ఎలిమెంటరీ స్కూల్ చదువుని మూడు మొట్టికాయలూ, ఆరు అరుపులూ, ఏడు ఏడుపులతో వెలగబెట్టీ, హైస్కూల్ లో అడుగుపెట్టీ, ఆరవతరగతి ని ఇరగదీసి ఏడు లో అడ్డూ ఆపూ లేకుండా ఎగిరెగిరి పడుతున్న రోజులవి.
నేనూ, అప్పల్రాజూ, అనీలూ, ఫణీ నలుగురం జాన్ జిగిడీ దోస్తులం. అయితే రోజూ ఇంటర్వెల్ లో ఉసిరి కాయలూ,జామ కాయలూ , ఆశా చాక్లెట్ లూ కొనిపెట్టడం వల్లా నాకు ఫణి గాడితో బాగా దోస్తీ ఉండేది. అనిల్ గాడు A-సెక్షన్ కాగా, మిగిలిన వాళ్ళందరం C-సెక్షన్.
ప్యాచ్ పడిన సైకిల్ లాగా పూటకి పదిమైళ్ళ వేగం తో నడుస్తుంది కాలం......
ఒకరోజూ కొంపలు మునిగే పరిస్థితొచ్చీ, అర్జెంట్ గా వెళ్ళాల్సిన అవసరమొచ్చీ, మా ఇంగ్లీష్ సర్ స్కూల్ కి సెలవెట్టీ హడావిడిగా వెళ్ళిపోయారు. మునిగింది ఆయన కొంప కాదూ, కాలింది నా కొంపా అనీ తర్వాత తెలిసింది నాకు. ఆయన లేరు కాబట్టీ ఆరోజు కి మమ్మల్నందర్నీ A-సెక్షన్ తో కంబైండ్ చేసేశారు. నేను క్లాస్ లోకి వెళ్ళీ వెళ్ళగానే మా అనిల్ గాడు ఫస్ట్ రో లోంచి లేచి వాడి ప్లేస్ నాకిచ్చి, నువ్ కూర్చోరా అనేసి, నా వైపు అదోరకంగా చూసేసి, ఇంకో రకంగా నవ్వేసి వాడి బ్యాచ్ తో చివ్వరి లైన్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. పరలోకం నుండి దిగొచ్చిన దేవ దూతల్లాగా, తింగరి మొహాలేసుకున్న తేజోమూర్తుల్లాగా ఆ అతిధి మర్యాదలకి పూరీ పొంగినట్టూ పొంగి పోయి తిష్ట వేసుకొని కూర్చున్నాం. కానీ అప్పుడే తెలిసింది మాకు ఆ క్లాస్ తీసుకోబోయేదీ "సింహాచలం" మాష్టారని.
సింహాచలం మాష్టారి గురించి అంతకు ముందు కొంచెం విన్నాను. దుర్వాసుడి లాగా కోపిష్టి అనీ, ప్రకాష్ రాజ్ లాగా సాడిస్ట్ అనీ, చండశాసనుడనీ, అతను ఎంటరయితే హెచ్.ఎం కూడా లేచి నించుంటారనీ వగైరా..వగైరా. ఇంతలో చూడ్డానికి పొడుగ్గా, నల్లగా, లావుగా ఉన్న ఒక వ్యక్తి చేతిలో సిమెంట్ కవర్ తో చేసిన సంచి తో, మూర్ఖత్వం మూర్తీభవించిన ముఖం తో, వడియాలు వేపుతున్నట్టూ కరక్....పఱక్ అని చెప్పులు చేస్తున్న శబ్దాలతో లోపలికొచ్చారు. క్లాస్ అంతా పుష్పక విమానం సినిమాలో నటశిఖామణుల్లాగా.. సైలెంట్ అయిపోయి, సైగలు చేసుకోవటం మొదలెట్టారు. వచ్చీ రాగానే మా ఫణి గాడిని లేపి " నిన్న పాఠం ఎంతవరకూ చెప్పుకున్నాం రా? " అనడిగారు. ముందురోజు ఏం చెప్పారో మాకేం తెలుసు?. మా వాడు బెబ్బెబ్బే అన్నాడు. "బాబోయ్ బాబోయ్" అని అరిసే లాగా అరిసలూ, బుగ్గ మీద బొబ్బట్లూ అసలూ, వడ్డీ , కొసరుతో కలిపి వడ్డించి కూర్చోబెట్టారు. తరవాత నా వంతే. ఈ గ్యాప్ లో నిన్న ఏ పాఠం ఎంతవరకూ చెప్పారన్న ఇన్ఫర్మేషన్ గేధర్ చేసి ధైర్యం గా నిలబడి దర్జాగా చెప్పాను. "సరే అక్కడివరకూ చదువు" అన్నారు. నేను మొదటీ నాలుగు లైన్ లూ గడగడా చదివేసి, ఒకానొక పదం చదవటం రాక, బఠాణీ లు తింటూంటే మధ్య లో తగిలిన గులకరాయి నమలడానికి ట్రై చేస్తున్న వాడిలాగా రక రకాల ఎక్స్ప్రెషన్ లు పెట్టి, పెట్రోలయిపోయిన పల్సర్ కి డిస్క్ బ్రేకులు వేసినట్టూ ఆగిపోయాను. మెల్లగ తల యెత్తి చూశాను. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. "నల్లగా ఉండే ఆయన మొహం కోపంతో ఇంకా నల్ల బడిపోయింది. ఆయన మనిషిలా కాదు మండే అగ్ని గోళం లా కనిపించారు."
దవడ పగిలేట్టు కొన్నీ, నాది వీపా? విమానాశ్రయమా? అని నాకే డౌట్ వచ్చేటట్టు బోల్డన్నీ ఇచ్చి కూర్చోబెట్టారు. ఆ డీటీయెస్ కి మా క్లాస్ పక్కనే చింత చెట్టు మీద ఉన్న కాకుల గుంపు కావ్ కావ్ మంటూ దూరం గా ఎగిరిపోయింది. (ఈ సీన్ నే తర్వాత సినిమాలో కాపీ కొట్టేశారు ;().
చంప దెబ్బ కొడితే అంత సౌండ్ వస్తుందనీ, గూబ గుయ్య్ మనడం అంటే ఇదేననీ, దిమ్మతిరిగి మైండ్ బ్లాకయితే చెవులు వినిపించవనీ అనుభవ పూర్వకం గా తెలుసుకున్నాను. (నిజం చెప్పొద్దూ.. నా ఎడమ చంప నుండి వేడి వేడిగా ఆవిర్లు రావటం చూశాను). ఆ వెంటనే అప్పల్రాజు గాడిని లేపారు. వాడిని కూడా నాలుగు పీకబోతుండగా వాడు దొరక్కుండా దూరంగా పారిపోయి.. "నేను ఈ సెక్షన్ కాదు సార్..." అని అరిచాడు.
సార్ : అవునా? మరి వీళ్ళిద్దరూ??
అ.రాః వాళ్ళు కూడా కాదు సార్. ఈ రోజు రెండూ సెక్షన్లూ కంబైండ్ చేశారు
సార్: మరా ముక్క ముందు చెప్పి ఏడవచ్చు కదా..
నేను (మనసులో) : అంత టైమిచ్చావా మాకు? ( ఒక కంట్లోంచి గోదావరీ, ఇంకో కంట్లోంచి కృష్ణా, ముక్కులోంచి పెన్నానదీ పారుతుండగా.. )
క్లాస్ అయిపోయాక అనిల్ గాడోచ్చి.. "ఇప్పుడర్ధమయ్యిందా? నేను లాస్ట్ లైన్ కి వెళ్ళి ఎందుకు కూర్చున్నానో? అతను ఫస్ట్ లైన్ లో వాళ్ళని మాత్రమే అడుగుతారు. పైగా ఎవరి మొహాలూ గుర్తుండవ్. " అని చిదంబర రహస్యం చెవినేసి పోయాడు.
ఇటువైపు ఒక లుక్కేశాను. ఫణిగాడు ఏకాగ్రత తో ఏడుస్తున్నాడు. అటువైపు ఓ లుక్కేశాను. అమ్మాయిలంతా అదోరకంగా చూస్తున్నారు.మా సెక్షన్ అమ్మాయిలే కాదు పక్క సెక్షన్ అమ్మాయిల దగ్గర కూడా పరువు పోయిందన్న బాధ ఒకవైపు, వీపు మండిపోతున్న బాధ ఒకవైపు, అప్పల్రాజుగాడికి దెబ్బలు మిస్సయి పోయాయన్న కడుపుమంట మరోవైపు. యే భగవాన్..!
సాయంకాలం ట్యూషన్ సెంటర్ కి వెళ్ళేసరికి ఈ న్యూస్ కళ్ళ కలగలు వ్యాపించినట్టూ అన్ని స్కూళ్ళ వాళ్ళకీ వ్యాపించింది. ఆఖరికి మా ట్యూషన్ సర్ కూడా "ఏరా.. ఈరోజు దంతాలు కదిలాయంట మీకు?" అని అడగడం తో మా కోపం కిరోసిన్ పోసిన కుంపటి లో మంట లాగా ఎగసి పడింది.
నేనూ ఫణి గాడూ, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సర్ పై మాకు కోపం.... అన్యాయంగా కొట్టారని, బాధ ...క్లాస్ లో పరువు పోయిందనీ, చికాకు... మేమేం చెయ్యలేమనీ..
నేను : సింహాచలం మాష్టారు చచ్చిపోతే బాగుంటుందిరా.
ఫణి : అవున్రా.. నాకూ అదే అనిపిస్తుంది. రోజూ క్లాస్ కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ రోజు చర్చ్ లో ఇదే కోరుకుంటా..
నేను: దేవుడా... ఆ మాష్త్తారు చనిపోతే ఆంజనేయ స్వామి గుళ్ళో 100 కొబ్బరికాయలు కొడతాను. ఆయనంటే నాకస్సలు ఇష్టం లేదు.
4 రోజులు గడిచాయి. ఎప్పటీలాగానే సాయంకాలం ట్యూషన్ కి వెళ్లాను. ఫణిగాడు ఆందోళన గ పరిగెత్తుకుంటూ వచ్చి "ఒరేయ్.. సింహాచలం సార్ చనిపోయారంటా" అన్నాడు. నా జీవితం లో ఒక చావు వార్త వినడం అదే మొదటిసారి. నాకు భయం తో కాళ్ళు వణికాయి. గుండె గుభేల్ మంటుండగా "నిజమా?" అని అడిగాను. పక్కనే ఉన్న మా ట్యూషన్ సార్ చెప్పారు హార్ట్ ఎటాక్ వల్ల ఆ రోజు పొద్దున్నే చనిపోయారని. మేమిద్దరం ముఖాలు చూసుకున్నాం. మనమే కదరా ఆయన చనిపోవాలని కోరుకున్నదీ? "నేనే కదా వంద కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నదీ?" ఏమ్ చెయ్యాలిప్పుడూ? మా వల్లేనా ఇదంతా?
ఆ రోజు తెలిసింది మాకు పైకి చూడ్డానికి అలా కనిపించినా ఎంత మృదుస్వభావో?అంతకు కొన్ని వారాల ముందు బెస్ట్ టీచర్ అవార్డ్ రావడానికి కారణమయిన అతనికి తన వృత్తిపట్ల ఉన్న నిబద్దత ఎంతో.., తన సొంత తమ్ముడు 15 సం॥ లనుండీ ఏకధాటీగా ఎమ్మెల్యే గా చేసినా, ఆ దర్పం చూపకుండా ఆర్టీసీ బస్సులో సిమెంట్ సంచి చేతికి తగిలించుకు వచ్చే అతని నిరాడంబరత ఎంతో. హైబీపీ తో బాధ పడుతూ కోపం వచ్చినప్పుడు కంట్రోల్ తప్పే ఆయనకి మాపై ఉన్న కోపం ఏపాటిదో....
బాధేసింది...వారి కుటుంబాన్ని తలచుకొని.
సిగ్గేసింది...అసహ్యమేసింది.. నా మీద నాకే.. అలా మొక్కుకున్నందుకు.
కోపం వచ్చింది.. ఆ దేవుడి మీద... తెలియనితనం తో కోరిన నా కోరిక ని తీర్చినందుకు. అందుకే మొక్కు తీర్చలేదు. తీర్చను.!!
[ఇది జరిగి 14 సం॥ అవుతున్నా.. తలచుకున్న ప్రతీ సారీ బాధేస్తుంది ఎంత సర్ది చెప్పుకున్నా సరే. ఒక్కొక్క సారి మన కంటికి కనిపించేవీ , చెవులకి వినిపించేవీ, మనకి అన్పించేవీ నిజాలు కావు.. అందుకే ఎవరి మీద కోపం వచ్చినా, వారివల్ల నేను ఎంత బాధ పడినా, వారికి చెడు జరగాలని అనుకోను..పైన తధాస్తు దేవతలుంటారట... హ్మ్మ్...]
25 comments:
ఫస్ట్ నేనే
నవ్వుతు నవ్వుతూ సడెన్గా నవ్వాగిపోయింది బాస్..
ఇలాంటిదే నాకూ ఒక ఇన్సిడెంట్ జరింది నా చిన్నతనంలో, కాని నేను దాన్ని చెప్పలేను.
No words, touched..
కాని ఎందుకో తధాస్తుదేవతలని నేను నమ్మను, ఖర్మ సిద్దాంతమే కరెక్ట్ అనిపిస్తుంది..Lets's watch the life.
nijam gaa ilantivi andari jeevithallo jaruguthuntai.kadanam
kadilinchela undi.kosa merupu yentante nenu maths teacherni best teacher awardeeni,meeku istam ayithe naa blog choodandi.sasikala.
హ్మ్! ఆ చివరి రెండు పేరాలు చదివాక, ఏమి రాయాలో కూడా తెలియటం లేదు !
హ్మ్ చాలా బాధ వేసింది .. రాజకుమారు .. నిజమే తల రాతని ఎవరు మార్చలేము కదా ..
బాధ పడడం కి మించి మనమేమి చెయ్యలేము .. అయిన కోపం లో వంద అనుకుంటాము .. :( ఏంటో ఏమి రాయాలో కూడా తెలియడం లేదు
రాజ్.. చివరి పేరాతో మొదట్లో నవ్వుకున్న నవ్వులన్నీ మటుమాయమైపోయాయ్. ఏడిపించేసావ్. మాటల్లేవ్ అంతే..
ఓ సినిమాలో సంభాషణ ఉంటుంది రాజ్ " ఎదుటివాడికి మంచి జరగాలి అని కోరుకుంటే దేవుడు తప్పక వింటాడు, చెడు జరగాలని ఎంత కోరుకున్నా జరగదు" అని దాని సారంశం. కాకపోతే నీ చిన్నతనంలో జరిగింది కాబట్టి ఇంకా గిల్టి ఫీలవుతున్నట్టున్నావు దాని గురించి ఎక్కువగా పట్టించుకోకు
ఏడిపించావు రాజ్! హ్మ్ చిన్నపిల్లలు మీకు అప్పటికి ఏమీ తెలీదుకదా. మీ తప్పేమీ లేదులే, బాధపడకు. అయినా ఒక్కోసారి ఇలాంటివి జరిగితే మరచిపోలేము జీవితాంతం.
ప్యాచ్ పడిన సైకిల్ లాగా
కళ్ళ కలగలు వ్యాపించినట్టూ
బఠాణీ లు తింటూంటే మధ్య లో తగిలిన గులకరాయి నమలడానికి ట్రై చేస్తున్న వాడిలాగా ....ఇలాంటి ఉపమానాలు ఎలా తడతాయి నీకు? నీ బుర్ర నాకు కొంచం అప్పివ్వవూ....ఉపమానాలని మాత్రం వాడుకుని తిరిగిచ్చేస్తాలే :)
హ్మ్! రాజ్ నిజంచెప్పాలంటే...మీ బ్లాగ్ చాలా బాగుందని..అన్నీ పోస్ట్స్ ఫన్నిగా ఉన్నాయని నేను చదవడం మిస్ అయిన పోస్ట్స్ అన్నీ మెల్లగా చదువుకుంటూ వచ్చాను....చాలా బాగున్నాయ్! కానీ ఈ పోస్ట్ మొదట ఎంత నవ్వించిందో తరువాత అంత బాధ పెట్టింది :( పాపం మీ మాష్టారు :( నాకు ఇలాంటిదే ఉంది కాని.....నేను ఆ సార్ ని ఏమీ తిట్టుకోలేదు మనకెందుకులే అని! కానీ ఎందుకో ఈ పోస్ట్ చదివాక కొంచెం బాధేసింది :(
చివరికి వచ్చేసరికి ఏడిపించేశావ్ రాజ్.. నాగార్జున చెప్పినట్లు మంచిజరగాలని కోరుకుంటేనే దేవుడు మన మాట వింటాడు ఇలాంటి విషయాల్లో వినడు. కనుక మీరు మొక్కుతీర్చుకోనక్కర్లేదు.. కర్మ సిద్ధాంతాన్ని ఒక్క సారి గుర్తుతెచ్చుకోండి. చావుపుట్టుకలనేవి ముందే నిర్ణయించబడి ఉంటాయి.. ఎవరమూ మార్చలేము.
oh no, oh no. నవ్వించి నవ్వించి గుండె పిండేసారు కదా.
ఏమైనా టపా సూపరు అంతే.
>ప్యాచ్ పడిన సైకిల్ లాగా పూటకి పదిమైళ్ళ వేగం తో నడుస్తుంది కాలం.
>వడియాలు వేపుతున్నట్టూ కరక్....పఱక్ అని చెప్పులు చేస్తున్న శబ్దాలతో
>బఠాణీ లు తింటూంటే మధ్య లో తగిలిన గులకరాయి నమలడానికి ట్రై చేస్తున్న వాడిలాగా
ఇల్లాంటి ఊహల/ మాటల మసాలాలు ఎలా చేస్తారు
మీరు. కేక, గునపం ఇత్యాదులు అన్నీ.
తలరాతను తప్పించడం నిమిత్తమాత్రులమైన మనవల్ల ఏమౌతుంది రాజ్.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలవాలని కోరుకోవడం తప్ప మనం చెయ్యగలిగింది ఏమీలేదు.. తెలిసీ తెలియని వయసులో చేసిన దాని గురించి గిల్టీగా ఫీల్ కావడం అనవసరం .. జనన మరణాలు మన చేతుల్లో లేవు..
నేను నవ్విన నవ్వంత ఎక్కడ...??...మీరు ఇలా ఏడిపిస్తారు కూడానా...?? :(
touching post ......నాగార్జున చెప్పిన డైలాగ్..ని తల్చుకోండి..కరెక్ట్ అనిపిస్తుంది..
మీ టపా చదివాకా..నాకు కూడా కృష్ణ,గోదావరి,పెన్నా flowing ..
@కావ్య.. హ్మ్మ్.. అలా అనుకోవడమే మనం ఏమ్ చెయ్యలేం..
@గిరీష్.. తధాస్తు దేవతలని కధల్లో వినడమే గిరీష్ గారూ.. నిజానికి ఆ వార్త తెలిసే ముందువరకూ మేము ఆ సంగతి మరిచిపోయి జోకులేసుకుంటున్నాం..తెలియగానే నాకు అదే గుర్తొచ్చింది. ధన్యవాదాలు
శశికళ గారూ... తప్పకుండానండీ. ధన్యవాదాలు.
శ్రావ్య గారూ.. పరవాలేదులెండీ.. నెనర్లు.
మనసుపలికే గారు... i can understand..
@నాగార్జున, @వేణూశ్రీకాంత్ గారు.. అవునండీ.. మంచి కోరుకుంటే మంచే జరుగుతుంది అంటారు. కాకపోతే ఒకరి చెడు కోరుకోకూ అని దేవుడు చాలా స్ట్రాంగ్ గా చెప్పిన పాఠం ఇది అనిపిస్తుంది. నెనర్లు..
బులుసుగారూ.. హహహ..ఏదో మీలాంటి వారి శిక్షణ లో అలా వెలుగుతూ ఉంటాయంతే.. మీరు గునపాలు, గడ్డపార లూ ఇలాగే ఇస్తూ ఉండండీ నేను ఇనప సామాన్ల కొట్టు పెట్టుకుంటాను. ;) ;)
నేను నవ్విన నవ్వంత ఎక్కడ...??...మీరు ఇలా ఏడిపిస్తారు కూడానా...?? :(
touching post ......నాగార్జున చెప్పిన డైలాగ్..ని తల్చుకోండి..కరెక్ట్ అనిపిస్తుంది..
మీ టపా చదివాకా..నాకు కూడా కృష్ణ,గోదావరి,పెన్నా flowing ..
హ్మ్మ్
చాలా బాధాకరం రాజ్
పంచ్ డైలాగులతో ఎప్పటి లాగే నవ్వించి సడన్ గా గుండె పిండేసావు. ఆ వయసులో నువ్వు ఎలా ఫీల్ అయి ఉంటావో అర్ధం చేసుకోగలను. ఇంతకు మించి మాటలు రావట్లేదు.
Really good...
సౌమ్యగారూ.. రోజూ తలచుకుని అదేపనిగా బాధపడటం లేదుగానీ..గుర్తొచ్చినప్పుడు మాత్రం అదోలా అయిపోతుంది..ప్చ్.. ;(
నా బుఱ లో ఏముంది లెండీ.. మీరు మరీనూ.. ః)
ఇందుగారూ.. ధన్యవాదాలు ఓపిగ్గా అన్నీ చదివినందుకు.. ;) అయినా మీరు చాలా మంచోరు అందుకే మీ సర్ ని చెడుగా ఏమీ తిట్టుకోకోలేదు ;)
కార్తీక్..
>> ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలవాలని కోరుకోవడం తప్ప>>
అప్పట్లో అలా కోరుకోవాలని కూడా తెలీదు.. ఇంకో సంగతి ఏమిటంటే.. ఈ మ్యాటర్ కొంతమంది ఫ్రెండ్స్ కి తప్పా ఎవ్వరికీ తెలీదు ఇప్పటీవరకూ.. హ్మ్మ్..
కిరణ్ గారూ.. మళ్ళీ మొదటి నుండీ చదవండీ దొరుకుతాయి..;)
ఇక మళ్ళీ ఇలాంటివి రాయనులెండీ..ధన్యవాదాలు.
హరే..! మరే.. ఏం చెయ్యలేని పరిస్థితి. ఎవరికన్నా ఇది చెప్తే నన్ను తన్నే పరిస్థితి..;(
సాయి.. హ్మ్మ్... అర్ధం చేసుకోగలను..
వెంకీ గారూ ధన్యవాదాలు..
Touching post Raj, post starting lo entha navvano , ending ki vachheppatiki naku theliya kundane naa kallalo kannellu
విరబోణి గారూ.. స్వాగతం.
ధన్యవాదాలండీ..
cheppataniki matalu levu....
కిషోర్ గారూ..
స్పందించినందుకు ధన్యవాదాలు
Post a Comment