Wednesday, March 25, 2020

పాచిపోయిన పకోడీలు.... వేడి వేడి గా ..!!


టైటిల్ చూసి ఇదేదో వికటించిన యూట్యూబ్ వంటల ప్రయోగం మీద ప్రతీకారం పోస్ట్ అనో , మొన్నామధ్య రైల్లో తిన్న పకోడీ తాలూకా దుష్ప్రభావాల వల్ల దెబ్బతిన్న జీర్ణాశయం మనోభావాల పోస్ట్ అనో  అనుకుంటారేమో!! కాదు కాదు.  ఫ్లాపయిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో చూసి హిట్టయ్యే రివ్యూలు రాసిన పని తక్కువ కాలం లో,చచ్చి పోయిన మా నానమ్మ కి సీరియస్ గా ఉందని చెప్పి సెలవు తీస్కొని ఇంటికెళ్ళిపోయే వీలున్న జిత్తులమారి  కాలం లో,  టీమ్ లో కాకపోయినా కనీసం డిపార్ట్మెంట్ లో అయినా ఒక్క కత్తి లాంటి అమ్మాయి ఉంటే బాగుండేది అనుకునే కరువు కాలం లో, నా దరిద్రం నాలుగు పాదాల మీద నడిచేరోజుల్లో (ఇప్పుడు 14 పాదాలు లెండి) జరిగిన కొన్ని సంఘటనల సమాహారం.

అది 2010. నా పేరు తెచ్చిన తిప్పల (ఇక్కడ నొక్కితే నేనూ శనీశ్వరుడూ కలిసి ఆడిన డిస్కో చూడొచ్చు ) వల్ల పడిన బొక్కలన్నీ పూడ్చుకొన్నాక మొట్ట మొదటి సారిగా నాకు ఆన్ సైట్ అవకాశం వచ్చింది సౌత్ కొరియా కి. అప్పటిదాకా మా ఊరి ఎర్ర బస్సు, మా కాలేజీ కుక్కల బస్సు, జనం ద్రాక్ష గుత్తుల్లా వేలాడే BMTC  బస్సూ  ఎక్కేను తప్ప విమానాన్ని దగ్గర నుండి కూడా ఎప్పుడూ చూడలేదు. "థాయ్ ఎయిర్ లైన్స్" వాడి విమానం ఉద్యమ కాలం లో కాలిపోయిన ఆర్టీసీ బస్సు కి ఏషియన్ పెయింటింగ్స్ వేసి ఉమ్ముతో రెక్కలు అతికించినట్టుంది. సెంటర్ లో ఒక తెర కట్టి చావు దగ్గరకొస్తే ఎలా ఉంటాదో వివరం గా చెప్పే వీడియో వేశారు. ఆపై ఆలిండియా రేడియో ఆడియో పెట్టి ఎదో హిందీ సినిమా వేసాడు. అది అరిగిపోయిన మా పిన్నిపెళ్లి క్యాసెట్ క్వాలిటీ తో చూడముచ్చట గా ఉంది. చిన్నప్పుడు మా ఊరి మధ్య లో ఇలాంటి తెర మీదనే గూండా, రుస్తుం, త్రినేత్రుడు లాంటి సినిమాలు చూసిన జ్ఞాపకాలు ఆవులిస్తూ బద్ధకం గా నిద్రలేచాయి. ఇంతలో సున్నం కొట్టిన చీపురు పుల్లకి చీర కట్టినట్టున్న  "గగన సఖులు" (ఈనాడు పేపర్ చదవరా మీరు??) "టీ .... చైనీస్ టీ...సా...... ర్" ("మసా.... జ్... సాండ్విచ్ మసా.... జ్.. సలోలీ సలోలీ" రాగం ) అంటా తిరగడం మొదలెట్టేరు. అవసరం అయితే హాట్, అక్కర్లేదంటే కూల్ డ్రింకులు గ్లాసుల్లో పోసి పోతున్నారు. అసలే కరువు లో కట కట లాడుతున్న నేను గ.స ని దగ్గర నుండి చూడొచ్చ్చని కక్కుర్తి కొద్దీ ఆరెంజ్ జ్యూస్ లీటర్లకి లీటర్లు తాగడం పోయి రావడం మొదలెట్టాను. కొద్ది సేపటికే ఆ జ్యూస్లు, తిండి , సఖులు బోర్ కొట్టడం మొదలెట్టింది. అప్పటికి ఇప్పుడున్నంత ఫోన్ అడిక్షన్ లేకపోవడం, వెంట పుస్తకాలు  ఏవీ తెచ్చుకోకపోవడం, బ్యాంకాక్ లో కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం వెయిట్ చెయ్యడం, చీటికీ మాటికీ సెక్యూరిటీ చెక్, వీటన్నివల్లా చిర్రెత్తుకొచ్చింది. అర్ధరాత్రి 12 కి మొదలైన ప్రయాణం.. కొరియా చేరేసరికి సాయంత్రం నాలుగయింది. బస్సెక్కి హోటల్ కి చేరుకునేసరికి చీకటి పడింది. ఫ్లయిట్ జర్నీ కి అలసిపోతారని అప్పుడే తెలిసింది. స్నానం చేయకపోతే స్చచిపోతానేమో అనిపించి బట్టల కోసం ట్రాలీ ఓపెన్ చేసే సరికి... చిరిగిపోయిన ఉప్మా నూక, పప్పు , రైస్ ప్యాకెట్లు లోపల అల్లకల్లోలం చేసి బయట పడ్డాయి. అదంతా సర్దుకునేసరికి షాడో సినిమా కనిపించింది. తువ్వాలు తీస్కొని బాత్రూం కి వెళ్లాను. ఉన్నది ఒకటే ట్యాప్. దానికే షవర్ ఉంది. ఆ ట్యాప్ ఎలా ఆన్ చెయ్యాలో నా మట్టి మొహానికి తెలిసి ఏడవలేదు. అరగంట సేపు రాక్షసప్రయత్నం చేసి నా వల్ల కాక మళ్ళీ బెడ్ రూమ్ కి వఛ్చి "ఛీ నా బతుకు" అనుకోని కళ్ళు మూసుకొని యోగ నిద్ర లోకి వెళ్లాను. జ్ఞాన బల్బు డింగ్ మని వెలిగింది. ఆ ట్యాప్ ని తిప్పడం కాదు.. పైకెత్తాలని తెలుసుకున్నాను. బల్బు ని కనిపెట్టినప్పుడు ఎడిసన్  కి కూడా అంత ఆనందం కలిగి ఉండదు. పొద్దున్నే 8 కల్లా ఆఫీస్ లో ఉండాలంట. అసలే మూడున్నర గంటలు ఫాస్ట్. సమయం లేదు మిత్రమా అని అంతరాత్మ గగ్గోలు పెట్టడం తో నిద్దరోయాను. 

*******************************************************************************************************

మన లెక్కలో తెల్లవారుజామునే నిద్రలేచి, "ఔరా.. KO-RAIL " అనిపించే మెట్రో ఎక్కి ఆఫీస్ కి వెళ్ళాము మా గుంపంతా. టైం ఎనిమిది అయ్యేసరికి
"లోపల ఫ్రీ గా బెల్లం జిలెబీలు లు పంచుతున్నారంట... ఎన్నికావాలంటే అన్ని" అన్నట్టుగా ఆఫీస్ లోపలకి పరుగులు పెడుతున్నారు సాటి ఇంజినీర్లు. 8 కి ఆఫీస్ అంటే దానర్ధం 8 కి స్టాండ్ అప్ మీటింగ్ లో ఉండాలి అంట. "వామ్మో... ఓరినాయనో.. !! ఇవేం అలవాట్లు రా నాయనా..మేం సాయంకాలం ఇళ్ళకి పరిగెడతాం ఇలా" అనుకున్నాను.  వాళ్లంతా పని రాక్షసులు. పొద్దున్నే వఛ్చి , అర్ధరాత్రి దాటినా ఆఫీస్ లోనే ఉంటారు. మళ్ళీ పొద్దున్నే చూస్తే ఆఫీస్ లో టైం కి ఉంటారు. నా డెస్క్ దగ్గర సమయానికి పెన్ కూడా కనిపించదు సాధారణం గా. కానీ వీళ్ళ డెస్క్  మీద 2 మోనిటర్లు , తలగడలు , టూత్ బ్రష్ లు, రేజర్ లూ, కాఫీ పొట్లాలు, టేబుల్ ఫ్యాన్స్ సర్దేసి ఉంటాయి. వాళ్లు టెక్నికల్ స్కిల్స్ లో పులులు. ఏదైనా ఇష్యూ వఛ్చి డౌట్ అడిగితే పలానా  ఫైల్ లో పలానా లైన్ లో ఉంది ప్రాబ్లెమ్ అని సెకన్స్ లో ఫిక్స్ చేస్తారు. రాముడు యుద్ధం లో బాణాలు ఎప్పుడు తీస్తాడో ఎప్పుడు వేస్తాడో తెలీనంత వేగం గా వేస్తాడంట. అలా ఉంటుంది  వీళ్ళ స్పీడ్.  ఒక్కటే సమస్య ఏమంటే మనతో మాట్లాడాలంటే భయం. మనంత పిచ్చ్చిగా వాళ్ళు ఇంగ్లీష్ ని నెత్తికి పట్టించుకోలేదు నరాల్లోకి  ఎక్కించు కోలేదు. వాళ్ళ కంప్యూటర్లు కొరియా భాషలో ఉంటాయి . మెయిల్స్ , బుక్స్, బోర్డ్స్ అన్నీ కొరియా నే. ఎప్పుడైనా మా లీడ్ దగ్గరకి వెళితే గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి నాకు కీబోర్డ్ ఇచ్చేవాడు. నేను నా బాధని టైప్ చేస్తే అది కొరియన్ లో చదివి , కొరియా లో ఆన్సర్ రాస్తే దాని ఇంగ్లీష్ అనువాదం నేను చదువుకునే వాణ్ణి. కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్ ఉంది గానీ కమ్యూనికేషన్ గ్యాప్ లేదన్న మాట.

మాకు ఆఫీస్ లోనే అందరికీ ముప్పూటలా తిండి పెడతారు. కొరియన్ స్టైల్ తిండి. శుధ్ధ మాంసాహారాన్ని (పంది , ఎద్దు ,చేప, పక్షి  వగైరా ) , పచ్చి ఆకు కూరలు తో కలిపి తినడం వీళ్ళ స్టైల్.  అసలా డైనింగ్ హాల్ లోకి ఎంటర్ అవ్వగానే  మనకి ముక్కు పుటాలు పిట్టల్లా  ఎగిరిపోతాయి. అదో రకమైన భరించలేని వాసన. ఓ పది నిమిషాలు ఆ కంపుని అలవాటు చేసుకొని మాకోసం  సెపరేట్ గా ఒక ఇండియన్ రెస్టారెంట్ నుండి తెప్పించిన తిండి కతుకేవాళ్ళం.
మా పీజీ లో పెట్టే రబ్బరు చపాతీల విలువ ఆ తిండి తిన్నాకే తెలిసొచ్చింది మాకు. ఎప్పుడైనా మనం తినగలిగే ఐటెమ్స్ గనక ఉంటె ట్రై చేసేవాళ్ళం.
వడ్డించుకునే ముందు "ఇదేమిటీ ??" అనడిగేవాళ్ళం లాంగ్వేజ్ తో కాదు బాడీ లాంగ్వేజ్ తో. వాడేదో "*&*& స మీ దా ..ఏ ఏ ఏ ఏ ఏ' " అనేవాడు.

అప్పుడు నేను నాలోని కమల్ హాసన్ ని నిద్రలేపే వాణ్ని.

ఇలా

నేను : this .....గుర్ గుర్ ?? అని నా ముక్కు కన్నాలు పైకెత్తి చూపించాను . [ఇది పంది కూరా? అని అంతరార్ధం ]

వాడు : అప్సయో...  [రెండు చేతులూ క్రాస్ చేసి చూపించాడు. కాదు అని]

నేను : థిస్ ...కౌ ....??  అంబా ...ఆ..ఆ.ఆ.ఆ ?? [నెత్తి మీద చూపుడు వేళ్ళతో కొమ్ములు పెట్టుకొని ఆవులా నటిస్తున్న  నా విన్యాసాన్ని చూసి తీరాల్సిందే ]

వాడు : అప్సయో...!!  థిస్ ... ఫిష్షూ  ..ఫిష్షూ... !! 

హమ్మయ్యా.. ఫిష్ ఆ?? అలా చెప్పరా  గాడిదా...  అనుకొ ని ఆ చేపల కూర వడ్డించుకొని ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టాను కదా...అదేమీ వాసన రా ద్యావుడా? అదేమీ రుచిరా దరిద్రుడా..  మన లాగా చేప కి పొలుసు తీసి, శుభ్రం చేసి ముక్కలు కోసి పులుసు పెట్టే ఓపిక లేదు వాళ్లకి. ఆక్వారియం నుండి డైరెక్టుగా పులుసు లో పడేసీ సగం ఉడికాక దించేయడమే వంట కాబోలు. నారాయణ .. నారాయణ. నా చెయ్యి చేపల మార్కెట్ అయిపోయిందా రోజున. ఈ కొరియా వాళ్ళు రోజూ భోజనం చెయ్యగానే బ్రష్ ఎందుకు చేసుకుంటారో అర్ధమయింది. లోక కళ్యాణం కోసం చేసుకోవాల్సిందే తప్పదు.

నాన్ వెజ్  పేరు చెప్తే ఉసైన్ బోల్ట్ లా పరిగెత్తే నా ఫ్రెండు అశోక్ గాడు ఒకరోజు కొరియన్ ఫుడ్ ట్రై చెయ్యాల్సి వచ్చింది. ఓసారి.  నేను చేసిన యాక్షన్లు అన్నీ  వాడూ చేసి "ఇది వెజిటేరియన్ ఫుడ్" అని వంటాయన నొక్కి వక్కాణించాక తెచ్చుకొన్నాడు నెత్తళ్ల  ఇగురు. అది చేపల కూర అని తెలిసాక మా వాడికి  మెహర్  రమేష్'s  "శక్తి " జెనెరేట్ అయింది.  రే...... య్.... (అది మామూలు రేయ్ కాదు YVS choudary's  రేయ్) అంటూ సాయి కుమార్ డబ్బింగ్ తో రాజశేఖర్ అరిచినట్టూ అరుస్తూ వెళ్లాడు. వంటాయన ఒక  హుంకారాన్ని ప్రయోగించి మా వాడి ముందు ఒక చేప ని  చేత్తో చిదిమి ముక్కలు చేసి "సీ.. నో బ్లడ్.  దిస్ ఈజ్ వెజ్" అని డిక్లేర్ చేసేసి చేప ముక్కలు కూర గిన్నె లోకి విసిరి కొట్టాడు కోపంగా. 
ఆ దెబ్బకి అశోక్ గాడు శోకిస్తూ శుష్కించి పోయాడు. 

అయితే నా మొదటి ట్రిప్ లో తిండికి ఇబ్బంది పడినట్టూ ఆ తర్వాత ఇబ్బంది పడలేదు. తర్వాతి రోజుల్లో ఒక బంగ్లాదేశ్ కుక్ ని పెట్టి మా కోసం ఇండియన్ ఫుడ్ వండించేవారు ఆఫీస్ లో. 

ఒకసారి తిండి విషయం లో ఇంకో రచ్చ జరిగింది. మా టీమ్ లీడ్ ఒక జైన్. అపార్ట్మెంట్ లో కలిసి ఉంటున్నప్పుడు ఉన్న చెంచాలూ కంచాలూ కాకుండా మళ్ళీ ప్రత్యేకం గా కొని వాడేంత చాదస్తం. కరోనా వచ్చిందని మనం ఇప్పుడు మాస్కులు కట్టుకుంటున్నాం గానీ ఆరోజుల్లోనే ఆ మనిషి పీక్స్.  ఓ శీతాకాలపు సాయంత్రం మా బంగ్లాదేశ్ వంటాయన వంట చేసేసి తన అసిస్టెంట్స్ అప్పగించేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆరోజు చేసిన ఉల్లిపాయ పకోడీ సూపర్ గా ఉండటం తో జనాలు పీకల దాకా తినేశారు. మొత్తం అయిపొయింది. మమ్మల్ని ఓ ఐదు నిమిషాలు ఓపిక పట్టాలని చెప్పి అప్పటికప్పుడు మెత్తటి పకోడీ చేసి తీస్కోచ్చ్చారు కొరియన్  వంటలక్కలు. 

అందరూ తినడం మొదలెట్టాం. మైదా పిండి ఎక్కువ అయిపొయింది కాబోలు బాగా మెత్తగా ఉన్నాదా పకోడీ. ఒక ప్లేట్ తిన్నాక మా జైనుడి కి అనుమానం వఛ్చి పకోడీ విడదీసి చూసాడు. వాడికి చమటలు పట్టడం మొదలైంది. అనుమానము గా 
వంటలక్కల్ని పిలిచి ఆడిగాడు అదేమిటి అని. 

"ఆక్టోపస్" అన్నారాళ్లు. 

ఇక మా వాడు ఆరోజు చేసిన తాండవం గురించి ఎంత చెప్పినా తక్కువే. "నే చచ్చి పోతా..నే చచ్చి పోతా.. ఎక్కడ తాడు? ఎక్కడ చెట్టు?  ఎక్కడ నా స్టూల్? " అంటూ పిచ్చ్చేక్కించి పచ్చ్చడి తినిపించాడు.  

నీతి : ఆక్టోపస్ మైదా పిండి బొండాల్లాగా మెత్తగా ఉంటుంది. తినేస్తే బానే ఉంటుంది కానీ తెలిసాక వికారం గా ఉంటుంది.  

అందరికీ ఉగాది శుభాకాంక్షలు.  

[మరిన్ని సోది కబుర్ల తో మళ్ళీ వస్తా. 
అప్పటిదాకా ఇళ్ల లో ఉండండి.  బయట తిరక్కండి ]

23 comments:

పల్లా కొండల రావు said...

రాజ్ కుమార్ గారు, బాగున్నారా! చాలా కాలం తరువాత దర్శనం ఇచ్చారు.

venkat said...

Raju garu, swagatham, suswagatham. after 5 years. please keep writing. raasevaallu evaru lerandi. meelanti old-gold bloggers malli ravadam happy ga undi

Zilebi said...


కరోనా పుణ్యమా అని ఐదు సంవత్సరాల తరువాయి బ్లాగు పెట్టె తెరిచేరన్న మాట :)


వెల్కం బెకబెక. :)



చీర్స్
జిలేబి

Lalitha said...

మరిన్ని కబుర్లు కోసం ఎదురు చూస్తూ ...మీకు ఉగాది శుభాకాంక్షలు!

బులుసు సుబ్రహ్మణ్యం said...

స్వాగతం బ్లాగు లోకానికి పునఃస్వాగతం. మీ మార్కు హాస్యం చదివి ఏళ్లు గడిచాయి. సంతోషం. మీ కొరియా కబుర్లు అప్పుడే విన్నాం. కాని ఇది కొత్తగానే ఉంది. ముఖ పుస్తకానికి విడాకులు ఇచ్చి నాల్గైదు నెలలయింది. మీరు వ్రాస్తే నవ్వకుండా ఉండలేము కదా. కరోనా భయం వల్ల ముఖానికి గుడ్డ కట్టుకునే ఉన్నాను. అయినా స్క్రీన్ మీద తుంపర్లు పడ్డాయి. .......... మహా

Sujata M said...

మోదీ గారేదో అన్నారు.. కొన్ని సంవత్సరాల వెనక్కి అని.. ఇలా అయితే పర్లేదు. స్వాగతం.

MURALI said...

ఇరగేసావ్.
యూఎస్ లో కూడా హిందూ వెజ్, హిందూ నాన్-వెజ్ అని అడగాలి. లేకపోతే అంబా... యే

శ్రీనివాస్ పప్పు said...

నువ్వు బ్లాగ్ లో పోస్ట్ రాయడానికి కరోనా అంత ఉపద్రవం రావాలన్నమాట, ఎదయితేనేం కొరియా తిండి విశేషాలు కేక

kiran said...

:D soooparanthe

Rajendra Prasad(రాజు) said...

Blog sir blog anthe :p :)

Kottapali said...

భలే ఆరంభం.

Unknown said...

Raj garu,ennaallakennallaku... chala bagunnay mi visheshalu

Unknown said...

Raj garu ennaallaku... ade haasyam

Unknown said...

Raj garu,ennaallakennallaku... chala bagunnay mi visheshalu

Sharada said...

కరోనా పుణ్యమా అని, చాలా మందిమి నిద్ర లేచినట్టున్నాం. Welcome back!
Sharada (నీలాంబరి బ్లాగు)
(www.sbmurali2007.wordpress.com)

రాజ్ కుమార్ said...

@కొండలరావు గారు బాగున్నారా? నేను బాగున్నానండీ. ధన్యవాదాలు

@వెంకట్ గారూ.. ధన్యవాదాలు అండీ
@జిలేబీ గారూ... ఎంత కాలం అయిందండీ.. చీర్స్ జిలేబీ అని వినీ. బాగున్నారా?

@లలిత గారూ.. ధన్యవాదాలండి

@గురువు గారూ.. బాగున్నారా? వెంటనే స్చ్రీన్ ని డెట్టాల్ తో శుభ్రం చేశారా మరీ?? సిగరెట్లు స్టాక్ పెట్టుకున్నారనే అనుకుంటున్నా :)

@సుజాత గారూ.. ధన్యవాదాలు.. అప్పటి ఫ్లో ఇప్పుడు లేదు లెండి.

@ మురళీ.. అంతేగ అంటేగా

@పప్పుసార్.. థాంక్ యూ అండీ

@కొత్తపాళీ గారూ.. ధన్యవాదాలు :)

@శారద గారూ ధన్యవాదాలు.

@Unknown గారూ. Thanks a lot)

పరుచూరి వంశీ కృష్ణ . said...

సూపరు :)

బుచికి said...

OMG. Simply funtastic narration. Really scary for vegetarians.

మేం సాయంకాలం ఇళ్ళకి పరిగెడతాం ఇలా- too good 😅

సూర్య said...

"ఒకసారి తిండి విషయం లో ఇంకో రచ్చ జరిగింది. మా టీమ్ లీడ్ ఒక జైన్."
ఇక మిగతా వాక్యాలు చడవక్కరలేకుండానే సీన్ అర్థమైపోయింది. మాకు ఒక జైన్ టీమ్ మేట్ ఉండేవాడు.

రహ్మానుద్దీన్ షేక్ said...

మీకు శుద్ధ శాఖాహార బాపులు, బిబింబాపులు దొరకలేదా?

బాగున్నాయి మీ తిండి వెతలు. మళ్ళీ కొరియా వెళ్ళే అవకాశం ఉంటే జాగ్రత్త పడటానికి ఏం చేస్తారు తిండి‌ విషయంలో?

స్వాతిశంకర్ said...

ఆక్టోపస్ తిన్నారా ☺️☺️ నేను కేరళలో ఉన్నప్పుడు ఈవెనింగ్ స్నాక్స్ కి కప్ప (కర పెండలం / tapioca) అని చేసే వారు. ఆ పేరు వింటేనే ఆ వేళ పస్తు ☺️

విన్నకోట నరసింహా రావు said...

నేనూ కొంతకాలం కేరళాలో పని చేశాను. “కప్ప” పేరు మొదటిసారి విన్నప్పుడు ఒళ్ళు జలదరించింది. అది పెండలం అని తెలిసాక కాస్త కుదుటపడ్డాను.

Pavan Kumar Reddy Rendeddula said...

భలే నవ్వించారు రాజ్ గారు, ఇలాంటి పోస్ట్లు చదవడానికి భలే బాగుంటాయి.