Wednesday, June 22, 2011

పునాది రాళ్ళు


పునాది రాళ్ళు పడ్డాయి.
చిరునవ్వుల చిన్నారుల బంగారు భవితకి...
మీకు మేమున్నాం అని భరోసా ఇవ్వడానికి...
సంస్కారం గల మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది ఈ సమాజానికి అందివ్వడానికి..
ఒక మంచి పనికోసం సొమ్మునీ, సమయాన్నీ వెచ్చించిన దాతలు పెట్టుకున్న నమ్మకానికీ...
తనతో పాటూ తన చుట్టూ ఉన్నవారిని సేవా ప్రపంచం లో తీసుకెళదామన్న మంచి మనసున్న  ఒక మామూలు వ్యక్తి యొక్క గొప్ప ఆశయానికి……. పునాదిరాళ్ళు పడ్డాయి.



గత సంవత్సరం నవంబరు లో జీవని ని మొదటిసారి విజిట్ చెయ్యడానికి వెళ్ళాం. అప్పటికి పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు జీవని సంరక్షణ లో.   వచ్చే సంవత్సరానికల్లా వంద మంది  పిల్లలకి మంచి
విద్యనీ, వసతినీ ఏర్పాటు చెయ్యడానికి జరుగుతున్న ప్రయత్నాలనీ, అవరోధాలనీ  ప్రసాద్ గారు వివరించారు. అసాధ్యం కాకపోయినా అనుకున్నంత సులభం కాదు కదా...మరి!
వాటన్నిటినీ అధిగమించీ జీవని విద్యాలయానికి శంఖుస్థాపన చేసే రోజు రానే వచ్చింది జూన్-19-2011 న.



అదృష్టవశాత్తూ ఈ సంధర్భంగా పూజ్యులు శ్రీ చిలమకూరు విజయమోహన్ గారినీ, స్నేహితులు ఒంగోలు శ్రీను గారినీ, తెలుగు బ్లాగ్స్ రీడర్ అయిన చంద్రశేఖర్ గారినీ మొదటిసారి కలవటం జరిగిందీసారి. ముఖ్య అతిధి గా విచ్చేసిన శ్రీ మాంచూ ఫెఱర్ గారు, జీవని స్వచ్చంద సంస్థ కి వెన్నుదన్ను గా నిలిచి ప్రసాద్ గారికి తన సహాయ సహకారాలు అందిస్తున్న SRIT కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ సాంబ శివారెడ్డి గారూ, మానసిక విశ్లేషకులు ఆకెళ్ళ రాఘవేంద్రగారూ,
తెలుగు బ్లాగర్ల తరుపున తన గొంతు వినిపించిన శ్రీ ఒంగోలు శ్రీను గార్లు చెప్పిన నాలుగు మంచి మాటల్ని వినే అదృష్టం దక్కింది.

జీవని ప్రసాద్ గారు మాట్లాడుతూ.. " మీ చుట్టూ ఉన్నవాళ్లలో సహాయం కోసం ఎంతో మంది చూస్తూ ఉంటారు. మీ టైం లో 1% , మీ డబ్బు లో 1% వారికి కేటాయించండి చాలు " అన్నారు.
 1% నా? నేనిచ్చే 100 రూపాయలు జీవితాల్ని నిలబెడతాయా? అని అనుకుంటున్నారా నాలాగా? అవును నిలబెడతాయి. నా లాంటి వాళ్ళు 100 మంది ఏకమయితే ఖచ్చితం గా నిలబెడతాయి.  జీవని విషయం లో జరిగింది అదే.
ఒక్కరి ఆలోచన కొందరి ఆచరణ గా మారి మనందరినీ తమలో కలుపుకుపోతూ మహా వృక్షమయి నీడనిస్తుందీ.

ఈ బృహత్కార్యం లో తమ కాలేజ్ ఫ్యాకల్టీనీ, విద్యార్ధులనూ భాగస్వాములుగా చేసిన సాంబ శివారెడ్డి గారు మాట్లాడుతూ "ఆర్ధిక సహాయం చెయ్యడానికి చాలా మంది ఉన్నారు.  మీ సమయం లో 1% మాత్రం ఇవ్వండీ చాలు . సంవత్సరంలో ఒక్క రోజు లో కొన్ని గంటలు ఆ పిల్లలతో గడిపి వెళ్ళండీ. మాకోసం చాలా మంది ఉన్నారూ.. మేము ఒంటరి వాళ్ళం కాము అనే ఫీలింగ్ ని కలిగించండీ " అని.
నిజమే కదా..! ఎంతయినా డబ్బుకన్నా విలువయినది కదండీ కాలం.!

RDT ద్వారా అనంతపురం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మాంచూ ఫెఱర్ గారి ఉపన్యాసం నాకు చాలా చాలా నచ్చింది. ఆయన స్టేజ్ మీద కూర్చొని వక్తలు మాట్లాడుతున్నప్పుడూ చిరునవ్వులు నవ్వుతూ ఉంటే
"ఇతనికి ఏమ్ అర్ధమవుతుందబ్బా?" అనుకున్నా..!
మైక్ తీసుకొని "సభ కు నమస్కారం" అనగానే ఈ ఒక్క ముక్కా నేర్చుకొచ్చుంటారు అనుకున్నా..! (ఇంగ్లీష్ లోనో, స్పానిష్ లో మాట్లాడతారని నా స్ట్రాంగ్ ఫీలింగ్).
ఆ తరవాత సీమయాస లో తప్పులు లేని తెలుగు లో సాగిన ఆ ప్రసంగానికి నోరుతెరచి చూస్తూ ఉండి పోయాను. ఆయన తెలుగు లో మాట్లాడినందుకే గాదు.. ఆయన చెప్పిన విషయాలు విని. (వీడియో మిస్సవ్వద్దేం..! :-)  )



పిల్లల్నందరినీ అందరికీ పరిచయం చేస్తున్నప్పుడూ ఒక పిల్లాడు అన్నాడు " అమ్మా,నాన్న లేరని నాకు బాధ లేదు.. మీరంతా మా కోసం ఉన్నారు కాబట్టీ " అని. ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలీలేదు నాకు.. మీకో??



ఇప్పుడు ఒక కేకలాంటి సంగతి చెప్తా..

ఎవరి పేరు చెప్తే ఒంగోలు మొత్తం ఒళ్ళు విరుచుకుంటుందో..
ఎవరి పేరు చెప్తే కయ్యానికి కాలు దువ్వేవాళ్ల కాళ్ళు వణుకుతాయో..
ఎవరు పోస్ట్ వేస్తే బజ్ లో కామెంట్ల బాక్స్ డిజేబుల్ అవుతుందో..
అతనేనండీ అతనే.. మేమంతా శీనన్నా అని పిలుచుకునే ఒంగోలు శ్రీను అలియాస్ వికటకవి అలియాస్ ఎవర్ గ్రీన్ బాస్. ;) స్టేజెక్కిన తెలుగు బ్లాగర్ల ఖ్యాతి ని చూస్కోండీ ఈ కింద వీడియో ల్లో.. (ఇది అస్సలు మిస్సవ్వద్దూ.. ;)  )





సాయంత్రం పిల్లలతో గడిపిన క్షణాలూ, కొత్తగా చేరిన పిల్లల పరిచయాలు, కమెంట్ బాక్స్ లలో మాత్రమే కనిపించిన స్నేహితులు కళ్ళెదురుగా రావటంతో పడిన ప్రయాసలన్నీ మరిచిపోయి మాట్లాడుకున్న మాటలూ, చిందించిన నవ్వులూ ఎప్పటికీ మరిచిపోలేను. 2011 లో మరిచిపోలేని రోజు నాకు.

   

ఈ కార్యక్రమం గురించి వివరంగా ఇప్పటికే శ్రీ చిలమకూరు విజయమోహన్ గారు రాసి ఉన్నారు. 
ఇక్కడ  చూడండీ.
మరిన్ని ఫొటోలకోసం ఇక్కడ చూడండీ..

19 comments:

గిరీష్ said...

ఈ ప్రపంచంలో పిల్లలనే దేవునితో సమానంగ భావిస్తారు.. అలాంటి పిల్లలని అనాధలుగ చూసే దౌర్భాగ్యం మన మనుషులకి పట్టింది.. May God belss for Jeevani.
Nice post Raj..

karthik said...

good post raj

ఆ.సౌమ్య said...

బావుంది రాజ్ కుమారా....ముందుగా ప్రసాద్ గారికి అభినందనలు. మీరంతా అక్కడకి వెళ్ళి ఆ బృహత్కార్యంలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ పిల్లవాడి మాటలు గుండెని మెలిపెట్టాయి. మాంచూ గారి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం గా ఉన్నాయి. ఇంక శ్రీనూ ఇరగ...మామూలుగా కాదు నూనె పోసిన స్టీల్ రాడ్డుని ఇరగదీసినట్టు ఇరగదీసారు. :))

మనసు పలికే said...

రాజ్.. ఏంటో మాటలు రావట్లేదు.. ఆంధ్రప్రదేశ్ లోనే ఉండి కూడా రాగలిగే అవకాశాన్ని మిస్ చేసుకున్నాను. అటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనాలంటే అదృష్టం కూడా ఉండాలి. జీవని ప్రసాద్ గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువేనేమో కదూ.. వారి గురించి చదువుతుంటేనే నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మీరంతా అక్కడికెళ్లి, అంత మంచి పనిలో మీరు కూడా పాల్గొని.. చాలా గ్రేట్ రాజ్..
జీవని ప్రసాద్ గారి కల ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా నిజమవ్వాలని మనస్పూర్తిగా దేవుడిని ప్రార్థిస్తాను.. ఈ పునాది రాళ్లు మున్ముందు ఎందరో చిన్నారుల జీవితాలని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా..

నేస్తం said...

చాలా మంచిపోస్ట్ రాజ్ ..అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ఎప్పుడూ మంచి జరుగుతుంది

శశి కళ said...

రాజ్ ఇలాన్తి మన్చి పనులు కూదా చేస్థుంటారా.VERY GOOD BOY.

Sravya V said...

మీ అందరికి అభినందనలు రాజ్కుమార్ గారు .
శ్రీనివాస్ బాగా మాట్లాడారు !

మురళి said...

Congratulations..

jeevani said...

మిత్రుల స్పందనలకు ధన్యవాదాలు. అయితే నేను మా సభ్యులకు చెప్పేది + నేను పూర్తిగా నమ్మేది ఒకటే. ఇదంతా నా అదృష్టం. సేవ చేసే భాగ్యం పిల్లలు, దాతలు నాకు / మాకు కల్పిస్తున్నారు. పిల్లలు లేని కారణంగా ఒక పాపను దత్తత తీసుకున్న నాకు, జీవిత కాలంలో వందలాది మంది పిల్లలు నా పిల్లలే అవుతారు. ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నందుకు నేనే పిల్లలకు దాతలకు రుణపడి ఉంటాను.

kiran said...

రాజ్ -- touching post ..!!
ఈ సారి అనంతపూర్ వెళ్తే తప్పకుండా జీవని కి ఓ సారి వెళ్తాను...!!
జీవని team ki అభినందనలు

హరే కృష్ణ said...

అక్కడ కి వెళ్లి చూసిన ఫీలింగ్ కలుగుతోంది..ఫొటో blog pics కూడా బావున్నాయి
ఎంతో మందికి విద్యాదానం తో పాటు తల్లి తండ్రి అన్నీ అయి నడిపిస్తున్న జీవని కి హృదయపూర్వక అభినందనలు

చిలమకూరు విజయమోహన్ said...

చాలా చక్కగా చెప్పావు రాజ్! అభినందనలు.మాంచూ పెర్రర్‍గారి ఉపస్యాసం తెలుగు భాషాభిమానులకు స్పూర్థిదాయకం.ఒక్క ముక్క కూడా ఆంగ్లం మాట్లాడకుండా చాలా గొప్ప విషయంకదా!

బులుసు సుబ్రహ్మణ్యం said...

జీవని వ్యవస్థాపకులకు, ప్రోత్సహిస్తున్న అందరికీ శుభాభినందనలు.

ఇందు said...

వావ్! రాజ్ చాలా బాగా రాసారు! ఇంకా శ్రీను గారి మాటలు...ఫెర్రర్ గారి ఉపన్యాసం..బాగుంది :) మంచి పనికి చేస్తున్న సహాయం,అందుకు వస్తున్న స్పందన అద్భుతం :) జీవని ఇలా దినదినాభివృధ్ధి చెందుతూ పిల్లలకి ఆశాజ్యోతిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నా! :)

రాజ్ కుమార్ said...

స్పందించిన మరియూ అభినందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగా రాశావు రాజ్.. హరే చెప్పినట్లు మేం కూడా అక్కడికి వచ్చి చూసినట్లు అనిపించింది. వీడియోలు ఫోటోలు శ్రద్దగా తీసి ఇక్కడ మాతో పంచుకున్నందుకు నెనర్లు. అక్కడికి వెళ్ళిన మీ అందరికీ అభినందనలు మరియూ శుభాశీస్సులు. ఇక ముందు కూడా జీవని వారి ప్రయాణం సాఫీగా విజయవంతంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను.

కొత్తావకాయ said...

చాలా బాగుంది రాజ్ కుమార్ గారూ, మంచి విషయం, మంచి సమావేశపు కబుర్లు, మంచి ఫొటోలు, వీడియోలు,.. వెరసి చదివిన వారి మనసులో కూడా మంచి ఆలోచనలు పుట్టి ఆచరణలోకి వస్తాయని ఆశిద్దాం. :)

రత్న మాల said...

బాగా రాసారు .మీరు ఇంకా మంచి పనులు చేయాలనీ కోరుకుంటున్నాను .

రాజ్ కుమార్ said...

వేణూ శ్రీకాంత్ గారూ, రత్నమాల గారూ, కొత్తావకాయ గారూ.. ధన్యవాదాలు