Wednesday, March 19, 2014

భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ..!!

రోజూ లాగే లంచ్ టైం లో బయటకొచ్చి, ఆఫీస్ పక్కన కొత్తగా పెట్టిన "హనుమాన్ మెస్" లో బిర్యానీ ఆర్డరిచ్చి సాక్షి పేపర్ లో "జగన్ కోసం" ఆర్టికల్  చదువుతూ కళ్ళు తుడుచుకుంటున్న సమయం.

"ఒరే..సుధాకరూ...నిన్న ఆఫీస్ క్యాంటీన్ సాంబార్ లో బొద్దింక డెడ్ బాడీ వచ్చిందంట తెలుసా నీకూ?"  అన్నాన్నేను ఎగ్జయిటవుతూ.

"ఈ రోజు నందినీ బిర్యానీ పార్సిల్ లో బల్లి బోనస్ గా వచ్చిందంట ఈ సంగతి తెలుసా నీకూ? " లేటెస్ట్ అప్డేట్ తో వాడు.

"బల్లి కన్నా బొద్దింకే నయ్యం కదా... ప్చ్... బయట భోం చెయ్యాలంటే భయమేస్తుందిరా... ఇంట్లో వండుకోవాలంటే బద్దకమేస్తుంది. ఈ బెమ్మీ జీవితమేమో బోరుకొట్టేస్తుంది. బొత్తిగా కలర్ లేకుండాపోయింది." అంటూ వాపోయాన్నేను.

"బోర్ కొట్టదా మరీ..? బీటెక్ నాలుగేళ్ళూ ఫస్ట్ బెంచ్ లో కూర్చొని కళ్ళు తెరుచుకొని, తల ఊపుతూ నిద్రపోడం తప్ప నువ్ చేసిందేమైనా ఉందా?  " అని నా చరిత్రని తవ్వడం మొదలెట్టేడాడు.
"ఇప్పుడు బాధపడి ఏం లాభం రా సుధాకరూ? అసలా A.శ్రీనివాసూ,S.శ్రీనివాసులని అనాలి. ఆళ్ళ దెబ్బకి ఇంటర్లో ఏ ఒక్క అమ్మాయినీ నేను చూడలేదు. ఏ ఒక్క అమ్మాయీ నాతో మాటాడలేదు... అదే అలా అలవాటయిపోయింది"

"ఆళ్ళెవర్రా?  అమ్మాయిల మొహాలకి మసి పూసి, నోటికి ప్లాస్టరేసేవాళ్ళా?"

"మా ప్రిన్సిపలూ, పిజిక్సోడూనూ...మసిపూసిన మాట నిజమే గానీ మొహాలకి కాదు మా జీవితాలకి. డిస్సిప్లేన్ పేరుతో మా ఫ్రీడం ని పీక మీద కాలేసి తొక్కేసేరు."

ఫుల్ మీల్స్ లాగిస్తూ మా డిస్కషన్ వింటున్న మా పక్క టేబుల్ బట్టతలాయన "దీనికి ఇంత డిస్కషనేందుకు బ్రదరూ..పెళ్ళి చేసుకోవచ్చు గా.. సింపుల్ సొల్యూషన్" అని సలహా ఇచ్చాడు. "మ్యారీడ్ లైఫ్ బాగుంటుందా అన్నాయ్?" అని ఆశ గా అడిగాను సిగ్గు పడుతూ. "ఉహూ.... బ్యాచిలర్ లైఫే బాగుంటుందన్న సంగతి పెళ్ళయ్యాక తెలుస్తుంది" అన్నాడు సాంబార్ లో ముక్కలేరుకుని నముల్తూ. బెలూన్ కి బొక్కెట్టి గాలూదమన్నట్టుంది నీ ఎదవ సొల్యూషన్ అన్నాన్నేను చిరాగ్గా.

"అలా కూరలో అరిటాకు లా తీసి పారేయకు తమ్ముడూ..!"

"అరిటాకు కాదు కరివేపాకు"

"తీసి పారేసేదానికి ఏ ఆకయితే ఏంటి చెప్పూ.. పెళ్ళి విషయం లో నిన్ను చాలా ఎడ్యుకేట్ చెయ్యాలి. అసలే అమ్మాయిల కొరత. ముప్పై వచ్చేసరికి నీ నెత్తిమీద ఏడాదికి ఎకరం చొప్పున ఊడిపోతుంది. పొట్ట సైజ్ ఏజుతో సమానంగా పెరిగిపోతుంది. ఆ జుత్తు రాలిపోకముందే, ఈ పొట్ట పెరిగిపోకముందే పెళ్ళి చేసుకోక పోతే ఏటవ్వుద్దో ఆలోచించేవా?
"
"ఆఆఆఆ.....లేదు"

"నీ ఏడాది జీతాన్ని పట్టుకొని ఓ  అందమైన అమ్మాయి నీ లైఫ్ లోకి ఎంటరయ్యి... ఆఫీసుకెళ్ళేటప్పుడు టాటా చెప్తూ, ఇంటికెప్పుడొస్తావా అని రోజూ నీకోసం ఎదురుచూస్తూ... నీకిష్టమైనవన్నీ వండి పెడుతూ... నీకు సేవలు చేస్తూ, సినిమాలకీ షికార్లకీ నీకు తోడొస్తూ...ఫ్రంట్ కెమెరా తో ఇరుక్కుని తీసుకున్న క్లారిటీ లేని మీ ఇద్దరి ఫోటోల్నీ ఫేస్బుక్ లో పెడుతుంటే....అది చూసిన జనాలు మీ జంటని చూసి జుట్టు పీక్కొని పిచ్చెక్కి "ఆహా.. సూపరూ... ఓహో డూపరూ.. .nice pair... made for each other.. Yo dude \M/" అని కమెంట్లు పెడుతూ రచ్చ చేస్తుంటుంటే....... అసలు ఈ ఏంగిల్లోనయినా ఆలోచించేవా??...పెళ్ళి చేసుకుంటే జీవితానికి బాగా మరిగించిన పప్పుచారు చల్లారితే వచ్చే రుచొస్తుంది. అసలెంత కాలం తమ్ముడూ పవన్ కళ్యాణ్ ని ప్రొఫైల్ పిక్ లో పెట్టుకొని హీరోయిన్ల ఫోటోలకి లైకులు కొట్టేదీ??"

"ఒరే సుధాకరూ... ఫేస్బుక్ లో ఇంత జరుగుతుందా?? "

"నీ మొహం చూడగానే అనుకున్నాలే తమ్ముడూ రోజూ ఆర్కుట్ లో పోస్టులు రాసి కమెంట్లు రాట్లేదని ఫీలయ్యే తింగరోడివనీ..! చూడ్దానికి చాక్లెట్ బోయ్ లాగా ఉన్నావు... ఇప్పట్నించే పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టు" 

"చూశావు రా సుధాకరూ...నేను చాక్లెట్ బాయ్ నంట. ఎనిమిది చదివేటప్పుడు మా క్లాస్ లో మంగతాయారు కూడా ఇలాగే అనేది నన్ను" అన్నాను సిగ్గు పడుతూ. "ఆడు నిన్ను పొగడటం లేదు రా... నువ్వు చాక్లెట్ రంగులో ఉంటావూ... పెళ్లవ్వడం కష్టం అంటున్నాడు" అని అసలు సంగతి చెప్పేడు సుధాకర్ గాడు. ఎమ్మటే నా కడుపు  పాశర్లపూడి బ్లో ఔట్ లా భగ్గున మండింది. ఫ్రిజ్ లో పెట్టిన సీసాడు పురుగులమందుని పదిరూపాయలు పెట్టి కొనుక్కొని ( పెప్సీయో కోకాకోలానో గుర్తులేదు) తాగి కడుపుమంట ని చల్లబరిచాను. అప్పటికే  సలహా ఇచ్చిన అన్నాయ్ చెయ్యి నాక్కుంటూ వెళ్ళి పోయాడు. సర్వరొచ్చి సోంపు ప్లేట్ లో బిల్లెట్టి "సార్.. టిప్ కొంచెం చూసి ఇవ్వండి" అన్నాడు. "వంకాయలు కోసిన వెంటనే నీట్లో పడేస్తే నల్లరంగులోకి మారి పోకుండా ఉంటాయి. నేన్ చెప్పానని వంటోడికి చెప్పు" అని గొప్ప టిప్పిచ్చాను. వాడు ఆనందభాష్పాలు కారుస్తూ వెళ్ళిపోయాడు.

ఏ హోటల్ కెళ్ళినా కడుపునిండా మొహమాటం లేకుండా మెక్కీ, గుప్పెడు నిండా సిగ్గులేకుండా సోంపు తీసుకొనే అలవాటు మాకు.  సోంపు మీద ఈగలు వాలటం చూసిన సుధాకర్ గాడు  మెస్ లో పనిచేసే కుర్రాణ్ణి పిలిచి తన ఆవేదన కి ఆగ్రహం ముసుగేసి ఆక్రోశించాడు. ఆ దెబ్బకి వాడు హడావిడిగా లోపలకి పరిగెత్తి "HIT" పట్టుకొచ్చి సోంపు ప్లేట్ మీద ఎడాపెడా స్ప్రే చేసేసి ఈగల్ని చంపేశాడు. జరిగిన ఈ హఠాత్పరిణామానికి మేమిద్దరం తత్తరపడి బిత్తరపోయి మా ఆగ్రహాక్రోశాలకి ఆందోళన ని కలగలిపి జరిగిన ఘోరాన్ని  ఓనర్ అంకుల్ కి విన్నవించుకొని వాపోయాం. ఆ ఓనర్ మహాశయుడు "సారీ...సార్..... కానీ ఎన్నిసార్లు స్ప్రే కొట్టినా ఈగలు పోవటం లేదు సార్.. కాసేపటికి మళ్ళీ వచ్చేస్తున్నాయ్." అనేసి చచ్చిన ఈగల్ని ఏరి పక్కన పారేశాడు. (నిజం గానే నిజం... నేనెప్పుడన్నా అబద్ధం చెప్పేనా??) మేం ఒకరి మొహాలు ఒకళ్లం చూసుకొని ఈ ఏజ్ లో పబ్లిక్ గా ఏడిస్తే బాగోదని గంభీరమైన ఎక్స్ప్రెషన్ ని మెయిన్టైన్ చేస్తూ బయటకొచ్చేశాం.

"పరిస్థితి ఇలాగే కొనసాగితే చైనీస్ ఫుడ్ ఇండియన్ స్టైల్ లో డెడ్ చీప్ గా తినెయ్యొచ్చురా మనం....టెక్నికల్ గా మన కంపెనీ HR వాళ్ళ భాషలో చెప్పాలంటే దీన్నేప్రొసెస్ ఆఫ్ క్రియేటివ్ పాజిటివ్ థింకింగ్ ఇన్ పాథటిక్ సిచువేషన్స్ అంటారు." సుధాకర్ గాడు చెప్పుకుంటూ పోతున్నాడు. నేను మాత్రం అన్నాయ్ ఇచ్చిన సలహాని పాటిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. అప్పటికే  నా పెళ్ళి గురించి బెంగెట్టుకున్న మా పెద్దోళ్ళకి పచ్చజెండా ఊపేశాను.

"నేను పెళ్ళికి రెడీ" అనగానే ఆ ఆనందం లో మా అమ్మ ఇల్లంతా పెనాయిలేసి కడిగి, పనిలో పనిగా నాకు ఒంటికి నలుగెట్టి, జుట్టుకి పులుసెట్టీ స్నానం చేయిచింది.మా నాన్న XXX మాట్రిమొనీలో (అయ్యలారా...అది ట్ర్పిప్లెక్స్ కాదు) నాకు తెలీకుండా నా పేరు మీద క్రియేట్ చేసిన అకౌంట్ తాలూకా పాస్వర్డ్ నాకు ప్రసాదించారు. మర్నాడు పొద్దున్న 5 గంటల 31 నిమిషాలకి కి ముహూర్తం బాగుందనీ, అప్పుడు లాగిన్ అవ్వమని ఆర్డరేసేరు. డార్క్ కలర్ ప్యాంట్ లో లైట్ కలర్ షర్ట్ ని టక్ చేయించారు. కాళ్ళకి హీల్స్ ఉన్న షూ వేయించారు చేతికి టైటన్ వాచ్ పెట్టారు.
నడానికి బెల్టెట్టారు. నుదుటున బొట్టెట్టారు. ఫైనల్గా నన్ను  ఫోటో స్టూడియో లో నించోబెట్టారు.
నా వాలకం చూసి విషయం పసిగెట్టేసిన ఫోటోగ్రాఫర్ నా కోడిమెదడు కి అర్ధం కాని లుక్కిచ్చి లైట్లేశాడు.

"సార్... నేన్ చెప్పినట్టూ స్టిల్ ఇవ్వండి.."

"అలాగే..."

"ముందు ఆ కళ్ళద్దాలు తీసెయ్యండి"

"తియ్యను... అవి లేకపోతే నా ఫోటో నాది కాదనిపిస్తాది"

"హ్మ్మ్.. సరే.. నించోండి....... .దండ కట్టుకోండి....తల పైకెత్తండీ... కొం...చెం కిందకి దించండి...కుడి చేత్తో ఎడమ బుగ్గ మీద వేలు పెట్టుకోండి......ఆ.... ఇప్పుడు ఎడమవైపుకి చూడండీ"

"ఇది వివేకానంద స్టిల్ లాగా ఉంటుందేమో??"

"ఫోటో తీసేటప్పుడు మాటాడకండి సార్....చెప్పింది చెయ్యండి..... ప్చ్...చమట తుడుచుకోంది..... కొంచెం పౌడర్ 
రాసుకోండి... తల సరిచేసుకోండి... కళ్ళ్ద్దద్దాలు పైకెత్తండి..... ఊపిరి పీల్చండి..... సార్.. కొంచెం పొట్ట లోపలకి లాగండి సార్...ఆ రెడీ రెడీ.... స్మైల్....స్మైల్..."

[కరుణ నిండిన కళ్ళతో కల్మషం లేని నవ్వు రువ్వడానికి విశ్వప్రయత్నం చేస్తూ...నేను]

"అదేం నవ్వు సార్ ?? కొంచెం అందంగా నవ్వండి"

"అందంగానా?? అంటే ఎలాగా??"

"ఏమో నాకూ తెలీదు... మీరు రకరకాలుగా నవ్వండీ..ఏది బాగుంటే అది ఫైనలైజ్ చేద్దాం. రెడీ.. 1....2...3...4...5..."

"ఒరేయ్... ఎదవకానా.. మనిషివా మెగాస్టారువా? తొందరగా తీసి చావు. పొట్ట లోపలకి నెట్టి పళ్ళు బయటపెట్టి నవ్వటం ఎంత కష్టమో తెలుసా??"

"ఆ.... ఇది ఓకే... ఇప్ప్డుడు ఆఫ్ ఫోటో  క్లోజప్ షాట్ తీస్తాను... ఆ కుర్చీ లో  స్టైల్ గా కూర్చోండి"

"ఈ ఫోటోనే కట్ చెయ్యొచ్చు కదా??"

"కుదరదు.... మా టెంప్లెట్ ప్రకారం.... పెళ్ళి చూపుల ఫోటోలకి నించొని ఒకటి. కూర్చొని ఒకటీ, పాస్పోర్ట్ ఒకటీ తియ్యాల్సిందే "

"ఏదో ఒకటి తగలెట్టు"

"సార్... ఫోటోలు ఏ బ్యాక్ గ్రౌండ్ తో కావాలీ? చుక్కలు-చంద్రుడు మధ్యలో మీరు నించొని నవ్వ్తుతున్నట్టూ... మేఘాల్లో తేలుతున్నట్టూ... జలపాతం ముందు కూర్చున్నట్టూ..."

"నాయనా... చూసిన జనాలు నన్ను  మనిషిగా గుర్తించేట్టు ఉంటే చాలు... గ్రాఫిక్స్ అక్కర్లేదు."

ఆ రకంగా... ఫోటోషాప్ లో ఎడిట్ చేసిన ఫోటోలూ, MSWord లో ఎడిట్ చేసిన Bio data లు పదుల  సంఖ్యలో ప్రింటవుట్ తీయించి నన్ను వెంటేసుకొని ఇంటికి బయలుదేరారు మా పితృదేవులు.

ఇంటికొచ్చేసరికి మా ఆస్థాన పెళ్ళిళ్ళపేరయ్య గారు మా అమ్మ పెట్టిన జంతికలు కర్కశం గా కరకరలాడిస్తూ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. నన్నొకసారి ఎగాదిగా చూసి ( ఫోటోగ్రాఫర్ కూడా ఇలాగే చూశాడు నన్ను)
నా ఫోటోలు తీసుకుని చూసి "US లో మంచులో తీసుకున్న ఫోటో ఏమీ లేదా?" అన్నాడు.  మంచులో ఉన్న ఫోటో ఉంది గానీ అది US కాదని చెప్పేను. "అయితే అక్కర్లేదు" అని తేల్చేసి "ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలబ్బాయి?" అనడిగాడు.

"డబ్బున్న ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ లో పుట్టి బీటెక్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ   ఆధునిక భావాలు తో సాంప్రదాయ
విలువలు గల వంటొచ్చిన తెలివైన చురుకైన అణకువ గల అందమైన అమ్మాయి కావాలి. పొడుగు జడ ఉంటే ప్రయారిటీ ఇస్తా" అన్నాన్నేను. నా రిక్వైర్మెంట్ ని రీసైకిల్ బిన్ లోకీ, నా ఆశల్ని అగాధం లోకీ తోసేస్తూ..."నా దగ్గర ఉన్న 100 సంబంధాల్లో... 93 అబ్బాయిలవీ... మిగిలిన 7 అమ్మాయిలవీనూ...ఆ వివరాలు మీ అమ్మగారికి చెప్పేను. అన్నీ కావాలంటే ఎలాగా? ఉద్యోగం చేసే పిల్లకి అణకువ ఉండకపోవచ్చు. కట్నం ఇచ్చే అమ్మాయి అందంగా ఉండకపోవచ్చు.. అందంగా ఉండే పిల్ల కట్నం ఇవ్వలేకపోవచ్చు. మూడూ ఉన్న పిల్ల జాతకం నప్పకపోవచ్చు. అన్నీ ఉన్న పిల్ల నిన్నెందుకు చేసుకుంటదీ? కొంచెం ఆలోచించు.
 అంచేత... నేను ఇచ్చే ఏడు ఫోటోలూ చూసి ఏదో ఒకటి ఎంచుకుని ఫోన్ చేస్తే  ఆ పై నేను చూసుకుంటా" అనేసి అడ్వాన్స్ పుచ్చుకొని అటు నుండి అటే చెక్కేశాడు.

ఆ ఏడింటిలో కత్తిలా ఉన్న (పదప్రయోగానికి క్షమించాలి) మూడు ఫోటోలు సెలెక్ట్ చేసి మా నాన్నకిచ్చి సిగ్గుపడుతూ నా రూం లోకి పరిగెత్తుకెళ్ళిపోయేను. అందులో జాతకాలు నప్పలేదని ఒకదాన్ని నాన్నారు రిజెక్ట్ చేసేరు. సరేలే ఇంకా రెండు ఉన్నాయ్ కదా అని అమ్మ ఫోన్ చేసిందాళ్ళకి. ఒకమ్మాయ్ మెరిక లాంటోణ్ణీ పెళ్ళిచేస్కొని అమెరికా వెళ్ళిపోయిందంట. ఇంకో అమ్మాయి నెల క్రితం డెలివరీ కోసం ఇంటికొచ్చిందంట. పెళ్ళిళ్ళ పేరయ్య అంత అర్జెంట్ గా
అడ్వాన్స్ పట్టుకొని ఎందుకెళ్ళిపోయాడో తెలిసొచ్చింది మాకు.
"అంతం కాదిది ఆరభం" అనుకొని గుండె రాయి చేసుకొని వచ్చిన సంబంధాలన్నీ పరిగణించటం, తెచ్చిన ఫోటోలన్నీ పరిశీలించటం, నచ్చిన అమ్మాయిలందరినీ చూట్టానికి పోవటం అలవాటు చేసుకున్నాను.

*********************************************************************************
రెండేళ్ళ తర్వాత...!!

ఓ రోజు తెల్లవారుఝామున 4.30 కి నా సెల్ఫోన్ లబోదిబోమన్నాది. ఈ టైం లో ఎవరా అని చూస్తే.. మా నాన్నారు.

"ఒరే.. బుజ్జీ కాకినాడోళ్ళూ నీ మెయిల్ కి  ఫోటో పంపించారంట. వచ్చిందా?

"నచ్చింది కూడా"

నీకు నచ్చని అమ్మాయిలున్నారా మన దేశం లో? సరే.. అయితే 4 గంటల 49 నిమిషాలకి నీ ఫోటో పంపించు. అప్పుడు ముహూర్తం బాగుంది... ఈ ముహూర్తానికి తిరుగులేదంతే... ఈ సంవత్సరం నీ పెళ్ళి ఖాయం"

"ఏటి నానా ఇదీ పొద్దు పొద్దున్నే? నీ చాదస్తం కాకపోతే మరేంటీ ....!! సరిగ్గా ఆ టైం కి పంపించడం కుదిరే పనా?"

"అందుకే కదా ఇప్పుడు ఫోన్ చేశాను.... ఇప్పుడు అప్లోడ్ చేసీ... ఆ టైం కి Send కొట్టు."

"అలాగే"
.
.
.
.
.
"నాన్నోయ్...."

"ఏంట్రా??"

" కరెక్ట్ గా Send కొట్టే టైం కి కరెంట్ పోయింది నాన్నా. నెట్ ఆగిపోయింది."

ఇలా వందల సంఖ్యలో ఫోటోలూ, పదుల సంఖ్యలో పెళ్ళిచూపులూ చూసి అలుపూ,అనుభవం వచ్చిందిగానీ నా పెళ్ళిగడియ రాలేదు. పెళ్ళి చూపుల్లో రిపీటెడ్ గా ఎదురైన ఆ భయంకర అనుభవాలని ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ గా ఇస్తున్నాను. సాటి బెమ్మీలు ముందుగా ప్రిపేరయ్యుండండి.

"ఏం కంపెనీ లో చేస్తున్నావ్ ?? ఎక్కడ చేస్తున్నావ్? జీతమెంతా?? "

బెంగుళూర్ లో పలానా మల్టీనేషనల్ కంపెనీలో.... జీతం పది పరకలు.

"అదేం కంపెనీ?? మా అమ్మాయి విప్రో లో సెలెక్ట్ అయ్యింది... అలాంటి చెత్తకంపెనీలు కాకుండా నువ్వు కూడా ఇన్ఫోసిస్ లోనో విప్రో లోనో చూసుకోవచ్చు కదా?"

[బగమంతుడా... 1 2 3 4..5..6..7.. కంట్రోల్... కంట్రోల్.. ]

"కళ్ళద్దాలు తలనొప్పికా? "

[కాదు కడుపు నొప్పికి... ]

"ఓహో సైట్ కా?? సైటెంతా???"

[100 గజాలు]

"మా అమ్మాయి వెలుగుతున్న ట్యూబ్ లైట్ లా ఉంటాది. నువ్ ఎండిపోయిన చింతపండులా ఉన్నావు. కట్నం కట్"

[ నువ్వు లేవా చీకేసిన తాట్టెంక లాగా..?? ఎవడడిగాడయా నిన్ను కట్నం?? ఎంత కిరాణా షాపుంటే మాత్రం?? 
కట్నానికీ కలరుకీ లింకెడతావా తౌడు తినే దరిద్రుడా!!]

"US లో సెటిలయ్యే ఉద్దేశ్యం ఉందా? లేదా??"

[ఉద్దేశ్యమే కాదు... వీసా కూడా లేదు.. మీ అమెరికా పిచ్చి త్తగలెయ్య]

"బాబూ... నీకు మందు- సిగరెట్టూ లాంటి పాడలవాట్లు ఉన్నాయా??"

[నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఉంటే మాత్రం ఉన్నాయని చెప్తానా? మాసిపోయిన బట్టల్ని ఇస్త్రీ చేసుకొని వేసుకొచ్చిన పిత్తపరిగ మొహమా]

"అబ్బాయి ఎన్ని చలం పుస్తకాలు చదివినా గానీ అన్నీ ఉండీ కట్నం వద్దంటున్నారంటే మాకెక్క్కడో తేడా కొడుతుంది...మాకు నమ్మకం లేద్"

[తిరుపతి లడ్డూని నాలుకకి తగలకుండా మింగేస్తాననే మీ లాంటి మూర్ఖుల్ని ఎవడూ బాగుచెయ్యలేడయ్యా..ఇలాంటి పిచ్చనుమానాలతో అవమానిస్తే నీ చర్మం వలిచి Woodland వాడికమ్మేస్తా.. నమ్మండి రా... నమ్మకమే జీవితం! టీవీ లో ఎప్పుడూ వినలే?? ]

"ఖాళీ టైం లో ఏం చేస్తుంటారండీ?"
ఫ్లాపయ్యే సినిమాలు చూసి హిట్టయ్యే రివ్యూలు రాస్తుంటానండీ
"అంటే పనికొచ్చే పనులేవీ చెయ్యరన్నమాట..హ..హ హ"
అలా అయితే మీతో మాట్లాడేవాడినా?? హ..హ హ.
"అమ్మా... ఈడు నాకొద్దే...."


"మీ అబ్బాయికి రెండేళ్లబట్టీ చూస్తున్నా ఇంకా ఏమీ కుదరలేదా?? ఏంటీ ప్రోబ్లెమ్?? "
[హ్మ్మ్... చికెన్ సెంటర్ బయట తోకూపుతూ తిరిగే ఊరకుక్క కి వినిపిస్తుందా లోపల చచ్చే బ్రాయిలర్ కోడి ఆర్తనాదం??]

 "కార్తీక మాసం చెయ్యించండీ... పెళ్ళెందుకవ్వదో నేనూ చూస్తానూ"

[రంజాన్ మాసం కూడా చేసానండీ...వర్కవుటవ్వలేదూ]

"జాతక దోషమేమో....? శాంతి పూజలు చేయించండీ... తూర్పు దిక్కునుండి సంబంధం వెతుక్కుంటూ వచ్చి సెట్టయ్యిపోతుందీ"

[ఇలాంటయిడియాలు వినే కదా పోయినేడాది హోల్ సాలరీ హోమగుండం లో పోసిందీ? కళ్యాణం కోసం క్షుద్రపూజలు తప్ప అన్నీ చేశామయ్యా సామీ. వింటానే ఉంటే,  పొయ్యిలో నెయ్యి పొయ్యండీ, టీ డికాషన్ లో మజ్జిగేసుకొని తాగండీ అని చెప్తానే ఉంటారు మీలాంటోళ్ళు]

********************************************************************************
ఫైనల్ గా ఓరోజు  మా అమ్మ వచ్చి "బుజ్జిబాబూ...పొడుగుజడున్న పెళ్ళాలు  బాపు సినిమాల్లోనే ఉంటారు. నిజ
జీవితం లో పిచ్చెక్కించే పెళ్ళాలు మాత్రమే ఉంటారు కావలిస్తే మీ నాన్నని అడుగు.నీ చెత్త రిక్వయిర్మెంట్స్ లో 80%
కాంప్రయిజ్ అవుతానంటే నా దగ్గర 15 ఏళ్ళ క్రితం వేసుకున్న బ్యాకప్ ప్లానుంది. చిన్నప్పుడు నా దగ్గరే
చదువుకుంది.. ముగ్గు లో పొర్లించినట్టుండే దానికీ బొగ్గు కి బట్టలేసినట్టూండే నీకూ సరిగ్గా
సరిపోద్దనుకుంటున్నాను.. అత్తాకోడళ్ళ గొడవులే ఉండవురా... ఓ సారెళ్ళి చూసొద్దాం రా రా"
అన్నాది.అదికాదమ్మా...ఎప్పటికయినా "ఆనంద్ సినిమా లో రూపనీ, గోదావరి సినిమా లో సీతనీ కలిపి మిక్స్
చేసిన అమ్మాయి ని చేసుకుంటానమ్మా.. శేఖర్ కమ్ముల లాంటి తండ్రి ఎక్కడో క్రియేట్ చేసే ఉంటాడు"
అన్నాన్నేను.
"చీర కోసం అత్త తో గొడవ పడి పెళ్ళి క్యాన్సిల్ చేసుకునే తింగరదాన్నీ, కయ్యాల గయ్యాల్నీ కోరి
చేసుకుంటానంటావు.. ఇదేం పోయేకాలం రా" అంటూ మా అమ్మ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయింది.
బాలయ్యబాబు విన్యాసాలకి గ్రాఫిక్స్ తోడయినట్టూ దారుణం గా అయిపోయింది పరిస్థితి. నా
రిక్వయిర్మెంట్ ని అర్ధమయ్యేట్టూ చెప్పడం ఓపెనర్ లేకుండా వైన్ బాటిల్ మూత తియ్యడమంత కష్టమని
అర్ధమయ్యింది. Youtube లో దొరకని పాత సినిమా టీవీ లో వచ్చి కరుణించినట్టూ ఈ ముగ్గుబుట్టే మన రిక్వయిర్మెంటేమో అని డౌటొచ్చి అలవాటు ప్రకారం చూడ్డానికి వెళ్లాను.


చూసొచ్చాక, నేను ఎగిరి గంతేసి ఓకే అన్నాక, నెలరోజుల్లో ముహూర్తమన్నాక, మా పెద్దోళ్ళు అన్నారు " పై వాడు పలానా టైం కి వీడికి-దీనితో అని ముందే ముడేస్తాడు రా...ఈ లోపు మనమెన్ని  చేసినా ముడిపడదు... ఆ పై ఆగదు. శుభమస్తు" అని.

బ్లాగు మూగబోయిందీ........ అంటే పోదా మరీ?? 2013 లో జరిగిన విపరీతాల్లో ఇదొకటి.


ఇన్ ఫ్రెంట్ .......దేరీజ్ క్రొకొడైల్ ఫెస్టివల్ అని అప్పుడు నాకు తెలీదు....!!! కొత్త సిరీస్ రాయడానికి  నాకో క్యారెక్టర్ 
దొరికిందోచ్..
---------------------------పెళ్ళయ్యాక ప్రతీ స్సీనూ.. క్లైమాక్స్ లాగా ఉంటాది-----------------


73 comments:

Anonymous said...

Great...enni rojulaki meeru malli post rasaru....Ithe over all ga miku pelli ayyindanna maata...Congrats !!!andi..Ina 2013 lo ne pelli ithe mari inni rojulu cheppaledenti andii..??


--Roopa

తృష్ణ said...

ఇదిగో అబ్బాయ్.. చేతిలో బ్లాగుంది కదా అని ఫ్యూచర్లో అమ్మాయి మీద మరీ సెటైర్లు, జోకులు ఎక్కువ వేసేయకూ...:-)
అయినా ఈపాటికి బాగా అర్ధమైపోయి ఉంటుంది కదా!!

Gowri Kirubanandan said...

Congrats! Happy married Life!

Gowri Kirubanandan said...

Congrats! Happy Married Life!

Lakshmi Naresh said...

Raj baabu... chala rojulaindi ilaa navvi... thank you.. eppatilaage champesaaav.... hilarious

..nagarjuna.. said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ రచ్చో రచ్చ... బెమ్మీ కష్టాలని ఇంతకంటే బాగా ఎవడూ చెప్పలేడు. పీక్స్ అంతె ;)

Unknown said...

రాజ్ బాబూ, నీ పెళ్ళి వెనుక ఇంత కధ ఉందని తెలీదు :)) నీ పంచ్లు ఎన్నని ఏరమంటావు:)) కొత్త కారెక్టర్ తో ఇంత ధైర్యంగా బ్లాగ్ రాద్దామనే?? ఈ పోస్ట్ కు మాత్రం ఓ పదివేల లైకులూ ఓ లక్ష నవ్వులూ:)))

MURALI said...

"ఖాళీ టైం లో ఏం చేస్తుంటారండీ?"
ఫ్లాపయ్యే సినిమాలు చూసి హిట్టయ్యే రివ్యూలు రాస్తుంటానండీ
"అంటే పనికొచ్చే పనులేవీ చెయ్యరన్నమాట..హ..హ హ"
అలా అయితే మీతో మాట్లాడేవాడినా?? హ..హ హ.

పంచ్ పడింది. రీఎంట్రీ అదిరింది. ఇక కొత్త కాపరం ఇష్టాలు, కష్టాలు కూడా వ్రాయటం మొదలెట్టు

జ్యోతిర్మయి said...

Refreshing post...Thank you

వేణూశ్రీకాంత్ said...

హహహాహహహహహహ రీ ఎంట్రీ అదిరింది రాజ్ పోస్ట్ సూపరు :-))

నీ టిప్పు సంతకెళ్ళా... వంకాయలు కోశాక ఉప్పుకలిపిన నీటిలో వేయాలబ్బాయ్ ఉత్తనీళ్ళలో కాదు.

"అమెరికాలో మంచు ఫోటో..." కెవ్వ్వ్వ్వ్ ఒక్కసారి ఉలికిపడి భుజాలు తడుముకున్నానోయ్ :-))

సంతు (santu) said...

"పెళ్ళయ్యాక ప్రతీ సీనూ.. క్లైమాక్స్ లాగా ఉంటాది" hahaha...(experience tho cheptunnaraa?)

so, ika పెళ్లి చేసుకొనే బాబులు మీ బ్లాగ్ కి connect అయిపోతే future కి బాగా ప్రిపేర్ అవొచ్చు అన్నమాట... :p

cngrts n happy married life... :)

Karthik said...

Hhaa..kevvvvv...kekkkkka..:):)

అనంతం కృష్ణ చైతన్య said...

congratulations andi..... waiting for ur new series. MAALANTI bachelors ki "MARO BHAGAVADGITA" AVVALI MEE BLOG...... :)

శ్రీనివాస్ పప్పు said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

NSK said...

babu...ee sari aa posts length konchem tagginchu.....ledante mottan chadive lopala navvaleka chachi potunna............

NSK said...

idi chadivi navvaleka chachi poya ....room lo vallu edo road meeda pichivanni chusinattu chustunnaru! very nice post....thank you

కిరణ్ కుమార్ కే said...

"వంకాయలు కోసిన వెంటనే నీట్లో పడేస్తే నల్లరంగులోకి మారి పోకుండా ఉంటాయి. నేన్ చెప్పానని వంటోడికి చెప్పు" అని గొప్ప టిప్పిచ్చాను.

"US లో మంచులో తీసుకున్న ఫోటో ఏమీ లేదా?" అన్నాడు.

"నా దగ్గర ఉన్న 100 సంబంధాల్లో... 93 అబ్బాయిలవీ... మిగిలిన 7 అమ్మాయిలవీనూ

నీకు నచ్చని అమ్మాయిలున్నారా మన దేశం లో?

"అంటే పనికొచ్చే పనులేవీ చెయ్యరన్నమాట..హ..హ హ"
అలా అయితే మీతో మాట్లాడేవాడినా?? హ..హ హ.
---------------------------

ఖతర్నాక్ కామిడి, బలే రాస్తారండి మీరు, ధన్యవాదాలు.

Anonymous said...

a sambandamu lekunda mee intiki vachi mee chetha ekkilu pettistu bucketlu bucketlu kannilu karpinche vaalu vacharanamata
all the best raj

vainika said...

Aboo..soooperu...cheptha cheptha..eesari mee intiki vachinappudu thanaki motham chadivi vinipinchi...he he he.. :-)

Unknown said...

Soooooooooooooooooooper.......chaaalaa chaalaaa baagundi

నాగరాజ్ said...

రాజ్,
నువ్వూ... సూపరసలు!!
నవ్వులతో చంపేశావ్. అద్భుతం!!
Have a happy married life and wonderful journey ahead :-)

Sai Praveen said...

Back with a bang. Superrr :)

Anonymous said...

"ఏమో నాకూ తెలీదు... మీరు రకరకాలుగా నవ్వండీ..ఏది బాగుంటే అది ఫైనలైజ్ చేద్దాం. రెడీ.. 1....2...3...4...5..."

"ఒరేయ్... ఎదవకానా.. మనిషివా మెగాస్టారువా? తొందరగా తీసి చావు. పొట్ట లోపలకి నెట్టి పళ్ళు బయటపెట్టి నవ్వటం ఎంత కష్టమో తెలుసా??"
Vammooooooo!Super Rajkumar garu

Ravichandra said...

Meeru super andi babu ...kulla bodiche meetings madhya challa bariche manchi blog....... intaki sadaru sudhakar ki pelli eppudu :-)

Ravichandra said...

Meeru super andi mastaru...
Kulla bodiche meetings madhya challa bariche manchi blog...

Intaki sadharu sudhakar ki pelli ???

Ravichandra said...

Meeru super andi mastaru...
Kulla bodiche meetings madhya challa bariche manchi blog...

Intaki sadharu sudhakar ki pelli ???

Krishna said...

Super ooo super. ROFL

Found In Folsom said...

Adaaa vishayam.....ardhamaindi :) Congratulations, Raj. Wishing you a a very happy married life :) malla pillo/pillado puttaka rayakandi post..appudappudu maa lanti abhimanulu wait chestarani gurtu pettukondi.

శ్రీ said...

as usual adurs .... loved it

Anonymous said...

సూపర్...సూ...ప..ర్...

Sree said...

ee madhyane mee blog choosaanu, posts raatledu ani konchem feel ayyaanu but expect chesaa meeredo pelli post toti vastaaru ledante pelli ayipoyinaaka blog atakekkistaaru ani.. correcte annamaata :).

Wish you all the very best in life and have a content and peaceful life ahead.

chubby said...

he he :) Rajku.......... Finally malli blog rasav... nuvvu kotha character ani sambaralu chesukoku.. next thanu blog rayadam start chesthundi :)

Sridevi said...

Congrats Raj, happy married life! As always great post!

Unknown said...

ఇదిగిదిగో రాజ్బాబు ... ముందే చెప్పేస్తున్నా ..... నువ్వు గనక ఈవిధంగా, ఇలాగే అందరి పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నావు అనుకో ... నీ మీద బెమ్మి (ఐపీసి లాంటిదే) 000 సెక్షన్ కింద కేస్ ఎట్టేయ్యగనను జాగర్త ... హా ... ఏమనుకుంటున్నావో ... !!

బులుసు సుబ్రహ్మణ్యం said...

చాలా కాలానికి, కళ్ళమ్మట నీళ్ళు వచ్చేటట్టు నవ్వుకున్నాను. సూపర్ అంతే. మరో మాట లేదు.

Akshith my son said...

నాకు మాత్రం జంధ్యాల గారి మూవి చుస్తున్నట్టుగా ఉంది
చాలా రోజుల తరువాత ఇంత హయి గా నవ్వుకోవడం

Priya said...

Wow!! చక్కటి శుభవార్త చెప్పారు రాజ్ గారూ :) కంగ్రాట్స్ :D
పనిలో పనిగా ఓ ఫోటో కూడా పోస్ట్ చేసుంటే ఎంత బావుండేదో..

శశి కళ said...

ha...ha....yemi requirements raj.as usual post adurs :)))

CA Bosu Babu said...

ha ha....one liners keka...short n super.

Raviteja said...

ఈ మధ్య మీరు బ్లాగు పోస్ట్లు పేటక పోయేసరికి బెంగా పెటుకున మలి బ్లాగు పోస్ట్లు రాసీనాందుకు థాంక్స్ ఏపటలాగే వ్యాసం ఆదరింది 👅👅👅👅👅👅

రాజ్ కుమార్ said...

రూప గారు.. అవునండీ ప్రమాదవశాత్తూ అయ్యింది. బిజీగా ఉండి చెప్పలేదండీ ధన్యవాదాలు
తృష్ణ గారూ.. హహహ మన సంగతి ఎప్పుడో తెలిసిపోయింది. ఇప్పుడు జోకులేసేంత సీను లేదండీ ;( థాంక్యూ
గౌరి గారూ థాంక్యూ అండీ

రాజ్ కుమార్ said...

థాంక్యూ నరేషూ... ;)
నాగార్జునా.. ఏం నీకేం త్రక్కువ నాయనా? ఐ థింక్.. ఇప్పుడు నీ సిచువేషన్ భీ ఇట్నే ఉండి ఉంటుందిగా ;)
సునీత గారూ.. మరేమనుకున్నారు?? పెద్దకత ని ఇలా కుదించి రాశా. కొత్త క్యారెక్టర్ ని పెట్టి ఎన్నయినా రాయొచ్చు ఏం పర్లేద్ ;)

రాజ్ కుమార్ said...

మురళీ... థాంక్యూ అంతే కదా.. చూద్దాం ఏం రాయగలనో ;)
ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ
వేణూజీ థాంక్యూ... అందుకే గొప్పటిప్పన్నాను. ఉపయోగపడే టిప్పులిస్తారా ఎవరన్నా? మంచు ఫోటో ఇన్స్పిరేషన్ మీరు కాదులెండీ ;)

సంతుగారూ... ఎగ్జాట్లీ అంతే..అంతే.. థాంక్యూ అండీ
ఎగిసేఅలలు గారొ.. థాంకులు ;)
కృష్ణ చైతన్య గారూ.. థాంక్సండీ. పెళ్ళయ్యాక ఎవరన్నా రాసీగలరు బ్లాగ్వద్గీత ;)

రాజ్ కుమార్ said...

పప్పుసారో....రివర్స్ కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ;)
స్వరూప్ కుమార్ గారూ... నెక్స్ట్ టైం ట్ర్తై చేస్తా... ;) థాంక్యూ
గ్రీన్ స్టార్ గారూ థాంక్యూ వెరీ మచ్

అనానిమస్ గారూ థాంక్యూ అండీ
వంశీ గారూ, సాయి ప్రెవీణూ... ధన్యవాదః
ఇంకో అనానిమస్ గారూ థాంక్యూ

రాజ్ కుమార్ said...

రవిచంద్రగారూ.. ఏదో అలా కలిసొచ్చి.. అన్నమాట. సదరు సుధాకర్ పెళ్ళెప్పుడో ఇంకా మిస్టరీనే ;) థాంక్యూ
కిట్టిగాడు గారూ శ్రీగారూ, హరేఫల గారూ, శశిగారూ.. ధన్యవాదాలండీ
sree గారూ.. అయితే మీ అంచనాలని అందుకున్నానన్న మాట. ధన్యవాదాలండీ
chubby.. .అంత సీన్ లేదులే. అది కన్ఫర్మ్... థాంక్యూ

రాజ్ కుమార్ said...

రహ్మాన్.. పెళ్ళయినోడి మీద జాలిపడాలిగానీ శిక్షలవీ వేస్తారా? నీకు కూడా పెళ్లవ్వాలని శపిస్తున్నాను
బులుసుగారూ ఏదో మీ దయ.. ధన్యవాదాలండీ
రానిత గారు థాంక్యూ అండీ (గొప్ప కాంప్లిమెంటే ;))
ప్రియ గారూ నేను మీ కంటే రెండు నెలలు సీనియర్ ని. హిహిహి... ఫోటోలు గట్రా పెడతారా ఎవురయినా... మీకంటే మీ ఫోటోగ్రాఫర్ షేక్ చేసి తీశాడు కాబట్టీ సరిపోయింది. నాకు అలాక్కాదు గా ;)

Sujata M said...

Hearty Congratulations. I second Trishna garu. Looking forward to many new posts from you.

Anonymous said...

చాలా బాగుంది.....
సినిమా బాషలో చెప్పాలి అంటే..ఇంటర్వల్ బ్యాంగ్ అద్బుతమ్...మంచి వెటకరమైన సంభాషణాలతో మామూలు సన్నివేశాలని బాగా రక్తి కట్టించారు..

రాజ్ కుమార్ said...

నాగరాజు గారూ.. హృదయపూర్వక ధన్యవాదాలండీ.
సుజాత గారూ థాంక్యూ అండీ
రాజశేఖర్ గారూ థాంక్యూ సార్

HVM - హర్ష వీక్షణం said...

కుమ్మేసావ్ రాజా :))

vkbabu said...

మీలో ఒక గొప్ప రచయిత వున్నాడు. పడికాలాలు ఇలాంటి రచనలు చేస్తూ మా బోటివారిని ఆనందింపచేయండి.

Maitri said...
This comment has been removed by the author.
Swapna said...

mee posts ni story ga edaina magazines ki pampinchavachu kada... comedy story competetion emaina vunte mike first prize...

Congrats and wish you happy married life :)

--Swapna

Ranga said...

వంకాయలు కోశాక ఉప్పుకలిపిన నీటిలో వేయాలబ్బాయ్ ఉత్తనీళ్ళలో కాదు


keww tippu asalu

రాజ్ కుమార్ said...

అద్దొద్దనా.. థాంక్యూ
vkబాబు గారూ థాంక్స్ అండీ
కృష్ణవేణి గారూ థాంక్స్ ఎ లాట్

స్వప్న గారూ... కధలు రాసేంత టాలెంట్ లేదు లెండీ. థాంక్యూ
రంగ గారూ ధన్యవాదాలు

Anonymous said...

last time varaku aeppudu time doriki ee blog open chesinaa...aeppudoo temple run lanti aatalu ani choosi choosi...kotha post aeppudu pedatara ani wait chestunna naku..ee sari blog open cheyagane ee kotha post kanipichindi...chaduvutunte...mee gatha anubhavam gurinchi rastunnaranukunna kani...motham chadivake telisindi...ee samvatsaramlone pelli chesukunnarani.Congrats andi...meeku...mee sreemathigariki..:):)
nenu system mundu kurchoni aenduku ila pichi danila navvutunnano telika paapam maa ammamma anthe na vipu choosthoo undi...vishayam telikapothe nijangane pichi anukuntaremonani...meeru rasina mee pelli history panilo paniga maa ammammaki kuda cheppi iddaram kalisi navvukunnam...:D :D

రాధిక(నాని ) said...

నవ్వీ నవ్వీ అలసిపోయా .చాలా చాలా ఆ ఆ ఆ .. ....బావుందండీ :)))

Anonymous said...

Hi Rajkumar,

First of all, Congrats and Wish you happy married life.

Mee blog ki nenu regular visitor ni, first time mee blog lo Shadow review chadivanu, ful ga navvukuna, alane 2 days ofz lo work cheyakunda mee posts annni chedivesanu, mee blog link ni naa browser lo bookmark chesi pettanu, roju open chesi emaina kotha posts unnaya ani chudadaniki...

Very Hilarious blog I have ever seen...

-Aravind Yadav

రాజ్ కుమార్ said...

అనానిమస్ గారూ.. హృదయపూర్వక ధన్యవాదాలండీ. మీ అమ్మమ్మగారూ, మీరు చదివి ఆనందించినందుకు నాకూ ఆనందంగా ఉంది. థాంక్యూ

రాధిక గారూ. థాంక్యూ అండీ.
అరవింద్ యాదవ్ గారూ.. థాంక్యూ వెరీ మచ్ అండీ. ;) ;)

mahesh said...

Happy Married life RajKumar Garu :)

Unknown said...

Rajkumar garu
Wish u a very Happy married life
Mee blog lo comedy, history, flashbacks..etc..etc...anni kalipi readers ki vindubojanam pedutunnaru

Craving for ur posts
Vineelc15@gmail.com

హరీష్ బలగ said...

రాజ్ కుమార్ గారు? మీరు intermediate శ్రీ ప్రకాష్ కాలేజీ లో చదివారా? మీరు చెప్పిన శ్రీనివాసరావు లని నేను అక్కడే చూసా .

adigaadu said...

Happy married life rajkumaar gaaru.mee posts kekokekandi��

రాజ్ కుమార్ said...

vineel గారూ..థాంక్యూ వెరీ మచ్ ;)
adigadu గారూ ధన్యవాదాలు ;)

హరీష్ బలగ గారూ.. ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడక్కూడదంతే.. ;) ;) వాళ్లని అక్కడ చూశారంటే మీకూ ఫ్లాష్బ్యాక్ ఉండే ఉంటాది ;)

Anonymous said...

చాలా బాగుంది.పంచ్ బాగుంది.గ్రేట్ రాజ్
డా. హరిబాబు

somepalli said...

excellent writing. lot of fun combining with whats happening in the Andhra Pradesh.

Swathi Vajja said...

:)

Unknown said...

Manasaara navvukunnanandi . Chala baaga Softaware kurralla eethi badhalki haasyanni jodinchaaru. Great Job andi..

Anonymous said...

Raj ...Enni rojulu chadivina post ee malil malli chadavanu....malli eppudu rastharu new post ???? waiting ikkada....


--Roopa

Anonymous said...

super post ani!! Happy married life

sudhakara said...

Super sir

గిరీష్ said...

1. వంకాయలు కోసిన వెంటనే నీట్లో పడేస్తే నల్లరంగులోకి మారి పోకుండా ఉంటాయి. నేన్ చెప్పానని వంటోడికి చెప్పు

2. ఆ దెబ్బకి వాడు హడావిడిగా లోపలకి పరిగెత్తి "HIT" పట్టుకొచ్చి సోంపు ప్లేట్ మీద ఎడాపెడా స్ప్రే చేసేసి ఈగల్ని చంపేశాడు

3. అయ్యలారా...అది ట్ర్పిప్లెక్స్ కాదు

4. తియ్యను... అవి లేకపోతే నా ఫోటో నాది కాదనిపిస్తాది (same here)

5. ఇది వివేకానంద స్టిల్ లాగా ఉంటుందేమో??

6. అందంగానా?? అంటే ఎలాగా??

7. మనిషివా మెగాస్టారువా? (nenu hurt ayya basu)

8. నమ్మండి రా... నమ్మకమే జీవితం! టీవీ లో ఎప్పుడూ వినలే??


Arupulu.

Hari Krishna said...

ఇంటికొచ్చేసరికి మా ఆస్థాన పెళ్ళిళ్ళపేరయ్య గారు మా అమ్మ పెట్టిన జంతికలు కర్కశం గా కరకరలాడిస్తూ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. నన్నొకసారి ఎగాదిగా చూసి ( ఫోటోగ్రాఫర్ కూడా ఇలాగే చూశాడు నన్ను)
నా ఫోటోలు తీసుకుని చూసి "US లో మంచులో తీసుకున్న ఫోటో ఏమీ లేదా?" అన్నాడు. మంచులో ఉన్న ఫోటో ఉంది గానీ అది US కాదని చెప్పేను. "అయితే అక్కర్లేదు" అని తేల్చేసి "ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలబ్బాయి?" అనడిగాడు.


కుమ్మేశావ్ కామెడీ ..