Monday, March 30, 2020

పాచిపోయిన పకోడీలు.... వేడి వేడి గా .. 2ఆదివారం భానుడు కళ్ళు తెరిచినవేళ
పొరలు కమ్మిన పొగమంచు ఆవిరగు సమయాన
వారాంతపు జిహ్వాగ్ని వెర్రులెత్తు దినాన 
అల్లం వెల్లుల్లి తో  ఉల్లి నుజ్జయ్యే రాతిన 
కొక్కొరొక్కో కేక గొంతు దాటే క్షణాన
నీచు అంగడిన కత్తి వేటు వేసె.
ఉష్ణ రుధిర ధార ఏరులై పారే. 
నాటు కోడి నాకు కబళమయ్యె!!!

కో బలీ.... నరుకు బలీ.. !!
 
కంగారు పడకండి. నిన్న ఆదివారం కదా.  ఈ కరువు రోజుల్లో కోడి ,మేక లపై ఇలాంటి  క్షుద్ర కవితలు రాయడం తప్ప కూర తినగలనా ? పైగా పోస్ట్ ఎలా మొదలెట్టాలో తెలీలేదు. అందుకే మీ కర్మ కి కిలుం పట్టింది. ఆ కపిత పుట్టింది. 

------------------------------------------------------------------------------------------------------------------

2012 లో ఒకానొక ప్రోజెక్ట్ కి "యాంగ్మీ కిమ్" అనే ఆవిడ మాకు మేనేజర్ గా ఉండేది. రోజూ మార్నింగ్ మీటింగ్ అయిపోగానే మేము వచ్చామో, హోటల్లో ముసుగేసి నిద్దరోయామో అని చెక్ చేయడానికి సర్జరీ చేసిన మర్నాడు డాక్టర్ రౌండ్స్ వేసినట్టూ వేసేది మా వర్క్ స్టేషంస్ దగ్గరకి. ఎప్పుడైనా వీకెండ్స్ అవసరం పడితే మా హోటల్ కి వచ్చేసి మా వాళ్ళ రూమ్ కాలింగ్ బెల్ కొట్టి ఆఫీస్ కి లాక్కుపోయేది‌. తొక్కి నార తియ్యడం గురించి విన్నాను గానీ తెలిసింది మాత్రం అప్పుడే.

ఓ రోజు ఆఫీస్ లో నన్నూ, ఇంకో ఇద్దరు కుర్రోళ్ళనీ ఒక ప్రోజెక్ట్ డిస్కషన్ కోసమని పిలిచింది. మేము కూడా జాతరకెళ్ళే మేకల్లాగా వెంటే వెళ్ళాం. చెవులు మూసుకున్న మూగ కోతుల్లాగా మేం ముగ్గురం ఎదురుగా కూర్చుంటే ఆవిడ మా కోసం బాలయ్య బాబు ఆడియో ఫంక్షన్ లో రాబోయే సినిమా లో ఇంట్రెవెల్ బాంగ్ హైలైట్స్ వివరించినట్టుగా వివరించడం మొదలెట్టింది ఇంగ్లీష్ లో.

పావు గంట అయ్యింది. ఆవిడ మాట్లాడేది ఇంగ్లీషే. కాకపోతే ఒక్క ముక్కా బుర్రలోకి వెళ్ళట్లేదు. నేనంటే తెలుగు మీడియం కాబట్టీ ఏమో లే అనుకున్నా . తక్కిన ఇద్దరూ కూడా నోట్లో భూగోళం చూపించే బాలకృష్ణుళ్ళ లాగా (అయ్యా.. నేను చెప్పేది నందమూరి అందగాడి గురించి కాదు) చూస్తూ , తలకాయలు నా వైపు తిప్పారు. అంట్లు తోమడానికి కొబ్బరి పీచు కూడా తేలేనే తల్లీ అంటే పనిమనిషి చేతులు కందకుండా గ్లౌజులు కావాలందట బెంగుళూర్ లో ఒకానొక .... (ఇప్పుడెందుకులెండి అవన్నీ ). అంతా అయ్యాక ఇమ్మీడియట్ గా కోడింగ్ మొదలెట్టాలని మా గుండెల్లో గుండ్రాయి పడేసింది‌.
నేను "once more " అడిగాను... ఆవిడ మళ్ళీ. ఇలా

"దిస్ అఫ్హ్లికేషనూ... ఐ నో పీపుల్.. హెల్పింగ్...ఇయర్ నో పీపుల్... కేజీ టమాటాలూ.., మాడిపోయిన మినపట్లు , ఎండబెట్టిన పనస పిక్కలు, సామాజిక న్యాయం, ఊర మిరపగాయలు, కిమ్చీ , చల్లారిపోయిన గెంజి... I know people, hear know people" అంటూ మిఠాయి కిళ్లీ నమిలినట్టూ నమిలి మిగెయ్యటం మొదలెట్టింది.

మేము సబ్ టైటిల్స్ లేని మలయాళీ సినిమా లో కడుపుమండిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ భావోద్వేగపు డైలాగ్ వింటున్నట్టూ కూర్చున్నాం... కప్పల్లా గుడ్లప్పగించి‌.

ఇంక‌ లాభం లేదు అని ఆవిడ లేచి నుంచొని అభినయిస్తూ మళ్ళీ ఐ నో పీపుల్, ఇయర్ నో పీపుల్. యు నో.. అనేసి... "మీకు చెప్పడం నా వల్ల కాదురా... మట్టి బుర్రలు" అన్నట్టూ ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయింది.

నేను పద్మాసనం వేస్కొని కూర్చొని కళ్ళు మూస్కొని నా 2 మోకాళ్ళనీ మర్దనా చేస్కోడం మొదలెట్టాను.
డింగ్... ఆవిడ బాధేంటో నాకు బోధ పడింది.

అది i know people కాదు.. Eye No people అనగా కళ్ళు లేని వారు.

ఇయర్ నో పీపుల్ = Ear No people అనగా చెవులు వినిపించని వారు.

వినికిడి లేని వారి కోసం, కళ్ళు లేని వారి కోసం కోసం ఒక అప్లికేషన్ చెయ్యాలని ఆవిడ ఉద్దేశ్యం. మాకు బుర్ర లేదని తేలిపోవడం తో మాకు ఆ ప్రోజెక్ట్ ఇవ్వలేదు.

********************************************************************************************
నేను టీమ్ లో జాయినయిన కొత్తల్లో మాకు కాంటాక్ట్ పాయింట్ గా ఒక కిమ్ (పేరు కిమ్) వచ్చాడు. మా వర్క్ ప్లేస్ చూపించాక, ఏమైనాకావాల్సి ఉంటే మెయిల్ ఇవ్వమని తన కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మర్నాడు నాకేదో అవసరం అయి మెయిల్ ఇచ్చాను. రిప్లై లేదు. పాపం బిజీగా ఉన్నాడేమో అని నేనే డెస్క్ దగ్గరకి వెళ్ళి అడిగాను. నాకేం మెయిలూ రాలేదే అని చెక్ చేశాడు‌. నా మెయిల్ కనిపించలేదు‌. నేనేదో అడిగా..నాకు తెలీదని మొహమాటం గా చెప్పడం తో వచ్చేసాను. ఇక రోజూ నేను వెళ్ళి ఆయన్ని ఏదో అడగడం... వాడు నాకు తెలీదని చేతులు క్రాస్ చెయ్యడం. నన్ను చూస్తేనే వాడికి గుండెల్లో భయం, మొహం‌లో చిరాకూ, వెన్నులో ఒణుకు.
నేను మాత్రం సగం కోసిన పుచ్చ్చకాయని స్పూన్ తో తీస్కొని తిన్నట్టూ వాడి బుర్ర తినేసేవాడిని. వాడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు నాకు కొరియా అస్సలురాదు. ఒకరోజు అలా అతనితో మాట్లాడుతూ ఉండగా నాకు మొదటి రోజు కనిపించిన కిమ్ కనిపించాడు. నా గుండె గుభేల్ మంది. 4 రోజులు ఆర్మీ ట్రెయినింగ్ కోసం లీవ్ లో వెళ్ళాడంట. అం....టే.... నేను రోజూ మెయిల్ పెట్టేది ఒకడికి. వాడే అనుకొని మాట్లాడేది ఇంకొకడితో. ఇద్దరి పేర్లూ‌ ఒకటే. ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ( దాదాపు అందరూ ఒకలాగే కనిపిస్తారు)‌. ఎలక‌ కొరికి వదిలేసిన కొబ్బరి పెచ్చి మొహానికి నవ్వు పులుముకొని వచ్చేశా సైలెంట్ గా. అసలు సంగతి చెప్తే నన్ను ఆ కిటికీ లో నుండి తోసేస్తాడు. అసలే 13 వ ఫ్లోర్.

మా టీమ్ లో ఒకమ్మాయి (పేరు అదేదో లీ ) ఉండేది. ఒక రోజు నేను ఆఫీస్ కి వెళుతూ ఉంటే దారిలో ఒక బస్ స్టాప్ లో కనిపించింది‌. ఈరోజు లీవ్ ఏమో ..వెళ్ళి పలకరిద్దామా? అనుకున్నాగానీ... ఎందుకు లే అని ఊరుకున్నాను. ఆఫీస్ కి వచ్చి చూస్తే మా టీమ్ మేట్ బుద్దిగా పని చేస్కుంటా కనిపించింది.అంటే బస్టాప్ అమ్మాయి వేరు. ఇద్దరూ గంగ-మంగ టైప్ అన్నమాట. ఇంకా నయ్యం ఆ బస్టాప్ అమ్మాయిని పలకరించేను కాను. ఇలా కనీసం 4 సార్లన్నా పొరబడి ఉంటాను ఆ అమ్మాయి విషయం లో. ఖండానికి ఒకళ్ళు చొప్పున ఉండాల్సినోళ్ళు అందరూ కొరియా లోనే ఉన్నారు కాబోలు. ఈ కంఫ్యూజన్ మా మొహాల విషయం లో వాళ్ళకీ ఉంటుందని తర్వాత తెలిసింది. మా ఐడీ కార్డ్ మెడ లో లేకపోతే వాళ్ళకి రవి కుమార్ ఎవడో రాజ్ కుమార్ ఎవడో తెలీదు.

****************************************************************************************************

అక్కడ ఎక్కువ గా రోడ్ పక్కన బుట్ట లో పెట్టి స్వీట్ కార్న్ అమ్మినట్టూ ఒక రకమైన స్నాక్స్ అమ్ముతారు నల్లగా ఉండే పిక్కల్లాంటివి. పేపర్ గ్లాస్ లో వేసి ఒక టూత్ పిక్ పెట్టి ఇస్తారు. పిల్లలూ పెద్దలూ ఆ టూత్ పిక్ తో గుచ్చుకొని తింటారు. ఆ చుట్టుపక్కల ఒక వంద మీటర్ల విస్తీర్ణం లో కడుపు లో చేద వేసి తోడేసేట్టు భరించలేని వాసన వస్తుంది. అవేంటో, ఆ కంపు ఏమిటో అర్ధం అయ్యేది కాదు. ఒక రోజు మా‌ కొరియన్ మేనేజర్ ని అడిగాను అవేంటి అని.

"సిల్క్ వార్మ్స్" అన్నాడు కూల్ గా.

నేను : అంటే...?? పట్టు పురుగులా??

"పట్టు పురుగు...లార్వాలు" (తెలుగు ట్రాన్స్లేషన్)

నేను : "నువ్ కూడా తింటావా?"

"యెస్... అప్పుడప్పుడూ... హెల్త్ కి మంచిది.. కావాలా??"

నేను : ఆ.... నేను ఇందాకే లంచ్ చేసేశా. వద్దులే. (అంతకన్నా ఆ డిస్కషన్ పొడిగిస్తే బాగోదని ఆపేసాను )

గుండె ధైర్యం ఉన్నోళ్లు ఇక్కడ ఒక లుక్ వెయ్యొచ్చు

ఎప్పుడైన టీమ్ లంచ్ కి తీస్కెళితే‌ ఇండియన్‌‌ రెస్టారెంట్స్ కే తీస్కెళ్ళేవాళ్ళు. మేము ఎక్కడ ఇబ్బంది పడతామో అని ఆలోచించేవాళ్ళు. దాదాపు జనాలంతా చాలా ఫ్రెండ్లీ గానే ఉండేవాళ్ళు.

వీళ్ళు పని రాక్షసులు అని చెప్పాను కదా... ఒక‌ ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తాను.

ఆఫీస్ లావెటరీ లలో తలుపు కి‌ లోపలి వైపుల జావా ప్రోగ్రామింగ్ టిప్స్ అతికించేవారు. (ఏంటి... కింద పడి కొట్టుకుంటున్నారా... ఒక సోడా తాగి రండి)
ఉదా :
1. StringBuilder vs StringBuffer. ఏది ఫాస్ట్? దేనికి ఎంత టైం పడుతుందో ఒక టేబుల్
2. Null pointer exception ని ఎవాయిడ్ చెయ్యడం ఎలా??

వీటిని వారం వారం మారుస్తా ఉండేవాళ్ళు. లావెటరీ లో పొట్ట ఖాళీ అయ్యే పని లో ఉన్నప్పుడు, మెదడు ప్రశాంతం గా, జ్ఞాపకశక్తి ఎక్కువగానూ ఉంటుందని ఏ దిక్కుమాలిన యూనివర్సిటీ వాడో ప్రయోగం చేసి కనిపెట్టినట్టున్నాడు. బహుశా అది నిజమే కావొచ్చు నేను అక్కడ నేర్చుకున్నవి ఎప్పుడూ మరిచిపోలేదు‌. ట్రై చేసి చూడండి... కికికికిచివరిగా చెప్పేదేమంటే...
"ఇంట్లో ఉండండి...బయట తిరక్కండి"

17 comments:

సూర్య said...

టాయిలెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఇన్నోవేషన్ అండీ. నాకు ఏదైనా ప్రాబ్లెమ్ ని ఎలా సాల్వ్ చెయ్యాలా అని తట్టనపుడు టాయిలెట్ కి వెళ్లి కూర్చునేవాడిని. ఎదో ఒక ఐడియా తగిలేది. వెంటనే వెళ్లి(కడుక్కున్న తరువాతే అనుకోండి) టీమ్ కి వివరించే వాడిని. వాళ్ళెవరూ టాయిలెట్ కి వెళ్లకపోవడం వల్ల నా ఐడియాకే ఫిక్స్ అయిపోయేవారు.

నీహారిక said...

తంతే బూరెల బుట్టలో పడ్డట్టు మీరు బ్లాగుల్లో పడటం మా అదృష్టం. బోడి(కోడ్) ఉద్యోగం మానేసి సినిమాల్లో ట్రై చేయకూడదా ?

సూర్య said...

ఇంతకీ కిమ్చీ ని పెరుగన్నం లో నంచుకుని ఎప్పుడన్నా తిన్నారా?

రహ్మానుద్దీన్ షేక్ said...

మీ పోస్టు చదివితే ఫ్రీచైతన్య పారాయణ వాళ్ళు టాయిలెట్లనూ వదలకుండా కొమోడ్ మీద క్లాస్‌రూమ్ కాన్సెప్ట్ తో వస్తారు.

పచ్చి కోడి, అర పచ్చి కోడి, పూర్తిగా బొగ్గైన కోడి -- వీటి రుచులు పోల్చి వ్యత్యాసాలు రాస్తారనుకున్నా.

విన్నకోట నరసింహా రావు said...

ఈ సూర్య కొరియా బాపతో, చైనా జపాన్ బాపతో అయ్యుండచ్చని ఈ మధ్యనే ఒక బ్లాగ్ లో నా అంచనాతో కామెంట్ పెట్టాను. దానికి సూర్య అవుననలేదు, కాదనలేదనుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ “కిమ్చీ” (అసలు ఏమిటా పదార్థం?) మాట తీసుకొచ్చి కొరియా వాడినని తనే చెప్పినట్లవలా 😁😁? కరక్టేనా సూర్య గారు 🙂?

విన్నకోట నరసింహా రావు said...Toilt humour in a Chiranjeevi movie

Zilebi said...


డిటెక్టివ్ నరసన్న :)

సూర్య said...

 “కిమ్చీ” అనేది క్యాబేజీ లాంటి ఆకు కూరకు కారం కలిపి చేసేది. ఇంకా ఏమేం వేస్తారో తెలియదుగానీ మన పచ్చళ్లు దొరకనప్పుడు బదులుగా దానితో సరిపుచ్చుకోవచ్చు.
విన్నకోట వారూ నేను ఇండియావాడినే అండీ.
అసలే ఇప్పుడు ఎన్నారై అంటే రాళ్లిచ్చుకు కొట్టేలా ఉన్నారు.

bonagiri said...

నేను కొరియా వెళ్ళలేదు కాని, 2003లో ఇండియాలోనే కొరియన్స్‌తో పని చేసాను. అలహాబాదులో ఒక పెద్ద బ్రిడ్జి నిర్మాణానికి వాళ్ళు టీముతో వచ్చారు. సైటు దగ్గర కట్టిన గెస్టుహౌసులో ఉండేవారు. వాళ్ళూ కొరియా నుండి టిన్నుల్లో మాంసం తెచ్చుకునేవారు. కుక్క మాంసం వాళ్ళ ఫేవరిట్ అట. ఒకరోజు ఒక కొరియన్ ఈ రోజు నేను ఏమి తిన్నానో తెలుసా, పాము మాంసం తిన్నాను అన్నాడు. ఇన్నిరకాలు తింటారు కదా, మీకు అన్నింటికన్నా రుచికరమైనది ఏమిటి అని అడిగితే ఇలా చెప్పాడు. బతికి ఉన్న కోతిని తీసుకుని మనం కొబ్బరి బొండాం కొట్టినట్టు కోతి తల చెక్కి, దాని మెదడు తాగితే అద్భుతంగా ఉంటుందన్నాడు. నాకు వికారం వచ్చి, యు ఆర్ బార్బరిక్ అంటే అతనికి కోపం వచ్చింది. యు కెనాట్ సే లైక్ దట్, అది మాకు అలవాటు అన్నాడు.

Gayathri said...

Chaala rojulu tarvatha,kadu kadu.chaala samvatsaraala tarvatha malli mee blog lo kotha post.Hope you continue.

సూర్య said...

నేను నమ్మను. మరీ బ్రతికున్న కోతిని అలా తింటే జంతు ప్రేమికులు "మూతి కాలా ...ముకాబలా.."అని అటాక్ చెయ్యరూ?!

bonagiri said...

ఏమో, అతను చెప్పిందే నేను రాసాను. వీలైతే ఎవరైనా కొరియన్ ని అడిగి confirm చేసుకోండి.

సూర్య said...

రోజర్ మూర్ నటించిన జేమ్స్ బాండ్ సినిమా octopussy లో ఈ అలాంటి సీన్ ఉన్నట్లు గుర్తు. అంటే తల చెక్కడం చూపలేదు గాని మెదడు తాగుతున్నట్లు చూపించినట్లున్నాడు.

Pavan Kumar Reddy Rendeddula said...

మీరు సీనియర్ బ్లాగర్ అని అర్థం అయింది మీ బ్లాగ్ హిస్టరీ చూస్తే. అలా ఆపేయకుండా ఇలా నవ్వించే పోస్టులు రాస్తూ మమ్మల్ని నవ్విస్తూ ఉండండి రాజ్ గారు ప్లీజ్.

రాజ్ కుమార్ said...

@సూర్య గారూ... మీరు సూపర్ సార్. దీనికోసం కొంతమంది సిగరెట్టు కోసం పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ ట్రిక్ తెలీక :)
కించీ ట్రై చేశాను గానీ.. ఆ పచ్చి కూరగాయల కారం మనకి ఎక్కడ ఎక్కుద్దండి?

@ నీహారిక గారూ.. బాగున్నారా? సినిమాల్లో కుమ్మేద్దామని మహా మహా పండితులే వెళ్ళి పాట్లు పడుతున్నారు. ఏదో నాలుగు లైన్లు రాస్కుని పోస్ట్ వేస్కునే నాకెందుకొచ్చింది చెప్పండి.?

@ రెహమానూ.. ఆ అరకోడి, పచ్చి కోడి ల గురించి ఓక మినీ పోస్టు రాస్కోవ్చ్చు. :)


@విన్నకోట నరసిమ్హారావు గారు , కించీ అంటే పహ్చి ఆకు కూరలు, వెల్లుల్లి , ఉప్పుకారం, వేసి ఎర్ర ఎర్రగా చూడ్డానికి బాగుంటుంది. ఒక కొరియన్ వంటకం. సూర్య గారికీ, మీకూ ముందే పరిచయం ఉందని అనుకుంటున్నాను. :)


@జిలేబీ గారూ.. అర్ధం కాలేదండీ ;)

@బోనగిరి గారూ.. ఆ కోతి మెదడు, కుక్క కూర కొన్ని దేశాల్లో ఉందని విన్నాను. బట్ కొరియా లో అంత పాపులర్ అని అనుకోను. నాకైతె ఎవరూ తగల్లేదు మరి. కొన్ని కథల్లో చదివాను.

@గాయత్రి గారూ.. అవునండీ చలా సంవత్సరాల తర్వాతే.. ధన్యవాదాలు అండీ

@పవన్ కుమార్ గారూ.. సీనియర్ బ్లాగర్ అంటే మరీ అంత కాదులెండి. కానీ ఓ ఆరేళ్ల క్రితం బాల బ్లాగర్ ని. బ్లాగులు రాసింది తక్కువ చదివింది ఎక్కువ. ధన్యవాదాలు


Lalitha said...

"i know people కాదు.. Eye No people అనగా కళ్ళు లేని వారు.
ఇయర్ నో పీపుల్ = Ear No people అనగా చెవులు వినిపించని వారు."

భలే translations :))

సూర్య said...

మీకు కించీ రుచి తెలియాలంటే ఇలా చెయ్యండి. ఒక రోజంతా కరోనామాత పేరిట ఉపవాసం ఉండండి. నీళ్ళు తాగొచ్చు (కానీ నీటిలో ఆక్సిజన్ కలిసి ఉండకూడదు)!
ఇక మరుసటి రోజు వేడి వేడిగా అన్నం వండి పెరుగు కలపండి. దానిమీద కించీ వేసుకు తినండి.
అప్పుడు ఖచ్చితంగా మీకు కించీ రుచి తెలుస్తుంది.

బ్లాగుల్లో అందరూ పరిచయస్థులే సార్! విన్నకోటవారు జేమ్స్ బాండ్ లా నా మీద నిఘా వేస్తున్నారు!