్ఘం ఇస్తే  అక్షరం  అడ్డంగా  సాగుతాదీ, పలికితే నాలుక నిలువుగా సాగుతాది గానీ... "ద" నిలువు గా ఎలా సాగుతాదండీ? 
(బా గా అడిగాను కదా.. అప్పట్లో  క్లాస్ ఫస్ట్ నేనే)
"వస్తన్నా... వస్తన్నా...  " అని నా దగ్గరకొచ్చీ,  నా నెత్తి మీద జుత్తు పట్టుకొని పైకి లాగారు. చక్కగా మఠం వేసుక్కూర్చున్న నేనూ, ఆ  లాగుడికి లేచి నిలబడ్డాను.

"ద"  ని నిలువు గా ఎలా సాగదీయాలో  పిల్లలం దరికీ బాగా అర్ధమయ్యిందీ. నెత్తి మీద నాలుగు వెంట్రుకలు
ఊడిపోవటం తో నాకు ఇంకా బాగా అర్ధమయ్యింది.


డ్రా.మా:  అలా సాగ దీశాకా,  పైన తలకట్టుని వంకీ తిప్పీ,  కింద పీఠాన్ని పాలిష్ చేస్తే .... "ఆనపకాయ" రెడీ..!


ఇలా తన ఫస్ట్ క్లాస్ లోనే మమ్మల్ని చిత్రకారుల్ని చేసిన  ఆచారి మాష్టారు, ఎక్స్టెండ్ చేసిన మ్యాత్స్, సైన్స్ క్లాసులు
డ్రాయింగ్ క్లాస్  ల లోకి దూసుకొచ్చెయ్యటం తో,  ఎవ్వరూ డ్రాయింగ్ కి వేల్యూ ఇవ్వట్లేదన్న చింత తో ఎక్కువగా
చింత  చెట్ల కింద సిగరెట్లు కాలుస్తూ చేతికందిన కుర్రోళ్లని చావగొడుతూ తన ఉనికి చాటుకునేవారు...

కానీ ఈ స్పూర్తి తో, నేను గొప్ప ఆర్టిస్టు ననే గర్వం తో  ఖండించుకోని సరళరేఖలూ, ఖండించుకునే‌ చాప రేఖలూ,
ఇచ్చిన  కొలతలతో సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజాలు,  వక్రాలూ, పరివృత్తం, అంతర వృత్తం,
బాహ్య వౄత్తం   మొదలైన  నానా వ్యర్ధాలూ,  పెరాబొలాలూ, హైపర్ బోలాలూ, ఆకు అడ్డుకోతా, నాడీకణం నిలువు
కోతా, ఎన్నో ఎన్నెన్నో చిత్రీకరించాను పరీక్షల్లో...! ఒకానొక సారి ఉప్పు సత్యాగ్రహం మీద వ్యాసం రాస్తూ  గాంధీ గారి
గుండు పటం గీచీ భాగాలు కూడా గుర్తించాను.   కానీ ఎప్పుడూ ఎవ్వరూ నన్నొక చిత్రకారుడి గా గుర్తించలేదు.

ఈ దిగులు తో అప్పుడప్పుడూ నాకు తిండి సహించేది కాదు. మా అమ్మ ఆరు ఇడ్లీలు వేస్తే ఒక ఇడ్లీ వదిలేసే వాణ్ణి.
కూర ఎంత నచ్చినాగానీ ఎంగిలి చేయ్యి నాకెయ్యకుండా చేయి కడిగేసుకునేవాణ్ణి.
వద్దూ... మీరు నన్ను ఓదార్చొద్దు... !!!! ఎవ్వరి జాలినీ సహించలేను నేను.
*****************************************************************************
అయితే.... ఇంటర్లోకి అడుగు పెట్టాక ఇంకో ముచ్చట జరిగింది.  మా కాలేజ్ ఆనివర్సరీ కి ఆర్ట్ ఎగ్జిబిషన్
పెట్టారు.  "ఈ రోజుల్లో చిదిమి దీపం పెట్టుకునే టైప్ లో ఉండకూడదు. ఇంటికి నిప్పెట్టే టైప్ లో ఉండాలి" అని దిట్టంగా
డిసైడయ్యాను. ఈ లోకుల మీద కోపంతో, నా బొమ్మలు చూసే అదృష్టం ఈ పాడులోకానికి కలగనివ్వకూడదన్న కసి
తో (నిజం చెప్పాలంటే నాకు చేతకాని తనం తో) మా తమ్ముడి చేత ఒక
పెయింటింగ్ వేయించీ (వాడు పిచ్చ ఆర్టిస్టు) వాడి పేరు బ్లేడ్ తో గోకేసీ.. నా పేరు రాసేసీ, సబ్ మిట్ చేశా, ఆ తర్వాత
ఆ సంగతే మరిచి పోయా.

ఎగ్జిబిషన్ లో కొన్ని వందల పెయిటింగ్స్ మధ్య నాదీ ఒక చోట బుద్దిగా కూర్చుంది.
వారం రోజుల తర్వాత, ఒకరోజు  క్లాస్ జరుగుతూ ఉండగా,  మా సంస్కృతం సార్  వచ్చీ.... "మొన్నటి ఆర్ట్ ఎగ్జిబిషన్
లో బెస్ట్ 10 లో మన కాలేజ్ నుండి ఒకే ఒక్కటి సెలక్ట్ అయ్యిందీ.  రాజ్ కుమార్.... మన జూనియర్ కాలేజ్ పరువు
నిలబెట్టేవ్ " అనీ  చేతిలో  సెర్టిఫికేట్ పెట్టీ, చప్పట్లు కొట్టారు.

నాకు సిగ్గు లేదని మా పిత రోజూ తిడతా ఉండేవారు. నేనూ నిజమనే భ్రాంతి లో  బతికేసేవాడిని. కానీ  ఆరోజు
మాత్రం సిగ్గుతో సచ్చిపోడం అంటే ఏంటో తెలిసొచ్చిందీ. చీమ తుమ్మినా, ఈగ దగ్గినా వింత గానూ, విశేషం గానూ
చెప్పుకునే మా కాలేజోళ్లంతా కంగ్రాట్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే చెయ్యి వణికేసింది. నిజం చెప్పడానికి కాదు
కదా థాంక్స్ చెప్పడానికి కూడా మాట రాలేదు.
చప్పట్ల మధ్య చచ్చిపోయిన మూగ దోమ లాగా అయిపోయింది నా పరిస్థితి.

ఆరోజు చెప్పలేక పోయాను... ఈ రోజు మీకు చెప్తున్నా.... "ఆ పెయిటింగ్ వేసింది నేను కాదూఊఊఊఊ.!!!!!!
నాకసలు బొమ్మలెయ్యటమే రాదూ......!!!!! "

51 comments:

రసజ్ఞ said...

మీ బొమ్మలు కేవ్వ్వ్వ్ మీ టపాల్లాగానే :) మీరింత భీభత్సమయిన ఆర్టిస్ట్ అని తెలియక ఎవరెవరో చిత్రకారుల్ని పరిచయం చేస్తున్నా కదండీ నా బ్లాగులో ;) ఒకసారి మీ తుంటర్వ్యూ అదేలే ఇంటర్వ్యూ ఇవ్వరాదూ ;) ఈ బాతు, ఆనపకాయ నాకు కూడా ఇలానే వచ్చు. ఇంకా dojob అని వ్రాసి జోకర్ని గీయటం, ఎన్ని బొమ్మలేసినా నాకు కప్ప సైడ్ angle మాత్రం వచ్చేది కాదు అందుకే కప్పని తెలివిగా పై నుండి వేసేదానిని ;) ఇది చదివి నవ్వీ నవ్వీ కన్నీళ్ళతో పాటూ జ్ఞాపకాలు కూడా గుర్తుకొచ్చాయి ....... సూపరండీ!!!

Found In Folsom said...

hahaha....mee drawing story picha pichaga nachesindi....will read it again and again..maa vadiki kooda baatu bomma ela veyalo ippudu mee bomma choosi nerpinchesta..btw, chinnappudu matladithe rendu kondalu, madyalo selayeru, kinda neellu, kobbari chettu, naaku kooda standard pic..:P boledu chinna naati gnapakalani gurtu chesaru...nijamga chala bavundi..mee sense of humor adbhutam..telugu lo type cheyatam naaku kastam..so kshaminchagalaru
abbo, ivala nene first anukunta comment pedutundi..:)

pallavi said...

:) :)
nenu kooda aa 76 baatu bomma baga vesedanni.. kani 76 ni tiragesi rayadam practice chesinandu valla, book tirageyalsina avasaram raaledu naaku :) :)
appatlo ado vinta.. mana bujji chetulto vesi boldu anandapadipoye vallam..

naa 9th class daaka naaku bommaleyatam raadu ane nijanni baaga nammi.. maa daddy to veyinchedanni :) ..
oka sari maa sir tittaru kooda :(

kani naa 10th class ki vachhaka , vidhi leni paristitullo bommalu geeyatam modalu pettaka, telisindi naaku.. nenu bommalu baaga vestanu ani :) :)
inka gurtu undi naa 10th class exams lo page nindu ga vesina 'aaku addukota' bomma.. meeru malli gurtu chesaru :) :)

avunu, telugu lo ela rayali ikkada?

durgeswara said...

kalaakaarulalo aneka konaalumtaayi sumamdiii

ఆ.సౌమ్య said...

హహహ మాకు చెప్పడం సరే, మీ తమ్మూడికి చెప్పావా ఈ సంగతి??? :D

ఫోటాన్ said...

కెవ్వు కేక రాజ్... :))
ఉపమానాలు వాడటం లో నీకు నువ్వే సాటి :)
మీ తమ్ముడికి ఆ ప్రైజ్ మనీ లో వాటా ఏమన్నా ఇచ్చావా లేదా?

phaneendra said...

ఇంకా ఏ ఎమ్మెఫ్ హుసేన్ గురించో చెబుతారనుకున్నాను, కేక.

..nagarjuna.. said...

ROFL.... ultimate dude
తోటరాముడి "బాపు,రవివర్మ,పికాసో.." పోస్ట్ గుర్తొచ్చింది :))

ప్రిజ్ లో పెట్టిన లెతశవం హైలైట్ ః))

నిషిగంధ said...

:)))))))))))))))))

మీ భాషలోనే చెప్పాలంటే -- అసలు టైటిలే అరాచకం అనుకుంటే టపా మొత్తం భీభత్సం.. మెగా సునామీ అనుకోండీ!
ఇక లాభం లేదు మీ టపాల్ని వర్క్ లో చదవడం పూర్తిగా మానేయాలి.. లేకపోతే నవ్వాపుకోడానికి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు :))

"ఆకలితో ఉన్నకుక్కకి తోలు చెప్పు దొరికినట్టూ..
నోట్లో‌ తిరపతి లడ్డూ కుక్కీ, మూతి మీద గుద్దేస్తే ఎలా ఉంటాదో తెలుసా??...
పెద్ద ఆర్టిస్ట్ ని అయిపోవాలనే కోరిక పుస్తకాలకి చెద పట్టినట్టూ ఒళ్ళంతా పట్టింది...
నెత్తి మీద వాలి కాకి రెట్టేస్తుంటే చేతిలో కర్ర ఉండీ కొట్టలేని గాంధీగారి శిలా విగ్రహంలాగా...
ఈ రోజుల్లో చిదిమి దీపం పెట్టుకునే టైప్ లో ఉండకూడదు. ఇంటికి నిప్పెట్టే టైప్ లో ఉండాలి...
చప్పట్ల మధ్య చచ్చిపోయిన మూగ దోమ లాగా..."

అసలీ ఉపమానాలు ఎలా తడతాయండీ బాబూ!!
బాతు బొమ్మ మాత్రం... ... ఏం చెప్తాంలేండీ :)))))))))

Raviteja said...

ha ha ha bagunadie sir :D oka appudu nanu manchie artist ne sir kane maa thammudu chelleli kapuram cinema lo Nagabushanam laga naa paintings vade school ke tesekone velie credit kotasavadu.

sunita said...

నవ్వీ నవ్వీ చాలొచ్చింది! టపా గురించి కొత్తగా చెప్పేదేముందీ అందరూ చెప్పేసారు కానీ అసలు 76 ను అలా బాతు చేసిన క్రియేటివిటీ ఉంది చూసావు అన్ని అడ్జెక్టివెస్ ఇక్కడ వేసేయ్!అంతే! నాకు ఇంకా వింతగానే ఉంది. ఇలా కూడా బొమ్మ వెయ్యచ్చా? అని:))

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> నెత్తి మీద వాలి కాకి రెట్టేస్తుంటే చేతిలో కర్ర ఉండీ కొట్టలేని గాంధీగారి శిలా విగ్రహంలాగా...

ఇది అరాచకం.

నేనుకూడా చిన్నప్పుడు 2 తో బోల్డు పక్షుల బొమ్మలు గీసేవాడిని. కానైతే తెలివిగా ముందు పేరు వ్రాసి ఆపైన బొమ్మ గీసేవాడిని. అదేమిటో, పేరు వ్రాసినా మా మాష్టారు నమ్మేవారు కాదు.

టపా ఎప్పటిలాగానే ఉంది, పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్విస్తూ. కేక అంతే.

రాజ్ కుమార్ said...

రసజ్ఞ గారూ.. .అందుకే కదండీ ఎలాగైనా మీ పోస్టు లో పడాలని రాశానూ. మీ అంతటి వారు అడగాలే గానీ లైవ్ తుంటర్వ్యూ ఇస్తాను.
dojob జోకర్ ఎలాగండీ? కానీ నాకు scout boy బొమ్మ గుర్తొస్తుందీ.. అడ్డెడ్డే... అది కూడా రాసి ఉండాల్సింది ;( ;(
ఆ కప్ప మేటర్ ఏదో వివరంగా చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను ;) ధాంక్యూ అండీ ;)

found in Folsom గారూ.. ఏమండీ లేక లేక నా బొమ్మ చూపించాలా మీ బుజ్జోడికీ?? నేనొక్కడినే అనుకున్నా.. మీరూ అదే సీనరీ నా? ;) భాష కన్నా భావం ముఖ్యం.. ధన్యవాదాలు

రాజ్ కుమార్ said...

పల్లవి గారూ.. సేం పించ్.. కానీ నాకు మీ కున్న తెలివితేటల్ లేకపోవటం వల్లా, తిరగేసేవాణ్ణి.
నేను చాలా బొమ్మలు మా పిన్నితోనో, మావయ్య తోనో వేయించే వాణ్ణి ;)
అయితే మీరు పే..ద్ద ఆర్టిస్ట్ అన్నమాట ;)
మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
తెలుగు లో రాయడానికి ఈ కింది లింకులు చూడండీ. జీమెయిల్ లో కూడా తెలుగు రాయొచ్చు.
http://lekhini.org/
http://www.google.com/transliterate/telugu

రాజ్ కుమార్ said...

దుర్గేశ్వర గారూ... నా బ్గాగ్ కి స్వాగతం.
అవునండీ.. అందులో నాదో కోణం ;) ధన్యవాదాలు

అ.సౌమ్య గారూ... కికికికి ఇంట్లో అందరికీ చెప్పాను. సెర్టిఫికేట్ లో నా పేరు చూసీ మొహం అదోరకంగా పెట్టాడు. ;)
థాంక్యూ

ఫోటానూ.. థాంకులూ.. ప్రైజ్ మనీ నా పాడా? అంత లేదు. కార్డు ముక్క, చప్పట్ల చెక్కా నూ ;) మీనింగ్ అడక్కూ.. ఫాలో అయిపో..;)

రాజ్ కుమార్ said...

ఫణీంద్ర గారూ.. నేను ఏనాడయినా పనికొచ్చే సీరియస్ విషయాలు రాశానాండీ? ;)
థాంక్యూ

నాగార్జునా... కెవ్వ్వ్వ్వ్వ్వ్.... ఆపోస్ట్ ఎలా గుర్తొచ్చిందయ్యా? తిడతన్నావేటీ?? ;) ;) నెనర్లు..

నిషిగంధ గారూ... నా పోస్ట్ సంగతేమో గానీ మీ కమెంట్ మాత్రం నాకు సునామీ లాగా ఉందండీ. చాలా హ్యాపీగా ఉందీ .
ధన్యవాదాలు ;)

రాజ్ కుమార్ said...

రవితేజా..కికికికికి... మీ తమ్ముడు కూడా నాలాంటోడే‌ సుమీ..
అయినా పేరు తనదైనా వేసిన మీరు ఆర్టిస్ట్ కాక పోతారా?
ధన్యవాదాలు

సునీత గారూ... ఆ బాతు టెక్నిక్ నాది కాదండీ ఎలిమెంటరీ స్కూల్ లో ఫ్రెండ్స్ నేర్పించినదే.. చాలా మందికి తెలిసే ఉంటుంది ;)
మెచ్చ్చినందుకు థాంకులు

బులుసు గారూఊఒ... రెండు తో నేను హంస ఒక్కటే వేసే వాడినండీ. మీకు ముందు జాగ్రత్త ఎక్కువ కాబట్టీ పేరు రాసే వారు. నా కంత సీన్ ఇల్లల్లిల్లియో.. ;)
;) ;) ధన్యవాదాలు ;)

సిరిసిరిమువ్వ said...

నీ ఉపమానాలు దొంగలెత్తుకెళ్ల! (ఇది అభిమానంతో అనే మాట..అపార్థాలు చేసుకోకు రాజ్ బాబూ).

నోట్లో‌ తిరపతి లడ్డూ కుక్కీ, మూతి మీద గుద్దేస్తే ఎలా ఉంటాదో తెలుసా??...ఎలా ఉంటుందో ఊహించుకుని మరీ నవ్వుకున్నా:)))

మధురవాణి said...

హహ్హహ్హా.. భలే బాగుంది రాజ్ నీ చిత్రకళాకౌశలం.. As usual, hilarious post! :D :D
చిన్నప్పుడు పెన్నూ, పేపరూ దొరికితే చాలు.. 76 తో బాతు, M తో పిల్లి బొమ్మ.. ఓ తెగ గీసి పారేసేవాళ్ళం.. అవన్నీ గుర్తొచ్చాయి. :)

వేణూశ్రీకాంత్ said...

నిన్న నువ్ పబ్లిష్ చేసిన పదినిముషాలకే పోస్ట్ చదివేసినా ఏ లైన్స్ కోట్ చేయాలా అని ఈప్పటిదాకా ఇది ఇదీ అని సెలెక్ట్ చేస్తూనే ఉన్నానంటే నమ్ము :) ఫైనల్ గా టపా అంతా కోట్ చేయలేక నిషిగారి కామెంట్ లో కోట్ చేసినవి మన గురూజీ కామెంట్ లో కోట్ చేసినవి మరో సారి చదువుకో.. పోస్ట్ అరుపులు అంతే :)

అన్నట్లు నేను కూడా చిన్నప్పుడు ఒక ఎమ్ మరియు ఒక టిక్ మార్క్ తో ఎలక బొమ్మ వేసే వాడ్నోయ్... ఎలాగో నీ విచిత్రకార బుర్రకి వీజీగా అర్దమైపోయింటదిగా ఈ పాటికి. అలాగే బి తో కూడా ఏదో బొమ్మ వేసే వాడ్ని కానీ ఏం బొమ్మో మర్చిపోయా :)

స్నిగ్ధ said...

నిన్న రాత్రే మీ టపా చదివానండీ...ఏ లైన్లు పెట్టాలో తెలియక మళ్ళీ ఇంకో సారి చదివి కామెంటుతున్నా....అసలు ఆ టైటిలేంటండీ బాబూ...ఒక్క నిమిషం రాజ్ గారు ఇలాంటి టైటిల్ పెట్టారేమిటా అని అనుకుంటా టపా మొదలెట్టా...మొదటి పేరా చదివాక అప్పుడనిపించింది సీరియస్ టపా కాదని...

చదువుకుంటూ నవ్వుతూంటే మా ఇంట్లో జనాలు ఏమయ్యిందా అని ఆశ్చర్యం గా చూడ్డం మొదలెట్టారు....:)

టపా అరాచకం.....అసలు ఇలాంటి పంచులు ఎలా తడతాయండీ మీకు..దీని మీద ఒక స్పెషల్ క్లాస్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము....

స్నిగ్ధ said...

నిన్న రాత్రే మీ టపా చదివానండీ...ఏ లైన్లు పెట్టాలో తెలియక మళ్ళీ ఇంకో సారి చదివి కామెంటుతున్నా....అసలు ఆ టైటిలేంటండీ బాబూ...ఒక్క నిమిషం రాజ్ గారు ఇలాంటి టైటిల్ పెట్టారేమిటా అని అనుకుంటా టపా మొదలెట్టా...మొదటి పేరా చదివాక అప్పుడనిపించింది సీరియస్ టపా కాదని...

చదువుకుంటూ నవ్వుతూంటే మా ఇంట్లో జనాలు ఏమయ్యిందా అని ఆశ్చర్యం గా చూడ్డం మొదలెట్టారు....:)

టపా అరాచకం.....అసలు ఇలాంటి పంచులు ఎలా తడతాయండీ మీకు..దీని మీద ఒక స్పెషల్ క్లాస్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము....

రాజ్ కుమార్ said...

మువ్వ గారూ.. కికికికి థాంక్యూ అండీ. అపార్ధాలెందుకు చేసుకుంటామండీ?

మధురగారూ.. ఆ పిల్ల్లి బొమ్మ ఎలా అండీ? నాకు తెల్వది.. ;( థాంక్యూ..

రాజ్ కుమార్ said...

మిమ్మల్ని నమ్మ్యుతాను వేణూజీ ;) వాఆఆఅ నాకు తెలీనివి చాలా చెప్తున్నారు అంతా.. ఆ ఎలక బొమ్మ ఎలా వెయ్యాలీ??
అర్జెంట్ గా చెప్పాల్సిన అవసరం ఉన్నాదండీ.. నెనర్లు ;)

స్న్తిగ్ధ గారూ.. నాకు సీరియస్ విషయాలు రాసేంత సీన్ లేదండీ ;)
స్పెషల్ క్లాసులు ఇచ్చేంత అస్సలు లేదు.. ;) ;)
ధన్యవాదాలు అండీ..

శ్రీనివాస్ పప్పు said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ రాజూ అద్దరగొట్టేహావంతే ఇది బాగోలేదు అని చెప్పడానికి ఏమీ లెదు ఇందులో,మా నస గారు చెప్పినట్టు

హరే కృష్ణ said...

చిత్రకారుడి చీకటి రహస్యాలు
కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్...

ఆనపకాయ క్రియేటివిటీ కెవ్వ్ కేక :))
పంచ్ లు మొత్తం పేస్ట్ చేసుకోవాలి
ROFL

kiran said...

చిత్రలేఖండనం, గానకాలుష్యం పోటీలకి నా పేరిచ్చీసేరు. - :):)
ఎర్రని సూరీడూ(రూపాయి బిళ్ళతో వేయాలి) --- అబ్బో కేక :)
ఈ దేశం లో కళాకారులకి తగిన ప్రోత్సాహం లేదు.. ;( ;( ;( -- ఇదే నా బాధ కూడాను...!!
ఆర్టిస్ట్ ని అయిపోవాలనే కోరిక పుస్తకాలకి చెద పట్టినట్టూ ఒళ్ళంతా పట్టింది నాకు. - సూపెర్..!! :)
పలికితే నాలుక నిలువుగా సాగుతాది గానీ... హిహిహిహిహి
చప్పట్ల మధ్య చచ్చిపోయిన మూగ దోమ లాగా అయిపోయింది నా పరిస్థితి. - విషాదం లో కూడా తమాషా నా..!!
పోన్లే నిజం ఒప్పెస్కున్నావ్... :)
చాలా రోజుల తరువాత ఓపెన్ చేసానేమో......ఇది చదివాక..బ్లాగ్స్ ని మిస్ అవుతున్న అనిపించింది :)
నైస్ :)

Vasu said...

" గుండు గొరికించుకొని గంధం రాసుకున్నంత హాయిగా అనిపించింది."

anta haayigaa undi mee tapaa chaduvutunte..

arupu :)

జలతారు వెన్నెల said...

మీ చిత్రలేఖనం ఎలాంటిదైనా..మీ అనుభవాలు మాతో పంచుకున్నారు.

అద్బుతమైన చిత్రాలు వెయ్యాలన్న మీ తాపత్రయాన్ని మేము గమనించాము! Where there is a will,there is a way కదా? సో చిత్రాలు గీస్తూ ఉండండీ. అప్పుడప్పుడు అవి పోస్ట్ చేస్తూ ఉండండి! నవ్వించేసారు ఎదైతేనేంటి లెండి!

వనజ తాతినేని/VanajaTatineni said...

సూపర్..అండీ.. .. చిన్నప్పటి నుండి మొదలెట్టి ఇంటర్ దాక ఒకే రోజు చెప్పాలా!? కాసిని దాచి ఉంటే మరల నవ్వి ఉండేదాన్ని కదా!
వెదవది జీవితం లో సెన్సాఫ్ హ్యుమర్ లేక మొత్తు కుంటుంటేను.!

గిరీష్ said...

గాంధీ గారి గుండు గీసి భాగాలు గుర్తించడం అంటే మామూలు మాటలా సూపరు, కెవ్వు... :) nice post raj.

SHANKAR.S said...

నీలో ఇంతటి మహా కళాకారుడు ఉన్నాడని తెలియదు రాజ్. ఇక నుంచీ నిన్ను మన దయ్యాల సభ ఆస్థాన చిత్రకారుడిగా నియమిస్తున్నాం. రాబోయే మన పిశాచ సావనీర్ కవర్ పేజీ డిజైన్ నువ్వే చెయ్యాలి.


(గాంధీ బొమ్మేసి భాగాలు గుర్తించిన నీ మేధోశక్తికి లాల్ సలాం కామ్రేడ్ :) )

MURALI said...

మిగిలిన పంచ్‌లు అందరికీ ఎలాగూ నచ్చుతాయి, కానీ ప్రత్యేకంగా మన దళానికి నచ్చే పంచ్ "ఫ్రిజ్‌లో పెట్టిన లేత శవం"

రాజ్ కుమార్ said...

పప్పుసార్.. ధన్యవాదాలు... మీ చేత అదరగొట్టించుకోకపోతే ఏదో లా ఉంటాది ;)
హరే.. థాంక్యూ. కికికి
వాసు గారూ... మిమ్మల్ని హాయిగా ఉంచినందుకు నాకూ హాయిగా ఉందండీ. ధన్యవాదాలు ;)

రాజ్ కుమార్ said...

అవును కిరణ్.. ఎంతయినా మీలాగా ఆర్టిస్టులం కాదు కదా... ;( ;(
థాంక్యూ సో మచ్ ;)

జలతారు వెన్నెల గారూ.. ఏదో ఈ పోస్ట్ గురించి చాలా సంవత్సరాల తర్వాత వేశానండీ. మీ ఆజ్ఞ ప్రకారం అలాగే ట్రై చేస్తాను. థాంకులు

జ్యోతిర్మయి గారూ.. నెనర్లు ః)

రాజ్ కుమార్ said...

అవును గిరీషూ..అది మామాలు విషయం కాదు.. కికికిక్ థాంక్యొ

వల్లకాడు వార్డెన్ గారూ..చిత్తం.. తమరి ఆజ్ఞ. ఆస్తాన చిత్రకారుడిగా నా బాధ్యతని నేను నిర్వర్తిస్తాననీ పిశాచాల సాక్షిగా ప్రమాణం చేస్తూ ప్రణామాలు చేస్తున్నాను. లాల్ సలాం కి డార్క్ లాల్ సలాం కామ్రేడ్.. ధన్యవాదాలు. చాలా కాలానికి ఇటువైపు వచ్చినట్టున్నారు? ;)

మురళీధరా.. ఒక దళ సభ్యుడిగా అటువంటి ఒక లైన్ ని పెట్టడం నా కొరివి లో కర్తవ్యం. జై దెయ్యాలకోటా..నీకు నా హృదయపూర్వక పుర్రెలు

శశి కళ said...

హ...హ..రాజ్ అప్పుడప్పుడు పశ్చాత్తాపాలు మామూలే.
గాంధి గుండు గీసి బాగాలు గుర్తించావా?కేవ్వ్వ్వ్వ్వ్వ్ కేక.నేను అయితే ఫుల్ మార్క్స్ ఇచ్చున్దేదాన్ని.అసలు బాతు ,అనపకాయి భలే ఉనాయి.అసలు నవ్వే నవ్వు చదువుతుంటే...))

శివరంజని said...

హహహః చాలా బాగా రాసారు రాజ్ గారు ... నవ్వి నవ్వి నవ్వుతూనే ఉన్నా ... పంచ్ లు అదిరాయి

మా అన్నయ్య లాగే నేను కూడా చిన్నప్పుడు ఒక ఎమ్ మరియు ఒక టిక్ మార్క్ తో ఎలక బొమ్మ, 76 బాతు బొమ్మ నాకు వచ్చు ...

అన్నట్టు నాకు బొమ్మలు , ముగ్గులు వేయడం బాగా వచ్చండి ..

అయినా మీకు బొమ్మలు రాకపోతే మాత్రం ఏముందండి .. అంతకంటే గొప్పగా కామెడీ గా బ్లాగ్ పోస్ట్ లు రాస్తున్నారుగా

చాతకం said...

Awesome drawing 101 class. Post needs to be preserved for future generations.

రాజ్ కుమార్ said...

శశిగారూ... మీరు లేక నాకు పాస్ మార్కులే వచ్చాయండీ.. ;( ;( ఉంటే ఎంత బాగుణ్ణో.... థాంక్యూ

చాతకం గారూ ధన్యవాదాలు.

శివరంజని గారూ.. మీకు బొమ్మలతో పాటూ, ముగ్గులు కూడా వచ్చా?? కామెడీ చించెయ్యటం ఇంకా బాగావచ్చు. ఇంకేం మీరు మల్టీ టాలెంటెడ్..;)
నాకు నాలుగు అడ్డువరసలూ, నాలుగు నిలువు వరసలతో ఒక ముగ్గొచ్చండీ.. మీకొచ్చా మరీ??
ధన్యవాదాలతో..

మనసు పలికే said...

"చిత్రలేఖండనం, గానకాలుష్యం" ఆ??? ఆ పేర్లేంటి మహాప్రభో :D:D.. ఒక్కొక్క ఉపమానం ఒక్కొక్క చిచ్చుబుడ్డి.. అన్నీ పెట్టాలంటే మళ్లీ టపా అంతా వ్యాఖ్యలో పెట్టాల్సి వస్తుంది. అద్భుతం అంతే :) ఇక నుండి ఆఫీసులో ఉన్నప్పుడు నీ టపా మాత్రం చదవకూడదనే గాట్టి నిర్ణయానికి వచ్చేశా. నాలో నేనే చున్నీ నోట్లో కుక్కుకుని నవ్వుకుంటుంటే పక్క క్యూబికల్ వాళ్లు తేడాగా చూస్తున్నారు :(((

chubby said...

Super Rajkuuuu...Keka...Super rasav :P

chubby said...

Btech lo ED lo chinchesava ayithey...

రసజ్ఞ said...

Please DO NOT Publish my comment
మీ పుట్టినరోజని తెలిసి, మీ మెయిల్ ఐ డి కనిపించక ఇలా ఇక్కడ విషెస్ చెప్తున్నాను. హార్థిక జన్మదిన శుభాకాంక్షలండీ! నవ్వుతూ, నవ్విస్తూ, ఆనందంగా, ఆయురారోగ్యాలతో, ఆశల తీరాలు చేరుతూ, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

సంతు (santu) said...

superb andi... :) :)

చీకటి రహస్యాలు
ఆ జీన్స్ ఎక్కడికి పోతాయ్
"అన్నీ నా పోలికలే ఎదవకీ"
"పంది భలే ఉంది అన్నయ్యా" అన్నాడు చప్పట్లు కొడుతూ... ! నోట్లో‌ తిరపతి లడ్డూ కుక్కీ, మూతి మీద గుద్దేస్తే ఎలా ఉంటాదో తెలుసా?? అలా అనిపించింది నాకు.
"మరి నేనంటే‌ ఏటనుకున్నావు..? పెద్దయ్యాకు నువ్వూ నాలాగే వేసి మంచి పేరు తెచ్చుకోవాలి" అని క్లాస్ పీకీ, ఈ మాట ఇంకెవరితోనూ చెప్పొద్దని మాట తీసుకుని గమ్మునుండి పోయాను.
బాతు బొమ్మ
"అరాచకం అండి
ఒక్కొక్క పదం చదువు తూ ఉంటె, నవ్వ లేక చస్తున్న....
supper కెవ్వు కేక"

కానీ చివర్లో మీ తమ్ముడు వేసిన paint కుడా పెట్టాల్సింది ,,,
బహుమతి పొందిన ఆ కళాకండాన్ని కూడా చూసి ధన్యులం అయ్యే వాళ్ళం గా.....

రాజ్ కుమార్ said...

మనసుపలికే... జాగ్రత్త జాగ్రత్త హహ్హా
థాంకుల్స్.. ;)

చబ్బీ.. థాంక్యూ సో మచ్ ;) ;)

సంతు గారూ.. ధన్యవాదాలు..ఆ పెయింటింగ్ ప్రస్తుతం నా దగ్గర లేదండీ... ఇంట్లో ఎక్కడో ఉండి ఉంటుంది.. ;) ;)

Radha said...

ఇది చూసిన మా మాష్టారు, నెత్తి మీద వాలి కాకి రెట్టేస్తుంటే చేతిలో కర్ర ఉండీ కొట్టలేని గాంధీగారి శిలా విగ్రహం
లాగా కాసేపు ఏం మాట్లాడకుండా నిలుచుండి పోయీ

hahaha...

Anonymous said...

super...

రాజ్ కుమార్ said...

the tree గారూ ధన్యవాదాలు.
రాధ గారూ.. థాంకులు ;)
అనానిమస్ గారూ థాంక్యూ ;)

Sowjanya said...

రాజ్ గరు...

మీ బ్లొగ్ లొ మీరు చెప్పినట్టు
"బాలమిత్ర, చందమామా, బుజ్జాయీ,
బాలజ్యోతీ వగైరాలకి ఈ ఆడోళ్ళంతా సీరియళ్ళు చూస్తూ ఏడవడానికీ, మా నాన్న రాజశేఖర్ సినిమాలకీ, మా తాత లంక పొగాకు చుట్టలకీ, మా నానమ్మ ఆ చుట్టపీకలు ఊడ్చడానికీ, అడిక్ట్ అయిపోయినట్టూ" నెను మీ బ్లొగ్ కి అడ్డిక్ట్ అయిపొయాను.

దొంగలు పడ్డ ఆరు నెల్లకు కుక్కలు మొరిగినట్లు నాకు ఇప్పుడు మీ బ్లొగ్ దొరికి ఇప్పుడు కూర్చుని చదువుతున్న అన్నీ.

ఛాల మంది చెప్పినట్లు నెను కూడా అదీ ప్రొబ్లెం లొ ఉన్నను. ఛదవకుండ అగలెకపొతున్న. ఛదివితె నవ్వు అపుకొలెను. నవ్వితె కొల్లీగ్స్ అందరూ దీనికి పిచ్చి ముదిరి పొయింది అని కంఫర్మ్ చెసుకుంటారని భయమీస్తున్న లొకం ఎమైన అనుకోనివ్వు. నెను చదవల్సిందే అని తెగించి మరీ చదివెస్తున్నా.

బాబొయ్...మీకు అసలు ఎల వస్తాయండి ఇలాగ? మీ ప్రాస, నార్రేషన్, పంచ్ డైలాగులు, టైటిల్స్ అన్నీ కేక...

ఆన్నట్లు మీ బొమ్మలు సూపెర్...వీలైథే మీ తమ్ముడు వేసి మీకు ప్రైజ్ తెచ్చిపెట్టిన ఆ బొమ్మ ని కుడా మాకు చుపించండి...అంత గొప్ప చిత్రలేఖనం చూసి తరిస్తాము...

రాజ్ కుమార్ said...

సౌజన్య గారూ.. ఎప్పుడు చదివితే ఏముందండీ... ఇప్పటికైనా మీరు చదివినందుకూ, ఎంజాయ్ చేసినందుకూ ఆనందంగా ఉంది. చదవడానికీ, కమెంటడానికీ అస్సలు మొహమాట పడకండీ.. తప్పు ;)
ఆ బొమ్మ ఇప్పుడు ఎలా చూపించమంటారు? ఎక్కడ ఉందో? ఏ పరిస్థితుల్లో ఉందో మరి ;)

ధన్యవాదాలండి