Monday, November 5, 2012

ఇది కధ కాదు 2 : అగ్గి "రాజు"కుంది




(మొదటి భాగం ఇక్కడ చూడండి).
 
"న్యం లో గిరిజన పోరాటాలని రగిలించి స్వాతంత్ర పోరాట చైతన్యాన్ని దీప్తివంతం చేసిన ఇరవై ఏడేళ్ల బ్రహ్మచారి.

తాను ముముక్షువు గా జీవిస్తూనే, దేశమాత దాస్య శృంఖలాలను తెంచి, స్వాతంత్ర సాధన కొరకు మన్యసీమని వేదికాగా చేసుకొని మహోద్యమం నడిపిన దేశ భక్తుడు.
అల్లూరి సీతారామ రాజు గా పిలవబడిన శ్రీ రామరాజు.

శ్రీ వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకి 1897 జూలై 4 న పాండ్రంగి లో జన్మించిన రామరాజు పసిప్రాయం మోగల్లులో గడించింది. రాజమండ్రీ,రామచంద్రాపురం,విశాఖపట్నం,నరసాపురం, కాకినాడ లలో అతుకుల బొంతగా సాగింది రామరాజు చదువు.అయితే ఆయన చదువుకున్న ప్రతీ చోటా వినిపించిన మాట "వందేమాతరం". కాకినాడలో చదివేటపుడు తన ఎదురుగా "వందేమాతరం" అన్నందుకు "కృష్ణారావు" అనే విద్యార్ధిని, బ్రిటిష్ అధికారి "కెప్టెన్ కెంప్" కొట్టి చంపేసిన ఘటన గురించి తెలుసుకున్నాడు. ఒక నిండు గర్భిణి ని తన్ని, ఆమె మరణానికి కారణమైన ఒక బ్రిటిష్ పోలీసు పైశాచికత్వాన్ని గురించి విన్నాడు."వందేమాతరం" అని అరిస్తే చదువులు ఆగిపోతున్నాయ్. ఉద్యోగాలు ఊడిపోతున్నాయ్.ఇవన్నీ రామరాజు లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆలోచనలు నాటాయి. మొదటి నుండీ బ్రిటిష్ పాలన, వాళ్ల సంస్కృతి, చదువుల పట్ల అయిష్టతని పెంచుకున్న రామరాజు "తుని" లో సంస్కృతాంధ్రాలూ,జ్యోతీష్యశాస్త్రం, యోగవిద్య, గుర్రపుస్వారీ, విలువిద్య అభ్యసించాడు.



(విద్యార్ధి గా ఉన్నప్పుడు అల్లూరి శ్రీరామరాజు)

విద్యార్ధి దశ నుండీ "వందేమాతరం" అన్న మాటనీ, వెనుక ఉన్న ఉద్దేశ్యాన్నీ అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మన్యం లోని పరిస్థితులు ఆయన అన్వేషణ కి ఆఖరి మజిలీ అయ్యాయి.

మన్యం గ్రామాల్లోని ప్రజలూ, ముఖ్యంగా కొండజాతి ప్రజలూ అడవినే నమ్ముకున్న వాళ్ళు. తినే తిండీ, వాడే మందూ, ఉండే చోటు, దున్నే భూమీ అన్నీ అడవి తల్లి ప్రసాదించినవే. అడవి తప్ప వారికి వేరే ప్రపంచం తెలీదు.
 రాజులు రాజ్యం చేసినా, జమీందార్లు మారినా, అడవిని, ఆ అమాయక ప్రజలకి దూరం చెయ్యాలనీ, ఆంక్షలు పెట్టాలనీ, వాళ్ల హక్కులని ప్రశ్నించాలనీ ఎవ్వరూ ప్రయత్నం చెయ్యలేదు. ఆ ఆలోచన మొట్టమొదట చేసింది బ్రిటిష్ వాడే. అటవీ చట్టాలు చేశారు. అడవిని సర్వే చేశారు.  ముక్కలు గా విడగొట్టారు. ఆ ముక్కలపై సుంకాలు విధించారు. ఒక్కో భూభాగానికీ ఒక ముఠాదారీ వ్యవస్థని ఏర్పాటు చేశారు. తరతరాలు గా తిండి గింజలు పండిస్తున్న తన భూమిని దున్నుతున్నందుకు ప్రభుత్వానికి పన్ను కట్టాలి. కొండల్నీ, అడవులనీ చదును చేసి పంటల్ని పండించే "పోడు వ్యవసాయం" చెయ్యకూడదు. అడవిలో చెట్టు కొట్టకూడదు. రిజర్వ్డ్ ఫారెస్ట్ లోకి ఏ గిరిపుత్రుడూ ప్రవేశించకూడదు. పశువులని మేపకూడదు. తేనే, మందులూ, మాంసం వంటి ఎటువంటి వస్తువ ప్రభుత్వ అనుమతి లేకుండా, పన్ను కట్టకుండా అడవి నుండి  తెచ్చుకోకూడదు. అంటే అడవిలోనే పుట్టీ, పెరిగీ, ఆ మట్టి లోనే కలిసిపోయే అడవి బిడ్డలకి ప్రకృతి సంపద మీద ఉన్న హక్కు లాక్కోబడింది.  ఈ చట్టాలన్నీ కఠినంగా అమలు చెయ్యడం మొదలెట్టింది ప్రభుత్వం. కొత్తగా వచ్చిన ఈ చట్టాలు గిరిజనుల చేత ఆకలి కేకలు పెట్టించాయ్.

ఇలా అయితే ప్రజలెలా బ్రతకాలీ? దీనికి సమాధానం గా తెల్లవాళ్ల దగ్గర గొప్ప ఆలోచన ఉంది. మన సంపదని మనం అనుభవించకూడదు గానీ వాళ్ళు దోచుకోవచ్చు. అది తరలించడానికి  రోడ్లు కావాలి. అవి కావాలంటే వెట్టి చాకిరీ చెయ్యడానికి మనుషులు కావాలి. రోడ్లు వేసే పనిలో చేరి కూలి తీసుకొని బతకాలి. అయితే అది పని చేసేవాడి ఇష్టం కాదు. బలవంతం. శ్రోపిడీ. "రాను.. చెయ్యను" అని చెప్పే ధైర్యం లేదు. "చెయ్యలేను" అని చెప్పే అవకాశం లేదు. ఎదిరించిన వాడికి దారుణమయిన శిక్షలు.ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా ఒంటిని చీరేసే కొరడా దెబ్బలు.

ఇవన్నీ ప్రభుత్వ ఆజ్ఞలకి, చట్టాలకీ అనుగుణంగా జరుగుతున్న అరాచకాలు. ప్రజలు భరించారు. అయితే అధికారం చేతిలో ఉన్న తహశీల్దారులు, అడిగే వాడు లేడని ఎగిరే బ్రిటిష్ అధికారులు,పోలీసులు, మరిన్ని  అరాచకాలకి పాల్పడ్డారు. వారిలో ముఖ్యుడు, పరమ క్రూరుడూ అయిన ఆ గూడెం డిప్యూటీ తహశీల్దార్ మరియూ రోడ్ కాంట్రాక్టర్ అయిన "బాస్టియన్". బ్రిటిష్ ప్రభుత్వం కూలీ 6 అణాలుగా నిర్ణయిస్తే, 2 అణాలు మొహాన కొట్టి పొమ్మనే వాడు. "ఇది అన్యాయం" అని ఎదురుతిరిగిన మగాళ్లని తన గుర్రానికి కట్టి చనిపోయిన జంతువులని లాగినట్టూ లాగీ, తలక్రిందులుగా వ్రేలాడదీసి, ఆసనం లో సీమ మిరపకాయల ముద్ద కూరుతున్న దారుణాలు. ఆడవాళ్ల వక్షాలపై మిరపకాయల ముద్ద రాస్తున్న ఘోరాలు.  చెట్లకింద పడుకోబెట్టిన చంటిపిల్లలు ఆకలితో ఏడుస్తుంటే వాళ్లకి పాలిచ్చే అవకాశం కూడా పనిచేసే ఆ తల్లులకి ఉండేది కాదు. మన్యం జాతి స్త్రీల దగ్గర వ్యభిచారం కుదరదు. కచ్చితమైన కట్టుబాట్లు ఉంటాయ్ వారికి. కానీ అది ఈ రాక్షసులకి అర్ధం కాదు. వాళ్ళ దృష్టిలో కొండజాతి వాళ్ళంటే అనాగరికులు. పద్దతీ పాడూ లేని వాళ్ళు. వాళ్లని ఎంత హీనంగా అయినా చూడొచ్చు. ఏమయినా చెయ్యొచ్చు. ఒక కత్తికున్న పదును ని ఒక ఇండియన్ తలని మొండెం నుండి ఒక్క వేటుతో దూరం చెయ్యడం ద్వారా దృఢపరచుకున్నారు. తమ భుజబలాన్ని ఒక పసికందు కాళ్ళు పట్టుకొని చీల్చెయ్యడం ద్వారా బేరీజు వేసుకున్నారు. ఇలాంటి దారుణాలు ఎన్నో...ఎన్నెన్నో. పోలీసులు వస్తున్నారంటే మగవాళ్లు ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటే, స్త్రీలు మానరక్షణ కోసం పిచ్చిదాని లాగానో, రోగిష్టి లాగానో నటించాల్సి వస్తున్న భయంకరమైన రోజులు.  [ఈ ఘటనలన్నిటికీ ప్రత్యక్ష మూగ సాక్షి అయిన అప్పటి ప్రభుత్వ వైద్యుడు అయిన తేతలి సత్యనారాయణ గారు తన డైరీ లో రాసుకొన్నారు]

అయితే ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా ఎవ్వరూ తిరగబడ లేదా?? అనే ప్రశ్న సహజం.
ఎందుకు లేదూ? కొడితే పడి ఉండడానికి వాళ్ళు గర్జించడం మరిచిపోయిన సర్కస్ సింహాలు కాదు. అడవి బిడ్డలు. ప్రాణం మీదకి వస్తే పిల్లి కూడా పులవుతుంది. గురిచూసి కొట్టడం, వేటాడటం,కౄర జంతువుల మధ్య తిరగడం,వాళ్ల జీవితం లో ఒక భాగం. తిరుగుబాట్లు జరిగాయ్. అయితే అవన్నీ అత్యంత కిరాతకం గా అణచివేయబడ్డాయి.అన్నీ ఉద్యమం పేరుతో ప్రజలకి కొత్తకష్టాలు తెచ్చేవే గానీ, ధైర్యాన్నిచ్చేవి కావు. వాటికి కారణాలు అనేకం. 

"నా వాళ్ళు" అనుకున్న వాళ్లకి అన్యాయం జరుగుతుంటే జాలిపడే వాళ్ళూ, బాధ పడేవాళ్ళూ చాలామంది ఉంటారు.
కోపంతో రగిలిపోయి ఆ అన్యాయాన్ని ఆపాలని అనుకునే ఆవేశపరులు కొంతమందే ఉంటారు.
ఆ కొంతమందినీ కూడగట్టి ఒక శక్తిగా నిలబెట్టి దుర్మార్గులను మట్టుబెట్టే వాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. చరిత్రలో నిలిచిపోతాడు.
ఆ ఒక్కడూ ఇప్పుడు కావాలి.
ఆ అడవి బిడ్డల ఆవేశాన్ని ఆశయ సాధన కోసం ఉపయోగించగల తెలివి కావాలి.
వారి లోపాలని సరి చేయగల శక్తి కావాలి.
బలమైన శత్రువు ని ఎదుర్కొనే యుక్తి కావాలి.
వారి ఆక్రోశాన్ని అర్ధం చేసుకోగల ప్రతినిధి కావాలి.
మన్యం మట్టిని శిరస్సున ధరించగల మనిషి కావాలి.
మన్య గ్రామాలన్నిటినీ ఒక త్రాటి పైకి తేగల నేత కావాలి.
నడిపించగల నాయకుడు కావాలి.
బ్రిటిష్ వారి ముఠాదారీ విధానం తో వీధిన పడ్డ కంకిపాటీ బాలయ్య పడాలు, గాం గంటందొర, గాం మల్లుదొర, బొంకుల మోదిగాడు, గోకిరి ఎఱేసు మొదలైన గిరిజన నాయకులు, కొండజనాన్ని కాపాడగల ఆ నాయకుడు "శ్రీ రామరాజు" మాత్రమే అని నమ్మారు. ఈ పరిస్థితులన్నిటినీ రామరాజు కి ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉన్నారు.  భారత దేశ మంతా గాంధీజీ సహాయనిరాకరణోద్యమం తీవ్రతరమౌతున్న ఆ రోజుల్లో అదే సహాయనిరాకరణని మన్యం లో చేయడానికి  రామరాజు సంకల్పించారు. ఒక మహా ఉద్యమానికి బీజం పడింది. 

కుల వ్యవస్థలూ, ఉన్నవాడు లేని వాడిని దోచుకోడాలూ, నీచంగా చూడటాలూ,అగ్రకులం, నిమ్నకులం మొదలైనవి ఎక్కడయినా ఉండేవే. మన్యం దానికి మినహాయింపు కాదు. మన్యం ప్రజల్లో బగతలు, కొండదొర,కొండకాపు,గదబలు, వాల్మీకులూ, ఖోదులు మొదలైన కులాలూ, వాటి మధ్య పేద, ధనిక అంతరాలు, అంటరానితనాలూ ఉన్నాయ్. ఎన్ని అంతరాలున్నా అందరికీ ఉన్న ఒక ఉమ్మడి వ్యసనం -తాగుడు. 
జీలుగ కల్లు, తాటికల్లు, మద్యాలకి అంతులేదు అక్కడ. ఎవరికి ఎక్కువ "జీలుగ చెట్లు" ఉంటే వారే ధనవంతులక్కడ. 
ఐకమత్యం లేని ప్రతిఘటన ఎంత సేపు నిలబడుతుందీ? వ్యసనాల్లో మునిగిన వారు గొప్ప ఆశయాన్ని ఎలా సాధించగలరు??  
రామరాజు మొదట తన దృష్టి కేంద్రీకరించింది ఈ విషయాల మీదనే.
ఒక శక్తివంతమైన నిరసన ని తెలియజెయ్యాలంటే ముందు ఆ అంతరాలని తొలగించాలి.  ఈ దుర్వ్యసనాలని దూరం చెయ్యాలి.  
శ్రీ రామరాజు జీలుగ చెట్లని కొట్టెయ్యమనీ, గిరిజన తెగల మధ్య గల అంతరాలని మరిచిపొమ్మనీ, డబ్బు ఇవ్వని పని కోసం ఎవ్వరి దగ్గరకీ వెళ్ళొద్దనీ, పోలీసులని కలసి కట్టుగా ఎదిరించమనీ ఉద్భోదించాడు.
తన అధ్యక్షతన "పంచాయితీ పాలన" ని  ప్రవేశ పెట్టాడు. ఏ తగాదా అయినా ప్రభుత్వం కోర్టులో కాకుండా పంచాయితీ లోనే పరిష్కరించుకోవాలన్నాడు.

ఒక్క మనిషి చెప్పిన మాట విని అన్ని గ్రామాల ప్రజలు తరతరాలుగా తమలో జీర్ణించుకుపోయిన అలవాట్లనీ, ఆచారాలనీ,అంతరాలనీ వదిలేశారా??? అతని రూపం లో అంతటి ఆకర్షణ ఉందా? అతని మాటల్లో అంతటి శక్తి ఉందా? అతని వ్యక్తిత్వం లో అంతటి గొప్పతనం ఉందా? అని అడిగితే.....

అవును... శ్రీ రామరాజు అంటే.. సాక్షాత్తూ భద్రాద్రి రాముడి అవతారం గిరిజన ప్రజల్లో.. ఆ మాటకి తిరుగులేదు.
జీలుగ చెట్లు కూలుతున్నాయ్..
గొడవలు పంచాయితీకే వస్తున్నాయ్...
186 గ్రామాలు ఒక్కటయ్యాయ్... 
పోలీసుల కి ఎదురు చెప్తూ గొంతెత్తుతున్నాయ్...

అల్లూరి శ్రీ రామరాజు నేతృత్వం లో ఉద్యమం లేచిందన్న వార్త గుప్పుమంది. ప్రభుత్వానికి ఉప్పందింది. కృష్ణదేవీ పేటలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహారాలు నడుపుతున్నాడన్న కారణం గా 1922 జనవరి 29 న పోలీస్ కమిషినర్ "స్వెయిన్" రాజుని అదుపు లోకి తీసుకొని విచారణ జరిపాడు.తాను అధ్యాత్మిక విషయాలు మాత్రమే బోధిస్తున్నాననీ, ప్రజల ఆరోగ్యం కోసం మాత్రమే కల్లు/మద్యం మానివేయమన్నాననీ, సహాయనిరాకరణ గురించి ఉద్భోధించలేదనీ రామరాజు చెప్పినాగానీ, పోలీసులు ఆయన్ని కస్టడీ లోకి తీసుకొని నర్సీపట్నం లో ఉంచారు. 16 రోజుల తర్వాత రామరాజు ని విడుదల చేసినా, అతని ప్రతీ కదలిక మీదా పోలీసులు కన్నేసుంచారు.
రోజూ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి రావడం రాజు దిన చర్యలో భాగమయ్యింది. పోలీసులతో గౌరవంగా వ్యవహరించేవాడు. ఎవ్వరితోనూ ఎటువంటి గొడవల్లోనూ కల్పించుకోలేదు. ఈ కారణం తో అతని మీద మంచి రిపోర్ట్ తయారయ్యింది. 
"నేపాల్ ఆధ్యాత్మిక యాత్ర" చెయ్యడానికి వినతి పత్రం సమర్పించి, ప్రభుత్వం నుండి అనుమతి తెచ్చుకున్నాడు. 
తన తల్లినీ, తమ్ముడినీ ఎడ్లబండి మీద నరసాపురం ప్రయాణం చేయించి, తాను గుర్రం మీద అనుసరిస్తూ కృష్ణదేవీపేట పొలిమేరలు స్వయం గా దాటించాడు.

మన్యం ప్రజలు తమ ఆశాజ్యోతి అనుకున్న శ్రీరామరాజు ఇంత పిరికితనం గా ఎందుకు మసలుతున్నాడు?
పోలీసులకి బెదిరి, తనని నమ్మిన జనాన్ని వదిలి నేపాల్ పారిపోతున్నాడా?
అసలతని ఆలోచన ఏంటీ?? వ్యూహం ఏంటీ? 

సింహం వెనక్కి అడుగు వేసేది పంజా విసరడానికే.....!


 (అల్లూరి శ్రీరామరాజు గారి ఒరిజినల్ ఫోటో ఆధారంగా గీసిన పెయింటింగ్)


11 comments:

పల్లా కొండల రావు said...

బాగుంది. నిజంగానే అగ్గి రాజుకుంది. చదివేవారికీ రాజేస్తున్నావు. నీ కోసం వ్రాసుకున్న పోస్టుతో నీ బ్లాగును ఫాలో అవుతున్నాను. ఇపుడు అందరికోసం..... ఇప్పటి జనాలందరికోసం అవసరమైన సబ్జెక్ట్ చక్కగా వ్రాస్తున్నందుకు అభినందనలు.

ఈ పోస్టులో కీలక వాక్యాలివి :

"మన్యం గ్రామాల్లోని ప్రజలూ, ముఖ్యంగా కొండజాతి ప్రజలూ అడవినే నమ్ముకున్న వాళ్ళు. తినే తిండీ, వాడే మందూ, ఉండే చోటు, దున్నే భూమీ అన్నీ అడవి తల్లి ప్రసాదించినవే. అడవి తప్ప వారికి వేరే ప్రపంచం తెలీదు.
రాజులు రాజ్యం చేసినా, జమీందార్లు మారినా, అడవిని, ఆ అమాయక ప్రజలకి దూరం చెయ్యాలనీ, ఆంక్షలు పెట్టాలనీ, వాళ్ల హక్కులని ప్రశ్నించాలనీ ఎవ్వరూ ప్రయత్నం చెయ్యలేదు. ఆ ఆలోచన మొట్టమొదట చేసింది బ్రిటిష్ వాడే. అటవీ చట్టాలు చేశారు. అడవిని సర్వే చేశారు. ముక్కలు గా విడగొట్టారు. ఆ ముక్కలపై సుంకాలు విధించారు. ఒక్కో భూభాగానికీ ఒక ముఠాదారీ వ్యవస్థని ఏర్పాటు చేశారు. తరతరాలు గా తిండి గింజలు పండిస్తున్న తన భూమిని దున్నుతున్నందుకు ప్రభుత్వానికి పన్ను కట్టాలి. కొండల్నీ, అడవులనీ చదును చేసి పంటల్ని పండించే "పోడు వ్యవసాయం" చెయ్యకూడదు. అడవిలో చెట్టు కొట్టకూడదు. రిజర్వ్డ్ ఫారెస్ట్ లోకి ఏ గిరిపుత్రుడూ ప్రవేశించకూడదు. పశువులని మేపకూడదు. తేనే, మందులూ, మాంసం వంటి ఎటువంటి సరుకూ ప్రభుత్వ అనుమతి లేకుండా, పన్ను కట్టకుండా అడవి నుండి తెచ్చుకోకూడదు. అంటే అడవిలోనే పుట్టీ, పెరిగీ, ఆ మట్టి లోనే కలిసిపోయే అడవి బిడ్డలకి ప్రకృతి సంపద మీద ఉన్న హక్కు లాక్కోబడింది. ఈ చట్టాలన్నీ కఠినంగా అమలు చెయ్యడం మొదలెట్టింది ప్రభుత్వం. కొత్తగా వచ్చిన ఈ చట్టాలు గిరిజనుల చేత ఆకలి కేకలు పెట్టించాయ్."

ఓ సూచన : పై వాక్యం లో సరకూ అనే పదం పట్ల కొంత అవగాహన కోసం చేస్తున్నాను. గిరిజనులు తమకు తాము వాడుకునేది వస్తువు. ప్రభుత్వం లేదా పెట్టుబడిదారుడు అమ్మకానికి పెట్టేది సరకు అవుతుంది. నిన్ను తప్పు పట్టడానికి చెప్పడం లేదు. అల్లురితో మొదలైన ఈ సాహిత్యం ప్రజలకు ఉపయోగపడే మరిన్ని పోస్టులు భవిష్యత్తులో ఇదే బ్లాగునుండి రావాలనే కోరికతో సవరణ సూచిస్తున్నాను. బ్రిటీషు వాడు వచ్చాకే ఇవి వచ్చాయి అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చే మన దేశ సంస్కృతి జీవన విధానాన్ని నాశనం చేయడం ప్రారంభించిందనేదానికోసం చెప్పాను.

"ఇలా అయితే ప్రజలెలా బ్రతకాలీ? దీనికి సమాధానం గా తెల్లవాళ్ల దగ్గర గొప్ప ఆలోచన ఉంది. మన సంపదని మనం అనుభవించకూడదు గానీ వాళ్ళు దోచుకోవచ్చు. అది తరలించడానికి రోడ్లు కావాలి. అవి కావాలంటే వెట్టి చాకిరీ చెయ్యడానికి మనుషులు కావాలి. రోడ్లు వేసే పనిలో చేరి కూలి తీసుకొని బతకాలి. అయితే అది పని చేసేవాడి ఇష్టం కాదు. బలవంతం. "రాను.. చెయ్యను" అని చెప్పే ధైర్యం లేదు. "చెయ్యలేను" అని చెప్పే అవకాశం లేదు."

ఇదే పెట్టుబడిదారీ నీతి. రాక్షస నీతి . మనిషిని అవసరాల ఆధారంగా శ్రమ చేసేవాడిని శ్రమ చేయకుండా అధికారం తో అహంకారం తో దోచుకునే నీతి.రీతి.

సుభ/subha said...

రాజ్ మంచి చరిత్రని ఎంచుకున్నారే? చాలా బాగా వ్రాస్తున్నారు. మొదటి భాగం లో మొదటి వాఖ్యాలు చూడగానే ఎవరో వీరుని కథ అని అనిపించింది. క్షత్రియుడు అనగానే అల్లూరి సీతా రామ రాజు కాదు కదా అనుకున్నాను.. సినిమా చూసి ఆయన గురించి తెలుసుకోవడమే తప్ప నిజంగా ఆయన గురించి తెలియదు అస్సలు. ఇలా మీ వల్ల తెలుసుకునే అవకాశం వస్తోంది. ధన్యవాదాలు మంచి సిరీస్ మొదలుపెట్టినందుకు.. ఆ అరుదైన చిత్రాలు కూడా బాగున్నాయ్.

Sravya V said...

చాల బాగా రాసారు రాజ్ !
సింహం వెనక్కి అడుగు వేసేది పంజా విసరడానికే.....!
--------------------------------
ఇలా ఎండ్ చేయటం బావుంది ! సింహం పంజా ఎలా విసిరిందో తెలుసుకోవటానికి ఆసక్తి గా ఎదురు చూస్తున్నా !

చాణక్య said...

చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్..

Raviteja said...

బాగుంది సర్ కొందరు చరిత్ర చదువుతుంటే రొమాలు నిక్కబొడచుకుంటాయి అలాంటి వారిలో అల్లూరి సీతారామరాజు కూడా ఒకరు :)

Unknown said...

తెలుసుకోవాలిసిన చరిత్ర.బాగా రాస్తున్నావు రాజ్,తరువాయి భాగం కోసం ఎదురు చూపు..

POOJITA said...

అల్లూరి గురించి వినడమే తప్పా తెలిసింది తక్కువ ,చాలా మంచి నాయకుని గురించి రాసారండి .తర్వాత పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం

రాజ్ కుమార్ said...

కొండలరావు గారూ... మీ సూచన ప్రకారం సరిచేశానండి. మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలండీ

సుభ గారూ.. అవునండీ విల్లమ్ములు పట్టుకొని, పంచె కట్టుకున్న రూపమూ, స్వాతంత్ర్య సమరయోధుడు అన్న పేరు తప్ప పెద్దగా తెలియదు.. అందుకే ఈ ప్రయత్నం.ఆ సినిమానే పెద్ద రిఫరెన్స్..;)

ధన్యవాదాలు.

రాజ్ కుమార్ said...

శ్రావ్య గారూ, చాణక్యా... తప్పకుండా.. త్వరలో వేసేస్తా ;) థాంక్యూ

రవితేజా.. యెస్..అంతేకదా మరీ ;)

సునీత గారూ, పూజ గారూ..ధన్యవాదాలండీ

కృష్ణప్రియ said...

Interesting narration.

రాజ్ కుమార్ said...

ధన్యవాదాలు కృష్ణప్రియ గారూ ;)