Monday, December 3, 2012

ఇది కధ కాదు 9 : తుది అశ్రు బిందువులు

ప్పించు కోడానికి చిన్న ప్రయత్నం కూడా చెయ్య లేదు రామరాజు. అతని మీద ఎన్ని నమ్మకాలు? ఎన్ని కధలు?? ఎన్ని అభియోగాలు? "మహిమలున్నాయంట అతనికి..! అతనికి గురిపెట్టిన తుపాకీ పేలదట. ఇక్కడ మాయమైపోయి అక్కడ ప్రత్యక్షమవుతాడట". ఈ నమ్మకాలకి అతన్ని పట్టుకున్న అళ్వారు నాయుడు, జామేదార్ కంచుయేనన్ లు అతీతులు కారు. అలాంటి అల్లూరి శ్రీ రామరాజుని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రాణాలతో పట్టేశారు. ఆలస్యం చెయ్యలేదు ఇక. ఒక నులకమంచం తెప్పించి  దాని మీద రాజుని పడుకోబెట్టి, అంగుళం కూడా శరీరాన్ని కదిపే వీలు లేకుండా తాళ్ల తో కట్టేశారు. రాజు ని సజీవంగా పట్టుకున్నట్లు మద్రాస్ కి టెలిగ్రాం ఇచ్చి,  ముందు కొయ్యూరు సైనిక శిబిరానికీ, అక్కడ నుండి కృష్ణదేవీ పేట కి తీసుకొస్తామని అక్కడి పోలీసులకి సమాచారం అందించారు. స్థానిక గిరిజనులని పిలిచి, రాజుని కట్టిన మంచాన్ని భుజాలకెత్తించారు. మంప గ్రామం నుండి కొయ్యూరు వెళ్ళాలి అంటే ఆరు మైళ్ళు అడవి లో వాగులు దాటి, వెదురు పొదలు దూరి ప్రయాణించాలి. ప్రయాణం మొదలైంది. మధ్యాహ్నం వేళకి కొయ్యూరు సరిహద్దులలోకి ప్రవేశించగా అప్పుడు జరిగిందో సంఘటన. తన బృందంతో పెట్రోలింగ్ చేస్తున్న అస్సాం రైఫిల్స్ అధిపతి మేజర్ గుడాల్ ఎదురయ్యాడు వీళ్లకి. విషయం తెలుసుకొని, రాజు ని తనకి అప్పగించవలసిందిగా ఆదేశించాడు.కంచుయేనన్ దానికి ఒప్పుకోకుండా మద్రాస్ ప్రెసిడెన్సీ ఆదేశాల మేరకు రాజు ని స్వయం గా కృష్ణదేవిపేట తీసుకెళ్ళి కలెక్టర్ కి అప్పగిస్తానన్నాడు. మరి రాజుని పట్టిస్తే వచ్చే డబ్బు, అంతకు మించి వచ్చే వెలకట్టలేని కీర్తినీ ఎవరు మాత్రం వదులుకుంటారు?? దీనితో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. అది సంవాదం కాదు..  పక్కనే మంచానికి కట్టి వేయబడి ఉన్న రాజు ప్రాణాలు ఉండాలా? వద్దా?? అన్న విషయం మీద పరోక్షం గా జరుగుతున్న వాదన.గుడాల్ తన హోదానీ, అధికారాన్నీ, మొండితనాన్నీ ఉపయోగించి బెదిరించడం తో రామరాజుని అప్పగించక తప్ప లేదు కంచుయేనన్ కి.

మేజర్ గుడాల్ రామరాజుని తన శిబిరం వద్దకు తీసుకెళ్ళాడు. ఉద్యమానికీ, దాడులకీ సంబంధించి ఇద్దరి మధ్యా చిన్నపాటి వాగ్యుద్ధం జరిగింది. ఏ తెల్లవాడూ సమాధానం చెప్పలేని ప్రశ్నలున్నాయ్ రాజు వద్ద. తన పోరాటానికి బలమైన కారణం ఉంది. నిస్వార్ధమైన ఆశయముంది. న్యాయముంది. నిజాయితీ ఉంది. కానీ ఎదురుగా ఉన్న గుడాల్ చేతిలో గన్ మాత్రమే ఉంది. రాజు ని ఒక చింతచెట్టుకి కట్టివేయించాడు. అతని తల కి ముసుగు తొడిగించాడు. గన్ గురి చూసి కాల్చలేదు గుడాల్. గుండెల మీద పెట్టి కాల్చాడు. మూడుసార్లు తుపాకీ నిప్పులు కక్కింది. అల్లూరి శ్రీరామరాజు విడిచిన ఆఖరి శ్వాస అతనిచ్చిన గుండె ధైర్యం తో శత్రువులనీ, అతన్ని మోయబోతున్న గిరిజనులనీ, చెట్లనీ, పుట్లనీ, పువ్వులనీ ఎటువంటి వివక్షా చూపించకుండా స్పృశిస్తూ వెళ్ళిపోయింది. ఈ మన్యం వీరుడి చావు కి తను వెన్నుదన్ను గా నిలిచానని బాధ పడిందో?? లేకా  రాజుగారు  తన ఒడిలో  ప్రాణాలు విడుస్తున్నందుకు గర్వ పడిందో... ఆ చెట్టు.

రాజు మరణించిన విషయాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ కి వైర్లెస్ లో కొయ్యూరు నుండి సమాచారం పంపించాడు గుడాల్. ప్రాణాలతో పట్టుకున్న వాడిని ఎందుకు చంపవలసి వచ్చిందో సంజాయిషీ చెప్పమనడం తో "కొయ్యూరు చేరాక లఘుశంక కొరకు రాజు కట్లు విప్పమని కోరాడనీ,విప్పిన తర్వాత  తప్పించుకొని పారిపోడానికి ప్రయత్నించడం తో కాల్పులు జరుపవలసి వచ్చిందని" కధ అల్లి చెప్పాడు. తర్వాత రామరాజు భౌతిక కాయాన్ని అదే మంచానికి కట్టి  "బ్రిటీష్ సింహాసనాన్ని ఎదిరిస్తే... ఎవరికయినా ఇదే గతి పడుతుందనీ " గ్రామగ్రామానా ఊరేగింపు తీశారు.

చీకటి పడే సమయానికి రాజు శవాన్ని కృష్ణదేవీపేట కి చేర్చారు. రాజు సజీవం గా పట్టుబడ్డాడని మాత్రమే తెలిసిన  ప్రజలు , రాజు శవమై వచ్చాడని తెలిసి కలత చెందారు. "రూధర్ ఫర్డ్" మాత్రం గుడాల్ చేసిన పనికి అతని పై మండి పడ్డాడు. "తను చేసింది తప్పే అయితే... తనని సంజాయిషీ అడగవలసింది బెంగాల్ గవర్నర్ మాత్రమే అనీ, తనని ప్రశ్నించే అధికారం ఇక్కడ ఏ అధికారికీ లేదనీ" మొండికేశాడు మేజర్ గుడాల్. వేరే దారి లేక అతను అల్లిన కధనే యదార్ధ ఘటన గా ప్రకటించాడు రూధర్ ఫర్డ్.

ఎక్కడయితే కృష్ణదేవీపేట ప్రజలకి శ్రీ రామరాజు పరిచయమయ్యాడో, ఎక్కడ యోగిగా ఆధ్యాత్మిక బోధనలు చేశాడో, ఎక్కడ మన్యం వాసులకి ఆయుర్వేద వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టాడో, ఏ స్థలం లో పంచాయితీ పెద్ద గా తీర్పులిచ్చాడో, ఆఖరికి ఎక్కడ ఒక విప్లవకారుడై దర్శనమిచ్చాడో... సరిగ్గా అక్కడే , ఆ రామాలయం దగ్గరే ఆయన మృతదేహాన్ని ప్రదర్శనకి పెట్టారా రోజు.

నమ్మలేదు మన్యం..
తూటాలూ, తుపాకులూ ఆయన్నేం చేయగలవు??
అసలు అవతార పురుషులకి అంతం ఏంటి?
శ్రీ రామరాజు ఆ భద్రాద్రి రాముడి అవతారం. ఆయనకి చావేంటి??

కానీ ఊహలూ, నమ్మకాలూ గొప్పగా ఉంటాయి. వాస్తవాలు తట్టుకోలేనంతగా, బాధాకరంగా, ఒక్కోసారి అసహ్యం గా ఉంటాయి. 

శవ పంచాయితీ మొదలైంది దీపాల వెలుగు లో.. వీధి వీధినా పోలీసులే... ఆనందోత్సాహలతో కేరింతలు కొడుతున్నారు..ఊరంతా కదం తొక్కుతున్న మిలిటరీ బూట్లు...లాఠీలు...!
"మీ రాజొచ్చాడు... పాలు ఇవ్వండి... తాగుతాడు"
"మీ రాజు గారు పంచాయితీ పెడుతున్నారు రండీ.."   వెటకారాలు.. ఎకసెక్కాలు...
"మీ దేవుణ్ణి చంపేశాం....వచ్చి చూస్కోండి" .. కోపం... పగ... ఇన్ని నెలలు గా తమకి కంటి మీద కునుకు లేకుండా చేసిన రామరాజంటే ద్వేషం. ఇక ఈ అడవి లో భయపడుతూ తిరగాల్సిన పనిలేదన్న ఆనందం.
గుండె భారం దించుకొనేలా, గుండెలవిసేలా ఏడ్చే స్వాతంత్ర్యం కూడా లేదు గ్రామ ప్రజలకి.

రాజు చేత "అన్నగారూ" అని పిలిపించుకున్న చిటికెల భాస్కరనాయుడు గారు... రాజు విప్లవకారుడయ్యాక అతన్ని కలవడానికి ఇష్టపడని  భాస్కరనాయుడు గారు వచ్చారు రాజుని చూడ్డానికి. చనిపోయింది శ్రీరామరాజే అని గుర్తించే బాధ్యత అతనిదే మరి. రాజుతో పరిచయమున్న 50 మంది మున్సబులొచ్చారు రామరాజు ని గుర్తించడం కోసం. కట్లు విప్పి రాజు శవాన్ని చెట్టుకి జారేశారు. ఫోటోలు తీసే కార్యక్రమం ప్రారంభమైంది. హృదయ విదారకంగా ఉందా దృశ్యం.. చాతీ మీద పాయింట్ బ్లాంక్ లో కాల్చిన దానికి ఫలితంగా మాంసపు పీలికలు వేలాడుతూ మూడు పెద్ద రంధ్రాలు. రక్తం లో ముంచి తీసినట్టున్నాయ్ బట్టలు. తెల్లవాళ్ల రక్తపుటేరులు పారించిన రామరాజుని మాంసపు ముద్ద చేసి, అతని నెత్తురుని కళ్ళజూసి ప్రతీకారం తీర్చుకుంది వలసదారుడి ప్రభుత్వం....!


తెల్లవారిపోతుంది. శవం నుండి వాసన మొదలైంది. ఊరి శివార్ల లో దొరికిన కట్టెలతో చితి పేర్చారు. చితికి నిప్పంటించే ముందు గా రాజు ధరించిన ఖాకీ నిక్కరు లో లభించిన రక్తంతో తడిచిపోయిన మొల గడియారం, పుస్తకం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వందల మంది చూస్తుండగా, సూర్యోదయం అవుతుండగా, రెండో సూర్యుడి లా చితి మండటం మొదలైంది. ఎన్నో భయాల మధ్య పోలీసులే చితా భస్మాన్ని తాండవ నది లో కలిపేశారు.

******************************************************************************

రాజు చనిపోయాక బ్రిటిష్ సేన కి కొండంత ధైర్యం వచ్చింది. ప్రత్యేక దళలాని వెనక్కి పంపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. రాజుదళం లో ప్రధమ సేనాని అయిన "గంటం దొర" నాయకుడయ్యాడు. అతన్ని పట్టుకొనే పని మీద 15 కి పైగా పోలీస్ దళాలు గాలిస్తున్నాయి. ఆ సమయం లోనే "నడింపాలెం" గ్రామానికొచ్చిన గంటందొర "రామరాజు బ్రతికే ఉన్నడనీ, ముగ్గురు అనుచరులతో మాంచ్ ఖండ్ వెళ్ళాడనీ...జూన్ 2 నాటికి తానేంటో చూపిస్తానని" ప్రకటించాడు. అయితే పోలీసులకి పట్టుబడిన అగ్గిరాజు నుండి సమాచారం రాబట్టిన పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమం మొదలు పెట్టిన రామరాజు లేకపోవడం, పోలీసులు పెట్టే బాధలు, సహకరిస్తే వచ్చే బహుమతులు ప్రజల్లో చాలా మార్పు తీసుకొచ్చాయి. ఏ గ్రామం ఉద్యమకారులని ఆ గ్రామ ప్రజలే కొట్టి చంపేయ్యడమో, ప్రాణాలతో పట్టుకొని పోలీసులకి అప్పగించడమో చేయడం సాధారణమయ్యింది.

మే 26 న జరిగిన ఒక సంఘటన మాత్రం ఉద్యమాన్ని పునాదులతో సహా పెకలించడానికి వీలుచేసింది. రాజుదళం లో ప్రధాన సభ్యుడయిన ఎండుపడాలు ని చంపేసినప్పుడు అతని దగ్గర రాజు వాడే "పూజ పెట్టె" (ఇది ఎవరో బ్రిటిష్ అధికారి వాడే లెదర్ బ్యాగ్. దాన్ని రాజు స్వాధీనం చేసుకొని వాడేవాడు.) దొరికింది పోలీసులకి. అందులో పుస్తకాలు, మ్యాపులూ దొరికాయి. ఏ యే గ్రామం నుండి ఎవరెవరు ఉద్యమం లో చేరినది, ఎప్పుడు చేరినదీ? ఎప్పుడు సెలవు తీసుకొని వెళ్ళిపోయినదీ మొత్తం వివరాలు రాసి పెట్టుకున్నాడు రామరాజు. అలాగే ఏ యే పోరాటాలలో ఎవరెవరు చనిపోయారో, ఎవరు కొండదళాన్ని పట్టివ్వడానికి ప్రయత్నించారో, ఆ గ్రామ ప్రజల మీద రామరాజు విధించిన సుంకాల వివరాలు కూడా అందులోనే ఉన్నాయి. ఈ సమాచారమంతా పోలీసుల చేతికి రావడం తో మొత్తం ఉద్యమకారులంతా పిట్టల్లా రాలిపోయారు.
 1924, జూన్ 7
గంటం దొర  చిన్న భార్య పోలీసులకి చిక్కింది. సరిగ్గా మూడు రోజుల తర్వాత అతని పెద్ద భార్య, పిల్లలు అతనికి భోజనం తీసుకువస్తుండగా "వలసం పేట" గ్రామం లో పోలీసులకి దొరికిపోయారు. గంటం దొర ఉన్న ప్రాంతం గురించి చెప్పక తప్పలేదు వాళ్ళకి.గంటందొర దళం, పోలీసు బెటాలియన్స్ కి మధ్య కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఎడమ తొడ విరిగి, తూటాలు శరీరం లోకి చొచ్చుకుపోయి కొనప్రాణం తో పోలీసులకి దొరికిపోయిన గంటందొరని బయొనెట్ తో పొడవటం తో కన్నుమూసాడు.కృష్ణదేవీపేట కి అతని శరీరాన్ని తీసుకొచ్చి, రాజు కి దహన సంస్కారం చేసిన చోటనే అంత్యక్రియలు జరిపారు. 

గోకిరి ఎర్రేసు ని పోలీసులు పట్టుకున్నారు. మల్లుదొరకి ఉరిశిక్ష విధించి, ఆ పై దానిని జీవిత ఖైదుగా మార్చారు. చాలామంది తెల్ల సైన్యం జరిపిన కాల్పుల్లో చనిపోగా, ఉద్యమం ముగిసిన తర్వాత సుమారు 300 మంది  జైలుకి పంపించ బడ్డారు. అందులో  నెల రోజుల శిక్ష నుండీ జీవిత ఖైదు వరకూ విధింపబడ్డవారు ఉన్నారు.
జూన్ నెలాఖరుకి, అంటే అల్లూరి శ్రీరామరాజుచనిపోయిన నెల రోజులకి,  ఫితూరీ ఆనవాలు లేకుండా పోయింది. పోరాటం ముగిసింది...!

****************************************************************************
12 సంవత్సరాల తర్వాత...
Indian national congress ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రిగా ఉన్న C. రాజ గోపాలాచారి గారి చొరవ తో  చాలామంది మన్యం వీరులు విడుదల  అయ్యారు. ఇలా విడుదలయ్యి స్వేచ్చా ప్రపంచాన్ని చూసిన వారిలో మల్లుదొర, గోకిరి ఎర్రేసు కూడా ఉన్నారు.

ఉద్యమం లో కీలక పాత్ర వహించినా గానీ  వ్యసనాల కారణం గా రామరాజు చేత వెలివేయబడి, పోలీసులకి పట్టుబడిన మల్లుదొర, జైల్ నుండి విడుదలయ్యాక, 1952 లో పార్లమెంట్ కు నామినేట్ అయ్యి హస్తిన లో అడుగుపెట్టాడు.

రామరాజు ని చివరి వరకూ నమ్మి, అందరికీ దూరమైన గోకిరి ఎర్రేసు. .. ఒక సొరకాయ తంబురా చేత బూని కృష్ణదేవి పేట వీధులలో తత్వాలు పాడుతూ, భిక్షక వృత్తి చేపట్టాడు తన చివరి రోజుల్లో.

 ఏమయిపోయాడో లోకానికి తెలియని అగ్గిరాజు 1936 లో అండమాన్ సెల్యులర్ కారాగారం లో  అనామకం గా కన్నుమూసాడు.
ఇక రామరాజు వెనకే వెన్నంటి నడిచీ, రాజు ఆశయాలకి అనుగుణం గా మసలుకొన్న గంటందొర. ఆ రాముడి తో ఆ లక్ష్మణుడు అడవికి నడిస్తే, ఈ రామరాజు తో చావు లోనూ తోడు వెళ్ళిన గాం గంటం దొర  ఇదిగో..... ఇలా రాజుగారి పక్కనే , విప్లవాగ్ని అల్లూరి శ్రీరామరాజు తో పాటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
(కృష్ణదేవి పేట లో అల్లూరి మరియు గంటం దొరల సమాధులు. కొద్ది కాలం కిందట వీటికి మెరుగులు దిద్దారు)
*******************************************************************************

"ఉద్యమ సాఫల్య వైఫల్యాల మీద చర్చ అనివార్యం. ఉద్యమ నేత దృష్టి, పంధా, తాత్వికతల గురించి అంచనాలూ అవసరమే. నిజానికి అదొక పాఠం. అంతకంటే కూడా, ఒక సదాశయం కోసం జరిగిన రక్త తర్పణలనీ, త్యాగాలనీ, ఆ ఆశయం కోసమ్ ఒక తరం పడిన వ్యధనీ,బాధనీ, క్షోభనీ, అన్నిటికీ మించి ఆ తరం  కార్చిన కన్నీళ్లని అలా గాలికి వదిలివేయడం ఒక తప్పిదం. ఒక ద్రోహం. కాబట్టే ముందు తరాలు, ఆ ఉద్యమం నీడ, ఆ నేత నీడ కాలం మీద ఎలా పరుచుకున్నాయో చూడాలి. అదొక స్పూర్తి."
--- శ్రీ గోపరాజు నారాయణరావు

*********************************************************************************
అల్లూరి సీతారామరాజు గారి మీద ఎవరెవరు పుస్తకాలు రాశారో, అవి ఎక్కడ దొరుకుతాయో పెద్దగా సమాచారం లేదు.నిజానికి శ్రీరామరాజు మీద రాయబడిన పుస్తకాలు ఉన్నాయి కానీ వాటి వివరాలు తెలియవు. పైగా రామరాజు స్వాతంత్ర్యం వచ్చేవరకూ బతికే ఉన్నాడనీ, అతనికి 8 మంది భార్యలనీ,బెండపూడి లో ఉన్న సాధువే రామరాజనీ విచిత్రమైన కధలూ, వాటిని సొమ్ము చేసుకుని హడావిడి చేసే టీవీ కార్యక్రమాలూ, రామరాజుని ఒక బందిపోటు దొంగ, భూకబ్జాదారుడి గా చిత్రీకరించిన కధనాలు పుట్టుకొచ్చిన సంఘటనలూ ఉన్నాయి. ఈ తెలుగు గడ్డలో పుట్టి ,పాతికేళ్ళ వయస్సు లో ప్రపంచం లోని అతిపెద్ద సైనిక శక్తి పై అమాయకప్రజల చేత తిరుగుబాటు చేయించీ, దాదాపు రెండేళ్ల పాటు పోరాటం చేసి, అతి తక్కువ వయస్సులోనే వీరమరణం పొందిన ఒక మహనీయుడి గురించి భావి తరాలకి తెలియజేసే ప్రయత్నాలు జరగకపోవడం బాధాకరం.  రాజకీయనాయకుల మీదా, క్రీడాకారుల మీదా, కవుల మీదా స్కూల్ పాఠ్యపుస్తకాల్లో పాఠాలున్నాయి గానీ ఈ తెలుగోడి మీద ఏ తెలుగు పాఠ్యపుస్తకం లోనూ, ఏ సోషల్ స్టడీస్ పుస్తకం లోనూ లేకపోవడాన్ని ఏమనాలో?.  అతని గురించి తెలుసుకోడానికి అందరికీ అందుబాటులో ఉన్న, అందరికీ అర్ధమయ్యే విధంగా ఉన్న ఏకైక మార్గం... అల్లూరి సీతారామరాజు సినిమా. రామరాజు గురించి ఎంతో రిసెర్చ్ చేసి,  తెలుగు చలన చిత్రాలలో గర్వంగా చెప్పుకోదగ్గ గొప్ప సినిమా తీసి,(అందులో కొన్ని కల్పితాలున్నా సరే) తన అద్బుతమైన డైలాగ్ డెలివరీ తో మంత్రముగ్ధుల్ని చేసి, అల్లూరి గురించి తెలుసుకోవాలనే తపనని నాలో కలుగజేసిన  సూపర్ స్టార్ కృష్ణ గారికీ, ఆ సంభాషణలు అందించిన మహారధి గారికీ, రామరాజు మీద రాయబడిన పుస్తకాలన్నిటినిటి మీదా పరిశోధన చేసి,  ఓ గొప్ప పుస్తకాన్ని రాసిన శ్రీ గోపరాజు నారాయణ రావు గారికీ ఈ సిరీస్ అంకితం.

సరదా పోస్టులు రాసుకునే నా చేత ఇలాంటి సిరీస్ రాసేలా ప్రోత్సహించిన ఆలమూరు  సౌమ్య గారికీ, తమ విలువైన సమయాన్ని వెచ్చించి ప్రతీ పోస్టుకీ వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహించిన నా మిత్రులకీ ప్రత్యేక కృతజ్ఞతలు.

జై..హింద్..!

33 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

9 కధలు జాగ్రత్తగానే చదివాను.(జాగ్రత్త అంటే.. చరిత్ర చదివేటప్పుడు ముందుది వెనకది సమన్వయం చేసుకుంటూ చదవాలోయ్ బడుద్ధాయ్ అనేవారు మా హిస్టరీ మాష్టారు చిన్నప్పుడు)
మీరు వ్రాస్తే మాములుగానే బాగుంటాయి కానీ ఇవి ఇంకా బాగున్నాయి.

ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో 'విప్లవ వీరుడు' అనే శీర్షిక తో చాలా వ్యాసాలే వ్రాసారు శ్రీ.ఎం.వి.ఆర్. శాస్త్రి. నేను కొన్ని చదివాను. మిగిలిన కధ మీ ద్వారా తెలిసింది.

ఒక విమర్శ ఉండేది మా చిన్నప్పుడు. అల్లూరికి ఆనాటి రాజకీయ నాయకుల ప్రోత్సాహం, సహకారం లేవు. ఉంటే బహుశా ఆ పోరాటం ఇంకా కొంత కాలం సాగేదేమో నని.

మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని వ్రాసారు. అభినందనలు.

Padmarpita said...

అద్భుతంగా ఆవిష్కరించారు.....అభినందనలు.

Sravya V said...

ముందు గా మీకు అభినందనలు ఇంత మంచి సిరీస్ ని విజయవంతం గా పూర్తి చేసినందుకు.
ఈ భాగం చాల బాగా రాసారు రాజ్ !
అరుదైన ఫొటోస్, కొన్ని న్యూస్ క్లిప్పింగ్ తో సహా రాసిన ఈ సిరీస్ one of your best !

Anonymous said...

Great Job Raj ! Congratulations !!!!

ఆ.సౌమ్య said...

రాజ్..ముందుగా అభినందనలు ఇంత మంచి సీరీస్ తో ముందుకొచ్చినందుకు.
నీ సత్తా ఏమిటో మరోసారి నిరూపించావు. నువ్వు రాయగలవు అన్న నా నమ్మకాన్ని నిలబెట్టావు :)
ఒక్కో భాగమూ చదువుతుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చివరి భాగం చదువుతుంటే కళ్ళు తడిసాయి.
శ్రీ రామరాజు జీవిత చరిత్రలోని సత్యాలు చాలామందికి (నాతో సహా) విపులంగా తెలియవు. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నది, సినిమా చూసి నేర్చుకున్నది తప్ప. కల్పితాలు, అతిశయోక్తులు లేని నిజమైన జీవితగాథను రసవత్తరంగా బ్లాగుకెక్కించే బృహత్కార్యాన్ని దిగ్విజయంగా, అద్భుతంగా పూర్తి చేసినందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.


ఇలాంటి మంచి పోస్టులు మరిన్ని రాయగలవని ఆశిస్తున్నాను.

..nagarjuna.. said...

Thanks and kudos for presenting the series Raj.

Unknown said...

<<>>

సరదా పోస్టైతే అప్పటికప్పుడు చదివి నవ్వుకోవచ్చు రాజ్!డెప్త్ ఉన్న పోస్ట్ చదవాలంటే తీరిగ్గా మెదడులోకి నిక్షిప్తం చేస్తూ చదవాలి. ఈ సిరీస్ ఇప్పుడే పూర్తి చేసాను. ఓ పొగడ్తైనా, ఓ మెచ్చుకోలైనా ఇక్కడ తేలిపోతాయనిపించింది. ఏకబిగిన చదివించావు. బాగుంది. నోట మాటలేదు. రామరాజు మరణం, ఆ ఫోటో ఒక్కసారి గుండెను మెలిపెట్టింది:((

జయ said...

No words to say Rajkumar. చేతులు తిరిగిన రచయితల కన్నా చాలా చక్కటి భాషతో ఎంతో వివరంగా రాశారు. నా అభిప్రాయాలు చాలా మారిపోయాయి. ముఖ్యంగా రామరాజు మరణం లో ఉన్న నా అనుమానాలన్నీ రబ్బర్ తో చెరిపేసినట్లే పోయాయి. రామరాజు జీవితమంతా పక్కనే ఉండి నేను కూడా ప్రతి ఘట్టం అనుభవిస్తున్నట్లే అనిపించింది. చివరి వాక్యాలు ఎన్నో రకాల ఫీలింగ్స్ తెప్పించాయి. రామరాజు కృషికి, త్యాగానికి సరి అయిన గుర్తింపు వస్తే బాగుండు. మీతో పాటు సౌమ్య గారికి కూడా కృతజ్ఞతలు. తొందరలోనే ఇంకో సిరీస్ మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను.

శ్రీనివాస్ పప్పు said...

నీలోని రచయిత లోకానికి పరిచయం అవడానికి ఇంకెంతో దూరం లేదనిపిస్తోంది నాకు.అభినందనలు.

నిషిగంధ said...

ఏదైనా సిరీస్ రాయాలంటే ఒక్క విషయజ్ఞానమే కాదు ఎంతో నిబద్దత కూడా ఉండాలి!! మీకష్టం అంతా ప్రతి భాగంలూనూ కనబడుతోంది!

ఏదో పాఠ్యపుస్తకాల్లోనూ.. సినిమాల్లోనూ చదివిన/చూసిన సంగతులే కానీ ఈ వీరుడి వెనకు ఇంత సమగ్రమైన చరిత్ర ఉన్నదనీ, ముఖ్యంగా ఆయనకున్న (ఉన్నవి అనుకున్న) దివ్యశక్తుల గురించీ మీ ద్వారానే తెలిసింది, రాజ్!
చాలా బ్యాలన్స్‌డ్‌గా రాశారు...
మంచి సబ్జెక్ట్.. విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు.. మాకు కాస్త విషయ పరిజ్ఞానాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు :-)

ఇంతకీ ఈ సిరీస్ అంతటికీ బ్లాగ్‌లో ఒక లేబుల్ చేశారాండీ!?

Unknown said...

excellent sir
mari tarwatha antiiii...............ika
let's strat.......

Raviteja said...

మీ బ్లొగ్ పొస్త్ వల్ల మన్యం వీరుడు గురుంచి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను

పల్లా కొండల రావు said...

రాజ్ !

అల్లూరి గాథను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు. చాలా బాగా రాశావు. నీలో ఈ యాంగిల్ కొనసాగాలని , మరిన్ని స్పూర్తివంతమైన చారిత్రక గాథలు నీ కలం నుండి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యలో రెండు ఎపిసోడ్స్ చూడలేదు వ్యక్తిగత పని ఒత్తిడి వల్ల. అవికూడా చదవాల్సి ఉంది. ముగింపులో కూడా నీ విమర్శ , కృతజ్ఞతలు అందరి బాధ్యతను గుర్తెరగజేస్తున్నాయి. విమర్శనాత్మకంగా , చదివింపజేసేవిధంగా అతిశయోక్తులు లేకుండా, అడుగడుగునా అందరినీ ఇన్వాల్వ్ చేసేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లనిపించింది. చాలా కృషి చేసి పత్రికా క్లిప్పింగులతో సహా అందించడం బాగుంది. చరిత్రను అందులోనూ ఓ విప్లవవీరుని గాథను పరిశోధించి పట్టుదలగా, ఇష్టంతో వ్రాశావు. అల్లూరి గురించి ప్రతి అడ్డమైన కథనాలను టీ.ఆర్.పీ రేటింగ్ల కోసం ఓ ఐటంగా వేసే టీ.వీ వాళ్లకు నీ కథనాలు కనువిప్పు అవుతాయి. నాకూ కృష్ణ సినిమాద్వారా అల్లూరి గురించి తెలుసు ఆ తరువాత ఓ బుక్ చదివాను. నీ పోస్టుల ద్వారా మరిన్ని వివరాలు ముఖ్యంగా అల్లురి మరణం , సీత గురించి , అల్లురి నిక్కరు గురించి, మరణానతరం సహచరుల గురించి , మల్లుదొర - గంటం దొర గురించి ఇప్పుడు తెలుసుకున్నాను. అల్లూరి పోరాటం ఎంత స్పూర్తినిస్తుందో , ఆయన మరణం అంత జాగ్రత్తలనూ తెలుపుతుంది. ఈ పోస్టులన్నీ ఓ బుక్ గా చేస్తే బాగుంటుందనిపిస్తుంది.

Anonymous said...

మీ అల్లూరి కథను రాసిన్రు సరే. మా కొమొరం భీం, చాకలి ఐలమ్మ కథను రాషే 'దమ్ముందా'? :) ;)

రాజ్ కుమార్ said...

బులుసుగారూ.. అవునండీ ఆనాటి రాజకీయ నాయుకుల సపోర్ట్ ఉండి ఉంటే ఇంకొంత కాలం సాగిఉండేది. ధన్యవాదాలు.

పద్మార్పిత గారూ, శ్రావ్యగారూ, అనానిమస్ గారూ... థాంక్యూ సో మచ్ అండీ

రాజ్ కుమార్ said...

సౌమ్యగారూ... చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో ఉండేదా? నాకు గుర్తున్నంత వరకూ ఒక ఫోటో మినహా పాఠాలేం లేవు. ;(
ధన్యవాదాలు ;)
థాంక్యూ చారీ.. ;)

సునీత గారూ.. << మెదడులోకి నిక్షిప్తం చేస్తూ చదవాలి. ఈ సిరీస్ ఇప్పుడే పూర్తి చేసాను.>>>>
మనసు నిండిపోయిందండీ.. ధన్యవాదాలు ;))

రాజ్ కుమార్ said...

జయగారూ.. మీకు నచ్చినందుకూ, మెచ్చినందుకూ హ్యాపీ గా ఉందండీ.. ఇంకో సిరీసా..? ;) చూద్దాం..ఏది రాయగలుగుతానో.. మీకు సమాధానం దొరకని ప్రశ్నలేమన్నా ఉండిపోతాయేమో అనుకున్నా.. అన్నీ కవర్ చెయ్యగలిగినందుకు హ్యాపీస్
థాంక్యూ అండీ.

థాంక్యూ పప్పుసార్.. రచయితా?? అంత పెద్దమాటలెందుకు లెండి ;)

నిషి గారూ... థాంక్యూ సో మచ్ అండీ.. మీరు చెప్పాకనే గుర్తొచ్చిందండీ... లేబుల్ చెయ్యడం.. ఇప్పుడు చేసేశా.. థాంక్యూ అగైన్.. ;)

రాజ్ కుమార్ said...

Unknown గారూ, రవితేజా.. థాంక్యూ వెరీ మచ్..;)

కొండలరావు గారూ... తొందరగా మిగిలిన భాగాలు కూడా చదివేసి చెప్పండి మరి ;). మీరు కనిపించకపోయేసరికి బిజీ అనుకున్నాను లెండి. అల్లూరి కిసంబంధించి మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను.
బుక్ గురించి అంటారా.. దీనికన్నా అతనిమీద రాయబడిన పాత పుస్తకాలు సేకరించి, డిజిటల్ కాపీస్ చెయ్యాలని ఉందండీ.. ఎప్పుడు వీలవుతుందో మరి..
ధన్యవాదాలు ;)

Anonymous said...

Well written

రాజ్ కుమార్ said...

శంకర్ గారూ.. ప్రస్తుతానికి మన అల్లూరి ని గురించి మాత్రమే తెలుసుకున్నానండీ.. మన కొమరం భీం,ఐలమ్మ గురించి తెలుసుకున్న రోజున తప్పకుండా రాసే ప్రయత్నం చేస్తాను. ;)

ధన్యవాదాలు

మాలా కుమార్ said...

చాలా బాగా వ్రాశారు రాజ్ . అభినందనలు .

రాజ్ కుమార్ said...

snkr గారూ, మాలాకుమార్ గారూ ధన్యవాదాలండీ

AB said...

Superb ga undi.

Bookmarked

Thanks

Anonymous said...

అల్లూరి సీతారామరాజు అంటే ఎవరూ అని అడిగే రోజులలో మంచి టపాలు వేశారు. మొదటి టపా నుంచి చదివి తరవాత ఇప్పటిదాకా అగాను. చరిత్ర చదివించడం కష్టం కాని సీతారామరాజు చరిత్ర అటువంటిది కాదు. నేను వీరిని నా టపాల్లో చాలా సార్లు తలుచుకున్నా.

రాజ్ కుమార్ said...

అశ్విన్ గారూ, కష్టేఫలి గారూ.. ధన్యవాదాలండీ
కష్టేఫలి గారూ.. అవును... అతని చరిత్ర అలాంటిది

రసజ్ఞ said...

ఏకబిగిన ఈ సీరిస్ మొత్తం చదవాలన్న కోరిక ఇప్పుడే తీరింది. కానీ, చదివిన తరువాత ఎలా స్పందించాలో కూడా తెలియటం లేదు నాకు. ఇంతటి మహావీరుని మా ముందుకు తీసుకొచ్చిన మీకు నమోన్నమః, మిమ్మల్ని ప్రోత్సహించి వ్రాయించిన సౌమ్య గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వ్యాసం గురించి నేను ఏమి మాట్లాడినా తక్కువే అవుతుంది.
ఈ సీరీస్ లో మాత్రం మీ శైలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే "విస్మయం"

రాజ్ కుమార్ said...

రసజ్ఞ గారూ.. నమోన్నమః నమోన్నమః

Ennela said...

yuva raj neeku nuvve saaTi. Jay ho

Sowjanya said...

Raj garu...Naaku ee madya ne mee blog gurinchi telisindi office lo oka friend pampatam valla. Unnavanni varusaga okkoti chaduvutu unna. Meeru inta goppa katha indulo rasarani teliyadu, raasi untarani kuda uhinchaledu.

Suneetha garu cheppinatlu Manasu keendrikarinche paristhitulu undi, sankshiptamavutundi anukunappudalla mee blog open chesi series complete chesanu.

Ee dikkumalina software jobs lo cheri telisina koncham Telugu, Samskruthi, Charitra marichipotunnam.

Asalu mee blog chadivi chala rakala feelings vachayi manasulo. Kani cheppentha Telugu ravatledu marchipovatam vallano emo.

Kani meeru raasina vidhanam amogham, adbhutam, chirasmaraneeyam...Chala chala baga raasaru. Naaku Alluri gari gurinchi aa movie lo chusindi tappa emi teliyadu. Kani ee roju mee blog chavatam valla motham kshunnam ga telisindi. Kallaku kattinatlu ga undi.

Inta baga raasinanduku, oka charitra karudi gurichi maakandariki telipinanduku, meeku ela ela abhinandanalu telupukovalo, mimmalni ela prasasimchalo teliyatledu...

Nijam ga photos, paper articles to raasina mee srama amogham, slaghaneeyam.

Ayana chanipovatam chaduvutunte, aa photos chusi manasantha chala badha ga hrudaya vidharakam ga ayindi. Entati maha naayakudi ki entati durbharamaina maranam ani...

Meeru oka writer oo kaado naaku teliyadu kani meeru atu vaipu ga sramisthe chala ranistaru, inka ilanti kathanalu bhavi taralaku velugu loniki teesukuni vastaru.

Meeru cheppindi nijam. Ento mandi swatantra udyama karulu unnaru. Kani vallevarini vache tarala vaariki teliyanivvatledu ippudu unna Rajakeeya naayakulu. Ana ki kora kani valla perlu (aa rojullo tella vallaku teesiponi vallu) edo mahanubhavullaga, desam kosam edo chesesinatlu adugadugana oka vigraham. Kani ilanti nijamaina nayakula gurinchi matlade valle leru.

Ento lendi ila nenu naa manasulo anipinchinavanni raasthe...idi oka bharatam avutundemo...

Motham meeda intha baaga raai ayana maa katha nu maaku teliyachesina meeku, andukosam chesina mee krushi ki Sirassu vanchi abhivandanam chestunnanu...

Endaro Veerula tyagaphalam, mana neti swetcha ke mula phalam...annaru oka kavi...

Andaru veerulu antha kashtapadi, tama praanalu arpinchi ichina swatantram deeni kosamena...ippudu mana desam unna paristhithi kosama...ivanni chustu valla atmalu enta ghoshistunnayo...

రాజ్ కుమార్ said...

సౌజన్య గారూ మీ కమెంట్ కి ఏం రిప్లై ఇవ్వాలో తెలియట్లేదండీ. కానీ మీకు బాగానచ్చిందని మాత్రం అర్ధమయ్యింది. మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ;)

శిశిర said...

అద్భుతం రాజ్. ఈ సిరీస్ వెనుక మీ కృషి మొత్తం ఈ అక్షరాల్లో కనిపిస్తూంది. సిరీస్ చదువుతుంటే ఉద్వేగం, ఉత్సాహం, క్రోధం, బాధ ఇలా అన్ని రకాల భావాలూ చుట్టుముట్టాయి. అల్లూరి వారి గురించి తెలియని చాలా విషయాలు తెలియజేశారు. రామరాజుని మీ మాటల్లో చూపించారు. చివరి భాగం చదివాక అల్లూరివారి సమాధిని ఒక్కసారైనా దర్శించి మొక్కాలనిపించింది.

నాగరాజ్ said...

అద్భుతంగా రాశావ్, రాజ్! నీ బ్లాగు కీర్తికిరీటంలో విప్లవ వీరుడు అల్లూరి మీద రాసిన ఈ తొమ్మిది పోస్టులు కలికితురాయిలుగా మిగిలిపోతాయనడం నిస్సందేహం. Inspiring posts! Thank you!

** బ్లాగుల గురించి లేటుగా తెలీడం వల్ల కాస్త ఆలస్యంగా చదివానివి.

Unknown said...

chaalaa baagundi