Wednesday, October 31, 2012

ఇది కధ కాదు...1

క్కడ అధికార దుర్వినియోగం ఉంటుందో అక్కడ సామాన్యుడి ఆవేదన ఉంటుంది.
ఎక్కడ ఆవేదనా, అసహాయతా ఉంటాయో  అక్కడ రాక్షసత్వం ఉంటుంది.
ఎక్కడ రాక్షసత్వం ఉంటుందో అక్కడ బానిసత్వం ఉండి తీరుతుంది.

పురాణాలలో చెప్పినట్టూ అకృత్యాలని ఆపడానికీ, దురాగతాలకి అడ్డుకట్ట వెయ్యడానికీ, దుర్మార్గులని శిక్షించడానికీ, అమాయకులని రక్షించడానికీ భగవంతుడు ఈ భూమి మీదే పుడతాడూ అన్నది నిజమే అయితే మనం పూజించే పది అవతారాలే కాదు ఎన్నో అవతారాలు ఉన్నాయ్. లెక్కకు మించినవీ,మనం  పట్టించుకోనివీ, అక్కర్లేనివీ.అలాంటి ఒకానొక కారణజన్ముని చరిత్ర ఇది. కధ కాదిది.

స్వస్తి శ్రీ చాంద్రమాన హేవళంబినామ సంవత్సర ఆషాడ శుధ్ద చవితి తత్కాల పంచమీ భానువారం సాయంకాలం 4 గంటలకి మఖా నక్షత్ర చతుర్ధ చరణ యుక్త వృశ్చిక లగ్నమందు క్షత్రియుడిగా అవతరించాడు.
రాజ్యపాలన పేరు మీద సేవలు చేయించుకునే రాజ కుంటుంబం కాదది. ఫోటో స్టూడియో పెట్టుకొని పొట్టగడుపు కునే ఓ ఫోటోగ్రాఫర్ కుటుంబం అది. ముద్దుగా "చిట్టిబాబూ" అని తమ మొదటి సంతానాన్ని పిలుచుకున్న వారి ప్రేమా, వాత్సల్యం, అతను ఉగ్రవాది అవుతాడని తేల్చిన అతని జాతకం కలిగించిన కలవరపాటుని మరుగుపరిచింది.
సామ్రాజ్యాలు కూలుతున్నా, అధికారాలు మారుతున్నా, మిత్రులూ, శత్రువులూ, పుణ్యాత్ములూ, పాపాత్ములూ పుడుతున్నా, గిడుతున్నా నాకేం? అన్నట్టూ మంచినీ, చెడునీ, బాధల్నీ,సంతోషాల్నీ సమానంగా స్వీకరిస్తూ  తనలో కలిపేసుకుంటూ ఎప్పటిలాగే మౌనం గా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంది కాలం.
***************************************************************************************************************
జూలై 24 1917.
విశాఖజిల్లా లోని దట్టమైన, అందమైన అటవీ ప్రాంతాలలో ఒకానొక ఊరది. ఓ రోజు ఆ ఊరి భూస్వామి చిటికెల భాస్కర నాయుడు గారు రామ మందిరం దగ్గర పురాణ కాలక్షేపాన్ని ముగిస్తున్న సాయంకాల సమయం లో తెల్లని పంచె, పైన వస్త్రం, యజ్ఞోపవీతం ధరించీ, పెరిగిన గెడ్డం, అప్పుడే పెరుగుతున్న మీసం, నుదుటన తిరునామం, చేతిలో పుస్తకాల సంచితో ఆలయాన్ని దాటిన ఒక వ్యక్తి ని చూశారాయన. ఆ ఊరిలోకి ఏ సాధువులొచ్చినా, పండితులొచ్చినా ఇంటికి పిలిచి మర్యాద చేయటం తన బాధ్యత అనుకునే నాయుడు గారు ఆ వ్యక్తినీ ఇంటికి తీసుకెళ్ళారు. పాలు, పళ్ళు తప్ప వేరే ఆహారం స్వీకరించని ఆ వ్యక్తి ముక్తి కోసం తపస్సు చేసుకోడానికి అనువైన చోటుకోసం అన్వేషిస్తూ ఇలా వచ్చానని చెప్పాడు. ఇరవై యేళ్ళ వయసు లో జపతపాలా? సన్యాసమా? కలిగిన అనుమానాలూ, ఆశ్చర్యాలూ,  చూడగానే "స్వామీ" అని పిలవాలనిపించే ఆ యువకుని లోని ఆకర్షణ ముందు ఆవిరైపోయాయి. 

ఊరికి ఉత్తరాన తాండవ నదీ ప్రవాహం, చుట్టు పక్కల అద్బుతమైన జలపాతాలు, వాటి మధ్యన స్వయంభువు అయిన నీలకంఠేశ్వరుని ఆలయం. ఆ పక్కనే "స్వామి" కోసం ఏర్పాటు చెయ్యబడ్డ కుటీరం. రోజూ ప్రొద్దున తాండవ నది లో స్నానం, తర్వాత కొన్ని గంటల పాటు నీలకంఠేశ్వరుని పూజ రామ మందిరం లో పురాణ ప్రవచనాలు, ఆయన చేత "అన్నగారూ" అని పిలవబడే భాస్కర నాయుడి గారితో వేదాంత చర్చలూ స్వామి దిన చర్య గా మారాయి.శిష్యులుగా చేరిన కొందరు యువకులు ఆయన సమక్షం లో  రోజూ అమరం, ఆంధ్రం, వసు చరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం మొదలైనవి చదవడం అలవాటయింది. భర్తృహరి వైరాగ్య శతకం లోని పద్యాలు, భాగవతం లోని కపిల, దేవహూతి సంవాదం, విదుర మైత్రేయ సంవాదం,  కూచిమంచి జగ్గకవి పద్యాలు, సిద్దేంద్రయోగి భామాకలాపం లోని ఘట్టాలు సామికి ఎంతో ఇష్టం, కంఠోపాఠం. క్రిష్టియన్ మెషినరీలూ, మతమార్పిడులూ  పెరుగుతున్న ఆ రోజుల్లో స్వామి ప్రవచనాలు ఆయనని ఒక జ్ఞానిగా యోగిగా నిలబెడితే,  ముహూర్తాలు పెట్టడం, జాతక చక్రాలు గీయటం,గ్రామస్థులకీ, చుట్టుపక్కల మన్యవాసులకి చేసే ఆయుర్వేద వైద్యం మొదలైనవి అతన్ని ఆరాధించే స్థాయికి చేర్చాయి. ఆయన తపస్సంపన్నుడనీ, అతీంద్రియ శక్తులున్నాయనీ ప్రజల నమ్మకం.

ఒక రోజు భాస్కరుడు గారింట వేదాంత చర్చలు జరుగుతున్నాయ్ స్వామితో. మధ్య మధ్య లో రాజకీయాల గురించీ, దేశపరిస్థితి గురించీ మాటలు దొర్లుతున్నాయ్.పాలు, పళ్ళు  తీసుకొచ్చిన భాస్కరుడు గారి తల్లి సోమిదేవమ్మ గారు ఎప్పటి నుండో తన మదిలో సమాధానం లేకుండా మిగిలి ఉన్న ప్రశ్నలని స్వామిని అడిగేశారు.
"బాబూ... నిండా ఇరవై యేళ్ళుండవు తమకి. కానీ యోగివి. ఏ తల్లి కన్నబిడ్డవో, ఏ ఊరి ముద్దు బిడ్డవో.. ఇలా మా ఊరిలో మా మధ్య మసలుతూ మా వాడివయ్యావు. నీకు వెనకా ముందూ ఎవరూ లేరా? ఉంటే ఎక్కడ ఉంటారు? అసలు ఎవరు నువ్వు?" అని.

ఆశ్రయమిచ్చి ఆత్మీయంగా చూసుకుంటున్న వారి దగ్గర ఏమీ దాచలేదు స్వామి.
"లేకేమీ? ఉన్నారు. నాన్న కాలం చేశారు. అమ్మ, తమ్ముడు, చెల్లెలూ ఉన్నారు. ఇంటికి పెద్ద బిడ్డని నేనే.  ఇల్లు విడిచి రెండేళ్లవుతుంది. నా గారాల చెల్లెలు సీతని చూసి రెండేళ్లవుతుంది. నా సమాచారం వాళ్లకి గానీ, వాళ్ళ సమాచారం నాకు గానీ తెలియదు. మా బంధువులు చూసుకుంటారు. భయపడవలసిన పని లేదు". 

ఆ మాటలకి అమితాశ్చర్యాలకి లోనయిన సోమమ్మ గారు ఈ పిల్లాడు "అన్నీ తెలిసిన మూర్ఖుడా? ఏమీ తెలియని అమాయకుడా?", తేల్చుకోలేక, ఆయనకి బుద్ధులు చెప్పీ, నచ్చజెప్పి, వివరాలు తెలుసుకొని స్వామి కుటుంబాన్ని ఆ ఊరికి రప్పించారు.చిన్నతనం లోనే ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయిన కుంటుంబం. ఆస్తులన్నీ ఆవిరైపోతున్న తరుణం లో ఆ లోటుని భర్తీ చెయ్యాల్సిన వాడల్లా ఇంగ్లీష్ చదువుల మీద అయిష్టత తో చదువుకి స్వస్తి చెప్పిన కొడుకు. చెల్లెలి పెళ్ళికి కూడా కనిపించని కొడుకు. రెండేళ్ల నుండీ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలున్నాడో లేడో అని తల్లడిల్లిపోతున్న అతని తల్లి నిరీక్షణకీ, ఆవేదన కీ ఆరోజు తెరపడింది. అయితే మోక్ష సాధన కోసం అక్కడికి చేరిన సామి కోసం, అతని కుటుంబం కోసం ప్రశాంతం గా ఉండే మరొక లోతట్టు ప్రాంతంలో ఒక కుటీరాన్ని నిర్మీంచి ఇచ్చారు గ్రామస్తులు. ఇప్పుడు స్వామి దినచర్య లో వ్యవసాయం కూడా వచ్చి చేరింది కుటుంబం కోసం.(ఈ ప్రదేశమే శ్రీరామవిజయనగరం గా పిలవబడింది)

ఈ కధ జరుగుతున్న ఆ ఊరి పేరు, తెల్లవాడి పై ఓ తెలుగోడు చేసిన తిరుగుబాటు కి సాక్షంగా చరిత్రలో నిలిచిపోయిన "కృష్ణదేవి పేట". ఆ అడవి ప్రజల చేత "సామి" గా పిలవబడే ఆ యువకుడి ముద్దు పేరు "చిట్టిబాబు" అయితే తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు "అల్లూరి శ్రీరామరాజు".
 
అదిగో... అప్పుడే.. అక్కడే... అడవి మాటున సాగిపోతున్న అరాచకం లోకం దృష్టికి వస్తుంది.
అటవీ చట్టాల కింద అమాయకత్వం నుగ్గు నుగ్గు అవుతుంది.
నోటికాడ కూడే లాఠీల లక్ష్యం అయ్యింది.
చర్మం మీద కొరడా దెబ్బలు చేసిన పగుళ్ళ మధ్య అంటిన కారం చేయించిన ఆర్తనాదాలు కొండలలో ప్రతిధ్వనిస్తున్నాయి.
దక్కవలసిన శ్రమఫలం కోసం అడిగిన ఫలితంగా సీమ పచ్చిమిరపలు ఆసనం లో అగ్నిశిఖలు మండిస్తున్నాయి.
ఆ పచ్చని ప్రశాంత ప్రకృతి వెనక ఎంత అశాంతి దట్టించి ఉందో అవగతమవుతుంది.
ఒక్కమాట లొ చెప్పాలంటే "తల్లి ఒడినుండి జారిపొతున్న బిడ్డ చేసే ఆక్రందనే వినిపిస్తుందక్కడ"

ప్రశాంతం గా, స్వచ్చంగా కనిపించే ఆ అటవీ ప్రాంతం లో అశాంతి కి కారణాలేమిటీ?
యోగిగా వచ్చిన వ్యక్తి యుద్ధ శంఖం పూరించడానికి పురిగొల్పిన పరిస్థితులేమిటీ?

{శ్రీ గోపరాజు నారాయణ రావు గారు రాసిన "విప్లవాగ్ని అల్లూరి" పుస్తకం, చిన్నప్పటి నుండీ నేను విన్న సంగతులూ, చూసిన సాక్షాల ఆధారంగా...}
**********************************************xxx****************************************

31 comments:

Found In Folsom said...

chaala rojula taruvata post...adi mee saili ki bhinnanga :) bavundi..good that I read this post..Maa buddodiki ivala night ayana gurinchi chadivi vinipista....oka aavida Iswar chandra vidyasagar gurinchi raaste, ninna monna adey chadivi vinipicha :)

జేబి - JB said...

మొదటి అంకం చదివి నేను ఇంకా మీ స్వీయకథ చెబుతున్నారనుకున్నా!
1917లో ఆంధ్రదేశంలో పొట్టగడవడానికి ఫొటోగ్రాఫరా?

జేబి - JB said...

మొదటి అంకం చదివి నేను ఇంకా మీ స్వీయకథ చెబుతున్నారనుకున్నా!
1917లో ఆంధ్రదేశంలో పొట్టగడవడానికి ఫొటోగ్రాఫరా?

రాజ్ కుమార్ said...

Found in Folsom గారూ.. నాకు ఎప్పటి నుండో ఉండిపోయింది అండీ అల్లూరి మీద సిరీస్ రాయాలని. చెప్పండి మీ బుడ్డోడికి.నా పోస్ట్ కి ఫలితం దక్కినట్టే. అల్లూరి అంటే పంచకట్టుతో, చేతిలో విల్లమ్ములతో, గెడ్డంతో ఉంటాడు, ఫ్రీడం ఫైటర్ అని మాత్రమే తెలుసి ఉంటుంది చాలా మందికి. ఇంకొంచెం తెలియజేద్దాం అని ఈ చిన్ని ప్రయత్నం. ధన్యవాదాలండి.

జేబి -JB గారూ.. హహహ్.. కాదు సార్ ;)
అవునండి.. 1917 కన్నా ముందే.. వారి తండ్రిగారు రాజమండ్రి లో ఫోటోగ్రాఫర్.
ధన్యవాదములు;)

పల్లా కొండల రావు said...

రాజ్ లో రగిలింది విప్లవాగ్ని ఈ రోజు . ఆ అగ్ని పేరు రాజే (శ్రీ రామ రాజు). వాస్తవానికి సీతా రామ రాజు నిక్కరు తో ఉంటాడని విన్నాను. సినిమాలో మాత్రమే ఆ గెటప్ మార్చి పంచె కట్టారని విన్నాను. రాజ్ ! ఎన్ని కోణాలున్నాయి నీలో. keep it up.

శిశిర said...

చదవడం మొదలుపెట్టగానే ఊహించాను అల్లూరి వారి గురించి చెప్తున్నారని. Interesting... తరువాతి భాగాలకోసం ఎదురుచూస్తూ..

ఆ.సౌమ్య said...

ఈ సీరీస్ మొదలవ్వడానికి సరి అయిన రోజు ఇదే :)
superb !

తెలుగువీర లేవరా..దీక్ష బూని సాగరా..
రామరాజు అసలు కథను మరల కూర్చి రాయరా! :)

శ్రీనివాస్ పప్పు said...

సూపర్ రాజూ,కానియ్ శుభస్య శీఘ్రం

బంతి said...

తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ

Sravya V said...

చాలా బాగా రాసారు . మిగిలిన భాగాలు కూడా ఇంతే ఉత్తేజితం గా ఉంటాయి అని ఎదురు చూస్తున్నాను! ( తప్పక ఉంటాయి కూడా అనుకోండి )

తృష్ణ said...

బావుంది రాజ్..మంచి ప్రయత్నం.

www.apuroopam.blogspot.com said...

చాలా బాగుందండీ.చరిత్ర మీకు తెలిసినంతవరకూ చరిత్ర లాగానే వ్రాయండి. ఏ మార్పులూ చేయవద్దు.మిగిలిన భాగాలు వెంటనే చదవాలని ఉంది.

రాజ్ కుమార్ said...

కొండలరావ్ గారూ.. మీరన్నది కొంతవరకూ నిజమే.. ఉద్యమం మొదలయ్యాక అతని గెటప్ మారింది.
ధన్యవాదాలు ;)

శిశిర గారూ, సౌమ్య గారూ, పప్పుసార్, బంతీ.. తప్పకుండా.. ధన్యవాదాలు

వేణూశ్రీకాంత్ said...

అమేజింగ్ రాజ్.. చాలా బాగుంది... గుడ్ జాబ్.. మిగిలిన భాగాలకోసం ఎదురు చూస్తున్నా..

నిరంతరమూ వసంతములే.... said...

రాజ్ గారు, ముందుగా చరిత్ర పురుషుడి గురించి వ్రాస్తున్నందుకు మీకు అభినందనలు. ఇవే ఇవే మనకు కావలిసినది. ఇలా మన చారిత్రాత్మక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందు తరాలకు అందించాలి. చాలా బాగా వ్రాశారు. ఇదే స్పూర్తితో తరువాతి బాగాలు వుండాలని ఆశిస్తున్నాను.

రాజ్ కుమార్ said...

శ్రావ్యగారూ.. ఏమో.. అన్నీ ఇలాగే ఉంటాయని చెప్పలేను. రాసిన కధ కాదు కదా;) థాంక్యూ

తృష్ణగారూ థాంక్యూ సో మచ్;)

పంతుల గోపాలకృష్ణారావ్ గారూ.. నేను చదివి తెలుసుకున్నదీ,విన్నదీ, చూసినదీ మాత్రమే రాస్తున్నానండీ. ధన్యవాదాలు

Raj said...

బాగుంది రాజ్.. మంచి ప్రయత్నం... all the best..

తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ...

Raviteja said...

సీత అంటే అల్లూరి శ్రీరామరాజు గారు చెల్లెలు అఆఅ! కృష్ణ గొరు సినిమా కోసం వరసలు మార్చారు చీ...చీ. మీ బ్లాగు వల కొత్త విషయాలు తెలుసుకున్న :)

రాజ్ కుమార్ said...

వేణూజీ, సురేష్ గారూ,రాజేంద్రా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ;)

రవితేజా... అవును..ఆయన చెల్లెలి పేరు సీత. సినిమా లో చూపించినట్లుగా ఆయన జీవితం లో ఏ స్త్రీ లేదు. కాకపోతే సినిమా కి హీరోయిన్ కావల్సి వచ్చింది. సినిమా లో డ్రామా పండించేందుకు కొన్ని కల్పించారు.

అయితే ఆ పాటలూ, ఫైట్లూ లేకుండా ఒక ఉద్యమాన్ని, చరిత్రనీ తెరకెక్కించి మన తరానికి అందించిన వారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకి ;) ;)

Harsha said...

చక్కగా రాసారు రాజ్,అల్లూరి వారు పుట్టింది మా ఊరే పాండ్రంగి అని ,తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తునాను ,ఇంకొకటి చరిత్ర ని చాలా మంది తమకు నచ్చినట్టు మార్చేస్తారు ,మీరు మాత్రం ఈ పంధా నే ఫాలో అవ్వండి,....రియల్లీ అమేజింగ్

నిషిగంధ said...

చాలా మంచి ప్రయత్నం రాజ్! మీ శైలి కూడా కధకి తగ్గట్టే పదునుగా బావుంది.. అస్సలూహించలేదు, మీనించి ఇలాంటి గంభీరతతో కూడిన సిరీస్‌ని! ఏ మాత్రం నిరాశపరచలేదు.. మిగతా భాగాలు కూడా అలానే ఉంటాయని ఆశిస్తూ... గుడ్ లక్!

జయ said...

చాలా బాగుంది రాజ్ కుమార్. నేను విన్న వి చదివినవి ఇందులో క్రోడీకరించుకుంటాను. అల్లూరి గురించి నాకు చాలా అనుమానాలున్నాయి. అవి అన్నీ మీ రచన ద్వారా తీరిపోతాయనిపిస్తుంది. ఎంతో ఆరాటంతో తరువాతి భాగాల కోసం ఎదురుచూస్తూఉంటాను. Good job. Keep it up. All the best.

జ్యోతిర్మయి said...

సరైన రోజు మొదలెట్టారు. చాలా బాగా రాశారు రాజ్ గారు. తరువాతి భాగాల కోసం ఎదురుచూస్తూ వుంటాము.

జలతారు వెన్నెల said...

విభిన్నం గా ఉంది ఈ పోస్ట్ మునుపు మీరు రాసిన వాటి కన్నా. చాలా బాగా రాసారు.

రాజ్ కుమార్ said...

నిషిగారూ, జయగారూ, జ్యోతి గారు, జలతారు వెన్నెల గారూ.. ధన్యవాదాలండీ.
అవును.. ఇప్పటి వరకూ రాసిన వాటికి కొంచెం భిన్నమైనదే గానీ నాకు ఎప్పటి నుండో ఉండిపోయిన కోరిక అండీ. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు ;)

Anonymous said...

what's up rajkumarneelam2.blogspot.com owner found your site via yahoo but it was hard to find and I see you could have more visitors because there are not so many comments yet. I have found website which offer to dramatically increase traffic to your website http://cheap-mass-backlinks.com they claim they managed to get close to 4000 visitors/day using their services you could also get lot more targeted traffic from search engines as you have now. I used their services and got significantly more visitors to my blog. Hope this helps :) They offer most cost effective services to increase website traffic Take care. Richard

చాణక్య said...

ఆరంభం చాలా బాగుంది రాజ్‌గారు. తర్వాతి భాగం చదివేసి వస్తాను. గుడ్ జాబ్! కంటిన్యూ.. :)

కొత్తావకాయ said...

శభాష్ రాజ్ కుమార్ గారూ! "రెండు అంచులా పదునున్న కత్తి" మీ రాతలని నిరూపించారు. చాలా బావుంది. అభినందనలు!

కృష్ణప్రియ said...

వావ్.. పెద్ద రచయితలు రాసినట్లు ఉంది మీ ఇంట్రొ..

కృష్ణప్రియ said...

వావ్.. పెద్ద రచయితలు రాసినట్లు ఉంది మీ ఇంట్రొ..

రాజ్ కుమార్ said...

hahah కృష్నప్రియగారూ... పూర్తిగా నా సొంతం కాదు లెండీ.. బోల్డ్ లో పెట్టిన చివరి పేరా శ్రీ గోపరాజు నారాయణరావు గారు రాసిన విప్లవాగ్ని అల్లూరి పుస్తకంనుండి ;)
ధన్యవాదాలు