విజయానందంతో గిరిజన గ్రామాలన్నిటినీ పర్యటిస్తున్న రాజు సైన్యానికి ప్రజల నుండి గొప్ప స్పందన లభించింది.
అడుగు పెట్టిన ప్రతీ చోటా "స్వాతంత్ర్య సమరం" గురించీ, దాని ఆవశ్యకత గురించీ, తాము సాధిస్తున్న విజయాలని గురించి ప్రజలకి తెలియజేస్తున్నాడు రామరాజు.ఎక్కడ బస చేసినా సరే, ఆ గ్రామ మునసబులు, సమీప గ్రామాల మునసబులు, ప్రజలు, బియ్యం, వంట సామగ్రి, బట్టలు, కోడి, మేక వంటివి కొండదళానికి పంపిస్తున్నారు. సిరిబలి, కిలంకోట లమీదుగా సెప్టెంబరు 3 వ తేదీ నాటికి పాడేరు సమీపం లోని "ఒంజేరి" చేరుకున్నారు.
అప్పుడు జరిగిందో సంఘటన.
ఐదు ఏనుగుల మీద సామాగ్రి తో సుమారు ముప్పై మంది పోలీసులు అటువైపు వస్తున్నారని సమాచారం అందింది. రాజు దళం అటాక్ చేసింది. పోలీసుల నుండి ఎదురు కాల్పులు జరిగాయ్. కానీ రాజుదండు ధాటికి పోలీసులు తోకముడిచి పరుగులు పెట్టారు. ఒక పోలీస్ మరణించాడు. ఏనుగుల మీద ఉన్న పెట్టెల లోని బట్టలు, కంబళ్ళు,ఇతర సామాగ్రి అక్కడికక్కడే తన వాళ్లకి పంచి పెట్టాడు రాజు. మన్యం వీరుల ఖాతా లో మరో విజయం.
రాజమండ్రి నుండి వెలువడే "గోదావరి పత్రిక", నెల్లూరు నుండి "ఆర్యావర్తనము", "న్యాయదీపిక", "ఆంధ్ర పత్రిక" మొదలుకొని తెలుగు పత్రికలన్నీ రామరాజు పోరాటాన్ని గురించీ, దానికి సంబంధించిన విశ్లేషణలనూ ప్రచురించాయి. కానీ ఆ తరువాత కాలంలో "కాకినాడ నుండి వెలువడే ఆర్యపత్రిక" మొదలైన కొన్ని మాత్రమే ఎక్కువగా కధనాలని రాసింది.
*******************************************************************
తూర్పుగోదావరి జిల్లా,"తుని" వీధులలో "పేరిచర్ల సూర్యనారాయణ రాజు" అనే వ్యక్తి కోసం రామరాజు మనుషులు వెతుకుతున్నారు. వారి చేతుల్లో ఒక ఉత్తరం. అది స్వయంగా రామరాజు , తన మిత్రుణ్ణి పోరాటం లోకి ఆహ్వానిస్తూ రాసిన ఉత్తరం.
మిత్రమా!
నేను యుద్దమును ప్రారంభించితిని. ఇంతవరకూ నాలుగు ప్రదేశములలో మన సైన్యం బ్రిటిష్ సైన్యాన్ని ఓడించినది. రామరాజు మూడు పోలీస్ స్టేషన్లు కొట్టాడు. అయితే ఉత్తరం లో పేర్కొన్న ఆ నాలుగో విజయం ఏదో అస్పష్టం. ప్రతి పోరాటమునను భగవానుని దయవలన జయము మన పక్షమునకే లభించినది. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకొని నీవు బయలుదేరి రావలెను. మృత్యువు, జననమును వెన్నంటియే యుండును.ప్రతి మానవుడు తన వంతు వచ్చినప్పుడు మరణించవలసినదే. కర్మ పరిపక్వమై, కాలము సమీపించిన,ఎక్కడున్నను ఏ మానవుడు మరణించడు? ఎంత శ్రద్ధతో ఈ శరీరమును పెంచి పోషించిననూ ఒకరోజు అది నాశనము కావలసినదే. మానవ శరీరములు శాశ్వతములు కావు. కానీ కీర్తి, అపకీర్తి శాశ్వతములు. మంచి, చెడులు చిరకాలము నిలుస్తాయి.క్షత్రియులకు యుద్ధము సహజము. ఎవరైతే జయాపజయములను, కష్ట సుఖములను చీకటి వెలుగులను చూడగలరో వారే ఆత్మ సాక్షాత్కారము పొందగలరని భగవద్గీత బోధించుచున్నది.మనకు యుద్ధం లో విజయము లభించిన ఎడల భౌతికానందము పొందగలము. యుద్ధం లో మరణించిన ఎడల మనము వీరస్వర్గము నలంకరించి ఆనందించగలము. అందువలన ఈ విషయములన్నిటినీ నేను జాగ్రత్తగా ఆలోచించి, దేశ క్షేమము కొరకు యుద్ధము అనివార్యమని పూర్తిగా విశ్వసించి ఈ సమరమును ప్రారంభించినాను. ఈ ఉత్తరము చేరిన వెంటనే నీవు తప్పక బయలుదేరి వస్తావని పూర్తిగా నమ్ముచున్నాను. ఇంకను ఎవరైనా వస్తే నీతో తీసుకొని రావలెను. ఒకసారి నీవు బయలుదేరి వచ్చి, ఇచ్చట నేను పోరాటమును సాగించుటకు చేసిన ఏర్పాట్లు చూడవలెను. అవి నీకు నచ్చకపోయిన ఎడల తిరిగి వెళ్ళిపోవచ్చును. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. అక్కడ పేకేటి వారి అబ్బాయి ఉంటే తప్పక నీతో తీసుకొని రావలెను. మిత్రులకు నా అభినందనలు.
-సం॥ అల్లూరి శ్రీరామరాజు.
ఈ ఉత్తరం చేరాల్సిన చోటకి చేరి ఉంటే, అందాల్సిన సహకారం అంది ఉంటే వేరేలా ఉండేదేమో. కానీ అప్పటికే ఏజన్సీ ప్రాంతాల మీద, ఆ ప్రాంతాల నుండి వచ్చిన మనుషుల మీద నిఘా పెట్టడమూ, పోలీసు శిబిరాలూ, చెక్ పాయింట్ల సంఖ్య పెంచడం తో రామరాజు మనుషులు పోలీసులకి చిక్కారు. వారితో పాటూ ఈ ఉత్తరం కూడా. దానికి ఇంగ్లీష్ అనువాదం పై అధికారులకి పంపించబడింది. వీరే కాకుండా దళానికి ఆహారం సమకూర్చుతున్న మరికొందరు పోలీసుల చేతికి చిక్కారు. జరిగిన దాడుల గురించిన విషయాలు రాబట్టారు. రామరాజు ఆలోచనలు,వ్యూహాలు, విజయాలు వెరసి విషయ తీవ్రత, ప్రభుత్వానికి అర్ధమయ్యింది. ఇది ప్రభుత్వం మీద యుద్దం అని భావించింది.
************************************************************************
సమయం: 1.30Pm
ప్రదేశం: నర్సీపట్నానికి 25 కిలోమీటర్ల దూరం లోని ఘాటీ.
కమాండర్ ట్రెమన్ హౌర్, గూడెం డిప్యూటీ తాహశీల్దార్ బాస్టియన్ కొంత సైన్యం తో కలిసి, రామరాజు దళం ఆచూకీ వెతుకుతూ, తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న రామరాజు వ్యూహం సిద్ధం చేశాడు.
అదును చూసి కాల్పులకి సంజ్ఞ చేశాడు రాజు. యుధ్దం మొదలైంది. ఇరువైపుల నుండీ తుపాకీ మోతలతో ఆ ప్రదేశం అంతా దద్దరిల్లింది. బ్రిటిష్ సైన్యం చేతులెత్తేసింది. కొందరి ప్రాణాలు గాలిలో కలిసిపోగా, మరికొందరు ప్రాణాలు చేత్తో పట్టుకొని దొరికిన దిక్కుకి పారిపోయారు. కమాండర్ ట్రెమన్ హౌర్ తూటా దెబ్బ రుచి చూశాడు.
మన్యం ప్రజల ఆవేదనకీ, ఆక్రోశానికీ ప్రధాన కారణమయిన బాస్టియన్ కి ఆరోజు ఆఖరి రోజు అవ్వవలసింది. అతనికి గురిచూసి విసరబడిన ఒక కత్తి నుండి వెంట్రుక వాసిలో తప్పించుకొని పారిపోయాడు. ఆ కత్తి విసిరింది వేరెవరో కాదు బాస్టియన్ ఎవరి మీదయితే తప్పుడు కేసులు బనాయించి తన మున్సబు పదవిని పోగొట్టాడో, ఎవడైతే సొంత భూమికోసం తన కాలితో తన్నులు తిన్నాడో.. ఆ గిరిజన నాయకుడు..రామరాజు ప్రధాన అనుచరుడు
"గాం గంటందొర".
**********************************************************************
ఉద్యమ అణచివేతకు ప్రయత్నాలు ఎక్కువ అయ్యాయి.కొయ్యూరు, కృష్ణదేవీపేట, గుర్తేడు, పెదవవలస, గూడేం, చింతపల్లి, లంబసింగి, మంప, ఇలా అనుమానమున్న ప్రతీ చోటా పోలీసు శిబిరాలు ప్రతీ శిబిరానికీ 50 మంది జవానులు ఆధునిక ఆయుధాలతో ఏర్పాటు చెయ్యబడ్డారు.
మొదటి ప్రపంచ యుద్ధం లో పాల్గొన్న అనుభవం ఉండటమే కాక, కేరళలోని మలబార్ అల్లర్లని అణచేసి వచ్చిన "నైవెల్లి హైటర్" నీ, తిరుగుబాట్లని తొక్కెయ్యడంలో సిధ్దహస్తుడని పేరున్న "స్కాట్ కవర్ట్" లని రంగం లోకి దించింది బ్రిటిష్ ప్రభుత్వం.
1922 సెప్టెంబర్ 24
ఆ రోజు రాజుదళం కృష్ణదేవి పేటకి ఆరున్నర మైళ్ల దూరం లో ఉన్న "దామనపల్లి ఘాట్" లో ఉందన్న సమాచారం హైటర్, కవర్ట్ లకి తెలిసింది. వారిద్దరి నేతృత్వం లో పోలీసులు బయలుదేరారు. అయితే ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడానికి రాజుదళం లో ఏర్పాట్లు ఉన్నాయ్. పోలీస్ బెటాలియన్ వస్తుందన్న సంగతి రాజుదండు కి మున్సబ్ తమ్ముడు బొర్రంనాయుడి ద్వారా చేరవేయ బడింది.
సుమారు మూడొందల మంది పోలీసులతో బ్రిటిష్ పటాలం నాలుగు వరసల్లో కదలివస్తుంది. ముందు యాభైమంది అడ్వాన్స్ పార్టీ, తర్వాత నల్ల పోలీసు(ఇండియన్స్) దళం. ఆ వెనక హైటర్, కవర్ట్స్, వెనకాల మిగిలిన పోలీసులు. అందరూ సాయుధులు. కానీ భయం భయం గా, పది మైళ్ళ పొడవున్న ఆ సన్నని కాలిబాటలో అడుగులు వేస్తున్నారు.
అప్పటికే గొరిల్లా యుద్ధం లో ఆరితేరిపోయాడు రామరాజు. మొత్తం ఐదు గ్రూప్ లు గా తన దళాన్ని విడగొట్టి వేరు వేరు చోట్ల మొత్తం దళాన్ని చుట్టుముట్టే విధంగా వ్యూహం పన్నాడు. హఠాత్తుగా రాజుదళం నుండి రెండు రౌండ్లు పేలాయ్. మొదటి రౌండ్ కి తూటా కవర్ట్ కణతలోకి దూసుకు పోయింది. రెండవ రౌండ్ కి తూటా హైటర్ భుజంలోకి చొచ్చుకుపోయింది. బ్రహ్మాస్త్రాలని బ్రిటిష్ ప్రభుత్వం దించిన ఆ ఇద్దరి ప్రాణాల్ని చిటికెలో గాల్లో కలిపేసిన వాడు - విలువిద్య లో మొనగాడైన "గోకిరి ఎర్రేసు". అంతే... మొత్తం బ్రిటిష్ సైన్యం అంతా తప్పించుకునే వీలు లేకుండా చుట్టూరా కాపు కాసిన రాజు దళానికి దొరికేసింది.
ఏ ఒక్క భారతీయుడూ చంపబడకూడదు.. అన్న నియమానికి రాజు కట్టుబడి ఉండకపోతే , "ఊ... చంపెయ్యండి" అని రాజు ఒక్క మాట అని ఉంటే, ఆ రోజు అక్కడ నరమేధం జరిగుండేది. పచ్చని అడవి ఎర్రబడేది. ధామన్ ఘాట్ లోని వాగులో నీటికి బదులు రక్తం ప్రవహించి ఉండేది. ఎటువైపు నుండి బాణం వస్తుందో తెలిసేలోగా శరీరం లోకి దిగబడేది. దిగిందని తెలిశాక, గొంతు లో కేక గాల్లోకి చేరే లోగా ప్రాణాలు పోయుండేవి. అదే అవకాశం పోలీసు దళానికి వచ్చి ఉంటే రాజు దళం లోని ఏ ఒక్కరూ బ్రతికి ఉండేవారు కాదు. రామరాజు మాత్రం శత్రు సైన్యం లో ఉన్నా కూడా వారిలో భరతమాత బిడ్డల్నే చూశాడు. యుద్ధం మొదలైన కొద్ది నిమిషాలలో జరిగిన అలజడిలో మరో ఇద్దరు పోలీసులు మరణించగా, కొందరు గాయపడ్డారు. మొత్తం ఆయుధాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. ప్రాణాలు మాత్రం విడిచి పెట్టబడ్డాయ్. ఇద్దరు పోలీసులని మాత్రం కొండదళం బందీలుగా తీసుకెళ్ళారు. ఆ ఇద్దరు పోలీసుల ద్వారా వశపరచుకున్న "303 రైఫిల్స్" నీ, ఇతర ఆయుధాలనీ వాడే పద్ధతిని నేర్చుకుంది రాజుబృందం. వారు ఉన్న రెండ్రోజులూ భోజన సదుపాయాలతో మర్యాద గా చూశాడు రాజు. తర్వాత వారిని కూడా విడిచి పెట్టేశాడు.
అయితే చనిపోయిన హైటర్, కవర్ట్ ల శవాలు ఏమయిపోయాయో తెలియలేదు. కవర్ట్ కి అత్యంత సన్నిహితుడైన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ "అర్మిటేజ్" స్వయంగా బయలుదేరి వచ్చాడు. కొండదళాన్ని ఢీకొట్టడానికి బెటాలియన్ తో రెడీ అయ్యాడు. ఈ సారి జరిగిన పోరు లో ఒక తూటా అర్మిటేజ్ టోపీ దగ్గరగా దూసుకుపోయింది. చావుతప్పి కన్ను లొట్టపోయినట్టవ్వడంతో వెనుదిరిగి, శవాల కోసం స్థానికుల ద్వారా రాజుని సంప్రదించి బ్రతిమలాడుకోవడం తో Rs 500 జరిమానా కట్టి తీసుకెళ్ళేటట్టుగా ఒప్పందం జరిగింది. వారి మృత దేహాలని నర్సీపట్నం తీసుకెళ్ళి అంతిమ సంస్కారాలు జరిపించారు.(ఇప్పటికీ వారి సమాధులు R&B అతిధి గృహం లో ఉన్నాయ్).
యుద్ధం మొదలై నెల రోజులు మాత్రమే అయ్యింది. పరిస్థితుల్లో ఎంతటి మార్పు??
ఏ గిరిజన యువకుడి నైనా సరదాకోసం కాలెత్తి తన్నే పోలీస్ అధికారులు, గొంతెత్తి అరవడానికి గానీ, ఏ స్త్రీ నైనా కన్నెత్తి చూడటానికి గానీ సాహసించడం లేదు. భయం... ఇది రగిలే విప్లవాగ్ని అల్లూరి శ్రీరామరాజు నడయాడే చోటు. ఒక మన్య స్త్రీకి కీడు చేస్తే రామరాజు కి సంజాయిషీ చెప్పుకోవాలన్న భయం. ఆ సంజాయిషీ కి రూపం చావేనన్న భయం. ఒక భారతీయుడి కి చెడు తలపెడితే తలలు తెగుతాయన్న భయం.
మరి జరినవి సాధారణ యుద్ధాలా? దక్కినవి సామాన్య విజయాలా? నిరాయుధులైన సాధారణ జవాన్లనో, నలుగురైదుగురు పోలీసోళ్లనో, అరాచకాలు చేసిన బాస్టియన్ నో చంపి "మేం.. గెలిచాం" అనడం కాదు. "విప్లవాగ్ని ఆర్పేస్తా.. తిరుగుబాటుని తొక్కేస్తా" అని భుజాలు చరుచుకు వచ్చిన వాళ్లంతా కొండని ఢీకొన్న పొట్టేళ్ళలాగా భంగపడ్డారు. రాజు ఆశయం తాత్కాలిక పరిష్కారం కాదు. చిన్న, చితకా వాళ్లని కొట్టడం కాదు.తన యుద్ధం ఒక వ్యక్తి మీద కాదు. ఒక వ్యవస్థ మీద. ఒక జాతి మీద. వలసదారుడి పెత్తనం మీద. మీదకి దూకడానికొచ్చిన కుక్క కళ్ళ ఎదురుగా పెద్దపులిని చంపేస్తే, కుక్క కి మొరిగే ధైర్యం ఉండదు. దాన్ని కొట్టాల్సిన అవసరమూ ఉండదు. ఇక్కడ జరిగిందదే.
ఇది "రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం" అని ఎగిరిపడుతున్న తెల్లవాడి గర్వానికి దెబ్బ.
అత్యాధునిక ఆయుధాలు కలిగిన అతి పెద్ద సైన్యాన్ని ఒక సాధారాణ గిరిజన బృందం కొట్టిన దెబ్బ.
బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్ట కి దెబ్బ.
బ్రిటీష్ సైనిక శక్తి కి సవాల్.
రామరాజునీ అతని సైన్యం యొక్క సామర్ధ్యాన్నీ చూసిన I.G ఆర్మిటేజ్ "ఈ తిరుగుబాటుని ఆపడం కష్టమనీ, సాధారణ పోలీస్ దళాలూ, సైన్యాలూ సరిపోవనీ, అడవుల్లోనూ, కొండల్లోనూ యుద్దం చేసిన అనుభవం ఉన్న సైనికులు అవసరం అనీ" మద్రాస్ సర్కార్ చీఫ్ సెక్రటరీకి టెలిగ్రాం పంపించాడు.
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయబడ్డాయ్. కొత్త చట్టాలు చేయబడ్డాయ్. కొత్త అధికారులూ, కొత్త టీం లూ, తిరుగుబాటు దార్లని విచారించేందుకు కోర్టులూ ఏర్పాటు చేయబడ్డాయి.ఫితూరీ లో పాల్గొనడమే కాదు, వారికి సహాయం చేయడం, ఆచూకీ ఇవ్వకపోవడం అన్నీ నేరాలే. అనుమానం ఉన్న గిరిజనులందరినీ లారీలలో ఎక్కించి విశాఖపట్నం తీసుకెళ్ళడం పోలీసుల దినచర్య అయ్యింది.
విప్లవకారుల జాబితా తయారయ్యింది. వారికి ఆహారమే కాదు మంచినీరిచ్చినా నేరమే. గ్రామల్లో ఏ ఒక్కరూ ఆయుధాలు కలిగి ఉండకూడదనీ, అన్నీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఆయుధాలతో కనిపిస్తే కాల్చివేతలే అనీ ఆంక్షలు పెట్టింది. పోలీస్ స్టేషన్ల పై దాడులని ఆపడానికీ, ముఖ్యంగా రాజు దళానికి ఆయుధాలు దొరకకుండా ఉండడానికీ చర్యలు తీసుకుంది.
క్రమ క్రమంగా మిలిటరీ సైన్యం విడతలు విడతలు గా వచ్చి చేరుతుంది. పూర్తి సైన్యాన్ని సమీకరించుకునే వరకూ రామరాజు అనే పర్వతాన్ని ఢీకొట్టకూడదని భావించింది ప్రభుత్వం. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తుంది....
ఆ అవకాశం బ్రిటిష్ సేనకి లభించిందా??
ఎప్పుడు?
ఎక్కడ???
ఎలా????
9 comments:
ఈ రోజుల్లోనూ దేశభక్తి రగులుతూనే ఉండడం అభినందించదగ్గ , ఆహ్వానించదగ్గ పరిణామమైతే, ఆ దేశభక్తి రగిలించిన మన్యం విప్లవాగ్ని అల్లురి ధన్య జీవి. చాలా బాగా వ్రాస్తున్నరు రాజ్. తరువాత పోస్టుకోసం ఎదురుచూస్తున్నాను.
చరిత్ర చదివించడం కష్టం, కాని శ్రీ రామరాజు లాటి మహానుభావుని చరిత్ర చదవని వాడు.........శ్రీరామరాజా మా కోసం మరోసారి ఇప్పుడు పుట్టవా?
goosebumps ! చాలా చాలా బాగా రాసారు !
>>రగిలే విప్లవాగ్ని అల్లూరి శ్రీరామరాజు నడయాడే చోటు. ఒక మన్య స్త్రీకి కీడు చేస్తే రామరాజు కి సంజాయిషీ చెప్పుకోవాలన్న భయం. ఆ సంజాయిషీ కి రూపం చావేనన్న భయం. ఒక భారతీయుడి కి చెడు తలపెడితే తలలు తెగుతాయన్న భయం.>>
ఆ పోరాటపటిమను మీ రాతల్లో యధాతథంగా చిత్రించారు.
కొత్తగా చెప్పదీ ఏమిలేదు అద్భుతంగా వ్రాశారు!
హలో అండీ !!
''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!
వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!
రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది
మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు
http://teluguvariblogs.blogspot.in/
చాలా బాగుంది రాజ్..
కొండలరావు గారూ ధన్యవాదలండీ..
కష్టేఫలి గారూ.. హ్మ్మ్... మళ్ళీనా? అత్యాశేమో సార్. అవసరం అనుకున్న అప్పుడే మన పూర్వీకులు ఆయన్ని కాపాడుకోలేక పోయారండీ..
ధన్యవాదాలు..
శ్రావ్యగారూ, జ్యోతిర్మయిగారూ, రవితేజా, వేణూజీ మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు ;)
Post a Comment