Tuesday, September 11, 2012

అట్టు ముట్టని వాడు మట్టిగడ్డై పుట్టున్...!

తెలుగు భాష లో నాకు బాగా నచ్చిన పదాల్లో ఒకటది.
నేను ఎంతగానో మెచ్చిన పదార్ధాల్లో మొదటిది.
కడుపు నిండుగా ఉన్నా చూడగానే నోటికి ఆకలి తెప్పించే అట్టు అది.

కొంచెం డీటెయిల్డ్ గా చెప్పాలంటే నేను చాలా  ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. మీరు అంతకంటే ఓపిగ్గా వినాలి.

అట్ల మీద నా నాలుక ఎప్పుడు మనసు పారేసుకుందో, ఎందుకు పారేసుకుందో, ఎలా పారేసుకుందో నాకు గుర్తు లేదు గానీ అర్ధ రాత్రుళ్ళు నిద్ర లేచి
"భౌఔఔఔఔఔఔఔ... అట్టు..... అట్టు కావాలీ" (భౌఔఔఔఔ... అంటే ఏంటని అడగొద్దు.. నాకూ తెలీదు) అని
ఏడుపు మొదలెట్టే నాకు, మా పెద్దమ్మమ్మ అప్పటికప్పుడు పిండి కలిపి, పొయ్యి రాజేసి అట్టేసి పెడితే రెండు 
ముక్కలు తినీ, ప్లేటు పక్కలో పెట్టుకొని పడుకునే వాడినట. ఆ ఆకారం లోనే ఆ ఆకర్షణ ఉందో, ఆ పేరు లో ఏ మేజిక్కుందో, అట్టేసే మా అమ్మమ్మ ప్రేమ వల్లే ఆ రుచి వచ్చేదో  తెలీదు గానీ పిండేదయినా, పచ్చడి ఉన్నా లేకపోయినా నా ఈ పిచ్చి రోజు రోజు కీ, నాతో పాటూ పెరిగి పీక్ కి వెళ్ళిపోసాగింది.

ఎప్పుడూ శనగపిండి అట్టో, వరిపిండి అట్టో, చోడి పిండి అట్టో, కోడిగుడ్డట్టో తింటూ పెపంచికం లో అన్నిటీకంటే రుచికరమైన పద్దార్ధం ఇదే అని
మురిసిపోయే నేనూ.. ఓ రోజు, ప్రతీ రోజు లాగే కడుపునిండా పెరుగన్నం తినేసీ, పక్క వీధి లో ఉన్న మా మావయ్య వాళ్ళీంటికి వెళ్ళాను. మా అత్తేమో పచ్చరంగులో ఏవో అట్లేసీ, మధ్య లో ఉప్మా పెట్టి మావయ్యకీ, బావలకీ వేస్తోంది. నాకూ ఒకటి వేడి వేడిగా వడ్డించింది.

ఈ అట్టూ-ఉప్మా కాంబినేషనేమిటో, ఆ కలరేంటో, ఆ వాసనేంటో... అంతా వింతగా అనిపించింది. అప్పటికే జాలువారుతున్న నోట్లోని లాలా జల ప్రవాహాలనీ, నాసికా రంధ్రాల గుండా దూకుతున్న జలపాతాలనీ సంగమీంచనివ్వకుండా ముక్కు ఎగబీల్చి, అట్టు ముక్క నోట్లో వేసుకున్నా...అంతే. "ఇదేరా.. ఇదే.. ఈ రుచికోసమే ఇన్నాళ్ళూ నువ్వు పెట్టిన అడ్డమైన అట్లూ రుచి చూశాను.. ఇన్నాళ్ళకి నా జన్మ సార్ధకమయ్యింది.. రానియ్.. రానియ్యి.. ఇంకోంచెం పెద్ద ముక్క తుంచు.. ఆ ఉప్మాతో కలుపు..ఆ..అదీ.. చెట్నీతో తాకించడం కాదురా..గాడిదా  ముంచు బాగా.. పెట్టూ నోట్లో.. కమాన్...డూ ఇట్ ఐ సే"  అంటూ నా నాలుక మెదడుని ఆధీనం లోకి తెచ్చేసుకొని ఆర్డర్స్ వెయ్యటం మొదలెట్టీంది..




మా అత్త స్టౌ ఆర్పేసీ, అట్ల రేకు తిరగేసేసే వరకూ తినేసి ఇంటికి బయలు దేరాను. ఇంటికొచ్చేసరికి కడుపంతా బరువుగా అనిపించింది. ఊపిరాడటం లేదు. పొట్ట ఉబ్బిపోయి గట్టిగా అప్పుడే ఊదిన బెలూన్ లాగా అయిపోయింది. మంచం మీద వెల్లకిలా పడుకొనీ....."అమ్మోయ్... కడుపు నొప్పెడుతుందీ" అంటూ తన్మయత్వంతో విషాద గీతం పాడుతున్న హిమేష్ రిషమియా లాగా అరవటం మొదలెట్టాను. 

అమ్మః అయ్యో.. అయ్యో.. పొట్టేమిటి ఇలా ఉబ్బిపోయిందీ? ఏమండీ.. ఇలా వచ్చి చూడండి.. బుజ్జిగాడినీ..
నాన్నః ఏమయ్యిందిరా?? ఏం తిన్నావ్??
నేనుః  పెసరట్టు.. అత్త పెట్టిందీ...!
నాన్నః పెసరట్టా?? ఎన్ని తినేశావ్??
నేనుః ఒకటే... (ఎన్ని తిన్నానో రివైండ్ చేసుకుంటూ..)
నాన్నః ఓరి నీ కక్కుర్తీ..... తగలెయ్య... పొద్దున్నే కదా కడుపునిండా మెక్కావు? ఆకలెక్కువ - పీక సన్నం ఎదవకీ.
నేనుః కడుపు నొప్పేడతుందీఈఈఈ....

ఇంతలో మా నానమ్మ (మా ఇంటీ ఓనరు) విషయమ్ తెలుసుకొని, నిప్పుల కుంపటి తెచ్చీ చేత్తో కాక పట్టి కడుపు మీద పెట్టేసరికి రిలీఫ్ అనిపించింది. చాలా కాలం పాటు నాకు అర్ధం కాలేదు పెసరట్టు తిండానికీ, కడుపునొప్పి రాడానికీ సంబంధం ఏంటో...!

నా ఈ అట్ల యావ అర్ధం చేసుకునీ, ఏదీ లేకపోతే కనీసం ఆమ్లెట్టన్నా వేసి పెట్టే మా నానమ్మ, అట్లతద్ధికి ఎవరో ఇచ్చిన పుల్లట్లు తెచ్చి "బుజ్జియ్యా.. నీకోసం పప్ప 
తెచ్చేనయ్యా" అని ఒక అట్టు నా చేతిలో పెట్టింది ఒకనాడు. ఇదేంట్రా బాబూ అట్టుకెక్కువా, రొట్టికి తక్కువా అన్నట్టూ ఇలా ఉందీ అని అనిపించింది మొదట. గుండు గీయించుకున్న ఫ్రెండు ని డిప్ప మీద పీకాలనిపించడం ఎంత కామనో, చేతిలో పుల్లట్టెట్టినప్పుడూ తినాలనిపించడమూ అంతే కామన్ కదా?? తిన్నాను. ఒకసారి పుల్లట్లు రుచిమరిగినోడు ఇంకోటి 
తినాలనుకోడా? పెద్దలు మీరే చెప్పండీ..! ఇంకోటి పెట్టమన్నాను. ఒకటే వాయినం ఇచ్చేరూ... ఇంక లేవూ అన్నాది. మా అమ్మని చెయ్యమని అడిగాను. "నాకు రాదురా" అనేసింది.
నేనూరుకుంటానా? ఎండిపోయిన నూతిలో చేదేసి నీళ్ళు తోడేసినట్టూ ఈళ్ళిద్దరి ప్రాణాలూ తొడెయ్యటం మొదలెట్టేను.
ఇలా అయితే లాభం లేదనీ "పిల్లోడు తింటాడు కదా అని అట్టుముక్క చేతిలో పెట్టాను గానీ, ఇలా నన్ను పీక్కు తింటాడని కలగన్నానా.. మేష్టారూ?" అని ఏంగ్రీ యంగ్ మేన్ అయిన మా పితృదేవులకి కంప్లయిట్
ఇచ్చింది. మా ఆగ్రహ యువకుడు నన్ను ఈడ్చితన్ని,  echo ఎఫ్ఫెక్ట్ లో నా చేత అరిపిస్తాడు అని భయపడ్డాను.

కానీ ఆరోజు బ్రహ్మ రాత నాకు పాజిటివ్ రాసి ఉంది.
"కోతి చేతిలో టూత్ బ్రష్ పెడితే అది పళ్ళు తోముకుంటుందా? వీపు గోక్కుంటుందా?..లేకా పీకి పారేస్తుందా? అంటే ఏం చెప్పగలం పిన్నిగారూ?? అది కోతి. ఏమయినా చేస్తుంది..ఈ ఎదవా అంతే.. అదేదో వండి పెట్టండి" అని అంతిమ తీర్పిచ్చారు నాన్నారు.

ఆ తరవాత పుల్లట్ల స్పెషలిస్టు అయిన ఎదురింటి గున్నిమామ్మ చేత చేయించి పెట్టాక నేను రాక్షస సంహారం చేసిన అమ్మోరిలాగా శాంతించాననుకోండీ.. అది వేరే విషయం.

******************************************************************************************
ఉల్లిపాయలు -- 5Kg --------- ఆ
3kg - ఉప్మా నూక ---------ఆ
kg - చనా పిండి ---------ఆ
2 kg - దుంప ---------ఆ
కేజీ.. మంచి నూని---------ఆ
.
.
.
.
.
లిస్ట్ వెరిఫికేషన్ అలా ఫ్లో లో పోతా ఉంది. మా తాతయ్య గారికి అప్పట్లో కిరాణా షాపు ఉండేది. తాతయ్య స్కూల్ కి వెళ్ళిపోయాక అమ్మమ్మ నడుపుతూ ఉండేది. అప్పట్లో వేసవి సెలవుల్లో నేను బాలకార్మికుడి అవతారం ఎత్తుతూ ఉండేవాడీని.. ఊరికినే కాదు లెండీ... గళ్ళా పెట్టె దగ్గర కూర్చొని బిస్కెట్లు, బిళ్ళలూ, జీళ్ళూ, 
చాక్లెట్లూ, లాగిస్తూ అమ్మమ్మకి హెల్ప్ చెయ్యడానికి. 
ఊళ్ళో ఉన్న హోటల్స్ అన్నీ మా కొట్టు లోనే కొనేవోళ్ళు  సరుకులు... అందులో పెద్ద ఖాతా "ఇందేసు ఒటేలు" అన్నమాట. పైన చెప్ప్పిన లిస్ట్ వెరిఫికేషన్ ప్రతీ రోజూ రాత్రి జరిగే సీన్ అన్నమాట.

రోజూ పొద్దున్నే పెరుగన్నం తినేసి, నాన్న చెయ్యి పట్టుకొని స్కూల్ కి వెళ్ళిపోవటం తప్ప బయట తిండి అలవాటు లేని  నాకు "బుజ్జీ... ఇందేసు ఒటేలుకెళ్ళీ దోస తెచ్చుకో" అనే అమ్మమ్మ మాటలు నాకు శ్రియాఘోషల్ పాడిన రొమాంటిక్ సాంగంత సమ్మగా అనిపించేవి. బారెడు పొద్దెక్కినా, మొద్దుల్లాగా నిద్రపోయే మా మాయలకీ, చీపురు కట్ట పట్టుకోడం కూడా చేతగాని మా చిన్నపిన్ని కీ టిఫిన్ తీసుకురమ్మనటమే అందులోని ఆంతర్యమని ఆ పాల
బుగ్గల బాల రాజ్ కుమార్ కి తెలీదు అప్పట్లో.. అందుకే  నిక్కరు ఎగదోసుకొని బయలుదేరేవాడిని.

ఇందేసు ఒటేలు అంటే పెద్ద హోటలేం కాదు. మా ఇంటికి పదడుగుల దూరం లో బజార్లో రావి చెట్టుకింద చిన్న చీకటి పాక. పొద్దున్న టైం లో చాలా బిజీ గా ఉండేది. 
ఎప్పుడు చూసినా ఇందేసు గారు చెక్కబల్ల మీద కూర్చొని, రెండోవైపు అరిగిపోయి, కత్తిలాగా పదునుగా తయారయిన గరిట తో ఉల్లిపాయలూ, పచ్చిమిర్చీ, అల్లం కసాబిసా కోసేస్తా ఉండేవాడు ఎవ్వరితోనూ మాట్లాడకుండా.

అయితే ఇక్కడ నేను బాగా ఎంజాయ్ చేసే విషయం ఒకటుంది. మోకాళ్ల వరకూ నిక్కరేసుకొనీ, పొయ్యి మీద దోశల పెణం పెట్టీ చెక్క పెట్టెమీద "ఇది నా చీకటి సామ్రాజ్యం, ఇదే నా సింహాసనం" అన్నట్టూ మహారాజ ఠీవి తో
కూర్చొని దోశలు పోసే రాజారావ్ పెదనాన్న(ఇందేసు గారి కొడుకన్నమాట). ఒక చేత్తో పొయ్యిలో మంట ఎగదోస్తూ, పెణం మీద చుయ్య్ య్ మనేలా నీళ్ళు కొట్టీ, చీపురు తో తుడిచేసీ, నూనేసీ, ముందుగా ఉల్లి, మిరమ మిక్స్ జల్లీ, వాటి మీద బాగా కలిపిన పిండిని చిన్న గ్లాస్ తో నేర్పుగా గుండ్రంగా సింగిల్ టేక్ లో పోసీ, అది కాలేలోపు జేబు లో బీడీ కట్ట లోంచి ఒక బీడీ నోట్లో పెట్టీ పొయ్యిలోని కొరకంచె తో బీడీ వెలిగించి పొగ వదులుతూ ఉంటే ఆ దృశ్యం
చూడటం ఎన్ని సార్లయినా బోర్ కొట్టేది కాదు. సినిమాల్లో సిరంజీవి ని చూసినట్టూ ఫీలయిపోయేవాడీని.

ఉల్లిదోసా,సాదాదోసా, మినపట్టూ ఇలా పోస్తూ, ప్లేట్లోకి తీస్తూ, బేరాలు చూస్తూ, నన్ను మాత్రం ఒక అరగంట కూర్చోబెట్టే వాడు.(మనం డబ్బులు ఇవ్వం కదా.. సాయంకాలం కొట్లో  సామాన్లు కొనే టప్పుడు లెక్క చూసుకునేవారు). 

నా రిక్వైర్మెంట్ ఏంటో తెలుసు కాబట్టీ అన్నీ వేసి మా అచ్చీరత్నం పెద్దమ్మకి ఇచ్చీ "బాబబా డ్బబడబడబ గుర్ గురురగుర్ మినప.. గర్ గర్ ఉల్లి..సాదా. డగడగడగ" అనే వాడు నాతో. (చాలా ఫాస్ట్ గా లొడలొడా మాట్లాడటం తో అతని మాట నాకు అర్ధమయ్యి ఏడ్చేది కాదు).

అప్పుడు, అడ్డాకుల్లో దోసలు చుట్టీ, దారం కట్టీ, ప్యాకింగ్ చేస్తూ 
"ఈ మినపట్టు మీ చిన్నమాయకంటా, ఈ ఉల్లి దోశ మీ పెద్దమాయకి, ఈ పలచగా రేకుల్లా కాల్చిన దోస మీ పిన్నికీ, ఈ సాదా దోస నీకూ.. స్పెసల్ గా ఈ గ్లాస్ లో  పోసిన బొంబాయ్ చెట్నీ కూడా నీకే.. కారం ఉండదు.. ఏడి చల్లారకముందే గమ్మున పరిగెత్తుకెల్పో ఇంటికి..  జాగ్రత్త రా బాబూ తన్నుకొని పడిపోగలవు"
అని ఆ మాటల్ని  డీకోడ్ చేసీ, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేది అచ్చీరత్నం పెద్దమ్మ. నాకు అక్కడే హోటల్లో అందరిలాగా కూర్చొని తినాలని ఆశగా ఉండేది. కానీ ఒప్పుకునేవారు కాదు ఎప్పుడూ :( :(




ఇక ఇంటికొచ్చి ఆ దోసలు తింటుంటే రాజా... నో పాస్టెన్సో.. నో ఫ్యూచరు. నా ఒంట్లో కరెంటు. ఇంట్లో అమ్మ చేసే
దోసలు ఇంత రుచిగా ఉండవూ? అనిపించేది ప్రతీసారీ..!

ఆ టేస్టంతా పెణం తుడిచే ఆ జిడ్డు చీపురుదే అనీ, అదే చీపురుతో పొద్దున్న పూట వాకిలి తుడుస్తారనీ అంటా
ఉండేవాడు మా తాత.(ఎంతవరకూ నిజమో తెలీదు)
ఆ టేస్టు దగ్గర ఈ కామెంట్లన్నీ ఇరగ డాన్సాడుతున్న చిరంజీవి పక్కన ఎక్స్పోజింగ్ చేస్తున్న హీరోయిన్ లాగా ఫేడయిపోయేవి.

దీన్ని బట్టి మీకేమర్ధమయ్యిందీ? మూలుగు కి రోగం పెరిగినట్టూ, వయసు కి చాదస్తం పెరిగినట్టూ, కృష్ణవంశీ కి మూర్ఖత్వం పెరిగిపోయినట్టూ... నాకు అట్ల మీద ఆప్యాయత అలా అలా పెరిగిపోయిందని తెలీట్లేదూ?
******************************************************************************************************

ఇహ బెంగుళూర్ కి వచ్చాక రంగా....మోహన్ బాబుకి మైకిచ్చినట్టూ, పిచ్చోడికి రాళ్ల కుప్ప చూపించినట్టూ
అయ్యింది నా పరిస్థితి. రెచ్చి రంకెలేసానంటే నమ్మాలి మీరు.
చిన్న హోటలూ, పెద్ద హోటలూ,దోస కార్నరూ అని లేదు...కనిపిమ్చిన చోటల్లా ఎటాక్
చేసేసీ, మసాలా దోస,సెట్ దోస,,రవ్వ దోస, ఆనియన్ దోస, రవ్వ-ఆనియన్, రవ్వానియన్ మసాల, ఓపెన్ బట్టర్ మసాలా, గోభీ దోస, కాప్సికమ్ దోస, రాగి దోస, పన్నీర్ దోస, పెసర దోస, ఆనియన్ పెసర దోస, ఆనియన్ మిర్చీ పెసర దోస, నా దినం దోస, అప్పం, ఊతప్పం మొదలైనవన్నీ మొహమాటం లేకుండా, సిగ్గు పడకుండా తినీ, అరిగించుకొనీ అట్టు/దోసల మీద మీద నా ప్రేమని చాటుకొన్నానని బ్లాగ్ ముఖంగా చెప్పుకోడానికి గర్వ పడుతున్నాను. 




అసలు దోసల పేర్లు వింటుంటేనే.... 

"రసాతలం లో మసాలా దోసా... పెసరట్టుప్మా తినాలని ఆశా.." 
"అల్లం, ఉల్లీ కసకసా కట్ చేశా... రవ్వా మిక్స్ తో దోసలు పోసా"
"చక్కని దోసకై పెన్నాన్ని గీసా... ముక్కలైన దోసని పక్కన పారేసా"


అని ప్రాస తో కూడిన  భావకవిత్వం లావాలాగా పొంగుకొచ్చేస్తుంది నాకు.

అయితే నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద హోటల్స్ లో డబ్బులు సమర్పించుకొని బ్రేవ్ మనటం తప్పితే టేస్ట్ అంతగా బాగోదు. 
బెంగుళూర్ లో మా రూం కి దగ్గర్లో ఓ చిన్న హోటలుంది. మన తెలుగు వాళ్లదే. సాదా/ఆనియన్/కారం దోసలు వాళ్ళ  స్పెషలు.(దోస Rs.15 డెడ్ చీపు) ఆ ఆంటీ రెండు స్టౌల మీద బుల్లి బుల్లి పెనాల మీద చక చకా వేసిస్తారు. మామూలుగా పిండి గరిటతో వేసీ గుండ్రంగా పరుస్తారు కదా... ఆవిడ పెనం గాల్లోకి ఎత్తి గుండ్రంగా తిప్పుతారు. చాలా పలచగా టేస్టీగా వస్తాయ్ లెండీ.. ఒక్కొక్కళ్ళదీ ఒక్కో ఫార్ములా. ఆ హోటల్ లో దోసలు బాగా ఇష్టం నాకు. మినిమం నాలుగు ఐదు దోసలు ఊదేస్తాను నేను.

సాటి అట్టు/దోస ప్రేమికులకి సూచనలు - నా పరిశీలనలుః

1. మొదట వాయ తో తీసిన ఇడ్లీ, ఆఖరిగా వేసిన అట్టూ అద్భుతంగా ఉంటాయ్.

2. హైజెనిక్ ఫుడ్డూ తొక్కా తోటకూరా అంటారు గానీ రోడ్ సైడ్ కాకా హోటల్లోనూ, తోపుడు బళ్లల్లోనూ ఉండే రుచి ఇంకెక్కడా రాదు. 

3. హిట్టయ్యే మాస్ సినిమా కి ఐటెం సాంగులూ,బూతు డైలాగులూ ఎంత ముఖ్యమో, దోసలకి చెట్నీ,సాంబారూ అంత ముఖ్యం.
   చాలా మంది చట్నీ కి టచ్ చేస్తే షాక్ కొడుతుందేమో అన్నట్టూ చెంచాడు చెట్నీ తో తినేస్తూ ఉంటారు. ఏదో పేజీలు తిప్పినట్టూ ఉంటాది యవ్వారం. పాపం తగులుతాది అలా తింటే. ఒక అట్టుకి కనీసం మూడ కప్పుల చెట్నీ/సాంబారు మింగితే అప్పుడే దాని జన్మకీ ఒక అర్ధం పరమార్ధమూనూ.

4. నాన్ స్టిక్ పెనం మీదేసిన అట్టు పారెయ్యడానికి కూడా పనికిరాదు నా దృష్టి లో. మట్టి పెనం, మామూలు అట్లరేకు మీద వేసిన అట్టుకొచ్చే రుచే వేరు.
5. కొంత మంది దోసల్ని కూడా కత్తులతో కోసి, ఫోర్కులతో పీక్కుతింటారు. అలాంటి వాళ్లని చూసి జాలి పడండి. చేత్తో తుంచీ, చెట్నీలో ముంచీ, నాన్చీ, తినడానికి గర్వపడండి.

6. అట్లెప్పుడూ వేడి వేడిగా ఊదుకుంటూ తినేయాలి. "మాకు తెలుసు లే" అంటారేమో... కొంచెం వివరిస్తాను.  ఇంట్లో అట్లేసేటప్పుడు ఒకటి పూర్తిగా తినకముందే ప్లేట్లో ఇంకొకటీ వేసేశారనుకోండి. పాతది కంప్లీట్ చేశాక ఇది తినటం కన్నా, మోస్ట్ రీసెంట్ గా వేసినది ముందు తినెయ్యటం ఉత్తమం.

7. హోటల్ నుండి దోసల్ని పార్సిల్ తీసుకెళ్ళడం కన్నా ఆవురావురుమంటూ అక్కడే తినెయ్యటం మంచి పద్దతి. (చల్లారి పోయి, స్మూత్ నెస్ పోయిన దోస ఏజ్ బారయిపోయిన హీరోయిన్ లాంటిది) పైగా కావల్సినంత చెట్నీ
లాగించొచ్చు.

8. మీకోసం మీరే దోసలు వేసుకొని తినడం దరిద్రమయిన దురదృష్టం. ఎవరయినా ఒకదాని తర్వాత ఒకటీ వేసి పెడుతుంటే తినడం మహా  అదృష్టం .


ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైపోవటం తో మహాభారతం లాగా సాగుతున్న నా ఈ అట్ల పురాణాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.  ఈ పురాణాన్ని
విన్నవారికీ, చదివిన వారికీ అష్టరకాల అట్లు సిద్ధిస్తాయనీ నేను నొక్కి వక్కాణిస్తున్నాను.

॥సర్వేజనాం సుఖినో భవంతు॥
॥శ్రీఘ్రమేవ అట్లు ప్రాప్తిరస్తు॥





జైహింద్...!

79 comments:

సుభ/subha said...

హహహహ..కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. అమ్మో నవ్వలేక చస్తున్నానండీ బాబూ..అసలు టైటిలే కేక.ఇక మీరు చెప్పిన సూచనల్లో 6,8 సూచనలు మా అమ్మతో ఎప్పుడూ అంటూ ఉంటాను.

Imtiaz Ali Khan said...

మీ పరిశీలనకు కోటి దండాలు. మా వీధి చివర్లో దోసలు వేసె పెద్దమ్మ దగ్గరికి నెయ్యి తీసుకొని వెళ్ళి దోసెలు వేయిన్చుకునేవాణ్ణి నా చిన్నతనం లో. నా తర్వాత అదే పెనం మీద దోస వేయించుకోడానికి పోటీ పడే వాళ్ళు కొందరు పిల్లలు.

మంచి ఘ్ఞాపకాలు గుర్తు చేసారు. మీ శైలి అద్భుతం.

Sravya V said...

వామ్మో రాజ్ అసలు ఏ లైన్ బావుందని చెప్పాలి ? మీ భాష లో ఈ పోస్టు కెవ్వు కేక :-))
ఇప్పుడు నాకు కడుపు లో నొప్పి గా ఉంది అట్లు తిని కాదు నవ్వీ నవ్వే :-))
అసలు ఆ క్రింద 8 సూచనలు అరాచకం :-))

శ్రీరామ్ said...

రాజ్ నీ అట్ల పురాణం కెవ్వు కెక ....!!

శ్రీరామ్ said...

రాజ్, నీ అట్ల పురాణం కెవ్వు కెక ....!

మనసు పలికే said...

నీ అట్లపురాణం బాగు బాగు, బహు బాగు:)

కాసేపు నోట్లో లాలాజలం వరద గోదారిలా పొంగిపోయి ఇప్పుడే సద్దుమణిగింది;) నువ్వు చెప్పిన ప్రతీ పాయింటుతోనూ నేను ఏకీభవిస్తాను రాజ్. అట్టు ఒక మహాద్భుతమైన, అమృతతుల్యమైన పదార్థం. అర్జెంటుగా వెళ్లి ఒక అట్టు లాగిస్తేనే కానీ మనసు కంట్రోల్ లోకి వచ్చేలా లేదు, బై బై...

శిశిర said...

:)))))

ఆ.సౌమ్య said...


రాజ్...నీ అసాధ్యంకూల....అట్ల గురించే రాసావూ! నీ బ్లాగు పోస్ట్ కన్నా పెద్ద కామెంటు పెట్టేలా ఉన్నాను. సర్లే కుదించి రాస్తాను.

ఈ అట్ల పిచ్చి నాకూ ఉంది. హొటెల్ కెళితే అట్టు తప్ప ఇంకోటి ఆర్డర్ చెయ్యను. ఎప్పుడూ అట్లేనా అని అమ్మ మందలించినా "అట్లే" అన్నదే నా జవాబు. మసాలాదోశలంటే పిచ్చి. ఇప్పుడు ఆ పిచ్చి రవ్వదోసలమీదకి మళ్ళిందనుకో. ఓసారి మా నాన్నగారు మా పిల్లకాయలందరినీ (కజిన్స్ అందరినీ) హొటెల్ కి తీసుకెళ్ళి మీరెన్ని మసాలాదోసలు తినాలంటే అన్ని తినండి అన్నారు. అప్పుడు నాకు 12-13 వయసుంటుందేమో ఉంటాయేమో. ఆబకొద్దీ ముందు 6 అని తరువాత 8 అని చివరకి 10 తింటా అన్నాను. హొతెల్కెళ్ళి మూడు కూడా తినలేకపోయాను. ఒకటిన్నర తినేసరికి ఆయాసం వచ్చేసింది. ఆపోటీ ఏదో ఇప్పుడు పెడితేనా అనిపిస్తుంటుంది నాకు.

మా ఊర్లో కృష్ణా భవన్లో అట్లు చిన్నప్పుడు ఒక క్రేజ్. అక్కడికెళ్ళి దోశలు తినాలి. అలాగే సావిత్రమ్మ కొట్టు లో పుల్లట్లు...అబ్బబ్బా ఏం చెప్పను ఆ రుచి! నువ్వన్నట్టు చిన్న చిన్న కాకా హొటెళ్ళలోనే అట్లు మహా రుచి.

నీలాగే ఆ అట్టు ఈ అట్టు అని తేడా లేకుండా అన్ని రకాలు ట్రై చేస్తా ఎక్కడికెళ్ళినా. ఆ మధ్య ఎప్పుడో దోస కార్నర్ అని కనిపిస్తే ఆశ గా వెళ్ళి ఏదో నోరు తిరగని పేరున్న దోశ ఆర్డర్ చేసా....అదేమో దోసలో నూడుల్స్ చుట్టి ఇచ్చాడు. వాడి శ్రార్థం పెట్ట...ఏడుపొచ్చింది. అసలు బంగారం లాంటి అట్టుని నూడుల్స్ తో కలపడమేమిటి వాడి బొంద కాకపోతే.

అసలు అట్లు వేస్తున్నప్పుడు చుయ్య్ మని వచ్చే ఆ శబ్దానికే...నాయనా...నోట్ళో లాలజలం సుడులు తిరగదూ!!

మా యూనివర్సిటి హాస్టల్లో మసాలాదోశలు వేస్తే నాకు ఒకటి extra. నేను చెప్పక్కర్లేదు వాళ్ళే వేసేస్తారు నాకు :) నేను మెస్ సెక్రటరీగా ఉన్నప్పుడు వారానికి మూడు రోజులు దోసలు పెట్టేదాని . మా ఫ్రెండ్స్ అందరూ విసుక్కునేవారు....నీకీ అట్ల పిచ్చేమిటే బాబు అని :)

ఎగ్ దోశ తిన్నవా ఎప్పుడైనా? ఎగ్ దో లో శనగపలుకుల చట్నీ ముంచుకు తింటే ఉంటుంది చూడు...ఓహో నా రాజ్...స్వర్గం ఎందుకు పనికొస్తుంది దాని ముందు!

ఇంక ఆపేస్తా :) ఎప్పటిలాగే నీ పోస్ట్ అదుర్స్...నవ్వించి చంపావ్!

జయ said...

అబ్బో! కెవ్వుకేక:) (మన బ్లాగుల్లో చూసే వాళ్ళు సినిమాలో ఈ కెవ్వు కేక కాపీ కొట్టారని నా అనుమానం) అమృతం సీరియల్ లో అప్పాజీ గుర్తొచ్చాడు రాజ్ కుమార్:) హైద్రాబాద్ లో కూడా పుల్లట్లు దొరికితే బావున్ను...

రసజ్ఞ said...

వావ్! కేవ్వ్వ్వవ్ కేక వ్రాసారుగా!! అసలెలా వ్రాస్తారు మీరిలా??? మీరు ఎంపిక చేసుకునే అంశాలు కూడా భలే ఉంటాయి!
"వేసవి సెలవుల్లో నేను బాలకార్మికుడి అవతారం" అయ్యో పాపం!!! అంత కష్టపడి బిస్కెట్లు, బిళ్ళలూ, జీళ్ళూ, చాక్లెట్లూ,తినేవారా?? నేనయితే ఇంకొంచెం ఎక్కువ కష్టపడి జీడిపప్పు, బాదం పప్పు, పల్లీలు తినేదానిని. మరి హెల్ప్ చెయ్యాలంటే బలం రావాలి కదా!!
ఈ ఇందేసు గారి గురించి మీరు చెప్పింది, నేను ఊహించుకుంటే "ఉల్లాసంగా ఉత్సాహంగా"లో వద్దు సరోజా అంటాడు, అతను గుర్తొచ్చాడు :)
ఈ అట్ల పిచ్చి నాకూ ఉంది. ఎవరయినా నందికేశ్వరుడి నోము పట్టి, పిలవటానికి ఇంటికొచ్చి మా ఇంట్లో అట్లు అంటే చాలు స్కూల్ మానేసి మరీ వెళ్ళేదానిని (అంత భక్తనమాట) కాలేజీకోచ్చాక ఒకసారి 115 రకాల దోశలతో ఏదో ఫెస్టివల్ పెట్టాడు, స్టూడెంట్స్ కి ఫ్రీ ఎంట్రీ. గంటసేపు ఎన్ని తిన్నా ఫ్రీ మిమ్మల్ని పిలవాల్సింది :(:( మా హాస్టల్ లో మాత్రం మష్రూమ్ మసాలా దోశ వేసేవాడు సూపరంతే.
"రసాతలం లో మసాలా దోసా... పెసరట్టుప్మా తినాలని ఆశా" మీ భావావేశం .................. మొత్తానికి ఈ అట్ల పురాణంలోని ముఖ్య సారమయిన ఆఖరి ఎనిమిది వాక్యాలూ అందరూ ఫాలో అవ్వాలని, అవుతారని ఆశిస్తూ, ఇప్పటికే లెంగ్త్ ఎక్కువయినందున ఆపేస్తున్నా.

సంతు (santu) said...

నమ్మ లేకున్నా, అట్టు ని చట్నీ తో తినొచ్చు కవాలన్తేయ్ సాంబార్ తో తినొచ్చు అని తెలుసు కాని ఇలా కవిత్వం రాసుకొని కుడా తినొచ్చు అని ఇప్పుడీ తెల్సింది,
మీ ఈ అట్ల పురాణం చదివిన తరువాత నాక్కూడా మీకు మల్లె "అట్ల పురాణం (వెర్షన్ 2 )" రాయాలని మది లో ఏవేవో ఆలోచనలు మెదళుతున్నాయి, కాని నా నాలుక కూర్చోనివ్వడం లేదు, సో ఇప్పుదేల్లి తొరగా అట్లు తినేసి వొస్తా...

అట్ల పై ఇంత పెద్ద వ్యాసం రాసిన వ్యాసకర్తకు ఇదే న అట్లమాల.......

Chinni said...

ఇంట్లో అట్లేసేటప్పుడు ఒకటి పూర్తిగా తినకముందే ప్లేట్లో ఇంకొకటీ వేసేశారనుకోండి. పాతది కంప్లీట్ చేశాక ఇది తినటం కన్నా, మోస్ట్ రీసెంట్ గా వేసినది ముందు తినెయ్యటం ఉత్తమం - ఇది నేను కచ్చితంగా పాటిస్తానండి. వెంటనే ఒక దోస తినాలనిపిస్తోంది.

sarma said...

:)

హరే కృష్ణ said...

హిట్టయ్యే మాస్ సినిమా కి ఐటెం సాంగులూ,బూతు డైలాగులూ ఎంత ముఖ్యమో, దోసలకి చెట్నీ,సాంబారూ అంత ముఖ్యం.
ROFL

అన్ని పాయింట్లు సర్వేజనా వరకు కెవ్వ్ కేక :))))

Sravya V said...

దేవుడా అ పోస్ట్టే అనుకుంటే ఈ సౌమ్య గారి కామెంట్ :)
-------------------
రాజ్...నీ అసాధ్యంకూల....అట్ల గురించే రాసావూ! నీ బ్లాగు పోస్ట్ కన్నా పెద్ద కామెంటు పెట్టేలా ఉన్నాను. సర్లే కుదించి రాస్తాను.
-------------------------
అసలు ఈ లైన్లు చూసి నేను నవ్వి నవ్వి చస్తున్నా

moonlight said...

చాలాసార్లు కామెంట్ పెట్టాలని అనుకుని బద్దకంతో పెట్టలేదండి.ఈ పోస్ట్ చదివాక ఔను నేను కామెంట్ పెట్టాను అనిపించుకోవాలనీ!. పైన ఎవరో చెప్పినట్లు మీరు ఎంచుకునే టాపిక్కుకి ఎక్కువ మార్కులు వేస్తున్నానండి.మీ శైలి అద్భుతం ,అమోఘం . మీరు చెప్పిన ఎనిమిది సూత్రాలు ఈసారి తూచ తప్పకుండా పాటిస్తాను.మీ POSTS గురించి చకోరపక్షుల్లా ఎదురు చూసే అభిమానులను దృష్టిలో పెట్టుకుని తరచూ వ్రాయమని కోరిక

మీ అభిమాని

kiran said...

ఈ అట్లు ముంచే అలవాటు పుట్టుకతో వచ్చిందా.....అయితే వాకే...!!

"బాబబా డ్బబడబడబ గుర్ గురురగుర్ మినప.. గర్ గర్ ఉల్లి..సాదా. డగడగడగ" -- LOLLLLLLLLLLLL

అన్ని దోసల పేర్లు రాశావ్...నాకేదో అనుమానం వచ్చేస్తున్నాది.. :P

నీ పరిశీలనలు లో నన్ను మూడో పాయింట్ ఎక్కడో తంతోంది..నేను బాగా hurt అయ్యాను :(

నీకు నా చేత వీపు మీద స్పెషల్ అట్టు ప్రాప్తిరస్తు... :P

నీ పోలికలు ఎప్పుడు పోలికేకే ..ఇక టపా గురించి స్పెషల్ గ చెప్పాలా...ఉప్మా పెసరట్టు లా సూఒపార్...

నేస్తం said...

చాలాసార్లు కామెంట్ పెట్టాలని అనుకుని బద్దకంతో పెట్టలేదండి.ఈ పోస్ట్ చదివాక ఔను నేను కామెంట్ పెట్టాను అనిపించుకోవాలనీ!. పైన ఎవరో చెప్పినట్లు మీరు ఎంచుకునే టాపిక్కుకి ఎక్కువ మార్కులు వేస్తున్నానండి.మీ శైలి అద్భుతం ,అమోఘం . మీరు చెప్పిన ఎనిమిది సూత్రాలు ఈసారి తూచ తప్పకుండా పాటిస్తాను.మీ పోస్ట్ ల గురించి చకోరపక్షుల్లా ఎదురు చూసే అభిమానులను దృష్టిలో పెట్టుకుని తరచూ వ్రాయమని కోరిక

మీ అభిమాని

చాతకం said...

Awesome post. Whole heartedly agree to the 8 commandments. Yes, The very first Attu always sucks & should avoid at all costs. I like it even more if they make them pyramid shaped. ;)

POOJITA said...

చాలాసార్లు కామెంట్ పెట్టాలని అనుకుని బద్దకంతో పెట్టలేదండి.ఈ పోస్ట్ చదివాక ఔను నేను కామెంట్ పెట్టాను అనిపించుకోవాలనీ!. పైన ఎవరో చెప్పినట్లు మీరు ఎంచుకునే టాపిక్కుకి ఎక్కువ మార్కులు వేస్తున్నానండి.మీ శైలి అద్భుతం ,అమోఘం . మీరు చెప్పిన ఎనిమిది సూత్రాలు ఈసారి తూచ తప్పకుండా పాటిస్తాను.మీ పోస్ట్ ల గురించి చకోరపక్షుల్లా ఎదురు చూసే అభిమానులను దృష్టిలో పెట్టుకుని తరచూ వ్రాయమని కోరిక

మీ అభిమాని

నిషిగంధ said...

"కోతి చేతిలో టూత్ బ్రష్ పెడితే అది పళ్ళు తోముకుంటుందా? వీపు గోక్కుంటుందా?..లేకా పీకి పారేస్తుందా? అంటే ఏం చెప్పగలం పిన్నిగారూ?? అది కోతి. ఏమయినా చేస్తుంది..ఈ ఎదవా అంతే.. అదేదో వండి పెట్టండి" అని అంతిమ తీర్పిచ్చారు నాన్నారు."

:)))))))

టైటిల్ నించీ చివరాఖరి దీవెన్ల వరకూ పోస్ట్ హిలేరియస్, రాజ్! ఈ మధ్యనే నా చేత తుంచబడిన నానా రకాల అట్లన్నీ ఇంకోసారి గుర్తొచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాను :-)

సౌమ్య కామెంట్ కూడా సూపర్ :))

vikki said...

please review this Site
www.logili.com
post your Book Reviews
review.logili@gmail.com

Unknown said...

ఏం రాసావు రాజ్:))అందరూ ఇప్పటికే చెప్పేసారు.కోతి ఇన్నిపనులు చేస్తుందా:))ఇంతకూ నీకు దోసలు వేసుకోవడం వచ్చా? నాన్స్టిక్ పెనాలగురించి నేనూ నీతో ఏకీభవిస్తాను.దోస సంఘం వర్ధిల్లాలి అనాలేమో:))

PradeepReddy said...

Simply Amazing

PradeepReddy said...

Simply Amazing

Found In Folsom said...

రాజ్ కుమార్ గారు, మీకు 100 ఇయర్స్ అండి. నిన్ననే ఒక సాడ్ న్యుస్ విని చాలా డల్ గా ఉన్నాను. రాజ్ కుమార్ పొస్ట్ చదివి చాలా రోజులు అయ్యింది...ఏదన్నా రాస్తే బావుండు అని నిద్ర లేస్తూనే ఐపాడ్ తెరిచా. ఇంకేముంది..కనుల పండుగ ...మీ పొస్ట్ చదివేసా. ఈ సారి మీకు తెలుగులొనే కామెంట్ పెట్టాలని కస్ట పడి రాస్తున్నా..:)అసలు విషయం ఎప్పటి లగానే, పొస్ట్ సూపర్. కానీ అంత అద్రుస్టం నకు లేదండి. నా వరకు వచ్చె సరికి అట్ల పిండి ఎప్పుడూ అయిపొతుంది. మళ్ళా కలుపుకోవాలి. నా అట్లు నెనే వెసుకోవాలి. వెరే వాళ్ళు వెస్తే మనకి నచ్చవు కదా. సొ, సెల్ఫ్ సెర్వీసు అన్నమాట. అమ్మొ, ఇంక తెలుగులో టైపు చేయటం నా వల్ల కాదు. ఇంక సెలవు.

జలతారు వెన్నెల said...

రాజ్ గారు, చాలా బాగుంది.మనసారా నవ్వుకునేలా చేసింది మీ పోస్ట్.
అట్లు/దొశలంటే నాకు కూడా చాలా ఇష్టం.మీ నాన్నగారు అంతిమ తీర్పు ఇచ్చేటప్పుడు అన్న మాటలకి నవ్వు ఆపుకోలేకపోయాను.

Raviteja said...

superrrr post. naku mee laga attlu anta chala ishtam. mukhayamga vizag meghalaya hotel lo every saturday manchurian dosa, mushroom dosa special gaa chastaru danike ke nanu pedda fan nee

rajachandra said...

kevvu keka andi.. superooo super :)

సిరిసిరిమువ్వ said...

వార్నాయనో..నవ్వి నవ్వి కడుపు పగిలేటట్టు ఉంది..నీ పోస్ట్ చదివి వెంటనే వంటింట్లోకి వెళ్ళి ఓ రవ్వ దోసె వేసుకుని తిని వస్తున్నా!

జాలువారుతున్న నోట్లోని లాలా జల ప్రవాహాలనీ, నాసికా రంధ్రాల గుండా దూకుతున్న జలపాతాలనీ సంగమీంచనివ్వకుండా ముక్కు ఎగబీల్చి..

తన్మయత్వంతో విషాద గీతం పాడుతున్న హిమేష్ రిషమియా..:)))

"కోతి చేతిలో టూత్ బ్రష్ పెడితే అది పళ్ళు తోముకుంటుందా? వీపు గోక్కుంటుందా?..లేకా పీకి పారేస్తుందా? అంటే ఏం చెప్పగలం పిన్నిగారూ?? అది కోతి. ఏమయినా చేస్తుంది..ఈ ఎదవా అంతే.. అదేదో వండి పెట్టండి"

ఆ టేస్టంతా పెణం తుడిచే ఆ జిడ్డు చీపురుదే అనీ, అదే చీపురుతో పొద్దున్న పూట వాకిలి తుడుస్తారనీ అంటా ఉండేవాడు మా తాత..
అహ.హ...హాస్టల్ లో దగ్గర నిలబడి మరీ అట్టు వేయించుకునే వాళ్లం..ఇంకాసిన్ని ఉల్లిపాయ ముక్కలు వెయ్యి అని మరీ డిమాండ్ చేసి వేయించుకునే వాళ్ళం..అప్పుడు ఆ వంట వాడు ఇలాగే చీపురుతో తుడిచేవాడు..మొదట్లో అది చూడటానికి ఇబ్బందిగా ఉన్నా అట్టాభిమానం ముందు అది తుడుచిపెట్టుకుపోయింది.

లైను..లైనుకి ఓ వంద కెవ్వులు వేసుకో!

మా అమ్మాయి అచ్చు నీలాగే అట్టుకి వీరాభిమాని అవలీలగా ఓ ఏడెనిమిది తినేస్తుంది...నేను కూడా అట్టాభిమానినే. హోటల్ లో నేను తినే ఏకైక టిఫిన్ అట్టు..అది కూడా ఉల్లట్టు..మసాలా అట్టు మొహం మాత్రం అసలు చూడను.

"మీకోసం మీరే దోసలు వేసుకొని తినడం దరిద్రమయిన దురదృష్టం. ఎవరయినా ఒకదాని తర్వాత ఒకటీ వేసి పెడుతుంటే తినడం మహా అదృష్టం" ...ఇది మాత్రం గొప్ప నిజం. అట్టు వేసుకునే ప్రతిసారి అబ్బ ఎవరైనా వేసిపెడితే బాగుండు అనుకుంటా. మా అమ్మాయి ఉంటే నాకు తనే వేసి పెడుతుంది.

నీ భావ కవిత్వం మాత్రం అదిరిపోయింది రాజ్!

నిండు నూరేళ్ళు ఇలాంటి టపాలు వ్రాస్తూ వర్ధిల్లు రాజ్ బాబూ!

శ్రీనివాస్ పప్పు said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ రాజ్ పోస్ట్ కేకంతే మాటల్లేవ్. అర్జంటుగా వెళ్ళి ఓ నలుగైదారేడెమిదిత్తొమ్మిదిపది దోశలు తినేసి వస్తా.

సౌమ్యా కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

బంతి said...

సూపర్ గా ఉంది నీ అట్లపురాణం.
"మోహన్ బాబుకి మైకిచ్చినట్టూ"
హ హ హ అన్నట్టు దాసరి కి కూడ మైకు జబ్బు ఉంది అని నా అనుమానం .. నువ్వు ఏటంటావు?
అవును రాజ్ అక్టోపస్ అట్టు ట్రై చేసావా :P

మాలా కుమార్ said...

మా అబ్బాయి కి కూడా అట్టు పిచ్చి వుంది . అందరూ తిన్నాక వాడి కి వేసి ఇవ్వటం మొదలు పెట్టేదానిని . మావారు వచ్చి ఇంకా ఎన్ని రా ఇహచాలు అనీర్చేవరకూ ఆపసోపాలు పడుతూ తింటునే వుండేవాడు .
మీ పోస్ట్ బాగుంది . దోసలలో ఇన్ని రకాలు వుంటాయని నాక తెలీదు :)

..nagarjuna.. said...

>>ఒక అట్టుకి కనీసం మూడ కప్పుల చెట్నీ/సాంబారు

ఇంటర్లో రెండిడ్లీలకు మూడు కప్పుల సాంబార్ పోయించుకుంటుంటే వింత చూపులు చూసిన హొటెల్ వాడు గుర్తొస్తున్నాడు :))

ఇంతకూ మీ రూం దగ్గర ఆ దోశల బండి ఎక్కడ బాబు... ఈసారొచ్చినపుడు ట్రైమాడెదను

laddu said...

ROFL.... Very good observation on Attu.

రాజ్ కుమార్ said...

సుభ గారూ...టైటిల్ నాకు కూడా బాగా నచ్చిందండీ.ధన్యవాదాలు.

ఇంతియాజ్ ఆలీఖాన్ గారూ..ముందుగా నా బ్లాగ్ కి స్వాగతం. అడ్డెడ్డే అనుకుంటూనే మరిచిపోయానండీ నేతి తో దోశల సంగతీ..;(
భలే గుర్తు చేశారు ;) ధన్యవాదాలు

శ్రావ్యగారూ.. మీ ISI ముద్రపడిపోయాక ఇంకేం? హ్యాపీస్.. థాంక్యూ సో మచ్.

రాజ్ కుమార్ said...


శ్రీ రాం గారూ ధన్యవాదాలు.. చాలా కాలానికి నా బ్లాక్ లో కాలుపెట్టినట్టున్నారండీ.. ;)

@మనసుపలికే...చెల్లెలివై ఉండీ ఆమాత్రం ఏకీభవించకపోతే ఎట్టా?అవును అట్టు ఒక అద్బుతం. అసలు మన రాష్ట్రం అసలు పేరు
అట్ల ప్రదేశ్ ఏమో అని నాకు అనుమానం;);) థాంక్యూ

శిశిర గారూ ధన్యవాదములు ;)

రాజ్ కుమార్ said...

అ.సౌమ్యగారూ... నాకు నచ్చలేదు అస్సలు.. అసలు "కుదించటం ఏంటీ?" అని ప్రశ్నిస్తున్నాను.
అయితే అయ్యింది.. నా అట్టు.. అదే మన అట్టు గురించి ఎంత చెప్పినా కొత్తగానే ఉంటుంది. మొత్తం రాసెయ్యాల్సింది.
థాంక్యూ.. ;) ;)

జయగారూ.. భలే గుర్తు చేసారండీ..అప్పాజీ కూడా..పెసరట్టో.. అని గోల పెడతాడు..హ్హహహ్.. ధన్యవాదాలండీ.

రసజ్ఞ గారూ..
>>మీరు ఎంపిక చేసుకునే అంశాలు కూడా భలే ఉంటాయి!>> ఏం రాయాలో తెలియక పోతే ఇలాంటీ టాపిక్కులే దొరుకుతాయండీ.
జీడిపప్పు, బాదం పప్పు తినడం మొదలెడితే.. జీళ్ళు కూడా తిండానికి లేకుండా కొట్టు మూసేసుకునే వారు ;) అట్లక్లబ్ కి మీకు కూడా
స్వాగతం. థాంక్యూ

రాజ్ కుమార్ said...







santu గారూ..ఇంకెందుకు ఆలస్యం? తొందరగా రాసెయ్యండి మరి..మాంచి పెసరట్టు తినీ మొదలెట్టండి. అట్లమాలని స్వీకరిస్తూ..ధన్యవాదాలు

చిన్ని గారూ.. సేం పించ్..హహహ.. థాంక్యూ

హరే థాంక్యూ వెరీ మచ్ ;) ;)

శ్రావ్య గారూ కదా... నేను షాకయ్యాను.. మీరుకోట్ చేసిన లైన్స్ కేక ;)

చాతకం గారూ థాంక్యూ అండీ. మొదటి అట్టు ఎప్పుడూ అలాగే తిడుతుంది.. ;) ;)

రాజ్ కుమార్ said...

@కిరణ్ ఏమో ఎప్పటి నుండి వచ్చిందో తెల్వది. అలాంటి అనుమానాలు పెట్టుకుంటే నువ్వేసిన అట్టు పెనానికి అంటుకుపోయి ముక్కలు ముక్కలు గా అయిపోవాలని
శపిస్తా.. కికికి నిజం నీ గురించే అది ;) థాంక్యూ ;)

పూజిత గారూ..అలా బద్దకించడం తప్పుకదూ? మీరు ఎక్కించిన చెట్టు దిగాక నెక్శ్ట్ పోస్ట్ రాస్తానండీ ధన్యవాదాలు.

నిషిగంధ గారూ.. థాంక్యూ సో మచ్.అంటే మీరూ మా క్లబ్ లో ఉన్నట్టేనా?

రాజ్ కుమార్ said...


లోగిలి గారూ.. thanks for the info ;)

సునీత గారూ... ఎంత మాట అనేశారూ?? దోసలు తినడం ఎంతిష్టమో వెయ్యటం అంత ఇష్టం.. ;)థాంక్యూ వెరీ మచ్ అండీ

ప్రదీప్ రెడ్డి గారూ థాంక్యూ;)

found in folsom గారూ.. ముందుగా మీ దీవెనలకీ, తర్వాత మీ అభినందనలకీ కృతజ్ఞతలు ;)మీ చేత తెలుగులో కమెంట్ పెట్టినందుకు
అట్టు తిన్నంత ఆనందంగా ఉంది. మీ బుడ్డాడు పెద్దయ్యి మిమ్మల్ని కూర్చోబెట్టి అట్లేసి పెట్టే రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నా ;)

రాజ్ కుమార్ said...

జలతారు వెన్నెలగారూ.. హహ.. చాలా థాంక్స్ అండీ

రవితేజ..థాంక్యూ సో మచ్. welcome to our dosa club ;)అవునా.. ఈ సారి వైజాగ్ వచ్చినప్పుడూ ట్రై చేస్తా..ఎక్కడ అదీ?

రాజా చంద్ర గారూ థాంక్యూ అండీ
పప్పుసార్... అంతకంటే తక్కువ తింటే మనకి పరువు తక్కువ కదూ?? కుమ్మెయ్యండి. థాంక్యూ..

రాజ్ కుమార్ said...



మువ్వగారూ..కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్.. మీరు రవ్వ దోసల స్పెషలిస్టా? నేను డైరెక్ట్ గా మీ ఇంటికే నండీ. మీకు నచ్చినందుకూ, నన్ను మెచ్చినందుకూ చాలా థాంక్స్ .
>>నిండు నూరేళ్ళు ఇలాంటి టపాలు వ్రాస్తూ వర్ధిల్లు రాజ్ బాబూ!>>
మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా ;)



బంతీ.. దాసరికే ఇద్దాం అనుకున్నా.. కానీ మోహన్ బాబు కి బాగా సింకవుతుందని ఉంచేశా..
నేనేమంటానూ..?? "దాసరి మోహన్ బాబు కి గురువు" అంటాను.
ఆక్టోపస్ అంట్టా..గుఱ్ ఱ్ ఱ్ ఱ్ ఱ్ ఱ్


మాలా కుమార్ గారూ.. మీ అబ్బాయ్ ని మా క్లబ్ లోకి చేర్చుకుంటున్నామండీ.. ;) ;) తినేవరకూ నాకూ తెలీదండీ అన్ని ఉంటాయని ;)
థాంక్యూ

చారీ.. వాళ్ళు అలాగే చూస్తారు..వాడి సొమ్మేదో తినేస్తున్నట్టు.. నేను అస్సలు సిగ్గు పడను చెట్నీ లో ఈత కొట్టేస్తాను ;)
ఓ..తప్పకుండా... కుమ్మేద్దాం ఈ సారి ;) ;)

Anonymous said...

మీకోసం మీరే దోసలు వేసుకొని తినడం దరిద్రమయిన దురదృష్టం. ఎవరయినా ఒకదాని తర్వాత ఒకటీ వేసి పెడుతుంటే తినడం మహా అదృష్టం .

ఇది మాత్రం నిజం. జన్మానికో శివరాత్రి లా( కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే ) ఎపుడేనా మావారు వేసే అట్లే నాకు మహాప్రసాదం. ముందు వెయ్యమంటే నాకు చాల ఆకలిగా ఉంది నేను తిన్నాక అంటారు. ఫదో,నాలుగో పదారో తిన్నాక ఓపిక లేదు పొమ్మంటారు. రేపు రాత్రికి అటుకుల అట్లకి నానబోయాలి మీ దయవల్ల. తలా ఓ నాలుగేసి ఇడ్లిలేసి చేతులు దులిపెసుకోవాలనుకున్న. కుదరనిచ్చారు కాదు కదా.

బులుసు సుబ్రహ్మణ్యం said...

వార్నాయనోయ్, చదివిన పావుగంట కి కానీ నవ్వులోంచి తేరుకోలేదు.

అట్లలో రారాజు పుల్లట్టు అని నా ఘట్టి నమ్మకం. కానీ పుల్లట్టు వేసేవారు ఆంధ్రదేశం లో కరువైపోతున్నారు. పుల్లట్టు మీద ఓ పిహెచ్ డి చేయాలని ఉంది. మంచి పుల్లట్లు వేసే మాష్టారు దొరికితే స్కూల్ ఆఫ్ పుల్లట్లు స్థాపించవచ్చు.

అన్నట్టు బొబ్బట్టు కూడా అట్ల జాతికి చెందినదే.

టాపిక్ అదుర్స్. టైటిల్ కెవ్వు. టపా కేక.

www.apuroopam.blogspot.com said...

వహ్వా..ఏం పోస్టండి. మాంచి కరకరలాడే దోశ తిన్నట్టు ఉంది.ఇది చదువుతుంటే ఎప్పుడో యాభైలలో విశాఖ పట్నం చడగాస్ లో తిన్నదోశలు కూడా గుర్తొచ్చేయి.పుల్లట్లగురించి చదవడమే కాని తినే అదృష్టం ఎప్పుడూ కలుగలేదు.ఈజన్మకింతేనేమో.పోనీండి. మీరైనా పుల్లట్ల లాంటి పోస్టులు రాసిమమ్మల్ని ధన్యులను చేయండి.

Found In Folsom said...

హహ్హహ్హ....మా బుడ్డోడు ఇప్పుడు వెయమన్నా రెడీ.కాకపోతే అవి అట్లు లాగాకాదు,దిబ్బరొట్టెల్లానో,అట్టు ఖీమింకో లాగానో వస్తాయి. మీరు మరీ ఇంత గాప్ తీసుకోకుండా కొంచెం ఎక్కువ పొస్ట్ లు రయొచ్చు కదా. అంటే, డిమాండ్ కాదు అనుకొండి, ఎదో మీ అభిమానుల విన్నపం అంతే..

జ్యోతిర్మయి said...

హహహ....మీ టైటిలే బ్రహ్మాడంగా వుంది. అట్ల పురాణం పదికాలాలపాటు చెప్పుకుంటాం. దోశ తిన్నంత కమ్మగా వుందీ పోస్ట్.

Anupama said...

mamoooluga ledu!urgentga atlu tinali ani undi. mee sooktulu paatistoo B-)

Raviteja said...

Hotel Meghalaya in Asilmetta Junction dagra sir

Harsha said...

amazing sir,chala bagundi

Anonymous said...

హ హ హ .. ఖెవ్వ్వ్వ్ కేకంతే!!!

మనకి దోశలపిచ్చి ఎక్కువే.
అమ్మో అమ్మో....మీరూ బెంగళూరేనా????

అయితే మరి కొని ఒటేల్ల పేర్లు చెప్తా.... రాస్కొని ట్రై చెయ్యండి. ఈసారెప్పుడయినా
మా బసవన గుడి,గాంధీ బజ్ఆర్ వైపు వచ్చేట్టయితే, విద్యార్థి భవన్ అని చిన్న ఉడుపి హొటల్ ఉంది. అక్కద ట్రై చెయ్యండి. దోశలకి పిచ్చ ఫేమస్స్.. అక్కడ పేద్ద క్యూ ఉంటుంది... సూపర్ టేస్టు.కాని, రెండో ప్లేటు మూడో ప్లేటు దొరకటం కష్టం మరి.......
బసవన గుడి, జైన్ కాలేజ్ ఎదురుగా మరో దోశ హోటల్ ఉంది. అక్కడ నూట ఇరవయి రకాల దోశలు చేస్తారు... మీరు నమ్ముతారా.. సూపర్ టేస్ట్ అసలు వదలరన్న మాట...ఎన్ని ప్లేట్లయిన తినొచ్చు.

ఇవి రెండూ కాకుండా, జయనగర్ లో విజయా కాలేజ్ ఎదురుగా, దోశ క్యాంప్ ఉంది.. అక్కడయితే పండగే....

రాజ్ కుమార్ said...

anonymous గారూ.. హహ పదో, నాలుగో, పదారో తిన్నాక లేకుండా ఉండేది ఓపిక కాదండీ పిండి. అహా...ఇడ్లీలు పెట్టేసి చల్తా... అందామనే?
మేం ఒప్పుకోం నానబొయ్యండి అర్జెంట్ గా(కొంచెం లేట్ అయ్యిమ్ది నేను చెప్పడం) ధన్యవాదాలండీ

బులుసుగారూ.. పుల్లట్టు రారేజే గానే... మహారాజు లాటి బొబ్బట్టు ని మరిచిపోయినందుకు నేను చాలా విచారిస్తున్నాను.. గుర్తు చేసినందుక్కు థాంక్సు
మెచ్చినందుకు ధన్యవాదాలండీ

రాజ్ కుమార్ said...

పంతుల గోపలాకృష్ణగారూ.. అవునా... మీరు ఫ్లాష్ బ్యాక్ కి వెళితే మాంచి పోస్టులొస్తాయ్ మాకు. మీకు తొందర్లో పుల్లట్లు తినే యోగం పట్టాలని ప్రార్ధిస్తున్నా
ధన్యవాదాలు;)

Found in folsom గారొ..అవునా.. అయితే మీరే యూజ్ చేసుకోవటం లేదు ఫెసిలిటీని. వీలుని బట్టండీ. ప్రతి నెలా ఒక్కటయినా రాయడానికి ట్రై చేస్తాను. ఈ సారి కొంచెం పని ఒత్తిడి వల్ల
గ్యాప్ ఎక్కువ వచ్చేసింది ;( మీరు విన్నపాలూ, అబిమానులూ అనకండీ.. అంత విషయం లేదిక్కడ ;)

జ్యోతిర్మయిగారూ ధన్యవాదాలు..అండీ..

అనుపమ గారూ థాంక్యూ సో మచ్.. వెళ్ళి తినేయండీ అర్జెంట్ గా వేడిగా...;)

రాజ్ కుమార్ said...


రవితేజా.. ఓహ్... థాంక్యూ... ఈ సారి కుమ్మెయ్యటమే ;) ;)

మరోమహాప్రస్తానం గారూ.. థాంక్యూ వెరీ మచ్ ;)


అనానిమస్ గారూ.. అవునండీ బెంగుళూర్ నే.. బసవనగుడి వచ్చి క్యూలో నించొని, అవసరం అయితే ఇన్ఫో ఇచ్చిన పాపానికి మిమ్మ్లని కూడా లైన్లో నించోబెట్టి,
రెండో దోస తినేసే వెళతాను. గుర్తుంచుకుంటానండీ. వీలయినప్పుడు వెళ్ళి కలబడిబోతాను.
ధన్యవాదాలు ;)

రాజ్ కుమార్ said...

మోహన్ తలారి గారూ..
చక్రి పాట పోలిక సూపరు హహహ్...
అలా మీ మానసిక పరిస్థితి మీద అనుమానాలు రానీయకండి. ;) వస్తే ఆ పాపం నాది కాదు రసఙ గారిదే.. ధన్యవాదాలు ;)
అన్నట్లు నా బ్లాగ్ కి స్వాగతం

Unknown said...

భలే ఉంది. .మీ అట్ల పురాణం..

వేణూశ్రీకాంత్ said...

నాసామిరంగ కుమ్మేశావ్ గా పురాణం :-))) చాలా బాగుంది రాజ్...
అదేంటో నీతో కలిసి అట్టుని పొగుడుదామని అనుకుంటే..
ఆపక్కనుండి ఇడ్లీ డెడ్లీ వార్నింగ్ ఇస్తుంది, పోనీ ఇగ్నోర్ చేద్దామంటే ఈపక్కనుండి వడ తేడాలొచ్చేస్తాయ్ అని బెదిరిస్తుంది, ఇంకోపక్క పూరీ "సారీబాస్ తర్వాత జరిగే పరిణామాలకి నాబాధ్యతలేదు" అంటుంది, ఐనా ధైర్యంచేద్దాం అంటే మరోపక్కనుండి ఉప్మా ఉక్రోషంగా చూస్తుంది. అందుకే ఎవర్నీ ఎక్కువ తక్కువ చేయలేక పొగడ్త విరమించుకుంటున్నా :)

మొత్తానికి నీ అట్లపురాణం చదివితే నాకాలేజ్ రోజుల్లో వైజాగ్ గ్రీన్ పార్క్ హోటల్లోని దోశ ధమాకా గుర్తొచ్చింది దదాపు పాతిక రకాల అట్లు రుచి చూశా ఆరోజు :) ఆ వివరాలన్నీ తీరిగ్గా టపాయించాలోరోజు.

Prathyusha Davuluri said...

too good undi andi Raj Kumar garu....navvukuntune unnanu chaduvutunnanta sepu....hatsoff to your analogies...office lo undi kuda nenu madyalo aapalekapoyanu sumi...;)
Keep them coming...bookmark kuda chesa......ika nunchi regular ga follow avutanu :)

Radha said...

ivale choosa mee blog. mee atla puranam nizamga ne baagundi. atlaki ee range lo pariseelakulu , premikulu untarani teliyadu...

chala navvincharu
good post

Sujata M said...

అట్టు తెలుగు పదం, దోసె తమిళం అని ఎవరో చెప్పేరు. మీ ఫోటోలేంటీ, వర్ణనలేంటీ, ఆఖర్న ఇచ్చిన సూచనలేంటీ.. అన్నీ బావున్నాయి. డాన్సుల్లో చిరంజీవి పక్కన రాధల్ని ఎవరూ చూడరని నాక్కూడా నిశ్చితాభిప్రాయం. No wonder this one got 60 comments.

Sujata M said...

అట్టు తెలుగు పదం, దోసె తమిళం అని ఎవరో చెప్పేరు. మీ ఫోటోలేంటీ, వర్ణనలేంటీ, ఆఖర్న ఇచ్చిన సూచనలేంటీ.. అన్నీ బావున్నాయి. డాన్సుల్లో చిరంజీవి పక్కన రాధల్ని ఎవరూ చూడరని నాక్కూడా నిశ్చితాభిప్రాయం. No wonder this one got 60 comments.

రాజ్ కుమార్ said...

సుజాత గారూ ధన్యవాదాలండీ.. ;)

రాజ్ కుమార్ said...

ప్రసీద గారూ ధన్యవాదాలు

వేణూజీ నాకు కూడా అవంటే ప్రాణమే.. కానీ అట్టుకి ప్రయారిటీ ఎక్కువ అన్నమాట ;) థాంక్యూ

లాస్య రామకృష్ణ గారూ మీకు కూడా శుభాకాంక్షలు కొంచెం ఆలస్యం గా ;)

ప్రత్యూష గారూ, రాధ్ గారూ నా బ్లా కి స్వాగతం. థాంక్యూ వెరీ మచ్ అండీ ;)

Priya said...

ఇప్పుడే మీ బ్లాగ్ ని లాస్య రామకృష్ణ గారి "బ్లాగ్ లోకం" లో చూసాను.
ఆల్రెడీ నాకున్న అట్ల పిచ్చి పుణ్యమా అని "అట్టు ముట్టని వాడు మట్టిగడ్డై పుట్టున్...!" అన్న మీ టైటిల్ చూడగానే "ఈ మాటలేవో మన అభిప్రాయానికి బాగా దగ్గరగా ఉన్నాయే" అనుకుంటూ మీ బ్లాగింట్లోకి అడుగుపెట్టాను. చదువుతూ ఉండగా 2, 3 సార్లు నా కొలీగ్ పిలిచినా వినిపించుకునే స్పృహ లేకుండా చదివేసాను. బొబ్బట్టంత తీయని అనుభూతిని కలిగించింది మీ పోస్ట్!

రాజ్ కుమార్ said...

ప్రియ గారూ నా బ్లాగ్ కి స్వాగతమ్ ;)
ధన్యవాదాలు ;)

Anonymous said...

hi all rajkumarneelam2.blogspot.com blogger found your site via Google but it was hard to find and I see you could have more visitors because there are not so many comments yet. I have found website which offer to dramatically increase traffic to your blog http://xrumer-services.net they claim they managed to get close to 4000 visitors/day using their services you could also get lot more targeted traffic from search engines as you have now. I used their services and got significantly more visitors to my blog. Hope this helps :) They offer best services to increase website traffic Take care. Roberto

Anonymous said...

Let's assume a female client walks in and seems to be in fear and terror. " This is that human behavior can have a deap-seated motives that have origins in things that happened in child hood, and subconscious fears and desires. Longer-term issues include depression, suicidal ideation, ongoing self-image or self-worth issues, and the many forms of mental illness.
Feel free to surf my web site anxietate

Ennela said...

మీకోసం మీరే దోసలు వేసుకొని తినడం దరిద్రమయిన దురదృష్టం. ఎవరయినా ఒకదాని తర్వాత ఒకటీ వేసి పెడుతుంటే తినడం మహా అదృష్టం ...pch pch..

Ennela said...

మీకోసం మీరే దోసలు వేసుకొని తినడం దరిద్రమయిన దురదృష్టం. ఎవరయినా ఒకదాని తర్వాత ఒకటీ వేసి పెడుతుంటే తినడం మహా అదృష్టం ...pch pch..

రాజ్ కుమార్ said...

ఎన్నెల గారూ.. ఏంటండీ ప్చ్..ప్చ్ అంటున్నారూ?
జాలిపడుతున్నారా? ;) ;)
ధన్యవాదాలు ;)

మధురవాణి said...

హహ్హహ్హా.. బ్రహ్మాండంగా ఉంది రాజ్ నీ అట్ల పురాణం.. నిజమే.. ఏదో ఒక రకం అట్లు నచ్చని వాళ్ళు బహుశా ఎవరూ ఉండరేమో అనిపిస్తుంది నాకు..
నాకు మాత్రం రవ్వ దోసె, ఉప్మా లేని పెసరట్టు అంటే చాలా చాలా ఇష్టం.. ఇంతకీ శ్రద్ధగా నీ అట్ల పురాణం చదివినందుకు అర్జెంటుగా నాకు అట్లు తినే ప్రాప్తం కలక్కపోతే మాత్రం నువ్వే పార్సిల్ పంపించాలి.. :D
దోసెల సంగతేమో గానీ నవ్వులతో కడుపు నింపేసావ్.. :D
Keep writing!

Anonymous said...

poyina vaarame chusanu me blog... office lo pani cheykunda... navvapukuntu.. cough chesinattu natistu..enta kastapadi chadiaavano inka time chusesariki 8 :30. intiki chere sariki 9 :30

$13 bokka... bus miss ayyi taxi lo velaanu intiki...

రాజ్ కుమార్ said...

అనానిమస్ గారూ.. తిట్టారా? పొగిడారా? ;) ;)
ధన్యవాదాలండి ;)

Vajra said...

అస్సలు ఇన్ని రోజులు నేను మీ బ్లాగ్ని మిస్ అయ్యాన..లేక మీరే అండర్ కవర్ ఆపరేషన్ లాగా తప్పించుకొని తిరుగుతున్నార! కెవ్వు కేక..సూపర్ రాసారు . నవ్వలేక నవ్వలేక దగ్గి మల్లి నవ్వాను. ఎక్కడ ఏ పదాలు రాయాలో అక్కడ కరెక్ట్ గా rhyming చేసి రాసారు. నిజంగా మీరు రాసిన అట్ల పురాణం చాల మందికి కనెక్ట్ అవ్తుంది నాలగే. మీరు చెప్పిన 8 సూత్రాలు పక్క తుచ తప్పకుండ పాటిస్తున్న..మరి ఒక్కసారి మీ రాతలకు నా జోహార్లు. Keep the same స్పిరిట్స్..

Jyostna said...

chaala navvesaanu dosa story chadivi, me posts chala interesting ga engaging unnayi. trivikram ki thammudu la anipisthunnaru.

Kshitija Rekha said...

Ma thammudiki attlantee boledu ishtamandi Ippudu US lo vunnadu ma amma attlesina rojalla ee attlevaru kanipettaro kani devudamma anukuntu oka 10 12 attlu thintadu ma amma kuda super ga chestundandi hotel vi kuda saripovu ee post chaduthuntee same ma thammudu matladinattundi

Haritha said...

రాజ్ గారు,

ఇది చూసారా?
http://www.andhrajyothy.com/node/5534

దోసెలు వేసే మెషిన్.

Kottapali said...

Brilliant