ఇప్పటికే బ్లాగుల్లో అరగదీసి మురగబెట్టి న ఈ సబ్జెక్ట్ మీద ఎన్నిసార్లు రాస్తావురా రాములా? అంటే ఎం చెప్తాము? "కుక్కలు సార్. కుక్కలంతే". [శునక చరిత్ర మొదటి భాగాన్ని ని ఇక్కడ చదివి రావొచ్చు.]
ఈ పోస్ట్ రాయడానికి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంది. కొన్ని వారాల కిందట మా వీధి చివర ఒక బోర్డు చూసాను. మా వీధి "వీధి కుక్క " ఫోటో ప్రింట్ తీసి అతికించి "We Miss You" అని రాశారు ఎవరో శునక ప్రేమికులు. [లాక్ డౌన్వల్ల ఫోటో తీయలేను ఇప్పుడు] అప్పుడు గుర్తొచ్చింది నాకు. రోజూ రాత్రి ఆఫీస్ నుండి వస్తుంటే నన్ను చూసి అరిచేది మా ఇంటి దగ్గర. కళ్ళు కనపడక పోయినా నేను వచ్చేసరికి కసి తీరా అరిచేది కానీ ఎప్పుడూ కరవ లేదు. ఈ మధ్య కనిపించటం లేదన్న సంగతి అప్పుడే గుర్తించాను నేను.
*****************************************************************************
మా ఇంటి ఓనర్ కి ఒక కొవ్వెక్కిన నల్ల కుక్క ఉంది. అది "భౌ భౌ" అంటుంది కాబట్టీ కుక్క అనుకోవాలి తప్ప చూడ్డానికి అప్పుడే డ్రైనేజీ లో సేదదీరి వచ్చిన కింగ్ సైజ్ ఊర పంది లాగా ఉంటుంది. దాని పేరు అజ్గర్. ఇప్పటికి దాదాపు 3 ఏళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నా రోజూ నన్ను చూసి వేంకటపతి రాజా వారిని చూసిన చంద్రముఖి లా అరుస్తుంది. అంత రెస్పెక్ట్ నేనంటే దానికి. మా ఓనర్ & ఫ్యామిలీ కి అదంటే పంచ ప్రాణాలు. రోజూ మూడు పూటలా మా ఓనరమ్మ ఆప్రాన్ కట్టుకొని , ఆ కుక్క ని సోఫా లో కూర్చోబెట్టి ముద్దలు తినిపించే సీన్ చూస్తుంటే మెంటలెక్కి పోతుంది నాకు. దానికి చలేస్తుంది అని ఎక్కువ గా స్నానం చేయించకపోవడమో మరింకేమైనా కారణం ఉందొ తెలీదు మా ఓనర్ ఇంటి పరిసరాలు అజ్గర్ గాడి భరించలేని కంపునిండిపోయి ఉంటుంది. చెప్తే ఫీల్ అవుతారని ఎప్పుడూ చెప్పలేదు. [మీ కుక్క కి పిల్లలు పుట్టలేదా అని అడిగినందుకే చాల ఫీలయిపోయింది మా ఓనరమ్మ. పరాయి కుక్కల కనుచూపు సోకకుండా , వాటిని చూసినా మా కుక్క తోకెత్తి ఊపకుండా పెంచుకుంటున్నాం రా. అలాంటిది అంత మాట అనేస్తావా అన్నట్టూ ఓఇదై పోయింది. వయసొచ్చిన కుక్క ని అలా ఇంట్లో అతి ప్రేమతో సాకుతూ ఉంటె బొమ్మరిల్లు లో సిద్దార్ధ్ లాగా అది ఫ్రస్ట్రేషన్ తో అందరి మీదా అరుస్తుంది అని అప్పుడే అర్ధమైంది]. పై పోర్షన్ లో ఉండే మేమంతా ఊపిరి బిగబట్టి పరుగు పరుగున మెట్లెక్కేస్తాం. కానీ నెల నెలా అద్దె ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి రమ్మంటారు. వద్దంటే వినరు మహా మర్యాదస్తులు. సరే వెళతాను.అద్దె ఇచ్ఛేసి పారొచ్చేద్దాం అనుకుంటే సోఫా లో కూర్చోమంటారు. ఆ సోఫా విశిష్టత ఏమంటే ఆ అజ్గర్ గాడు బాసింపట్టు వేసుకొని చేతి ముద్దలు తిని పావనం చేస్తూ ఉంటాడు. మొహమాటం కొద్దీ కూర్చుంటాను. మా ఓనరు డబ్బులు లెక్క పెడతా ఉంటాడు . తెలిసి చేస్తాదో తెలీక చేస్తాదో తెలీదు గానీ మా ఓనరమ్మ 4 బిస్కెట్లు తెఛ్చి 2 నాకిచ్చ్చి , ఒకటి ఓనరు గారికిఛ్చి , ఒకటి అజ్గర్ గాడికి తినిపిస్తుంది. "బాపు/విశ్వనాధ్ గారి సినిమాల్లో డైలాగులు లేకుండా సింబాలిక్ గా విషయం వివరించినట్టూ" అనిపిస్తుంది నాకు.
*****************************************************************************
ఆరోజు ఫ్రెండ్స్ తో కలిసి వేరే ఊరు వెళ్లే ప్లాన్ ఉంది. తెల్లవారుఝామున ఐదింటికి మా వీధి చివర జంక్షన్ లో వెయిట్ చేస్తూ ఉన్నా మా ఫ్రెండ్ కోసం. పగలంతా ట్రాఫిక్ తో పిచ్చెక్కించే రోడ్లు రోజూ నేను నిద్దరోయే టైం లో ఖాళీ గా ఉంటాయని తెలుసుకున్నాను.
పుణ్యపురుషులు కొంతమంది మాత్రం పిక్కలు కనిపించేలా నిక్కర్లేసుకొని చమట్లు కక్కేలా పరిగెడతా ఉన్నారు చలి లో.అసలా టైం లో మెలకువ వస్తే... నిద్రపోడానికి ఎంత బాగుంటాదో..!! మనసులోనే ఆ జాగర్స్ కి నమస్కారం చేస్తుండగా... మా వీధి ఆ చివరన ఎక్కడో ఓ కుక్క నన్ను చూసి.. గుర్.ర్.ర్ర్. అంది. నేను పట్టించుకోనట్టు నటించాను. అది విని మరో కుక్క గొంతు కలిపింది. రెండూ కలిపి శృతి పెంచాయి. నాకు కాళ్ళు వణకడం మొదలైంది. ఈ సారి మూడో కుక్క పొగరుగా మొరిగింది. జాగింగ్ చెయ్యకుండానే నాకు చమట్లు మొదలైనాయి. అలాగే నించొని ఫోన్ తీసి HDFC కస్టమర్ కేర్ కి కాల్ చేశాను. ముందురోజు క్రెడిట్ కార్డ్ కావాలా? అని అడిగితే తిట్టి పెట్టేశాను. ఇప్పుడు కాల్ చేసి కావాలంటే ఏం అనుకుంటాదో ఏమో..!!
నా బాడీ లాంగ్వేజ్ లో వాటికి ఏం అర్ధం అయ్యిందో.. నెమ్మది గా నా వైపు రావడం మొదలెట్టాయి. నా గొంతు తడారిపోయింది. గుండె పంపింగ్ స్పీడ్ పెంచింది. కిడ్నీ కూడా ప్రొసెసింగ్ స్పీడ్ పెంచింది. అక్కడ కుక్కలు వేగం పెంచాయి. చుట్టూ చూశాను. నాలుగు రోడ్ల జంక్షన్. పారిపోడానికి అన్నీ దారులే కానీ తప్పించుకునే దారే కనిపించ లేదు. ఈ రోజు కుక్కచావు గ్యారెంటీ అనుకున్నాను. పరిగెడదామా?? అన్న ఐడియా వచ్చి, కొన్ని కుక్క బేసిక్స్ గుర్తొచ్చి అలాగే శిలావిగ్రహం లా నిల్చుండిపోయాను. కుక్కలు మాత్రం రేసుగుర్రాల్లా దూసుక్కొస్తున్నాయ్.. ఒక కుక్క ఒలింపిక్స్ లో బంగారు పతకం నాకే... అన్నట్టుగా పరిగెడుతుంది. రజత, కాంస్యాల కోసం తక్కిన రెండూ పోటీ పడుతున్నాయి. నేను ఇంక తెగించేశా.... ఊపిరి గట్టిగా పీల్చాను. పిడికిళ్ళూ బిగించాను. పళ్ళు కొరికాను. కళ్ళల్లోకి రక్తం చేరి (నీళ్ళు కాదు) ఎర్రబడ్డాయి. కనీసం ఒక దాన్నైనా చంపి వీరస్వర్గానికే పోవాలనుకొని డిసైడయ్యాను. లెజెండ్ సినిమా లో బాలయ్యబాబు లా విజృంభిద్దాం అనుకున్నా... మధుబాబు కధలో హీరో లాగా పొలికేక పెట్టి, కుడికాలు తో భూమ్మీద తన్ని ప్రకంపనలు సృష్టించి సింహనాదం చేద్దాం అనుకుంటూ ఉండగా....
గోల్డ్ మెడల్ కుక్క హఠాత్తుగా రైట్ టర్న్ తీసుకొని పరిగెత్తింది. తక్కిన కుక్కలు కూడా రైట్ టర్న్ తీస్కొని దాన్ని వెంట తరుముతా పోయాయి.
ఇది కుక్కల ప్రాంతీయ విద్వేషాల్లో భాగం గా జరుగుతున్న అంతర్గత కొట్లాట అని జ్ఞానోదయం అయ్యింది. ఇంకా నయ్యం నా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నా కాబట్టీ సరిపోయింది లేదంటే... జాగిలాల జాతంతా ఏకమయ్యి.. "భిన్నత్వం లో ఏక కుక్కత్వాన్ని" నాకు చూపించుండేవి.*****************************************************************************
ఓ సారి అర్ధరాత్రి ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరాను. 2కిమీ కలిసొస్తుందని, Traffic ఉండదనీ రూట్ అంత గొప్పగా ఉండకపోయినా HAL క్వార్టర్స్ మీదగా వస్తున్నాను. చలికాలం మొదలైపోవడం తో రోడ్లమీద మనుషులు లేరు. ఆ ఏరియా మొత్తం కరెంట్ లేదు. ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వెలగట్లేదు. ప్రతి వీధి లోనూ కుక్కల ఆధిపత్య పోరాటం న్యూస్ చానల్స్ లో లైవ్ డిబేట్స్ కన్నా గోలగా జరుగుతుంది. పగలంతా పీకలదాకా మెక్కిన వీధి కుక్కలన్నీ అర్నబ్ గోస్వామి లాగా అరుస్తున్నాయ్. ఎదురుగా ఒక పావు కిలోమీటర్ దూరం లొ రోడ్డుకిరువైపులా అశోకుడు నాటించిన చెట్లలాగా ఒక తెల్ల,నల్ల కుక్కలు కాపుకాసి నన్ను చూసి మొరగడం మొదలెట్టాయి. నాకు బైక్ యూ టర్న్ తీస్కొనే టైమ్ లేకపోవడం తో తెగించి, గేర్ తగ్గించి బండి రేజ్ చేశాను. స్పీడ్ అందుకోడానికి ఇంకొన్ని సెకన్లు పడుతుందని అర్ధమయ్యింది. బాహుబలి బిగినింగ్ లో శివుడు- కట్టప్ప లు చెరోవైపూ పరిగేత్తుకొస్తుంటే మధ్య లో పరిగెత్తిన గుర్రం లాగా ఉంది నా బైక్. దాని మీద కత్తి లాంటి నేను. రెండు కుక్కలూ చెరోకాలూ పంచుకుంటే..బండి స్పీడ్ కి అవి పెద్ద కష్టపడకుండానే 2 లెగ్ పీస్ లు దొరకడం ఖాయం. వణుకుతున్న చేతులతో హ్యాండిల్ గట్టిగా పట్టుకున్నా. చల్లబడిపోయిన 2 కాళ్ళూ పై కెత్తి హ్యాండిల్ మీద పెట్టాను. ఊపిరి బిగబట్టాను. ఆక్సిలరేటర్ ఫుల్ గా పట్టుకున్నా. ఎవడో కడ్డీ కాల్చి వీపు మీద వాత పెట్టినట్టూ గీ పెట్టింది నా బైక్. జస్ట్ మిస్... ఒక్క రన్ తేడా తో వరల్డ్ కప్ మిస్ అయినట్టూ ఫీలయ్యాయి అనుకుంటా పిచ్చిగా అరుస్తూ కసిగా వెంటాడటం మొదలెట్టాయి. అలా ఆ స్ట్రైట్ రోడ్ లో అర కిలోమీటర్ వెళ్ళి ఉంటాను. అరుపులు తగ్గాయి. హమ్మయ్యా అనుకొని రేర్ మిర్రర్ లో చూశా. ఎడమవైపు తెల్లకుక్క ఇంకా తరుముతుంది. ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసింది. ఉస్సెయిన్ బోల్ట్ పెంపుడు కుక్కని బెంగుళూర్ లో వదిలేసి పోయాడో ఏమో. దీని ఫిట్నెస్ లెవెల్స్ తగలెయ్యో... అనుకొని ఆక్సిలరేటర్ ఇంకా రేజ్ చెయ్యబోయా... ఆల్రెడీ ఫుల్ గా పట్టుకున్నామని చేతులు మెదడు ని విసుక్కున్నాయ్. లెఫ్ట్ ఇండికేటర్ వేసి చటుక్కున రైట్ టర్న్ తీసుకొని దాన్ని ఫూల్ చెయ్యొచ్చని సిక్స్త్ సెన్స్ సెలవిచ్చింది. ఆ స్పీడ్ లో ఆ రోడ్ మీద టర్న్ తీస్కుంటే కుక్కల విందు కి ఊళ్ళోవాళ్ళు హడావిడి చేస్తారని 7th సెన్స్ చెవిలో ఊదింది. ఇంతలో బైక్ ఫుల్ స్పీడ్ అందుకుంది. గోడ కట్టబోయి సిమెంట్ లేక సగం లో ఆపేసారా అన్నట్టున్న స్పీడ్ బ్రేకర్ మీద నుండి దూకింది. కుక్క ఆయాసం తో ఆగిపోయింది.(ధూమ్ 4 లో హీరోకి స్లోమోషన్ లో ఈ సీన్ పెట్టమని యాష్ చోప్రా కి ట్విట్టర్ లో మెసేజ్ పెడితే ఎలా ఉంటుందా? అనిపించింది.) నా గుండె ఓల్టేజ్ డ్రాపయిన మోటార్ లాగా స్పీడ్ తగ్గించింది. బీపీ నార్మల్ కి వచ్చింది. అడ్డాల నాటి నుండీ గెడ్డం నెరిసే ఏజ్ మొదలయినా కుక్కలకీ నాకూ ఈ వైరం ఏమిటో ఈ పగలేమిటో అర్ధం కాలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏ వీధులు వెళ్లినా , ఏ ఊరు మారినా, రాష్ట్రాలు దాటినా కుక్కలతో ఇలాంటి భయంకర అనుభవాలు కోకొల్లలు నాకు. శునక జాతి తో నాది జన్మ జన్మల వైరం కాబోలు. లేదా సదా నా వెనకాలే ఉండే దరిద్ర దేవతని చూసి మొరుగుతాయో నాకు అర్ధం కాదు. అర్ధరాత్రుళ్ళు అందరూ నిద్దరోయాక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హారర్ సినిమాలు చూసే నాకే అంత చలిలో చమట్లు పట్టించాయి. అప్రయత్నం గాదవడలు బిగుసుకున్నాయి. ఈ మాయదారి కుక్కల్ని రోడ్ రోలర్ తో తొక్కించెయ్యాలన్నంత కోపం వచ్చింది. అప్పుడే ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది.
బెంగుళూర్ ట్రాఫిక్ కీ కార్ కన్నా బైక్ బెటర్ అనుకునే వాణ్ణి. కానీ ఆ రెండూ కాదు రోడ్ రోలర్ కరెక్ట్ అనిపించింది.
ఎందుకంటే .....
1.ఇలా కుక్కలు తరిమినప్పుడు ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ కీ కట్ చేస్తే చాలు.. కుక్కల కసి కేకలు ఆర్తనాదాలు గా మారే లోపు మా ఆఫీస్ లో మేనేజర్లు గా పుట్టడానికి గ్రౌండ్ వర్క్ జరిగిపోద్ది. తార్ రోడ్ మీద టెంపరరీ టాటూ పడిపోద్ది.
2.ఇక్కడ ఏవరేజ్ స్పీడ్ 5కి.మీ కాబట్టీ స్లో అన్న సమస్యే లేదు.
3. వెనకాల నుండి రై రై మని వచ్చేసి స్పీడ్ కంట్రోల్ కాక గుద్దేసే స్కూటీల వాళ్ళూ, abs ఉంది కదా అని మన బండి ముందు షడన్ బ్రేకులేసే కాస్ట్లీ కారోళ్ళూ మనకి దూరం గా ఉంటారు.భయపడతారు. మనం వాళ్ళని గుద్దినా వాళ్ళకే రిస్కూ..వాళ్ళు మనల్ని గుద్దినా వాళ్ళకే రిస్కు.
4. హెల్మెట్ పెట్టుకోలేదనీ, సీట్ బెల్ట్ కట్టుకోలేదనీ అడ్డమైన నీతి పలుకులూ పలికి 200 లాక్కొని పోయేవాళ్ళ గొడవ ఉండదు.
5. రాంగ్ పార్కింగ్ అని పోలీసోళ్ళు బండి పట్టుకుపోయే చాన్సే లేదు. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసుకోవచ్చు.
6. ఎంత వర్షం పడినా రోడ్ల పై ఏర్లు పారినా సైలెన్సర్ లోకి నీళ్ళు పోతాయని భయం లేదు.
7. వీకెండ్స్ పార్ట్ టైం జాబ్ గా రోడ్లు వేసే పనికి పోవచ్చు.
పర్సనల్ లోన్ , పీ.ఎఫ్ లోన్ పెట్టి అవసరం అయితే చీటీ పాట పాడి ఒక రోలర్ కొనేద్దాం అనుకుంటున్నా. ఎటొచ్చీ అవి పచ్చి తాగుబోతులని విన్నాను. ముందున లాగడానికి ఒక నలుగురు, వెనకనుండి తొయ్యడానికి నలుగురినీ పెట్టుకుంటే సరి.
అవసరం అయితే...
"రోడ్ రోలర్ తో ఈ ఇంజినీర్ ఏమ్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు"
"ఇలా చేస్తే మీకు వీధి కుక్కల బెడద ఉండదు"
"ఆఫీస్ కి రోడ్ రోలర్ మీద వెళ్ళడం చూస్తే పొట్ట చెక్కలే" లాంటి టైటిల్స్ తో యూట్యూబ్ లో వీడియోలు పెడతాను.
ఈ పోస్ట్ ని లైక్ చేస్తే రూపాయ్, కమెంట్ చేస్తే 2 రూపాయలూ, షేర్ చేస్తే 5 రూపాయలూ జూకర్ మామ నా sbi account కి వేస్తానని నిన్న మా ఆఫీస్ లో క్లైంట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కల్లోకొచ్చి చెప్పాడు. మీరా పనిమీదుంటే మెయింటెనన్స్ కి ఏదో పెగ్గు లోకి పొటాటో చిప్స్ లాగా, బిసిబేళాబాత్ లోకి బూంధీ లాగా సమ్మ గా ఉంటుంది నాకు.
మరిన్ని సోది కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. లాక్ డౌన్ ఎక్స్టెండ్ అయ్యిందట.
"ఇంట్లో ఉండండి. బయట తిరక్కండి"
*****************************************************************************
End Title Song [repeat]
రక్త సిక్త వర్ణమైన తరతరాల శునక చరిత్రా.... శునక..శునక..శునక శునక శునక
ఆధిపత్య పోరు కొరకు సాగుతున్న శునక చరిత్రా...శునక. .శునక..శునక శునక శునక
తుది లేనిది ఈ సమరం.. చీకటీ పడితే చావుభయం..
బతికేందుకు ఈ సమరం .. వెనకాలే ఓ సైన్యమ్..
6 comments:
అప్రయత్నంగా దవడలు బిగుసుకున్నాయి :)
దవడకండరాలు అని కదా వుండాలి. ఇలా మధుబాబుకున్ను యండమూరి కున్ను ద్రోహం చేస్తే యెలా :)
జిలేబి
నువ్వు మా ఏరియా కి ఎప్పుడూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటమే కదా. తిరుమల కొండ మీద కోతుల జనసాంద్రత కి పోటీ పడేలా కూకట్ పల్లిలో కుక్కల జనసాంద్రత ఉంటుంది. అసలు ఇది కుక్కలపల్లి ఏమో అని నా డౌటు.
ఈ పోస్టు చదివి జంతుప్రేమికులు నీ అంతు చూస్తారేమో ��
>>> "రోడ్ రోలర్ తో ఈ ఇంజినీర్ ఏమ్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు"
"ఇలా చేస్తే మీకు వీధి కుక్కల బెడద ఉండదు"
"ఆఫీస్ కి రోడ్ రోలర్ మీద వెళ్ళడం చూస్తే పొట్ట చెక్కలే" లాంటి టైటిల్స్ తో యూట్యూబ్ లో వీడియోలు పెడతాను.>>>
ఇటువంటి వీడియోలకి బూతుల కమెంట్స్ బాగా వస్తాయి.ఆలోచించండి మరి.
శునక వ్రతం చేయండి ఫలితముంటుందేమో. మేమెలాగూ శునకచరిత్ర పారాయణం చేసేసాం కూడానూ..
చాలా సంతోషం వేసింది ఈ పోస్ట్ చూసి...
నాకు చాలా లేట్ గా బ్లాగ్స్ గురించి తెల్సింది. ఆ లోపు అందరూ రాయడం మానేశారు..వా....(ఏడుస్తున్న)మొదటగా చదివింది జాజిపూలు. ఇందాక మూడోసారి అన్ని మళ్ళీ చదువుతూ మీ కామెంట్ చూసి మీ పేరు పైన టాప్ చేస్తే ఈ టపా కనిపించింది.
అమ్మోఓ... చాలా నవ్వించేశారు.మా వీధి లో కూడా ఒకటే కుక్కల గోల.మీలాగే ఆవేశంతో వెంటపడి రాళ్లతో కొట్టి చంపేయాలన్న న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు.
ఈ టపా ని inspiration గా తీసుకుని ఇంకా ఇంకా ఆవేశంతో వెంటాడుతూనే ఉంటా ..........
దుర్మార్గుడా.. ఒక కుక్కని పెంచి అప్పుడు రాయరా ..అప్పుడు చూస్తాను ఎలా రాస్తావో.. ఆయ్..
కాని భలే రాసావ్ రాజు కొత్తపోస్ట్లు...ఏ మాత్రం వాడి తగ్గలేదు... పాత రోజులన్నీ గుర్తొచ్చాయి నాకు.. అప్పట్లో అందరం ఒకళ్ళను మించి ఒకళ్ళం రాసేసేవాళ్ళం కదా..
Raj garu, topic edaina full comedy ga cheptaaru, naaku kukkalante hadal... year ki 2 post ayina pettandi, we will laugh heartily
Post a Comment